
రెడ్‌బుక్ కుట్రలకు డీజీపీ జీ హుజూర్
అత్యంత వివాదాస్పదంగా హరీశ్ గుప్తా వ్యవహార శైలి
ప్రభుత్వ పెద్దల కుట్రకు వత్తాసు
ఎస్పీలు, కమిషనర్లకు టార్గెట్ పెట్టి మరీ ఒత్తిడి
వాచ్‌మెన్ రంగన్న సహజ మరణంపై దర్యాప్తు
అది అనుమానాస్పద మృతి అంటూ అప్పుడే నిర్ధారణ!
సాక్షి, అమరావతి: ప్రభుత్వ పెద్దల రెడ్‌బుక్ కుట్రలకు డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా సెల్యూట్ చేస్తుండటం యావత్ పోలీసు శాఖను విభ్రాంతికి గురిచేస్తోంది. వైఎస్సార్‌సీపీ నేతలపై అక్రమ కేసులతో మరింతగా విరుచుకు పడాలని ఆయన జిల్లా ఎస్పీలు, పోలీస్ కమిషనర్లకు టార్గెట్ పెట్టి మరీ ఒత్తిడి చేస్తుండటం సర్వత్రా చర్చనీయాంశమైంది. మరోవైపు సీబీఐ దర్యాప్తు చేస్తున్న మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో రాష్ట్ర పోలీసు శాఖ అత్యుత్సాహం ప్రదర్శిస్తుండటం విస్మయ పరుస్తోంది. వివేకా హత్య కేసులో సాక్షిగా ఉన్న రంగన్న సుదీర్ఘకాలం అనారోగ్యంతో బాధపడుతున్నాడు.
ఇటీవల ఆయన ఆరోగ్యం విషమించడంతో కుటుంబ సభ్యులు తొలుత పులివెందుల, ఆ తర్వాత కడప రిమ్స్‌కు తరలించారు. ఈ క్రమంలో గురువారం మృతి చెందాడు. కాగా, ఈ అంశాన్ని రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించుకోవాలని కూటమి ప్రభుత్వ పెద్దలు పన్నాగం పన్నారు. రంగన్న మృతితోపాటు మరికొన్ని సహజ మరణాలపై దర్యాప్తు కోసం సిట్‌ను నియమించారు. వివేకా హత్య కేసును ఐదేళ్లుగా సీబీఐ దర్యాప్తు చేస్తోంది. మరి రంగన్న తదితరుల సహజ మరణాలపై ఏపీ పోలీసులు సిట్ పేరుతో దర్యాప్తు చేయడం ఏమిటని న్యాయ నిపుణులు ప్రశ్నిస్తున్నారు.
కానీ, డీజీపీ గుప్తా మాత్రం ప్రభుత్వ పెద్దల మెప్పు కోసం అత్యుత్సాహం ప్రదర్శిస్తుండటం విస్మయ పరుస్తోంది. వెలగపూడిలోని సచివాలయంలో శుక్రవారం రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముగిసిన తర్వాత డీజీపీ గుప్తా.. తాజా సిట్ గురించి మంత్రులకు వివరించారు. పైగా ‘రంగయ్య మృతి అనుమానస్పదమే’ అని చెప్పారు. ఇంకా సిట్ దర్యాప్తే మొదలు పెట్టకుండా రంగన్న మృతి అనుమానాస్పదమని డీజీపీ ఏకపక్షంగా మంత్రులకు వివరించడం పోలీసు శాఖ ప్రతిష్టను రాజకీయ ప్రయోజనాల కోసం పణంగా పెట్టిననట్టేనని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. తద్వారా సిట్ నివేదిక ఎలా ఉండబోతోందన్నది స్పష్టమవుతోందని చెబుతున్నారు.
వేధించకపోతే వేటేస్తాం..
‘వైఎస్సార్‌సీపీ నేతలే లక్ష్యంగా అక్రమ కేసుల జోరు పెంచండి’ అని డీజీపీ హరీశ్‌కుమార్ గుప్తా జిల్లా ఎస్పీలు, పోలీస్ కమిషనర్లకు తేల్చిచెప్పారు. ఇదే ప్రధానాంశంగా ఆయన ఇటీవల టెలీ కాన్ఫరెన్స్‌లు నిర్వహిస్తున్నారని పోలీసు వర్గాలే చెబుతున్నాయి. వైఎస్సార్‌సీపీ నేతలకు వ్యతిరేకంగా కూటమి నేతలు చేస్తున్న ఫిర్యాదులపై తక్షణం స్పందించాలని.. ప్రాథమిక ఆధారాలు లేకుండానే అక్రమ కేసులు నమోదు చేసేయాలని ఆయన విస్పష్టంగా ఆదేశించారు.
వైఎస్సార్‌సీపీకి చెందిన ఏయే నేతలపై ఫిర్యాదు చేయాలన్నది టీడీపీ ప్రధాన కార్యాలయం నిర్ణయిస్తుందని, ఆ ఫిర్యాదులు అందిన వెంటనే అరెస్టులకు తెగబడాలని డీజీపీ నిర్దేశించారని సమాచారం. ఈ సందర్భంగా న్యాయ, సాంకేతిక అంశాలను కొందరు ఎస్పీలు ప్రస్తావించగా, డీజీపీ గుప్తా వారిపై ఆగ్రహం వ్యక్తం చేయడం గమనార్హం. చెప్పినట్టు వేధించాల్సిందేనని, లేకుంటే బదిలీ వేటేస్తామని ఆయన తేల్చి చెప్పినట్లు సమాచారం.

మరోవైపు సీఐడీ, ఏసీబీ, విజిలెన్స్–ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగాల ద్వారా కూడా వైఎస్సార్‌సీపీ నేతలపై అక్రమ కేసుల జోరు పెంచామని కూడా ఆయన వారితో చెప్పడం గమనార్హం. ఎవరు ఎంతగా అక్రమ కేసులతో వేధిస్తున్నారన్నదాన్ని బట్టి ఎస్పీలు, కమిషనర్ల పనితీరు నివేదికలు ఆధారపడి ఉంటాయని కూడా వ్యాఖ్యానించినట్టు సమాచారం.
తీసుకోండి ఫిర్యాదులు.. పెట్టండి కేసులు
» పోసాని కృష్ణ మురళిపై ఒక్కసారిగా అబద్ధపు ఫిర్యాదులు జోరందుకున్నాయి. ఆయనపై రాష్ట్రంలో వేర్వేరు జిల్లాల్లో పోలీసులు చకచకా అక్రమ కేసులు నమోదు చేశారు. హైదరాబాద్‌లో ఉన్న ఆయన్ను అరెస్ట్ చేసి.. అన్నమయ్య, పల్నాడు, కర్నూలు జిల్లాలు తిప్పుతూ వేధింపులకు తెగబడ్డారు.
» మాజీ మంత్రి విడదల రజినీని తాజాగా లక్ష్యంగా చేసుకున్నారు. ఆమెపై ఓ క్వారీ యజమాని ద్వారా అవాస్తవ ఆరోపణలతో ఏసీబీకి ఫిర్యాదు ఇప్పించారు. ఆ ఫిర్యాదు ప్రతి దుమ్ము దులిపిన ఏసీబీ అధికారులు ఆమెను అక్రమ కేసుతో వేధించేందుకు సన్నద్ధమవుతున్నారు.
» పర్చూరు నియోజకవర్గంలో గతంలో ఓట్లను తొలగించారనే ఆరోపణలతో ప్రభుత్వం మరో కుట్రకు తెరతీసింది. అందుకోసం కుట్ర పూరితంగా టీడీపీ ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావుతో ఫిర్యాదు చేయించింది. ఆ వెంటనే ఓట్ల తొలగింపుపై దర్యాప్తునకు సిట్‌ను నియమించింది. టీడీపీ అస్మదీయ అధికారి, ప్రకాశం జిల్లా ఎస్పీ ఏ ఆర్ దామోదర్‌ను సిట్ ఇన్‌చార్జ్‌గా డీజీపీ సూచించడం గమనార్హం.
ఆయన ఇప్పటికే రఘురామకృష్ణంరాజు ఫిర్యాదుతో ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్, విజయ్‌పాల్ తదితరులపై చెలరేగిపోతున్న విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు కొట్టివేసిన అభియోగాలపై తాజాగా కేసు నమోదు చేసి మరీ వేధింపులకు పాల్పడుతూ దామోదర్ హల్చల్ సృష్టిస్తున్నారు. ఈ కేసులో అబద్ధపు వాంగ్మూలాలు ఇవ్వాలంటూ గుంటూరు జీజీహెచ్ అధికారులను వేధిస్తున్నారు. అటువంటి ట్రాక్ రికార్డు ఉన్న ఈయనకు సిట్ బాధ్యతలు అప్పగించడం పక్కా ప్రభుత్వ పన్నాగమే.
» ఇక వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం విధానంపై సీఐడీ నమోదు చేసిన అక్రమ కేసులోనూ డీజీపీ గుప్తా అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. ఇప్పటికే బెవరేజస్ కార్పొరేషన్ పూర్వ ఉద్యోగి సత్య ప్రసాద్‌ను వేధించి అబద్ధపు వాంగ్మూలం ఇప్పించారు. తాజాగా ప్రభుత్వ మాజీ సలహాదారుడు రాజ్ కసిరెడ్డితో అబద్ధపు వాంగ్మూలం ఇప్పించడం లక్ష్యంగా పెట్టుకున్నారు.
అందుకోసం ఆయన సమీప బంధువులను వేధిస్తూ ఒత్తిడి పెంచుతున్నారు. తాము చెప్పినట్టు అబద్ధపు వాంగ్మూలం ఇవ్వకపోతే అక్రమ కేసులు నమోదు చేస్తామని రాజ్ కసిరెడ్డి సమీప బంధువుల ఇళ్లకు పోలీసులు వెళ్లి బెదిరింపులకు పాల్పడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment