State Police Department
-
మహిళా పోలీస్..లెక్కలో లెస్..
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర జనాభాలో మహిళలు దాదాపు సగం (49.7 శాతం) ఉన్నప్పటికీ... మహిళా పోలీసుల శాతం మాత్రం ఇప్పటికీ నామమాత్రంగానే ఉంది. కేంద్రం అధీనంలోని బ్యూరో ఆఫ్ పోలీసు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ (బీపీఆర్ అండ్ డీ) గణాంకాల ప్రకారం రాష్ట్ర పోలీసు విభాగంలో పనిచేస్తున్న మొత్తం సిబ్బంది, అధికారుల సంఖ్య 62,731గా ఉండగా అందులో మహిళా పోలీసులు కేవలం 5,349 (8.53 శాతం) మందే ఉన్నారు. 2021 జనవరి నాటి పరిస్థితుల ఆధారంగా... బీపీఆర్ అండ్ డీ ఏటా అన్ని రాష్ట్రాలు, కమిషనరేట్లలో పోలీసు సిబ్బంది వివరాలను సేకరిస్తోంది. ఆయా ప్రాంతాల్లో ఉన్న జనాభాతో పురుష–మహిళా పోలీసులు, సివిల్–ఆర్మ్డ్ రిజర్వ్ బలగాల్లోని సిబ్బందిని గణించి నివేదిక రూపొందిస్తోంది. 2021 జనవరి నాటి గణాంకాల ఆధారంగా అధ్యయనం చేసిన బీపీఆర్ అండ్ డీ... రాష్ట్రంలో మహిళలకు అవసరమైన స్థాయిలో మహిళా పోలీసులు లేరని స్పష్టం చేసింది. అయితే అన్ని రాష్ట్రాలూ మహిళా పోలీసు పోస్టుల సంఖ్య పెంచడంతోపాటు భర్తీకి అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరింది. ఉన్న సిబ్బందికీ సమస్యలెన్నో... ప్రస్తుతం పోలీసు విభాగంలో ఉన్న మహిళా సిబ్బందిని ఫిట్నెస్ సమస్యలు వెంటాడుతున్నాయి. చాలా మంది మహిళా పోలీసులు స్థూలకాయంతో బాధపడుతున్నారు. వ్యాయాయం లేకపోవడం, ఏళ్ల తరబడి కార్యాలయ విధులకే పరిమితం కావడంతో బందోబస్తు డ్యూటీ చేయాల్సి వస్తే నిరసనకారులను అదుపు చేయడం వారికి సాధ్యం కావట్లేదు. కొత్తగా విధుల్లో చేరిన యువ మహిళా సిబ్బంది మినహా మిగిలిన వారిలో అనేక మందికి ఈ సమస్యలు ఉన్నాయి. మహిళా పోలీసు సిబ్బంది కొరత తీర్చడంతోపాటు ఉన్న వారిలోనూ నైపుణ్యాలు మెరుగుపరచడానికి ఉమ్మడి రాష్ట్రంలో తెరపైకి వచ్చిన ప్రతిపాదనలు ఇప్ప టికీ పూర్తిస్థాయిలో అమలుకు నోచుకోలేదు. మహిళా పోలీసులకు సమకాలీన అంశాలపై అవగాహన కల్పించడం, వృత్తిలో మెళకువలు నేర్పే ఉద్దేశంతో క్రాష్‌కోర్స్ నిర్వహించాలని గతంలో భావించారు. అయితే ఈ ప్రక్రియ కొందరికి పూర్తయినా మిగిలిన వారికి ఆగిపోయింది. ప్రత్యేక మహిళా బెటాలియన్ ఏర్పాటుకు సన్నాహాలు చేసినా ఆచరణకి రాలేదు. ఎట్టకేలకు లా అండ్ ఆర్డర్‌కు నేతృత్వం.. హైదరాబాద్‌లోని మూడు కమిషరేట్లలో 150కిపైగా లా అండ్ ఆర్డర్ పోలీసుస్టేషన్లు, ఐదు మహిళా ఠాణాలు ఉన్నాయి. మహిళా ఠాణాలకు ఉమెన్ ఆఫీసర్లే నేతృత్వం వహిస్తున్నా చాలాకాలం వరకు మూడు కమిషనరేట్లలో ఏ ఒక్క శాంతి భద్రతల విభాగం పోలీసుస్టేషన్‌కు మహిళా పోలీసును స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్హెచ్ఓ)గా నియమించిన దాఖలాలు లేవు. అయితే హైదరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ గతేడాది మహిళా దినోత్సవం రోజు లాలాగూడ ఠాణాకు మధులతను మొదటి మహిళా ఎస్హెచ్ఓగా నియమించారు. మరోవైపు గతంలో మహిళా పోలీసు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చినా అభ్యర్థి నుల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన ఉండేది కాదని... తాజాగా చేపట్టిన పోలీసు రిక్రూట్మెంట్లో స్త్రీలకు 33 శాతం రిజర్వేషన్ ఇవ్వడంతోపాటు వారికి అనేక వెసులుబాట్లు కల్పించడంతో పోలీసు విభాగంలో అతివల కొరత చాలా వరకు తీరుతుందని అధికారులు చెబుతున్నారు. -
నేరాలపై మూడో కన్ను!
సాక్షి, హైదరాబాద్: హత్యలు, దొంగతనాలు, కిడ్నాపులు, సైబర్ నేరాలు.. ఇలా నేరం ఏదైనాసరే రాష్ట్ర పోలీసుశాఖ చిటికెలో తేల్చేస్తోంది. భారీ సంఖ్యలో ఏర్పాటు చేస్తున్న సీసీ కెమెరాలు ఓవైపు, అత్యాధునిక టెక్నాలజీ మరోవైపు ఆయుధాలు చేసుకుని నేరస్తుల పని పడుతోంది. ఏటా వేలకొద్దీ కేసులను కొన్ని గంటల్లోనే ఛేదిస్తోంది. టెక్నాలజీని సమర్థవంతంగా వినియోగించుకుంటూ.. నేరాలు, ముందు జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పిస్తోంది. సాంకేతికత వినియోగంలో ఏటేటా మరింత ముందుకు వెళుతోంది. రాష్ట్ర ఆవిర్భావం నుంచి యుద్ధప్రాతిపదికన జరుగుతున్న సీసీ కెమెరాల ఏర్పాటు లక్ష్యాన్ని మరికొద్ది రోజుల్లో చేరుకోబోతోంది. ఇప్పటివరకు 8.6 లక్షల కెమెరాలు రాష్ట్రంలో 10 లక్షల సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోగా.. ఇప్పటివరకు 8.60 లక్షల కెమెరాలను ఏర్పాటు చేశారు. మిగతా వాటిని కూడా కొద్దిరోజుల్లో పూర్తిచేసి.. మొత్తం వ్యవస్థను త్వరలో అందుబాటులోకి రానున్న కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానం చేస్తారు. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడ, ఏం జరిగినా ఈ సెంటర్ నుంచి అప్డేట్ చేసేలా, సమస్యను నిమిషాల్లో పరిష్కరించేలా వ్యవస్థ అందుబాటులోకి రానుందని పోలీస్ అధికారులు చెప్తున్నారు. మరోవైపు పోలీసు విభాగాల ఆధునీకరణ కూడా కేసుల పరిష్కారానికి మరింత వెన్నుదన్నుగా నిలుస్తోంది. సోషల్ మీడియాలోనూ ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్.. ఇలా పలు వేదికల ద్వారా వచ్చే ఫిర్యాదులు, పోస్టులపైనా పోలీసుశాఖ వేగంగా చర్యలు తీసుకుంటోంది. 2021లో రాష్ట్రవ్యాప్తంగా 1.47 లక్షల పోస్టులపై పోలీస్ శాఖ స్పందించింది. అంతేకాదు ట్రాఫిక్ నిబంధనలు, సైబర్ దోపిడీ, ఇతర ముందస్తు జాగ్రత్తలు, నిబంధనలపై లక్షల మందికి అవగాహన కల్పించింది. స్కూళ్లు, కాలేజీలు, ఇతర వేదికల ద్వారా 53.5 లక్షల మంది మహిళలు, చిన్నారులకు, సైబర్ నేరాలపై 2.1 లక్షల మందికి అవగాహన కల్పించినట్టు అధికారులు తెలిపారు. అటు కళా బృందాల ద్వారా కూడా లక్షల మందికి వివిధ అంశాలపై అవగాహన కల్పించామని.. కమ్యూనిటీ పోలీసింగ్ ద్వారా 10 లక్షల మందిని చేరుకున్నామని వివరించారు. కేసులను వేగంగా ఛేదిస్తూ.. ►ఓవైపు పెద్ద సంఖ్యలో సీసీ కెమెరాలు, మరోవైపు ఆధునీకరించిన విభాగాల పనితీరుతో.. నేరాల అదుపుతోపాటు కేసుల ఛేదింపు పెరుగుతోంది. 2021లో సీసీ కెమెరాల సాయంతోనే ఏకంగా 23 వేల కేసులు ఛేదించినట్టు అధికారులు చెప్తున్నారు. అదే 2020లో సీసీ కెమెరాల ద్వారా ఛేదించిన కేసులు 4,490 మాత్రమే. ►ఇక ఆధునీకరించిన ఫింగర్ ప్రింట్స్ విభాగం ద్వారా 2020లో 300 కేసులను, 2021లో 480 కేసులను ఛేదించారు. వేలిముద్రల ద్వారా 37 గుర్తుతెలియని మృతదేహాలు ఎవరివో తేల్చగలిగారు. ►మొబైల్ యాప్ ద్వారా 2020లో 3,100 అనుమానితులను గుర్తించగా.. 2021లో 5,624 మంది అనుమానితులను గుర్తించారు. ►బాధితులకు త్వరగా న్యాయం జరిగేందుకు నమోదు చేసే జీరో ఎఫ్‌ఐఆర్‌లూ పెరుగుతున్నాయి. 2020లో 517 జీరో ఎఫ్ఐఆర్లు చేయగా, 2021లో 838 నమోదైనట్టు అధికారులు తెలిపారు. ►బాధితులు నేరుగా పోలీస్‌స్టేషన్‌కు రాకుండానే ఆన్లైన్ ద్వారా దాఖలు చేస్తున్న ఫిర్యాదుల సంఖ్య కూడా పెరిగింది. ఇలా 2020లో 2,626 ఫిర్యాదులు అందగా.. 2021లో ఏకంగా 10,656 ఫిర్యాదులు ఆన్లైన్లో అందినట్టు అధికారులు వెల్లడించారు. ►ఇక మొబైల్ యాప్ హ్యాక్ ఐ ద్వారా 83,355 ఫిర్యాదులు అందగా, డయల్ 100 ద్వారా 11.24 లక్షల కాల్స్‌ను పోలీస్ సిబ్బంది అందుకున్నారు. ►సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ కింద ఏర్పాటు చేసిన సైబర్ ఫోరెన్సిక్ ల్యాబ్‌ల ద్వారా 808 కేసుల్లో 426 కేసులను ఛేదించారు. ►మొబైల్ క్లూస్ టీంల ద్వారా 2,969 ఘటనల్లో 1,638 కేసులను తేల్చారు. ►‘వీడియో ఎన్హాన్స్మెంట్ ల్యాబ్’ద్వారా వివిధ ఘటనలకు చెందిన 7,460 వీడియోల్లో.. 2,283 వీడియోలను బాగా మెరుగుపర్చి కేసుల దర్యాప్తులో వినియోగించారు. ►డేటా అనలిటిక్స్ యూనిట్ ద్వారా 37,563 కేసులను తేల్చారు. ►నాన్ బెయిలబుల్ వారెంట్లు వచ్చి తప్పించుకు తిరుగుతున్న 94మంది నిందితులను ‘పాపిలాన్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్’ద్వారా పట్టుకున్నారు. -
Hyderabad: కరోనా రోగుల ఇంటి వద్దకే ఫ్రీ ఫుడ్ డెలివరీ
సాక్షి, హైదరాబాద్: కరోనా మొదటివేవ్ లాక్డౌన్ సమయంలో అవసరమైన ప్రతి ఒక్కరికీ ఆహారం, సరుకులు పంపిణీ చేసిన రాష్ట్ర పోలీసులు, మరో బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కరోనా సోకి హోం ఐసో లేషన్‌లో ఉన్న వ్యక్తుల ఇంటి వద్దకే ఆహారం ఉచిత సరఫరా చేపట్టారు. సేవా ఆహార్ పేరుతో సత్యసాయి సేవా సంస్థ, హోప్ స్వచ్ఛంద సంస్థతో కలిసి గురువారం నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్విగ్గీ, బిగ్ బాస్కెట్ వంటి ఫుడ్ డెలివరీ సంస్థలు ఇందుకు సహకారం అందిస్తున్నాయి. ప్రస్తుతానికి ఈ సేవలు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే కొనసాగించనున్నారు. దాతలు, ఫుడ్ డెలివరీ సంస్థలు ముందుకు వస్తే త్వరలోరాష్ట్రవ్యాప్తంగా విస్తరించనున్నారు. కరోనా బారినపడి ఇంటికే పరిమితమై, బయటికి రాలేని వారికోసం ఈ సేవలు అందిస్తున్నారు. రెండు విధాలుగా ఆర్డర్ ఈ సేవా ఆహార్ పథకంలో రెండు రకాలుగా ఉచిత ఆహారం కోసం ఆర్డర్ చేయవచ్చు. మొదటిది 7799616163 ఫోన్ నంబర్‌కు వాట్సాప్‌లో ఉదయం 7 గంటల్లోగా ఆర్డర్ చేయాలి. ఏడింటి తరువాత చేస్తే దాన్ని మరుసటి రోజు ఆర్డర్ కింద పరిగణిస్తారు. సేవా ఆహార్ యాప్ ద్వారా కూడా ఆర్డర్ చేయవచ్చు. ఈ యాప్‌ను ఆండ్రాయిడ్, ఐఓఎస్ ఫోన్ల వినియోగదారులు ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ యాప్ రెండురోజుల్లో అందుబాటులోకి రానుంది. ఆర్డర్ సమయంలో రోగి పేరు, నివసిస్తున్న ప్రాంతం, కాంటాక్ట్ నంబర్, ఇంట్లో ఎందరు పాజిటివ్ అయ్యారు? తదితర వివరాలను పంపాలి. వీరికి ఐదురోజుల పాటు ఉచితంగా ఆహారం అందజేస్తారు. ఇలా రోజుకు 1,000 నుంచి గరిష్టంగా 2,000 మందికి నాణ్యమైన ఆహారాన్ని సరఫరా చేస్తారు. ఇందులో వృద్ధులు, చిన్నారులకు ప్రాధాన్యం ఇస్తారు. గతేడాది డీజీపీ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసిన పోలీసు ఉన్నతాధికారులు రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మందికి సరుకులు, ఆహారం అందజేశారు.కాగా సేవా ఆహార్ కార్యక్రమాన్ని సత్యసాయిసేవా సంస్థతో పాటు విమెన్ సేఫ్టీ వింగ్ చీఫ్, ఏడీజీ స్వాతీ లక్రా, డీఐజీ బడుగుల సుమతి పర్యవేక్షిస్తున్నారు. ఇందుకు సంబంధించిన పోస్టర్ విమెన్ సేఫ్టీ వింగ్ కార్యాలయంలో గురువారం ఆవిష్కరించారు. -
శాంతిభద్రతల రక్షణలో దేశానికే ఆదర్శం: కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: అభివృద్ధి పథాన ముందుకు సాగుతున్న తెలంగాణ రాష్ట్రం, శాంతి భధ్రతల పరిరక్షణలో దేశానికే ఆదర్శంగా నిలిచిందని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అన్నారు. ఆ దిశగా పోలీసుల భాగస్వామ్యాన్ని అభినందించారు. బుధవారం ప్రగతి భవన్లో జరిగిన రాష్ట్ర పోలీసు శాఖ, అటవీశాఖ ఉన్నతాధికారుల సమావేశంలో సీఎం కేసీఆర్ ప్రసంగించారు. సామాజిక రంగాలలో నిత్యం శాంతిభధ్రతల పరిరక్షణ కోసం అహర్నిషలు కృషి చేయాల్సిన అవసరాన్ని ముఖ్యమంత్రి, పోలీసు ఉన్నతాధికారులకు వివరించారు. ఈ కార్యక్రమంలో హోంశాఖ మంత్రి మహ్మద్ అలీ, అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, డీజీపీ మహేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారులు రాజీవ్ శర్మ, అనురాగ్ శర్మ, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ నర్సింగరావు, సీఎం కార్యదర్శులు స్మితా సభర్వాల్, ఓఎస్డీ ప్రియాంక వర్గీస్, పీసీసీఎఫ్ శోభ, అటవీశాఖ ఉన్నతాధికారులు, అన్ని జిల్లాల ఎస్పీలు, పోలీస్ కమిషనర్లు, రేంజ్ డీఐజీలు, జోనల్ ఐజీలు, తెలంగాణ పోలీస్ శాఖ ఉన్నతాధికారులు, సీఎంవో అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం మహిళల భధ్రతను ప్రాధాన్యతాంశంగా తీసుకుని పనిచేస్తున్నదని, పోలీసులు మహిళా సంరక్షణ కోసం మరింతగా శ్రమించాల్సిన అవసరముందన్నారు. సమాజాన్ని పీడించే గంజాయి వంటి వాటి ఉత్పత్తి, అమ్మకం, రవాణా వ్యవస్థలను అరికట్టాలన్నారు. అటవీ సంపదను కొల్లగొట్టే వారి పట్ల మరింత కఠినంగా వ్యవహరించాలని సీఎం ఆదేశించారు. కలప స్మగ్లింగును గత పాలకులు సరిగ్గా పట్టించుకోక పోవడం వల్ల కొందరికి అలుసుగా మారిందని, ఐతే దీన్ని తెలంగాణ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకున్నదని ముఖ్యమంత్రి తెలిపారు. ఫారెస్టు స్మగ్లింగును అరికట్టడంలో కేవలం అటవీశాఖ అధికారులే కాకుండా సివిల్ పోలీసు వ్యవస్థ కూడా భాగస్వామ్యం కావాల్సిన అవసరముందన్నారు. సమాజంలో భాగస్వామ్యమై నేరాలను అరికట్టినట్టు, ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమంలో భాగస్వామ్యం కావడం ద్వారా పోలీసులు అడవుల పట్ల అవగాహన పెంచుకుని, స్మగ్లింగు వంటి అటవీ నేరాలను అరికట్టాలని పిలుపునిచ్చారు. అటవీశాఖ అధికారులు పోలీసులతో సమన్వయం చేసుకుని ఈ దిశగా ముందుకు సాగాలని సీఎం సూచించారు. ఎప్పటికప్పుడు ఇరు శాఖల ఉన్నతాధికారులు సమావేశాలు నిర్వహించుకుని కలప స్మగ్లింగు నివారణ చర్యల రూపకల్పనకు వ్యూహాలు సిద్ధం చేసుకోవాలన్నారు. తద్వారా మాత్రమే సమాజానికి మనం అనుకున్న విధంగా సేవ చేయగలుగుతామన్నారు. (చదవండి: అరవై ఏళ్లుగా గోస పడ్డాం...) దళితుల మీద దాడులు శోచనీయం తెలంగాణ ఏర్పాటు అనంతరం పోలీసులు సాధించిన ఘన విజయాల్లో గుడుంబా నిర్మూలన కూడా వుందన్నారు. ఇటీవలి కరోనా నేపథ్యంలో రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల్లో అక్కడక్కడ గుడుంబా తయారీ జరుగుతున్నట్టు సమాచారముందని, దాన్ని కూడా తక్షణమే అరికట్టాలన్నారు. తెలంగాణను గుడుంబా రహిత రాష్ట్రంగా మార్చిన ఎక్సైజ్, సివిల్ పోలీసులు తిరిగి అదే స్ఫూర్తితో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. అందుకుగాను రాష్ట్ర ఎక్సైజ్ శాఖతో పోలీసులు సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలన్నారు. ప్రజలను ఏమార్చే గ్యాంబ్లింగ్ వంటి సామాజిక దురాచారాలను అరికట్టడంలో పోలీసులు అప్రమత్తంగా ఉండాలన్నారు. దేశవ్యాప్తంగా దళితుల మీద దాడులు జరుగుతున్న వార్తలు వినడం శోచనీయమని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దుస్థితి నుంచి సమాజం దూరం కావాలని ఈ సందర్భంగా సీఎం ఆకాంక్షించారు. దళితుల మీద దాడులు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని పోలీసులకు సీఎం వివరించారు. ఆ దిశగా ఎప్పటికప్పుడు అప్రమత్తతతో మెలగాలన్నారు. బలహీనుల మీద బలవంతుల దాడులు జరగకుండా కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర పోలీసు వ్యవస్థకున్నదని పేర్కొన్నారు. ఇందులో భాగంగా ఉన్నతాధికారుల దగ్గరనుంచి కిందిస్థాయి పోలీసు వరకు సమాజంలో ఒకరిగా భాగస్వాములు కావాలని, చిన్నా పెద్ద తేడా లేకుండా పౌరులందరికి గౌరవాన్ని ఇస్తూ ఫ్రెండ్లీ పోలీసు స్ఫూర్తిని పెంచుకోవాల్సిన అవసరం ప్రతి పోలీసుకున్నదన్నారు కేసీఆర్. (చదవండి: దేవునితోనైనా కొట్లాడుతా!) కారుణ్య నియామకాల్లో ఆలస్యం తగదు తమ దగ్గరికి రక్షణకోసం వచ్చిన అభాగ్యుల పట్ల మానవీయ కోణంలో మెలగాలని సీఎం హితవు పలికారు. నకిలీ సర్టిఫికెట్ల వ్యవహారాల మీద పోలీసు ఉన్నతాధికారులు దృష్టి సారించి అరికట్టాలని సీఎం చెప్పారు. కష్టపడి సాధించాల్సిన పట్టాలను తప్పుడు దారుల్లో పొందే సంస్కృతి సమాజానికి తప్పుడు సంకేతాలిస్తుందని తెలిపారు. ఫేక్ సర్టిఫికెట్లను సృష్టించే ముఠాలు, వ్యక్తుల మీద కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులకు సీఎం కేసీఆర్ సూచించారు. పోలీసు శాఖలో పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు పెన్షన్ సెటిల్ చేసి, సర్వీసు ఆఖరి రోజున గౌరవప్రదంగా ఇంటిదాకా సాగనంపాల్సిన అవసరాన్ని ముఖ్యమంత్రి మరోమారు పోలీసు ఉన్నతాధికారులకు గుర్తుచేశారు. తన జీవితకాలం పాటు డిపార్టుమెంటుకు సేవలందించిన ఉద్యోగి రిటైరయితే, వారిని సత్కరించి కారులో ఇంటికాడ దించివచ్చే మంచి సంప్రదాయాన్ని కొనసాగించాలని అన్నారు. పోలీసు శాఖలో కారుణ్య నియామకాలను చేపట్టడంలో ఆలస్యం తగదన్నారు. డ్యూటీలో వుంటూ చనిపోయిన ఉద్యోగి వారసులకు, నిబంధనల ప్రకారం కారుణ్య నియామకానికి అర్హత కలిగిన వారసులకు, తక్షణమే ఉద్యోగం ఇవ్వాలని, దీనిపై వెంటనే కార్యాచరణ చేపట్టాలన్నారు. ఇతర శాఖల్లో ఖాళీలుంటే పరిశీలించి వెయిటింగ్ లిస్టులో వున్న అభ్యర్థులకు ఉద్యోగాలు అందేలా చూడాలని డీజీపీ మహేందర్ రెడ్డికి సీఎం కేసీఆర్ సూచించారు. (చదవండి: దసరాకు ధరణి) మహిళా ఉద్యోగులకు ప్రత్యేక వసతులు పోలీసు శాఖలో పనిచేసే మహిళా ఉద్యోగుల సంక్షేమం కోసం మరింతగా కృషి జరగాల్సిన అవసరమున్నదని సీఎం తెలిపారు. పోలీసు ఉద్యోగ నియామకాల్లో మహిళల కోసం 33శాతం రిజర్వేషన్లను అమలు పరుస్తున్న నేపథ్యంలో, ఆ శాఖలో మహిళా ఉద్యోగుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతున్నదన్నారు. అందులో భాగంగా మహిళలు పనిచేసే పోలీసు కార్యాలయాలు స్థలాల్లో ప్రత్యేకించి రెస్ట్ రూములు, వసతులు కల్పించాలన్నారు. హైదరాబాద్‌లో పది లక్షల సీసీ కెమెరాల ఏర్పాటు లక్ష్యంగా కార్యాచరణ వేగవంతం చేయాలని డీజీపీకి సీఎం సూచించారు. పోలీసు వ్యవస్థలో ఐటీ పాత్రను పెంచి నేరాలను అరికట్టడంలో సాంకేతిక వ్యవస్థలను ఉపయోగించుకోవాలని తెలిపారు. దేశానికే తలమానికంగా హైదరాబాద్‌లో నిర్మితమౌతున్న పోలీసు కమాండ్ కంట్రోల్ వ్యవస్థ నిర్మాణాన్ని అతి త్వరలో పూర్తిచేసి వినియోగంలోకి తీసుకొస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. -
‘షేర్’కింగ్‌లూ.. జాగ్రత్త
సాక్షి, హైదరాబాద్: ఢిల్లీలో హింస చెలరేగిన నేపథ్యంలో రాష్ట్ర పోలీసులు అప్రమత్తమయ్యారు. రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. సున్నిత, అతి సున్నిత, సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఉంచాలని, వదంతులు నమ్మవద్దని డీజీపీ కార్యాలయం నుంచి రాష్ట్రంలోని అన్ని జిల్లాల ఎస్పీలు, కమిషనర్లకు ఆదేశాలు వెళ్లాయి. చర్యలేంటి? - సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా కామెంట్లు చేస్తే.. ఐటీ యాక్ట్ సెక్షన్ 66(ఏ) ప్రకారం పోలీసులు అరెస్టు చేసే వీలుంది. - వ్యక్తుల పరువుకు భంగం వాటిల్లే పోస్టులు పెడితే.. ఐపీసీ 499 సెక్షన్ ప్రకారం కేసులు నమోదు చేయవచ్చు. - ఒక వ్యక్తిని లేదా సంస్థ ప్రతిష్టకు భంగం వాటిల్లేలా పోస్టులు పెడితే.. పరువు నష్టం దావా వేసే వీలుంది. - అసభ్యకర పోస్టులు పెట్టి ఇతరులను ఇబ్బందులకు గురిచేస్తే.. ఐపీసీ సెక్షన్లు 292, 292 (ఏ), 293, 294 ప్రకారం అరెస్టు అవుతారు. -
పోలీసులు చట్ట ప్రకారం నడుచుకోలేదు
సాక్షి, హైదరాబాద్ : విశాఖపట్నం విమానాశ్రయంలో ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిపై జరిగిన హత్యాయత్నం కేసు విషయంలో ఆంధ్రప్రదేశ్ పోలీసులు చట్ట ప్రకారం నడుచుకోలేదని ఆయన తరఫున సీనియర్ న్యాయవాది సీవీ మోహన్‌రెడ్డి గురువారం హైకోర్టుకు నివేదించారు. పౌర విమానయాన చట్టం ప్రకారం.. విశాఖ విమానాశ్రయంలో జరిగిన హత్యాయత్నం ఘటన చట్ట వ్యతిరేక కార్యకలాపాల నియంత్రణ నిర్వచన పరిధిలోకి వస్తుందని తెలిపారు. దీని ప్రకారం జగన్‌పై జరిగిన ఘటనకు సంబంధించిన సమాచారాన్ని, నివేదికను ఏపీ పోలీసులు కేంద్ర ప్రభుత్వానికి తప్పనిసరిగా పంపాల్సి ఉండగా, ఇప్పటివరకు ఆ పని చేయలేదని ఆయన వివరించారు. పౌర విమానయాన భద్రతా చట్ట నిబంధనల ప్రకారం ఇటువంటి ఘటనలపై దర్యాప్తు చేసే అధికారం జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)కు ఉందన్నారు. రాష్ట్ర పోలీసులు పంపే నివేదిక ఆధారంగా ఎన్ఐఏ దర్యాప్తునకు అప్పగించే విషయంపై కేంద్రం నిర్ణయం తీసుకుంటుందని వివరించారు. అయితే, రాష్ట్ర పోలీసులు చట్ట ప్రకారం కేంద్రానికి ఎటువంటి నివేదిక పంపలేదని ఆయన కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీంతో స్పందించిన హైకోర్టు.. కేసులో చాలా తీవ్రత ఉందని, అందువల్ల పూర్తిస్థాయి వాదనలు వింటామని స్పష్టంచేస్తూ ఈ వ్యాజ్యంపై విచారణను డిసెంబరు 3కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ ఎస్వి భట్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీచేసింది. కాగా, తన మీద జరిగిన హత్యాయత్న ఘటనపై రాష్ట్ర ప్రభుత్వ, పోలీసుల నియంత్రణలో లేని స్వతంత్ర సంస్థతో దర్యాప్తు చేయించేలా ఆదేశాలివ్వాలంటూ జగన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఇదే సమయంలో ఆయన పౌర విమానయాన చట్ట నిబంధనల గురించి వివరిస్తూ ఇటీవల ఓ అనుబంధ పిటిషన్ కూడా దాఖలు చేశారు. అలాగే, ఇదే వ్యవహారంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున వైవీ సుబ్బారెడ్డి, జగన్‌పై హత్యాయత్నం ఘటనను ఎన్ఐఏతో దర్యాప్తు చేయించాలని కోరుతూ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కూడా పిటిషన్లు దాఖలు చేశారు. విమానాశ్రయాల్లో భద్రతా లోపాలపై బోరుగడ్డ అనిల్‌కుమార్, మరొకరు ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలన్నింటిపై గురువారం సీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా ధర్మాసనం కౌంటర్ల దాఖలు గురించి ఆరా తీయగా, కౌంటర్లు సిద్ధమయ్యాయని సీఐఎస్ఎఫ్ తరఫు న్యాయవాది లక్ష్మణ్ కోర్టుకు నివేదించారు. తదుపరి విచారణ నాటికి వాటిని కోర్టు ముందుంచుతానని ఆయన తెలిపారు. ఇందుకు ధర్మాసనం అంగీకరిస్తూ, ఈ కేసులో చాలా తీవ్రత ఉందని మరోసారి గుర్తుచేసింది. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. -
మానవ అక్రమ రవాణా నియంత్రణపై సమష్టి కార్యాచరణ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మానవ అక్రమ రవాణా నియంత్రణకు చేపట్టాల్సిన కార్యాచరణపై రాష్ట్ర పోలీస్ శాఖ–కేంద్ర హోంశాఖ సంయుక్తంగా రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహించింది. శనివారం హైదరాబాద్ మాసబ్‌ట్యాంక్‌లోని పోలీస్ అధికారుల మెస్‌లో జరిగిన రాష్ట్ర స్థాయి యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ సదస్సును డీజీపీ మహేందర్‌రెడ్డి, రిటైర్డ్ డీజీపీ పీఎం నాయర్ కలిసి ప్రారంభించారు. ఈ సదస్సులో రాష్ట్రంలోని అన్ని జిల్లాలు, కమిషనరేట్లలో పనిచేస్తున్న ఇన్స్పెక్టర్లు, డీఎస్పీలు, అదనపు ఎస్పీలు మొత్తం 100మంది వరకు పాల్గొన్నారు. మానవ అక్రమ రవాణా నియంత్రణకు చేపట్టాల్సిన కార్యక్రమాలపై గ్రూప్ డిస్కషన్, పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌పై సుదీర్ఘంగా శిక్షణ ఇచ్చారు. అక్రమ రవాణా కేసుల నమోదు, వాటి దర్యాప్తులో చేపట్టాల్సిన అంశాలపై మహేందర్‌రెడ్డి, పీఎం నాయర్ అధికారులకు అవగాహన కల్పించారు. చట్టపరంగా సమన్వయం చేసుకోవాల్సిన విభాగాలు, వాటి ద్వారా చేపట్టాల్సిన చర్యలపై ప్రధానంగా శిక్షణ కొనసాగింది. అక్రమ రవాణా కూపాల నుంచి బయటపడ్డ బాధితులకు అందాల్సిన పరిహారం, స్వచ్ఛంద సంస్థల సహకారంపై వేగవంతంగా స్పందించాలని సూచించారు. యూనిసెఫ్ నుంచి వచ్చిన ప్రతినిధులు మానవ అక్రమ రవాణా నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలు, అందుకు తగిన సహకారంపై ప్రజెంటేషన్ అందించారు. ప్రజ్వల, మై చాయిస్, దివ్యదిశ, తరుణి, బచ్పన్ బచావ్, సంకల్ప్ తదితర స్వచ్ఛంద సంస్థలతో ఈ కార్యక్రమంలో కలిసి చేపట్టాల్సిన అంశాలపై అవగాహన కల్పించారు. న్యాయపరంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దానిపై మెట్రోపాలిజన్ సెషన్స్ జడ్జి వెంకట కృష్ణయ్య అవగాహన కల్పించారు. హైదరాబాద్ కమిషనరేట్‌లో ఏర్పాటుచేసిన భరోసా లాంటి సెంటర్లను జిల్లాల్లోనూ వేగవంతంగా విస్తరించి చర్యలు చేపట్టాలని పోలీస్ ఉన్నతాధికారులకు, అధికారులకు సూచించారు. కార్యక్రమంలో రాచకొండ కమిషనర్ మహేశ్ భగవత్, మహిళ భద్రత విభాగం ఐజీ స్వాతిలక్రా, ఎస్పీ సుమతి, ప్రజ్వల ఎన్జీవో నిర్వాహకురాలు సునీతకృష్ణన్, మహిళ శిశుసంక్షేమ శాఖ అధికారులు, పలు స్వచ్చంద సంస్థల నిర్వహకులు తదితరులు పాల్గొన్నారు. -
కేసులుంటే డ్యూటీ పాస్ ఎలా ఇచ్చారు?
సాక్షి, విశాఖపట్నం : అంతర్జాతీయ విమానాశ్రయాల్లోకి ఎవరైనా అడుగుపెట్టాలంటే అనేక ఆంక్షలు, నిబంధనలు ఉంటాయి. తనిఖీల విషయంలో ప్రయాణికులనే కాదు అక్కడ పనిచేసే సిబ్బందిని కూడా విడిచిపెట్టరు. అణువణువూ తనిఖీచేస్తారు. అలాగే, అక్కడ పనిచేసే సిబ్బందికి పాసులు జారీచేసే విషయంలోనూ అనేక జాగ్రత్తలు తీసుకుంటారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై గురువారం జరిగిన హత్యాయత్నం ఘటనతో నిందితుడు శ్రీనివాసరావుకు పాసు జారీ విషయంలో రాష్ట్ర పోలీసుల వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. పోలీసులు ఎన్ఓసీ ఎలా ఇచ్చారు? వాస్తవానికి ఎయిర్‌పోర్టులోని రెస్టారెంట్‌తో పాటు ఇతర విభాగాల్లో పనిచేసే సిబ్బందికి ప్రత్యేకంగా డ్యూటీ పాస్‌లు జారీచేస్తారు. రెస్టారెంట్లో పనిచేసే సిబ్బంది అయితే దాని యజమాని తమ వద్ద ఎవరెవరు పనిచేస్తున్నారు.. వారిని ఏ విధంగా నియమించుకున్నామో వివరిస్తూ లేఖ ఇవ్వాలి. లేఖ ఇచ్చిన తర్వాత వారిపై ఏమైనా కేసులున్నాయో లేదో విచారించి రిపోర్టు ఇవ్వాలని స్థానిక పోలీసు అధికారులకు ఎయిర్‌పోర్టు అధికారులు లేఖ రాస్తారు. ఒకవేళ వారు స్థానికులైతే వారు నివసిస్తున్న ప్రాంతాల పరిధిలోని పోలీస్‌స్టేషన్‌లో విచారించి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ పంపిస్తారు. వేరే జిల్లాలకు చెందిన వారైతే ఆయా జిల్లాలకు వారి వివరాలను పంపి అక్కడి ఎస్పీల ద్వారా ఎన్వోసీలు తెప్పించుకుంటారు. ఎలాంటి కేసులు లేవని సంబంధిత పోలీస్‌స్టేషన్‌లో తేలితేనే ఎన్వోసీలు జారీచేస్తారు. ఒకవేళ ఉంటే వాటి తీవ్రత.. సెక్షన్లు.. ఏ సందర్భంలో ఆ కేసులు నమోదయ్యాయో వివరిస్తూ రిపోర్టు పంపిస్తారు. కేసులున్నాయని స్పష్టంగా రిపోర్టులో పేర్కొంటే మాత్రం ఎయిర్‌పోర్టు అధికారులు వాటిని తిరస్కరిస్తారు. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్‌పై దాడిచేసిన జనుపెల్లి శ్రీనివాసరావుకు తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం పోలీస్‌స్టేషన్‌లో కేసులు నమోదై ఉన్నట్టు స్పష్టమైంది. గతేడాదే ఠానేలంకలో దాడిచేసిన ఘటనలో శ్రీనివాసరావుపై సెక్షన్–323, 506 (కొట్టడం, బెదిరించడం) కింద కేసులు నమోదయ్యాయి. శ్రీనివాసరావు ఏ–4 ముద్దాయిగా ఉన్న ఈ కేసు ముమ్మిడివరం కోర్టులో నేటికీ కొనసాగుతున్నప్పటికీ ఎయిర్‌పోర్టులోని రెస్టారెంట్ యజమాని నిందితుడు శ్రీనివాసరావును వెయిటర్‌గా నియమించుకున్నారు. అలాంటి నిందితునికి కేసుల్లేవంటూ రాష్ట్ర పోలీసులు ఎన్వోసీ జారీచేయడం, దాన్ని ఆధారంగా చేసుకుని ఎయిర్‌పోర్టు అధికారులు డ్యూటీ పాస్ ఇవ్వడం ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. మరోవైపు.. రాష్ట్ర పోలీసుల ఎన్వోసీ ఆధారంగానే డ్యూటీపాస్ ఇచ్చాం.. అందులో తమ తప్పేమీ లేదంటూ ఎయిర్‌పోర్టు అధికారులు స్పష్టం చేస్తున్నారు. -
ప్రేమ కేసులు.. పోలీసుశాఖ కీలకాదేశాలు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న ప్రేమ, పెళ్లి వ్యవహారపు కేసుల్లో అప్రమత్తంగా వ్యవహరించాలని అన్ని జిల్లాల పోలీసు అధికారులను పోలీసు శాఖ ఆదేశించింది. పరిస్థితులు చెయి దాటిపోయాక పోలీసు శాఖపై ఆరోపణలు వచ్చేలా వ్యవహరించొద్దని సూచించింది. రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఘటనలతో ఆందోళనకరమైన పరిస్థితి ఉండటంతో పోలీసు శాఖ చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. ఈ మేరకు అన్ని జిల్లాల ఎస్పీలు, పోలీసు కమిషనర్లకు మార్గదర్శకాలు పంపినట్లు తెలిసింది. ఫిర్యాదులు తీసుకోండి.. ప్రేమించి పెళ్లి చేసుకున్న జంట మేజర్లయితే వారి ఫిర్యాదును స్వీకరించాలని, ఫిర్యాదులో ఆరోపించిన అంశాలపై దర్యాప్తు చేయాలని పోలీసు శాఖ సూచించింది. అలాగే ప్రేమించి పెళ్లి చేసుకున్న జంట విషయంలో ఇరువురి తల్లిదండ్రులు, పెద్దలను స్టేషన్‌కు పిలిపించి తప్పనిసరిగా కౌన్సెలింగ్ ఇవ్వాలని ఆదేశించినట్లు సమాచారం. గతంలో లాగా సాదాసీదాగా వ్యవహరించొద్దని, అవసరమైతే కేసుల నమోదుకు కూడా వెనుకాడొద్దని ఆదేశాలు జారీ అయినట్లు పోలీసు శాఖ వర్గాలు తెలిపాయి. ఘాతుకాలకు పాల్పడటానికి ముందే ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల సమజాంలో హింసాత్మక ఘటనలు జరగకుండా ఉంటాయని భావిస్తోంది. నిజంగా ప్రాణహాని ఉందనుకున్న సమయంలో ప్రేమజంటపై, వారి కుటుంబీకులపై నిఘా పెట్టాలని ఆదేశించినట్లు తెలిసింది. రోజుకు పది ఫిర్యాదులు అవే.. గడిచిన నెల రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా ప్రేమ వ్యవహారాల్లో ఫిర్యాదులు పెరిగినట్లు పోలీసు శాఖ తెలిపింది. జిల్లాలతో పాటు రాజధాని కమిషనరేట్ల పరిధిలో రోజుకు కనీసం 10 నుంచి 15 ప్రేమ పెళ్లి ఫిర్యాదులు వచ్చినట్లు గుర్తించింది. ఈ ఫిర్యాదులపై ప్రాథమిక విచారణ జరిపి వధూవరుల అభిప్రాయం తర్వాతే కేసుల నమోదుకు వెళ్తున్నట్లు ఉన్నతాధికారులు తెలిపారు. కొన్నిసార్లు కేసులు నమోదుచేయడం వల్ల సమస్య మరింత జఠిలమై దాడుల వరకు వెళ్లేలా ఉంటున్నాయని, అందువల్ల ఇరువర్గా లు సంయమనం పాటించేలా చేసి పెళ్లికి ఒప్పించే స్థితికి కౌన్సెలింగ్ చేస్తున్నట్లు ఉన్నతాధికారులు తెలిపారు. -
‘ఆపరేషన్ సభ’ సక్సెస్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పోలీసు విభాగం పటిష్ట వ్యూహం.. డీజీపీ నుంచి కానిస్టేబుల్ వరకు సమన్వయంతో పని... పగలు రాత్రి లేకుండా అహర్నిశలు శ్రమ... ఫలితంగా ‘ఆపరేషన్ సభ’పూర్తిగా సక్సెస్ అయింది. ఆదివారం నాటి ప్రగతి నివేదన సభను అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా పూర్తి చేశారు. అక్కడక్కడా ట్రాఫిక్ జామ్, కొంగరకలాన్‌లోని పార్కింగ్ ప్రాంతంలో చిన్న, చిన్న ఇబ్బందుల మినహా ఆద్యంతం సజావుగా పూర్తయింది. కార్యక్రమం ముగిసిన తర్వాత వాహనాలను క్రమపద్ధతిలో పంపించారు. భద్రత ఏర్పాట్లలో భాగంగా సభా వేదిక, చుట్టపక్కల ప్రాంతాల్లో మొత్తం 300 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. వీటితో పాటు ప్యాన్ టిల్ట్ జూమ్ (పీటీజెడ్) టెక్నాలజీతో పని చేసే కెమెరాలు అదనంగా అమర్చారు. వీటన్నింటినీ అనుసంధానిస్తూ కొంగరకలాన్‌లో ఓ కంట్రోల్‌రూమ్ ఏర్పాటు చేశారు. మరోపక్క డీజీపీ కార్యాలయంలో ప్రత్యేకంగా కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేశారు. ఆదివారం ఉదయం నుంచి ఇక్కడే ఉన్న డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి ఆద్యంతం పర్యవేక్షించారు. రాత్రి సభ ముగిసిన తర్వాత సైతం గంటలపాటు డీజీపీ తన కార్యాలయంలోనే ఉండి తిరిగి వెళ్తున్న వాహనాల విషయంలోనూ శ్రద్ధ తీసుకున్నారు. ఫలితాలు ఇచ్చిన హోల్డింగ్ ఏరియాలు... సభకు వచ్చే లక్షలాది వాహనాల కోసం పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ఓఆర్ఆర్, సర్వీసు రోడ్లు, ఇతర కీలక రహదారుల్లో హోల్డింగ్ ఏరియాలు కేటాయించారు. ప్రతి రెండు కిలోమీటర్లకు ఒకటి చొప్పున ఇవి ఉన్నాయి. వెనుక వచ్చే వారికై వేచి చూడటం, ముందున్న వాహనాలు వెళ్లే వరకు ఆగడం కోసం వాహనాలను రహదారిపై నిలిపేస్తుంటారు. ఇలా చేస్తే ట్రాఫిక్ ఇబ్బందులు వస్తాయనే ఉద్దేశంతో ఈ ఏరియాలు కేటాయించారు. వాహనాలు వీటిలో నిలవడంతో పెద్దగా ఇబ్బందులు కలగలేదు. సర్వీసు రోడ్లతో పాటు ఎక్కడైనా వాహనాలు ఆగితే తరలించేందుకు 50 క్రేన్లు సిద్ధంగా ఉంచారు. పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నా భారీగా వచ్చిన వాహనాలతో అనేక చోట్ల ట్రాఫిక్ జామ్ తప్పలేదు. ప్రధానంగా ఓఆర్ఆర్కు సమీపంలో ఉన్న సాగర్ రింగ్ రోడ్, ఎల్బీనగర్, నాగోల్, తెలంగాణ పోలీసు అకాడెమీ, గచ్చిబౌలి జంక్షన్లతో పాటు పెద్ద అంబర్పేట్, తూప్రాన్‌పేట్, కొంగర విలేజ్, రాచలూరు గేట్, పల్మాకుల, కండ్లకోయల్లోని ఎంట్రీ, ఎగ్జిట్పాయింట్స్ వద్ద వాహనాలు ఆగక తప్పలేదు. ఓ దశలో సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ స్వయంగా రంగంలోకి దిగారు. తెలంగాణ పోలీసు అకాడెమీ జంక్షన్ వద్ద ఆయనే నిల్చుని పరిస్థితిని సమీక్షించారు. మరోపక్క శనివారం రాత్రి, ఆదివారం మధ్యాహ్నం కురిసిన వర్షంతో ర్యాంప్, పార్కింగ్ ప్రాంతాల్లో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి. ఇవి మట్టితో నిర్మించినవి కావడంతో కొన్ని వాహనాలు దిగబడ్డాయి. సోమవారమే ట్రాక్టర్ల పయనం ప్రగతి నివేదన సభ నేపథ్యంలో ఆదివారం ఉదయం 10 నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు నగరం, సైబరాబాద్, రాచకొండ పరిధిలతో పాటు ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్ఆర్) పైనా ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేశారు. ఆదివారం ఓఆర్ఆర్పై ఆటోలు, ట్రాక్టర్లు, ద్విచక్ర వాహనాల ప్రవేశం నిషే«ధించారు. ఈ నేపథ్యంలోనే సభకు ట్రాక్టర్లపై వచ్చేవారు శనివారం సాయంత్రానికే ఆ ప్రాంతానికి చేరుకున్నాయి. వీటిని సోమవారం ఉదయమే తిరిగి వెళ్ళేందుకు అనుమతించనున్నారు. -
పోలీస్ శాఖకు స్కోచ్ అవార్డు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పోలీస్ శాఖకు మరో ప్రతిష్టాత్మక అవార్డు దక్కింది. క్రైం అండ్ క్రిమినల్ ట్రాకింగ్ సిస్టమ్ (సీసీటీఎన్ఎస్) ప్రాజెక్ట్ అమలులో అన్ని రాష్ట్రాల కన్నా ముందుండటం, ఎప్పటికప్పుడు డాటా షేరింగ్‌లోనూ మొదటి స్థానంలో ఉండటంతో రాష్ట్ర పోలీస్ శాఖకు స్కోచ్ సిల్వర్ అవార్డు లభించింది. ఈ నెల 23న ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో పోలీస్ కమ్యూనికేషన్ అదనపు డీజీపీ రవిగుప్తా ఈ అవార్డును స్వీకరించారు. రవిగుప్తా, ఆయన బృందం డీజీపీ మహేందర్‌రెడ్డిని సోమవారం ఆయన కార్యాలయంలో కలిశారు. అవార్డు రావడం పట్ల డీజీపీ హర్షం వ్యక్తం చేశారు. రవిగుప్తాతో పాటు, ఆయన బృందాన్ని అభినందించారు. -
లైంగికదాడులకు వ్యతిరేకంగా..
భువనేశ్వర్ : బాలికలపట్ల జరుగుతున్న అత్యాచారాలకు వ్యతిరేకంగా రాష్ట్ర పోలీసు విభాగం ప్రత్యేక చైతన్య కార్యక్రమాన్ని ప్రారంభింది. ఈ కార్యక్రమం లోగోను రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ శర్మ ఆదివారం స్థానిక రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆవిష్కరించారు. ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఈ నెల 28వ తేదీ సోమవారం ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు. యూనిసెఫ్ సహకారంతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు డీజీపీ వివరించారు. ఈ నెల 18వ తేదీ నుంచి జూన్ 12వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా బాలికలపట్ల అత్యాచారాల నివారణ కోసం చైతన్య కార్యక్రమం నిరవధికంగా కొనసాగుతుందని ప్రకటించారు. ముఖ్యమంత్రి ఈ నెల 28న 15 పొరీ వ్యాన్లను ప్రారంభిస్తారు. ఈ వ్యాన్లను రాష్ట్రవ్యాప్తంగా బాలికలపట్ల అత్యాచారాలకు వ్యతిరేకంగా అమల్లో ఉన్న చట్టాలు, ఇతరేతర సమగ్ర సమాచారాన్ని ప్రచారం చేస్తాయి. రాష్ట్రంలోని 30 జిల్లాల్లో ఈ సమస్యతో సతమతమవుతున్న జిల్లాల్లో ఈ వ్యానులు ప్రచారం చేస్తాయి. ప్రతి జిల్లా కలెక్టర్, ఎస్పీ ఈ కార్యక్రమానికి సారథ్యం వహిస్తారు. ప్రచార రథం ఆగిన ప్రతి చోట 2 నుంచి 3 గంటలపాటు చైతన్య సమావేశాల్ని నిర్వహిస్తుందని డీజీపీ వివరించారు. ప్రజా ప్రతినిధులు, కమ్యూనిటీ సభ్యులు, ప్రతిష్టాత్మక వ్యక్తులు, స్వయం సహాయక బృందాలు, పిల్లల్ని ఈ సమావేశంలో పాల్గొనేందుకు ప్రేరేపిస్తారు. ప్రచార కార్యక్రమంలో భాగంగా ఎక్కడికక్కడ వీధుల్లో లఘు నాటికలు, జానపద సంగీత నృత్య ప్రదర్శనలు నిర్వహిస్తారు. యూనిసెఫ్ ఆధ్వర్యంలో ఈ కళాకారులకు శిక్షణ కల్పించారు. జిల్లా కళా సాంస్కృతిక సంఘం కార్యకర్తలను ఈ శిక్షణతో తీర్చిదిద్దారు. -
18 వేల పోలీసు పోస్టులు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పోలీస్ శాఖలో భారీగా కానిస్టేబుళ్లు, సబ్ ఇన్స్పెక్టర్ (ఎస్సై) పోస్టుల భర్తీకి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. సుమారు 18 వేల వరకు కానిస్టేబుల్, ఎస్సై పోస్టులను భర్తీ చేయనుంది. ఈ మేరకు ఏప్రిల్ రెండో వారం లేదా మూడో వారంలో నోటిఫికేషన్ రానుందని పోలీసుశాఖ ఉన్నతాధికార వర్గాలు వెల్లడించాయి. రాష్ట్రం ఏర్పాటయ్యాక 2015లో 9,600 కానిస్టేబుల్ పోస్టులు, 539 ఎస్సై పోస్టులకు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. కానిస్టేబుల్ పోస్టులకు ఎంపికైనవారు రెండు నెలల క్రితమే శిక్షణ పూర్తిచేసుకుని ఉద్యోగాల్లో చేరారు. ఎస్సై పోస్టులకు ఎంపికైనవారికి మరో మూడు నాలుగు నెలల్లో శిక్షణ ముగియనుంది. అయితే కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో.. భారీగా పోలీసు పోస్టులు భర్తీ చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఇందులో 3,500 కానిస్టేబుల్ పోస్టులకు ఆర్థికశాఖ గతేడాది అక్టోబర్‌లోనే ఆమోదం తెలపగా.. తాజాగా మరో 14 వేలకుపైగా పోస్టులకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్టు తెలిసింది. దీంతో నియామక ప్రక్రియ ప్రారంభించేందుకు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు కసరత్తు చేస్తున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. వయసు సడలింపు ఉంటుందా? పోలీసు పోస్టుల భర్తీలో ఈసారి కూడా అభ్యర్థులకు వయోపరిమితి సడలింపు ఇవ్వాలా? వద్దా అన్న అంశంపై స్పష్టత ఇవ్వాలని పోలీస్ శాఖ ప్రభుత్వాన్ని కోరినట్టు తెలిసింది. వారం రోజుల్లో ఈ విషయం తేలే అవకాశముందని భావిస్తున్నారు. ఇక గతంలోలా రిజర్వేషన్ల అ మలు సమస్య వంటివి ఈసారి ఎట్టి పరిస్థితుల్లో రాకుండా చూడాలని ఉన్నతాధికారులు రిక్రూట్మెంట్ బోర్డును ఆదేశించినట్లు తెలుస్తోంది. -
త్వరలో భారీగా కానిస్టేబుళ్ల నియామకం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పోలీస్ శాఖలో భారీ ఎత్తున కానిస్టేబుళ్ల నియామకానికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్టు విశ్వసనీయంగా తెలిసింది. దీనికి సంబంధించి ఆర్థిక శాఖ ఇటీవలే పంపిన ప్రతిపాదనకు సీఎం ఓకే చెప్పినట్టు సచివాలయ వర్గాల ద్వారా వెల్లడైంది. కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో కేబినెట్ ఆమోదించిన 14 వేల పోస్టుల భర్తీకి ఒకేసారి నోటిఫికేషన్ ఇచ్చేందుకు పోలీస్ శాఖ త్వరలో చర్యలు చేపట్టనున్నట్టు తెలుస్తోంది. ఈ 14 వేల పోస్టుల్లో సివిల్ విభాగానికి అధికంగా పోస్టులు కేటాయించనున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. జిల్లాల పునర్విభజనతో పోలీస్ శాఖలో కింది స్థాయి సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. దీంతో శాంతి భద్రతల విభాగాలు పర్యవేక్షించే సివిల్ కానిస్టేబుల్ పోస్టులు ఇప్పుడు కీలకంకానున్నాయి. 14 వేల పోస్టుల్లో 8 వేల వరకు సివిల్ విభాగంలో, 3 వేల పోస్టులు ఆర్మ్డ్ రిజర్వ్ విభాగంలో, మరో 3 వేల పోస్టులు తెలంగాణ స్పెషల్ పోలీస్ (టీఎస్ఎస్పీ) విభాగంలో భర్తీ చేయాలని పోలీస్ శాఖ భావిస్తోంది. జిల్లా హెడ్క్వార్టర్లలో అత్యవసర పరిస్థితుల్లో బందోబస్తు కోసం ఏఆర్, టీఎస్ఎస్పీ బలగాలను దింపాల్సి ఉంటుంది. ఎన్నికలు దగ్గరపడుతుండడంతో ఈ రెండు విభాగాల నియామకాలు కూడా కీలకంకాబోతున్నాయి. అలాగే కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన మూడు రిజర్వ్ బెటాలియన్లలోనూ ప్రస్తుతానికి సిబ్బంది లేరు. దీనితో ఇప్పుడు నియమించే సిబ్బందిని మొత్తం ఈ బెటాలియన్లలో ఉపయోగించుకునేందుకు అవకాశం ఉన్నట్టు ఉన్నతాధికార వర్గాల ద్వారా తెలిసింది. జిల్లాకో 500 ... కొత్తగా ఏర్పడిన ప్రతీ జిల్లా పోలీస్ విభాగానికి 500 చొప్పున కానిస్టేబుల్ పోస్టులను కేటాయించే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. అయితే కొత్త జిల్లాల ప్రకారం రిక్రూట్మెంట్ చేస్తారా? లేదా ఉమ్మడి జిల్లాల ప్రకారం చేస్తారా అన్న అంశంపై సందిగ్దత ఏర్పడింది. ఇటీవల టీఆర్టీకి సంబంధించి కొత్త జిల్లాల వారీగా నోటిఫికేషన్ ఇవ్వడంతో చాలా సమస్యలు వచ్చిపడ్డాయి. ఆ తర్వాత హైకోర్టు ఆదేశాలతో పాత జిల్లాల ప్రకారమే నోటిఫికేషన్‌ను సరిచేయాల్సి వచ్చింది. ఏ కేటగిరీకి ఎన్ని పోస్టులు? ముఖ్యమంత్రి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన 14 వేల పోస్టుల్లో రిజర్వేషన్ల ప్రకారం ఏ కేటగిరీకి ఎన్ని పోస్టులు కేటాయిస్తారన్న అంశంపై కూడా మరికాస్త స్పష్టత రావాల్సి ఉందని పోలీస్ శాఖ చెబుతోంది. అలాగే తెలంగాణ ఏర్పడిన తర్వాత పోలీస్ శాఖ 2015లో ఇచ్చిన నోటిఫికేషన్లో వయోపరిమితి సడలించారు. ఇప్పుడు కూడా ప్రభుత్వం వయోపరిమితి సడలింపు ఇస్తుందా? లేదా? అన్నది తేలాల్సి ఉంది. దీనిపై పోలీస్ శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత పోలీస్ శాఖ 2015లో చేపట్టిన నియామకాల్లో గందరగోళం ఏర్పడింది. దీనితో కొంత మంది అభ్యర్థులు హైకోర్టు వెళ్లి ఉద్యోగాలు సాధించారు. అయితే ఈ సారి ఎలాంటి చిక్కులు రాకుండా పక్కా ప్రణాళికతో నియామక ప్రక్రియను పూర్తిచేసేందుకు ఉన్నతాధికారులు చర్యలు చేపట్టనున్నట్టు తెలిసింది. -
రాష్ట్ర ఇంటెలిజెన్స్‌కు రాజ్‌నాథ్ అభినందనలు
సాక్షి, హైదరాబాద్: ఉత్తరప్రదేశ్ లక్నోలో జరిగిన ఐసిస్ టెర్రరిస్ట్ సైఫుల్లా ఎన్కౌంటర్లో రాష్ట్ర ఇంటెలిజెన్స్ పోలీస్ కీలక పాత్ర పోషించింది. రెండు నెలల నుంచి ఐసిస్ కూర్సన్ మాడ్యుల్‌ని రాష్ట్ర కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్ పోలీసులు ట్రాక్ చేస్తున్నారు. లక్నో–భూపాల్ ఉజ్జయిని ప్యాసింజర్ రైలులో పేలుడు అనంతరం కూర్సన్ మాడ్యుల్ ఉగ్రవాదులు బస్ ఎక్కి పారిపోయినట్లు కౌంటర్ సెల్ పోలీసులు గుర్తించారు. ఉత్తరప్రదేశ్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్)కు ఈ సమాచారాన్ని రాష్ట్ర ఇంటెలిజెన్స్ ఇవ్వడంతో వారు ఆపరేషన్ కూర్సన్ ప్రారంభించారు. ఈ ఆపరేషన్‌లో ఉగ్రవాది సైఫుల్లా మృతి చెందగా.. మిగతా ఇద్దరు ఫైజాన్, ఇమ్రాన్‌ను ఏటీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కీలక సమాచారం ఇచ్చి భారీ ఉగ్రముప్పు నుంచి కాపాడిన రాష్ట్ర పోలీస్ శాఖను కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ బుధవారం అభినందించారు. ఈ మేరకు డీజీపీ అనురాగ్ శర్మకు కేంద్ర హోంశాఖ మంత్రి ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. -
దరఖాస్తుల్లో తప్పులుంటే సవాలు చేయొచ్చు
కానిస్టేబుల్ అభ్యర్థులకు టీఎస్ఎల్పీఆర్బీ అవకాశం సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పోలీసు శాఖలో వివిధ పోస్టుల భర్తీకి నిర్వహించిన తుది రాత పరీక్షలో కనీస అర్హత సాధించిన అభ్యర్థులు తమ దరఖాస్తుల్లో ఏమైనా లోపా లుంటే సవాలు చేయవచ్చని తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు (టీఎస్ఎల్పీఆర్బీ) చైర్మన్ పూర్ణ చందర్రావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. కానిస్టేబుల్ (సివిల్/ఏఆర్/ఎస్ఏఆర్/ టీఎస్ఎస్పీ) పోస్టులతోపాటు ఎస్పీఎఫ్లో కానిస్టేబుల్, అగ్నిమాపక శాఖలో ఫైర్‌మన్ అభ్య ర్థులు దాఖలు చేసిన దరఖాస్తుల వివరాలు, దేహదారుఢ్య పరీక్ష (పీఈటీ) సమా చారాన్ని సంస్థ వెబ్సైట్ (www. tslprb.in)లో అందుబాటులో ఉంచామన్నారు. అభ్యర్థులు తమ ఆన్లైన్ దరఖాస్తులను డౌన్లోడ్ చేసుకొని అందులో వివరాలను సరిచూసు కోవాలన్నారు. ఈ నెల 28న ఉదయం 10 గంటల నుంచి 30న అర్ధరాత్రి వరకు వెబ్‌సైట్‌లోని ‘చాలెంజింగ్ అప్లికేషన్ ఫాం’లో మార్పులకు సంబంధించిన సమాచారాన్ని భర్తీ చేయాలని కోరారు. అప్లికేషన్ ఫాంను భర్తీ చేసేందుకు ఓసీ, బీసీ అభ్యర్థులు రూ.1,000, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.500లను డెబిట్, క్రెడిట్ కార్డు ద్వారా చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఒక వేళ అభ్యర్థుల సవాలు నిజమని తేలితే ఈ డబ్బును తిరిగి ఇచ్చేస్తామన్నారు. -
‘కానిస్టేబుల్’కు అర్హుల జాబితా విడుదల
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పోలీసు శాఖలో కానిస్టేబుల్ (సివిల్/ఏఆర్/ఎస్ఏఆర్/టీఎస్ఎస్పీ)పోస్టులతో పాటు ఎస్పీఎఫ్లో కానిస్టేబుల్, అగ్నిమాపక శాఖలో ఫైర్‌మెన్ పోస్టుల భర్తీకి నిర్వహించిన తుది రాత పరీక్షలో కనీస అర్హత మార్కులు సాధించిన అభ్యర్థుల ఆన్లైన్ దరఖాస్తులు, దేహ దారుఢ్య పరీక్ష వివరాలను విడుదల చేశారు. తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ పూర్ణచందర్ రావు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. www.tslprb.in నుంచి అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తులను డౌన్లోడ్ చేసుకొని, వివరాలను సరిచూసుకోవాలన్నా రు. దరఖాస్తు సమాచారంలో వ్యత్యాసాలుంటే 040-23150362/ 23150462 లలో లేదా support@tslprb.in కు మెరుుల్ ద్వారా సంప్రదించాలన్నారు. -
దేశ రక్షణలో పోలీస్ కీలకం: గవర్నర్
- ‘అమరుల సంస్మరణ’ పరుగు ప్రారంభించిన నరసింహన్ హైదరాబాద్: దేశరక్షణలో పోలీసుల పాత్ర ఎంతో కీలకమైందని, ఫ్రెండ్లీ పోలీస్తో ప్రజలకు మరింత చేరువయ్యారని గవర్నర్ నరసింహన్ పేర్కొన్నారు. ఆదివారం ఇక్కడి నెక్లెస్ రోడ్డు పీపుల్స్ ప్లాజాలో భారతీయ పోలీసు అమర వీరుల తొలి సంస్మరణ పరుగును ఆయన ప్రారంభించారు. గవర్నర్ మాట్లాడు తూ దేశరక్షణ కోసం ప్రాణాలర్పించిన పోలీసు అమరుల సేవలు మరువలేనివన్నారు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా వారి త్యాగాలను గుర్తు చేసుకోవాలన్నారు. పీపుల్స్ ప్లాజా నుంచి ట్యాంక్‌బండ్ మీదుగా 10కె, 5కె, 2కె రన్లను నిర్వహించారు. వీటిలో పోలీసు అధికారులు, సిబ్బంది, విద్యార్థులు, ఔత్సాహికులు పాల్గొన్నారు. రన్లో పాల్గొన్న వారందరికీ పోలీసు శాఖ తరఫున ప్రోత్సాహక పతకాలను అందజేశారు. రన్లో 5వేల మందికి పైగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో డీజీపీ అనురాగ్‌శర్మ, జాతీయ పోలీస్ అకాడమీ డీజీ అరుణా బహుగుణ, జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి, హైదరాబాద్ సీపీ మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి సహా పలువురు ఐపీఎస్ అధికారులు, ఏసీపీలు పాల్గొన్నారు. రెండోరోజు ఆకట్టుకున్న ఎక్స్పో... రాష్ట్ర పోలీసు శాఖ ఆధ్వర్యంలో పీపుల్స్ ప్లాజాలో రెండోరోజు ఏర్పాటుచేసిన పోలీస్ ఎక్స్పో ఎంతగానో ఆకట్టుకుంది. రన్లో పాల్గొన్న వారంతా ఎక్స్పోను సందర్శించి వివిధ స్టాళ్లల్లో ఏర్పాటుచేసిన ఆయుధాలతో పాటు ఫొటోలను తిలకించారు. -
కార్యరూపం దాల్చని జీపీఎస్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పోలీసుశాఖకు కోట్లాది రూపాయలు ఖర్చు చేసి నూతన వాహనాలను కొనుగోలు చేసినా లక్ష్యం నెరవేరడం లేదు. కొత్త పుంతలు తొక్కుతున్న నేరస్తులను ఆటపట్టించేందుకు నూతన సాంకేతికతను వినియోగించాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. తెలంగాణ రాష్ర్టం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కె.చంద్రశేఖర్‌రావు మొదటగా పోలీసుశాఖపైనే దృష్టి సారించారు. సింగపూర్ తరహాలో పోలీసుశాఖను బలోపేతం చేసి తద్వారా శాంతిభద్రతలను అదుపుచేయాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది. అందుకు అనుగుణంగా అన్ని పోలీసుస్టేషన్లకు కొత్త వాహనాలు అందించాలని ప్రణాళికలు రూపొందించింది. దీని కోసం 340 కోట్ల రూపాయలు వెచ్చించి 15 వందల ఇన్నోవాలు, సుమోలు, అదేస్థాయిలో ద్విచక్ర వాహనాలు కొనుగోలు చేసింది. అయితే, వాహనాలు కొనుగోలు చేసి ఏడాది గడచినా వాటిల్లో ఉపయోగించాల్సిన గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ (జీపీఎస్) టెక్నాలజీని ఇప్పటి వరకు పొందుపరచలేదు. జీపీఎస్ కోసం ప్రయత్నించిన ప్రతీసారి అడుగడుగునా అవాంతరాలు ఎదురవుతున్నాయి. తాజాగా అన్ని రాష్ట్రాలను కలుపుతూ నిర్భయ నిధులతో ఒక వ్యవస్థను రూపొందిస్తామంటూ కేంద్రం ప్రకటిం చింది. దీంతో జీపీఎస్ టెండర్ల ప్రక్రియ మళ్లీ మొదటికి వచ్చింది. జీపీఎస్ ఉంటే.. ఎక్కడ ఎలాంటి ఆపద వచ్చినా బాధితులు ‘డయల్ 100’కు కాల్ చేసిన వెంటనే కంట్రోల్ రూం ద్వారా దగ్గర్లోని పెట్రోలింగ్ వాహనానికి కాల్ కనెక్టు అవుతోంది. పెట్రోలింగ్ సిబ్బంది వెంటనే స్పందించేలా రూపకల్పన చేశారు. వాహనంలో ల్యాప్‌టాప్, సీసీ కెమెరాల్లో రికార్డు అయిన దృశ్యాలను చూసేందుకు సదుపాయం కల్పించారు. సంఘటనాస్థలంలో లభించే వేలిముద్రలు తదితర ఆధారాలను వెంటనే జీపీఎస్ ద్వారా కంట్రోల్‌రూం సహాయంతో పరిశీలించవచ్చు. జీపీఎస్ లేకపోవడంతో ఏడాది కింద కొనుగోలు చేసిన వాహనాలకు స్టిక్కర్లు వేసి, కూతలు పెట్టిస్తూ తిప్పుతున్నారు. నిర్వహణ బాధ్యతపై సందిగ్ధత! జీపీఎస్ టెక్నాలజీ కొనుగోలు చేసినా నిర్వహణ బాధ్యత ఎవరు చూడాలన్న ప్రశ్న పోలీసు ఉన్నతాధికారులను పట్టి పీడిస్తోంది. టెక్నాలజీ సమకూర్చినవారికే అవుట్సోర్సింగ్ పద్ధతిలో నిర్వహణ బాధ్యతలు అప్పగించాలని మొదట్లో భావించినా, అలాంటి విధానం వల్ల ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. శాంతిభద్రతల విషయంలో బయటి వ్యక్తులకు అవకాశం ఇస్తే సమాచారం బయటకు పొక్కే ప్రమాదముందని భావిస్తున్నారు. పోలీసుశాఖలోని టె క్నికల్ సర్వీసును పర్యవేక్షించే విభాగానికి బాధ్యతలు అప్పగించాలనుకున్నా అది సాధ్యపడేలా లేదు. ఈ వ్యవస్థను నిర్వహించాలంటే పెద్దసంఖ్యలో సిబ్బంది అవసరమవుతారు. టెక్నికల్ సర్వీసు విభాగం వద్ద సరిపడా సిబ్బంది లేకపోవడంతో ఉన్నతాధికారులు ఎటూ తేల్చలేకపోతున్నారు. -
సెల్‌ఫోన్‌తో కాల్ చేస్తే చాలు!
ప్రత్యేక యాప్ రూపకల్పనకు పోలీసు విభాగం నిర్ణయం సాక్షి, హైదరాబాద్: ఆపదలో ఉన్న మహిళలు పోలీసులకు సంబంధించిన నంబర్లకు ఫోన్ చేయడం, వారి ఇబ్బందిని వివరించడం, చిరునామాలు చెప్పడం అన్ని వేళల్లోనూ సాధ్యం కాకపోవచ్చు. వారికి ఆ వెసులుబాటు లభించే , కంగారు, టెన్షన్లో బాధితులకు ఆ ఆలోచన వచ్చే అవకాశాలు తక్కువ. దీన్ని దృష్టిలో పెట్టుకున్న రాష్ట్ర పోలీసు విభాగం, కాల్ చేస్తే చాలు.. దాన్నే ఫిర్యాదుగా పరిగణించడంతో పాటు ఇతర వివరాలు తెలియజేసేలా సెల్ఫోన్లలో ఇన్స్టాల్ చేసుకునే ప్రత్యేక యాప్‌ను రూపొందించాలని నిర్ణయించింది. వివిధ సాఫ్ట్వేర్ సంస్థలతో ఈ మేరకు సంప్రదింపులు జరుపుతోంది. మహిళలు తమ సెల్ఫోన్లలోకి డౌన్లోడ్ చేసుకునేందుకు వీలుగా ఈ యూప్ ఉంటుంది. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇది నిత్యం కంట్రోల్ రూమ్‌లోని కంప్యూటర్లలో ఉండే సాఫ్ట్‌వేర్‌తో అనుసంధానమై ఉంటుంది. ఆపదలో ఉన్న సమయంలో తమ సెల్ఫోన్లలో ఈ యూప్ కలిగిన మహిళలు.. పోలీసులు కేటాయించిన ప్రత్యేక సింగిల్ డిజిట్ నంబరుకు ఒకసారి డయల్ చేయగలిగితే చాలు. అది నేరుగా కంట్రోల్ రూమ్‌కు కనెక్ట్ అవుతుంది. దుండగులు బాధితురాలి చేతిలో ఫోన్ లాక్కుని కాల్ కట్ చేయాలని, ఫోన్ స్విచాఫ్ చేయాలని ప్రయత్నించినా సాధ్యం కాదు. బాధితురాలు ఫోన్లో ఎలాంటి వివరాలూ చెప్పలేకపోయినా... ఆమెతో పాటు దుండగుల మాటలు, పరిసరాలకు సంబంధించిన ప్రతి శబ్దాన్నీ కంట్రోల్ రూమ్‌లోని సిబ్బంది వినగలుగుతారు. గ్లోబల్ పొజిషనింగ్ సిస్టం (జీపీఎస్) ద్వారా బాధితురాలు ఉన్న ప్రాంతాన్ని తక్షణమే గుర్తించి సమీపంలో ఉన్న పోలీసుస్టేషన్, గస్తీ సిబ్బందిని అప్రమత్తం చేసి అక్కడకు పంపిస్తారు. కంట్రోల్ రూమ్‌లోని సిబ్బంది కట్ చేస్తే మాత్రమే ఆ కాల్ కట్ అవుతుంది. అలా కట్ అరుున తర్వాత మాత్రమే సదరు ఫోన్‌ను ఎవరైనా స్విచ్ఛాఫ్ చేయగలుగుతారు. ఇప్పటికే మూడు సంస్థలు ఈ తరహాలో రూపొందించిన సాఫ్ట్వేర్, యాప్స్‌ను డీజీపీ జేవీ రాముడికి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారుు. అయితే ఈ యూప్‌లు కేవలం నగరాలు, పట్టణాల్లో అత్యాధునిక సెల్ఫోన్లు కలిగిన వారికి మాత్రమే ఉపయుక్తంగా ఉంటారుు. గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి సెల్ఫోన్లు ఉపయోగించే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని భావిస్తున్న పోలీసులు.. అందరికీ అందుబాటులో ఉండే, మరింత సరళీకృత టెక్నాలజీ కోసం అన్వేషిస్తున్నారు. మరోపక్క హఠాత్తుగా, ఊహించని విధంగా ఆపదలు ఎదుర్కొనే అవకాశం గ్రామీణ ప్రాంత మహిళలకు తక్కువగా ఉంటుందని భావిస్తున్న ఉన్నతాధికారులు పై తరహా యాప్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని వారి కోసం ‘100’, ‘1091’ ‘199’ తరహా నంబర్లు ఉపకరిస్తాయని వారంటున్నారు. రాష్ట్ర రాజధాని గుర్తింపు, అక్కడ పోలీసు హెడ్-క్వార్టర్స్ నిర్మాణానికి స్థలం కేటాయింపు జరిగేలోపు ఈ యాప్‌పై తుది నిర్ణయం తీసుకోనున్నారు. -
హోంగార్డులకు ఊరట!
* సిబ్బంది తగ్గింపు ప్రక్రియకు బ్రేక్ * విభజన తర్వాత ఇరు రాష్ట్ర ప్రభుత్వాలదే తుది నిర్ణయం సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపథ్యంలో హోంగార్డులకు కాస్త ఊరట లభించింది. వీరి సంఖ్యను తగ్గించాలన్న నిర్ణయానికి తాత్కాలికంగా బ్రేక్ పడింది. దీనిపై కొత్తగా ఏర్పడే ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలే నిర్ణయం తీసుకుంటాయని అధికారులు స్పష్టం చేశారు. అప్పటి వరకు ఎలాంటి చర్యలు ఉండవని చెబుతున్నారు. రాష్ట్ర పోలీసు విభాగంలోని వివిధ శాఖల్లో ప్రస్తుతం దాదాపు 27 వేల మంది హోంగార్డులుగా పని చేస్తున్నారు. మరికొందరు డెప్యూటేషన్‌పై ఇతర విభాగాల్లో ఉన్నారు. అరకొర జీతంతో ఇబ్బందులు పడుతున్న ఈ చిరుద్యోగులు సుదీర్ఘకాలం పొరాడి వేతన పెంపును సాధించుకున్నారు. ఈ మేరకు జనవరిలో ఉత్తర్వులు జారీ అయ్యాయి. అయితే ఈ సందర్భంగా సర్కారు పెట్టిన మెలిక హోంగార్డులను కలవరపెడుతోంది. వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి వీరి సంఖ్యను 20 వేలకు కుదించాలని అందులో నిర్దేశించింది. దీనిపై అప్పట్లోనే విస్తృత స్థాయిలో సమీక్షలు నిర్వహించిన పోలీసు ఉన్నతాధికారులు.. సంఖ్యను కుదించడం ఆచరణ సాధ్యంకాదనే అభిప్రాయం వ్యక్తం చేశారు. వేతనం విషయంలో కానిస్టేబుళ్ల కంటే చాలా తక్కువ తీసుకుంటున్నా.. వారితో సమానంగా విధులు నిర్వర్తిస్తున్న హోంగార్డులను తగ్గిస్తే సమస్యలు రావచ్చని, తీవ్రస్థాయిలో వ్యతిరేకత కూడా వస్తుందని గట్టిగా వాదించారు. దీనిపై పునరాలోచించాలని ప్రభుత్వాన్ని కోరాలని, సానుకూల స్పందన రాకుంటే అవసరమైన కార్యాచరణ రూపొందించాలని అధికారులు నిర్ణయించారు. అయితే ఇప్పుడు విభజన ప్రక్రియ పూర్తికావస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం వాయిదా పడినట్లేనని డీజీపీ కార్యాలయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. రాష్ట్ర విభజన అనంతరం రెండు రాష్ట్రాల హోంశాఖలే దీనిపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని చెబుతున్నాయి. మరోపక్క ఉద్యోగుల విభజనకు సంబంధించి జిల్లాల్లో పని చేస్తున్న హోంగార్డుల విషయంలో ఎలాంటి సమస్య లేదు. డీజీపీ, సీఐడీ వంటి ప్రధాన కార్యాలయాల్లో పని చేస్తున్న ఇతర ప్రాంతాల వారిని మాత్రం బదిలీ చేయాల్సి ఉంటుందని తొలుత భావించారు. అయితే రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలో నిర్దేశించిన దాని ప్రకారం కింది స్థాయి ఉద్యోగుల కొనసాగింపుపై నిర్ణయం తీసుకునే అధికారం ఆయా విభాగాల అధిపతులకు ఉంటుంది. దీంతో సిబ్బంది విభజనతో ఏర్పడే కొరతను దృష్టిలో పెట్టుకుని హోంగార్డులను యథాస్థానాల్లో కొనసాగించే అవకాశాలు ఉన్నాయని అధికారులు అంటున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో హోంగార్డుల తొలగింపు ప్రక్రియ ఆచరణ సాధ్యం కాదని అభిప్రాయపడుతున్నారు. -
‘డీఎస్పీ సీనియారిటీ’ జాబితా వెబ్సైట్లో
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పోలీసు శాఖలోని సివిల్ విభాగంలో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్(డీఎస్పీ) పదోన్నతులకు సంబంధించిన సీనియారిటీ జాబితాను అధికారిక వెబ్సైట్ (www.apstatepolice.org)లో ఉంచినట్లు డీజీపీ కార్యాలయం బుధవారం తెలిపింది. దీనిపై ఎవరికైనా అభ్యంతరాలుంటే శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల లోపు శాంతి భద్రతల విభాగం అదనపు డీజీకి(adg_lo@co.appolice.gov.in) ఈ-మెయిల్ ద్వారా తెలపాలని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. మరోపక్క వెయిటింగ్లో ఉన్న సాయుధ రిజర్వ్ విభాగం డీఎస్పీ ఎం. మహేష్‌కుమార్‌కు ఆక్టోపస్‌లో పోస్టింగ్ ఇస్తూ డీజీపీ ఉత్తర్వులు జారీ చేశారు. -
లక్ష జనాభాకు 96 మంది పోలీసులే
ఉండాల్సింది కనిష్టంగా 125 మంది కేటాయించిన పోస్టుల్లో 30 వేలకు పైగా ఖాళీనే.. మహిళా ఫోర్స్ విషయంలో మరీ ఘోరం విభజన లెక్కల నేపథ్యంలో వెలుగులోకి మనకన్నా కర్ణాటక, తమిళనాడులే మిన్న సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పునర్వ్యవస్థీకరణలో భాగంగా పోలీసు విభాగం పంపకాల కోసం తీస్తున్న లెక్కలు ఆందోళనకర అంశాలను వెలుగులోకి తెస్తున్నారు. కేటాయింపుల ప్రకారం రాష్ట్రంలో ప్రతి లక్ష జనాభాకు కనిష్టంగా 125 మంది సివిల్ పోలీసులు ఉండాలి. అయితే ప్రస్తుతం అందుబాటులో ఉన్న దాని ప్రకారం కేవలం 96 మందే ఉన్నారు. రాష్ట్ర పోలీసులోని అన్ని విభాగాలకు కలిపి కేటాయించిన పోస్టుల సంఖ్య 1,29,225 కాగా, అందుబాటులో ఉన్నది మాత్రం 96,978 మాత్రమే. మహిళా పోలీసుల అంశంలో పొరుగు రాష్ట్రాల కంటే చాలా వెనుకబడి ఉన్నాం. ఈ పరిస్థితి ఇలానే కొనసాగితే భవిష్యత్తులో ఊహించని పరిణామలు ఎదుర్కొవాల్సి వస్తుందని పోలీస అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. 665 మందికి కచ్చితంగా ఒకరుండాలి... నిబంధనలు, నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం ప్రతి 665 మంది జనాభాకు ఒక పోలీసు ఉండాలి. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో మాత్రం ప్రతి 886 మందికీ ఒకరు మాత్రమే ఉంటున్నారు. ఫలితంగా శాంతిభద్రతల నిర్వహణ, నేరాల నియంత్రణ కష్టసాధ్యంగా మారుతోంది. గడిచిన కొన్నేళ్లుగా పోలీసు విభాగంలో పదవీ విమరణలు చేస్తున్న స్థాయిలో ఎంపికలు జరగకపోవడంతో కేటాయించిన పోస్టుల్లోనూ అనేకం ఖాళీగా ఉంటున్నాయి. ఈ కారణంగానే అవసరమైన స్థాయిలో పోలీసులు అందుబాటులో లేరు. ఉన్నతాధికారులు, పర్యవేక్షణ అధికారుల కంటే క్షేత్రస్థాయిలో కీలక ఉద్యోగులైన కానిస్టేబుల్ పోస్టుల్లోనే కొరత తీవ్రంగా ఉంది. ఈ కొరత నేపథ్యంలో మార్గదర్శకాల ప్రకారం ఓ దర్యాప్తు అధికారి ఏడాదికి గరిష్టంగా 40 కేసుల్ని మాత్రమే దర్యాప్తు చేయాల్సి ఉండగా... ఇప్పుడు ఒక్కోక్కరూ 150కి పైగా కేసుల దర్యాప్తు చేస్తున్నారు. దీని ప్రభావం నాణ్యతపై పడి శిక్షలు పడే కేసుల సంఖ్య పడిపోతోంది. ఎస్ఐ స్థాయిలోనూ తీవ్ర కొరత పోలీసింగ్‌లో శాంతి భద్రతల పరిరక్షణ, నిఘా, దర్యాప్తు తదితర అంశాలు ప్రాథమికమైనవి. ఈ విధులు నిర్వర్తించడంలో క్షేత్రస్థాయి దర్యాప్తు అధికారులైన, జిల్లాల్లో స్టేషన్ హౌస్ ఆఫీసర్లుగా వ్యవహరించే ఎస్ఐల పాత్ర చాలా కీలకం. అయితే రాష్ట్రవ్యాప్తంగా ఎస్ఐల లేమి తీవ్ర సమస్యగా మారింది. కొన్నేళ్ల కిందట కేటాయించిన సిబ్బందిలో దాదాపు 24 శాతం పోస్టులు ఖాళీగా ఉండిపోవడంతో మూడు షిప్టుల్లో (8 గంటల చొప్పున) పనిచేయాల్సిన సిబ్బంది రెండు షిఫ్టుల్లో (12 గంటల చొప్పున) పని చేస్తున్నారు. దీంతో పని భారం పెరిగి, పనిలో నాణ్యత కొరవడుతోంది. ఫలితంగా సిబ్బంది ఆరోగ్యం పైనా తీవ్ర ప్రభావం చూపుతోంది. కానిస్టేబుల్ స్థాయిలోనూ పరిస్థితులు ఇలానే ఉన్నాయి. స్వచ్ఛంద సేవగా పరిగణించే హోంగార్డులు, మాజీ సైనికాధికారుల్ని ఎంపిక చేసుకునే స్పెషల్ పోలీసు ఆఫీసర్లు (ఎస్పీఓ)లతోనే చాలా విభాగాల్లో పనులు చక్కబెడుతున్నారు. వీరిని కేవలం బందోబస్తు, భద్రతా విధులకు మాత్రమే వాడాల్సి ఉండటంతో అసలు సమస్య మాత్రం తీరట్లేదు. తీసికట్టుగా మహిళా సిబ్బంది... రాష్ట్ర జనాభాలో దాదాపు సగం మహిళలే ఉంటున్నారు. అయితే వీరికి రక్షణ, సహాయ సహకారాల కోసమంటే ఏర్పాటు చేసిన మహిళా ఠాణాలు, సిబ్బంది మాత్రం ఎందుకూ కొరగాని సంఖ్యలో ఉంటున్నారు. ఉద్యమాలతో పాటు నిరసన కార్యక్రమాల్లోనూ మహిళలు పెద్ద సంఖ్యలోనే పాల్గొంటున్నారు. వీరిని అదుపు చేయడంతో పాటు వివిధ నేరాల్లో అరెస్టు అయిన మహిళల్ని విచారించడానికి, ఓ ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలించడానికి, భద్రతా ఏర్పాట్లలో భాగంగా మహిళల్ని సోదాలు, తనిఖీలు చేయడానికీ కచ్చితంగా మహిళా పోలీసులు అవసరం. వీరు అవసరమైన స్థాయిలో లేకపోవడంతో అనేక సందర్భాల్లో అపశృతులు చోటు చేసుకున్నారు. పొరుగున ఉన్న తమిళనాడులో 196 మహిళా పోలీసుస్టేషన్లు ఉండగా... మన రాష్ట్రంలో ఆ సంఖ్య కేవలం 32కు పరిమితమైంది. అక్కడ ప్రత్యేకించి మహిళా బెటాలియన్, కమాండో ఫోర్స్ ఉండగా... ఇక్కడ ఈ అంశం కేవలం ప్రతిపాదనలు మాత్రమే పరిమితమైంది. ఖాళీలు నింపాలి, సంఖ్యను పెంచాలి అరకొర సంఖ్యలో ఉన్న సిబ్బందితో పని భారం మొత్తం ఉన్న వారిపైనే పడుతోంది. పగలురాత్రి డ్యూటీలు చేస్తుండటంతో పోలీసులు అనేక శారీరక రుగ్మతలు, మానసిక ఒత్తిడి బారినపడి తీవ్రమైన దుష్ఫభ్రావాలు చవిచూస్తున్నారు. దీని ప్రభావం కుటుంబంపైన కూడా ఉంటోంది. ప్రతి 500 జనాభా ఒక పోలీసు ఉండాలన్నది పోలీసు సంస్కరణలు చెప్పే అంశాల్లో కీలకమైంది. ఏ స్థాయిలోనూ ఇది అమలు కావట్లేదు. కొన్ని పోలీసుస్టేషన్లలో వీఐపీ బందోబస్తు, ఇతర డ్యూటీలపై సిబ్బంది వెళ్లిపోగా.. ఆ ప్రాంతంలో జరగరానిది జరిగితే కనీసం నలుగురు కూడా అందుబాటులో ఉండని పరిస్థితి. ఇవి మారాలంటే తక్షణం ఖాళీలు నింపాలి. పోలీసు సిబ్బంది సంఖ్యనూ మరో లక్ష పెంచాలి. దర్యాప్తు, బందోబస్తు విభాగాలను వేరు చేయాలి. - గోపిరెడ్డి, పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు -
ఎన్నికలపై నక్సల్స్ కన్ను : డీజీపీ పసాదరావు
యాక్షన్ టీమ్స్ విరుచుకుపడే అవకాశం ఈ కోణానికీ బందోబస్తులో ప్రాధాన్యం గస్తీ, తనిఖీలు ముమ్మరం సాక్షి, హైదరాబాద్: ‘నిత్యం ఎన్నికల బహిష్కరణకు పిలుపునిచ్చే మావోయిస్టులు ఆ ప్రక్రియను భగ్నం చేసేందుకు ప్రయత్నిస్తారు. సరిహద్దు రాష్ట్రాలైన ఛత్తీస్‌గఢ్. ఒడిశాల్లో కేంద్రీకృతమైన క్యాడర్ నేరుగా చొచ్చుకు రాకపోయినా... ఇద్దరు, ముగ్గురితో కూడిన యాక్షన్ టీమ్‌లు రెక్కీలు నిర్వహించి మెరుపుదాడులు చేసే ప్రమాదం ఉంది’ అని రాష్ట్ర డీజీపీ ప్రసాదరావు అన్నారు. ఈ పరిణామాలను దృష్టిలో పెట్టుకునే బందోబస్తు, భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన చెప్పారు. సార్వత్రిక, మున్సిపల్, పంచాయతీరాజ్ ఎన్నికలు ఒకేసారి రావడంతో రాష్ట్ర పోలీసు శాఖ తీసుకుంటున్న చర్యలను మంగళవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీజీపీ వివరించారు. గతంలో జరిగిన ఎన్నికలకు సంబంధించి నమోదైన కేసుల్ని కొలిక్కి తెస్తున్నామని. అభియోగపత్రాల దాఖలుతో పాటు పెండింగ్‌లో ఉన్న 16 నాన్-బెయిలబుల్ వారెంట్లను ఎగ్జిక్యూట్ చేస్తున్నామని తెలిపారు. ఎన్నికల ప్రచార కార్యక్రమాలు నిర్వహించే పార్టీలు, అభ్యర్థులు కచ్చితంగా ముందస్తు అనుమతి తీసుకోవాలన్నారు. ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, తూర్పు గోదావరి, విశాఖపట్నం రూరల్, శ్రీకాకుళంలో మావోయిస్టుల ప్రభావం ఉందన్నారు. విశాఖ, ఖమ్మం జిల్లాల్లో మారుమూల ప్రాంతాలకు ఎన్నికల సామగ్రి, సిబ్బందిని తరలించడానికి హెలి కాప్టర్లను వినియోగిస్తామని తెలిపారు. ఎన్నికల ప్రచారానికి వచ్చే వీఐపీలకు ఉన్న ముప్పును బట్టి భద్రతను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. ఘర్షణల నిరోధంపై ప్రత్యేక దృష్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో అల్లర్లు, ఘర్షణలకు అవకాశం ఉండటంతో వాటి నిరోధంపై ప్రధానంగా దృష్టి పెట్టామన్నారు. పరోక్షంగా జరిగే మండల, జిల్లా పరిషత్ అధ్యక్షుల ఎంపికప్పుడు కిడ్నాపింగ్‌లకు ఆస్కారం ఉండడంతో వాటిని అరికట్టడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే ఫ్యాక్షన్ ప్రభావిత ప్రాంతాల్లో అసాంఘిక శక్తులపై ప్రత్యేకంగా దృష్టి సారించామన్నారు. ఏ పార్టీకైనా అన్ని ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం చేసే స్వేచ్ఛ ఉంటుందని, ఫలానా వ్యక్తిని ఫలానా ప్రాంతానికి రావద్దని చెప్పే అధికారం ఎవరికీ లేదని అన్నారు. సాధారణ ఎన్నికలకు సంబంధించి రాష్ట్రంలోని 26,135 పోలింగ్ స్టేషన్లను సమస్యాత్మకంగా పరిగణిస్తున్నట్టు ఆయన తెలిపారు. ఇప్పటి వరకు 1,038 చెక్‌పోస్టులు, 942 ఫ్లైయింగ్ స్వ్కాడ్స్ ఏర్పాటయ్యాయని, ఇవి రానున్న రోజుల్లో పెరుగుతాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 7,085 మందిని బైండోవర్ చేయడంతో పాటు 3,576 లెసైన్డ్స్ ఆయుధాలను డిపాజిట్ చేయించినట్టు వెల్లడించారు. -
పోలీసు విభజనపై కసరత్తు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పోలీసు శాఖను రెండుగా విభజించే ప్రక్రియపై పోలీసు ఉన్నతాధికారులు కసరత్తు ప్రారంభించారు. దీనికి సంబంధించి డీజీపీ బి.ప్రసాదరావు శుక్రవారం హెడ్‌క్వార్టర్స్‌లో సీనియర్ ఐపీఎస్ అధికారులతో చర్చించారు. ప్రధానంగా ఏయే విభాగాల్లో విభజన ఇబ్బందులు ఎదురవుతాయనే అంశంపైనే దృష్టి సారించారు. ముఖ్యంగా రాష్ట్ర స్థాయికేడర్ అయిన డీఎస్పీ నుంచి ఎస్పీ, ఆపై అధికారులను రెండు రాష్ట్రాలకు విభజించడంలోనే కొన్ని సమస్యలు ఎదురవుతున్నట్లు తెలిసింది. ఇందులో ఏ ప్రాంతానికి చెందినవారిని ఆ ప్రాంతానికి కేటాయిం చే అవకాశం ఉన్నప్పటికీ, ఎక్కువమంది అధికారులు ఒక ప్రాం తంవైపే మొగ్గు చూపితే సమస్య మొదలవుతుందని సీనియర్ అధికారులు భావిస్తున్నారు. రాష్ట్రానికి చెందిన ఐపీఎస్ అధికారులు ఏ ప్రాంతానికి చెందినవారో గుర్తించి అక్కడే పోస్టింగ్‌లు ఇచ్చే అవకాశం ఉందని తెలిసింది. రాష్ట్ర కేడర్‌లోని ఇతర రాష్ట్రాలకు చెందిన ఐపీఎస్ అధికారులకు వారి ఆప్షన్‌ను బట్టి కేటాయింపులు జరిగే అవకాశం ఉందని ఐపీఎస్ వర్గాలు తెలిపాయి.