![Collective activity on human trafficking control - Sakshi](/styles/webp/s3/article_images/2018/10/28/ANTI-HUMAN-TRAFFICKING.jpg.webp?itok=SwpwBGkP)
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మానవ అక్రమ రవాణా నియంత్రణకు చేపట్టాల్సిన కార్యాచరణపై రాష్ట్ర పోలీస్ శాఖ–కేంద్ర హోంశాఖ సంయుక్తంగా రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహించింది. శనివారం హైదరాబాద్ మాసబ్‌ట్యాంక్‌లోని పోలీస్ అధికారుల మెస్‌లో జరిగిన రాష్ట్ర స్థాయి యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ సదస్సును డీజీపీ మహేందర్‌రెడ్డి, రిటైర్డ్ డీజీపీ పీఎం నాయర్ కలిసి ప్రారంభించారు. ఈ సదస్సులో రాష్ట్రంలోని అన్ని జిల్లాలు, కమిషనరేట్లలో పనిచేస్తున్న ఇన్‌స్పెక్టర్లు, డీఎస్పీలు, అదనపు ఎస్పీలు మొత్తం 100మంది వరకు పాల్గొన్నారు.
మానవ అక్రమ రవాణా నియంత్రణకు చేపట్టాల్సిన కార్యక్రమాలపై గ్రూప్ డిస్కషన్, పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌పై సుదీర్ఘంగా శిక్షణ ఇచ్చారు. అక్రమ రవాణా కేసుల నమోదు, వాటి దర్యాప్తులో చేపట్టాల్సిన అంశాలపై మహేందర్‌రెడ్డి, పీఎం నాయర్ అధికారులకు అవగాహన కల్పించారు. చట్టపరంగా సమన్వయం చేసుకోవాల్సిన విభాగాలు, వాటి ద్వారా చేపట్టాల్సిన చర్యలపై ప్రధానంగా శిక్షణ కొనసాగింది.
అక్రమ రవాణా కూపాల నుంచి బయటపడ్డ బాధితులకు అందాల్సిన పరిహారం, స్వచ్ఛంద సంస్థల సహకారంపై వేగవంతంగా స్పందించాలని సూచించారు. యూనిసెఫ్ నుంచి వచ్చిన ప్రతినిధులు మానవ అక్రమ రవాణా నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలు, అందుకు తగిన సహకారంపై ప్రజెంటేషన్ అందించారు. ప్రజ్వల, మై చాయిస్, దివ్యదిశ, తరుణి, బచ్‌పన్ బచావ్, సంకల్ప్ తదితర స్వచ్ఛంద సంస్థలతో ఈ కార్యక్రమంలో కలిసి చేపట్టాల్సిన అంశాలపై అవగాహన కల్పించారు.
న్యాయపరంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దానిపై మెట్రోపాలిజన్ సెషన్స్ జడ్జి వెంకట కృష్ణయ్య అవగాహన కల్పించారు. హైదరాబాద్ కమిషనరేట్‌లో ఏర్పాటుచేసిన భరోసా లాంటి సెంటర్లను జిల్లాల్లోనూ వేగవంతంగా విస్తరించి చర్యలు చేపట్టాలని పోలీస్ ఉన్నతాధికారులకు, అధికారులకు సూచించారు. కార్యక్రమంలో రాచకొండ కమిషనర్ మహేశ్ భగవత్, మహిళ భద్రత విభాగం ఐజీ స్వాతిలక్రా, ఎస్పీ సుమతి, ప్రజ్వల ఎన్‌జీవో నిర్వాహకురాలు సునీతకృష్ణన్, మహిళ శిశుసంక్షేమ శాఖ అధికారులు, పలు స్వచ్చంద సంస్థల నిర్వహకులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment