ఆచూకీ
‘ఈ పిల్లల ఆచూకీ మీరు కనిపెట్టాలి’ అని పై అధికారి ఆదేశించారు. ‘అలాగే సార్’ అనడమే కాదు ‘ఎలాగైనా సరే’ అనుకున్నారు మనసులో. దిల్లీలోని యాంటీ–హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్‌లో పనిచేస్తున్న కానిస్టేబుల్స్ సీమా దేవి, సుమన్ హుడా ఒక్కరు కాదు... ఇద్దరు కాదు రకరకాల కారణాలతో కనిపించకుండా పోయిన 104 మంది పిల్లలను వారి తల్లిదండ్రులకు అప్పగించారు.
ఒకప్రాంతంలో...
‘అయ్యా... నా కొడుకు వారం రోజుల నుంచి కనిపించడం లేదు...’
‘ఫోటో ఉందా?
‘లేదయ్యా’
మరోప్రాంతంలో...
‘మా అమ్మాయి కనిపించడం లేదు సారూ... ఎక్కడెక్కడో వెదికాం...’
దిల్లీ, దిల్లీ చుట్టుపక్కలప్రాంతాలలో కనిపించకుండా పోయిన పిల్లల సంఖ్య 104 ఆ పేద తల్లిదండ్రులలో చాలామంది దగ్గర కనీసం తమ పిల్లల ఫొటోలు కూడా లేవు. కొందరు ‘మా పిల్లలు ఇలా ఉంటారు’ అని పోలికలు చెప్పేవారు.
కొందరి దగ్గర ఫొటోలు ఉన్నా అవి అవుట్‌డేటెడ్ ఫొటోలు.. ఇలాంటి ఎన్నో ప్రతికూల పరిస్థితుల్లో ‘ఆపరేషన్ మిలాప్’ తెర మీదికి వచ్చింది. ఈ ఆపరేషన్‌ను సీమా దేవి, సుమన్ హుడా సవాలుగా తీసుకున్నారు. దిల్లీలో పనిచేస్తున్న ఈ కానిస్టేబుల్స్ ఎలాగైనా సరే కనిపించకుండా పోయిన పిల్లలను తిరిగి తల్లిదండ్రులకు అప్పగించాలనుకున్నారు. అదెంత కష్టమో వారికి తెలియనిది కాదు. అయినా సరే, రంగంలోకి దిగారు. ప్రతి కేసును సవాలుగా తీసుకున్నారు. ఉత్తర్‌ప్రదేశ్, బిహార్, హరియాణాలో ఊరూ వాడా వెదికారు.
కొన్ని సందర్భాలలో బాధితులకు పోలీసులు మాట్లాడే భాష అర్థం కాకపోయేది. పిల్లలను చివరిసారిగా గుర్తించిన ప్రాంతాల్లోని స్థానికులు పోలీసులతో మాట్లాడేందుకు నిరాకరించేవారు. ఇలాంటి సవాళ్లు ఎన్నో ఎదురైనా వెనకడుగు వేయలేదు. సైబర్ టీమ్ సహాయం కూడా తీసుకున్నారు.
ఎట్టకేలకు వారి కష్టం ఫలించింది. తప్పిపోయిన 104 మంది పిల్లలను తొమ్మిది నెలల కాల వ్యవధిలో వారి తల్లిదండ్రులకు అప్పగించడంలో సీమాదేవి, సుమన్ హూడాలు విజయం సాధించారు.
ఈ పిల్లలు కనిపించకుండా పోవడానికి ఇంట్లో నుంచి పారిపోవడం నుంచి సోషల్ మీడియాలో పరిచయం అయిన వారి మాటలు నమ్మి వెళ్లిపోవడం వరకు ఎన్నో కారణాలు ఉన్నాయి. కొత్తప్రాంతాలకు ఇన్వెస్టిగేషన్ కోసం వెళ్లినప్పుడు స్థానికులు సీమాదేవి, సుమన్‌లను అనుమానంగా చూసేవాళ్లు. ‘మీరు నిజంగా పోలీసులేనా?’ అని అడిగేవారు. వారిలో నమ్మకం రావడానికి కాస్త టైమ్ పట్టేది. అయినా ఓపికగా ఎదురు చూసేవారు. స్థానికులలో నమ్మకం వచ్చాక... ఇంటింటికి వెళ్లి వెదికేవారు.
చెత్త ఏరే పిల్లల నుంచి మొదలు రైల్వేస్టేషన్‌లో పనిచేసే సిబ్బంది వరకు ఎంతోమంది నుంచి ఎన్నో రకాల క్లూలు సేకరించేవారు.
‘ఇంతమంది పిల్లలను వారి తల్లిదండ్రుల వద్దకు చేర్చినందుకు చాలా సంతోషంగా, గర్వంగా ఉంది. మాకు ఫిక్స్‌డ్ డ్యూటీ టైమింగ్స్ ఉండేవి కావు. తప్పిపోయిన పిల్లల గురించి ఏ చిన్న సమాచారం అందినా వెంటనే ఇంటి నుంచి బయలుదేరేవాళ్లం. కనిపించకుండా పోయిన పిల్లల్ని వెదకడంలో మా పిల్లల్ని చూసుకోవడం కుదిరేది కాదు. అయినా బాధ పడలేదు’ అంటుంది సీమాదేవి.
‘రవాణా సౌకర్యాలు లేకపోవడం వల్ల ఎన్నో కిలోమీటర్‌ల దూరం నడవాల్సి వచ్చేది. బాగా అలిసిపోయేవాళ్లం’ అంటుంది సుమన్ హుడా.
తొమ్మిది నెలల కాలంలో వారు ఇళ్లు విడిచి, కుటుంబాన్ని విడిచి ఎన్నో కష్టాలు పడ్డారు. అయితే... కృతజ్ఞతతో నిండిన పిల్లల తల్లిదండ్రుల కళ్ల నుంచి వచ్చిన ఆనంద బాష్పాలను చూసిన తరువాత ఆ కష్టాలేవీ ఇప్పుడు వారికి గుర్తుకు రావడం లేదు.
Comments
Please login to add a commentAdd a comment