సీమా.. తడాఖా.. సూపర్‌ కాప్ | Delhi Cop Seema Dhaka Rescues 76 Missing Children in 3 Months | Sakshi
Sakshi News home page

సీమా.. తడాఖా.. సూపర్‌ కాప్

Published Mon, Dec 14 2020 3:25 AM | Last Updated on Mon, Dec 14 2020 3:44 AM

Delhi Cop Seema Dhaka Rescues 76 Missing Children in 3 Months - Sakshi

ఏఎస్‌ఐగా ఉద్యోగోన్నతి పొందిన సీమ

ఆమె పేరు సీమా ఢాకా.. ఢిల్లీ పోలీసు డిపార్ట్‌మెంటులోనే  కాదు. ఇపుడు దేశవ్యాప్తంగా ఆమె ఓ సూపర్‌కాప్‌. ఢిల్లీలో తప్పిపోయిన చిన్నారులను ఒక్కరోజులో ఆచూకీ కనిపెట్టగల సత్తా ఆమె సొంతం. కేవలం మూడు నెలల కాలంలోనే ఏకంగా 76 మంది తప్పిపోయిన చిన్నారులను తిరిగి వారి తల్లిదండ్రుల వద్దకు చేర్చిన అరుదైన ఘనత ఆమె సొంతం. ప్రస్తుతం ఆమె పనిచేస్తోన్న సమయ్‌పూర్‌ బద్లీ పోలీస్‌స్టేషన్‌ సీమా ఢాకా పనితీరు వల్ల చాలా ప్రసిద్ధి చెందింది.

ఎంతగా అంటే.. ఢిల్లీలో ఎక్కడ పిల్లలు తప్పిపోయినా.. ఈమెనే దర్యాప్తు చేయమనేంతగా..! సివంగి వేటకు దిగితే.. ఏ జంతువైనా తలవంచాల్సిందే.. ఈ సీమా ఢాకా దర్యాప్తుకు దిగితే.. తన తడాఖా చూపిస్తుంది ఎలాంటి మిస్సింగ్‌ కేసైనా 24 గంటల్లో పరిష్కారం కావాల్సిందే. హెడ్‌ కాన్‌స్టేబుల్‌గా పని చేస్తూ ఇటీవలే ఏఎస్‌ఐగా పదోన్నతి అందుకున్న సీమా ఢాకా తన విధులు, వ్యక్తిగత జీవితంపై పలు విషయాలు ‘సాక్షి’తో ప్రత్యేకంగా పంచుకున్నారు.

► ఒక్కసారిగా దేశవ్యాప్తంగా సూపర్‌ కాప్‌ అని పిలిపించుకోవడం ఎలా ఉంది?
సీమ: చిన్నారుల జాడ కనిపెడితే కలిగే సంతృప్తి నాకెంతో ఇష్టం. ముఖ్యంగా ఆ పిల్లలను తిరిగి తల్లిదండ్రుల వద్దకు చేరిస్తే.. వారి కళ్లల్లో కనిపించే ఆనందం మాటల్లో వర్ణించలేనిది. నేనూ తల్లినే..! బిడ్డ కాసేపు కనబడకపోతే తల్లడిల్లిపోయే తల్లులు నా వద్దకు వస్తే.. నేను తట్టుకోలేను. వెంటనే రంగంలోకి దిగిపోతాను.

► మీ స్పీడ్‌ దర్యాప్తులోని సీక్రెట్‌ ఏంటి?
సీమ: నాకంటూ కొన్ని పద్ధతులు ఉన్నాయి. టెక్నాలజీ, ఇంటలిజెన్స్‌ను సమర్థంగా వాడతా. ఠాణాలో పిల్లలు తప్పిపోయారన్న ఫిర్యాదు అందిన వెంటనే స్పందిస్తా. అలాగైతే.. పిల్లలు సరిహద్దులు దాటకముందే పట్టుకోవచ్చు. జాప్యం చేసే కొద్దీ వారు దూరం వెళ్లిపోతారు.

► తప్పిపోయిన పిల్లల విషయం లో మిమ్మల్ని కదలించిన ఘటన ఏదైనా ఉందా?
ఉంది. 2016లో ఓ ముసలావిడ మా స్టేషన్‌కి వచ్చింది.. తన మనవరాలు తప్పిపోయిందని ఫిర్యాదు చేసింది. తన కొడుకు–కోడలు మరణించారని, మనవరాలు తప్ప ఈ లోకంలో తనకు ఎవరూ లేరని బోరుమంది. ఎంక్వైరీ చేస్తే నిజమే అని తెలిసింది. వాస్తవానికి హెడ్‌ కానిస్టేబుల్‌గా ఉన్న నాకు ఆ కేసు దర్యాప్తు చేసేందుకు అధికారాలు లేవు. కానీ, ఉన్నతాధికారుల వద్ద ప్రత్యేక అనుమతి తీసుకుని దర్యాప్తు మొదలుపెట్టాను.. 13 ఏళ్ల ఆ అమ్మాయిని పక్కింట్లో అద్దెకుండే ఓ యువకుడు మాయమాటలు చెప్పి బిహార్‌కు తీసుకెళ్లాడనే విషయాన్ని కనిపెట్టి, అక్కడ నుంచి బాలికను క్షేమంగా తీసుకొచ్చి నానమ్మకు అప్పగించా. అప్పుడు ఎంతో సంతోషం కలిగిందో చెప్పలేను.

► ఇంత తక్కువ సమయంలో 76 మంది పిల్లలను ఎలా గుర్తించగలిగారు?
ఇదంతా మా ఢిల్లీ పోలీస్‌ కమిషనర్‌ సార్‌ కల్పించిన అవకాశం. 14 ఏళ్లలోపు చిన్నారుల మిస్సింగ్‌ కేసులను ర్యాంకులతో సంబంధం లేకుండా ఎవరైనా కనిపెట్టవచ్చు అంటూ ఇచ్చిన ఆదేశాలను నేను సమర్థంగా వినియోగించుకున్నాను. వాస్తవానికి 12 నెలల్లో 50 మంది పిల్లల ఆచూకీ కనిపెట్టాలని డిపార్ట్‌మెంట్‌ నాకు టార్గెట్‌ ఇచ్చింది. కేవలం తొలి పదిరోజుల్లోనే 12 మంది పిల్లల ఆచూకీ కనిపెట్ట గలిగాను. దాంతో నామీద నాకు, డిపార్ట్‌మెంట్‌కు నమ్మకం పెరిగింది. కేవలం 70 రోజుల్లో ఆ సంఖ్య 76కి చేరుకుంది. మిస్సింగ్‌ కేసుల్లో ఠాణా పరిమితులు లేకపోవడంతో ఢిల్లీలో ఎక్కడ పిల్లలు తప్పిపోయినా.. నా వద్దకు వచ్చిన కేసులను దర్యాప్తు చేస్తున్నాను.

► పిల్లల కోసం ఏయే రాష్ట్రాలు వెదికారు? ఎలాంటి సవాళ్లు ఉండేవి?
ఢిల్లీలో తప్పిపోయిన పిల్లలు ఎక్కువగా ఢిల్లీ, పంజాబ్, ఉత్తర్‌ప్రదేశ్, పశ్చిమ బెంగాల్‌లో దొరికారు. కేసు వస్తే.. ఎన్ని సవాళ్లు ఎదురైనా లెక్కచేయను. పిల్లలను రెండు రోజుల్లో పట్టుకునేదాన్ని. తరువాత సీడబ్ల్యూసీ వాళ్ల ద్వారా తల్లిదండ్రులకు అప్పగించినపుడు ఆ కష్టం మొత్తం మర్చిపోతాను. వెంటనే ఒక చాయ్‌ తాగేసి, టేబుల్‌ మీద ఉన్న కొత్త కేసు ఫైల్‌ అందుకుంటా!

► పిల్లలు ఇంటి నుంచి పారిపోవడానికి ప్రధాన కారణాలేంటి?
పేదరికం. అవును, మీరు వింటున్నది నిజమే! ఢిల్లీకి బతుకుదెరువు కోసం వచ్చే పేదపిల్లలే ఎక్కువగా అదృశ్యమవుతుంటారు. కుటుంబ సమస్యలు, చెడుసావాసాలు, తల్లిదండ్రులు సమయం కేటాయించకపోవడం, ప్రేమపేరుతో మాయమాటల కారణంగా పిల్లలు ఇల్లు విడుస్తున్నారు. వీరుగాకుండా మానవ అక్రమ రవాణా ముఠాలు కిడ్నాప్‌ చేస్తుంటాయి.

► పిల్లలు తప్పిపోయిన  విషయంలో తప్పుడు ఫిర్యాదులేమైనా వస్తుంటాయా?
వస్తుంటాయి. అసలు కారణాలను వదిలేసి, పిల్లలు పారిపోయిన విషయాన్నే చెబుతుంటారు చాలామంది. పేదరికం, సహజీవనం, అక్రమ సంబంధాలు కలిగి ఉండటం... ఇలాంటి వాటికి మూలకారణం. దానివల్ల దర్యాప్తు ఆలస్యమవుతుంది. ఈ విషయంలో కారణాలేమైనా.. మేం పిల్లల్ని వెదికి పట్టుకుంటాం. తరువాత అందరికీ కౌన్సెలింగ్‌ చేసి పంపిస్తాం.

► కిడ్నాప్‌ కేసులు ఏమైనా మీ వద్దకు వచ్చాయా?
లాక్‌డౌన్‌లో ఒక విచిత్రమైన కేసు మావద్దకు వచ్చింది. ఓ వివాహితతో అక్రమ సంబంధం ఉన్న ఓ యువకుడు ఆమె తనను కలిసేందుకు రావడం లేదని ఆమె మూడేళ్ల కూతురుని కిడ్నాప్‌ చేశాడు. తల్లి మాకు అసలు విషయం చెప్పలేదు. మూడేళ్ల చిన్నారిని విడిపించాక, అసలు విషయం వెలుగు చూసింది. నిందితుడు జైలుకు వెళ్లడంతో తల్లీ పిల్లలకు విముక్తి కలిగింది.

► మీరు ఆచూకీ కనిపెట్టిన 76 మంది తల్లిదండ్రులను చేరుకున్నారా?
దేవుడి దయవల్ల అంతా తల్లిదండ్రులను కలుసుకున్నారు. కొందరు తల్లిదండ్రులు భాగస్వాములకు తెలియకుండా దత్తతకిచ్చి, తరువాత గొడవలు రాగానే తప్పిపోయారని ఫిర్యాదు చేస్తారు. లాక్‌డౌన్‌ కాలంలో కొందరు ఫిర్యాదులు ఇచ్చి రాంగ్‌ అడ్రస్‌లు ఇచ్చారు. కొందరు ఫోన్‌నెంబర్లు మార్చారు. మరికొందరు ఏకంగా ఢిల్లీ వదిలి సొంత రాష్ట్రాలకు వెళ్లిపోయారు. ఈసారి తల్లిదండ్రులను కూడా పట్టుకోవాల్సి వచ్చింది. అంతవరకూ పిల్లలను షెల్టర్‌ హోంలో ఉంచాల్సి వచ్చింది.

► కుటుంబ నేపథ్యం, వ్యక్తిగత జీవితం గురించి చెబుతారా?
మాది యూపీలోని ముజఫర్‌ నగర్‌ జిల్లాలోని షమ్లీ ప్రాంతం. డిగ్రీవరకూ అంతా అక్కడే చదివాను. సంప్రదాయ కుటుంబం. అమ్మానాన్నలు టీచర్లు. మా కుటుంబంలో నేనే తొలి పోలీసు ఆఫీసర్‌. ఉద్యోగమొచ్చాక ఢిల్లీకి మారాను. ఇంట్లో నేను మా ఆయన అనిత్‌ ఢాకా, మా అబ్బాయి ఆరవ్‌ ఢాకా ఉంటాం. మా ఆయన కూడా పోలీసే. నా భర్త నా బ్యాచ్‌మేటే. మా కజిన్‌ ఈ సంబంధం తీసుకువచ్చాడు. దీంతో అనుకోకుండానే బ్యాచ్‌మేట్‌ను వివాహం చేసుకున్నాను. క్షణం తీరిక లేకున్నా.. ఇంట్లో అంతా నన్ను ప్రోత్సహిస్తారు. నా విజయాలను వారి విజయాలుగా చెప్పుకుంటారు. వారి ప్రోత్సాహంతోనే కూతురిగా, భార్యగా, తల్లిగా పోలీసు అధికారిగా ఇపుడు అన్ని బాధ్యతలు సమర్థంగా నిర్వర్తించగలుగుతున్నాను.

► పోలీసు జాబును ఎందుకు ఎంచుకున్నారు?
సీమ: 2006 ఊళ్లో కొందరు అమ్మాయిలు దరఖాస్తు చేస్తుంటే నేనూ చేశాను. సెలెక్టయ్యాను. కానీ, బంధువులంతా నాన్నను భయపెట్టారు. పోలీసైతే పెళ్లి అవదు అని, మగరాయుడిలా పోలీసును చేస్తావా? అంటూ సూటిపోటి మాటలు అన్నారు. దానికి తగ్గట్టు శిక్షణకు వెళ్లొచ్చాక కొద్దిగా నల్లబడ్డాను. ‘చెబితే విన్నావా? అసలే ఆడపోలీసు...అంటుంటే.. ఇపుడు నల్లబడింది. మీ అమ్మాయికి ఇక పెళ్లవదు...’ అంటూ శాపనార్థాలు పెట్టారు. 2014లో పదోన్నతితో హెడ్‌ కానిస్టేబుల్‌ అయ్యాను. 76 మంది పిల్లల జాడ  పట్టుకున్నాక.. ఈ ఏడాది నవంబరులో ఏఎస్‌ఐగా పదోన్నతి వచ్చింది. ఇలాంటి ప్రమోషన్‌ ఢిల్లీ పోలీసు చరిత్రలో నాకే తొలిసారిగా దక్కింది. దీంతో నాడు వెక్కిరించినవారే... నేడు మా బంధువుల అమ్మాయి అని గర్వంగా చెప్పుకుంటున్నారు.

– అనిల్‌కుమార్‌ భాషబోయిన సాక్షి, హైదరాబాద్‌


భర్త, కుమారుడితో సీమ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement