పాక్ నుంచి పారిపోయివచ్చి, తన ప్రియుడు సచిన్‌తో పాటు యూపీలోని నోయిడాలో ఉంటున్న సీమా హైదర్ ఇప్పుడు మరిన్ని చిక్కుల్లో పడ్డారు. ఆమె పాకిస్తాన్ భర్త గులాం హైదర్ భారత్ వచ్చినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ముందుగా ఆయనే స్వయంగా తన యూట్యూబ్ చానల్‌లో తెలిపారు. గులాం హైదర్ ఆ వీడియోలో..‘పిల్లలూ మీ నాన్న ఇండియా వస్తున్నారు. అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయి’ అని పేర్కొన్నారు. గ్రేటర్ నోయిడా కోర్టు సీమా హైదర్ పాకిస్తాన్ భర్త గులాం హైదర్‌ను జూన్ 10న కోర్టుకు హాజరు కావాలని సమన్లు జారీ చేసింది. ఈ నేపధ్యంలోనే ఆయన ఈరోజు (సోమవారం) నోయిడా కోర్టుకు హాజరు కావాల్సివుంది.
సీమా హైదర్ పాక్ నుంచి భారత్ వచ్చినది మొదలు ముఖ్యాంశాలలో కనిపిస్తున్నారు. సీమా-సచిన్ ల ప్రేమకథ దేశవ్యాప్తంగా హల్‌చల్ చేసింది. సీమా తనతో పాటు తన నలుగురు పిల్లలను కూడా పాకిస్తాన్ నుంచి భారత్‌కు తీసుకువచ్చారు. ఈ పిల్లలు సీమా, ఆమె పాక్ భర్త గులాం హైదర్‌లకు జన్మించారు.
తన పిల్లలను తనకు అప్పగించాలంటూ సీమా హైదర్ పాకిస్తాన్ భర్త గులాం హైదర్ కోర్టును ఆశ్రయించారు. కరాచీలో నివసిస్తున్న ఆయన.. సచిన్ మీనాతో సీమా పెళ్లి చెల్లుబాటు కాదంటూ భారతీయ న్యాయవాది ద్వారా నోయిడాలోని కుటుంబ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఇంతలోనే సీమా తాను హిందూ మతంలోకి మారానని, పాకిస్తాన్‌కు తిరిగి వెళ్లబోనని, తన పిల్లలు కూడా హిందూ మతాన్ని స్వీకరించారని పేర్కొంది.
ఈ ఉదంతం గురించి మానవ హక్కుల కార్యకర్త అన్సార్ బర్నీ మాట్లాడుతూ గులాం హైదర్ వాదన న్యాయబద్ధంగా ఉందని, అంతర్జాతీయ చట్టాల ప్రకారం చిన్న పిల్లలను మత మార్పిడి చేయడంపై నిషేధం ఉన్నదన్నారు. సీమా ప్రస్తుతం భారత్‌లో స్థిరపడినప్పటికీ, ఆమె పిల్లలు పాకిస్తాన్ పౌరులని అన్నారు. గులాం హైదర్ తన భార్య సీమా నుంచి ఏమీ కోరుకోవడం లేదని, తన పిల్లలను పాకిస్తాన్‌కు తీసుకు వెళ్లాలని మాత్రమే అనుకుంటున్నారని అన్సార్ తెలిపారు. మరి ఈ కేసులో కోర్టు ఎలాంటి తీర్పు ఇవ్వనున్నదో వేచి చూడాల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment