తన నలుగురు పిల్లలతో సహా అక్రమంగా భారత్‌కు వచ్చిన పాకిస్తాన్ మహిళ సీమా హైదర్ కేసు కొత్త మలుపు తిరిగింది. సీమా హైదర్ మొదటి భర్త గులాం హైదర్ తన పిల్లలను పాకిస్తాన్‌కు తిరిగి తెచ్చుకునేందుకు ఒక భారతీయ న్యాయవాదిని నియమించుకున్నారు. మానవ హక్కుల కార్యకర్త ఒకరు పాక్‌లోని కరాచీలో ఈ విషయాన్ని వెల్లడించారు.
సీమా, సచిన్ మీనాల కేసును ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ పోలీసుల ఏటీఎస్ దర్యాప్తు చేస్తోంది. వీరిని నోయిడా పోలీసులు అరెస్టు చేసిన కొన్ని వారాల తర్వాత 2023 జూలైలో ఈ జంటను విచారణ కోసం అదుపులోకి తీసుకున్నారు. సీమా 2023 మేలో తన నలుగురు పిల్లలతో పాటు రబుపురా ప్రాంతంలో రహస్యంగా అద్దె ఇంట్లో నివసిస్తోంది. ఆమె పిల్లలందరూ ఏడేళ్లలోపు వారే. సీమా, మీనాలను గత ఏడాది జులై 4న అరెస్టు చేసిన స్థానిక కోర్టు జూలై 7న వారికి బెయిల్ మంజూరు చేసింది.
పాక్‌లోని సింధ్ ప్రావిన్స్‌లో గల జాకోబాబాద్‌కు చెందిన సీమా హైదర్ కరాచీలోని తన ఇంటి నుంచి నేపాల్ మీదుగా గత ఏడాది మేలో తన పిల్లలతో కలిసి భారత్‌కు వచ్చింది. ఆ సమయంలో సీమా భర్త గులాం హైదర్ సౌదీ అరేబియాలో పనిచేస్తున్నాడు. కాగా పాక్ న్యాయవాది, మానవ హక్కుల కార్యకర్త అన్సార్ బర్నీ మాట్లాడుతూ, సీమా భర్త గులాం హైదర్ తన నలుగురు పిల్లల సంరక్షణలో సహాయం కోసం తనను సంప్రదించారని చెప్పారు. ఈ నేపధ్యంలో తాము భారతీయ న్యాయవాది అలీ మోమిన్ సేవలను వినియోగించుకుంటున్నామన్నారు. అలాగే భారతీయ న్యాయస్థానాలలో చట్టపరమైన చర్యలను ప్రారంభించేందుకు పవర్ ఆఫ్ అటార్నీని పంపామని తెలిపారు.
మానవ హక్కుల కార్యకర్త బెర్నీ ఒక ట్రస్ట్‌ను కూడా నడుపుతున్నారు. ఇది తప్పిపోయిన, కిడ్నాప్‌కు గురయిన పిల్లలను వెదికేందుకు పనిచేస్తుంది. పాక్ జైళ్లలో మగ్గుతున్న భారతీయ ఖైదీలకు సాయం అందించేందుకు కూడా ఆయన ముందుకు వచ్చారు. కాగా సీమా హైదర్ తాను హిందూ మతంలోకి మారానని, పాకిస్తాన్‌కు తిరిగి వెళ్లనని స్పష్టం చేసింది. తన పిల్లలు కూడా హిందూ మతాన్ని స్వీకరించారని సీమా పేర్కొంది.
కాగా గులాం హైదర్ వాదన బలంగా ఉందని, అంతర్జాతీయ చట్టాల ప్రకారం చిన్న వయసు కలిగిన పిల్లల మత మార్పిడి నిషేధమని బర్నీ తెలిపారు. సీమ ప్రస్తుతం భారత్‌లో స్థిరపడినప్పటికీ, ఆమె పిల్లలు పాకిస్తాన్ పౌరులని, వారు చిన్న వయస్సులో ఉన్నందున వారిపై పూర్తి హక్కులు తండ్రికి ఉంటాయని చట్టం చెబుతోందని ఆయన అన్నారు. గులాం హైదర్ తన భార్య నుండి ఏమీ కోరుకోవడం లేదని, కేవలం తన పిల్లలను మాత్రమే పాకిస్తాన్‌కు తీసుకురావాలని కోరుకుంటున్నాడని బర్నీ తెలిపారు. భారతదేశంలోని సీమా హైదర్, సచిన్ మీనా తరపు న్యాయవాది ఏపీ సింగ్ మాట్లాడుతూ గులాం హైదర్ వాదన గురించి తమకు ఇంకా తెలియలేదని, దీని గురించి అధికారికంగా తెలియగానే స్పందిస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment