missing children
-
‘సెర్చ్’ ఇంజన్లీ అమ్మలు
‘ఈ పిల్లల ఆచూకీ మీరు కనిపెట్టాలి’ అని పై అధికారి ఆదేశించారు. ‘అలాగే సార్’ అనడమే కాదు ‘ఎలాగైనా సరే’ అనుకున్నారు మనసులో. దిల్లీలోని యాంటీ–హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్లో పనిచేస్తున్న కానిస్టేబుల్స్ సీమా దేవి, సుమన్ హుడా ఒక్కరు కాదు... ఇద్దరు కాదు రకరకాల కారణాలతో కనిపించకుండా పోయిన 104 మంది పిల్లలను వారి తల్లిదండ్రులకు అప్పగించారు.ఒకప్రాంతంలో... ‘అయ్యా... నా కొడుకు వారం రోజుల నుంచి కనిపించడం లేదు...’‘ఫోటో ఉందా?‘లేదయ్యా’మరోప్రాంతంలో...‘మా అమ్మాయి కనిపించడం లేదు సారూ... ఎక్కడెక్కడో వెదికాం...’దిల్లీ, దిల్లీ చుట్టుపక్కలప్రాంతాలలో కనిపించకుండా పోయిన పిల్లల సంఖ్య 104 ఆ పేద తల్లిదండ్రులలో చాలామంది దగ్గర కనీసం తమ పిల్లల ఫొటోలు కూడా లేవు. కొందరు ‘మా పిల్లలు ఇలా ఉంటారు’ అని పోలికలు చెప్పేవారు.కొందరి దగ్గర ఫొటోలు ఉన్నా అవి అవుట్‌డేటెడ్ ఫొటోలు.. ఇలాంటి ఎన్నో ప్రతికూల పరిస్థితుల్లో ‘ఆపరేషన్ మిలాప్’ తెర మీదికి వచ్చింది. ఈ ఆపరేషన్‌ను సీమా దేవి, సుమన్ హుడా సవాలుగా తీసుకున్నారు. దిల్లీలో పనిచేస్తున్న ఈ కానిస్టేబుల్స్ ఎలాగైనా సరే కనిపించకుండా పోయిన పిల్లలను తిరిగి తల్లిదండ్రులకు అప్పగించాలనుకున్నారు. అదెంత కష్టమో వారికి తెలియనిది కాదు. అయినా సరే, రంగంలోకి దిగారు. ప్రతి కేసును సవాలుగా తీసుకున్నారు. ఉత్తర్‌ప్రదేశ్, బిహార్, హరియాణాలో ఊరూ వాడా వెదికారు.కొన్ని సందర్భాలలో బాధితులకు పోలీసులు మాట్లాడే భాష అర్థం కాకపోయేది. పిల్లలను చివరిసారిగా గుర్తించిన ప్రాంతాల్లోని స్థానికులు పోలీసులతో మాట్లాడేందుకు నిరాకరించేవారు. ఇలాంటి సవాళ్లు ఎన్నో ఎదురైనా వెనకడుగు వేయలేదు. సైబర్ టీమ్ సహాయం కూడా తీసుకున్నారు.ఎట్టకేలకు వారి కష్టం ఫలించింది. తప్పిపోయిన 104 మంది పిల్లలను తొమ్మిది నెలల కాల వ్యవధిలో వారి తల్లిదండ్రులకు అప్పగించడంలో సీమాదేవి, సుమన్ హూడాలు విజయం సాధించారు. ఈ పిల్లలు కనిపించకుండా పోవడానికి ఇంట్లో నుంచి పారిపోవడం నుంచి సోషల్ మీడియాలో పరిచయం అయిన వారి మాటలు నమ్మి వెళ్లిపోవడం వరకు ఎన్నో కారణాలు ఉన్నాయి. కొత్తప్రాంతాలకు ఇన్వెస్టిగేషన్ కోసం వెళ్లినప్పుడు స్థానికులు సీమాదేవి, సుమన్‌లను అనుమానంగా చూసేవాళ్లు. ‘మీరు నిజంగా పోలీసులేనా?’ అని అడిగేవారు. వారిలో నమ్మకం రావడానికి కాస్త టైమ్ పట్టేది. అయినా ఓపికగా ఎదురు చూసేవారు. స్థానికులలో నమ్మకం వచ్చాక... ఇంటింటికి వెళ్లి వెదికేవారు.చెత్త ఏరే పిల్లల నుంచి మొదలు రైల్వేస్టేషన్లో పనిచేసే సిబ్బంది వరకు ఎంతోమంది నుంచి ఎన్నో రకాల క్లూలు సేకరించేవారు.‘ఇంతమంది పిల్లలను వారి తల్లిదండ్రుల వద్దకు చేర్చినందుకు చాలా సంతోషంగా, గర్వంగా ఉంది. మాకు ఫిక్స్డ్ డ్యూటీ టైమింగ్స్ ఉండేవి కావు. తప్పిపోయిన పిల్లల గురించి ఏ చిన్న సమాచారం అందినా వెంటనే ఇంటి నుంచి బయలుదేరేవాళ్లం. కనిపించకుండా పోయిన పిల్లల్ని వెదకడంలో మా పిల్లల్ని చూసుకోవడం కుదిరేది కాదు. అయినా బాధ పడలేదు’ అంటుంది సీమాదేవి.‘రవాణా సౌకర్యాలు లేకపోవడం వల్ల ఎన్నో కిలోమీటర్ల దూరం నడవాల్సి వచ్చేది. బాగా అలిసిపోయేవాళ్లం’ అంటుంది సుమన్ హుడా.తొమ్మిది నెలల కాలంలో వారు ఇళ్లు విడిచి, కుటుంబాన్ని విడిచి ఎన్నో కష్టాలు పడ్డారు. అయితే... కృతజ్ఞతతో నిండిన పిల్లల తల్లిదండ్రుల కళ్ల నుంచి వచ్చిన ఆనంద బాష్పాలను చూసిన తరువాత ఆ కష్టాలేవీ ఇప్పుడు వారికి గుర్తుకు రావడం లేదు. -
‘ఆకలేస్తోంది.. అమ్మ చనిపోయింది!’
ఆశలు వదిలేసుకుంటున్న తరుణంలో.. ఏదో అద్భుతం జరిగినట్లు నలుగురు చిన్నారులు అమెజాన్ అడవుల నుంచి బయటపడ్డారు. ఓవైపు 40 రోజులు వాళ్లు ఎలా అడవిలో గడిపారనే దానిపై ప్రపంచం చర్చించుకుంటుండగా.. అదే టైంలో రెస్క్యూ టీం శ్రమపై కొలంబియాలో సర్వత్రా అభినందనలు కురుస్తున్నాయి. రియల్ హీరోలుగా అభివర్ణిస్తోంది ఆ దేశమంతా. ఈ తరుణంలో.. సదరు రెస్క్యూ గ్రూప్ ఆదివారం ఓ మీడియా ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చింది. శుక్రవారం సాయంత్రం చిన్నారుల జాడ దొరకగా.. వాళ్లను ప్రత్యేక విమానంలో రాజధాని బోగోటాకు తరలించి చికిత్స అందించడంతో వాళ్లు కోలుకున్నట్లు తెలిపింది. హుయిటోటోకు చెందిన ఆ పిల్లలు సర్వైవర్ స్కిల్స్(ఆపదలో తమను తాము రక్షించుకోవడం) ద్వారా బయటపడినట్లు చెప్పింది. అంతేకాదు.. రెస్క్యూ టీంలో సభ్యుల్లో చాలా మంది స్థానిక తెగకు చెందిన వాళ్లే కావడం గమనార్హం. ‘‘ఆ నలుగురిలో పెద్ద లెస్లీ. తన చేతిలో చిన్న పసికందు ఉంది. నన్ను చూడగానే పరిగెత్తుకుంటూ వచ్చింది. ఆకలిగా ఉందంటూ కన్నీళ్లు పెట్టుకుంది. వెనకాల ఇద్దరు పిల్లలు ఉన్నారు. వాళ్లలో ఒక పిల్లాడు మమ్మల్ని చూసి కిందపడిపోయాడు. దగ్గరికి వెళ్లగానే ఏడుస్తూ మా అమ్మ చనిపోయిందని చెప్పాడు. వెంటనే వాళ్లకు ధైర్యం అందించాలనుకున్నాం. మేం మీ నాన్న పంపితేనే వచ్చాం. మీమూ మీ కుటుంబం లాంటివాళ్లమే అని చెప్పాం అని బృందంలోని సభ్యులు ఒక్కొక్కరుగా వివరించుకుంటూ వచ్చారు. పిల్లల్ని రక్షించాక వాళ్లను నవ్వించేందుకు తాము చేయని ప్రయత్నమంటూ లేదని చెబుతున్నారు వాళ్లు. వాళ్లు ఆరోగ్యంగానే కనిపించారు. అయినా తాగడానికి నీళ్లు, ఎనర్జీ డ్రింక్స్ అందించాం. సరదాగా మాట్లాడుతూ ఉన్నాం. కానీ, వాళ్ల ముఖాల్లో నవ్వు రాలేదు. తల్లి లేదన్న బాధ నెలరోజులైనా ఆ చిన్నారుల ముఖం నుంచి వీడిపోలేదు. సరదాగా వాళ్లతో కబుర్లు చెప్పాం. పొగాకు తాగుతూ.. పాటలు పాడుతూ వాళ్లను నవ్వించే యత్నం చేశాం. అక్కడున్న పవిత్రమైన చెట్ల ఆకుల్ని పూజించాం. కథలు చెప్పాం. అందులో చిన్నారితో పాటు ఐదేళ్ల బాబు కూడా ఈ 40 రోజుల గ్యాప్‌లోనే పుట్టినరోజులు అయిపోయాయట. అందుకే వాళ్లకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ పాటలు పాడాం. వాళ్లు తేరుకుంటున్న సమయంలోనే ఎయిర్‌లిఫ్టింగ్ చేశాం. ఆస్పత్రిలో వాళ్లు కోలుకుంటున్నారు అని బృందం సభ్యులు చెప్పుకొచ్చారు. నాలుగు రోజులపాటు కొనప్రాణంతో.. ఇదిలా ఉంటే.. చిన్నారుల తండ్రి పిల్లలతో మాట్లాడాక ఆ వివరాలను ఆదివారం సాయంత్రం మీడియాకు వివరించారు. తన భార్య ప్రమాదం జరిగిన వెంటనే చనిపోలేదని పిల్లలు ఆ విషయం తనకు చెప్పారని ఆయన వివరించారు. మాగ్దలీనా ముకుటుయ్ తెగ నాయకురాలు. ఆమె ప్రమాదానికి గురయ్యాక తీవ్రంగా గాయపడింది. నాలుగు రోజుల పాటు ఆమె కొనప్రాణంతో కొట్టుమిట్లాడింది. ఆ టైంలో పిల్లలు ఆమె వెంటే ఉన్నారు. ఊపిరి ఆగిపోయేముందు ఆమె వాళ్లను.. ఎలాగైనా అడవి నుంచి బయటపడమని చెప్పి కన్నుమూసింది. మే 1వ తేదీన ఆ పిల్లలు, వాళ్ల తల్లి, ఓ తెగ నాయకుడు ప్రయాణిస్తున్న తేలికపాటి విమానం ప్రమాదానికి గురైంది. విమానం ముందు భాగం ధ్వంసం కావడంతో.. అక్కడ ఉన్న ముగ్గురు(పిల్లల తల్లి కూడా) మరణించారు. అయితే వెనకభాగంలో కూర్చున్న పిల్లలు సురక్షితంగా బయటపడి.. భయంతో అడవి నుంచి బయటపడేందుకు ప్రయత్నించారు. దాదాపు 40 రోజుల రెస్క్యూ ఆపరేషన్ తర్వాత వాళ్ల జాడను గుర్తించింది ఓర్డోనెజ్ గోమెస్ నేతృత్వంలోని బృందం. ఆ నలభై రోజులపాటు అడవుల్లో దొరికే పండ్లు, గింజలు, దుంపలు, వేళ్లు తిని బతికారు వాళ్లు. ఆ చిన్నారుల ధైర్యానికి ముఖ్యంగా తన తోబుట్టువుల్ని రక్షించుకునేందుకు లెస్లీ చేసిన సాహసానికి అభినందనలు కురుస్తున్నాయి. ఇదీ చదవండి: డాల్ఫిన్ కోసం వెళ్తే.. జరిగింది ఇది! -
సీమా.. తడాఖా.. సూపర్ కాప్
ఆమె పేరు సీమా ఢాకా.. ఢిల్లీ పోలీసు డిపార్ట్‌మెంటులోనే కాదు. ఇపుడు దేశవ్యాప్తంగా ఆమె ఓ సూపర్‌కాప్. ఢిల్లీలో తప్పిపోయిన చిన్నారులను ఒక్కరోజులో ఆచూకీ కనిపెట్టగల సత్తా ఆమె సొంతం. కేవలం మూడు నెలల కాలంలోనే ఏకంగా 76 మంది తప్పిపోయిన చిన్నారులను తిరిగి వారి తల్లిదండ్రుల వద్దకు చేర్చిన అరుదైన ఘనత ఆమె సొంతం. ప్రస్తుతం ఆమె పనిచేస్తోన్న సమయ్‌పూర్ బద్లీ పోలీస్‌స్టేషన్ సీమా ఢాకా పనితీరు వల్ల చాలా ప్రసిద్ధి చెందింది. ఎంతగా అంటే.. ఢిల్లీలో ఎక్కడ పిల్లలు తప్పిపోయినా.. ఈమెనే దర్యాప్తు చేయమనేంతగా..! సివంగి వేటకు దిగితే.. ఏ జంతువైనా తలవంచాల్సిందే.. ఈ సీమా ఢాకా దర్యాప్తుకు దిగితే.. తన తడాఖా చూపిస్తుంది ఎలాంటి మిస్సింగ్ కేసైనా 24 గంటల్లో పరిష్కారం కావాల్సిందే. హెడ్ కాన్స్టేబుల్గా పని చేస్తూ ఇటీవలే ఏఎస్ఐగా పదోన్నతి అందుకున్న సీమా ఢాకా తన విధులు, వ్యక్తిగత జీవితంపై పలు విషయాలు ‘సాక్షి’తో ప్రత్యేకంగా పంచుకున్నారు. ► ఒక్కసారిగా దేశవ్యాప్తంగా సూపర్ కాప్ అని పిలిపించుకోవడం ఎలా ఉంది? సీమ: చిన్నారుల జాడ కనిపెడితే కలిగే సంతృప్తి నాకెంతో ఇష్టం. ముఖ్యంగా ఆ పిల్లలను తిరిగి తల్లిదండ్రుల వద్దకు చేరిస్తే.. వారి కళ్లల్లో కనిపించే ఆనందం మాటల్లో వర్ణించలేనిది. నేనూ తల్లినే..! బిడ్డ కాసేపు కనబడకపోతే తల్లడిల్లిపోయే తల్లులు నా వద్దకు వస్తే.. నేను తట్టుకోలేను. వెంటనే రంగంలోకి దిగిపోతాను. ► మీ స్పీడ్ దర్యాప్తులోని సీక్రెట్ ఏంటి? సీమ: నాకంటూ కొన్ని పద్ధతులు ఉన్నాయి. టెక్నాలజీ, ఇంటలిజెన్స్‌ను సమర్థంగా వాడతా. ఠాణాలో పిల్లలు తప్పిపోయారన్న ఫిర్యాదు అందిన వెంటనే స్పందిస్తా. అలాగైతే.. పిల్లలు సరిహద్దులు దాటకముందే పట్టుకోవచ్చు. జాప్యం చేసే కొద్దీ వారు దూరం వెళ్లిపోతారు. ► తప్పిపోయిన పిల్లల విషయం లో మిమ్మల్ని కదలించిన ఘటన ఏదైనా ఉందా? ఉంది. 2016లో ఓ ముసలావిడ మా స్టేషన్‌కి వచ్చింది.. తన మనవరాలు తప్పిపోయిందని ఫిర్యాదు చేసింది. తన కొడుకు–కోడలు మరణించారని, మనవరాలు తప్ప ఈ లోకంలో తనకు ఎవరూ లేరని బోరుమంది. ఎంక్వైరీ చేస్తే నిజమే అని తెలిసింది. వాస్తవానికి హెడ్ కానిస్టేబుల్‌గా ఉన్న నాకు ఆ కేసు దర్యాప్తు చేసేందుకు అధికారాలు లేవు. కానీ, ఉన్నతాధికారుల వద్ద ప్రత్యేక అనుమతి తీసుకుని దర్యాప్తు మొదలుపెట్టాను.. 13 ఏళ్ల ఆ అమ్మాయిని పక్కింట్లో అద్దెకుండే ఓ యువకుడు మాయమాటలు చెప్పి బిహార్‌కు తీసుకెళ్లాడనే విషయాన్ని కనిపెట్టి, అక్కడ నుంచి బాలికను క్షేమంగా తీసుకొచ్చి నానమ్మకు అప్పగించా. అప్పుడు ఎంతో సంతోషం కలిగిందో చెప్పలేను. ► ఇంత తక్కువ సమయంలో 76 మంది పిల్లలను ఎలా గుర్తించగలిగారు? ఇదంతా మా ఢిల్లీ పోలీస్ కమిషనర్ సార్ కల్పించిన అవకాశం. 14 ఏళ్లలోపు చిన్నారుల మిస్సింగ్ కేసులను ర్యాంకులతో సంబంధం లేకుండా ఎవరైనా కనిపెట్టవచ్చు అంటూ ఇచ్చిన ఆదేశాలను నేను సమర్థంగా వినియోగించుకున్నాను. వాస్తవానికి 12 నెలల్లో 50 మంది పిల్లల ఆచూకీ కనిపెట్టాలని డిపార్ట్మెంట్ నాకు టార్గెట్ ఇచ్చింది. కేవలం తొలి పదిరోజుల్లోనే 12 మంది పిల్లల ఆచూకీ కనిపెట్ట గలిగాను. దాంతో నామీద నాకు, డిపార్ట్మెంట్కు నమ్మకం పెరిగింది. కేవలం 70 రోజుల్లో ఆ సంఖ్య 76కి చేరుకుంది. మిస్సింగ్ కేసుల్లో ఠాణా పరిమితులు లేకపోవడంతో ఢిల్లీలో ఎక్కడ పిల్లలు తప్పిపోయినా.. నా వద్దకు వచ్చిన కేసులను దర్యాప్తు చేస్తున్నాను. ► పిల్లల కోసం ఏయే రాష్ట్రాలు వెదికారు? ఎలాంటి సవాళ్లు ఉండేవి? ఢిల్లీలో తప్పిపోయిన పిల్లలు ఎక్కువగా ఢిల్లీ, పంజాబ్, ఉత్తర్‌ప్రదేశ్, పశ్చిమ బెంగాల్లో దొరికారు. కేసు వస్తే.. ఎన్ని సవాళ్లు ఎదురైనా లెక్కచేయను. పిల్లలను రెండు రోజుల్లో పట్టుకునేదాన్ని. తరువాత సీడబ్ల్యూసీ వాళ్ల ద్వారా తల్లిదండ్రులకు అప్పగించినపుడు ఆ కష్టం మొత్తం మర్చిపోతాను. వెంటనే ఒక చాయ్ తాగేసి, టేబుల్ మీద ఉన్న కొత్త కేసు ఫైల్ అందుకుంటా! ► పిల్లలు ఇంటి నుంచి పారిపోవడానికి ప్రధాన కారణాలేంటి? పేదరికం. అవును, మీరు వింటున్నది నిజమే! ఢిల్లీకి బతుకుదెరువు కోసం వచ్చే పేదపిల్లలే ఎక్కువగా అదృశ్యమవుతుంటారు. కుటుంబ సమస్యలు, చెడుసావాసాలు, తల్లిదండ్రులు సమయం కేటాయించకపోవడం, ప్రేమపేరుతో మాయమాటల కారణంగా పిల్లలు ఇల్లు విడుస్తున్నారు. వీరుగాకుండా మానవ అక్రమ రవాణా ముఠాలు కిడ్నాప్ చేస్తుంటాయి. ► పిల్లలు తప్పిపోయిన విషయంలో తప్పుడు ఫిర్యాదులేమైనా వస్తుంటాయా? వస్తుంటాయి. అసలు కారణాలను వదిలేసి, పిల్లలు పారిపోయిన విషయాన్నే చెబుతుంటారు చాలామంది. పేదరికం, సహజీవనం, అక్రమ సంబంధాలు కలిగి ఉండటం... ఇలాంటి వాటికి మూలకారణం. దానివల్ల దర్యాప్తు ఆలస్యమవుతుంది. ఈ విషయంలో కారణాలేమైనా.. మేం పిల్లల్ని వెదికి పట్టుకుంటాం. తరువాత అందరికీ కౌన్సెలింగ్ చేసి పంపిస్తాం. ► కిడ్నాప్ కేసులు ఏమైనా మీ వద్దకు వచ్చాయా? లాక్డౌన్లో ఒక విచిత్రమైన కేసు మావద్దకు వచ్చింది. ఓ వివాహితతో అక్రమ సంబంధం ఉన్న ఓ యువకుడు ఆమె తనను కలిసేందుకు రావడం లేదని ఆమె మూడేళ్ల కూతురుని కిడ్నాప్ చేశాడు. తల్లి మాకు అసలు విషయం చెప్పలేదు. మూడేళ్ల చిన్నారిని విడిపించాక, అసలు విషయం వెలుగు చూసింది. నిందితుడు జైలుకు వెళ్లడంతో తల్లీ పిల్లలకు విముక్తి కలిగింది. ► మీరు ఆచూకీ కనిపెట్టిన 76 మంది తల్లిదండ్రులను చేరుకున్నారా? దేవుడి దయవల్ల అంతా తల్లిదండ్రులను కలుసుకున్నారు. కొందరు తల్లిదండ్రులు భాగస్వాములకు తెలియకుండా దత్తతకిచ్చి, తరువాత గొడవలు రాగానే తప్పిపోయారని ఫిర్యాదు చేస్తారు. లాక్డౌన్ కాలంలో కొందరు ఫిర్యాదులు ఇచ్చి రాంగ్ అడ్రస్‌లు ఇచ్చారు. కొందరు ఫోన్‌నెంబర్లు మార్చారు. మరికొందరు ఏకంగా ఢిల్లీ వదిలి సొంత రాష్ట్రాలకు వెళ్లిపోయారు. ఈసారి తల్లిదండ్రులను కూడా పట్టుకోవాల్సి వచ్చింది. అంతవరకూ పిల్లలను షెల్టర్ హోంలో ఉంచాల్సి వచ్చింది. ► కుటుంబ నేపథ్యం, వ్యక్తిగత జీవితం గురించి చెబుతారా? మాది యూపీలోని ముజఫర్ నగర్ జిల్లాలోని షమ్లీ ప్రాంతం. డిగ్రీవరకూ అంతా అక్కడే చదివాను. సంప్రదాయ కుటుంబం. అమ్మానాన్నలు టీచర్లు. మా కుటుంబంలో నేనే తొలి పోలీసు ఆఫీసర్. ఉద్యోగమొచ్చాక ఢిల్లీకి మారాను. ఇంట్లో నేను మా ఆయన అనిత్ ఢాకా, మా అబ్బాయి ఆరవ్ ఢాకా ఉంటాం. మా ఆయన కూడా పోలీసే. నా భర్త నా బ్యాచ్‌మేటే. మా కజిన్ ఈ సంబంధం తీసుకువచ్చాడు. దీంతో అనుకోకుండానే బ్యాచ్‌మేట్‌ను వివాహం చేసుకున్నాను. క్షణం తీరిక లేకున్నా.. ఇంట్లో అంతా నన్ను ప్రోత్సహిస్తారు. నా విజయాలను వారి విజయాలుగా చెప్పుకుంటారు. వారి ప్రోత్సాహంతోనే కూతురిగా, భార్యగా, తల్లిగా పోలీసు అధికారిగా ఇపుడు అన్ని బాధ్యతలు సమర్థంగా నిర్వర్తించగలుగుతున్నాను. ► పోలీసు జాబును ఎందుకు ఎంచుకున్నారు? సీమ: 2006 ఊళ్లో కొందరు అమ్మాయిలు దరఖాస్తు చేస్తుంటే నేనూ చేశాను. సెలెక్టయ్యాను. కానీ, బంధువులంతా నాన్నను భయపెట్టారు. పోలీసైతే పెళ్లి అవదు అని, మగరాయుడిలా పోలీసును చేస్తావా? అంటూ సూటిపోటి మాటలు అన్నారు. దానికి తగ్గట్టు శిక్షణకు వెళ్లొచ్చాక కొద్దిగా నల్లబడ్డాను. ‘చెబితే విన్నావా? అసలే ఆడపోలీసు...అంటుంటే.. ఇపుడు నల్లబడింది. మీ అమ్మాయికి ఇక పెళ్లవదు...’ అంటూ శాపనార్థాలు పెట్టారు. 2014లో పదోన్నతితో హెడ్ కానిస్టేబుల్ అయ్యాను. 76 మంది పిల్లల జాడ పట్టుకున్నాక.. ఈ ఏడాది నవంబరులో ఏఎస్ఐగా పదోన్నతి వచ్చింది. ఇలాంటి ప్రమోషన్ ఢిల్లీ పోలీసు చరిత్రలో నాకే తొలిసారిగా దక్కింది. దీంతో నాడు వెక్కిరించినవారే... నేడు మా బంధువుల అమ్మాయి అని గర్వంగా చెప్పుకుంటున్నారు. – అనిల్‌కుమార్ భాషబోయిన సాక్షి, హైదరాబాద్ భర్త, కుమారుడితో సీమ -
మూడు నెలల్లో 76 మంది పిల్లల్ని....
సాక్షి, న్యూఢిల్లీ: తెలిసీ తెలియక, క్షణికావేశంతోను, కుటుంబ సభ్యులు వేధింపులు తట్టుకోలేక చాలామంది పిల్లలు ఇంటినుంచి పారిపోతూ ఉంటారు. అలా తప్పిపోయిన చిన్నారులను, బాలలను తిరిగి తమ ఇంటికి చేర్చిన ఒక మహిళా హెడ్ కానిస్టేబుల్ వారి జీవితాల్లో వెలుగులు నింపారు. దీంతో అటు ఉద్యోగరీత్యా ప్రోత్సాహకాలతోపాటు, విధి నిర్వహణలో ఒక మహిళగా తల్లి మనసు చాటుకున్నారంటూ నెటిజనుల ప్రశంసలుకూడా అందుకున్నారు. తప్పిపోయిన చిన్నారులను, కాపాడినందుకు ఢిల్లీకి చెందిన హెడ్ కానిస్టేబుల్ ప్రోత్సాహక పురస్కారాన్ని అందుకున్నారు. 12 నెలల్లో 76 మంది పిల్లలను కనిపెట్టినందుకుగాను సీమా ధాకా ఔట్-ఆఫ్-టర్న్ ప్రమోషన్ అందుకున్నారు. వారిలో 56 మంది 14 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారు. దీంతో అసాధారణ్ కార్యా పురస్కర్ అవార్డుకు సీమాను ఎంపిక చేసినట్టు పోలీసు ఉన్నతాధికారులు ప్రకటించారు. 14 సంవత్సరాల కంటే తక్కువ వయస్సున్న 50లేదా అంతకంటే ఎక్కువమంది పిల్లలను (వీరిలో కనీసం 8 సంవత్సరాల లోపు చిన్నారులండాలి)12 నెలలో వ్యవధిలో రక్షించే ఏ కానిస్టేబుల్ లేదా హెడ్ కానిస్టేబుల్‌కు ప్రోత్సాహక పథకం కింద అవుట్-టర్న్ ప్రమోషన్ ఇవ్వనున్నట్టు పోలీసు విభాగం ఆగస్టు 7న ప్రకటించింది. దీంతో రికార్డుస్థాయిలో పిల్లలను కాపాడి ఈ పురస్కారాన్ని అందుకోనున్న మొదటి పోలీసుగా సీమా నిలిచారు. దీంతో పాటు ఇతర అదనపు ప్రోత్సాహకాలను మంజూరు చేస్తున్నట్లు ఢిల్లీ పోలీస్ కమిషనర్ ఎస్.ఎన్. శ్రీవాస్తవ ప్రకటించారు. కేవలం 3 నెలల్లో 56 మంది పిల్లలను కాపాడిన సీమాకు అభినందనలు తెలుపుతూ ఆయన ట్వీట్ చేశారు. కేవలం ఢిల్లీనుంచి మాత్రమే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా ఈ పిల్లలను రక్షించామని సీమా చెప్పారు.పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఇద్దరు, పంజాబ్‌లోని హోషియార్పూర్ జిల్లాకు చెందిన ఇద్దరు, గుర్గావ్, ఘజియాబాద్, నోయిడా, పానిపట్, బిహార్ నుంచి తదితరులను కాపాడినట్టు తెలిపారు. 2018లో ఒక మహిళ తన ఏడేళ్ల కుమారుడి తప్పిపోయిన ఫిర్యాదు చేశారు. ఆ తరువాత ఆ మహిళ తన చిరునామాను, మొబైల్ నంబర్‌ను మార్చేశారు. దీంతో ఆమెను గుర్తించడం చాలా కష్ట మైందన్నారు. చివరకు 2020 అక్టోబర్‌లో పశ్చిమ బెంగాల్‌లోని తల్లి వద్దకు చేర్చినట్టువెల్లడించారు. అలాగే సవతి తండ్రి హింస, వేధింపులను తట్టుకోలేక ఇంటినుంచి పారిపోయిన ఒక బాలుడు తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్ళడానికి సిద్ధంగా లేడంటూ తన అనుభవాలను పంచుకున్నారు సీమా. కాగా సీమా జూలై 3, 2006 న ఢిల్లీలోపోలీసు ఉద్యోగంలో చేరారు. ఆమె 2014 లో పదోన్నతి పొంది హెడ్ కానిస్టేబుల్ అయ్యారు. 2012 వరకు అక్కడే పనిచేసిన ఆమెను 2012 లో బయటి జిల్లాకు, అక్కడి నుంచి రోహిణికి, తరువాత బయటి-ఉత్తర ప్రాంతానికి బదిలీ చేసినట్లు పోలీసులు తెలిపారు -
ఇప్పటికి 325 మంది పిల్లల్ని రక్షించాం
సాక్షి, హైదరాబాద్ : ‘ఆపరేషన్ స్మైల్’ కార్యక్రమం చాలా మంచి ఫలితాలిస్తుందంటున్నారు సీపీ అంజనీ కుమార్. సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘జనవరి1, 2019 నుంచి ‘ఆపరేష్ స్మైల్’ నిర్వహిస్తున్నాం. తప్పిపోయిన పిల్లల్ని ట్రేస్ చేయడం ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశం. దీని కోసం అడిషనల్ సీపీ క్రైం నేతృత్వంలోని 17 బృందాలు పాల్గొన్నాయి’ అని తెలిపారు. అంతేకాక ‘‘ఆపరేషన్ స్మైల్’లో భాగంగా ఇప్పటివరకూ 325 మంది చిన్నారులను కాపాడాం. వీరిలో 11 మంది బాలికలు ఉన్నారు. ఇలా కాపాడిన పిల్లల్లో 272 మంది చిన్నారులను వారి తల్లిదండ్రులకు అప్పగించాము. 53 మందిని రెస్క్యూ హోమ్‌లో చేర్పించామ’ని తెలిపారు. ‘దర్పణ్’ అనే ఫేస్ రికగ్నేషన్ యాప్ ద్వారా ఈ పిల్లలను కనిపెట్టగలిగినట్లుగా సీపీ చెప్పారు. అంతేకాక చిన్నారుల చేత పనులు చేయిస్తున్న 14 మంది మీద కేసులు నమోదు చేశామని తెలిపారు. ‘మా పిల్లల్ని క్షేమంగా మా వద్దకు చేర్చిన హైదరాబాద్ పోలీసులకు రుణపడి ఉంటాం. మా పిల్లల కోసం ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నాం. మాయమాటలు చెప్పి పిల్లల్ని తీసుకెళ్లి వారిని బాలకార్మికులుగా మారుస్తున్నారు. వీరిని కఠినంగా శిక్షించాలని బాధిత పిల్లల తల్లిదండ్రులు కోరుతున్నారు. -
‘ఆ పిల్లల వివరాలు వెబ్సైట్లో పెడుతున్నాం’
సాక్షి, విజయవాడ : ఇంట్లోంచి పారియపోయి వచ్చిన పిల్లలను గుర్తించి వారిని తిరిగి క్షేమంగా తల్లిదండ్రుల వద్దకు చేర్చడమే తమ ప్రధాన ఉద్దేశం అంటున్నారు సౌత్ సెంట్రల్ రైల్వే డీఆర్ఎం ఆర్ ధనుంజయ్. శుక్రవారమిక్కడ విలేకరులతో మాట్లాడిన ధనుంజయ్ 2017 సంవత్సరంలో దాదాపు 230 మంది ఇంట్లోంచి పారిపోయి వచ్చిన పిల్లలను రైల్వే ప్రోటక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్) రెస్క్యూ టీం కాపాడారని తెలిపారు. అయితే ఈ ఏడాది వీరి సంఖ్య పెరిగిందని చెప్పారు. 2018 సంవత్సరంలో ఇప్పటివరకూ దాదాపు 246 మంది ఇలా ఇంటి నుంచి పారిపోయి వచ్చారని తెలిపారు. ఇలా పట్టుకున్న పిల్లలను వారి కుటుంబాలకు అప్పగించడం చాలా ఇబ్బందిగా మారిందన్నారు. తాము కాపాడిన పిల్లల ఫోటోలను ఆర్పీఎఫ్ వెబ్ పోర్టల్‌లో పెడుతున్నాని వెల్లడించారు. దాంతో పాటు ప్రస్తుతం ఆ పిల్లలు ఎవరి దగ్గర ఉన్నారో వారి అడ్రస్‌తో పాటు ఫోన్ నెంబర్లను వెబ్‌సైట్‌తో పాటు సోషల్ మీడియాలో కూడా పెడుతున్నట్లు తెలిపారు. -
తప్పిపోతున్నారు..
కామారెడ్డి క్రైం : ముక్కుపచ్చలారని చిన్నారులు.. ఆడుకోవడమే వారికి సరదా. తల్లిదండ్రులతో కలిసి బయటకు వెళ్లడమంటే మరీ ఇష్టం. ఆడుకుంటున్నా, తోడుగా వచ్చినా, ఎలాంటి పరిస్థితుల్లోనైనా వారిని విస్మరిస్తే అంతే సంగతులు. ఇంటిల్లిపాదిని సంతోషాల్లో ముంచెత్తే బోసి నవ్వులు కనిపించకుండా పోతాయి! తలిదండ్రులు, కుటుంబసభ్యులు చేస్తున్న కొన్ని పొరపాట్లు పిల్లల పాలిట శాపాలుగా మారుతున్నాయి. ఇంటా బయటా, ఎక్కడున్నా చిన్నారులను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బాధ్యతను ఇటీవల జిల్లాలో చోటుచేసుకున్న సంఘటనలు గుర్తుచేస్తున్నాయి. పిల్లల విషయంలో ఏ మాత్రం నిర్లక్ష్యం చూపినా భారీ మూల్యం తప్పదని పోలీసులు హెచ్చరిస్తున్నారు. జిల్లా కేంద్రంలో 15 రోజుల వ్యవధిలోనే ఇద్దరు చిన్నారులు తప్పిపోయిన సంఘటనలే ఇందుకు నిదర్శనం. పక్షం వ్యవధిలో ఇద్దరు చిన్నారులు.. జిల్లా కేంద్రంలో పదిహేను రోజుల వ్యవధిలో ఇద్దరు చిన్నారులు తప్పిపోయారు. వారిలో ఓ బాలుడు ఏకంగా కిడ్నాప్‌నకు గురయ్యాడు. అజాంపుర కాలనీకి చెందిన ఫాతిమా తన ఏడేళ్ల కుమారుడు సయ్యద్ అయాన్‌తో ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి వచ్చింది. వైద్య పరీక్షల కోసం ఆస్పత్రిలోని ఆమె వెళ్లగా బాలుడు బయట ఆడుకుంటున్నాడు. బాలుడిపై కన్నేసిన నజీరొద్దిన్ అనే వ్యక్తి అయాన్‌ను కిడ్నాప్ చేసి ఆటోలో వెళ్లిపోయాడు. బయటకు వచ్చిన తల్లి బాలుడు కనిపించడం లేదని ఫిర్యాదు చేయడంతో సీసీ కెమెరాల ఆధారంగా కిడ్నాప్‌నకు గురైనట్లు పోలీసులు గుర్తించారు. ఐదున్నర గంటలపాటు గాలించి నసీరొద్దిన్ ఇంట్లో బాలుడిని గుర్తించి తల్లికి అప్పగించారు. ఇది జరిగిన కొద్ది రోజులకే మరో బాలుడు అదృశ్యం కావడం కలకలం రేపింది. దోమకొండ మండలం సంగమేశ్వర్ గ్రామానికి చెందిన లక్ష్మీపతి దంపతులు ఆస్పత్రి పనిమీద కామారెడ్డికి నాలుగు రోజుల క్రితం వచ్చారు. పాతబస్టాండ్ ప్రాంతంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చూపించుకునేందుకు లోనికి వెళ్లారు. వారి కుమారుడు ఆరేళ్ల కృష్ణమూర్తి ఆస్పత్రి వరండాలో ఆడుకుంటూ తప్పిపోయాడు. అరగంట పాటు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. స్థానికులు, పోలీసులు చుట్టు పక్కల అంతటా గాలించి ఓ మెడికల్ వద్ద బాలుడిని గుర్తించారు. అయాన్, కృష్ణమూర్తి అనే ఇద్దరు చిన్నారులు అదృశ్యం కావడంలో వారి తల్లిదండ్రుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. వారిపట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తల విషయంలో చేసిన పొరపాట్లే కారణమని పోలీసులు, స్థానికులు భావించారు. ఇవేకాకుండా గత డిసెంబర్లో పాత బాన్సువాడకు చెందిన లోకేష్ అనే ఐదేళ్ల బాలుడు తప్పిపోగా చిల్లర్గి గ్రామానికి చెందిన కొందరు మహిళలు ఆ బాలుడిని తీసుకెళ్లిపోయారు. అప్పట్లో ఈ సంఘటన కలకలం రేపింది. చివరికి పోలీసులు కేసును చేధించి బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించారు. అంతకుముందు కోటగిరికి చెందిన ఓ బాలుడిని కిడ్నాపర్లు ఎత్తుకెళ్లిపోయారు. పోలీసులు కేసు ఛేదించి బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించారు. మొన్నటికి మొన్న నందిపేట మండలం వన్నెల్(కే) గ్రామానికి చెందిన ఆరేళ్ల పాప మనీశ్వరిని మరో మహిళ పాఠశాల నుంచి కిడ్నాప్ చేయగా కేరళలో వారిని గుర్తించిన విషయం తెలిసిందే. ఇప్పటికీ దొరకని గణేష్ ఆచూకీ.. కామారెడ్డిలోని భరత్నగ ర్ కాలనీకి చెందిన మూ డేళ్ల వయస్సు గల కటికె గణేష్ ఇంటి ముందు ఆడుకుంటుండగా తల్లిదండ్రులు బయటకు వచ్చి చూసే సరికి తప్పిపోయాడు. ఏప్రిల్‌లో జరిగిన బాలుడి అదృశ్యం కేసు ఇప్పటికీ మిస్టరీగానే మిగిలింది. పోలీసులు, బాలుడి కుటుంబ సభ్యులు, బంధువులు, గణేష్ ఆచూకీ కోసం పట్టణంతో పాటు జిల్లా అంతటా వడపోశారు. అయినా లభించలేదు. బాలుడిని ఎవరో కిడ్నాప్ చేసి ఉంటారని అందరూ భావించారు. గణేష్ తప్పిపోయి నాలుగు నెలలు దాటినా ఇప్పటికి అతడి జాడ తెలియక కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. సీసీ కెమెరాలు సక్రమంగా పనిచేయకపోవడం కూడా అతడి ఆచూకీ తెలియకపోవడానికి కారణమైంది. -
చైల్డ్‌లైన్ కార్యాలయంలో తప్పిపోయిన బాలలు
విజయనగరం ఫోర్ట్ : తప్పిపోయిన బాలలు నలుగురు చైల్డ్‌లైన్ 1098 సంస్థ కార్యాలయానికి చెంతకు చేరారు. వివరాల్లోకి వెళ్తే.. ఒడిశా రాష్ట్రం టి.బరంపురానికి చెందిన కుంది రాజ్‌కుమార్ అనే పదేళ్ల బాలుడు, కుంది కార్తీక్ అనే ఆరేళ్ల బాలుడు, రోహిత్ బెహరా అనే 11 ఏళ్ల బాలుడు, అక్షయ్ బెహరా అనే 12 ఏళ్ల బాలుడు స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్‌లో అనుమానాస్పదంగా తిరుగుతున్నాడని వన్‌టౌన్ పోలీస్ కానిస్టేబుల్ సత్యమోహన్ చైల్డ్‌లైన్ సభ్యులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న చైల్డ్‌లైన్ సభ్యులు బాలలు నలుగురిని చైల్డ్‌లైన్ కార్యాలయానికి తీసుకుని సంరక్షించారు. కార్యాలయంలో చైల్డ్‌లైన్ కో–ఆర్డినేటర్ ఎస్.రంజిత, వరలక్ష్మి, సతీష్ తదితరులు పాల్గొన్నారు -
నాలుగు రోజులు...3 వేల మంది
న్యూఢిల్లీ : అమ్మ తిట్టిందనో, మాష్టారు దండిచాడనో, స్నేహితులు గేలి చేశారనే కోపంలో క్షణికావేశంతో ఇల్లు విడిచి పారిపోతున్న చిన్నారులను తిరిగి వారి తల్లిదండ్రుల వద్దకు చేర్చాలనే ఉద్ధేశంతో ఢిల్లీ పోలీసులు ఒక నూతన విధానాన్ని రూపొందించారు. ఈ నూతన విధానంతో కేవలం నాలుగు రోజుల్లోనే దాదాపు 3000 మంది చిన్నారులను వారి తల్లిదండ్రుల చెంతకు చేర్చారు. ఇందుకుగాను ఈ ‘ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టమ్’కు కృతజ్ఞతలు తెలియజేసారు ఢిల్లీ పోలీసులు. ‘ఎఫ్ఆర్ఎస్’ కు సంబంధించిన పూర్తి వివరాలు... తప్పిపోయిన పిల్లలను గుర్తించి వారిని తల్లిదండ్రుల వద్దకు చేర్చాడానికి ఢిల్లీ పోలీసులు ‘ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టమ్’ (ఎఫ్ఆర్ఎస్) అనే ఒక నూతన విధానాన్ని రూపొందించారు. ఈ ‘ఎఫ్ఆర్ఎస్’ను పరీక్షించాల్సిందిగా ఢిల్లీ హై కోర్టు పోలీసులకు ఆదేశాలు జారీచేసింది. ఈ ‘ఎఫ్ఆర్ఎస్’ను టెస్ట్ చేసేందుకు తప్పిపోయిన పిల్లల సమాచారాన్ని ఇవ్వాల్సిందిగా పోలీసులు కేంద్ర మహిళా శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖను కోరారు. కానీ వారు అందుకు నిరాకరించడంతో పోలీసులు ఈ ‘ఎఫ్ఆర్ఎస్’ ను పరీక్షించలేదు. ఈ నెల 5న కోర్టు ‘ఎఫ్ఆర్ఎస్’ పనితీరు గురించి ఢిల్లీ పోలీసుల ప్రత్యేక కమిషనర్ని (క్రైమ్) ప్రశించింది. కమిషనర్ కోర్టు ప్రశ్నకు బదులిస్తు ‘ఎఫ్ఆర్ఎస్’ను ఇంకా పరీక్షించలేదని తెలిపాడు. ఈ సమాధానంతో కోర్టు ఢిల్లీ పోలీసుల పనితీరు పట్ల తన అసంతృప్తిని వ్యక్తం చేసింది. అందుకు అధికారులు మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి తమకు అవసరమయిన సమాచారం లభించలేదని తెలియజేసారు. అందువల్లనే ‘ఎఫ్ఆర్ఎస్’ను పరిక్షించలేదని తెలిపారు. దాంతో కోర్టు కేంద్రం మీద ఒత్తిడి తీసుకువచ్చింది. పిల్లలు తప్పిపోవడమనే సమస్య గత 20 సంవత్సరాల నుంచి చాలా తీవ్ర రూపం దాల్చిందని, ఇటువంటి విషయాన్ని మీరు తేలికగా తీసుకోవడం భావ్యం కాదని వ్యాఖ్యానించింది. ఇప్పటికైనా కోర్టు ఆదేశాలను పాటించకపోతే మీ మీద కోర్టు ధిక్కారణ చర్యలు తీసుకోవాల్సి వస్తుందని ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ఆదేశాలు వెలువడిన కొన్ని గంటల్లోనే పోలీసు అధికారుల, మంత్రిత్వ శాఖ అధికారుల సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మంత్రిత్వ శాఖ అధికారులు తమ వద్ద ఉన్న దాదాపు ఏడు లక్షల మంది తప్పిపోయిన చిన్నారుల వివరాలతో పాటు వారి ఫోటోలను కూడా పోలీసు అధికారులకు అందజేశారు. వివరాలను అందుకున్న అనంతరం పోలీసుల ‘ఎఫ్ఆర్ఎస్’ను పరీక్షించారు. ఇందుకు సంబంధించిన వివరాలను కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ సెక్రటరీ రాకేష్ శ్రీవాత్సవ కోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో పొందుపర్చాడు. ఈ అఫిడవిట్లో ఉన్న వివరాల ప్రకారం పోలీసులు వివిధ సంస్థల్లో ఆశ్రయం పొందుతున్న దాదాపు 45 వేల మంది చిన్నారులను ఈ ‘ఎఫ్ఆర్ఎస్’ సాయంతో సరిపోల్చి వారిలో 2,930 మందిని తిరిగి వారి కుటుంబాలతో కలిపారని తెలిపారు. ఈ ‘ఎఫ్ఆర్ఎస్’లో ముందుగా పిల్లల ముఖ కవళికలను స్టోర్ చేసి అనంతరం వాటిని పిల్లల ఫోటోగ్రాఫ్‌లతో పోల్చి చూస్తారు. జాతీయ బాలల హక్కుల రక్షణ కమీషన్ సభ్యుడు యశ్వంత్ జైన్ తప్పిపోయిన పిల్లలను గుర్తించి వారిని తిరిగి వారి కుటుంబాలతో కలపడానికి ఈ ‘ఎఫ్ఆర్ఎస్’ చాలా బాగా ఉపయోగపడుతుందంటూ దీని పనితీరును మెచ్చుకున్నాడు. ‘బచ్పన్ బచావో ఆందోళన్’ స్థాపకుడు భువన్ రిభూ ఈ ‘ఎఫ్ఆర్ఎస్’ను ఢిల్లీ పోలీసులకు ఉచితంగా ఇవ్వాలని ప్రతిపాదించాడు. దాంతో పాటు ‘నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్’ మాదిరిగానే ‘నేషనల్ చిల్డ్రన్స్ ట్రిబ్యునల్’ను ఏర్పాటుచేయాల్సిందిగా కోరాడు. -
కడుపుకోత మిగుల్చుతున్న కిడ్నాప్‌లు...
-
కనుపాప జాడేది?
-
పిల్లలు తప్పిపోతే సీఎస్, డీజీపీలదే బాధ్యత
చాలా రాష్ట్రాల్లో పిల్లలు పెద్ద సంఖ్యలో తప్పిపోతున్నారని, ఇక మీదట ఇలా పిల్లలు తప్పిపోతే మాత్రం ఆయా రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, డీజీపీలనే పిలిపిస్తామని, వాళ్లే బాధ్యత వహించాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. ఇందులో తొలి అడుగుగా.. బీహార్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల సీఎస్, డీజీపీలను ఈనెల 30వ తేదీన కోర్టు ఎదుట హాజరు కావాలని ఆదేశించింది. నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాష్ సత్యార్థికి చెందిన బచ్పన్ బచావో ఆందోళన్ దాఖలుచేసిన పిటిషన్‌ను విచారించే సందర్భంగా కోర్టు ఈ ఉత్తర్వులిచ్చింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇలాంటి విషయాల్లో చాలా యాంత్రికంగా సమాధానాలిస్తున్నాయని, దీన్ని ఇక సహించేది లేదని సుప్రీంకోర్టు చెప్పింది. -
వారం తర్వాత ఇంటికి
న్యూఢిల్లీ: అటు పోలీసు శాఖ అధికారులతోపాటు కుటుంబసభ్యులను తీవ్ర గందరగోళానికి గురిచేసిన చిన్నారి జాహ్నవి ఆహుజా ఆదివారం రోజుల తర్వాత ఇంటికి చేరుకుంది. దీంతో జాహ్నవి కుటుంబసభ్యుల ఆనందానికి అంతేలేకుండాపోయింది. ఈ విషయమై జాహ్నవి తండ్రి రాజేశ్ ఆహుజా సోమవారం మీడియాతో మాట్లాడుతూ ‘ఇంటికొచ్చిన వెంటనే అందరినీ గమనించిన జాహ్నవి నాన్నా అంటూ నన్ను పిలిచింది. ఏడవడం ప్రారంభించింది. ఆ తరువాత ఓ అడుగు ముందుకేసి నా ఒడిలో వాలిపోయింది. మాకు ఒకటే అమ్మాయి. దానికి ఫ్రూటీ అంటే ఎంతో ఇష్టం. ఇంటిలోకి రాగానే తింటానికి ఏదో ఒకటి ఇచ్చా’ అని అన్నాడు. ప్రస్తుతం తిండి బాగానే తింటోందని, బాగానే ఆడుకుంటోందని, రాత్రి బాగా నిద్రపోయిందన్నాడు. కాగా జాతీయ రాజధాని నడిబొడ్డునగల ఇండియా గేట్ వద్ద జాహ్నవి వారం క్రితం తప్పిపోయిన సంగతి విదితమే. జాహ్నవిని వెంటబెట్టుకుని ఆదివారం సాయంత్రం సరదాగా కుటుంబసభ్యులంతా ఇండియాగేట్ వద్దకు వచ్చారు. అయితే రాత్రి తొమ్మిది గంటల సమయంలో జాహ్నవి కనిపించలేదు. దీంతో కుటుంబసభ్యులు తిలక్‌మార్గ్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కిడ్నాప్ కేసు నమోదు చేశారు. అనంతరం నగర పోలీసు విభాగం సిబ్బందితోపాటు క్రైంబ్రాంచ్, స్పెషల్ సెల్‌కుచెందిన బృందాలు జాహ్నవి ఆచూకీ కోసం గాలింపు చర్యలను చేపట్టిన సంగతి విదితమే. ఇండియాగేట్ వద్ద తప్పిపోయిన మూడేళ్ల పసిపాప జాహ్నవి ఆచూకీ కనుగొన్నవారికి రూ. 50 వేల నగదు బహుమతిని అందజేస్తామంటూ నగర పోలీస్ కమిషనర్ భీంసేన్ బసి ప్రకటించిన సంగతి కూడా తెలిసిందే. కాగా ఆదివారం సాయంత్రం జాహ్నవి నగరంలోని మాయాపురి పోలీస్‌స్టేషన్ సమీపంలో ధీరేందర్ అనే ఓ కళాశాల విద్యార్థి కంటపడింది. ఆ సమయంలో పాప మెడలో ఆమె పేరుతోపాటు ఓ ఫోన్ నంబర్ ఉండడాన్ని గమనించిన ఆ విద్యార్థి పోలీసులకు సమాచారం అందించాడు. రంగంలోకి దిగిన పోలీసులు జాహ్నవిని వారి కుటుంబసభ్యులకు అప్పగించారు. నిందితులింకా పరారీలోనే... జాహ్నవిని అపహరించిన వ్యక్తులు ఇప్పటి కీ పరారీలోనే ఉన్నారు. అపహరణ అనంతర పరిణామాల క్రమాన్ని గుర్తించేందుకు యత్నిస్తున్నామని సంబంధిత అధికారి ఒకరు తెలియజేశారు. ఇంటికొచ్చే సమయానికి జాహ్నవి ఒంటిపై గల్లంతైన సమయంలో ధరించిన దుస్తులే ఉన్నాయి. నిందితులు జాహ్నవిని మురికిప్రదేశంలో ఉంచలేదని, కొట్టడం వంటివి చేయలేదని, పాపశరీరంపై ఎటువంటి గాయాలూ కనిపించలేదని ఆయన వివరించారు.