నాలుగు రోజులు...3 వేల మంది | In Delhi Facial Recognition System Finds 3000 Children In 4 Days | Sakshi
Sakshi News home page

సత్ఫలితాలు ఇచ్చిన ఎఫ్‌ఆర్‌ఎస్‌

Published Mon, Apr 23 2018 8:24 PM | Last Updated on Mon, Apr 23 2018 8:24 PM

In Delhi Facial Recognition System Finds 3000 Children In 4 Days - Sakshi

న్యూఢిల్లీ : అమ్మ తిట్టిందనో, మాష్టారు దండిచాడనో, స్నేహితులు గేలి చేశారనే కోపంలో క్షణికావేశంతో ఇల్లు విడిచి పారిపోతున్న చిన్నారులను తిరిగి వారి తల్లిదండ్రుల వద్దకు చేర్చాలనే ఉద్ధేశంతో ఢిల్లీ పోలీసులు ఒక నూతన విధానాన్ని రూపొందించారు. ఈ నూతన విధానంతో కేవలం నాలుగు రోజుల్లోనే దాదాపు 3000 మంది చిన్నారులను వారి తల్లిదండ్రుల చెంతకు చేర్చారు. ఇందుకుగాను ఈ ‘ఫేషియల్‌ రికగ్నైజేషన్‌ సిస్టమ్‌’కు కృతజ్ఞతలు తెలియజేసారు ఢిల్లీ పోలీసులు.

‘ఎఫ్‌ఆర్‌ఎస్‌’ కు సంబంధించిన పూర్తి వివరాలు...
తప్పిపోయిన పిల్లలను గుర్తించి వారిని తల్లిదండ్రుల వద్దకు చేర్చాడానికి ఢిల్లీ పోలీసులు ‘ఫేషియల్‌ రికగ్నైజేషన్‌ సిస్టమ్‌’ (ఎఫ్‌ఆర్‌ఎస్‌) అనే ఒక నూతన విధానాన్ని రూపొందించారు. ఈ ‘ఎఫ్‌ఆర్‌ఎస్‌’ను పరీక్షించాల్సిందిగా ఢిల్లీ హై కోర్టు పోలీసులకు ఆదేశాలు జారీచేసింది. ఈ ‘ఎఫ్‌ఆర్‌ఎస్‌’ను టెస్ట్‌ చేసేందుకు తప్పిపోయిన పిల్లల సమాచారాన్ని ఇవ్వాల్సిందిగా పోలీసులు కేంద్ర మహిళా శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖను కోరారు. కానీ వారు అందుకు నిరాకరించడంతో పోలీసులు ఈ ‘ఎఫ్‌ఆర్‌ఎస్‌’ ను పరీక్షించలేదు. ఈ నెల 5న కోర్టు ‘ఎఫ్‌ఆర్‌ఎస్‌’ పనితీరు గురించి ఢిల్లీ పోలీసుల ప్రత్యేక కమిషనర్‌ని (క్రైమ్‌) ప్రశించింది. కమిషనర్‌ కోర్టు ప్రశ్నకు బదులిస్తు ‘ఎఫ్‌ఆర్‌ఎస్‌’ను ఇంకా పరీక్షించలేదని తెలిపాడు.

ఈ సమాధానంతో కోర్టు ఢిల్లీ పోలీసుల పనితీరు పట్ల తన అసంతృప్తిని వ్యక్తం చేసింది. అందుకు అధికారులు మహిళా శిశు సంక్షేమ శాఖ  నుంచి తమకు అవసరమయిన సమాచారం లభించలేదని తెలియజేసారు. అందువల్లనే ‘ఎఫ్‌ఆర్‌ఎస్‌’ను పరిక్షించలేదని తెలిపారు. దాంతో కోర్టు కేంద్రం మీద ఒత్తిడి తీసుకువచ్చింది. పిల్లలు తప్పిపోవడమనే సమస్య గత 20 సంవత్సరాల నుంచి  చాలా తీవ్ర రూపం దాల్చిందని, ఇటువంటి విషయాన్ని మీరు తేలికగా తీసుకోవడం భావ్యం కాదని వ్యాఖ్యానించింది. ఇప్పటికైనా కోర్టు ఆదేశాలను పాటించకపోతే మీ మీద కోర్టు ధిక్కారణ చర్యలు తీసుకోవాల్సి వస్తుందని ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ఆదేశాలు వెలువడిన కొన్ని గంటల్లోనే పోలీసు అధికారుల, మంత్రిత్వ శాఖ అధికారుల సమావేశమయ్యారు.

ఈ సమావేశంలో మంత్రిత్వ శాఖ అధికారులు తమ వద్ద ఉన్న  దాదాపు ఏడు లక్షల మంది తప్పిపోయిన చిన్నారుల వివరాలతో పాటు వారి ఫోటోలను కూడా పోలీసు అధికారులకు అందజేశారు. వివరాలను అందుకున్న అనంతరం పోలీసుల ‘ఎఫ్‌ఆర్‌ఎస్‌’ను పరీక్షించారు. ఇందుకు సంబంధించిన వివరాలను కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ సెక్రటరీ రాకేష్‌ శ్రీవాత్సవ కోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో పొందుపర్చాడు. ఈ అఫిడవిట్‌లో ఉన్న వివరాల ప్రకారం పోలీసులు వివిధ సంస్థల్లో ఆశ్రయం పొందుతున్న దాదాపు 45 వేల మంది చిన్నారులను ఈ ‘ఎఫ్‌ఆర్‌ఎస్‌’ సాయంతో సరిపోల్చి వారిలో 2,930 మందిని తిరిగి వారి కుటుంబాలతో కలిపారని తెలిపారు.

ఈ ‘ఎఫ్‌ఆర్‌ఎస్‌’లో ముందుగా పిల్లల ముఖ కవళికలను స్టోర్‌ చేసి అనంతరం వాటిని పిల్లల ఫోటోగ్రాఫ్‌లతో పోల్చి చూస్తారు. జాతీయ బాలల హక్కుల రక్షణ కమీషన్‌ సభ్యుడు యశ్వంత్‌ జైన్‌ తప్పిపోయిన పిల్లలను గుర్తించి వారిని తిరిగి వారి కుటుంబాలతో కలపడానికి ఈ ‘ఎఫ్‌ఆర్‌ఎస్‌’ చాలా బాగా ఉపయోగపడుతుందంటూ దీని పనితీరును మెచ్చుకున్నాడు. ‘బచ్‌పన్‌ బచావో ఆందోళన్‌’ స్థాపకుడు భువన్‌ రిభూ ఈ ‘ఎఫ్‌ఆర్‌ఎస్‌’ను ఢిల్లీ పోలీసులకు ఉచితంగా ఇవ్వాలని ప్రతిపాదించాడు. దాంతో పాటు ‘నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌’ మాదిరిగానే ‘నేషనల్‌ చిల్డ్రన్స్‌ ట్రిబ్యునల్‌’ను ఏర్పాటుచేయాల్సిందిగా కోరాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement