డిజైన్లు లేకుండానే బ్లాక్–2ఏ కట్టిన వాటికి సీఈ సీడీవో ఆమోదం ఉందంటారా?
ప్రమాణం చేసి అబద్ధాలా?
క్రిమినల్ చర్యలు తీసుకోవాలా?
సుందిళ్ల బరాజ్ ఈఈపై జస్టిస్ ఘోష్ కమిషన్ ఆగ్రహం
సీఈ నల్లా వెంకటేశ్వర్లు ఆదేశాలతోనే డిజైన్లు లేకుండానే నిర్మించినట్టు ఇంజనీర్ల వివరణ
16 మంది ఇంజనీర్లకు క్రాస్ ఎగ్జామినేషన్ నిర్వహణ.. నేడు మరో 18 మందినిప్రశ్నించనున్న కమిషన్
సాక్షి, హైదరాబాద్: ‘తప్పుడు అఫిడవిట్ దాఖలు చేస్తారా? అన్నీ నిజాలే చెప్తాను.. అని ప్రమాణం చేసి అబద్ధాలు ఎలా ఆడతారు ? క్రిమినల్ కేసు పెట్టి చర్యలు తీసుకోవాలా..’అని సుందిళ్ల బరాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్(ఈఈ) గంగం వేణుబాబుపై జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు బరాజ్‌ల నిర్మాణంలో అవకతవకలపై విచారణలో భాగంగా మంగళవారం 16 మంది నీటిపారుదల శాఖ ఇంజనీర్లకు క్రాస్ ఎగ్జామినేషన్ నిర్వహించింది.
అఫిడవిట్‌లో పేర్కొన్న విషయాలన్నీ వాస్తవాలేనా? సుందిళ్ల బరాజ్ బ్లాక్–2ఏ డిజైన్, డ్రాయింగ్స్ ఉన్నాయా? ..అని విచారణ ప్రారంభంలో ఈఈ గంగం వేణుబాబును కమిషన్ ప్రశ్నించింది. బరాజ్‌లో నిర్మించిన ఇతర బ్లాకుల డిజైన్లు, డ్రాయింగ్స్ ఆధారంగా బ్లాక్–2ఏను నిర్మించాలని నాటి రామగుండం సీఈ నల్లా వెంకటేశ్వర్లు ఆదేశించారని వేణుబాబు బదులిచ్చారు.
సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్(సీడీఓ) సీఈ ఆమోదించిన డిజైన్లతోనే బ్లాక్–2ఏ కట్టామని అఫిడవిట్‌లో మీరు పొందుపరిచిన అంశం అబద్ధమా? ఆమోదిత డ్రాయింగ్స్ లేకుండానే బ్లాక్–2ఏ నిర్మించారా? అఫిడవిట్లో అబద్ధాలు ఎలా చెప్తారు? అని ఈ సందర్భంగా ఆయనపై కమిషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
‘పొరపాటైంది.. అఫిడవిట్‌లో పొందుపరిచిన అంశం వాస్తవం కాదు’అని వేణుబాబు వివరణ ఇవ్వడానికి ప్రయత్నించగా కమిషన్ అసహనం వ్యక్తం చేసింది. మీరు ఒక ఇంజనీర్ ? బాధ్యత లేదా? ఏ బ్లాకును కట్టాకా దాని డిజైన్ల ఆధారంగా ఏయే బ్లాకులు కట్టారు? బ్లాక్ –1, 2 కట్టిన తర్వాత బ్లాక్–2ఏ కట్టారా? అని కమిషన్ నిలదీయగా, సమాధానం ఇవ్వలేక వేణుబాబు ఇబ్బందిపడ్డారు. తప్పుడు అఫిడవిట్ ఇవ్వడం నేరం.. క్రిమినల్ కేసు పెట్టాలా? అని కమిషన్ మందలించింది.
బ్లాక్–2, 3ల నిర్మాణాన్ని ఎప్పుడు ప్రారంభించారని తదుపరిగా కమిషన్ ప్రశ్నించగా, వేణుబాబు సమాధానం ఇవ్వలేక నీళ్లు నమిలారు. తేదీలు తెలియకపోతే కనీసం ఏ సంవత్సరమో తెలపాలని కమిషన్ కోరగా, 2016 నిర్మాణం ప్రారంభమైందని బదులిచ్చారు. బ్లాక్–2, 3, 2ఏల నిర్మాణం 2017లో ప్రారంభించినట్టు రికార్డుల్లో ఉందని మళ్లీ కమిషన్ ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఈఎన్‌సీ ఆదేశాలతోనే బ్లాక్–2ఏ నిర్మాణం
సుందిళ్ల బరాజ్ బ్లాక్–2ఏకి సంబంధించిన డిజైన్లు, డ్రాయింగ్స్ లేవని రిటైర్డ్ డీఈఈ బండారి భద్రయ్య వెల్లడించారు. బ్లాక్–2, బ్లాక్–3 మధ్య దూరం పెరగడంతో అదనంగా బ్లాక్–2ఏ నిర్మించాల్సి వచి్చందని ఓ ప్రశ్నకు బదులిచ్చారు. డ్రాయింగ్స్ లేకుండానే ఇతర బ్లాకులను ఎలా కట్టారో బాక్–2ఏను సైతం అదే తరహాలో కట్టాలని రామగుండం మాజీ సీఈ నల్లా వెంకటేశ్వర్లు ఆదేశించారని తెలియజేశారు.
డ్రాయింగ్స్ లేకుండా ఎలా కట్టారు? అని కమిషన్ నిలదీయగా, ఆయన పైవిధంగా బదులిచ్చారు. సుందిళ్ల బరాజ్ పూర్తయినట్టు తాను ధ్రువీకరణ పత్రం జారీ చేశానని మరో డీఈఈ సునీత కమిషన్‌కు వివరణ ఇచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో తనకు సంబంధం లేదని చొప్పదండి ఈఈ శ్రీధర్ బదులిచ్చారు.
సుందిళ్ల పునరుద్ధరణ పూర్తి
అఫిడవిట్‌లో పేర్కొన్న విషయాలన్నీ వాస్తవాలేనా? నిజం తప్ప మరేమీ చెప్పను.. అని చేసిన ప్రమాణానికి అర్థం తెలుసా? అని రామగుండం ఎస్‌ఈ సత్యరాజుచంద్రను కమిషన్ ప్రశ్నించింది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ మధ్యంతర సిఫారసుల ఆధారంగా సుందిళ్ల బరాజ్‌కు అత్యవసర మరమ్మతులను నిర్మాణ సంస్థ నవయుగ సొంత ఖర్చులతో చేపట్టిందని, బ్లాక్–8కి ఎదురుగా ఉన్న కాంక్రీట్ బ్లాకుల పునరుద్ధరణ తప్ప మిగిలిన పనులన్నీ పూర్తయ్యాయని ఏఈఈ చెన్న అశోక్‌కుమార్ తెలిపారు.
ఏ రోజు పనిని అదేరోజు పరిశీలించి ప్లేస్‌మెంట్ రిజిస్టర్‌లో నమోదు చేసి సంతకాలు చేశారా? అని ఏఈఈ హరితను కమిషన్ అడగ్గా, అవును అని ఆమె బదులిచ్చారు. క్రాస్ ఎగ్జామినేషన్‌కు హాజరైన మిగిలిన ఇంజనీర్లు బరాజ్‌ల నిర్మాణంతో తమకు సంబంధం లేదని బదులిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment