
జనసేన నేత వేణు మాట్లాడినట్టుగా ఆడియో వైరల్
దువ్వ పంచాయతీ ఉద్యోగి కేసు వ్యవహారంలో కొత్త ట్విస్టు
తణుకు అర్బన్: ‘పెట్టిన కేసు వాపసు తీసుకోకపోతే నీ ఉద్యోగం పీకించేస్తా’ అంటూ జనసేన దువ్వ అధ్యక్షుడు శ్రీరాములు దుర్గారావు అలియాస్ చిన్ని, తణుకు మండల అధ్యక్షుడు చిక్కాల వేణుతో కలిసి వెంకటలక్ష్మి అనే ఒక మహిళా ఉద్యోగిని వేధించిన వ్యవహారం మరింత ముదురుతోంది. ఈ ఇరువురిపై కేసు నమోదయిన నేపథ్యంలో వేణు మాట్లాడినట్టుగా ఉన్న ఆడియో తాజాగా సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఆడియోలో ఉన్న ప్రకారం.. ‘ఇక్కడ ఎవరున్నారు. ఏమి గొడవ జరిగింది.
ఎంఎల్‌ఏ దగ్గరకు వెళ్లారు. కేసు పెట్టారు. ఎస్‌ఐని సెక్షన్‌లు తీసేయమన్నాం. తియ్యనన్నారు. ఎంతకావాలని అడిగాం. రెండో మాట లేదు. టేబుల్ పైన పెట్టేసి వచ్చేశాం. సెక్షన్‌లు తీసిపడేసారు. ఏమవుతాది..?’ అన్న మాటలు ప్రకంపనలు సృష్టిస్తుండడంతో పోలీసు వర్గాలకు సైతం చిర్రెత్తుకొచ్చినట్లు సమాచారం. ఇప్పటివరకు అధికార బలంతో అధికారులపై ఒత్తిడి తెస్తున్న కూటమి నాయకులు, నేడు పోలీసులనే కొనేశాం అని ధైర్యంగా చెప్పే పరిస్థితి తణుకు నియోజకవర్గంలో దాపురించడంతో ప్రజలు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు.

ప్రాణభయం ఉంది: బాధిత మహిళ
ఈ వ్యవహారంపై పనిగట్టుకుని అందరికీ ఫోన్‌లు చేసి.. తనకు దూరంగా ఉండాల్సిందిగా జనసేన నాయకులు చెబుతున్నారని బాధితురాలు వెంకటలక్ష్మి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తనపై చాలా కక్షపూరితంగా ఉన్నారని, తనను బతకనిచ్చేలా లేరన్నారు. ఈ వ్యవహారంపై తణుకు రూరల్ ఎస్‌ఐ చంద్రశేఖర్‌ను సాక్షి వివరణ కోరగా వెంకటలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామన్నారు.
గతేడాది జూలైలో బాధితురాలు బావ నరసింహస్వామి అలియాస్ అంతర్వేదికి– చిన్నికి మధ్య ఘర్షణలో అంతర్వేదికి ముఖంపై గాయాలయ్యాయి. అప్పట్లో దీనిపై కేసు నమోదైంది. ఈ కేసును వెనక్కి తీసుకునేలా అంతర్వేదిని ఒప్పించాలని చిన్ని, వేణులు వెంకటలక్ష్మిపై తీవ్ర ఒత్తిడి తెచ్చారు. వేధింపులు భరించలేక ఆమె వీరిరువురిపై కేసు పెట్టారు.