Executive Engineer
-
తప్పుడు అఫిడవిట్ దాఖలు చేస్తారా?
సాక్షి, హైదరాబాద్: ‘తప్పుడు అఫిడవిట్ దాఖలు చేస్తారా? అన్నీ నిజాలే చెప్తాను.. అని ప్రమాణం చేసి అబద్ధాలు ఎలా ఆడతారు ? క్రిమినల్ కేసు పెట్టి చర్యలు తీసుకోవాలా..’అని సుందిళ్ల బరాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్(ఈఈ) గంగం వేణుబాబుపై జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు బరాజ్‌ల నిర్మాణంలో అవకతవకలపై విచారణలో భాగంగా మంగళవారం 16 మంది నీటిపారుదల శాఖ ఇంజనీర్లకు క్రాస్ ఎగ్జామినేషన్ నిర్వహించింది. అఫిడవిట్లో పేర్కొన్న విషయాలన్నీ వాస్తవాలేనా? సుందిళ్ల బరాజ్ బ్లాక్–2ఏ డిజైన్, డ్రాయింగ్స్ ఉన్నాయా? ..అని విచారణ ప్రారంభంలో ఈఈ గంగం వేణుబాబును కమిషన్ ప్రశ్నించింది. బరాజ్‌లో నిర్మించిన ఇతర బ్లాకుల డిజైన్లు, డ్రాయింగ్స్ ఆధారంగా బ్లాక్–2ఏను నిర్మించాలని నాటి రామగుండం సీఈ నల్లా వెంకటేశ్వర్లు ఆదేశించారని వేణుబాబు బదులిచ్చారు. సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్(సీడీఓ) సీఈ ఆమోదించిన డిజైన్లతోనే బ్లాక్–2ఏ కట్టామని అఫిడవిట్లో మీరు పొందుపరిచిన అంశం అబద్ధమా? ఆమోదిత డ్రాయింగ్స్ లేకుండానే బ్లాక్–2ఏ నిర్మించారా? అఫిడవిట్లో అబద్ధాలు ఎలా చెప్తారు? అని ఈ సందర్భంగా ఆయనపై కమిషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘పొరపాటైంది.. అఫిడవిట్లో పొందుపరిచిన అంశం వాస్తవం కాదు’అని వేణుబాబు వివరణ ఇవ్వడానికి ప్రయత్నించగా కమిషన్ అసహనం వ్యక్తం చేసింది. మీరు ఒక ఇంజనీర్ ? బాధ్యత లేదా? ఏ బ్లాకును కట్టాకా దాని డిజైన్ల ఆధారంగా ఏయే బ్లాకులు కట్టారు? బ్లాక్ –1, 2 కట్టిన తర్వాత బ్లాక్–2ఏ కట్టారా? అని కమిషన్ నిలదీయగా, సమాధానం ఇవ్వలేక వేణుబాబు ఇబ్బందిపడ్డారు. తప్పుడు అఫిడవిట్ ఇవ్వడం నేరం.. క్రిమినల్ కేసు పెట్టాలా? అని కమిషన్ మందలించింది. బ్లాక్–2, 3ల నిర్మాణాన్ని ఎప్పుడు ప్రారంభించారని తదుపరిగా కమిషన్ ప్రశ్నించగా, వేణుబాబు సమాధానం ఇవ్వలేక నీళ్లు నమిలారు. తేదీలు తెలియకపోతే కనీసం ఏ సంవత్సరమో తెలపాలని కమిషన్ కోరగా, 2016 నిర్మాణం ప్రారంభమైందని బదులిచ్చారు. బ్లాక్–2, 3, 2ఏల నిర్మాణం 2017లో ప్రారంభించినట్టు రికార్డుల్లో ఉందని మళ్లీ కమిషన్ ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈఎన్సీ ఆదేశాలతోనే బ్లాక్–2ఏ నిర్మాణం సుందిళ్ల బరాజ్ బ్లాక్–2ఏకి సంబంధించిన డిజైన్లు, డ్రాయింగ్స్ లేవని రిటైర్డ్ డీఈఈ బండారి భద్రయ్య వెల్లడించారు. బ్లాక్–2, బ్లాక్–3 మధ్య దూరం పెరగడంతో అదనంగా బ్లాక్–2ఏ నిర్మించాల్సి వచి్చందని ఓ ప్రశ్నకు బదులిచ్చారు. డ్రాయింగ్స్ లేకుండానే ఇతర బ్లాకులను ఎలా కట్టారో బాక్–2ఏను సైతం అదే తరహాలో కట్టాలని రామగుండం మాజీ సీఈ నల్లా వెంకటేశ్వర్లు ఆదేశించారని తెలియజేశారు. డ్రాయింగ్స్ లేకుండా ఎలా కట్టారు? అని కమిషన్ నిలదీయగా, ఆయన పైవిధంగా బదులిచ్చారు. సుందిళ్ల బరాజ్ పూర్తయినట్టు తాను ధ్రువీకరణ పత్రం జారీ చేశానని మరో డీఈఈ సునీత కమిషన్‌కు వివరణ ఇచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో తనకు సంబంధం లేదని చొప్పదండి ఈఈ శ్రీధర్ బదులిచ్చారు. సుందిళ్ల పునరుద్ధరణ పూర్తి అఫిడవిట్లో పేర్కొన్న విషయాలన్నీ వాస్తవాలేనా? నిజం తప్ప మరేమీ చెప్పను.. అని చేసిన ప్రమాణానికి అర్థం తెలుసా? అని రామగుండం ఎస్ఈ సత్యరాజుచంద్రను కమిషన్ ప్రశ్నించింది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ మధ్యంతర సిఫారసుల ఆధారంగా సుందిళ్ల బరాజ్‌కు అత్యవసర మరమ్మతులను నిర్మాణ సంస్థ నవయుగ సొంత ఖర్చులతో చేపట్టిందని, బ్లాక్–8కి ఎదురుగా ఉన్న కాంక్రీట్ బ్లాకుల పునరుద్ధరణ తప్ప మిగిలిన పనులన్నీ పూర్తయ్యాయని ఏఈఈ చెన్న అశోక్‌కుమార్ తెలిపారు. ఏ రోజు పనిని అదేరోజు పరిశీలించి ప్లేస్మెంట్ రిజిస్టర్లో నమోదు చేసి సంతకాలు చేశారా? అని ఏఈఈ హరితను కమిషన్ అడగ్గా, అవును అని ఆమె బదులిచ్చారు. క్రాస్ ఎగ్జామినేషన్‌కు హాజరైన మిగిలిన ఇంజనీర్లు బరాజ్‌ల నిర్మాణంతో తమకు సంబంధం లేదని బదులిచ్చారు. -
HYD: నాంపల్లిలో అర్ధరాత్రి హైడ్రామా.. ఏసీబీ అదుపులో ఈఈ, ఏఈలు..
సాక్షి, హైదరాబాద్: నాంపల్లిలోని నీటి పారుదల శాఖలో ఏసీబీ సోదాలు ముగిశాయి. నాంపల్లిలో హైడ్రామా తర్వాత నలుగురు నిందితులను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం, వారిని నాంపల్లి ఏసీబీ కార్యాలయానికి తరలించారు.వివరాల ప్రకారం.. నాంపల్లిలో రెడ్ హిల్స్‌లోని నీటి పారుదల శాఖ ఆఫీసులో గురువారం రాత్రి ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో రంగారెడ్డి జిల్లా ఈఈ భన్సీలాల్, ఏఈలు కార్తీక్, నికేష్‌లు లంచం తీసుకుంటుండగా అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అదే సమయంలో, లంచం డిమాండ్‌కు సంబంధించి కీలక అధికారి పరారీ కావడంతో అర్ధరాత్రి వరకు హైడ్రామా కొనసాగింది. రాత్రి నాలుగు గంటల పాటు శ్రమించి నాలుగో వ్యక్తిని అధికారులు పట్టుకున్నారు.కాగా, ఒక వ్యక్తికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఆమోదం కోసం నీటిపారుదల శాఖ రంగారెడ్డి జిల్లా ఎస్ఈ కార్యాలయ అధికారులను సంప్రదించాడు. ఇక్కడ ఈఈగా పనిచేస్తున్న భన్సీలాల్, ఏఈలు కార్తీక్, నికేశ్ రూ.2.5 లక్షలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు తెలిసింది. దీనికి అంగీకరించిన సదరు వ్యక్తి ముందుగా రూ.1.5లక్షలు ఇచ్చేందుకు అధికారులు డీల్ కుదుర్చుకున్నారు. మరో లక్ష తర్వాత చెల్లించాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఇదంతా గురువారం సాయంత్రం ఈఈ ఆఫీసులో జరగాలని ప్లాన్ చేసుకున్నారు. ఈలోపే బాధితులు ఏసీబీకి ఫిర్యాదు చేయడంతో అధికారులు దాడులు జరిపి వారి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఇక, దీనికి సంబంధించిన వివరాలను అధికారులు కాసేపట్లో ప్రకటించే అవకాశం ఉంది. -
ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ జ్యోతికి 14 రోజుల రిమాండ్
సాక్షి, హైదరాబాద్: గిరిజన సంక్షేమ శాఖ ఇంజనీరింగ్ విభాగం ఇన్చార్జి సూపరింటెండెంట్ ఇంజనీర్(ఎస్ఈ) కె.జగజ్యోతిని ఏసీబీ అధికారులు ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. విచారణ చేపట్టిన ఏసీబీ కోర్టు.. జ్యోతికి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. మార్చ్ 6 వరకు జ్యోతికి రిమాండ్ విధిస్తున్నట్లు ఏసీబీ కోర్టు పేర్కొంది. జ్యోతిని చంచల్గూడా మహిళా జైలుకు తరలించాలని ఏసీబీ కోర్టు ఆదేశించింది. మరోవైపు రిమాండ్ ఆపాలని జ్యోతి తరపు న్యాయవాది ఏసీబీ కోర్టును కోరారు. జ్యోతిని అరెస్ట్ చేసి 24 గంటలు గడిచిపోయిందని జజ్యోతి తరపు నన్యాయవాది కోర్టుకు తెలిపారు. కోర్టు అనుమతి తీసుకున్నారని ఏసీబీ న్యాయమూర్తి తెలిపారు. దీంతో జ్యోతికి 14 రోజుల రిమాండ్ విధింస్తున్నామని కోర్టు తెలిపింది. వివరాల్లోకి వెళితే... గిరిజన సంక్షేమ శాఖ పరిధిలో నిజామాబాద్ పట్టణంలో ఒక నిర్మాణ పనిని, గాజుల రామారంలో జువెనైల్ బాయిస్ హాస్టల్ నిర్మాణపనులను బొడుకం గంగన్న అనే లైసెన్స్డ్ కాంట్రాక్టర్ చేపట్టారు. వాటికి సంబంధించిన బిల్లుల చెల్లింపుల విషయమై కాంట్రాక్టర్‌ను ఆ శాఖ ఇంజనీరింగ్ విభాగం ఇన్చార్జ్ సూపరింటెండెంట్ కె.జగజ్యోతి లంచం డిమాండ్ చేశారు. ఈ మేరకు కాంట్రాక్టర్ నుంచి రూ.84 వేల లంచం తీసుకుంటుండగా సోమవారం హైదరాబాద్‌లోని దామోదరం సంజీవయ్య సంక్షేమ(డీఎస్ఎస్) భవన్లో జగజ్యోతిని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అనంతరం ఆమె ఇంట్లో సోదాలు నిర్వహించగా రూ.65 లక్షల నగదు, రెండున్నర కిలోల బంగారం లభ్యమైనట్లు అధికారులు తెలిపారు. కార్యాలయంలోనూ కొన్ని కీలకపత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఈఈ స్థాయి అధికారి అయిన జగజ్యోతి ఇన్‌ఛార్జి హోదాలో ఎస్ఈ బాధ్యతలూ నిర్వర్తిస్తుండటం గమనార్హం. చదవండి: ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ జ్యోతి అరెస్ట్ -
ఎన్టీపీసీలో ఇంజనీర్ ఉద్యోగాలు.. నెలకు 60 వేల జీతం
నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్టీపీసీ).. వివిధ విభాగాల్లో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం పోస్టుల సంఖ్య: 15 ► పోస్టుల వివరాలు: ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (హైడ్రో) మెకానికల్–05, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్(హైడ్రో) సివిల్–10. ► ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్(హైడ్రో) మెకానికల్: అర్హత: కనీసం 60 శాతం మార్కులతో మెకానికల్ ఇంజనీరింగ్‌లో బీఈ/బీటెక్ ఉత్తీర్ణులవ్వాలి. వయసు: 35ఏళ్లు మించకూడదు. జీతం: నెలకు రూ.60,000 చెల్లిస్తారు. (మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) ► ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్(హైడ్రో) సివిల్: అర్హత: కనీసం 60 శాతం మార్కులతో సివిల్ ఇంజనీరింగ్‌లో బీఈ/బీటెక్ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పని అనుభవం ఉండాలి. వయసు: 35 ఏళ్లు మించకూడదు. జీతం: నెలకు రూ.60,000 చెల్లిస్తారు. ► ఎంపిక విధానం: ఆన్లైన్ స్క్రీనింగ్/షార్ట్‌లిస్టింగ్/సెలక్షన్ టెస్ట్ ఆధారంగా ఎంపికచేస్తారు. ► దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ► ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 30.11.2021 ► వెబ్సైట్: ntpc.co.in -
ఏసీబీకి చిక్కిన సంక్షేమ శాఖ ఈఈ
నల్లగొండ: సాంఘీక సంక్షేమ శాఖలో ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్‌గా పని చేస్తున్న ఎ. నాగశేషు ఓ కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకుంటూ సోమవారం ఏసీబీ అధికారులకు చిక్కాడు. ముందస్తు సమాచారంతో కార్యాలయానికి వచ్చిన ఏసీబీ అధికారులు.. నాగశేషు కాంట్రాక్టర్ నుంచి రూ. 27 వేలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అదనపు సమాచారం కోసం విచారణ చేపడుతున్నారు. -
ఏసీబీ వలలో నీటిపారుదల శాఖ ఇంజినీర్
తిరుపతి: బిల్లు పాస్ చేసేందుకు కాంట్రాక్టర్ నుంచి మామూళ్లు తీసుకుంటున్న నీటిపారుదల శాఖ ఇంజినీర్‌ను మంగళవారం ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. చిత్తూరు జిల్లా ఎర్రవాడపాలెంకు చెందిన గిరిబాబు ఇరిగేషన్ శాఖలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీరుగా పని చేస్తున్నారు. నీటిపారుదల శాఖలో మురళీ మోహన్ కాంట్రాక్టర్‌గా ఉన్నారు. ఇరిగేషన్ శాఖలో జరిగిన ఓ పనికి బిల్లు పాస్ చేయాల్సిందిగా ఇంజినీర్ గిరిబాబును కాంట్రాక్టర్ కోరారు. అందుకు పెద్ద మొత్తంలో డబ్బలు డిమాండ్ చేశాడు. లంచం ఇవ్వకుంటే ఏ పనులు రాకుండా చేస్తానని బెదిరించాడు. చేసేది ఏమీ లేక కాంట్రాక్టర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. మంగళవారం మధ్యాహ్నం తిరుపతి మ్యూజిక్ రోడ్డులో కాంట్రాక్టర్ నుంచి ఇంజినీర్ లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. -
భాగవతం
‘పలికెడిది భాగవతమట.. పలికించెడివాడు రామభద్రుండట నే బలికిన భవహరమగునట.. పలికెద, వేరొండు గాథ బలుకగనేలా?’ అంటూ పోతన వ్యాసభాగవతాన్ని తెనుగిస్తే.. వి.సాంబశివరావు అనే కృష్ణ భక్తుడు ఆ కృతిని కంప్యూటర్లో భద్రపరచి యువతరానికి అందించాడు. ఆ కథేంటంటే.. విద్యుత్‌సౌధలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌గా 2007లో రిటైరయ్యారు వి.సాంబశివరావు. పదవీ విరమణ పొందిన వెంటనే భాగవతాన్ని సాంకేతిక ఒరవడిలో ఒదిగే ప్రయత్నానికి పూనుకున్నారు. పోతన భాగవతంలోని మొత్తం తొమ్మిదివేల పద్నాలుగు పద్యాలను.. వాటి టీకా, తాత్పర్యం, వ్యాకరణం, ఛందస్సు.. ఇలా సమస్త సమాచారాన్ని రెండు విభాగాలుగా తెలుగు భాగవతం. ఓఆర్జీ పేరుతో పొందుపరిచారు. మొదటి విభాగం గణన అధ్యాయం. ఎన్ని పద్యాలున్నాయి? ఉత్పలమాల, చంపకమాల, తేటగీతి.. ఇలా ఒక్కో ఛందస్సులో ఎన్నేసి పద్యాలున్నాయో వివరాలుంటాయి. పద్యాలను గణ విభజన, యతి ప్రాసలు తెలిసేలా పొందుపరిచారు. ఇక రెండో విభాగం విశ్లేషణ. ఇందులో కావ్యానికి సంబంధించిన విశ్లేషణ ఉంటుంది. దీనిని పివర్ట్ టేబుల్ (చిన్న చిన్న పట్టికలుగా) సహాయంతో.. యూనీకోడ్లో అందించారు. అంతేకాదు.. పద్యాలు ఎలా ఉచ్ఛరించాలో తెలియడం కోసం మొత్తం 9,014 పద్యాలు శ్రావ్యమైన కంఠంతో స్వరబద్ధం చేసి ఉన్నాయి. కంప్యూటర్లో ఓనమాలు తెలియని తాను భాగవతాన్ని వెబ్సైట్లో పొందుపర్చడం.. ఓ పరిశోధనాత్మక ప్రయాసగా అభివర్ణిస్తారు సాంబశివరావు. అఆలు దిద్ది.. ఆరుపదుల వయసులో సాంబశివరావు కంప్యూటర్‌తో కుస్తీ మొదలుపెట్టారు. కీబోర్డ్‌లో అఆలు మొదలు.. ఎమ్మెస్ ఆఫీస్ టూల్స్ వరకూ అన్నీ ఔపోసన పట్టారు. రోజుకు పన్నెండు గంటలు కష్టపడ్డారు. ఈ సమయమంతా.. ఆయన వేళ్లు, కళ్లు, మెదడు అన్నీ.. కీబోర్డ్ మీదే ఉండేవి. తెలుగుభాగవతం.ఓఆర్జీ వెబ్సైట్ నిర్మాణ, నిర్వహణలో మాత్రం దిలీప్, ఉమామహేశ్ అనే ఇద్దరు యువకులు సహకారం అందించారు. పద్యాలను రాగయుక్తంగా ఆలపించి రికార్డు చేసింది వెంకట కణాద. ఈ-భాగవతం వెబ్సైట్లోనే కాదు ఆన్‌డ్రాయిడ్ యాప్స్‌గా కూడా అందుబాటులో ఉంది. దీనికి సాంబశివరావు అబ్బాయి సహాయపడ్డాడు. ఈ వెబ్‌సైట్‌ను భాగవతానికి పూర్తి రిఫరెన్స్‌గా మార్చాలని వ్యాసుడు రాసిన మూల భాగవతంలోని 18 వేల శ్లోకాలు, పోతనకు సంబంధించిన వివరాలనూ ఇందులో పొందుపర్చారు. పాఠకులు ఎవరు? ‘యువతరం లక్ష్యంగా దీన్ని ప్రారంభించాను. ఈతరం గంటలకు గంటలు కూర్చొని పుస్తకాలు చదవలేరు. అదే ఆన్లైన్లో మాత్రం బ్రహ్మాండంగా చదివేస్తారు. నా అంచనా తప్పలేదు. ఈ వెబ్సైట్ విజిట్ చేస్తున్న వాళ్లంతా 35 ఏళ్లలోపు వారే. అంతెందుకు ఈ వెబ్సైట్లో అప్లోడ్ చేస్తున్న సమాచార క్వాలిటీని చెక్ చేస్తున్నదీ యువతే. అమెరికాలో ఉంటున్న ఓ అమ్మాయి ప్రూఫ్ చూస్తుంటుంది’ అని అంటారాయన. ఈ వెబ్సైట్ నిర్మాణంలో పాలుపంచుకున్న వారు తెలుగు, భాగవతంపై భక్తితోనే పని చేశారు. అంతా ఉచిత సేవే. ఈ వెబ్సైట్లో అడ్వర్టయిజ్మెంట్స్కి చోటు లేదు. సిద్ధంగా మరెన్నో.. భాగవతమే కాదు పోతన ఇతర రచనలైన వీరభద్ర విజయము, నారాయణ శతకం, భోగినీదండకం కూడా యూనీకోడ్లో సిద్ధంగా ఉన్నాయి. ‘ఇవే కాక ఇతర పుస్తకాలనూ పెట్టాలని ఆశ. ఇప్పుడు రోజుకి ఎనిమిది గంటలకన్నా ఎక్కువ కూర్చోలేకపోతున్నాను. ఈ పనిని ఇంకాస్త ముందెందుకు ప్రారంభించలేకపోయానా అనిపిస్తోంది’ అంటారు సాంబశివరావు. ముగింపు సంస్కృతిని కాపాడటంలో సాహిత్యం పాత్ర గొప్పది. అలాంటి సాహిత్య పఠనాన్ని ఈ తరం మరిచిపోయింది అన్న అపోహను దూరం చేస్తోంది తెలుగుభాగవతం.ఓఆర్జీ. సాంకేతిక సొబగులతో ఏదిచ్చినా అందుకుంటుందని రుజువు చేస్తోంది. ..:: సరస్వతి రమ అసలీ ఆలోచన ఎలా వచ్చిందంటే..? ‘భాగవతంలో సృష్టి నుంచి ప్రళయం వరకూ అన్నీ ఉంటాయి. కథలు, వర్ణనలు, ఛందస్సు, మేనేజ్మెంట్ పాఠాలు.. ఇలా ఈ కావ్యంలో లేనివి లేవు. అందుకే భాగవతం అంటే ఇష్టం.. కృష్ణుడు అంటే భక్తి. ఈ వెబ్సైట్ నిర్మాణానికి స్ఫూర్తి ఇవే. ఆరో తరగతి పూర్తయిన తర్వాత అనారోగ్య కారణాల వల్ల ఏడాది చదువుకు అంతరాయం ఏర్పడింది. మా ఇంటి పక్కన ఓ ఆచారి గారు ఉండేవారు. ఆయన ఇంట్లో బోలెడన్ని పుస్తకాలు ఉండేవి. ఈ ఏడాదిలో అవన్నీ చదివేశాను. సాహిత్యం మీద ఆసక్తి ఏర్పడటానికి అదే కారణం. ఈ వెబ్సైట్ నిర్వహణకు ప్రేరణ కూడా అదే. భక్తి, భాష, సంస్కృతి, చరిత్రను చెప్పడమే ఈ వెబ్సైట్ లక్ష్యం’ అని చెబుతారు సాంబశివరావు. అలా పాడాను.. నేను చార్టెడ్ అకౌంటెంట్ని. చిన్నప్పటి నుంచి మా మామ్మ పాడిన భాగవత పద్యాలు, నాన్న సరిదిద్దిన పొరపాట్లే సాహిత్యాభిలాషకు కారణాలు. సాంబశివరావుగారి వెబ్‌సైట్‌ను విజిట్ చేసినప్పుడు కింద ఎక్కడో ఆయన నంబర్ కనిపించింది. ఫోన్ చేశాను. అలా పరిచయం. ఆపై స్నేహితులమయ్యాం. ఈ పద్యాలకు ఆడియో ఉంటే బాగుంటుందని సూచించాను. ఆయన సరేనన్నారు. చాలామంది సింగర్స్‌ను అడిగాం. కుదరలేదు. ‘మీరు పాడండి’ అన్నారాయన. మొదట ప్రథమ స్కంధంలోని పద్యాలు పాడాను. నా స్వరం ఆయనకు నచ్చడంతో దాదాపు తొమ్మిది వేల పద్యాలూ నేనే పాడాను. ఈ పద్యాలన్నీ ఇంట్లో సోనీ రికార్డర్ ముందు కూర్చుని రికార్డు చేసినవే. - వెంకట కణాద (పద్యాల గాయకుడు) భాషా‘ఛందము’.. మా పెద్దనాన్న మిరియాల రామకృష్ణారావు బాలసాహిత్యంలో దిట్ట. శ్రీశ్రీ సాహిత్యంపై రీసెర్చ్ చేశారు. ఆయన ప్రభావంతో పుస్తకాలు చదవడం అలవాటైంది. విప్రోలో పని చేస్తున్నాను. తెలుగు సాహిత్యం మీద అభిమానంతో ‘ఛందము’ అనే సాఫ్ట్‌వేర్‌ను డెవలప్చేశాను. దీంట్లో ఏ పద్యాన్ని వేసినా గణ విభజన చేసి అది ఏ ఛందస్సులో ఉందో చెప్తుంది. తప్పులున్నా పట్టేస్తుంది. ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా సాంబశివరావు పరిచయం అయ్యారు. ఈ సాఫ్ట్వేర్ ద్వారా పన్నెండు వందల పద్యాలను కరెక్ట్ చేసి ఈ-భాగవతంలో పెట్టాం. - దిలీప్ (వెబ్సైట్ డిజైనింగ్ సహాయకుడు) తెలుగులోనూ ఉండాలని.. విస్సెన్ ఇన్ఫోటెక్’లో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాను. తెలుగు తప్ప ఇతర భారతీయ భాషలన్నిటిలోనూ భారత, భాగవతాలను తర్జుమా చేసిన వెబ్సైట్లు ఉన్నాయి. సాంబశివరావు చేస్తున్న ప్రయత్నం తెలిసి ఆనందం వేసింది. టెక్నిక ల్గా నాకు చేతనైన సాయం అందించాను. అప్లోడ్కి కావల్సిన సాయం చేశా. వేదాలను తెలుగులోకి తేవాలనేది భవిష్యత్ ప్రణాళిక. - ఉమామహేశ్(వెబ్సైట్ డిజైనింగ్ సహాయకుడు) -
లక్షలు వదిలి.. లక్ష్యం దిశగా కదిలి
నేపథ్యం పుట్టింది పెరిగింది హైదరాబాద్‌లోనే. నాన్న పాతూరి శ్రీనివాసరావు ఆర్టీసీలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్. అమ్మ మంజుల గైనకాలజిస్ట్. తమ్ముడు శివ సాత్విక్ ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. స్ఫూర్తి అమ్మా, నాన్నలిద్దరూ ఉన్నత విద్యావంతులు కావడంతో వారే స్ఫూర్తిగా నిలిచారు. కెరీర్ విషయంలో కావల్సినంత స్వేచ్ఛనిచ్చారు. చిన్నప్పటి నుంచి ఐఐటీ వంటి ప్రతిష్టాత్మక ఇన్స్టిట్యూట్లలో చదవాలని పట్టుదలగా ఉండేది. దానికి తగ్గట్టే ఐఐటీ-ఖరగ్‌పూర్‌లో బీటెక్ (ఈఈసీఈ) విభాగంలో సీటు లభించింది. ఐఐటీలో టాపర్: ఐఐటీ-ఖరగ్‌పూర్‌లో టాపర్‌గా నిలవడం చాలా సంతోషానిచ్చింది. కాకపోతే అందరూ భావించినట్లు గంటల తరబడి పుస్తకాలతో కుస్తీ పట్టలేదు. ఏరోజు పాఠాలను ఆ రోజే పునశ్చరణ చేసేవాణ్ని. సబ్జెక్ట్‌ను కష్టపడికాకుండా ఇష్టంతో చదివే వాణ్ని. దాంతో ప్రిపరేషన్లో ఎప్పుడూ ఇబ్బంది ఎదురు కాలేదు. మా బ్రాంచ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ (ఈఈసీఈ) నుంచి 120 మందికి నలుగురు మాత్రమే 92.8 శాతం స్కోర్ సాధించారు. మొత్తం మీద యూనివర్సిటీ తరపున ఇన్స్టిట్యూట్ సిల్వర్ మెడల్ అందుకున్నవారిలో నేనొక్కడినే తెలుగు వాణ్ని. ఉద్యోగం వదిలి క్యాంపస్ సెలెక్షన్లో చెన్నైలోని ఈబే వెబ్సైట్ సంస్థ రూ. 22 లక్షల వేతనంతో ఉద్యోగాన్ని ఆఫర్ చేసింది. మా బ్రాంచ్‌లో నాదే అత్యధిక పే-ప్యాకేజీ కూడా. ఆ జీతంతో జీవితాన్ని సరదాగా గడిపేయొచ్చు. కానీ పీహెచ్డీ చేయడం నా ముందున్న లక్ష్యం. అందుకే ఉద్యోగ అవకాశాన్ని వదులుకున్నాను. నాలుగు వర్సిటీలకు: పీహెచ్డీ కొసం ఏడు యూనివర్సిటీలకు దరఖాస్తు చేయగా అమెరికాలోని నాలుగు యూనివర్సిటీలకు ఎంపికయ్యాను. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, యూనివర్సిటీ ఆఫ్ మిచిగాన్, జార్జియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, పర్డ్యూ వర్సిటీలో పీహెచ్డీ కోర్సులో ప్రవేశం లభించింది. వీటిలో యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో పీహెచ్డీ చేస్తాను. ఈఈసీఈనే ఎందుకంటే.. ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ (ఈఈసీఈ)లో పరి శోధనలు చేయడానికి పరిధి ఎక్కువగా ఉంటుంది. భవిష్యత అంతా ఈ రంగానిదే. అందుకనే ఈ విభాగాన్ని ఎంచుకున్నాను. నూతన ఆవిష్కరణలు: పీహెచ్‌డీలో భాగంగా ఎలక్ట్రికల్ సిగ్నల్ అండ్ ఇమేజింగ్ ప్రాసెసింగ్‌లో సరికొత్త ఆవిష్కరణలు చేయడానికి ప్రయత్నిస్తా. నేరస్థులు తమను గుర్తుపట్టకుండా ముసుగులు ధరిస్తుంటారు. అలాంటి సమయంలో వారిని సులువుగా గుర్తించడం, అలాగే మాటతీరు మార్చినా అసలు వ్యక్తి ఎవరో తెలుసుకునే విధంగా నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడానికి కృషి చేస్తా. అంతేకాకుండా సొంతంగా సాఫ్ట్వేర్ బిజినెస్ ప్రారంభించి పది మందికి ఉపాధి కల్పించాలన్నదే ఆశయం. అకడెమిక్ ప్రొఫైల్ 10వ తరగతి: 560/600 మార్కులు ఇంటర్మీడియెట్: 963/1000 మార్కులు ఐఐటీ జేఈఈ: 383వ ర్యాంక్ (ఓపెన్ కేటగిరీ) - చైతన్య వంపుగాని, గుడివాడ అర్బన్, కృష్ణా జిల్లా.