భాగవతం | v. sambasiva rao introduced bhagavatam with the name of ORG | Sakshi
Sakshi News home page

భాగవతం

Published Mon, Nov 3 2014 11:07 PM | Last Updated on Sat, Sep 2 2017 3:49 PM

భాగవతం

భాగవతం

‘పలికెడిది భాగవతమట..
పలికించెడివాడు రామభద్రుండట నే
బలికిన భవహరమగునట.. పలికెద,
వేరొండు గాథ బలుకగనేలా?’


అంటూ పోతన వ్యాసభాగవతాన్ని
తెనుగిస్తే.. వి.సాంబశివరావు అనే కృష్ణ భక్తుడు
ఆ కృతిని కంప్యూటర్‌లో భద్రపరచి
యువతరానికి అందించాడు. ఆ కథేంటంటే..

 
విద్యుత్‌సౌధలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌గా 2007లో రిటైరయ్యారు వి.సాంబశివరావు. పదవీ విరమణ పొందిన వెంటనే భాగవతాన్ని సాంకేతిక ఒరవడిలో ఒదిగే ప్రయత్నానికి పూనుకున్నారు. పోతన భాగవతంలోని మొత్తం తొమ్మిదివేల పద్నాలుగు పద్యాలను.. వాటి టీకా, తాత్పర్యం, వ్యాకరణం, ఛందస్సు.. ఇలా సమస్త సమాచారాన్ని రెండు విభాగాలుగా తెలుగు భాగవతం. ఓఆర్‌జీ పేరుతో పొందుపరిచారు.
 
మొదటి విభాగం గణన అధ్యాయం. ఎన్ని పద్యాలున్నాయి? ఉత్పలమాల, చంపకమాల, తేటగీతి.. ఇలా ఒక్కో ఛందస్సులో ఎన్నేసి పద్యాలున్నాయో వివరాలుంటాయి. పద్యాలను గణ విభజన, యతి ప్రాసలు తెలిసేలా పొందుపరిచారు. ఇక రెండో విభాగం విశ్లేషణ. ఇందులో కావ్యానికి సంబంధించిన విశ్లేషణ ఉంటుంది. దీనిని పివర్ట్ టేబుల్ (చిన్న చిన్న పట్టికలుగా) సహాయంతో.. యూనీకోడ్‌లో అందించారు. అంతేకాదు.. పద్యాలు ఎలా ఉచ్ఛరించాలో తెలియడం కోసం మొత్తం 9,014 పద్యాలు శ్రావ్యమైన కంఠంతో స్వరబద్ధం చేసి ఉన్నాయి. కంప్యూటర్‌లో ఓనమాలు తెలియని తాను భాగవతాన్ని వెబ్‌సైట్‌లో పొందుపర్చడం.. ఓ పరిశోధనాత్మక ప్రయాసగా అభివర్ణిస్తారు సాంబశివరావు.
 
అఆలు దిద్ది..
ఆరుపదుల వయసులో సాంబశివరావు కంప్యూటర్‌తో కుస్తీ మొదలుపెట్టారు. కీబోర్డ్‌లో అఆలు మొదలు.. ఎమ్మెస్ ఆఫీస్ టూల్స్ వరకూ అన్నీ ఔపోసన పట్టారు. రోజుకు పన్నెండు గంటలు కష్టపడ్డారు. ఈ సమయమంతా.. ఆయన వేళ్లు, కళ్లు, మెదడు అన్నీ.. కీబోర్డ్ మీదే ఉండేవి. తెలుగుభాగవతం.ఓఆర్‌జీ వెబ్‌సైట్ నిర్మాణ, నిర్వహణలో మాత్రం దిలీప్, ఉమామహేశ్ అనే ఇద్దరు యువకులు సహకారం అందించారు. పద్యాలను రాగయుక్తంగా ఆలపించి రికార్డు చేసింది వెంకట కణాద. ఈ-భాగవతం వెబ్‌సైట్‌లోనే కాదు ఆన్‌డ్రాయిడ్ యాప్స్‌గా కూడా అందుబాటులో ఉంది. దీనికి సాంబశివరావు అబ్బాయి సహాయపడ్డాడు. ఈ వెబ్‌సైట్‌ను భాగవతానికి పూర్తి రిఫరెన్స్‌గా మార్చాలని వ్యాసుడు రాసిన మూల భాగవతంలోని 18 వేల శ్లోకాలు, పోతనకు సంబంధించిన వివరాలనూ ఇందులో పొందుపర్చారు.
 
పాఠకులు ఎవరు?
‘యువతరం లక్ష్యంగా దీన్ని ప్రారంభించాను. ఈతరం గంటలకు గంటలు కూర్చొని పుస్తకాలు చదవలేరు. అదే ఆన్‌లైన్‌లో మాత్రం బ్రహ్మాండంగా చదివేస్తారు. నా అంచనా తప్పలేదు. ఈ వెబ్‌సైట్ విజిట్ చేస్తున్న వాళ్లంతా 35 ఏళ్లలోపు వారే. అంతెందుకు ఈ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేస్తున్న సమాచార క్వాలిటీని చెక్ చేస్తున్నదీ యువతే. అమెరికాలో ఉంటున్న ఓ అమ్మాయి ప్రూఫ్ చూస్తుంటుంది’ అని అంటారాయన. ఈ వెబ్‌సైట్ నిర్మాణంలో పాలుపంచుకున్న వారు తెలుగు, భాగవతంపై భక్తితోనే పని చేశారు. అంతా ఉచిత సేవే. ఈ వెబ్‌సైట్‌లో అడ్వర్టయిజ్‌మెంట్స్‌కి చోటు లేదు.
 
సిద్ధంగా మరెన్నో..
భాగవతమే కాదు పోతన ఇతర రచనలైన వీరభద్ర విజయము, నారాయణ శతకం, భోగినీదండకం కూడా యూనీకోడ్‌లో సిద్ధంగా ఉన్నాయి. ‘ఇవే కాక ఇతర పుస్తకాలనూ పెట్టాలని ఆశ. ఇప్పుడు రోజుకి ఎనిమిది గంటలకన్నా ఎక్కువ కూర్చోలేకపోతున్నాను. ఈ పనిని ఇంకాస్త ముందెందుకు ప్రారంభించలేకపోయానా అనిపిస్తోంది’ అంటారు సాంబశివరావు.
 
ముగింపు
సంస్కృతిని కాపాడటంలో సాహిత్యం పాత్ర గొప్పది. అలాంటి సాహిత్య పఠనాన్ని ఈ తరం మరిచిపోయింది అన్న అపోహను దూరం చేస్తోంది తెలుగుభాగవతం.ఓఆర్‌జీ. సాంకేతిక సొబగులతో ఏదిచ్చినా అందుకుంటుందని రుజువు చేస్తోంది.
 
..:: సరస్వతి రమ

అసలీ ఆలోచన ఎలా వచ్చిందంటే..?
‘భాగవతంలో సృష్టి నుంచి ప్రళయం వరకూ అన్నీ ఉంటాయి. కథలు, వర్ణనలు, ఛందస్సు, మేనేజ్‌మెంట్ పాఠాలు.. ఇలా ఈ కావ్యంలో లేనివి లేవు. అందుకే భాగవతం అంటే ఇష్టం.. కృష్ణుడు అంటే భక్తి. ఈ వెబ్‌సైట్ నిర్మాణానికి స్ఫూర్తి ఇవే. ఆరో తరగతి పూర్తయిన తర్వాత అనారోగ్య కారణాల వల్ల ఏడాది చదువుకు అంతరాయం ఏర్పడింది. మా ఇంటి పక్కన ఓ ఆచారి గారు ఉండేవారు. ఆయన ఇంట్లో బోలెడన్ని పుస్తకాలు ఉండేవి. ఈ ఏడాదిలో అవన్నీ చదివేశాను. సాహిత్యం మీద ఆసక్తి ఏర్పడటానికి అదే కారణం. ఈ వెబ్‌సైట్ నిర్వహణకు ప్రేరణ కూడా అదే. భక్తి, భాష, సంస్కృతి, చరిత్రను చెప్పడమే ఈ వెబ్‌సైట్ లక్ష్యం’ అని చెబుతారు సాంబశివరావు.

అలా పాడాను..
నేను చార్టెడ్ అకౌంటెంట్‌ని. చిన్నప్పటి నుంచి మా మామ్మ పాడిన భాగవత పద్యాలు, నాన్న సరిదిద్దిన పొరపాట్లే సాహిత్యాభిలాషకు కారణాలు. సాంబశివరావుగారి వెబ్‌సైట్‌ను విజిట్ చేసినప్పుడు కింద ఎక్కడో ఆయన నంబర్ కనిపించింది. ఫోన్ చేశాను. అలా పరిచయం. ఆపై స్నేహితులమయ్యాం. ఈ పద్యాలకు ఆడియో ఉంటే బాగుంటుందని సూచించాను. ఆయన సరేనన్నారు. చాలామంది సింగర్స్‌ను అడిగాం. కుదరలేదు. ‘మీరు పాడండి’ అన్నారాయన. మొదట ప్రథమ స్కంధంలోని పద్యాలు పాడాను. నా స్వరం ఆయనకు నచ్చడంతో దాదాపు తొమ్మిది వేల పద్యాలూ నేనే పాడాను. ఈ పద్యాలన్నీ ఇంట్లో సోనీ రికార్డర్ ముందు కూర్చుని రికార్డు చేసినవే.
- వెంకట కణాద (పద్యాల గాయకుడు)

భాషా‘ఛందము’..
మా పెద్దనాన్న మిరియాల రామకృష్ణారావు బాలసాహిత్యంలో దిట్ట. శ్రీశ్రీ సాహిత్యంపై రీసెర్చ్ చేశారు. ఆయన ప్రభావంతో పుస్తకాలు చదవడం అలవాటైంది. విప్రోలో పని చేస్తున్నాను. తెలుగు సాహిత్యం మీద అభిమానంతో ‘ఛందము’ అనే సాఫ్ట్‌వేర్‌ను డెవలప్‌చేశాను. దీంట్లో ఏ పద్యాన్ని వేసినా గణ విభజన చేసి అది ఏ ఛందస్సులో ఉందో చెప్తుంది. తప్పులున్నా పట్టేస్తుంది. ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా సాంబశివరావు పరిచయం అయ్యారు. ఈ సాఫ్ట్‌వేర్ ద్వారా పన్నెండు వందల పద్యాలను కరెక్ట్ చేసి ఈ-భాగవతంలో పెట్టాం.
- దిలీప్ (వెబ్‌సైట్ డిజైనింగ్ సహాయకుడు)

తెలుగులోనూ ఉండాలని..
విస్సెన్ ఇన్ఫోటెక్’లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాను. తెలుగు తప్ప ఇతర భారతీయ భాషలన్నిటిలోనూ భారత, భాగవతాలను తర్జుమా చేసిన వెబ్‌సైట్లు ఉన్నాయి. సాంబశివరావు చేస్తున్న ప్రయత్నం తెలిసి ఆనందం వేసింది. టెక్నిక ల్‌గా నాకు చేతనైన సాయం
 అందించాను. అప్‌లోడ్‌కి కావల్సిన సాయం చేశా. వేదాలను తెలుగులోకి తేవాలనేది భవిష్యత్
 ప్రణాళిక.
 - ఉమామహేశ్(వెబ్‌సైట్ డిజైనింగ్ సహాయకుడు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement