సాక్షి, హైదరాబాద్: నాంపల్లిలోని నీటి పారుదల శాఖలో ఏసీబీ సోదాలు ముగిశాయి. నాంపల్లిలో హైడ్రామా తర్వాత నలుగురు నిందితులను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం, వారిని నాంపల్లి ఏసీబీ కార్యాలయానికి తరలించారు.
వివరాల ప్రకారం.. నాంపల్లిలో రెడ్ హిల్స్‌లోని నీటి పారుదల శాఖ ఆఫీసులో గురువారం రాత్రి ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో రంగారెడ్డి జిల్లా ఈఈ భన్సీలాల్, ఏఈలు కార్తీక్, నికేష్‌లు లంచం తీసుకుంటుండగా అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అదే సమయంలో, లంచం డిమాండ్‌కు సంబంధించి కీలక అధికారి పరారీ కావడంతో అర్ధరాత్రి వరకు హైడ్రామా కొనసాగింది. రాత్రి నాలుగు గంటల పాటు శ్రమించి నాలుగో వ్యక్తిని అధికారులు పట్టుకున్నారు.
కాగా, ఒక వ్యక్తికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఆమోదం కోసం నీటిపారుదల శాఖ రంగారెడ్డి జిల్లా ఎస్‌ఈ కార్యాలయ అధికారులను సంప్రదించాడు. ఇక్కడ ఈఈగా పనిచేస్తున్న భన్సీలాల్, ఏఈలు కార్తీక్, నికేశ్ రూ.2.5 లక్షలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు తెలిసింది. దీనికి అంగీకరించిన సదరు వ్యక్తి ముందుగా రూ.1.5లక్షలు ఇచ్చేందుకు అధికారులు డీల్ కుదుర్చుకున్నారు. మరో లక్ష తర్వాత చెల్లించాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఇదంతా గురువారం సాయంత్రం ఈఈ ఆఫీసులో జరగాలని ప్లాన్ చేసుకున్నారు. ఈలోపే బాధితులు ఏసీబీకి ఫిర్యాదు చేయడంతో అధికారులు దాడులు జరిపి వారి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఇక, దీనికి సంబంధించిన వివరాలను అధికారులు కాసేపట్లో ప్రకటించే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment