సాక్షి, హైదరాబాద్: కవిగా, సాహితీవేత్తగా, తెలంగాణగడ్డ మీద నుంచి పోతనామాత్యులు చేకూర్చిన సాహితీశోభ తెలుగు సాహిత్యచరిత్రలో అజరామరమైనదని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. ఈ మేరకు పోతన జయంతి సందర్భంగా ఒక ప్రకటన విడుదల చేశారు. పోతన జన్మస్థలమైన వరంగల్ జిల్లా పాలకుర్తి మండలం బమ్మెర గ్రామంలో ఆయన జ్ఞాపకార్థం పలు అభివృద్ధి కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే చేపట్టిందని తెలిపారు.
భవిష్యత్తులో బమ్మెర ప్రాంతాన్ని సాహితీ, ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దుతామని, ఆ మహాకవి స్ఫూర్తితో రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ భాషకు, కవిత్వానికి, ఆధ్యాత్మిక ధోరణులకు పెద్దపీట వేస్తున్నదని కేసీఆర్ అన్నారు. ‘బాల రసాల సాల నవ పల్లవ కోమల కావ్యకన్యకన్ ’’అంటూ ఆత్మాభిమానం కలిగిన కవిగా, తన కావ్యాన్ని రాజులకు కాకుండా భగవంతుడైన శ్రీరాముడికే అంకితమిచ్చి, కవి ఆత్మగౌరవాన్ని చాటిన తెలంగాణ ప్రజాకవి పోతన అని కేసీఆర్ కొనియాడారు.
పోతన అందించిన పద్య గుళికలు భక్తి మాధుర్యాన్ని, భాషా పాండిత్య రసాన్ని పంచుతాయని పేర్కొన్నారు. భాగవతం ద్వారా అలతి అలతి పదాలతో శ్రీకృష్ణ తత్వాన్ని సామాన్యులకు చేర్చిన పోతన ప్రజాకవి అని సీఎం అన్నారు. కర్ణపేయమై తన్మయత్వంలో ముంచెత్తడం పోతన విలక్షణశైలి అని పేర్కొన్నారు. పోతన పద్యాన్ని వినని తెలుగువారుండరంటే అతిశయోక్తి కాదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment