Potana
-
ఆధ్యాత్మిక, సాహితీ కేంద్రంగా బమ్మెర: సీఎం
సాక్షి, హైదరాబాద్: కవిగా, సాహితీవేత్తగా, తెలంగాణగడ్డ మీద నుంచి పోతనామాత్యులు చేకూర్చిన సాహితీశోభ తెలుగు సాహిత్యచరిత్రలో అజరామరమైనదని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. ఈ మేరకు పోతన జయంతి సందర్భంగా ఒక ప్రకటన విడుదల చేశారు. పోతన జన్మస్థలమైన వరంగల్ జిల్లా పాలకుర్తి మండలం బమ్మెర గ్రామంలో ఆయన జ్ఞాపకార్థం పలు అభివృద్ధి కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే చేపట్టిందని తెలిపారు. భవిష్యత్తులో బమ్మెర ప్రాంతాన్ని సాహితీ, ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దుతామని, ఆ మహాకవి స్ఫూర్తితో రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ భాషకు, కవిత్వానికి, ఆధ్యాత్మిక ధోరణులకు పెద్దపీట వేస్తున్నదని కేసీఆర్ అన్నారు. ‘బాల రసాల సాల నవ పల్లవ కోమల కావ్యకన్యకన్ ’’అంటూ ఆత్మాభిమానం కలిగిన కవిగా, తన కావ్యాన్ని రాజులకు కాకుండా భగవంతుడైన శ్రీరాముడికే అంకితమిచ్చి, కవి ఆత్మగౌరవాన్ని చాటిన తెలంగాణ ప్రజాకవి పోతన అని కేసీఆర్ కొనియాడారు. పోతన అందించిన పద్య గుళికలు భక్తి మాధుర్యాన్ని, భాషా పాండిత్య రసాన్ని పంచుతాయని పేర్కొన్నారు. భాగవతం ద్వారా అలతి అలతి పదాలతో శ్రీకృష్ణ తత్వాన్ని సామాన్యులకు చేర్చిన పోతన ప్రజాకవి అని సీఎం అన్నారు. కర్ణపేయమై తన్మయత్వంలో ముంచెత్తడం పోతన విలక్షణశైలి అని పేర్కొన్నారు. పోతన పద్యాన్ని వినని తెలుగువారుండరంటే అతిశయోక్తి కాదన్నారు. -
పోతన చిరునవ్వు
‘‘ఇదేమిటి బావా ఇలా రాశావు? ఆయుధాలూ పరివారమూ లేకుండా శ్రీమహావిష్ణువు అక్కడికి వెళ్లి గజేంద్రుడిని ఎలా రక్షించాలనుకున్నాడు’’ అన్నాడు ఎగతాళిగా. పోతన చిరునవ్వు నవ్వి ఊరుకున్నాడు. ఒకరోజు శ్రీనాథుడు తన కూతురిని వెంట పెట్టుకొని మందీ మార్బలంతో కలిసి పోతన యింటికి వచ్చాడు. ఆ సమయంలో పోతన.. భాగవతంలో గజేంద్ర మో„ ఘట్టాన్ని రాస్తున్నాడు. శ్రీనాథుడు.. ‘‘ఏమి రాస్తున్నావు బావా?’’ అంటూనే తాళపత్రాన్ని చేతిలోకి తీసుకొని పైకి గట్టిగా చదివాడు. సిరికిన్ జెప్పడు శంఖ చక్ర యుగమున్ చేదోయి సంధింపడే / పరివారంబును జీరడ భ్రగ పతిన్ బన్నింపడాకర్ణి కాం / తర ధమ్మిల్లము చక్కనొత్తడు వివాద ప్రోద్ధిత శ్రీ కుచో / పరి చేలాంచలమైన వీడడు గజ ప్రాణావ నోత్సాహియై .. .. అని చదివి గట్టిగా నవ్వాడు. ‘‘ఇదేమిటి బావా ఇలా రాశావు? ఆయుధాలూ పరివారమూ లేకుండా శ్రీమహావిష్ణువు అక్కడికి వెళ్లి గజేంద్రుడిని ఎలా రక్షించాలనుకున్నాడు’’ అన్నాడు ఎగతాళిగా. పోతన చిరునవ్వు నవ్వి ఊరుకున్నాడు. తర్వాత అంతా భోజనాలకు కూచున్నారు. సగం భోజన మయ్యాక పోతన కొడుకు పరిగెత్తు కుంటూ వచ్చి ‘‘మామయ్యా మీ కూతురు బావిలో పడిపోయింది’’ అని చెప్పాడు. శ్రీనాథుడు ‘అయ్యో’ అంటూ గబుక్కున లేచి ఎంగిలి చెయ్యి కూడా కడుక్కోకుండా పెరట్లోకి పరుగెత్తుకొని వెళ్లి బావి లోకి తొంగి చూస్తూ ‘‘అమ్మా సుశీలా సుశీలా’’ అని పిలుస్తున్నాడు. అంతలోనే చెట్టు చాటునుంచి ‘‘ఏమిటి నాన్నా’’ అంటూ పరిగెత్తుకొచ్చింది సుశీల. ‘‘ఇదేమి సరసం బావా?’’ అన్నాడు శ్రీనాథుడు కోపంగా. అప్పుడు పోతన ‘‘బావా! నీ కూతురు బావిలో పడిందని వినగానే అలాగే చేయి కూడా కడుక్కోకుండా, నీ వెంట వచ్చిన నీ సేవకులను పిలవకుండా, తాడూ బొక్కెన లేకుండా నీవెలా పరిగెత్తుకొని వచ్చావు? పిల్లనెలా కాపాడుదామనుకున్నావు? నీ బిడ్డ పట్ల నీకెంత ఆతురత ఉన్నదో భక్తులు ఆపదలో వుంటే భగవంతుడు కూడా అంతే. ఆయన దేవుడు కనుక ఆయన వెంట శంఖమూ, చక్రమూ గద పరివారమూ అంతా వచ్చారు. ఆ చక్రంతో మొసలిని ఖండించి గజేంద్రుడిని రక్షించాడు. భగవంతుడికి తన నిజమైన భక్తుల పట్ల అంత ఆర్తి వుంటుంది’’ అన్నాడు పోతన. అప్పుడు శ్రీనాథుడు పోతనను క్షమించమని అడిగాడు. – డి.వి.ఆర్. -
నేత్రపర్వం.. సీతారాముల కల్యాణం
ఒంటిమిట్ట కోదండరామాలయంలో సీతారాముల కల్యాణోత్సవం మంగళవారం కన్నుల పండువగా జరిగింది. వేకువజామున ఆలయంలోని మూలవిరాట్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. నూతన పట్టువస్త్రాలు, వివిధరకాల పుష్పాలతో స్వాములవారిని సుందరంగా అలంకరించారు. ఆలయ మధ్యమండపంలో సీతారాముల విగ్రహాలను సుందరంగా అలంకరించిన కల్యాణవేదికపై కొలువుదీర్చారు. వైభవంగా కల్యాణం నిర్వహించారు. సుండుపల్లి నుంచి పాదయాత్రగా వచ్చిన భక్తులు చేపట్టిన భజన కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కోదండరామాలయంలో పోతన సాహితీ ఆధ్వర్యంలో పెద్దఎత్తున పద్యరచన పోటీలను నిర్వహించారు. జిల్లాలోని వివిధ పాఠశాలలనుంచి దాదాపు 1500 మంది విద్యార్థులు ఈ పోటీలలో పాల్గొన్నారు. భక్తులకు అన్నదానం చేశారు. -
సాంస్కృతిక కేంద్రాలే నివాళులు
తెలుగు భాషా, సంస్కృతులకు కొత్త చూపును, రూపును అందించిన సోమన్న, పోతనలు తెలంగాణ తత్త్వాన్ని తీర్చిదిద్దిన యుగ పురుషులు. వారి జన్మ స్థలాలనుఅభివృద్ధి పరడడానికి ప్రభుత్వం ముందుకు రావడం హర్షణీయం. పాశ్చాత్య దేశాలు తమ చారిత్రక, సాంస్కృతిక రంగాలను మలుపు తిప్పిన మహా పురుషుల స్మారక స్థలాలను భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయకంగా నిలిచేలా అభివృద్ధి పరిచాయి. మన దేశంలో తెలంగాణ ప్రాంతానికి ప్రత్యేక చరిత్ర, సంస్కృతులున్నాయి. ఇక్కడి సంస్కృతి ప్రజాస్వామ్య స్ఫూర్తిని ప్రతిబింబిస్తుంది. రాచరిక వ్యవస్థ కొనసాగిన కాలంలోనూ ప్రజలు దాన్ని ప్రతిఘటించారు. ఒక జాతి చరిత్ర, సంస్కృతులు ఒక్క రోజులో నేర్పితేనో, నేర్చుకుంటేనో వచ్చేవి కావు. అవి ఒక తరం నుంచి మరో తరానికి సంక్రమిస్తాయి. తెలంగాణలో ప్రజా సంస్కృతికి నాంది పలికిన యుగకర్తలు పాల్కురికి సోమన, బమ్మెర పోతన. సమైక్య రాష్ట్రంలో ఇక్కడి కవులకు, కళాకారులకు సముచిత స్థానం దక్కలేదన్నది వాస్తవం. పైగా మన సాహితీ వేత్తలకు తమ ప్రతిభ, పాటవాల పట్ల ఉదాసీనత కూడా ఉంది. ప్రచార ఆర్భాటాలకు దూరంగా ఉండటమూ ఈ సంస్కృతి ప్రత్యేకతే కావచ్చు. తెలుగు భాషా, సంస్కృతులకు ఒక కొత్త చూపును, రూపును అందించిన సోమన్న, పోతనలు తెలంగాణ తత్త్వాన్ని తీర్చిదిద్దిన యుగ పురుషులు. ఎక్కడో కన్నడ ప్రాంతంలో వ్యాపించిన వీర శైవాన్ని ఆలంబనగా చేసుకొని, నన్నయ నుంచి సంప్రదాయబద్ధంగా వస్తున్న మార్గ కవితని కాదని దేశీ కవిత్వానికి పట్టం కట్టిన ప్రజాకవి పాల్కురికి సోమనాథుడు. కుల, మత, ప్రాంత, లింగ వివక్షతలకు అతీతంగా సాహిత్య సృజన కావించి సామాజిక వర్గాలకు ముఖ్యంగా అట్టడుగు, బడుగు బలహీన వర్గాలకు సాహిత్య స్థాయిని, స్థానాన్ని కల్పించిన వైతాళికుడాయన. సోమన, పోతనలకు మధ్య 200 సంవత్సరాల అంతరం ఉన్నా, భావజాలంలో అదే గుణాత్మకమైన మార్పు సాగడం విశేషం. సింగ భూపాలుని ఉదంతాన్ని దృష్టిలో పెట్టుకొని రాచరిక వ్యవస్థను నిరసిస్తూ ‘ఇమ్మనుజేశ్వరాధముల్’ , ‘ధనమధాందుల కొలువేల తాపసులకు’ అనటం పోతనకే చెల్లింది. నన్నయ ఇత్యాధి కవులు రాజాస్థానాలలో ఉంటే సోమన, పోతనలు ప్రజాస్థానంలో నిలిచారు. అదే వీరి ప్రత్యేకత. వందల ఏళ్ళ క్రితమే ఇంతటి మహత్తరమైన భావజాలాన్ని తమ సాహిత్యం ద్వారా ప్రజలకు అందించిన మహాకవులను వారి జన్మ స్థలాలను విస్మరించి, వారి జయంతులను తూతూ మంత్రంగా ఇంత వరకు పట్టణాలలోనే జరిపారు. 1994లో నాటి తెలుగు విశ్వవిద్యాలయ ఉపాధ్యక్షులు ఆచార్య పేర్వారం జగన్నాథం వ్యక్తిగత చొరవ తీసుకొని పాలకుర్తిలో రెండు రోజులపాటు సోమనాథుని అర్ధ శత జయంతి ఉత్సవాలను నిర్వహించారు. మహాకవుల జన్మ స్థలాలైన పాలకుర్తి, బమ్మెరలను చూడాలని ఎంతోమంది రాష్ట్ర, రాష్ట్రేతర ప్రాంతాల నుంచి సాహితీ ప్రియులు, పరిశోధకులు, ధార్మికులు వచ్చి ఆ గ్రామాలలో నెలకొన్న దయనీయ పరిస్థితులను చూసి చలించి పోతున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం వాటి అభివృద్ధి దిశగా ముందడుగు వేయడం హర్షణీయం. ప్రధానంగా ఈ కర్తవ్యాన్ని పూర్తి చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కె.వి. రమణాచారిపై కేసీఆర్ ఈ బాధ్యత మోపారు. సాహిత్య సాంస్కృతిక రంగాలంటే నిత్యం తపించే రమణాచారి కృషితో సోమన, పోతన నడయాడిన ప్రదేశాలు గొప్ప సాహిత్య సాంస్కృతిక కేంద్రాలుగా మారుతాయి. పవిత్ర స్థలాలను పర్యాటక కేంద్రాలుగా మార్చడం కన్నా, వాటిని పరిశోధనా కేంద్రాలుగా మార్చడం మంచిది. భాషా, సంస్కృతుల పరిరక్షణకు, పరిశోధనకు అవి నెలవులు కావాలి. తెలంగాణ భాష, చరిత్ర, సంస్కృతులు ప్రతిబింబించేలా అక్కడ ఒక మ్యూజియంలను ఏర్పాటు చేయాలి. నాటి నుంచి నేటి వరకు వచ్చిన సాహిత్యాన్ని ఆ ప్రాంతాలలోనే గ్రంథాలయాలను ఏర్పాటు చేసి, వాటిలో భద్రపరచాలి. ప్రపంచీకరణ నేపథ్యంలో మరుగున పడిపోయిన మన కళారూపాలను వెలికి తీసేందుకు ఆడిటోరియంలను కూడా నిర్మించాలి. ఆ గ్రామాల్లోనీ మహాకవుల స్మారక చిహ్నాలను పరిరక్షించాలి. కేంద్ర ప్రభుత్వం తెలుగు భాషకు ప్రాచీన హోదాను కల్పించిన నేపథ్యంలో తెలంగాణ కవుల రచనల్లోని విశేషాలను విశ్లేషించాలి. పాలకుర్తి, బమ్మెర గ్రామాలను సాంస్కృతిక కేంద్రాలుగా తీర్చిదిద్దాలి. అప్పుడే మన భాషను, సంస్కృతిని సంరక్షించిన వారిమవుతాం. కడియం శ్రీహరి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక కమిటీ ఏర్పాటు చేసింది. తెలంగాణ సాంస్కృతిక వారసత్వ సంపదను పరిరక్షించాలనే రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశానికి అభినందనలు. లండన్ పక్కన్నే ఉన్న షేక్స్పియర్ జన్మ స్థలాన్ని ఒక పుణ్య స్థలంగా చూస్తారు. చైనాలో, అనేక లాటిన్ అమెరికన్ దేశాలలో కవులను సాంస్కృతిక రాయబారులుగా చూస్తారు. మా వూరు పక్కననే బమ్మెర ఉంటుంది. కాబట్టి ఆనాటి మండలి చైర్మన్ చక్రపాణిని బమ్మెర తీసుకుపోయాను. బమ్మెర పోతన సమాధి దగ్గరకు కాలిబాటన నడచుకుంటూ పోయాం. ఆ మట్టిని చక్రపాణి తన సంచిలో వేసుకుని గర్వంగా వెళ్లాడు. ఇతర దేశాలలో మహాకవుల సమాధులను గొప్పగా చూసుకుంటారు. అలాంటి సత్కార్యాలకు ఆర్థిక వ్యవస్థ దోహదం చేస్తుంది. తెలంగాణ ప్రజలు ఇక్కడి కవులను తమ గుండెల్లో దాచుకున్నారు. ఇప్పటికీ బమ్మెరలోని గ్రామ బావిని పోతన బావి అనే ప్రజలు పిలుచుకుంటారు. ప్రజల నోటి నుంచి వచ్చే ఆ మాటే ఆ మహాకవికి నిత్య సన్మానం. పాల్కురికి సోమనాధుడు రాసిన కావ్యం తను నివసించే గుట్టకు, ప్రకృతికే అంకితమిచ్చారు. అందుకే ఇప్పుడది పాలకుర్తి సోమనాథుని గుట్ట అయ్యింది. వాల్మీకి కావ్యం అంకితమిచ్చింది వల్మిడికి అంటారు. బమ్మెర పోతన పుట్టిన ప్రదేశాన్ని పర్యాటక కేంద్రంగానే గాక సాంస్కృతిక కేంద్రంగా మార్చాలి. అక్కడ ఒక పరిశోధనా కేంద్రాన్ని నెలకొల్పాలి. - వ్యాసకర్త ప్రముఖ విద్యావేత్త శాసనమండలి మాజీ సభ్యులు చుక్కారామయ్య -
జ్ఞానం కోసం జపించాలి
శ్లోకనీతి పోతన రచించిన భాగవతంలోని కొన్ని పద్యాలనైనా నేర్చుకోవడం తెలుగువారి కనీస కర్తవ్యం. పద్యాలను కేవలం కంఠోపాఠంగా కాకుండా, మనసుకి అర్థం చేసుకుని, అందులోని అంతరార్థాన్ని గ్రహించి అప్పుడు ఆ పద్యం నేర్చుకుంటే, అది చిరకాలం మన మదిలో పదిలంగా నిలిచిపోతుంది. పద్యం-2 క్షోణి తలంబునన్ నుదురు సోకగ మ్రొక్కి నుతింతు సైకత శ్రోణికి జంచరీకచయ సుందరవేణికి రక్షితామర శ్రేణికి దోయజాత భవ చిత్త వశీకరైణె క వాణికిన్ వాణికి నక్షదామ శుకవారిజ పుస్తక రమ్య పాణికిన్ వ్యాఖ్యాన భావం... సరస్వతీదేవి అవిశ్రాంతంగా... సుకుమారములైన తన నాలుగు చేతులలో క్రమంగా జపమాల, చిలుక, పద్మం, పుస్తకం ధరించి దర్శనమిస్తుంది. సరస్వతీదేవి చదువుల తల్లి. అందువల్లే చదువుకు, విజ్ఞానానికి ప్రతీకగా తన హస్తాలలోని జపమాల ద్వారా... నిరంతరం జ్ఞానాన్ని సముపార్జిస్తూ, మృదువాక్కులు జపిస్తూ ఉండాలని చూపుతోంది. ఇక చిలుక... గురువులు చెప్పిన విద్యను చిలుక వలె పలకాలని అంటే తీయగా, మృదుమధురంగా పలకాలని సూచిస్తోంది, పద్మం వలె వికసిత వదనాలతో స్వచ్ఛమైన హృదయంతో పుస్తకాన్ని చేతబూని జ్ఞానాన్ని సముపార్జించినప్పుడు వారు సరస్వతీదేవిలాగే జ్ఞాన సంపన్నులవుతారని అమ్మవారి అలంకారాలు బోధిస్తున్నాయి. మంచికి మారుపేరయిన దేవతలను రక్షించటం ద్వారా, ఎంతటివారైనా మంచికి అన్యాయం జరుగుతుంటే తప్పక వారిని రక్షించాలని తెలుపుతోంది. తన ఇంపైన మృదుమధుర వచనాల ద్వారా... సత్యాన్నే పలకమని సూచిస్తోన్న సరస్వతీమాతకు సాష్టాంగపడి నమస్కరిస్తున్నాను అన్నాడు పోతన ఈ పద్యంలో. - డా. పురాణపండ వైజయంతి -
సత్ప్రవర్తనకు సాక్షి... గణపతి
శ్లోకనీతి పోతన రచించిన భాగవతంలోని కొన్ని పద్యాలనైనా నేర్చుకోవడం తెలుగువారి కనీస కర్తవ్యం. పద్యాలను కేవలం కంఠోపాఠంగా కాకుండా, మనసుకి అర్థం చేసుకుని, అందులోని అంతరార్థాన్ని గ్రహించి అప్పుడు ఆ పద్యం నేర్చుకుంటే, అది చిరకాలం మన మదిలో పదిలంగా నిలిచిపోతుంది. పద్యం-1 ఆదరమొప్ప మ్రొక్కిడుదు నద్రిసుతాహృదయానురాగసం పాదికి దోషభేదికి బ్రపన్న వినోదికి విఘ్నవల్లి కా చ్ఛేదికి మంజువాదికి నశేష జగజ్జన నందవేదికిన్ మోదక ఖాదికిన్ సమదమూషక సాదికి సుప్రసాదికిన్ వ్యాఖ్యాన భావం... శ్రీమద్భాగవత ఇష్టదేవతా ప్రార్థనలో బమ్మెర పోతన వినాయకుడిని స్తుతిస్తూ... పర్వతరాజ కుమార్తె అయిన తన తల్లి పార్వతీదేవిని ఆనందింపచేశాడు. కల్మషాలను హరించడంలో దక్షత, క ష్టాలలో ఉన్నవారి బాధలను తీర్చడంలో నేర్పరితనం, లతలాగ అల్లుకుపోయిన ఆశ్రీతుల విఘ్నాలను ఛేదించటంలో మేటి, తీయనైన సున్నితమైన మాటలతో సకల జనులకు ఆనందం కలిగించడం వినాయకుడికి వెన్నతో పెట్టిన విద్య. ఎవరు ఏది పెట్టినా, వాటిని ప్రేమగా ఆరగించాలే కాని, ఆ వంటకంలోని లోపాలను ఎత్తిచూపుతూ, ఆహారపదార్థాలను వృథా చేయకూడదనే అంశాన్ని స్వయంగా, భక్తులు తనకు ప్రేమగా నివేదించిన ఉండ్రాళ్ల ద్వారా చూపాడు. చిన్నప్రాణిని సైతం ఆదరంగా చూడాలని మూషికాన్ని తన వాహనంగా చేసుకుని ఆదర్శంగా నిలిచాడు. తల్లిదండ్రులకు ప్రదక్షిణ చేసి ముక్కోటి నదులలో స్నానం చేసిన పుణ్యం సంపాదించి, తల్లిదండ్రులే ప్రత్యక్షదైవాలని నిరూపించిన గణపతిని పూజించడం ద్వారా సత్ప్రవర్తన అలవరచుకోవచ్చని భాగవతంలోని ఈ పద్యం బోధిస్తోంది. - డా. పురాణపండ వైజయంతి -
పోతన.. టైటానిక్.. చలికాలం
నెగళ్ల కాలం ఇది. పగళ్లు చాలా చిన్నవైన కాలం. మనుషులు దగ్గరకు కూడే కాలం ఇది. అవయవాలను ఒకదానికి ఒకటి దగ్గరకు చేర్చుకునే కాలం. తేనీటి కాలం ఇది. ప్రాతఃవేళ పొగలు గక్కే వేడినీటిని కోరే కాలం. నిదుర కాలం ఇది. పొడవు రాత్రుళ్లలో మనసు తీరా ముసుగు తన్నే కాలం. చలికాలం. గిలిగిలకాలం. పంటిని పన్ను తాకుతూ కటకటమని తాళం చరిచే కాలం. గీతాంజలి అంటే మొన్నటి దెయ్యం గీతాంజలి కాదు. ఊటీ గీతాంజలి. గిరిజ గీతాంజలి. లేచిపోదాం అన్న మొనగాడా ఎక్కడున్నావ్ అని కాలిని నేలకు తాటించే గీతాంజలి. మణిరత్నం గీతాంజలి. చలిని చూస్తే ఆ సినిమాలో చూడాలి. పచ్చగా ఫ్రెష్‌గా కనిపిస్తున్న కూరగాయల మార్కెట్లో అమ్మాయిని అబ్బాయి పలకరించడం అబ్బాయిని అమ్మాయి గిలిగింతలు పెట్టడం... నాన్ ఏసి థియేటర్లో కూడా స్వెటర్ వేసుకోబుద్ధయ్యే సినిమా. స్వెటర్ చలి నుంచి కాపాడే ఒక వస్త్రం. కాని తెలుగు సినిమా హీరోకు మాత్రం అదో ఫ్యాషన్ స్టేట్మెంట్. తెల్లప్యాంటు పైన రంగురంగుల స్వెటర్ తోడు మఫ్లర్... ఛళ్లున మండే ఎండలో కూడా అవి వేసుకొని మైదానాలలో పాడితేనే అతడికి అందం. ప్రేక్షకులకు చందం. కాశ్మీర్ శాలువాకు ఏం అదృష్టం పట్టిందో మనకు తెలుసు. శరీరానికి వెచ్చదనాన్ని హుందాదనాన్ని ఇవ్వాల్సిన ఆ శాలువ తెలుగు సినిమా బారిన ఒక కేన్సర్ సింబల్ అయ్యింది. లవ్ ఫెయిల్యూర్‌కు లోగో అయ్యింది. నల్లబట్టలు కట్టుకొని గడ్డం పెంచుకొని తెల్ల చెప్పుల్లోకి మారి పైన శాలువా కప్పారా ఏదో ప్రమాదం ముంచుకొచ్చినట్టే లెక్క. ఏదో సినిమాలో ‘ఏప్రిల్ మేలలో పాపల్లేరుగా కాంతి లేదుగా’ అనే పాట ఉంది. ఏప్రిల్ మేలలో కాలేజీలకు సెలవులట. అమ్మాయిలు రారట. కనుక కాంతి లేదుట. ఆమాటకొస్తే డిసెంబర్ జనవరిలో మాత్రం ఏ ఆనందం ఉంది. వంటి నిండా దుస్తులతో ఒకటికి రెండు పై వస్త్రాలతో ఒబేస్ అయినట్టుగా కనిపించే అమ్మాయిలే కదా ఎటు చూసినా. కాని ఒకందుకు ఇదీ మంచిదే. కుదురైన కనుముక్కు తీరేదో కనిపెట్టడానికి ఇదే అదను. కాని చరిత్రలో ఒక చలి ప్రమాదం చాలా విషాదభరితమైనది. మృత్యుశీతలం లేదా శీతల మృత్యువు... అలాంటిదే ‘టైటానిక్’ ఓడ ప్రమాదంలో సంభవించింది. 1912 ఏప్రిల్ పద్నాలుగున అట్లాంటిక్ సముద్రాన్ని దాటుతున్నట్టు ఆ నీళ్లు మృత్యు శీతలంగా ఉన్నాయి. కెరటాలు ఎనిమిది అడుగుల ఎత్తు వరకు ఎగిసి పడుతూ ఓడతో తలపడుతూ ఉన్నాయి. సాయంత్రానికి సముద్రం సద్దుమణిగింది. అతి శీతల గాలులు వీయడం మొదలుపెట్టాయి. అంతకు ముందు రోజు నుంచే ఆ వైపు వెళ్లిన ఓడలు మంచు కొండలు కనపడుతున్నాయి జాగ్రత్త అని టైటానిక్‌కు సందేశాలు పంపుతున్నాయి. కాని టైటానిక్ ఫుల్ స్పీడ్‌తోనే ప్రయాణించింది. రాత్రి 11.40 గంటలకు టైటానిక్ మంచుకొండను ఢీకొట్టింది. నౌక చెల్లాచెదురయ్యింది. 20 లైఫ్ బోట్లు ఉన్నాయి. కాని 700 మందే వాటి వల్ల ప్రాణాలు కాపాడుకోగలిగారు. వాటి సామర్థ్యం 1,178. మిగిలిన వాళ్లంతా నీటి పాలయ్యారు. లైఫ్ జాకెట్స్ ఉన్నాయి. ఈదే శక్తి ఉంది. కాని నీళ్లు శీతలం. గాలి శీతలం. రాత్రి శీతలం. మృత్యువు శీతలం. ఒక గొప్ప ప్రయాణాన్ని మొదలెట్టిన ప్రయాణికులు 1500 మంది ఆ కాళరాత్రి చలికి వణుకుతూ వణుకుతూ మృత్యువు ముందు చేతులు ముకుళించారు. సాహిత్యం కూడా చలిని చాలా తీవ్రంగా చూసింది. చలికి భయపడింది. చలితో తలపడింది. ప్రఖ్యాత రష్యన్ రచయిత గొగోల్ రాసిన ‘ది ఓవర్ కోట్’ ప్రఖ్యాతం. ఒక చిన్న ఆఫీస్‌లో క్లర్క్‌గా పని చేసే చిల్లర జీతగాడు జీవితాంతం ఒకే కలను కంటాడు. అదేమిటంటే కొత్త ఓవర్ కోట్‌ను కొనుక్కోవడం. దారుణమైన మంచుకురిసే ప్రాంతంలో ఉన్నవారికి అంతకు మించిన ధైర్యం ఉండదు. కాని అతని దగ్గర డబ్బులు ఉండవు. నెలల తరబడి పోగేసి పోగేసి అతి కష్టం మీద ఒక ఓవర్‌కోట్ కొనుక్కుంటాడు. ఎంతో ఆనందిస్తాడు. ఆ సంతోషంలో కన్నీరు కారుస్తాడు. ఏం లాభం? అతని కంటే దైన్య స్థితిలో ఉన్న కొందరు జులాయిలు అతణ్ణి కొట్టి ఆ ఓవర్‌కోట్‌ను లాక్కుని వెళతారు. మానవత్వం మానవత్వం అని మాటలు చెప్పడం కాదు. భయంకరమైన చలి ఇద్దరు మనుషులు ఒక రగ్గు ఉన్నప్పుడే ఒక మనిషిలోని మానవత్వం బయటపడుతుంది. తెలుగులో ఒక లలితమైన కథ ఉంది. మధురాంతకం రాజారాం రాశారు. దాని పేరు ‘కమ్మతెమ్మెర’. ఒక జంటకు కొత్తగా పెళ్లవుతుంది. కాని సుముహూర్తం లేని కారణాన మొదటిరాత్రికి ఎడం ఉంటుంది. ఈలోపు పెళ్లికొడుకు ఊరెళ్లి కొన్నాళ్లు పనులు చూసుకొని అత్తగారి ఇంటికి వస్తాడు. పెళ్లికూతురిని చూడాలని ఒకటే తహతహ. ఆమె మాత్రం సిగ్గుతో అతడికి కనపడకుండా దాక్కుంటూ ఉంటుంది. చేతులు గాజులు పాదాల నడక ఇవే కనిపిస్తూ ఉంటాయి. పెళ్లికొడుకు నిరాశపడతాడు. రాత్రికి అలసిపోయి అరుగు మీద ఏర్పాటు చేసిన పక్కలో నిదుర పోతాడు. మంచి చలి కాలం. అర్ధరాత్రి చలి వేస్తూ ఉంటుంది. నిద్రలోనే ఒణుకు తెలుస్తూ ఉంటుంది. అప్పుడు మృదువైన అందెల రవళితో సున్నితమైన గాజుల సవ్వడితో ఎవరో వచ్చి ఆ పెళ్లి కొడుక్కి వెచ్చటి దుప్పటి కప్పి తుర్రుమంటారు. నిండా కప్పుకున్నా సరే ఒక కమ్మతెమ్మెర తాకినట్టయ్యి పెళ్లికొడుకు పులకింతలు పోతాడు. ఆ జ్ఞాపకం ఇక నూరేళ్లు శాశ్వతం. ‘అహములు సన్నములయ్యె దహనము హితమయ్యె, దీర్ఘదశలయ్యె నిశల్; బహు శీతోపేతంబై ‘యుహు... హుహు’యని వడకె లోకముర్వీనాథా!’ అని పోతన చలి మీద పద్యం చెప్పాడు. హిందీ సినీ కవి ఒకడు ఇలాంటివి లెక్క చేయకుండా మంచి చలికాలంలో ‘ఠండే ఠండే పానీసే నహానా చాహియే’ అని పాటందుకున్నాడు. ‘చలితో నీవు చెలితో నేను చేసే అల్లరులూ’ అని మన తెలుగు కవి వంత కలిశాడు. ఏం పాడుకున్నా ఇవ్వడంలో ఆనందం తెలిపే కాలం ఇది. ఉన్ని వస్త్రాలే ఎందుకు? స్నేహమయమైన వెచ్చని కౌగిలి కూడా ఈ చలికి ఒక ధన్యతను ఇస్తుంది. - సాక్షి ఫ్యామిలీ ఆ నీళ్లు మృత్యు శీతలంగా ఉన్నాయి. కెరటాలు ఎనిమిది అడుగుల ఎత్తు వరకు ఎగిసి పడుతూ ఓడతో తలపడుతూ ఉన్నాయి. సాయంత్రానికి సముద్రం సద్దుమణిగింది. అతి శీతల గాలులు వీయడం మొదలుపెట్టాయి. -
ప్రసన్న కవి - స్వేచ్ఛా జీవి
- ఆగస్టు 10న శంకరంబాడి సుందరాచారి జయంతి ‘‘పోతన లాంటి భక్తుడూ తపస్వీ కావ్యం రాస్తే దానికొక విలువ ఉంటుంది. నా బోటి అల్పులు పిచ్చికుంకలు రాస్తే ఎవరు చదువుతారయ్యా’’ అంటూ తన 600 పద్యాల కాగితాల్ని చించేశాడు సుందరాచారి. తిరుపతి. ఆ రోజు శ్రావణ పూర్ణిమ. ఒక శ్రోత్రియ కుటుంబం. ఇంటికి ఆలస్యంగా వచ్చిన కొడుకును తండ్రి, ‘‘నీకు జందెమెందుకురా? శుద్ధ దండగ’’ అని తిట్టాడు. కొడుక్కి ఒళ్లుమండింది. జందేన్ని పుటుక్కున తెంచి, ఇంటి వసారాలో పడుకొన్న కుక్క మెడలో వేశాడు. ఇక ఈ ఇంటికీ నాకూ సంబంధం లేదని తెగేసి చెప్పాడు. విసవిసా నడుచుకుంటూ రైల్వేస్టేషన్ చేరాడు. అక్కడ ప్రయాణీకుల పెట్టే బేడా మోసి, వచ్చిన కూలీ డబ్బులతో తిండీ తిప్పలూ చూసుకోనారంభించాడు. ‘‘నేనున్న ఊళ్లో నాకిదేం అప్రతిష్ట?’’ అని తండ్రి మళ్లీ తిట్టాడు. అంతే! అక్కడినుంచీ చోళంగిపురం వెళ్లి హోటలు సప్లయరుగా చేరాడు. *** కంచి. మధ్యాహ్నపుటెండ. నడకనాపి ఒక శ్రీవైష్ణవుల ఇంటి ముందు ఆగాడొక యువకుడు. లోపలికి వెళ్లి దాహంగా ఉందన్నాడు. ఆ ఇంటివాళ్లు చెంబెడు నీళ్లిచ్చారు. ఎందుకో ఆ ఇంటి స్త్రీలు బాధపడుతున్నారని గమనించి, యజమానిని కారణమడిగాడు. ‘‘మా ఇంట్లో పెళ్లికెదిగిన అమ్మాయుంది. పేదరికం వల్ల పెళ్లి చేయలేకున్నాము’’. ‘‘మీకభ్యంతరం లేకపోతే నేనా అమ్మాయిని చూడవచ్చా?’’... ఇదే సంభాషణ! రెండు మూడు నిమిషాల తర్వాత ఒక అమ్మాయి తల్లి తీసుకురాగా దేవతలాగా ప్రత్యక్షమైంది. ‘‘అయ్యా! నేనే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను. ఒక వారం రోజుల్లో డబ్బు సర్దుకు వస్తాను’’ అని ఆ యువకుడు కంచి గరుడసేవను దర్శించి తిరుపతి చేరాడు. మేనమామని కలిసి విషయం చెప్పాడు. ఆయనిచ్చిన 500 రూపాయలతో ఏ శుభలేఖలూ ముద్రించకుండానే, ఏ ఆడంబరాలూ లేకుండానే బంధుమిత్రులు ఒక ఐదారుగురి సమక్షంలో పెళ్లి జరిగిపోయింది. **** ఆ బాలుడు, యువకుడి జీవితంలో ఇలాంటి సంఘటనలెన్నో! ఎవరతడు? బ్రతుకుని తృణప్రాయంగా తోసిరాజని స్వేచ్ఛా జీవిత సంచారం సాగించిన సర్వ స్వతంత్రుడు. తెలుగుతల్లి మోడలో వాడని మల్లెపూల దండ. ప్రసన్న కవి. ‘రాష్ట్ర’ కవి. తెలుగు బంకించంద్రుడు. అతడు శంకరంబాడి సుందరాచారి (10.8.1914 - 8.4.1977). బడిపిల్లల కోసం, సామాన్యుల కోసం కవిత్వం రాశాడు. వారినే నమ్ముకొని, వారికే అణాకి, రెండణాలకి పుస్తకాలు అమ్ముకొని జీవనం సాగించాడు. పద్నాలుగేళ్లకే ఛందోబద్ధ కవిత్వం. బుద్ధ గీత, ఏకలవ్యుడు, సుందర రామాయణం, సుందర భారతం, పేద కవి, స్వప్న సుందరుడు, అగ్నిపరీక్ష లాంటి కావ్యాలు రాశాడు. చిత్తూరు జిల్లాలో ఆయన్ని ఆహ్వానించని బడి లేదు. పద్యాలను ఆనంద భైరవి, కేదారం, ముఖారి, కౌదారగౌళ, రీతిగౌళ, శ్రీరాగాలు వేసి పాడేవాడు. త్యాగయ్య కీర్తనలంటే ఇష్టపడేవాడు. గంభీరంగానూ, హాస్యోక్తులతోనూ సాగే ఆయన ఉపన్యాసం వింటే ఎవరైనా ఆయనకి అభిమానులు అయిపోవలసిందే! అప్పటి లోక్‌సభ స్పీకరు శ్రీమాన్ అనంత శయనం అయ్యంగారికి స్వయానా మేనల్లుడు. తన ‘బుద్ధ గీత’ను నెహ్రూకి ఆంగ్లంలో వినిపించినవాడు. మండలి వెంకట కృష్ణారావు, కార్వేటి రాజా వంటి ప్రముఖులకెందరికో స్నేహితుడు. ఎవ్వరి సాంగత్యాన్ని ఎక్కడా వాడుకోలేదు. పట్టు జుబ్బాలు, ధోవతులతో తిరిగే సుందరాచారి చివరికి కోరాగుడ్డ జుబ్బాలు, చౌకబారు నాలుగు మూరల పంచెతో తన శరీరాన్ని కప్పుకొన్నాడు. సుందరాచారి ఆజన్మాంత స్నేహితుడు వై.కె.వి.ఎన్.ఆచార్య. శంకరంబాడి ఆశువుగా చెబుతూ ఉంటే అంతే వేగంగా వాటిని లిపిబద్ధం చేసేవాడీయన. ఆచార్య రాసిన ‘ప్రసన్నకవి సుందరాచారి - నేను’ పుస్తకంలో ఈ విశేషాలన్నీ ఉన్నాయి. తన జీవిత చరిత్రను, సాహిత్య కృషినీ గురించి ఒక పుస్తకం రాయమని కవి ఇతడిని కోరాడు. తన జీవితంలోని మంచినీ చెడునీ, దేన్నీ వదిలిపెట్టకుండా రాయమన్నాడు. దాదాపు 30 ఏండ్లు గడిచాయి. ఈ స్నేహితుడికి పక్షవాతం వచ్చింది. 85 ఏండ్లు వచ్చాయి. జీవితం చరమ దశకి చేరిందని తెలుసుకొన్నాడు. పుస్తకం పూర్తిచేయాలి. ఆ తరువాత తనకీ ప్రపంచంలో ఒక్క క్షణం కూడా ఆగాలనిపించటం లేదు. వణుకుతున్న చేతులతోనే రాశాడు వై.కె.వి.ఎన్. మిత్రుడి ప్రేమ అది. భాగవతం దశమ స్కందం ఆధారంగా సుందరాచారి చెబుతూ ఉంటే వై.కె.వి.ఎన్. ‘సుందర నంద నందనం’ రాస్తున్నాడు. 600 పద్యాలు పూర్తయ్యాయి. పద్యాలు బాగా వచ్చాయనుకొన్నారు. వై.కె.వి.ఎన్. ‘నల్లనివాడు, పద్మనయనంబులవాడు’ అని పోతన పద్యాలను పాడనారంభించాడు. కాసేపయ్యాక ‘‘ఇప్పటికిది నిలుపు. ఒక టీ సేవిద్దాం, తరువాత పోతన పద్యాల్ని చదువుదాం’’ అని సుందరాచారి అన్నాక, ఇద్దరూ లేచి వెళ్లి టీ తాగి వచ్చారు. ‘‘ఆ మహానుభావుడు గొప్ప భక్తుడురా. అతని జీవితం స్పటిక స్వచ్ఛమైనది. అలాంటి భక్తుడూ తపస్వీ కావ్యం రాస్తే దానికొక విలువ ఉంటుంది. నా బోటి అల్పులు పిచ్చికుంకలు రాస్తే ఎవరు చదువుతారయ్యా!’’ అంటూ తన 600 పద్యాల కాగితాల్ని చించేశాడు సుందరాచారి. ‘దీనబంధు’ చిత్రానికి మాటలూ పాటలూ సుందరాచారే. దర్శకుడు హెచ్.ఎం.రెడ్డి తేటతెలుగులో ఒక పడవ పాట రాయమన్నాడు. అప్పుడు రాసిందే ‘మా తెలుగు తల్లికి మల్లెపూదండ’. రెడ్డి మెచ్చుకొని యావత్కాలికమైన సాహిత్య విలువలున్న ఈ పాటను సినిమా పాటగా ఉపయోగించనన్నాడు. హెచ్.ఎం.వి. కంపెనీవారు ఒప్పుకొంటే తాను విడిగా పాడతానని టంగుటూరి సూర్యకుమారి అన్నది. సుందరాచారికి నూట పదహార్లు ఇచ్చి పాటను కొని సూర్యకుమారి చేత రికార్డు చేయించి ప్లేట్లు అమ్మితే యావదాంధ్రలో మారుమోగిపోయింది. కానీ పాట రాసింది సుందరాచారని ఎవరికీ తెలియదు. కొన్ని పాటల పుస్తకాల్లో ‘దేవులపల్లి’ అని రాశారు. సుందరాచారి అభ్యంతరం తెలిపితే కొంత నష్టపరిహారం ఇచ్చారు. ‘‘ఇప్పటికీ ఈ పాట జనాల్లోకి వెళ్లినంతగా నా పేరు వెళ్లలేదు. నేనే కర్తనని ఆంధ్రదేశంలో చాలామందికి తెలియదు. ఇదే నా దురదృష్టం’’ అని కవి బాధపడ్డాడు. ఈ పాటను ఏప్రిల్ 1975, హైదరాబాద్‌లో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభల్లో సూర్యకుమారి పాడినప్పుడు రచయిత అక్కడ లేడు. తాను హైదరాబాద్‌లోనే ఉన్నా వెళ్లలేని పరిస్థితి ఏమిటో? ఎందరో రాజకీయ నాయకులు, సినిమా కళాకారులు, లబ్ధ ప్రతిష్టులైన కవులు పాల్గొన్న ఆ సభలకి శంకరంబాడికి ఆహ్వానం ఉందో? లేదో? ఎవరికీ తెలియదు. జీవితం పొడవునా దురదృష్టం వెంటాడిన ప్రజాకవి శంకరంబాడి. సినిమాల్లో ఉన్నప్పుడు మద్యం అలవాటయ్యింది. అంతకుముందు నుంచే గఫర్ జూనియర్ బీడీలను ఇష్టంగా కాల్చేవాడు. తెలుగుతల్లి పాటను విని మండలి వెంకట కృష్ణారావు తన ఖరీదైన చేతి గడియారాన్ని బహుమతిగా ఇవ్వగా, దాన్ని అమ్ముకొని మరీ తాగాడు. అప్పటి జిల్లా కలెక్టర్ రాజాజీ సుందరాచారి పుస్తకాలనమ్మగా వచ్చిన వేయి రూపాయలనిస్తే, తెగ తాగి చిత్తూరులో గాంధీ విగ్రహం కింద పండుకొని ఉండగా, మొత్తం డబ్బు రౌడీలు లాక్కోగా చూస్తూ ఊరుకున్నాడు. దీపావళికో, సంక్రాంతికో సముద్రాల నాగయ్య ‘‘ఆచార్లూ! ఈ చీరెను నీ భార్యకిచ్చి కట్టుకోమను పండక్కు. ఆ పాకెట్టులో నీకు పంచె, ఉత్తరీయం కూడా ఉంది. నీవూ ధరించు’’ అని బస్టాండు వరకూ తన బంట్రోతును పంపితే, బంట్రోతు కొని యిచ్చిన టికెట్టును ఎవరికో అమ్మి, చీరెనూ పంచె, ఉత్తరీయాన్నీ అక్కడే విక్రయించి ఆ డబ్బుతో తాగుతూ తిరుపతిలోనే తిరుగుతూ ఉండిపోయాడు. శంకరంబాడి తనకు తాను ఇచ్చుకొన్న బిరుదు ‘మధుపాన మత్త మహాకవి’. ఆయన తన కవితలో భగవంతుణ్ని అడిగిన ప్రశ్న అప్పటి, ఇప్పటి చాలామంది కవులదీ, రచయితలదీ కూడా! ‘‘ఈ లోకమున నను ఏల సృష్టించితివి! సృష్టించి ఏ పనిని చేయ నియమించితివి?/ చిన్న బుచ్చక నాకు చెప్పరావా దొరా!/ ఈ చిన్న గుండెలో ఎన్ని గుండ్రాలురా/ ఈ లేత బుర్రలో ఎన్ని కంపాలురా/ వద్దురా ఈ బ్రతుకు వద్దురా దేవుడా!’’ - డా॥కాకుమాని శ్రీనివాసరావు ఫోన్: 8008070775 -
పోతన, పాల్కురికి ఉత్సవాలు
భాగవతం రచించిన బమ్మెర పోతన, తొలి తెనుగు విప్లవ కవి బసవ పురాణ గ్రంథకర్త పాల్కురికి సోమనాథుడి పేర్లతో ఉత్సవాలు నిర్విహ స్తామని తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు వరంగల్ సాక్షిగా ప్రకటించడం హర్షదాయకం. గత పాలకుల ఏలుబడిలో తెలంగాణ ప్రాంతానికి చెందిన కవులు, కళాకారులు, సాహితీవేత్తలు నిరాదరణకు గురయ్యారు. కనీసం తెలంగాణ ప్రాంతం ఇంతమంది ప్రజాకవులకు, పండితులకు, విద్వత్కవులకు జన్మని చ్చిందన్న ఎరుకను కూడా లేకుండా చేశారు. ఈ నేపథ్యంలో తెలంగాణ సంస్కృతికి ఆకరమైన ఇలాంటి మహనీయులను జ్ఞప్తికి తెస్తూ సాంస్కృతిక కార్యక్రమా లపై తెలంగాణ ప్రభుత్వం ఆసక్తి ప్రదర్శించడం ముదావహం. ఈ నేపథ్యంలో పోతన జన్మస్థలానికి ప్రాభవం తీసుకువస్తామని, ఆనాడు బమ్మెర పోతన దున్నిన నాలుగు ఎకరాల్లో స్మారకమందిరాన్ని నిర్మి స్తామని, రామాయణ మహాకావ్య సృష్టికర్త వాల్మీకి దేవస్థానం అభివృద్ధికి కూడా కృషి చేస్తానని ముఖ్యమంత్రి ప్రకటించాలి. దీంతో పాటు తెలంగాణ రైతులు, ప్రజలు తమ విముక్తి కోసం అరవైఏళ్ల క్రితం చేపట్టిన మహత్తర సాయుధ పోరాట చరిత్రను కూడా ప్రభుత్వం పాఠ్యాంశాలలో తప్పనిసరిగా చేర్చాలి. - దౌడ్ విజయకుమార్ పరకాల, వరంగల్ జిల్లా -
భాగవతం
‘పలికెడిది భాగవతమట.. పలికించెడివాడు రామభద్రుండట నే బలికిన భవహరమగునట.. పలికెద, వేరొండు గాథ బలుకగనేలా?’ అంటూ పోతన వ్యాసభాగవతాన్ని తెనుగిస్తే.. వి.సాంబశివరావు అనే కృష్ణ భక్తుడు ఆ కృతిని కంప్యూటర్లో భద్రపరచి యువతరానికి అందించాడు. ఆ కథేంటంటే.. విద్యుత్‌సౌధలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌గా 2007లో రిటైరయ్యారు వి.సాంబశివరావు. పదవీ విరమణ పొందిన వెంటనే భాగవతాన్ని సాంకేతిక ఒరవడిలో ఒదిగే ప్రయత్నానికి పూనుకున్నారు. పోతన భాగవతంలోని మొత్తం తొమ్మిదివేల పద్నాలుగు పద్యాలను.. వాటి టీకా, తాత్పర్యం, వ్యాకరణం, ఛందస్సు.. ఇలా సమస్త సమాచారాన్ని రెండు విభాగాలుగా తెలుగు భాగవతం. ఓఆర్జీ పేరుతో పొందుపరిచారు. మొదటి విభాగం గణన అధ్యాయం. ఎన్ని పద్యాలున్నాయి? ఉత్పలమాల, చంపకమాల, తేటగీతి.. ఇలా ఒక్కో ఛందస్సులో ఎన్నేసి పద్యాలున్నాయో వివరాలుంటాయి. పద్యాలను గణ విభజన, యతి ప్రాసలు తెలిసేలా పొందుపరిచారు. ఇక రెండో విభాగం విశ్లేషణ. ఇందులో కావ్యానికి సంబంధించిన విశ్లేషణ ఉంటుంది. దీనిని పివర్ట్ టేబుల్ (చిన్న చిన్న పట్టికలుగా) సహాయంతో.. యూనీకోడ్లో అందించారు. అంతేకాదు.. పద్యాలు ఎలా ఉచ్ఛరించాలో తెలియడం కోసం మొత్తం 9,014 పద్యాలు శ్రావ్యమైన కంఠంతో స్వరబద్ధం చేసి ఉన్నాయి. కంప్యూటర్లో ఓనమాలు తెలియని తాను భాగవతాన్ని వెబ్సైట్లో పొందుపర్చడం.. ఓ పరిశోధనాత్మక ప్రయాసగా అభివర్ణిస్తారు సాంబశివరావు. అఆలు దిద్ది.. ఆరుపదుల వయసులో సాంబశివరావు కంప్యూటర్‌తో కుస్తీ మొదలుపెట్టారు. కీబోర్డ్‌లో అఆలు మొదలు.. ఎమ్మెస్ ఆఫీస్ టూల్స్ వరకూ అన్నీ ఔపోసన పట్టారు. రోజుకు పన్నెండు గంటలు కష్టపడ్డారు. ఈ సమయమంతా.. ఆయన వేళ్లు, కళ్లు, మెదడు అన్నీ.. కీబోర్డ్ మీదే ఉండేవి. తెలుగుభాగవతం.ఓఆర్జీ వెబ్సైట్ నిర్మాణ, నిర్వహణలో మాత్రం దిలీప్, ఉమామహేశ్ అనే ఇద్దరు యువకులు సహకారం అందించారు. పద్యాలను రాగయుక్తంగా ఆలపించి రికార్డు చేసింది వెంకట కణాద. ఈ-భాగవతం వెబ్సైట్లోనే కాదు ఆన్‌డ్రాయిడ్ యాప్స్‌గా కూడా అందుబాటులో ఉంది. దీనికి సాంబశివరావు అబ్బాయి సహాయపడ్డాడు. ఈ వెబ్‌సైట్‌ను భాగవతానికి పూర్తి రిఫరెన్స్‌గా మార్చాలని వ్యాసుడు రాసిన మూల భాగవతంలోని 18 వేల శ్లోకాలు, పోతనకు సంబంధించిన వివరాలనూ ఇందులో పొందుపర్చారు. పాఠకులు ఎవరు? ‘యువతరం లక్ష్యంగా దీన్ని ప్రారంభించాను. ఈతరం గంటలకు గంటలు కూర్చొని పుస్తకాలు చదవలేరు. అదే ఆన్లైన్లో మాత్రం బ్రహ్మాండంగా చదివేస్తారు. నా అంచనా తప్పలేదు. ఈ వెబ్సైట్ విజిట్ చేస్తున్న వాళ్లంతా 35 ఏళ్లలోపు వారే. అంతెందుకు ఈ వెబ్సైట్లో అప్లోడ్ చేస్తున్న సమాచార క్వాలిటీని చెక్ చేస్తున్నదీ యువతే. అమెరికాలో ఉంటున్న ఓ అమ్మాయి ప్రూఫ్ చూస్తుంటుంది’ అని అంటారాయన. ఈ వెబ్సైట్ నిర్మాణంలో పాలుపంచుకున్న వారు తెలుగు, భాగవతంపై భక్తితోనే పని చేశారు. అంతా ఉచిత సేవే. ఈ వెబ్సైట్లో అడ్వర్టయిజ్మెంట్స్కి చోటు లేదు. సిద్ధంగా మరెన్నో.. భాగవతమే కాదు పోతన ఇతర రచనలైన వీరభద్ర విజయము, నారాయణ శతకం, భోగినీదండకం కూడా యూనీకోడ్లో సిద్ధంగా ఉన్నాయి. ‘ఇవే కాక ఇతర పుస్తకాలనూ పెట్టాలని ఆశ. ఇప్పుడు రోజుకి ఎనిమిది గంటలకన్నా ఎక్కువ కూర్చోలేకపోతున్నాను. ఈ పనిని ఇంకాస్త ముందెందుకు ప్రారంభించలేకపోయానా అనిపిస్తోంది’ అంటారు సాంబశివరావు. ముగింపు సంస్కృతిని కాపాడటంలో సాహిత్యం పాత్ర గొప్పది. అలాంటి సాహిత్య పఠనాన్ని ఈ తరం మరిచిపోయింది అన్న అపోహను దూరం చేస్తోంది తెలుగుభాగవతం.ఓఆర్జీ. సాంకేతిక సొబగులతో ఏదిచ్చినా అందుకుంటుందని రుజువు చేస్తోంది. ..:: సరస్వతి రమ అసలీ ఆలోచన ఎలా వచ్చిందంటే..? ‘భాగవతంలో సృష్టి నుంచి ప్రళయం వరకూ అన్నీ ఉంటాయి. కథలు, వర్ణనలు, ఛందస్సు, మేనేజ్మెంట్ పాఠాలు.. ఇలా ఈ కావ్యంలో లేనివి లేవు. అందుకే భాగవతం అంటే ఇష్టం.. కృష్ణుడు అంటే భక్తి. ఈ వెబ్సైట్ నిర్మాణానికి స్ఫూర్తి ఇవే. ఆరో తరగతి పూర్తయిన తర్వాత అనారోగ్య కారణాల వల్ల ఏడాది చదువుకు అంతరాయం ఏర్పడింది. మా ఇంటి పక్కన ఓ ఆచారి గారు ఉండేవారు. ఆయన ఇంట్లో బోలెడన్ని పుస్తకాలు ఉండేవి. ఈ ఏడాదిలో అవన్నీ చదివేశాను. సాహిత్యం మీద ఆసక్తి ఏర్పడటానికి అదే కారణం. ఈ వెబ్సైట్ నిర్వహణకు ప్రేరణ కూడా అదే. భక్తి, భాష, సంస్కృతి, చరిత్రను చెప్పడమే ఈ వెబ్సైట్ లక్ష్యం’ అని చెబుతారు సాంబశివరావు. అలా పాడాను.. నేను చార్టెడ్ అకౌంటెంట్ని. చిన్నప్పటి నుంచి మా మామ్మ పాడిన భాగవత పద్యాలు, నాన్న సరిదిద్దిన పొరపాట్లే సాహిత్యాభిలాషకు కారణాలు. సాంబశివరావుగారి వెబ్‌సైట్‌ను విజిట్ చేసినప్పుడు కింద ఎక్కడో ఆయన నంబర్ కనిపించింది. ఫోన్ చేశాను. అలా పరిచయం. ఆపై స్నేహితులమయ్యాం. ఈ పద్యాలకు ఆడియో ఉంటే బాగుంటుందని సూచించాను. ఆయన సరేనన్నారు. చాలామంది సింగర్స్‌ను అడిగాం. కుదరలేదు. ‘మీరు పాడండి’ అన్నారాయన. మొదట ప్రథమ స్కంధంలోని పద్యాలు పాడాను. నా స్వరం ఆయనకు నచ్చడంతో దాదాపు తొమ్మిది వేల పద్యాలూ నేనే పాడాను. ఈ పద్యాలన్నీ ఇంట్లో సోనీ రికార్డర్ ముందు కూర్చుని రికార్డు చేసినవే. - వెంకట కణాద (పద్యాల గాయకుడు) భాషా‘ఛందము’.. మా పెద్దనాన్న మిరియాల రామకృష్ణారావు బాలసాహిత్యంలో దిట్ట. శ్రీశ్రీ సాహిత్యంపై రీసెర్చ్ చేశారు. ఆయన ప్రభావంతో పుస్తకాలు చదవడం అలవాటైంది. విప్రోలో పని చేస్తున్నాను. తెలుగు సాహిత్యం మీద అభిమానంతో ‘ఛందము’ అనే సాఫ్ట్‌వేర్‌ను డెవలప్చేశాను. దీంట్లో ఏ పద్యాన్ని వేసినా గణ విభజన చేసి అది ఏ ఛందస్సులో ఉందో చెప్తుంది. తప్పులున్నా పట్టేస్తుంది. ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా సాంబశివరావు పరిచయం అయ్యారు. ఈ సాఫ్ట్వేర్ ద్వారా పన్నెండు వందల పద్యాలను కరెక్ట్ చేసి ఈ-భాగవతంలో పెట్టాం. - దిలీప్ (వెబ్సైట్ డిజైనింగ్ సహాయకుడు) తెలుగులోనూ ఉండాలని.. విస్సెన్ ఇన్ఫోటెక్’లో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాను. తెలుగు తప్ప ఇతర భారతీయ భాషలన్నిటిలోనూ భారత, భాగవతాలను తర్జుమా చేసిన వెబ్సైట్లు ఉన్నాయి. సాంబశివరావు చేస్తున్న ప్రయత్నం తెలిసి ఆనందం వేసింది. టెక్నిక ల్గా నాకు చేతనైన సాయం అందించాను. అప్లోడ్కి కావల్సిన సాయం చేశా. వేదాలను తెలుగులోకి తేవాలనేది భవిష్యత్ ప్రణాళిక. - ఉమామహేశ్(వెబ్సైట్ డిజైనింగ్ సహాయకుడు) -
పోతన పేరిట జాతీయ అవార్డు
హన్మకొండ కల్చరల్ న్యూస్‌లైన్ : పోతన రచనలపై విసృ్తతంగా పరిశోధనలు చేసిన రచయితలకు జాతీయ స్థాయి అవార్డు అందజేయాలి.. ఇందుకోసం ప్రభు త్వానికి ప్రతిపాదనలు పంపుతాం.. మహాభాగవత రచన చేసి దేశ సమైక్యతకు దారి చూపిన పోతన రచనలు ప్రపంచానికి తెలియజేసే విధంగా వెబ్సైట్ ఏర్పాటు చేయనున్నామని జిల్లా కలెక్టర్ గంగాధర కిషన్ ప్రకటించారు. శనివారం సాయంత్రం పోతన విజ్ఞానపీఠం 15వ సర్వసభ్య సమావేశాన్ని ఆడిటోరియంలో నిర్వహించారు. పీఠం చైర్మన్ జిల్లా కలెక్టర్ కిషన్ ముఖ్యఅతిథిగా పాల్గొని ఆడిటోరియం, గ్రంథాలయం, సంగీత కళాశాల భవనం, ప్రఖ్యాత చిత్రకారులు కొండపల్లి శేషగిరిరావు రూపొందించిన పొతన చిత్రపటాలను పరిశీ లించారు. అనంతరం 2013 వరకు జరిగిన ఆడిట్ అకౌంట్స్ అమోదం తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పోతన విజ్ఞాన పీఠానికి పూర్వవైభవం తేవడానికి కార్యవర్గ సభ్యులు జిల్లాలోని పెద్దలతో సమావేశమై ఒక నిర్ణయానికి రావాలని సూచించారు. విజ్ఞాన పీఠం ద్వారా నిర్వహించే సాంసృ్కతిక కార్యక్రమాలపై వార్షిక ప్రణాళికను ముంగానే తయారుచేసి దాని ప్రకారం నిర్వహించాలని చెప్పారు. నేటి తరం యువతీ యువకులలో పోతన సాహిత్యంపై అవగాహన కల్గించడానికి పాఠశాలల్లో పోటీలు నిర్వహించాలన్నారు. విజ్ఞాన పీఠం ఆడిటోరియం ను ఆధునికరించే విషయం పరిశీలిస్తానని తెలిపారు. సీనియర్ కాంగ్రెస్ నాయకులు బండా ప్రకాశ్ మాట్లాడుతూ తమ అల్లూరి మేనేజ్మెంట్ కళాశాల విద్యార్థులచే వెబ్సైట్ రూపొందించడంలో సహకరిస్తానని హామీ ఇచ్చారు. కోవెల సుప్రసన్నాచార్య మాట్లాడుతూ బమ్మెర పోతన రాసిన మహాభాగవత రచన తరువాతే మనదేశంలో భక్తి సంప్రదాయం వచ్చిందని, దేశ సమైక్యతకు చిహ్నంగా నిలిచిందని అన్నారు. జిల్లా పద్యనాటక పరిషత్ ప్రధాన కార్యదర్శి మారెడోజు సదానందచారి మాట్లాడుతూ తాము ఏదేళ్లుగా పద్యనాటిక ఏకాంకిక పోటీలు నిర్వహిస్తున్నామని, ప్రభుత్వం జిల్లా యంత్రాంగ ఆర్థికంగా సహకరించాలని, ప్రదర్శనలు నిర్వహించుకోవడానికి సరైన వేదిక లేదని చెప్పారు. ప్రసారిక సంపాదకులు, న్యాయవాది నమిలికొండ బాలకిషన్‌రావు మాట్లాడుతూ పీఠంలో ప్రతి సంవత్సరం శాశ్వత కార్యక్రమాల క్యాలెండర్ ఏర్పాటు చేసి, ఇందుకు శాశ్వత నిధిని సమకూర్చాలని కోరారు. వల్సపైడి మాట్లాడుతూ జిల్లా యంత్రాగం నిర్వహించే సాంసృ్కతిక కార్యక్రమాలను పోతన విజ్ఞాన పీఠం వేదికపై నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో డీపీఆర్వో కె.వెంకటరమణ, పోతన విజ్ఞాన పీఠం మేనేజర్ జమ్మలమడక నాగమణీంద్ర శర్మ, ఆచార్య బన్న అయిలయ్య, ఆచార్య పాండురంగారావు, కుందావర్జుల కృష్ణమూర్తి, వ్యాకరణం నాగేశ్వరరావు, అంపశయ్య నవీన్, ఆచార్య కాత్యాయినీ విద్మహే, ఆకారపు రాజాచెన్నవిశ్వేశ్వరరావు, డాక్టర్ విశ్వనాథ్‌రావు, వీఆర్ విద్యార్థి, వర్జుల రంగాచార్య, జి.పద్మజ, పొట్లపల్లి శ్రీనివాసారావు, జీవీ బాబు, పుల్లయ్య, కేవీఎన్.చారి, సురేష్ పాల్గొన్నారు.