పోతన.. టైటానిక్.. చలికాలం | potana and tiranic winter season | Sakshi
Sakshi News home page

పోతన.. టైటానిక్.. చలికాలం

Published Mon, Jan 18 2016 11:00 PM | Last Updated on Sun, Sep 3 2017 3:51 PM

పోతన.. టైటానిక్.. చలికాలం

పోతన.. టైటానిక్.. చలికాలం

నెగళ్ల కాలం ఇది. పగళ్లు చాలా చిన్నవైన కాలం. మనుషులు దగ్గరకు కూడే కాలం ఇది.
అవయవాలను ఒకదానికి ఒకటి దగ్గరకు చేర్చుకునే కాలం. తేనీటి కాలం ఇది.
ప్రాతఃవేళ పొగలు గక్కే వేడినీటిని కోరే కాలం. నిదుర కాలం ఇది.
పొడవు రాత్రుళ్లలో మనసు తీరా ముసుగు తన్నే కాలం. చలికాలం.
గిలిగిలకాలం. పంటిని పన్ను తాకుతూ కటకటమని తాళం చరిచే కాలం.


గీతాంజలి అంటే మొన్నటి దెయ్యం గీతాంజలి కాదు. ఊటీ గీతాంజలి. గిరిజ గీతాంజలి. లేచిపోదాం అన్న మొనగాడా ఎక్కడున్నావ్ అని కాలిని నేలకు తాటించే గీతాంజలి. మణిరత్నం గీతాంజలి. చలిని చూస్తే ఆ సినిమాలో చూడాలి. పచ్చగా ఫ్రెష్‌గా కనిపిస్తున్న కూరగాయల మార్కెట్‌లో అమ్మాయిని అబ్బాయి పలకరించడం అబ్బాయిని అమ్మాయి గిలిగింతలు పెట్టడం... నాన్ ఏసి థియేటర్‌లో కూడా స్వెటర్ వేసుకోబుద్ధయ్యే సినిమా.
   
స్వెటర్ చలి నుంచి కాపాడే ఒక వస్త్రం. కాని తెలుగు సినిమా హీరోకు మాత్రం అదో ఫ్యాషన్ స్టేట్‌మెంట్. తెల్లప్యాంటు పైన రంగురంగుల స్వెటర్ తోడు మఫ్లర్... ఛళ్లున మండే ఎండలో కూడా అవి వేసుకొని మైదానాలలో పాడితేనే అతడికి అందం. ప్రేక్షకులకు చందం. కాశ్మీర్ శాలువాకు ఏం అదృష్టం పట్టిందో మనకు తెలుసు. శరీరానికి వెచ్చదనాన్ని హుందాదనాన్ని ఇవ్వాల్సిన ఆ శాలువ తెలుగు సినిమా బారిన ఒక కేన్సర్ సింబల్ అయ్యింది. లవ్ ఫెయిల్యూర్‌కు లోగో అయ్యింది. నల్లబట్టలు కట్టుకొని గడ్డం పెంచుకొని తెల్ల చెప్పుల్లోకి మారి పైన శాలువా కప్పారా ఏదో ప్రమాదం ముంచుకొచ్చినట్టే లెక్క.
   
ఏదో సినిమాలో ‘ఏప్రిల్ మేలలో పాపల్లేరుగా కాంతి లేదుగా’ అనే పాట ఉంది. ఏప్రిల్ మేలలో కాలేజీలకు సెలవులట. అమ్మాయిలు రారట. కనుక కాంతి లేదుట. ఆమాటకొస్తే డిసెంబర్ జనవరిలో మాత్రం ఏ ఆనందం ఉంది. వంటి నిండా దుస్తులతో ఒకటికి రెండు పై వస్త్రాలతో ఒబేస్ అయినట్టుగా కనిపించే అమ్మాయిలే కదా ఎటు చూసినా. కాని ఒకందుకు ఇదీ మంచిదే. కుదురైన కనుముక్కు తీరేదో కనిపెట్టడానికి ఇదే అదను.
   
కాని చరిత్రలో ఒక చలి ప్రమాదం చాలా విషాదభరితమైనది. మృత్యుశీతలం లేదా శీతల మృత్యువు... అలాంటిదే ‘టైటానిక్’ ఓడ ప్రమాదంలో సంభవించింది. 1912 ఏప్రిల్ పద్నాలుగున అట్లాంటిక్ సముద్రాన్ని దాటుతున్నట్టు ఆ నీళ్లు మృత్యు శీతలంగా ఉన్నాయి. కెరటాలు ఎనిమిది అడుగుల ఎత్తు వరకు ఎగిసి పడుతూ ఓడతో తలపడుతూ ఉన్నాయి. సాయంత్రానికి సముద్రం సద్దుమణిగింది. అతి శీతల గాలులు వీయడం మొదలుపెట్టాయి. అంతకు ముందు రోజు నుంచే ఆ వైపు వెళ్లిన ఓడలు మంచు కొండలు కనపడుతున్నాయి జాగ్రత్త అని టైటానిక్‌కు సందేశాలు పంపుతున్నాయి.

కాని టైటానిక్ ఫుల్ స్పీడ్‌తోనే ప్రయాణించింది. రాత్రి 11.40 గంటలకు టైటానిక్ మంచుకొండను ఢీకొట్టింది. నౌక చెల్లాచెదురయ్యింది. 20 లైఫ్ బోట్లు ఉన్నాయి. కాని 700 మందే వాటి వల్ల ప్రాణాలు కాపాడుకోగలిగారు. వాటి సామర్థ్యం 1,178. మిగిలిన వాళ్లంతా నీటి పాలయ్యారు. లైఫ్ జాకెట్స్ ఉన్నాయి. ఈదే శక్తి ఉంది. కాని నీళ్లు శీతలం. గాలి శీతలం. రాత్రి శీతలం. మృత్యువు శీతలం. ఒక గొప్ప ప్రయాణాన్ని మొదలెట్టిన ప్రయాణికులు 1500 మంది ఆ కాళరాత్రి చలికి వణుకుతూ వణుకుతూ మృత్యువు ముందు చేతులు ముకుళించారు.
   
సాహిత్యం కూడా చలిని చాలా తీవ్రంగా చూసింది. చలికి భయపడింది. చలితో తలపడింది. ప్రఖ్యాత రష్యన్ రచయిత గొగోల్ రాసిన ‘ది ఓవర్ కోట్’ ప్రఖ్యాతం. ఒక చిన్న ఆఫీస్‌లో క్లర్క్‌గా పని చేసే చిల్లర జీతగాడు జీవితాంతం ఒకే కలను కంటాడు. అదేమిటంటే కొత్త ఓవర్ కోట్‌ను కొనుక్కోవడం. దారుణమైన మంచుకురిసే ప్రాంతంలో ఉన్నవారికి అంతకు మించిన ధైర్యం ఉండదు. కాని అతని దగ్గర డబ్బులు ఉండవు.

నెలల తరబడి పోగేసి పోగేసి అతి కష్టం మీద ఒక ఓవర్‌కోట్ కొనుక్కుంటాడు. ఎంతో ఆనందిస్తాడు. ఆ సంతోషంలో కన్నీరు కారుస్తాడు. ఏం లాభం? అతని కంటే దైన్య స్థితిలో ఉన్న కొందరు జులాయిలు అతణ్ణి కొట్టి ఆ ఓవర్‌కోట్‌ను లాక్కుని వెళతారు. మానవత్వం మానవత్వం అని మాటలు చెప్పడం కాదు. భయంకరమైన చలి ఇద్దరు మనుషులు ఒక రగ్గు ఉన్నప్పుడే ఒక మనిషిలోని మానవత్వం బయటపడుతుంది.
   
తెలుగులో ఒక లలితమైన కథ ఉంది. మధురాంతకం రాజారాం రాశారు. దాని పేరు ‘కమ్మతెమ్మెర’. ఒక జంటకు కొత్తగా పెళ్లవుతుంది. కాని సుముహూర్తం లేని కారణాన మొదటిరాత్రికి ఎడం ఉంటుంది. ఈలోపు పెళ్లికొడుకు ఊరెళ్లి కొన్నాళ్లు పనులు చూసుకొని అత్తగారి ఇంటికి వస్తాడు. పెళ్లికూతురిని చూడాలని ఒకటే తహతహ. ఆమె మాత్రం సిగ్గుతో అతడికి కనపడకుండా దాక్కుంటూ ఉంటుంది. చేతులు గాజులు పాదాల నడక ఇవే కనిపిస్తూ ఉంటాయి.

పెళ్లికొడుకు నిరాశపడతాడు. రాత్రికి అలసిపోయి అరుగు మీద ఏర్పాటు చేసిన పక్కలో నిదుర పోతాడు. మంచి చలి కాలం. అర్ధరాత్రి చలి వేస్తూ ఉంటుంది. నిద్రలోనే ఒణుకు తెలుస్తూ ఉంటుంది. అప్పుడు మృదువైన అందెల రవళితో సున్నితమైన గాజుల సవ్వడితో ఎవరో వచ్చి ఆ పెళ్లి కొడుక్కి వెచ్చటి దుప్పటి కప్పి తుర్రుమంటారు. నిండా కప్పుకున్నా సరే ఒక కమ్మతెమ్మెర తాకినట్టయ్యి పెళ్లికొడుకు పులకింతలు పోతాడు. ఆ జ్ఞాపకం ఇక నూరేళ్లు శాశ్వతం.
   
‘అహములు సన్నములయ్యె
దహనము హితమయ్యె, దీర్ఘదశలయ్యె నిశల్;
బహు శీతోపేతంబై ‘యుహు... హుహు’యని వడకె లోకముర్వీనాథా!’
 
అని పోతన చలి మీద పద్యం చెప్పాడు. హిందీ సినీ కవి ఒకడు ఇలాంటివి లెక్క చేయకుండా మంచి చలికాలంలో ‘ఠండే ఠండే పానీసే నహానా చాహియే’ అని పాటందుకున్నాడు. ‘చలితో నీవు చెలితో నేను చేసే అల్లరులూ’ అని మన తెలుగు కవి వంత కలిశాడు. ఏం పాడుకున్నా ఇవ్వడంలో ఆనందం తెలిపే కాలం ఇది. ఉన్ని వస్త్రాలే ఎందుకు? స్నేహమయమైన వెచ్చని కౌగిలి కూడా ఈ చలికి ఒక ధన్యతను ఇస్తుంది.
 - సాక్షి ఫ్యామిలీ
 
ఆ నీళ్లు మృత్యు శీతలంగా ఉన్నాయి. కెరటాలు ఎనిమిది అడుగుల ఎత్తు వరకు ఎగిసి పడుతూ ఓడతో తలపడుతూ ఉన్నాయి. సాయంత్రానికి సముద్రం సద్దుమణిగింది. అతి శీతల గాలులు వీయడం మొదలుపెట్టాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement