ప్రకృతి చాలా మహమాన్వితమైంది. సీజన్‌కు తగ్గట్టు మనకు ఎన్నో అద్భుతమైన ఫలాలను అందిస్తుంది. అందుకే ఏ కాలంలో దొరికే పళ్లు, కూరగాయలు ఆకాలంలో విరివిగా తినాలని పెద్దలు చెబుతారు. మరి శీతాకాలంలో మాత్రమే దొరికే ఒక అద్భుతమైన చిట్టి పండు గురించి తెలుసుకుందాం. రుచికి రుచీ, ఆరోగ్యానికి ఆరోగ్యం. ఏమిటా పండు? దాని లాభాలేంటి? చూద్దామా.
శీతాకాలంలో మాత్రమే దొరికే రేగి పండు(jujube fruit)తీపి పులుపు కలగలిపిన అద్భుతమైన రుచి. చూడ్డానికి చిన్నగా కనిపించినా పోషక విలువలు మాత్రం మెండుగా లభిస్తాయి. అందుకే ఆయుర్వేద చికిత్సలో, ఔషధాల్లో ప్రాముఖ్యత కూడా ఉంది. రేగు పండ్లు తరచూ జ్వరం, జలుబు రాకుండా చేస్తాయి. తలనొప్పి, డయేరియా, రక్త విరేచనాలను అరికట్టడానికి రేగి చెట్టు బెరడును ఉపయోగిస్తారు. బెరడు కషాయం మలబద్ధకానికి బాగా పనిచేస్తుంది.
ఈ పండ్లను చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ఎంతగానో ఇష్టపడతారు. మరీ ముఖ్యంగా రేగు పళ్లతో చేసే ఒడియాలకున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఒక్కసారి అలవాటు పడితే తినకుండా ఉండలేం. వీటి రుచి మహాగమ్మత్తుగా ఉంటుంది. రేగి పళ్ళపై ఉప్పు కారం చల్లుకుని తింటారు. ఇంకా వీజామ్‌లూ, జెల్లీలూ, జ్యూస్, టీ, వినెగర్, క్యాండీలూ లాంటి వాటిని కూడా తయారు చేస్తారు. రేగుపళ్లలో పురుగులు బాగా ఉంటాయి. చూసుకొని తినాలి
రేగు పండ్లలో విటమిన్ సి, ఫ్లేవనాయిడ్స్, పాలీఫెనాల్స్ వంటి యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ కారణంగా శరీరం దెబ్బతినకుండా రక్షించడంలో సహాయపడతాయి. ఇది శరీరంలో ఇన్ఫ్లమేషన్‌ను తగ్గిస్తాయి. రేగిపండులో ఉన్న పోటాషియం, యాంటీఆక్సిడెంట్లు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
రక్తహీనతతో బాధపడేవారికి రేగుపళ్లు చాలా మేలు చేస్తాయి. గర్భిణీ స్త్రీలు కూడా తినవచ్చని వైద్యులు చెబుతున్నారు. అలాగే వేవిళ్లు, వాంతుల సమయంలో రేగుపళ్లుతో తయారు చేసిన రేగుపళ్లను కొద్ది కొద్దిగా చప్పరిస్తూ ఉంటే నోటికి పుల్లగా బావుంటుంది. అలాగే వాంతులు కూడా తగ్గే అవకాశాలున్నాయి.
అద్బుతమైన ప్రయోజనాలు
రేగిపండులోని విటమిన్ సీ రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తుంది. ఈ పళ్లలోని యాంటీఆక్సిడెంట్లు శరీరాన్ని వైరస్లు, బాక్టీరియా వంటి హానికరమైన సూక్ష్మజీవుల నుంచి రక్షిస్తాయి శీతాకాలంలో వచ్చే సీజనల్ జలుబు, దగ్గు వంటి ఇతర ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి. సహజసిద్ధమైన చక్కెరలు , బీ విటమిన్ శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి. ఫైబర్ అధికంగా ఉంటుంది. కడుపు ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలను తగ్గిస్తుంది. జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది.
రక్తహీనతను (Anaemia) నివారిస్తుంది. రేగిపండులో ఐరన్ అధికంగా ఉంటుంది. ఇది హీమోగ్లోబిన్ స్థాయిని పెంచడంలో సహాయపడుతుంది. ఫలితంగా రక్తహీనత తగ్గుతుంది. అనీమియాసమస్యలతో బాధపడేవారు కొన్ని రేగిపండ్లను రోజూ తీసుకుంటే రక్తహీనత సమస్యను తగ్గించుకోవచ్చు.
రేగిపండులో ఉన్న యాంటీఆక్సిడెంట్లు చర్మ సౌందర్యాన్ని పాడతాయి. ముఖంపై మచ్చలు, ముడతలు , తగ్గించడంలో సహాయపడతాయి. ఇందులోని విటమిన్ సి చర్మంలో కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచి,చర్మానికి మెరుపునిస్తుంది. సౌందర్యం కోసం రేగిపండును ఫేస్ ప్యాక్ లాగా కూడా ఉపయోగిస్తారు.
అంతేనా...ఇంకా
దీర్ఘకాలిక ఆందోళన, ఒత్తిడితో బాధపడేవాళ్లకి రేగుపండ్లు ఔషధంలా పనిచేస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఈ పండ్లు తింటే డిప్రెషన్ దూరం అవుతుంది. అలాగే నిద్రలేమి (Insomnia) సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. దీన్నుంచి తీసిన ఎక్స్‌ట్రాక్ట్ మతిమరుపూ ఆల్జీమర్స్ రాకుండానూ అడ్డుకుంటుందని ఒక అధ్యయనంలో తేలింది.
రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. ఇందులోని ఫైటోకెమికల్స్ (Phytochemicals) వల్ల రక్తంలో ఇన్సులిన్ సున్నితత్వం మెరుగుపడుతుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు రేగిపండును (మితం) తీసుకోవచ్చు.
రేగిపండులో కూడా క్యాలరీలు తక్కువ, ఫైబర్ ఎక్కువ. కనుక బరువు పెరుగుతామనే బెంగ అవసరం లేదు. పైగా ఇది కడుపుని తేలికగా,తృప్తిగా ఉంచుతుంది.
రేగిపండులో కేల్షియం, ఫాస్పరస్, మ్యాగ్నీషియం ఎముకలను బలపరుస్తాయి. ఆస్టియో పోరోసిస్ వంటి ఎముకల సమస్యలకు ఉపశమనం పనిచేస్తాయి.
రేగిపండులో యాంటీ-క్యాన్సర్ సమ్మేళనాలు ఉన్నాయి. ఇవి క్యాన్సర్ కణాల వృద్ధిని నియంత్రిస్తాయి . ప్రత్యేకంగా బ్రెస్ట్ క్యాన్సర్ , లివర్ క్యాన్సర్ ముప్పును తగ్గించే అవకాశం ఉంది.
ఎవరు తినకూడదు
యాంటీ డిప్రెసెంట్ మందులువాడేవారు
మూర్చ వ్యాధితో బాధపడుతున్న వారు
స్కిన్ అలెర్జీ, శ్వాసకోస సమస్యలతో బాధపడుతున్నవారు.
ఆస్తమా వ్యాధితోబాధపడుతున్నారు కూడా రేగుపళ్ళను అతిగా తినకూడదు.
ఎక్కువగా తింటే విరేచనాలు అయ్యే ప్రమాదముంది గనుక, ఇప్పటికే ఈ సమస్యతో బాధపడేవారు కూడా దూరంగా ఉండాలి.
నోట్: ఇది అవగాహన కోసం అందించిన మాత్రమే. ఏదైనా అతిగా తినకూడదు. అతిగా తింటే కొన్ని అనారోగ్య సమస్యలు రావచ్చు. గొంతులో కఫం పెరగడం, దగ్గు లాంటి లక్షణాలు కనిపిస్తే వైద్యులను సంప్రదించాలి.
Comments
Please login to add a commentAdd a comment