
ఆధునిక కాలంలో, అందులోనూ పట్టణాల్లో జున్ను దొరకడమే గగనంగా మారిపోయింది. మరో విధంగా చెప్పాలంటే జున్ను అంటే భవిష్యత్తరానికి దూరమైపోతోంది. పశువులు, పాడి పంట పుష్కలంగా ఉన్న ఇళ్లల్లో కూడా అరుదుగా దొరుకుతుంది. జున్ను అంటే ఇష్టపడని వారు ఉండరు. అలాంటి జున్నుపాలు సామాన్యులకు దొరికాయంటే పండగ అన్నట్టు. నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా జున్ను ఎలా తయారు చేయాలో మీకు తెలుసా? పదండి తెలుసుకుందాం.
జున్ను పేరు చెబితేనే నోరు ఊరిపోతుంది కదా.. తియ్య..తియ్యగా, కారం కారంగా, మధ్య మధ్యలో అలా మిరియం గింజలు తగులుతూ ఉంటే ఆ రుచే వేరు. జున్ను మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది.
కావలసిన పదార్థాలు
జున్ను పాలు (ఆవు లేదా గేదె ఈనినపుడు మొదటి మూడు రోజుల్లో వచ్చే పాలు), ఒక గ్లాసు, సాధారణ పాలు - మూడు గ్లాసులు, కప్పు బెల్లం, కొద్దిగా యాలకుల పొడి, మిరియాల పొడి.
తయారీ విధానం
ఒక గిన్నెలో ఒక గ్లాసు జున్నుపాలు, మామూలు పాలను కలపాలి. ఇందులో బెల్లం తురుము, పంచదార కూడా వేసి బాగా కలపాలి. ఇందులోనే మిరియాల పొడి, యాలకుల పొడి వేసి కూడా బాగా కలపాలి. దీనికి ఆవిరి మీద ఉడికించుకోవాలి. అంటే ఒక పెద్ద గిన్నెలో నీళ్లు పోసి స్టవ్‌మీద పెట్టుకోవాలి. ఇపుడు మరో గిన్నెలో జున్ను పాల మిశ్రమాన్ని పోసి మూతపెట్టి వేడి నీటిగిన్నెలో ఉంచి ఉడికించుకోవాలి. గిన్నెలో సగం మాత్రమే వచ్చేలా చూసుకోవాలి. లేదంటే పొంగిపోయే అవకాశ ఉంది. ప్రెషర్ కుక్కర్లో కూడా దీన్ని తయారు చేసుకోవచ్చు.
జున్నుతో ఆరోగ్య ప్రయోజనాలు
జున్ను పాలు చాలా చిక్కగా, పసుపు రచ్చ రంగులో ఉంటాయి. జున్నులో క్యాల్షియం, ఫాస్ఫరస్, విటమిన్ బి12, విటమిన్ ఎ, విటమిన్ డి, విటమిన్ కె, రిబో ఫ్లావిన్, జింక్, ప్రోటీన్ వంటివి అధికంగా ఉంటాయి. వీటి ద్వారా రోగనిరోధక శక్తి పెరుగుతుంది. జున్నులో ఉండే అధికంగా లభించే కాల్సియం, పోషకాల కారణంగా ఎముకలు బలంగా తయారవుతాయి. దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి. జున్నులో ఉండే ప్రోటీన్ కంటెంట్ శరీరానికి శక్తిని అందిస్తుంది.
కృత్రిమంగా కూడా జున్ను
ఒక కప్పు చిక్కటి పాలల్లో రెండు ఎగ్స్‌ను వేసి, బాగా గిలక్కొట్టి, మామూలు జున్ను తరహాలోనే బెల్లం, మిరియాలు, యాలకులు కలిపి ఆవిరిమీద ఉడించుకోవచ్చు. మార్కెట్లో ఆర్టిఫిషియల్ గా చైనా గ్రాస్ తో తయారు చేస్తున్న జున్ను లభిస్తుంది.