నేత్రపర్వం.. సీతారాముల కల్యాణం
ఒంటిమిట్ట కోదండరామాలయంలో సీతారాముల కల్యాణోత్సవం మంగళవారం కన్నుల పండువగా జరిగింది. వేకువజామున ఆలయంలోని మూలవిరాట్‌లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. నూతన పట్టువస్త్రాలు, వివిధరకాల పుష్పాలతో స్వాములవారిని సుందరంగా అలంకరించారు. ఆలయ మధ్యమండపంలో సీతారాముల విగ్రహాలను సుందరంగా అలంకరించిన కల్యాణవేదికపై కొలువుదీర్చారు. వైభవంగా కల్యాణం నిర్వహించారు. సుండుపల్లి నుంచి పాదయాత్రగా వచ్చిన భక్తులు చేపట్టిన భజన కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కోదండరామాలయంలో పోతన సాహితీ ఆధ్వర్యంలో పెద్దఎత్తున పద్యరచన పోటీలను నిర్వహించారు. జిల్లాలోని వివిధ పాఠశాలలనుంచి దాదాపు 1500 మంది విద్యార్థులు ఈ పోటీలలో పాల్గొన్నారు. భక్తులకు అన్నదానం చేశారు.