భాగవతం రచించిన బమ్మెర పోతన, తొలి తెనుగు విప్లవ కవి బసవ పురాణ గ్రంథకర్త పాల్కురికి సోమనాథుడి పేర్లతో ఉత్సవాలు...
భాగవతం రచించిన బమ్మెర పోతన, తొలి తెనుగు విప్లవ కవి బసవ పురాణ గ్రంథకర్త పాల్కురికి సోమనాథుడి పేర్లతో ఉత్సవాలు నిర్విహ స్తామని తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు వరంగల్ సాక్షిగా ప్రకటించడం హర్షదాయకం. గత పాలకుల ఏలుబడిలో తెలంగాణ ప్రాంతానికి చెందిన కవులు, కళాకారులు, సాహితీవేత్తలు నిరాదరణకు గురయ్యారు. కనీసం తెలంగాణ ప్రాంతం ఇంతమంది ప్రజాకవులకు, పండితులకు, విద్వత్కవులకు జన్మని చ్చిందన్న ఎరుకను కూడా లేకుండా చేశారు. ఈ నేపథ్యంలో తెలంగాణ సంస్కృతికి ఆకరమైన ఇలాంటి మహనీయులను జ్ఞప్తికి తెస్తూ సాంస్కృతిక కార్యక్రమా లపై తెలంగాణ ప్రభుత్వం ఆసక్తి ప్రదర్శించడం ముదావహం. ఈ నేపథ్యంలో పోతన జన్మస్థలానికి ప్రాభవం తీసుకువస్తామని, ఆనాడు బమ్మెర పోతన దున్నిన నాలుగు ఎకరాల్లో స్మారకమందిరాన్ని నిర్మి స్తామని, రామాయణ మహాకావ్య సృష్టికర్త వాల్మీకి దేవస్థానం అభివృద్ధికి కూడా కృషి చేస్తానని ముఖ్యమంత్రి ప్రకటించాలి. దీంతో పాటు తెలంగాణ రైతులు, ప్రజలు తమ విముక్తి కోసం అరవైఏళ్ల క్రితం చేపట్టిన మహత్తర సాయుధ పోరాట చరిత్రను కూడా ప్రభుత్వం పాఠ్యాంశాలలో తప్పనిసరిగా చేర్చాలి.
- దౌడ్ విజయకుమార్ పరకాల, వరంగల్ జిల్లా