writers
-
సిబ్లింగ్ రైటర్స్..! రచయితలుగా రాణిస్తున్న అక్కా, తమ్ముళ్లు..
వారిది ఓ మధ్యతరగతి కుటుంబం.. ఇద్దరూ అక్కా, తమ్ముళ్లు.. చిన్నప్పటి నుంచీ ఇంగ్లిష్ మీడియంలో చదువుకున్నారు.. వారి ముందుతరాల్లో ఎవరికీ పుస్తకాలు రాయడమనే మాటే తెలియదు.. అసలు వాటిని చదవడమే గగనమైన కుటుంబం నుంచి వచ్చారు.. అనూహ్యంగా ఇద్దరికీ తెలుగుపై మమకారం పెరిగింది. సాధారణంగా బీటెక్ చదువుకున్న వారిలో చాలా మంది సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఉద్యోగం చేస్తూ కాలం గడిపేస్తుంటారు. కానీ వీరిద్దరూ అందుకు భిన్నం. అక్క ఉస్మానియా యూనివర్సిటీలో డిగ్రీ చదువుకోగా.. తమ్ముడేమో విశాఖలోని గీతమ్ యూనివర్సిటీలో బీటెక్ చదివాడు. కానీ వీరిద్దరూ భాషలో పట్టు సాధించి పుస్తకాలు రాస్తూ తమకు తోచినంతలో తెలుగుకు సేవ చేస్తున్నారు. అక్కా, తమ్ముళ్లు ప్రవళిక, ప్రవర్ష్ జర్నీ ఒక్కసారి చూద్దాం.. – సాక్షి, సిటీబ్యూరోతెలుగులో రాయాలనే ఆకాంక్ష అయితే ఉంది.. కాకపోతే పుస్తకాలు రాయడం ఇంట్లో ఎవరికీ అలవాటు లేదు. దీంతో వినూత్నమైన ఆలోచన వారి మదిలో మెదిలింది. 2017లో ‘కరపత్ర’ పేరుతో అవసరం ఉన్న వారికి లేఖలు రాయడం ప్రారంభించారు. ఈ ప్రాజెక్టు విషయంలో మహేశ్పోలోజు అనే మరోరచయిత వీరిద్దరికీ తోడయ్యాడు. వీరు ముగ్గురూ కలసి దాదాపు వెయ్యికి పైగా ఉత్తరాలు రాసిచ్చారు. లేఖలు అందుకున్న వారు అభినందనలతో ముంచెత్తడంతో రచయిత కావాలనే తృష్ణ వారిలో మరింత పెరిగింది.ఛాయాదేవి చెత్త కథలు..ప్రవళిక తొలిసారిగా 2017 సమయంలోనే ‘ఛాయాదేవి చెత్త కథలు’ పేరుతో తన తొలి పుస్తకాన్ని తీసుకొచి్చంది. అక్కను స్ఫూర్తిగా తీసుకుని ప్రవర్ష కూడా తన తొలి పుస్తకాన్ని ‘కథనై.. కవితనై’ పేరుతో వెలుగులోకి తీసుకొచ్చారు. ప్రవళిక మరో పుస్తకాన్ని ఇప్పటికే పూర్తి చేయగా, ప్రవర్ష్ ‘అభినిర్యాణం’ పేరుతో రెండో పుస్తకాన్ని ఆదివారం ఆవిష్కరించారు.అసిస్టెంట్ డైరెక్టర్‌గా..ప్రవర్ష్ మూడేళ్లు ఓ ఐటీ కంపెనీలో జాబ్ చేశాడు. కానీ తనకు అస్సలు సంతృప్తినివ్వలేదు. ఇక తనకు ఇష్టమైన రంగంలో రాణించాలని నిర్ణయించుకుని ఆ జాబ్ మానేసి పుస్తకాలు రాయడం ప్రారంభించాడు. పుస్తక రచయిత మాత్రమే కాదు.. అటు సినిమాలకు పాటలు రాయడం హాబీగా మార్చుకున్నాడు. ప్రస్తుతం ఓ డైరెక్టర్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నాడు. -
కంటెంట్ ఉంటేనే ‘కిక్కు.. క్లిక్’
సాక్షి, హైదరాబాద్: కంటెంట్‌లో కిక్కు ఉండాలి...అది ఉంటేనే క్లిక్ అవుతుందనే భావనలో రాజకీయ నాయకులు ఉన్నారు. జనంలోకి దూసుకెళ్లే వీడియోలు.. వినంగానే అర్థమయ్యేలా సోది లేకుండా చెప్పే నైపుణ్యం..నిశితంగా వైరిపక్షాన్ని ఇరుకున పెట్టే వ్యూహం.. లోక్‌సభ ఎన్నికల వేళ నేతలు ఈ తరహా కంటెంట్ కోసం ఎదురుచూస్తున్నారు.హైదరాబాద్‌కు చెందిన వికీపీడియా కంటెంట్ సొల్యూషన్స్ సమాచారం ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా లక్షమంది కంటెంట్ రైటర్లు పనిచేస్తున్నారు. అసలు కంటెంట్ రైటింగ్ అంటే ఏంటో? ఎలా ఉంటుందో? ఎలా క్రియేట్ చేయాలో చెప్పేందుకు ప్రత్యేక శిక్షణ సంస్థలూ ఉన్నాయి. ఢిల్లీకి దగ్గర్లోని గుర్గావ్లో ఇలాంటి పేరెన్నికగల సంస్థల్లో చాలామంది శిక్షణ పొందుతున్నట్టు వీక్పీడియా సంస్థ అధిపతి కుమార్‌జైన్ తెలిపారు. ఇలా శిక్షణ తీసుకున్నవారు కొన్నేళ్లుగా ఎన్నికలు, ఇతర ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. వీరి ఆధ్వర్యంలో పనిచేసిన మరో 80 వేల మంది వరకూ కంటెంట్ రైటర్లుగా మారిపోయారు. ‘క్లిక్’మనిపించడమే సవాల్ రాజకీయపార్టీ ఏదైనా సరే ఎన్నికల్లో గెలవాలనే అనుకుంటుంది. ఈ దిశగానే వారి ఆశయాలు, ఆచరణ విధానాలను ప్రజల్లోకి తీసుకెళుతుంది. వాట్సాప్, యూట్యూ బ్, ఇన్‌స్టా, ఫేస్బుక్ ఇలా అన్ని సోషల్ మీడియాల్లోనూ తమ వాదన ‘క్లిక్’కావాలనే కోరుకుంటాయి. ఇక్కడే కంటెంట్ రైటర్ ప్రావీణ్యత ముడిపడి ఉంది. నేతను జనంలో నిలబెట్టే మెళకువలు అందిపుచ్చుకోవడంలో దేశవ్యాప్తంగా 60 శాతం కంటెంట్ రైటర్లు విజయం సాధిస్తున్నారని ఢిల్లీకి చెందిన ఇండియా కంటెంట్స్ మేనేజర్ విజయ్‌కుమార్ మల్హోత్రా తెలిపారు. పోస్టు పెట్టాక రివ్యూ చేస్తారు. ఎంతమందికి అది రీచ్ అయింది తెలుసుకుని.. సరైన స్పందన లేకపోతే కంటెంట్ మార్చడానికి ప్రయత్నిస్తుంటారు. నాయకుడికి సంబంధింన కంటెంట్ రైటర్ తను పెట్టే వీడియోలు, ఫొటోలు ఓటర్లకు రీచ్ కాకపోతే కంటెంట్ రైటర్ చిక్కుల్లో పడ్డట్టే. దీనికోసం కంటెంట్ రైటర్లు కూడా సొంత ఫాలోవర్స్ ఏర్పాటు చేసుకోవాల్సి వస్తోంది. మంచి గిరాకీనే..కంటెంట్ రైటర్లకు ఎన్నికల సీజన్లో మంచి గిరాకీ ఉంటుంది. ఒక్కో సంస్థ పరిధిలో కనీసం 50 మంది పనిచేస్తుంటారు. నాయకుడి అందించే కాన్సెప్ట్ అర్థం చేసుకొని, అందుకు అనుగుణంగా అవసరమైన డైలాగ్స్, సెటైర్లతో కంటెంట్ ఇవ్వడం వీరి బాధ్యత. దీనిని వీడియో ఎడిటర్ చిత్రీకరణలోకి తీసుకెళతాడు. చిత్రం చాలా తేలికగా ఉండాలంటే, ఈజీగా ఉండే పదాలు, వాడుక భాషను కంటెంట్ రైటర్లు ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. కంటెంట్ అందిచడం అనేక విధాలుగా ఉంటుందని ది రైటర్స్ అనే సంస్థకు చెందిన విఠల్ తెలిపాడు. అధికార పార్టీ నేత పోటీ చేస్తున్నప్పుడు ప్రభుత్వ పథకాలు, జరిగిన లబ్దిపై ఎక్కువగా ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఇదే క్రమంలో విపక్షాలు లేవనెత్తే ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు కూడా కంటెంట్ ఇవ్వాలి. దీనిని వీలైనంత తక్కువ నిడివి గల వీడియో చిత్రీకరణకు అనువుగా ఉండాలని నేతలు కోరుతున్నట్టు కంటెంట్ రైటర్లు చెబుతున్నారు. విపక్షమైతే ఎదురుదాడి ప్రధానాస్త్రంగా కిక్ ఎక్కించే కంటెంట్ కోరుకుంటోంది. కంటెంట్ క్లిక్ అయ్యే దాన్ని బట్టి రెమ్యూనరేషన్ డిమాండ్ ఉంటోంది. కొంతమంది ఎన్నికల సమయం వరకూ ప్యాకేజీగా రూ.25 నుంచి రూ.40 లక్షల వరకూ తీసుకుంటున్నారు. మరికొంతమంది నేతలు వారి స్థాయిని బట్టి రెమ్యూనరేషన్ ఇస్తున్నారు. ఇది కూడా రూ.10 లక్షలకు తక్కువ ఉండదు. -
నెహ్రూ జాకెట్ సాహిత్యం
నెహ్రూ గారిని నిలదీయడం ఈ మధ్య ఫ్యాషన్ అయిపోయిందిగాని నిజానికి ఆయనను నిలదీయాల్సింది నెహ్రూ జాకెట్‌ను ఎందుకు పాప్యులర్ చేశావయ్యా అని. రచయితలు, కవులు, విమర్శకులు మున్ముందు రోజులలో లాల్చీ పైజమా ధరించడమేగాక నెహ్రూ జాకెట్‌ను కూడా తగిలించారంటే గనక చచ్చినట్టు వారు సాహిత్యకారులుగా మన దేశంలో చలామణి అవుతారని ఆయన ఊహించి ఉండడు. ఎరిగిన సాహిత్యకారులు అడపా దడపా ఆ అదనపు వస్త్రాన్ని ధరించినా తాము సాహిత్యకారులమే అని తప్పక నిరూపించుకోవాలనుకునే వారికి మాత్రం నెహ్రూ జాకెట్ కవచ కుండలం. పూర్వం రోజులలో కొందరు సాహితీ తాపసులు పెన్నును బుగ్గకు పెట్టుకుని, నుదుటిని నింగి వంక ఎత్తి పెట్టి ఫొటో దిగి, పుస్తకం వెనుక వేసుకోవడం వల్ల వారు రచయితలని, కవులని నమ్మాల్సి వచ్చేది. మరికొందరు టెలిఫోన్ రిసీవర్‌ను చెవి దగ్గర పెటుకొన్న ఫొటోను పుస్తకం వెనుక వేయడం వల్ల అమ్మో వీరు రచయితలేస్మీ అనుకోకుండా ఉండలేకపోయేవారం. ‘మానవతా... ఎక్కడమ్మా నీ చిరునామా?’ అని గూగుల్ మేప్స్ లేని కాలంలో ఎవరు పై అడ్రస్ అడుగుతూ కవిత్వం రాసినా వారు కవులు కాకుండాపోలేదు. ఇక ఏ కాలంలో అయినా ఎల్.ఎస్.వి.శేషాచలం, మునవర్తి సుబ్రహ్మణ్యం, విక్టర్ మనోహర్, ప్రొఫెసర్ చారులత వంటి ప్రముఖ విమర్శకులు ఉంటారు కనుక వారు ముందు మాట రాసి వదిలారంటే– ఎందుకొచ్చిన గొడవ అని నోరు మెదపక అట్టి రచయితలను రచయితలే అనుకోవడమూ కద్దు. ఏదేని ఒక శాఖ కలిగిన రాష్ట్రమంత్రితో, ఏదేని ప్రాదేశిక ఇన్ కమ్టాక్సు కమిషనర్‌తో, లేదంటే స్థానిక వాకర్స్ క్లబ్ ప్రెసిడెంట్‌తో... ఈ ముగ్గురితో కాని కనీసం వీరిలో ఇద్దరితో కాని ఫొటోలు దిగి, ఫేస్బుక్లో పెట్టి, ఇక మమ్మల్ని సాహిత్యకారులం కాదు అనంటే తంతాం అనేవారు ఉన్నారంటే నోరు నొక్కుకోవాల్సిన పని లేదు. జీవితంలో అక్షరమ్ముక్క రాయకపోయినా రాసే వాళ్లందరి ఫోన్ నంబర్లు కలిగి ఉండటమే కాదు వారికి కాల్ చేసి ‘ఏవోయ్ ఎలా ఉన్నావ్’ అనిగానీ, ‘నమస్కారమండీ... టిఫినయ్యిందా’ అనిగానీ అడగ్గలిగే చనువు ఉన్నందుకు కనీసం డజను మంది తెలుగునాట ప్రముఖ సాహిత్యకారులుగా చలామణి అవుతున్నారంటే గుండె పొంగే సంగతి. ‘శుంఠల్లారా... ఇదా మీ ప్రతాపమూ... నన్ను గనక కళ్లకు గంతలు గట్టి ఢిల్లీలో ఏమూల వదిలినా నేరుగా సాహిత్య అకాడెమీ ఆఫీసుకు చేరుకోగలను’ అనేవారి ప్రదక్షిణ పటిమ వారికి ఇస్తున్న అతిశయం అంతా ఇంతా కాదు. ‘అడుగడుగున నుడి ఉంది’, ‘అక్షర రశ్మీ జయతు’, ‘మనమంతా కలం కులం’... వాట్సప్ గ్రూప్‌లను స్థాపించి, ఒక దానిలో నూట పదహారుకు తక్కువ కాకుండా సభ్యులను చేసి, అడ్మిన్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఏకైక హోదా వల్ల సాహిత్య దశా దిశను నిర్దేశించాలని కన్నీళ్లతో తపన పడేవారెందరో మన హృదయాలను చెమ్మగిల్ల చేస్తున్నారు. ఈ యొక్క వాట్సప్ గ్రూప్‌లలో ప్రతి ఒక్క కవిత, వ్యాఖ్యకు మరువక లైక్ కొట్టేవారిని దృష్టిలోకి తీసుకుని మాసాంతంలో వారికో అవార్డు బహూకరించడం మరో విశిష్ట ప్రోత్సాహక ప్రోత్సహితం. జూమ్‌లో స్లాట్ బుక్ చేసి, కార్డు డిజైన్ చేయగల వనరులు కలిగినవారు వారానికి పది మందిని సాహితీ సమాలోచనంలో ముమ్మరం చేయడం చూస్తే ఏమిచ్చి వీరి రుణం తీర్చుకోగలం అనిపిస్తుంది. గుర్తు తెలియని విదేశాలకు వెళ్లి స్థానిక గాంధీనగర్ అసోసియేషన్ స్థాయి సాహితీ సమ్మేళనంలో పాల్గొని రుజువు పత్రంతోనూ, తెల్లవాళ్లతోనూ ఫొటోలు దిగి బెదురు, బెరుకు పుట్టించే వారిది స్వీయ విమానచార్జీలు భరించగలిగే స్థాయి. సాహిత్యం అంటే అందరికీ ఇష్టం. పాఠకులుగా ఉత్తమ సాహిత్యాన్ని ఇష్టపడేవారూ సృజన కారులుగా ఉత్తమ సాహిత్యసృష్టికి పెనుగులాడేవారూ ఎప్పుడూ ఉంటారు. ఈ ఇద్దరూ ప్రతి ప్రాంతంలో, భాషలో, దేశంలో తమ తమ సాహిత్యాన్ని గౌరవ భంగం కలగకుండా కాపాడుకుంటూ వస్తారు. అలాగే ప్రతి సందర్భంలో, ప్రతి సన్నివేశంలో ఈ సాహిత్యంలో భాగం కావాలని నిజాయితీగా అభిలషించేవారూ ఉంటారు.వీరి ప్రయత్న శుద్ధి, సృజన సామర్థ్యం, విడదీయలేని స్వభావం ఇవ్వవలసిన గుర్తింపు ఇస్తూనే ఉంటాయి. వీరు కాక ఔత్సాహిక పాఠకులు, ఔత్సాహిక సాహితీ సేవకులూ ఉంటారు. వీరు తమను తాము సాహితీకారులుగా భావించుకుని కార్యాచరణలో దిగడమూ, సాహిత్యానికి ప్రతినిధులుగా మారడం నేటి సోషల్ మీడియా కాలంలో విస్తృతమైంది. సాహిత్యం ఇచ్చే గుర్తింపు ఆనందాన్ని, ఆత్మసంతృప్తిని కలిగించడమేగాక ఏదో ఒక ఊతం దొరికింది కదా అనుకునేలా చేయడం ఇందుకు కారణం. ఇవన్నీ ఉండాల్సినవే. ఉండతగ్గవే. కాకుంటే శ్రుతి మించి అసలు కొంత, కొసరు మరింతగా మారడం నేటి దుఃస్థితి. వాస్తవానికి రెండు రాష్ట్రాలలోని చిన్న ఊళ్లలో ఉంటూ మంచి కవిత్వాన్ని, కథను రాస్తున్న యువతరం ఎందరో ఉన్నారు. అలాగే ఏళ్లకేళ్లు తమ మానాన తాము రాసుకుంటూ పాఠకుల గౌరవం పొందినవారూ ఉన్నారు. వీరంతా పి.ఆర్. చేయకపోవచ్చు. తమను తాము ముందుకు నెట్టుకోకపోవచ్చు. అంతమాత్రాన రాష్ట్ర, జాతీయస్థాయి వేదికల మీద వీరు కనపడాల్సిన పనిలేదు అనుకోరాదు. అదే సమయంలో పరిచయ సామర్థ్యమే సాహితీ సామర్థ్యంగా చెల్లుబాటయ్యే వారు అట్టి వేదికల మీద పదే పదే సాహితీ ముఖాలుగా కనిపించడాన్నీ ఉపేక్షించాల్సిన పని లేదు. ‘సత్యముతో పని ఏల, మిడియోకర్లతో కలిసి నడిచి ప్రయోజనాలు పొందితే పోలా’ అనుకునే నిజ సాహితీకారులదీ ఈ దోషం. కళ్లు మూత. ఏమైనా మాట్లాడే సందర్భం వస్తుంది. అభినయ సాహిత్యకారులూ కొంచెం నెమ్మదించండి! -
సంజీవని కావాలి!
మనం మనుషులం, మర్త్యులం. పుట్టిన ప్రతి మనిషికీ మరణం తప్పదు. మరణించిన మనుషులు తిరిగి బతికిన ఉదంతాలు అరుదుగా వార్తల్లో కనిపిస్తుంటాయి. చితి మీద నుంచి లేదా శవపేటిక నుంచి అలా బతికి లేచిన వాళ్లు కూడా ఏదో ఒకరోజు మరణిస్తారు. ‘జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ/ తస్మాద పరిహార్యేర్థే న/ త్వం శోచితు మర్హసి’ అని భగవద్గీతలో ఆ శ్రీకృష్ణ పరమాత్ముడే చెప్పాడు. పుట్టిన వారికి మరణం తప్పదని, మరణించిన వారు తిరిగి పుట్టక తప్పదని, ఇదంతా ఒక చక్రమని చాలా మతాలు నమ్ముతాయి. ఈ నమ్మకంలోని నిజానిజాలు ఆ భగవంతుడికే ఎరుక! ఇది ఇంతవరకు శాస్త్రీయంగా రుజువు కాలేదు. నమ్మకాలకు రుజువులతో పనిలేదు. నమ్మకాలను కలిగి ఉండటం ప్రజల హక్కు గనుక జనన మరణ చక్రంపై నమ్మకాన్ని అలా విడిచిపెడదాం. మన పురాణాల్లో మరణించిన వారిని బతికించిన ఉదంతాలు ఉన్నాయి. అసురగురుడు శుక్రాచార్యుడి వద్ద మృతసంజీవని విద్య ఉండేదట! ఆ విద్యతోనే దేవతలతో జరిగిన యుద్ధాల్లో మరణించిన దానవులందరినీ ఆయన మళ్లీ బతికించేసేవాడట! అప్పట్లో దేవతల వద్ద ఈ విద్య ఉండేది కాదు. ఆ తర్వాత క్షీరసాగర మథనంలో పుట్టిన అమృతం తాగిన తర్వాతనే దేవతలు అమర్త్యులుగా మారారు. క్షీరసాగర మథనానికి ముందు ప్రమాద నివారణ చర్యల్లో భాగంగా దేవగురువు బృహస్పతి మృతసంజీవని విద్యను శుక్రుని వద్ద నేర్చుకోవడానికి స్వయంగా తన కొడుకు కచుడిని పంపించాడు. శుక్రాచార్యుడి ఆశ్రమంలో కచుడి ప్రవేశం ముక్కోణపు ప్రేమ గాథకు దారితీసింది. అదంతా వేరే కథ! త్రేతాయుగం నాటి రామాయణంలో కూడా మృతులను బతికించిన సందర్భం కనిపిస్తుంది. అప్పట్లో ఈ విద్య వానర వైద్యుడు సుషేణుడికి తెలుసు. రామ రావణ యుద్ధంలో ఇంద్రజిత్తు బాణం దెబ్బకు లక్ష్మణుడు మూర్ఛిల్లినప్పుడు సుషేణుడి సలహాపై హనుమంతుడు సంజీవని మూలిక దొరికే సుమేరు పర్వతానికి వెళ్లి, మూలికను గుర్తించలేక ఏకంగా పర్వతాన్ని పెకలించుకొచ్చాడు. సుషేణుడు సంజీవని మూలికతో లక్ష్మణుడు తెప్పరిల్లేలా చేశాడు. అప్పటి వరకు యుద్ధంలో మరణించిన వానరులను తిరిగి బతికించాడు. ఇదంతా రామాయణ కథనం. ద్వాపర యుగం నాటికి మరణించినవాళ్లను తిరిగి బతికించే విద్య అంతరించిందేమో! కురుక్షేత్ర యుద్ధంలో మరణించిన వాళ్లెవరూ తిరిగి బతికిన దాఖలాలు కనిపించవు. ఆధునిక కాలంలో మనమేం చేస్తున్నామంటే, భూమ్మీద సృష్టి మొదలైనది లగాయతు ఇప్పటి వరకు ఏమేమి అంతరించిపోయాయో లెక్కలు వేసుకుంటున్నాం. భూమ్మీద జీవసృష్టి మొదలయ్యాక దాదాపు ఐదువందల కోట్ల జీవరాశులు ఉద్భవించాయి. వాటిలో తొంభైతొమ్మిది శాతం అంతరించిపోయాయి. ఇప్పటికి మిగిలిన జీవజాతులు దాదాపు ఎనభై ఏడు లక్షలు మాత్రమే! వీటిలోనూ కొన్ని జీవజాతులు మన కళ్లముందే అంతరించిపోయే పరిస్థితులు ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భూమ్మీద అంతరించిపోతున్నవి జీవరాశులు మాత్రమే కాదు. భూమ్మీద పుట్టిన మనుషులు సృష్టించుకున్న ఎన్నో నాగరికతలు, భాషలు అంతరించిపోయాయి. ఆధునికత అభివృద్ధి చెందే క్రమంలో ఎన్నో వస్తువులు, ఎన్నో కళలు కనుమరుగైపోయాయి. ప్రపంచవ్యాప్తంగా దాదాపు ఏడువేల భాషలను శాస్త్రవేత్తలు గుర్తించారు. వీటిలో దాదాపు ఐదువందల వరకు భాషలు పూర్తిగా అంతరించాయి. మనుగడలో ఉన్న భాషల్లోనూ కొన్ని సాహితీప్రక్రియలు కనుమరుగైపోయాయి. కొన్ని భాషలు కొన ఊపిరితో ఉన్నాయి. యునెస్కో రూపొందించిన ‘వరల్డ్ అట్లాస్ ఆఫ్ లాంగ్వే జెస్’ ప్రకారం ప్రస్తుత ప్రపంచంలో సుమారు రెండున్నరవేల భాషలు రానున్న కాలంలో కనుమరుగయ్యే స్థితిలో ఉన్నాయి. ఒక భాష అంతరించిపోతే, ఆ భాషతో ముడిపడి ఉన్న ప్రజల చరిత్ర అంతరించిపోతుంది. ఆ భాషలో నమోదై ఉన్న విలువైన సాహిత్యం, శాస్త్రవిజ్ఞానం; ఆ భాష ప్రజల సంస్కృతి కూడా తుడిచిపెట్టుకుపోతాయి. ఇప్పటికే అంతరించిపోయిన భాషలను ఎటూ కాపాడుకోలేకపోయాం. కనీసం ప్రమాదం అంచుల్లో ఉన్న భాషలనైనా కాపాడుకోవడానికి ప్రయత్నిస్తే మంచిది. మరణించిన భాషలకు ప్రాణం పోసే మృతసంజీవని విద్య ఏదీ ఇప్పటివరకు లేదు. అయితే, అంతరించిపోయిన కొన్ని అరుదైన జీవరాశులకు తిరిగి ప్రాణం పోయడానికి శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు. నాలుగు శతాబ్దాల కిందట అంతరించిపోయిన ‘డోడో’ అనే ఎగరలేని పక్షిని జన్యుసాంకేతిక పరిజ్ఞానంతో తిరిగి పుట్టించడానికి అమెరికన్ శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు. నాణ్యత అరుదైపోతున్న ప్రక్రియల విషయానికి వస్తే – తెలుగు సాహిత్యంలో ఇప్పుడు కొన ఊపిరితో ఉన్న ప్రక్రియ విమర్శ. ఆధునిక తెలుగు సాహిత్యంలో కందుకూరి వీరేశలింగంతో మొదలైన విమర్శ – రాచమల్లు రామచంద్రారెడ్డి నాటికి గొప్ప దశకు చేరుకుంది. కానీ, తర్వాత తర్వాత చప్పబడింది. రచయితలు రాటుదేలడానికి విమర్శకులు చాలా అవసరం. తెలుగు సాహిత్యంలో ప్రస్తుతం రచయితలకు, కవులకు కొదవలేదు గాని, విమర్శకుల లోటు బలంగా ఉంది. కొద్దిమంది విమర్శకులు ఈ ప్రక్రియను బతికించుకుంటూ వస్తున్నారు. అలాగని విమర్శ ప్రక్రియ క్షీణతకు కేవలం విమర్శకులను తప్పుపట్టలేం. విమర్శను తట్టుకునే శక్తి రచయితల్లో కొరవడటం కూడా ఈ పరిస్థితికి కారణం కావచ్చు. విమర్శ కనుమరుగైపోతే, సాహితీ సృజన అంతరించి పోవడానికి ఎంతోకాలం పట్టదు. ఇప్పుడు విమర్శకు పునర్జీవం కల్పించే సంజీవని కావాలి! -
అదిగో అయోధ్య... అల్లదిగో అయోధ్య
రాముడు శ్రీరాముడు సకల గుణాభిరాముడు రాఘవుడు... ఇన్ని నామాంతరాలు ఉన్న ఆ దశరథ రాముడు... ఆ రోజున తెల్లవారుజామునే మేల్కొన్నాడు... సరయూ జలాలలో అభ్యంగన స్నానం ఆచరించాడు... అల్లలాడుతున్న అలకలను సరిచేసుకున్నాడు...సూర్య వంశ చిహ్నంగా నుదుటన రవి తిలకం ధరించాడు రవికులుడు... చల్లని వెన్నెలలు చిలకరించే రాజీవాక్షాలకు నల్లని కాటుక అలదాడు..సీతమ్మకు ఆనవాలుగా పంపిన అంగుళీయకాన్ని వేలికి ధరించాడు... తన పట్టాభిషేక సమయానికి సిద్ధం చేయించిన వస్త్రాలు ధరించాడు.. నాడు భరతుడు సింహాసనం మీద ఉంచి పరిపాలన కొనసాగించిన పాదుకలలో పాదాలుంచాడు... బాల్యంలో చందమామ కావాలి అని మారాము చేసినప్పుడు అద్దంలో చందమామను చూపిన ఆ అద్దంలో ఇప్పుడు ఈ రామచంద్రుడు తన ముఖ బింబాన్ని చూసుకుని... చిరునవ్వులు చిందిస్తూ... గడప దాటి బయటకు అడుగు పెట్టబోతున్నాడు... సరిగ్గా అదే సమయానికి... గుమ్మం ముందర కవి సమూహం లోపలకు వస్తూ కనిపించారు. వారికి వినమ్రపూర్వకంగా నమస్కరించి, లోపలకు ఆహ్వానించి, సముచిత స్థానాలు చూపి, ఆసీనులను చేసి, తాను కూడా గౌరవముద్రలో సింహాసనం అధిరోహించాడు.. అందరూ విశ్రాంతులైన పిదప... ‘వాల్మీకి మహర్షీ! మహానుభావులంతా ఒక్కసారే విచ్చేశారు. కారణం తెలుసుకోవచ్చా’ అని వినమ్రంగా ప్రశ్నించాడు. వాల్మీకి తన గుబురు శ్మశ్రువుల మాటు నుంచి చిన్నగా నవ్వుతూ, ‘ఏమయ్యా! నువ్వు ఇంత తొందరగా ఏదో పని మీద బయలుదేరినట్టున్నావు. విషయం తెలుసుకోవచ్చా’ అన్నాడు ఏమీ ఎరగనట్లు. ‘మహర్షీ! ఏమీ ఎరగనట్లు ప్రశ్నిస్తున్నారు. మీరే కదా నా కథను లవకుశల ద్వారా గానం చేయించి ప్రపంచానికి పరిచయం చేసింది. నాకు ఎంతటి మంచి లక్షణాలు ఉండాలో కూడా మీరే నిర్దేశించారు కదా. అటువంటి మీకు నేను ఎప్పుడు, ఎక్కడకు వెళ్తానో తెలియదా. నా నోటితో చెప్పించాలనే ఆలోచన కాకపోతేను’ అన్నాడు వాల్మీకి మహర్షితో చనువుగా. ‘నాకు తెలుసు రామా! నీ వినయం, విధేయత, గౌరవం... అన్నీ. ఈ రోజు ఇక్కడకు వచ్చినవారిని గమనించావా. వీరంతా నీ కథను ఇన్ని వేల సంవత్సరలుగా సజీవంగా ఉంచిన మహానుభావులు. నేను రాసిన కథను యథాతథంగా ఉంచకుండా, వారికి తోచిన కల్పనలు కూడా చేశారు. వీరందరికీ నువ్వంటే ప్రీతి. అందుకే వారి మనసుకి నచ్చిన విధంగా నిన్ను కీర్తించారు. నిన్ను నెత్తిన పెట్టుకుని నేటికీ ‘రామాయణం’ అనే కావ్యాన్ని ‘రామ’ అనే తారక మంత్రాన్ని ఇంకా పచ్చిగా, లేతగా, తడి ఆరకుండా ఉంచారు... అని వాల్మీకి పారవశ్యంతో పలుకుతుంటే, రాముని శరీరం పులకించిపోయింది. రామా! నీకు ఒక్కొక్కరినీ మరోసారి పరిచయం చేస్తాను. ఇప్పుడు నువ్వు బయటకు వెళ్లే సంతోషంలో ఉన్నావు. అందువల్ల నేను పరిచయం చేస్తేనే కాని వారిని నువ్వు జ్ఞప్తికి తెచ్చుకోలేవు.... అంటూ పండిత పరిషత్తు వైపునకు తల పరికించాడు. ఇదిగో మొట్టమొదటగా చెప్పవలసిన వ్యక్తి కాళిదాసు. ఈయన కవికుల గురువు. నీ గొప్పదనాన్ని ‘రఘువంశం’ అనే కావ్యంగా వెలయించాడు. మీ కుటుంబాన్ని ఎంత గొప్పగా ప్రస్తుతించాడో తెలుసా. ఆ కవిత్వమంతా ఇప్పుడు చెప్పనులే. రేఖామాత్రంగానే పరిచయం చేస్తాను. ఇక ఆ పక్కన కూర్చున్న కవి భవభూతి. ఉత్తర రామ చరిత రచించి అందరి కంట నీరు పెట్టించాడు. ఆ పక్కనే ఉన్న భాసుడు ‘ప్రతిమ’ అనే నాటకాన్ని రచించాడు. ఆయనకు నా రామాయణంలోని కొన్ని విషయాలు నచ్చలేదు. అందుకని ఆయన కొన్ని కల్పనలు చేశాడు.కైకేయి దుర్బుద్ధికాని, లక్ష్మణుడు అవాచ్యకాలు పలకలడం కాని ఇందులో కనపడదు. దశరథ ప్రతిమా కల్పనం, దశరథ శ్రాద్ధ కలనం వంటి కొన్ని అంశాలు ఇందులోని కొత్త విషయాలు. అర్థమైందా ఈ కవి విలక్షణత. ఆయనకు కైకమ్మను నిందించాలనిపించలేదు. సరే – ఇంక ఆ పక్కన చూడు... మురారి. ఆయనకు నా పేరు కూడా చేరింది. బాల వాల్మీకి అని పిలుస్తారు. ఎన్నో గురుకుల క్లేశాలు అనుభవించి, చివరకు కవికులంలో స్థానం సంపాదించాడు. ఆ మహానుభావుడు.. నీ తండ్రి దశరథుడిని ఎంత గొప్పగా ప్రశంసించాడో తెలుసా. ఆయనట ఏకంగా దిక్పాలకులను తన ఇంటి ముంగిట్లో బంధించేశాడు. అంటే వారికి పని లేకుండా నీ తండ్రి గారే ముల్లోకాలను సుభిక్షంగా పరిపాలించాడట. అబ్బో ఈ కవి గురించి ఎంత చెప్పినా చాలదు. ఆయన మార్గమే వేరు. నీకు ముందు ముందు ఇటువంటి మార్గంలో వెళ్లిన మరో ఇద్దరిని గురించి చెబుతానులే. ఇక తెలుగు కవులలోకి వస్తే... అబ్బో... బోలెడు మంది.. తెలుగులో ఆది కావ్యం రచించిన నన్నయ మొదలుగా నిన్నమొన్నటి ఉషశ్రీ వరకు ఎంత మంది ఎంత అందంగా నీ కావ్యాన్న రచించారో. కవిత్రయంలో మొదటివాడైన నన్నయభట్టు మహానుభావుడు భారత ఆంధ్రీకరణేకాకుండా నీ కథను ‘రాఘవాభ్యుదయం’ పేరిట తెలుగువారికి అందించాడు. ఆ కవిత్రయంలో రెండవ వాడైన తిక్కన ‘నిర్వచనోత్తర రామాయణం’ పేరున తొట్టతొలి ప్రబంధ కావ్యాన్ని, ఒక్క వచనం కూడా లేకుండా పూర్తి పద్యంలో రచించాడు. కవిత్రయంలో మూడవ వాడైన ఎరన్ర కూడా రామాయణం కావ్యాన్ని రచించాడు. ఇక మంత్రి భాస్కరుడు ‘భాస్కర రామాయణం’, కుమ్మరి మొల్ల ‘మొల్ల రామాయణం’, గోన బుద్ధారెడ్డి ‘రంగనాథ రామాయణం’ రచించారు. వారంతా నీ పట్ల ప్రేమానురాగాలను కురిపిస్తున్న కన్నులతో ఎంత భక్తిగా కూర్చున్నారో చూడు. ఇక వీరందరిదీ ఒక ఎత్తయితే... ఆ మురారిలాగే నిరంకుశుడైన కవి ‘కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ’. ఆ మహానుభావుడు నీ క్రీగంటి చూపు కోసం చూస్తున్నాడు. అటు వైపుగా ఒక్కసారి నీ తల త్రిప్పు. ఈయన నీ కథను ‘రామాయణ కల్పవక్షం’ పేరున రచించి, తెలుగులో మొట్టమొదటి జ్ఞానపీఠ సత్కారాన్ని అందుకున్నాడు. ఇంకా ఎన్నో సత్కారాలు ఉన్నాయిలే. నిన్ను తనకు కావలసిన విధంగా ప్రస్తుతించుకున్నాడు. ఇక ఈ సభకు హాజరైన చివరివాడు ‘ఉషశ్రీ’. మురారి పంథాలో విశ్వనాథ కావ్యరచన చేస్తే, ఆ విశ్వనాథ చేత ‘ఇది ఉషశ్రీ మార్గము’ అనిపించుకుని, నిన్ను నెత్తిన పెట్టుకుని ఊరేగాడు. వాడు త్యాగ్య వాగ్గేయకారుడైతే, వీడు వాక్కావ్యకారుడు. తన నోటితో నీ కథను అందంగా చెబుతూ, తన కలంతో కూడా అంతే అందంగా నిన్ను ప్రస్తుతించాడు. ఇంతమంది కవులు నీ కోసం నిరీక్షిస్తుంటే... నువ్వు నీ బాల రామ ప్రతిష్ఠ కోసం పరుగులు తీయడం న్యాయమేనా. అందుకే నిన్ను లోపలకు పిలిచాను. వీరందరికీ నీ తియ్యని ఆశీర్వచనాలు కావాలి.. అంటూ వాల్మీకి పలుకుతుంటే... మరో నలుగురు పరుగుపరుగున లోపలకు ప్రవేశించారు. వారిలో ప్రథముడు కంచర్ల గోపన్న... అయ్యా! వాల్మీకి మహర్షీ! నన్ను మరచిపోతే ఎలాగయ్యా.. అంటూ పాదాల మీద వాలాడు. వాల్మీకి ఆ గోపన్నను దగ్గరగా తీసుకుని, ‘రామభద్రా! వీడు నీ కోసం భద్రాద్రిలో ఆలయం నిర్మించాడు. నీ పేరున కీర్తనలు రచించి, గోపన్న నామాన్ని రామదాసుగా మార్చుకున్నాడు. నీ కోసం కారాగారం పాలయ్యాడు. ఎన్నో దెబ్బలు తిన్నాడు. అయితేనేం, నీ గురించి ఎన్నో మంచి మంచి కీర్తనలు రచించాడు... అంటుంటే, రామదాసు శ్రీరాముని పాదాల ముందు సాష్టాంగపడ్డాడు. ఇదిగో ఈ మహానుభావుడిని చూడు. ఈయన త్యాగయ్య. నీ మీద ఎన్ని కీర్తనలు రచించాడు. ‘మా జానకి చెట్టపట్టగా మహరాజువైతివి’ అని ఆ తల్లి సీతమ్మను తన గుండెల్లో పొదివిపట్టుకున్నాడు.. అని త్యాగయ్య గురించి పలుకుతుంటే, ఆ మహానుభావుడు తన చేతిలోని తంబురను శ్రీరాముని చేతికిచ్చాడు. ఆ రాముడు తన విల్లును పక్కన పెట్టి, తంబురనే విల్లుగా ధరించాడు. అంతే ఆ దశ్యం చూసిన కొంటె బొమ్మల బాపు... గబగబ అయిదు నిమిషాలలో కవుల కొలువును, తంబుర రాముడిని తన రేఖలలో నింపేశాడు. ఆ పక్కన ముసిముసి నవ్వులతో బాపుని అంటిపెట్టుకున్న ముళ్లపూడి రమణ.. శ్రీరామా! ఓ ఫైవ్ లెటర్స్ అప్పు ఇస్తావా నిన్ను పొగడటానికి... అంటూ ఆయన పాదాల ముందు మోకరిల్లాడు. ఈసారి రాముడు కాదు, వాల్మీకి పరవశించిపోయాడు. నేను 24 వేల శ్లోకాలతో రామకథను కొన్ని వేల సంవత్సరాల క్రితం రచిస్తే, నేటికీ నా రాముడిని అందరూ అక్షరాలలో బంధిస్తూనే ఉన్నారు. ‘రామా! ఇది నా గొప్పతనం కాదు. ఇది నీ గొప్పదనం. నీ వ్యక్తిత్వ ఔన్నత్యం. నీ తండ్రి దశరథుడు నేర్పిన సంస్కారం గొప్పదనం.మా జన్మలు ధన్యమయ్యాయయ్యా. ఇక నువ్వు నీ బాల విగ్రహ ప్రతిష్ఠ చూడటానికి బయలుదేరు. మేమంతా నీ వెంట వస్తాం. అక్కడ అయోధ్యలో ‘రామాయ రామభద్రాయ రాచంద్రాయ వేధసే’ అంటూ రామాయణ గాథ ఉషశ్రీ గళం వినిపిస్తున్నారట. ‘మన ఉషశ్రీ ధన్యుడయ్యాడు. నీ ఎదుట గళం వినిపించే అదృష్టం అతడిని మాత్రమే వరించింది. అతడి మాటలలోనే నా ఉపన్యాసం ముగిస్తాను. స్వస్తి’ అంటూ వాల్మీకి ముగింపు పలికాడు. అందరూ నెమ్మదిగా అయోధ్య వైపుగా బయలుదేరబోతున్నారు. చకచక అడుగులు వేస్తూ ఉషశ్రీ వేగంగా వెళ్లడం గమనించిన రాముడు, ‘మహర్షీ! మనం కూడా బయలుదేరాలయ్యా. వాడు కాలాంతకుడు. సమయ పాలన వాడి ఆత్మ. నా బాలరామ విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నారు కదా. ఆ వ్యాఖ్యానం వీడి గళం నుంచే వెలువడబోతోంది. వాడితో పాటు వాడికి ‘ప్రత్యక్ష వ్యాఖ్యానం ఇలా ఉండాలి’ అని మార్గదర్శనం చేసిన జమ్మలమడక మాధవరామ శర్మ కూడా ఈ పాటికి అక్కడికి చేరి ఉంటాడు. వేగంగా పదండి’ అని పలికాడు. అదిగో అయోధ్య. అదిగో రాముడు. అదిగో మన కవిపండితులు. అదిగో మన తెలుగువారు. జై శ్రీరామ్... (జనవరి 22, 2024 సోమవారం నాడు బాలరామ విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరుగుతున్న సందర్భంగా సృజన రచన. - డా. పురాణపండ వైజయంతి) -
రెండో గొంతు
మనదైనది ఏదో వ్యక్తం చేయడానికి మనదైన భాష ఒకటి ఉండాలనుకుంటాం. కానీ భాష చిత్రమైంది. ఒక్కోసారి అనుకున్న మాట వెంటనే తట్టదు. ఇంకో సందర్భంలో ఆ ఒక్కమాటకు పది మాటలు కనబడి గందరగోళ పరుస్తాయి. రెండు సందర్భాల్లోనూ మనిషి మూగ కావడం గమనార్హం. ఇదంతా భాష సమస్య కాదేమో; మన లోపలి భావానికి అనుగుణంగా భాష మనల్ని ఇలా ఒంటరిగా మాట తోడులేకుండా నిలబెట్టే స్థితిని కల్పిస్తుందేమో! భావం అనేది చాలా సంక్లిష్టమైంది కదా మరి! దాన్ని భాషలోకి తేవాలని అనుకున్నప్పుడు, ఎంతో తెలుసు అనుకున్నది కూడా, ఏ కొసను అందుకోవాలో తెలియక తికమక పరుస్తుంది. ఒక తేనెతుట్టె ఏదో లోపల కదిలినట్టయి గందరగోళం తలెత్తుతుంది. అనుకున్న వ్యక్తీకరణ గాడి తప్పుతుంది. భావాన్ని వ్యక్తపరచడానికి ఏ భాష అయితే కావాలో అదే అవరోధంగా మారడం తమాషా కదా! మరి దానికేమిటి దారి? సంజ్ఞలైతే పనికిరావు. కాబట్టి మళ్లీ భాషే దిక్కు. పోనీ, ఇంకేదో భాష అయితే? అందులో మనకు అంతగా ప్రవేశం లేనిదైతే? ఒక్కోమాటా వాక్యంగా పేర్చుకునేదైతే? నిజంగా అలా రాయడం సాధ్యమా? ప్రపంచ సాహిత్యంలో పేరెన్నికగన్న కొందరు రచయితలు ‘తమది కాని’ భాషలో సాహిత్యం సృజించారు. 1978లో బేస్‌బాల్ గేమ్ చూస్తున్నప్పుడు, ఆటగాడు బంతిని బలంగా కొట్టిన బ్యాట్ శబ్దం టోక్యో శివార్లలోని ‘జింగు’ స్టేడియం మొత్తం ప్రతిధ్వనించిన ఒకానొక క్షణాన ఇరవైల్లో ఉన్న హరూకీ మురకామీకి ఉన్నట్టుండి తానూ రాయగలనని అనిపించింది. ఆ క్షణం ఆయనలో ఏదో ఎల్లలు లేని సృజనావేశం తన్నుకొచ్చింది. దాన్ని అలాగే పోనీయకుండా కొన్ని నెలలు శ్రమించి, రాత్రుళ్లు కుస్తీపట్టి జపనీస్ భాషలో మొదటి నవల రాయడానికి ప్రయత్నించాడు. అంతా అయ్యాక చదివితే ఆయనకే నచ్చలేదు. దీనికి కారణం – తన మాతృభాషలో ‘పశువుల కొట్టంలో పశువులు క్రిక్కిరిసినట్టుగా’ ఆలోచనలు రొద పెట్టడమే! దీనివల్ల ఉక్కిరిబిక్కిరికి లోనయ్యాడు. ‘ఒకరి భావాలను అలవోకగా ఒక క్రమంలో పెట్టడం గురించి మాట్లాడటం సులభమేగానీ, అలా చేయడం అంత సులభం కాదు. బొత్తిగా అప్పుడే రాయడం మొదలుపెట్టిన నా లాంటివాడికి అది మరింత కష్టం. కొత్తగా మళ్లీ ప్రారంభించడానికి, నేను చేయాల్సివచ్చిన మొదటి పని నా రాతప్రతుల కుప్పనూ, ఫౌంటెన్ పెన్ నూ వదిలించుకోవడం! అవి నా ముందు ఉన్నంతసేపూ నేనేదో ‘సాహిత్యం’ లాంటిదాన్ని రాస్తున్నట్టనిపించింది. వాటి స్థానంలోకి నా పాత అలవెటీ టైప్‌రైటర్‌ను అల్మారా లోంచి తెచ్చాను. తర్వాత, ఒక ప్రయోగం లాగా, నా నవల ప్రారంభాన్ని ఇంగ్లీష్‌లో రాయాలని నిర్ణయించుకున్నాను. ఎటూ ఏదైనా కొత్తగా ప్రయత్నించాలనుకున్నప్పుడు ఇలా ఎందుకు చేయకూడదనిపించింది?’ అంటూ మురకామీ తాను తన జపనీస్‌ను కాదని ఆంగ్లంలో రాయడానికి పూనుకోవాల్సి వచ్చిన నేపథ్యం చెబుతాడు. అయితే, ఆంగ్లం ఆయనకేమీ మంచినీళ్ల ప్రాయం కాదు. ఈ భాష పరిమితి వల్ల సంక్లిష్ట వాక్యాలు రాయడం కుదరదు. ఆ ఉన్న కొద్దిపాటి పదసంపద, వ్యాకరణాలనే ప్రతిభావంతంగా ఉపయోగించుకోవాలి. ‘మై కిచెన్ టేబుల్ ఫిక్షన్ ’ ధోరణిగా వర్ణించే ఆయన రచనలు అలా మొదలయ్యాయి. ఈ ధోరణిలో వచ్చిన ‘హియర్ ద విండ్ సింగ్’ నవలిక మురకామీని అమాంతం పైకి ఎత్తేసింది. కృత్యాదిలోనే మురకామీ అవస్థ పడ్డాడు. కానీ ఝుంపా లాహిరిది ఇంకో కథ. లండన్ లో పుట్టి, అమెరికాలో పెరిగిన భారత(బాంగ్లా) సంతతి ఝుంపా ‘ఇంటర్ప్రిటర్ ఆఫ్ మాలడీస్’ నవలకు ‘పులిట్జర్’ గెలుచుకుంది. ‘నేమ్‌సేక్’తో మరింత పేరొచ్చింది. ఉన్నట్టుండి తన నలభై ఐదేళ్ల వయసులో ఇటాలియన్ లో రాయాలని నిర్ణయించుకుంది. కొత్త భాషలో రాయడంలో ఒక స్వేచ్ఛ ఉంది అంటారామె. ‘పర్ఫెక్టుగా ఉండనక్కరలేని స్వేచ్ఛ’. న్యూయార్క్‌లో కొన్ని ఇటాలియన్ పాఠాలు విన్న అనుభవం ఉంది. కానీ ఆ భాష కోసమే 2015లో ఆమె కుటుంబంతో సహా రోమ్కు వెళ్లి, కొన్నేళ్లు ఉండివచ్చింది. తర్వాత మూడు పుస్తకాలు ఇటాలియన్ లో వెలువరించింది. తర్వాత అవి ఆంగ్లంలోకి వచ్చాయి. సహజంగానే ఇటాలియన్ లో రాయడమేంటని చాలామందే ఆమెను ప్రశ్నించారు. ఒక్కొక్క పదం, వాక్యం ద్వారా వ్యక్తీకరణను కూడగట్టుకొని కొత్త లోకపు ద్వారంలోకి ప్రవేశించినట్టుగా అనుభూతి చెందానంటుంది. పాత, కొత్త ప్రపంచాల మధ్య అదొక సవాలు కూడా! ‘ఇటాలియన్ భాష నా జీవితాన్నేమీ మార్చలేదు; అది నాకు రెండో జీవితాన్ని ఇచ్చింది; మరో అదనపు జీవితం’. తన అసంబద్ధ రచన ‘వెయిటింగ్ ఫర్ గోడో’ ద్వారా ఖ్యాతినొందిన శామ్యూల్ బెకెట్ పుట్టుకతో ఐరిష్‌వాడు అయినప్పటికీ ఫ్రెంచ్ను తన రచనాభాషగా ఎంచుకున్నాడు. దానికి ఆయన చెప్పిన కారణాలు సాధారణంగా రచయితలు కోరుకునే లక్షణాలకు పూర్తి విరుద్ధమైనవి. తన మాతృభాషకు దూరం కావడం అనేది, ఒక ముసుగును చించుకోవడంతో సమానంగా చూశాడు. ఫ్రెంచ్‌లో (పరాయి భాష) మాత్రమే ఒక శైలి లేకుండా రాయడం సాధ్యమవుతుందన్నాడు. అలాగైతేనే తనకు తగిన వనరులు లేకుండా పోతాయన్నాడు. అందువల్లేనేమో, ఆయన ప్రసిద్ధ ‘మినిమలిస్ట్’ రచయిత కాగలిగాడు. వేర్వేరు కారణాల వల్ల తమ మాతృభాషలకు దూరమైన రచయితలు ఎందరో ఉన్నారు. పరిస్థితులు వారికి అలాంటి పరీక్ష పెట్టాయి. ఆ వేదన ఇక్కడ అప్రస్తుతం. కానీ భాష అనేదాన్ని ఒక అవరోధంగా పెట్టుకుని రాయాలనుకోవడం దానికదే ఒక సవాలు. ప్రాణవాయువును మరీ ఎక్కువగా పీల్చకుండా పొదుపుగా వాడుకుంటూ బతికే యోగసాధన లాంటిది అది. -
ఎక్సలెంట్ రైటర్స్ ! అన్నప్రాసన నాడే ఆవకాయ తిన్న ఉద్దండపిండాలు!
అన్నప్రాసన నాడే ఆవకాయ తిన్న ఉద్దండపిండాలు ఉన్నారు తెలుసా? వాళ్లు ఆ సాహసం చేయడం వల్లే ఈ రోజు మనం వాళ్ల గురించి మాట్లాడుకోగలుతున్నాం. ఇక్కడ చెప్పుకోబోయే పిడుగులు పిన్న వయసులోనే చేయి తిరిగిన రచయితలకు మల్లే అద్భుతమైన పుస్తకాలను అవలీలగా రాసేశారు. పుస్తక ప్రియుల చేత ‘ఎక్సలెంట్’ అనిపించుకున్నారు. వాళ్లెవరంటే.. డోరతీ స్ట్రెయిట్ అమెరికన్ రచయిత్రి. 1958లో జన్మించిన డోరతీ.. నాలుగేళ్ల వయసులోనే ‘హౌ ద వరల్డ్ బిగాన్ ’ అనే పుస్తకం రాసి తన అమ్మమ్మకు బహుమతిగా ఇచ్చింది. ఈ ప్రపంచాన్ని ఎవరు సృష్టించారు? అని తల్లి వేసిన ప్రశ్నే ఆమెలోని రచన సృజనను వెలికి తీసిందట. ప్రస్తుతం ఆమెకు 65 ఏళ్లు. క్రిస్టఫర్ పాయోలీనీ పదిహేనేళ్ల వయసులోనే హైస్కూల్ పూర్తి చేసిన క్రిస్టఫర్ తన మొదటి నవల ‘ఎరగాన్’ రాయడం ప్రారంభించాడు. తన పద్దెనిమిదో ఏట ఆ పుస్తకాన్ని ప్రచురించాడు. అది న్యూయార్క్ టైమ్స్ బెస్ట్ సెల్లర్ జాబితాలో చేరింది. ఆ సిరీస్‌లో మరో మూడు పుస్తకాలు రాశాడు క్రిస్టఫర్. ఆ సిరీస్ ప్రేరణతో 2006లో పలు సినిమాలూ వెలువడ్డాయి. ఏన్ ఫ్రాంక్ ‘ది డైరీ ఆఫ్ ఎ యంగ్ గర్ల్’.. ప్రపంచంలో అత్యధికులు చదివిన పుస్తకాల్లో ఒకటి. రెండవ ప్రపంచయుద్ధకాలంలో.. జర్మనీకి చెందిన ఏన్ ఫ్రాంక్ అనే అమ్మాయిని, ఆమె కుటుంబాన్ని నాజీలు బంధించి చిత్రహింసలకు గురి చేశారు. అప్పుడు ఏన్కు 15 ఏళ్లు. బందీగా ఉన్న సమయంలో.. తమ నరకయాతనను ఎప్పటికప్పుడు డైరీలో రాసింది. అదే ‘ది డైరీ ఆఫ్ ఎ యంగ్ గర్ల్’ పుస్తకంగా ప్రచురితమైంది. ఇది హిట్లర్ దాష్టీకాలకు.. నాటి యూదుల ఆవేదనకు సాక్ష్యంగా నిలిచింది. ఏన్.. తను తలదాచుకున్న బంకర్లోనే ప్రాణాలు విడిచింది. ఆమె చనిపోయిన రెండేళ్లకు ఈ పుస్తకం ప్రపంచం ముందుకు వచ్చింది. సుమారు 60కి పైగా భాషల్లో అనువాదమైంది. మాటీ స్టెపనేక్ అమెరికన్ సుప్రసిద్ధ కవులు, వక్తల పేర్లలో మాటీ స్టెపనేక్ పేరు కూడా వినిపిస్తుంది. ఆ అబ్బాయి రాసిన జర్నీ త్రూ హార్ట్సాంగ్స్ అనే పుస్తకం బాగా పాపులర్ అయ్యింది. మస్క్యులర్ డిస్ట్రోఫియా బాధితుడైన మాటీ .. చిన్న వయసులోనే అనేక పాటలు, పద్యాలు, కవితలు రాసి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. మోటివేషనల్ స్పీకర్ కూడా. పీస్ అడ్వకేట్‌గానూ వ్యవహరించాడు. అనారోగ్య సమస్యలతో 2004లో.. తన 13వ ఏట తనువుచాలించాడు. (చదవండి: హైటెక్ డాన్స్‌మ్యాట్! ఈజీగా నేర్చుకోవచ్చు!) -
అంతటి హాలీవుడ్ కు సమ్మె ఎఫెక్ట్, నష్టం ఎంతంటే.?
అవును... హాలీవుడ్ సంక్షోభంలో చిక్కుకుంది. ఆరు దశాబ్దాల పైచిలుకు తర్వాత రచయితలు, నటీ నటులు మళ్ళీ ఏకకాలంలో సెట్స్‌కు దూరం జరిగారు. సినిమాలు, టీవీ షోల నిర్మాణం ఒక్కసారిగా ఆగింది. జీతభత్యాల పెంపు సహా పలు అంశాలపై నిర్మాతల కూటమి (అలయన్స్ ఆఫ్ మోషన్ పిక్చర్ అండ్ టెలివిజన్ ప్రొడ్యూసర్స్)తో చర్చలు విఫలమై మే 2 నుంచి రచయితలు సమ్మె బాట పట్టారు. రెండు నెలల తర్వాత తాజాగా ఈ జూలై 13 నుంచి వేలాది నటులూ జత కలిశారు. సరైన జీతం, మెరుగైన పని పరిస్థితుల డిమాండ్లు తీరకపోవడంతో నటులూ పిడికిలి పైకెత్తారు. ఇక, రచన, నటనలో కృత్రిమ మేధ (ఏఐ) వినియోగాన్ని నటీనటుల సంఘం (ఎస్ఏజీ), రచయితల సంఘం (డబ్ల్యూజీఏ)... రెండూ వ్యతిరేకిస్తున్నాయి. సమ్మెకు అదీ ఒక ప్రధాన కారణమే. జంట సమ్మెల ప్రభావం చిత్రనిర్మాణంలోని ఇతర విభాగాల్లో, అనుబంధ పరిశ్రమల్లోని వేలమందిపైనా పడింది. కార్మికులంతా వీధిన పడ్డారు. అందుకే, ఇది వట్టి వినోదానికి మించిన విషయం. సీఈఓలకు లక్షల డాలర్లిస్తూ, రచయితలు, నటుల దగ్గరకొచ్చేసరికి నష్టాలొస్తున్నాయంటూ బీద అరుపులు అరవడం హాలీవుడ్‌లోనూ ఉన్నదే. 2000లో అన్నీ కలిపి హాలీవుడ్ వినోద పరిశ్రమకు 500 కోట్ల డాలర్ల లాభాలొస్తే, నెట్‌ఫ్లిక్స్ చేరికతో 2019కి అది 3 వేల డాలర్లకు దూసుకుపోయింది. రచయితల సంపాదన మాత్రం తగ్గిపోయింది. గత దశాబ్దకాలంలో రచయిత కమ్ నిర్మాత హోదా లోని వారి సగటు జీతం 4 శాతం మేర తగ్గింది. ద్రవ్యోల్బణంతో చూసుకుంటే, ఏకంగా 23 శాతం క్షీణించింది. తాజా స్ట్రీమింగ్ శకం ప్రకంపనలు రచనావృత్తిని తాకాయి. 2000లో టీవీ సీజన్ రైటర్లకు ఏటా 42 వారాల పని దొరికేది. స్ట్రీమింగ్‌తో సీజన్లు తగ్గి, 20 వారాలకు పడిపోయింది. 11,500 మంది సభ్యులున్న రచయితల సంఘంతో మూడేళ్ళకోసారి నిర్మాతల కూటమి కొత్త జీతభత్యాల ఒప్పందం కుదుర్చుకుంటుంది. వార్నర్ బ్రదర్స్, డిస్కవరీ లాంటి భారీ స్టూడియోలు, నెట్‌ఫ్లిక్స్, పీకాక్ లాంటి పలు స్ట్రీమింగ్ వేదికలు ఆ నిర్మాతల్లో భాగమే. ఈసారి మే1తో కొత్త ఒప్పందం రావాలి. ఆరు వారాలు చర్చించినా ఫలితం లేకపోయింది. జీతం, పింఛన్, స్ట్రీమింగ్‌లో పదే పదే ప్రసారంతో రచయితలకు అదనంగా చేయాల్సిన అవశేష చెల్లింపులు (రాయల్టీలు) వగైరా ఎటూ తెగకపోవడంతో కలం కార్మికులు సమ్మె సైరన్ మోగించారు. స్థూలంగా నటీనటులకూ ఇలాంటి సమస్యలే. చర్చలు ఫలించక నటీనటుల సంఘం సైతం తాజాగా షూటింగ్‌లకు దూరం జరిగింది. గత నవంబర్‌లో రంగప్రవేశం చేసిన ఛాట్‌జీపీటీ సైతం సృజనాత్మక రంగాలను కుదిపేస్తోంది. సమీప భవిష్యత్తులో ఏఐతో తమ పొట్ట కొట్టకుండా రక్షణ ఉండాలని రచయితల, నటుల డిమాండ్. ప్రస్తుతం స్ట్రీమింగ్ వేదికలు పెరిగాయి. కంటెంట్ దాహం తీరట్లేదు. దీన్ని అదనుగా చేసుకొని ఏఐ లాంటి వాటి శిక్షణకు తమ స్క్రిప్టులను వినియోగించరాదనీ, తమ రచనల నుంచి కొత్తవి సృష్టించడానికి ఏఐని వాడరాదనీ సృజనకారుల డిమాండ్. నటులు సైతం అనుమతి లేకుండా, పరిహారమి వ్వకుండా ఏఐతో తమ రూపాలనూ, స్వరాలనూ సృష్టించి నటింపజేయరాదంటున్నారు. అది సమంజసమే. నిర్మాతలు మాత్రం నేపథ్యంలోని నటీనటుల స్కాన్లను తీసుకొనే హక్కు తమకు ఉండాలంటున్నారు. తద్వారా వారి రూపాలను ఏఐతో సృష్టించి శాశ్వతంగా వాడుకోనివ్వాలని కోరుతున్నారు. అప్పుడిక పారితోషికమివ్వకుండానే పని జరిగిపోతుందనేది నిర్మాతల ఎత్తు. దీని పైనే తీవ్ర అభ్యంతరం. వెరసి, యావత్ సినీ చరిత్రలోనే రెండో పర్యాయం హాలీవుడ్ స్తంభించింది. 2007లో వంద రోజుల పాటు రచయితల సమ్మెతో ఒక్క క్యాలిఫోర్నియాకే 210 కోట్ల డాలర్ల మేర నష్టం వాటిల్లింది. ఇప్పుడీ జంట సమ్మెలెంత నష్టం తెస్తాయో? రీషూట్లు, ప్రచారాలు, ప్రీమి యర్లకు నటులు దూరమయ్యేసరికి పూర్తయిన సినిమాలకూ ఇబ్బందే. టీవీ షోల కథ సరేసరి. ఎమ్మీ అవార్డుల ప్రదానం లాంటివీ వెనక్కిపోతాయి. వాటి కన్నా ముఖ్యం సాధారణ కార్మికుల పరిస్థితి. 1960లో నటులు, రచయితలు ఒకేసారి సమ్మె చేసినప్పుడు నటీనటుల సంఘానికి సారథి నటుడు, తర్వాత అమెరికా అధ్యక్షుడైన రొనాల్డ్ రీగన్. అయితే ఈసారి సమ్మె ప్రత్యేకమైనది. సాంకేతికతదే పైచేయి అయి, పని స్వభావం, సుస్థిరతపై ప్రభావం పడేవేళ యాజమాన్యానికీ, శ్రామికులకూ మధ్య బం«ధాల పునర్వ్యవస్థీకరణ అవసరమని గుర్తు చేస్తున్న సమ్మె ఇది. ఛాట్ జీపీటీతో పని చౌక గనక రచయితలు, ఎడిటర్లు, ఫోటోగ్రాఫర్ల లాంటి వైట్‌కాలర్ ఉద్యోగాలు పోతాయని భయం. అలాగని అంతర్జాల యుగంలో నియంత్రణలతో టెక్నాలజీని అడ్డగలమా అంటే అనుమానమే. ఎవరికీ దెబ్బ తగలకుండా మధ్యేమార్గంలో పోవడం విజ్ఞత. దర్శక దిగ్గజం క్రిస్టఫర్ నోలన్ అన్నట్టు తారల సంగతెలా ఉన్నా, ఏఐతో రచయితల, చిన్న నటీనటుల పొట్టకొట్టడం భావ్యం కాదు. నిజానికి, రచన, నటన లాంటి సృజనాత్మక కృషికి మేధ కన్నా మానసిక స్పందన ముఖ్యం. మనిషైతేనేం, మెషినైతేనేం అంతా ఒకటేనని కొందరు అనుకోవచ్చు. అననూవచ్చు. భవిష్యత్తులో అలాంటి ఏఐ ఆధారిత సినిమాలు రావచ్చు. కొత్త ఒక వింతగా ఆకట్టుకోనూవచ్చు. కానీ, ఏ సృజన ఎందుకు గొప్పదవుతుందో, ఎలా జనాదరణ పొందుతుందో యంత్రాలు, డేటాలు చెప్పగలవా? నకిలీ నటులు, కంప్యూటర్ రచయితలతో తయారైన ఏఐ చిత్రాలు నిజమైన సినిమాల అనుభూతిని అందించగలవా? కొద్దికాలానికి ఈ కృత్రిమ మేధాసృష్టి విసుగెత్తవచ్చు. అయితే, అప్పటికే అంతా ఆలస్యమైపోతుంది. హాలీవుడ్లో సమ్మె చేస్తున్నవారి ఆవేదన అదే! -
అవార్డులూ.. బహుమతులూను
‘అవార్డులు రావు. కష్టపడి సంపాదించుకోవాలి’ అని అబ్బూరి వరద రాజేశ్వరరావు ఒకసారి అన్నారు. సాహిత్యం, ఆ మాటకొస్తే ఏ కళైనా ప్రచారం కోరుకుంటుంది. ప్రచారం దేనికి? కీర్తి కోసం అనుకునేవారు కొందరు. కళ నిర్వర్తించాల్సిన పరమార్థం కోసం అనుకునేవారు కొందరు. ఉత్కృష్టమైన కళ మబ్బుల చాటు సూరీడు వలే ఎల్లకాలం దాగి ఉండదు. జనులకు తెలిసే తీరుతుంది. ఆదరణ పొందుతుంది. కాని బంగారు చేటకు కూడా గోడచేర్పు అవసరం అన్నట్టు కొన్నిసార్లు కళ ప్రచారం కావడానికి, ఫలానా కళాకారుడి కృషి చూడండహో అని తెలుపడానికి అవార్డులూ, బహుమతులూ ఉపయోగపడతాయి. అయితే కాలక్రమంలో ఇడ్లీ కంటే చట్నీకి విలువెక్కువైనట్టు కళ కంటే ఈ అవార్డులకు విలువ ఎక్కువై అవార్డు వచ్చినవారు ‘గొప్పవారేమో’ అనే భావన జన సామాన్యులలో ఏర్పడే పరిస్థితి వచ్చింది. ముళ్లపూడి వెంకటరమణ ‘ఎన్ని ఫ్యాన్లున్నా ఒక్క ఏసీకి సమానం కావు గందా’ అని ఏదో పాత్ర చేత అనిపిస్తారు. చచ్చు పుచ్చు పుస్తకాలు ఎన్ని రాసినా ఒక సరైన అవార్డు కొడితే తల ఎగరేస్తూ తిరగొచ్చు కదా అనుకునే స్త్రీ పురుష సాహితీకారులు నేడు ఇరు రాష్ట్రాలలో తగు మోతాదులో మేట వేశారనే వాస్తవిక అపోహ ఉంది. జోకులు చలామణీలో ఉన్నాయి. ఒక ప్రఖ్యాత కవికి సరస్వతీదేవి ప్రత్యక్షమై ‘వత్సా! కవిత్వం కావలెనా? న్యూఢిల్లీ వారి ఫలానా సాహితీ అవార్డు కావలెనా?’ అని అడిగితే ఆ కవి సెకను తొట్రుపడకుండా ‘కవిత్వమే దయచేయి తల్లీ! అవార్డును ఎలాగోలా మేనేజ్ చేసుకుంటాను’ అన్నాట్ట! మనుషులంటూ ఉన్న ప్రతిచోటా తప్పులు, పొరపాట్లు ఉన్నట్టే అవార్డు అనే మాట ఉన్న చోటల్లా తప్పులూ, పొరపాట్లూ, రాజకీయాలూ, బానిసలకు వరాలూ ఉంటాయి. సాహిత్యంలో సర్వోన్నతమైనదిగా భావించే నోబెల్ పురస్కారం టాల్‌స్టాయ్‌కి రాలేదు. ఆయనకు కాకుండా ఆ తర్వాత దాదాపు 39 మంది నవలాకారులకు నోబెల్ ఇచ్చారు. వారంతా ‘మేము టాల్‌స్టాయ్‌కి వారసులం మొర్రోయ్’ అన్నారు. గాంధీకి నోబెల్ శాంతి ఇవ్వలేదుగాని ఆయన ద్వారా స్ఫూర్తి పొందిన మార్టిన్ లూథర్ కింగ్‌కు ఇచ్చారు. చైతన్య స్రవంతికి ఆద్యుడైన జేమ్స్ జాయిస్‌కి నోబెల్ రాలేదు. కథా చక్రవర్తయిన సోమర్సెట్ మామ్‌కు ఎందుకివ్వలేదయ్యా అనంటే ‘అతడు అక్కరకు మించిన ప్రచారం పొందాడు’ అని సాకు చెప్పారు. మన దగ్గర రవీంద్రనాథ్ టాగోర్‌కి సరే, ప్రేమ్‌చంద్, శరత్‌లు నోబెల్‌కు ఏం తక్కువ అని తూకం వేసి నిరూపిస్తే సదరు అవార్డు కమిటీ ఏం చెబుతుందో ఏమో! భారతదేశం వంటి దేశంలో రచయితలు, కవులు కేవలం తన రచనలతో బతికే పరిస్థితులు లేవు. ఎంతో గొప్ప అంకితభావం, ప్రతిభ, రచనాశక్తి, జనహిత అభిలాష కలిగిన రచయితలైనా బతుకు బాదరబందీలకు అవస్థలు పడుతూ కవిత్వమో, కథో రాయాలి. అప్పొసప్పో చేసి పుస్తకాలు వేసుకోవాలి. అవి అమ్ముడు పోకపోతే అటక మీద గుడ్డ కప్పి దాచుకోవాలి. ఇలాంటి సందర్భాలలో వీరికి తృణమో పణమో ఇచ్చి అవార్డు చేతపెట్టి గౌరవించుకుందాం అనే సదుద్దేశ సాహితీ సంస్థలు అనేకమే వచ్చాయి. ఇవి తమ తమ అభిరుచి, అభిలాషల మేర అవార్డులు ఇచ్చి ప్రోత్సహించినా, వాటిలో ప్రతిష్ఠాత్మకస్థాయి కలిగినవి బహు స్వల్పం కావడంతో ప్రభుత్వపరంగా వచ్చే రాష్ట్ర అవార్డులు, కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డులు ప్రతిష్ఠాత్మకమై కూచున్నాయి. ‘షేక్స్పియర్కు ఏ అవార్డు వచ్చిందని నేటికీ చదువుతున్నారు’, ‘వేమనకు ఎవరు అవార్డిచ్చా రని ప్రతి నాలుక మీద పలుకుతున్నాడు’ అని ఎవరు ఎన్ని కబుర్లు చెప్పినా యోగ్యులైన సాహితీ కారులకు యోగ్యమైన అవార్డు వచ్చి తీరాలి. లేకుంటే అయోగ్యులు ఆ అవార్డులు పొందుతూ అవార్డుకు అయోగ్యతను తెచ్చి పెడతారు. అసలు సాహితీకారులు తమ వల్ల అవార్డుకు గౌరవం రావాలని కోరుకోవాలేగాని అవార్డు వల్ల తమకు గౌరవం రావాలనుకుంటున్నారంటేనే వీరెంత నిరుపేదలో అర్థం చేసుకోవచ్చు. ఇందుకై ఏళ్ల తరబడి పి.ఆర్ చేయుట, పెద్దలను మచ్చిక చేసుకొనుట, పథకాలు రచించుట, దొంగ పద్ధతిలో షార్ట్‌లిస్ట్‌లో చేరుట, కుల సమీకరణలు, ప్రాంతీయ సెంటిమెంట్లు.. ఇన్ని పతన సోపానాల మీద నడిచి అవార్డు తెచ్చుకుని అల్మారాలో పెట్టుకుని పొద్దున్నే అద్దంలో ముఖం ఎలా చూసుకుంటారో వీరు! నలుగురూ తిరిగే చోట తమ పుస్తకం పెట్టి, దాని మీద డబ్బు పెడితే ఆ డబ్బు కోసమైనా ఎవరూ పుస్తకాన్ని తీసుకెళ్లని నాసిరకం రచయితలు, కవులు కూడా ఫలానా అవార్డు కోసం పైరవీ చేసేవారే! వీరికి ఊ కొట్టే దిక్కుమాలిన జ్యూరీలు! ‘అవార్డు వస్తే ఏమవుతుంది’ అనంటే ‘నోరు మూతబడుతుంది’ అనేది ఒక జవాబు. ప్రభుత్వానికి ప్రత్యర్థిగా ఉండాల్సిన కవులు, రచయితలు ప్రభుత్వపరమైన అవార్డులు తీసుకున్నాక ప్రభుత్వానికి ములాజా అవుతారు. ఈ కారణం చేత కూడా ప్రభుత్వాలు అవార్డులను సృష్టిస్తాయి, ఇచ్చి ప్రోత్సహిస్తాయి. తమిళ రచయిత జయమోహన్ తనకొచ్చిన ‘పద్మశ్రీ’ పురస్కారాన్ని ఈ కారణం చేతనే తిరస్కరించాడు. అయితే సరైన రచయితలు తమకు అవార్డుల వల్ల వచ్చిన అదనపు గుర్తింపును జనం కోసం ఉపయోగించడం మంచి స్ట్రాటజీనే! ప్రస్తుతం తెలుగునాట అవార్డుల దుమారం రేగి ఉంది. అవార్డు ఇస్తాం అనంటే గౌరవప్రదమైన సాహితీకారులు పరిగెత్తి పోరిపోయే స్థితి ఉంది. నాణ్యమైన రచనల పట్ల తెలుగు పాఠకలోకం ఉదాసీనత మాని, వాటిని అక్కున జేర్చుకుంటూ, ఆ రచనలకు సముచిత స్థానం కల్పిస్తూ వెళ్లడమే దీనికి విరుగుడు. పాఠకుడి అవార్డులు, బహుమతులే ఇప్పుడు తెలుగు సాహిత్యానికి శ్రీ సరస్వతీ రక్ష. -
ఆంగ్లంలోకి ఎత్తిపోయాలి!
అవార్డు వచ్చిందే అత్యుత్తమ రచన కాకపోవచ్చు. అత్యుత్తమ రచనలన్నింటికీ అవార్డులు రాకపోవచ్చు. కానీ అవార్డు వచ్చింది సాధారణంగా మంచి పుస్తకమే అయివుండొచ్చు. ఒకవేళ ఈ వాక్యాలతో ఏమైనా విభేదించే అవకాశం ఉన్నా, అవార్డు వచ్చిన పుస్తకం ఎంతోకొంత ఆసక్తి కలిగింపజేస్తుందనే విషయంలో మాత్రం ఏ విభేదం లేదు. అవార్డు ఎంత పెద్దదైతే, అంత ఆసక్తి. ఆ భారీతనం వరుస సంవత్సరాలుగా ఇస్తుండటం వల్ల వచ్చిన ప్రతిష్ఠరూపంలో ఉండొచ్చు, లేదా పారితోషికం రూపంలో ఉండొచ్చు. ఏమైనా ప్రస్తుతం, ‘భారతదేశపు అత్యంత విలువైన సాహిత్య బహుమానం’గా ‘జేసీబీ ప్రైజు’ను పేర్కొంటున్నారు. అక్షరాలా ఈ పురస్కార విలువ పాతిక లక్షల రూపాయలు. గొప్ప భారతీయ రచనలను ఉత్సవం చేయాలనే ఉద్దేశంతో నెలకొల్పిన ‘ద జేసీబీ ప్రైజ్ ఫర్ లిటరేచర్’ ప్రత్యేకతలు ఏమంటే, ఇంగ్లిష్ రచనలకే బహుమానం ఇస్తున్నప్పటికీ, ఇంగ్లిష్ అనువాదాలను కూడా పరిగణనలోకి తీసుకోవడం; ఇంకా ఆసక్తికరమైనది, ఒకవేళ అనువాద రచన బహుమానం గెలుచుకుంటే, అనువాదకులకు అదనంగా మరో పది లక్షలు ఇవ్వడం. ‘‘గతంలో ఒక కొత్త ఉర్దూ నవల విడుదలయ్యిందంటే– విద్యార్థులు, అధ్యాపకులు దాని గురించి చర్చించుకునేవాళ్లు. ఇప్పుడు, దానికొక అవార్డు వచ్చి కొంత పాపులర్ అయితే తప్ప ఎవరూ పట్టించుకోవడం లేదు. అదొక ధోరణిలా మారిపోయింది. విశ్వవిద్యాలయాలు ఒకప్పుడు జ్ఞానాన్ని సృష్టించేవి. ఇప్పుడవి కేవలం పంపిణీ చేస్తున్నాయి,’’ అంటారు ఉర్దూ నవలా రచయిత ఖాలిద్ జావేద్. 2022లో ‘ద ప్యారడైజ్ ఆఫ్ ఫుడ్’ నవలకుగానూ ఆయన ‘జేసీబీ ప్రై జ్’ను స్వీకరించారు. ‘నేమత్ ఖానా’ పేరుతో వచ్చిన ఈ ఉర్దూ మూల నవలను బరన్ ఫారూఖీ ఇంగ్లిష్‌లోకి అనువదించారు. ఖాలిద్ ఆవేదన ఉర్దూ సాహిత్య రంగం గురించినదే అయినప్పటికీ అది దేశంలోని అన్ని భాషలకూ వర్తిస్తుంది. అందుకే అవార్డులు, పురస్కారాలు అనేవి సాహిత్యంలో ఎంతోకొంత ఊపును సృష్టించగలుగుతాయి. వాటి పరిమితులను మినహాయిస్తే, అదొక సానుకూలాంశం. అందువల్లే వంటిల్లు నేపథ్యంలో జరిగే అధికార క్రీడనూ... కత్తులు, మంట వంటి ప్రమాదకర ఆయుధాలను కలిగివుండే చోటునూ చిత్రించిన ఖాలిద్ ఉర్దూ నవల విస్తృత పాఠకలోకంలో చర్చనీయాంశంగా మారగలిగింది.నిర్మాణ పనుల్లో; తవ్వకం, ఎత్తిపోత, కూల్చివేతల్లాంటి పనుల్లో వాడే ‘జేసీబీ’ గురించి మనకు తెలుసు. ఈ జేసీబీ అనేదే ఆ యంత్రానికి ఒక పేరులా స్థిరపడిపోయిందిగానీ అది ఒక సంస్థ పేరు. ఇంగ్లండ్ వ్యాపారవేత్త జోసెఫ్ సిరిల్ బామ్ఫోర్డ్ (జేసీబీ) తన పేరుతోనే నెలకొల్పిన కంపెనీ ఈ జేసీబీ. 2018 నుంచి ఈ సంస్థ భారతీయ రచనలకు బహుమానాలు ఇస్తోంది. మార్చ్ నెలలో ఎంట్రీలను ఆహ్వానిస్తారు. ఏప్రిల్ 30 ఈ యేటి ఎంట్రీలు పంపడానికి ఆఖరి తేది. వారి వెబ్సైట్లో అన్ని వివరాలూ లభిస్తాయి. కథలు, కవిత్వ సంపుటాలు కాకుండా ‘యూనిఫైడ్ వర్క్’ మాత్రమే దీనికి పంపాలి. సాధారణంగా సెప్టెంబర్‌లో లాంగ్ లిస్ట్ విడుదలవుతుంది. అంటే వచ్చిన రచనల్లో తొలి వడపోతలో మిగిలిన పదింటిని ప్రకటిస్తారు. అక్టోబర్‌లో షార్ట్ లిస్ట్ వస్తుంది. అప్పటికి ఐదు నవలలు తుది పోటీలో ఉంటాయి. నవంబర్‌లో విజేతను ప్రకటిస్తారు. దీనికిగానూ ప్రతి యేటా ఒక స్వతంత్ర జ్యూరీ ఏర్పాటు అవుతుంది. ఇప్పటికి మూడు సంవత్సరాలు ముగ్గురు మలయాళ రచయితలు ఈ బహుమానం గెలుచుకోవడం విశేషం. మలయాళ చిత్ర పరిశ్రమలాగే, మలయాళ సాహిత్యం కూడా వర్ధిల్లుతోందని చెప్పడానికి ఇదొక సాక్ష్యం. కాదు, మలయాళ సాహిత్యం వర్ధిల్లుతున్నందుకే మలయాళ చిత్రసీమ వర్ధిల్లుతున్నదని అనాలేమో! తన ‘జాస్మిన్ డేస్’ నవలకుగానూ బెన్యామిన్ 2018లో ‘జేసీబీ’ తొలి బహుమానాన్ని గెలుచుకున్నారు. దీన్ని షెహనాజ్ హబీబ్ ఆంగ్లంలోకి అనువదించారు. 2020 సంవత్సరానికి ‘ముస్టాష్’ నవలకుగానూ ప్రైజ్ గెలుచుకున్న ఎస్.హరీశ్ ఇటీవలి మలయాళ కళాఖండం అనదగిన సినిమా ‘నన్ పగల్ నేరత్తు మయక్కమ్’(పగటి వేళ మైకం)కు రచయిత కావడం విశేషం. హరీశ్ తన నవలను ‘మీస’ పేరుతో తన మాతృభాషలోనే రాశారు. అది ఆయన తొలి నవల కూడా. 2021లో మరో మలయాళ నవల ‘ఢిల్లీ: ఎ సాలిలాక్వీ’ని కూడా ఈ ప్రైజ్ వరించింది. రచయిత ఎం.ముకుందన్ . 2019లో ‘ద ఫార్ ఫీల్డ్’ నవలకుగానూ మాధురీ విజయ్ గెలుచుకున్నారు. ఈమె కర్ణాటకకు చెందినవారు. కానీ ఆంగ్లంలో రాస్తారు. పేరుకు రెండు తెలుగు రాష్ట్రాలు ఉన్నాయిగానీ ఈ ఐదేళ్లలో ఏ ఒక్క తెలుగు పుస్తకం షార్ట్‌లిస్టు అటుండనీ, లాంగ్‌లిస్టులోకి కూడా రాలేదు. అసలు ఏ ఒక్కటైనా పోటీకి పంపారా అన్నదీ అనుమానమే. అంతకంటేముందు అసలు ఏ పుస్తకాలైనా ఇంగ్లిష్‌లోకి వెళ్తున్నాయా? పోనీ, వెళ్లాల్సినంతగా వెళ్తున్నాయా? అసలు మొత్తంగానే తెలుగు నవల భారతీయ పాఠకుల మనస్సులు గెలుచుకునేంత కళాత్మకంగా ఉంటోందా? ఉంటే, దాన్ని ఇంగ్లిష్‌లోకి చేర్చడంలో ఉన్న అడ్డంకులేమిటి? ఈ బహుమానం అనే కాదు, మన విలువను కట్టడానికి మరొకటైనా పరమ ప్రమాణం కాకపోవచ్చు. కానీ ఆ ‘గేమ్’లో మనం అసలంటూ ఎందుకు లేము? దక్షిణాది వరకే పరిమితం అయితే– కన్నడ, తమిళం, మలయాళం అనగానే కొందరు రచయితల పేర్లయినా జాతీయ స్థాయిలో తెలుస్తాయి. అలా తెలిసే తెలుగు రచయితలు ఎవరున్నారు, ఎందరున్నారు? ఇలాంటివి జరగాలంటే ఎలాంటి సంస్థలు, వ్యవస్థలు చొరవ చూపాలి? ఇవన్నీ మనకు మనం వేసుకోవాల్సిన ప్రశ్నలు. సావధానంగా జవాబులు వెతుక్కోవాల్సిన ప్రశ్నలు! -
ఆ రైటర్స్ లేకుండా హిట్టు కొట్టలేరా? సక్సెస్ ఫార్మాలా మిస్ అవుతుందా?
డైరెక్టర్స్ విజయం వెనుక వారి టాలెంట్ ఎంత వుంటుందో..అంతకు మించి రైటర్స్ సపోర్ట్ వుంటుంది. ఫిల్మ్ ఇండస్ట్రీలో రైటింగ్ తెలిసిన డైరెక్టర్స్ తక్కువ మంది ఉంటారు. అందుకే డైరెక్టర్స్ చాలా మంది.... స్టోరీతో పాటు స్క్రిప్ట్, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ రాయగల మంచి రైటర్స్ ను తమ టీమ్ లో వుండేలా ప్లాన్ చేసుకుంటారు. రైటర్ ప్లస్ డైరెక్టర్ కాంబినేషన్ వర్కౌవుట్ అయితే హిట్ సినిమా గ్యారెంటీ. అలా సక్సెస్ అందుకున్న డైరెక్టర్స్ చాలా మంది వున్నారు. వీరిలో ధమాకా మూవీతో సూపర్ హిట్ అందుకున్న డైరెక్టర్ నక్కిన త్రినాథ్ రావు కూడా ఉన్నాడు. అందుకే ఏ డైరెక్టర్ తనకి సెట్ అయిన రైటర్‌ను మిస్ చేసుకోవాలనుకోడు..రైటర్ మారితే ఆ డైరెక్టర్ తనని తాను మళ్లీ ప్రూవ్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది.సేమ్ స్టిట్యూవేషన్ లో వున్న డైరెక్టర్ నక్కిన త్రినాధ్ రావు ఇప్పుడు సోలోగా సినిమా చేయబోతూ ..తన అదృష్టాన్ని చెక్ చేసుకోబోతున్నాడు. టాలీవుడ్ లో చాలా మంది డైరెక్టర్స్ రైటర్స్‌తో పాటు సక్సెస్ కూడా మిస్ చేసుకున్నారు. ఎందుకంటే టాలీవుడ్లో రైటర్స్ డిమాండ్ పెరిగిపోయింది. ఒకప్పుడు హీరోలందరూ కథల విషయంలో డైరెక్టర్స్ పై ఆధారపడే వారు. ఇప్పుడు హీరోలు రూట్ మార్చారు. రైటర్లకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. గతంలో స్క్రిప్ట్, స్క్రిన్ ప్లే డిస్కషన్స్ లో హీరోల జోక్యం పెద్ద గా వుండేది కాదు. ఇప్పుడు పరిస్థితి అలా లేదు. హీరోలు స్టోరీ తో పాటు స్క్రిప్ట్, స్క్రీన్ ప్లే పై కూడా చాలా ఫోకస్ పెడుతున్నారు. అందుకే రైటర్స్ కి డిమాండ్ పెరిగిపోయింది. స్టోరీ ఫిక్స్ అయిన తర్వాతే హీరోలు డైరెక్టర్ గురించి ఆలోచిస్తున్నారు. బాక్సాఫీస్ దగ్గర హిట్ కొట్టిన దర్శకులు ..ఇప్పుడు సరైన రైటర్స్ లేక ఫెయిల్ అవుతున్నారు. గతంలో డైరెక్టర్ విజయ్ భాస్కర్ వెనుక త్రివిక్రమ్ రైటర్‌గా ఉండేవాడు. త్రివిక్రమ్ రైటర్ నుంచి డైరెక్టర్‌గా టర్న్ తీసుకున్న తర్వాత విజయ్ భాస్కర్ డైరెక్టర్‌గా ఒక హిట్ కూడా అందించలేకపోయాడు. ఇక డైరెక్టర్ శ్రీను వైట్ల..రైటర్స్ కోన వెంకట్, గోపి మోహన్ తో కలిసి ఉన్నంత కాలం హిట్ సినిమాలు తీశాడు. వారితో విడిపోయిన తర్వాత శ్రీనువైట్ల సక్సెస్ రేట్ దారుణంగా పడిపోయింది. అలాగే దేశం గర్వించదగ్గ దర్శకుల్లో శంకర్ ఒకరు. శంకర్ టీమ్ లో సూజాత రంగరాజన్ అనే గొప్ప రైటర్ ఉండేవాడు. ఆయన రోబో సినిమా సమయంలో చనిపోయారు. ఆ తర్వాత శంకర్ సినిమా కథల్లో బలం తగ్గిపోయిందనే మాట వినిపిస్తుంది. అలాగే డైరెక్టర్ త్రినాథరావు నక్కిన, రైటర్ బెజవాడ ప్రసన్న కుమార్ కాంబోలో వచ్చిన సినిమా చూపిస్త మావ, నేను లోకల్, ధమాకా లాంటి సినిమాలు విజయం సాధించాయి. అయితే ఇప్పుడు బెజవాడ ప్రసన్న కుమార్ రైటర్ నుంచి డైరెక్టర్‌గా టర్న్ తీసుకున్నాడు. కింగ్ నాగార్జున ప్రసన్న కుమార్ కి డైరెక్టర్ గా తన మూవీ తెరకెక్కించే ఛాన్స్ ఇచ్చాడు. దీంతో త్రినాధరావు నక్కిన ఇప్పుడు సోలోగా సినిమా చేయాల్సి వస్తోంది. ధమాకా హిట్ తర్వాత ఐరా క్రియేషన్స్‌లో ఓ కొత్త సినిమా చేయబోతున్నాడు. మరి ఇన్నాళ్లు కలిసి వర్క్ చేసిన రైటర్ బెజవాడ ప్రసన్న కుమార్ లేకుండా నక్కిన త్రినాధరావు ఈ సినిమా తో సక్సెస్ అందుకుంటాడో లేదా చూడాలి. -
అనగనగా ఓ కథ.. రాయలసీమ కథా కార్యశాల
రాయలసీమ కథా కార్యశాల.. అనగానే.. ఏంది కథ? అనుకున్నా.. ఏమిరా వీరశంకర్రెడ్డీ.. దీనివల్ల సమాజానికి లాభం? పొరపాటుగా అలవాటైన సినీ ‘సీమ’యాసలో నన్ను నేను ప్రశ్నించుకున్నా.. నిర్వాహకులకు మోయలేని భారమేమో.. మనుషులు రాకపోతే అవమానమేమో.. నమ్మకంతో కూడిన సందేహం వ్యక్తం చేసుకున్నా.. కడపలో కథా కార్యశాల ముగిసి రెండు వారాలవుతున్నా వదలని ఆ జ్ఞాపకాలు..అనుభూతులు.. అనుభవాలు పై సందేహాలను పటాపంచలు చేశాయి. చంచలమైన మనసుకు జవాబుదారీతనాన్ని నేర్పాయి. సమాజం నుంచే కథ పుడుతుందని.. కథ వల్ల సమాజం అర్థమవుతుందని.. ఇదే సమాజానికి ప్రయోజనకరమని అవగతమైంది. మంచి కథకు మనుషుల కరువేం లేదని.. వచ్చినోళ్లందరూ గొప్ప రచయితలుగా రూపొందకపోయినా సరికొత్త ‘మనుషులు’గా మారతారని .. మనసులను చూసే దృక్పథం ఒకటి అలవాటవుతుందని.. ‘మనో భార’మితి కనిపెట్టినంత సంతోషం వేసింది. హాజరు కోసం నేను గడిపింది కాసేపే అయినా.. కార్యశాల విజయగాథను వినిపించడానికి చాలా కసరత్తే చేయాల్సి వచ్చింది. కథ రాయడం ఓ కళ అని వర్ణించినా.. దానిని శాస్త్రీయంగా చెప్పి, ఇలా చెప్పడం పేద్ద కళ అని నేర్పకనే నేర్పించారు. రెండు రోజుల ప్రయాణంలో కొత్తదారిని కనుక్కునేలా చేశారు. – షేక్ ముజుబుద్దీన్, సాక్షి, కడప డెస్క్ కడపలోని విశ్వేశ్వరయ్య భవన్ ప్రాంగణం.. ఈ నెల 17, 18 తేదీల్లో రాయలసీమ కథాకార్యశాలకు విచ్చేసిన అతిరథ మహారచయితలు, భావి కథకులతో కళకళలాడింది. సీమకు చెందిన మూడు తరాల రచయితలతో పాటు కథారచనలో మెళకువలు నేర్చుకోవడానికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 42 మంది వర్తమాన కథకులకు వేదికైంది. లబ్దప్రతిష్టులు జీవితకథలు చెప్పేందుకు ఈ కార్యశాల పాఠశాలలా మారింది. ప్రసిద్ధ కథకులు డా.కేతు విశ్వనాథ్ రెడ్డి, షేక్ హుస్సేన్ సత్యాగ్ని, బండి నారాయణ స్వామి, శాంతి నారాయణల చేతుల మీదుగా కార్యశాల ప్రారంభమైంది. ప్రసిద్ధ కథకులు, విమర్శకులు.. శాంతి నారాయణ, దాదాహయాత్, డా.మేడిపల్లి రవికుమార్, పాలగిరి విశ్వప్రసాద్ రెడ్డి, జి.ఉమామహేశ్వర్, డా.వి.ఆర్.రాసాని, శ్రీనివాసమూర్తి, యోగివేమన యూనివర్సిటీ ప్రొఫెసర్ డా.ఎన్.ఈశ్వర్ రెడ్డి, యువ పరిశోధకులు డా.తవ్వా వెంకటయ్య తదితరుల అనుభవాలకు సజీవశిల్పంలా నిలిచింది. చివర్లో ప్రసిద్ధ రచయిత డా.బండి నారాయణ స్వామితో కథారచన మెళకువలపై ముఖాముఖి నడిచింది. మొత్తానికి రాష్ట్రం విడిపోయిన తర్వాత జరిగిన తొలి కథాకార్యశాల సాహితీలోకంలో సరికొత్త పరిమళాలు వెదజల్లింది. యువ కథకుల భవిష్యత్తుకు భరోసానిచ్చింది. పేరుకు రాయలసీమ అని పెట్టినా.. గుంటూరు, ప్రకాశం, వైజాగ్, హైదారాబాద్ తదితర ప్రాంతాల నుంచి ఔత్సాహికులు హాజరు కావడం కార్యశాల ప్రాధాన్యత తెలిపింది. రాయలసీమ కథా కార్యశాలే కాదు.. ఇపుడు హైదరాబాద్ బుక్‌ఫెయిర్ కూడా విశేషంగా విజయవంతం కావడం.. తెలుగు సాహిత్యం ఎన్నటికీ సుసంపన్నమేనని స్పష్టతనిస్తోంది. 2022 వెళుతూ వెళుతూ సాహితీపంట పడించింది. 2023 తెలుగింట కథల పండుగ తెస్తుందని చెప్పింది. ఉపసంహారం ఇలాంటి కథా కార్యశాలలు మరిన్ని జరగాలి. ప్రతి చోటా నిర్వహించాలి. తద్వారా ప్రతి వ్యక్తి ఒక సంస్కారి కావాలి. ఇంటింటా సాహిత్యం విరబూయాలి. పుస్తక పఠనం మరింత పెరగాలి. ఈ డిజిటల్ యుగంలో ప్రతి మనసు ఒక పుస్తకమై పరిమళించాలి. ఆపాదమస్తకం అనుభూతించాలి. కొత్తకథకు జీవితమవ్వాలి. కథకు(డికి) ఉండాల్సిన లక్షణాలు కథ జీవితం నుంచి, హృదయం నుంచి రావాలి. జీవితాంతం పాఠకుడి మనసులో నిలిచిపోవాలి. జీవితం పట్ల అవగాహన, విస్తృత పరిశీలన ఉండాలి. విమర్శనాత్మకంగా చూడాలి. కథ ఓ కళ. శ్రద్ధతో నిరంతరం సాహిత్య, జీవిత అధ్యయనం చేస్తే.. దానిని పదికాలాలు కళకళలాడేలా రాయవచ్చు. కథ ముందుగా మనసులో, మెదడులో, హృదయంలో, ఆలోచనల్లో నలగాలి. సమాజమే కథా కార్యశాల. సమాజంలోని చలనాలను, మార్పుని చూడగలగాలి. కథలకు సామాజిక ప్రయోజనం ఉండాలి. ప్రశ్నతోనే జీవితం బాగుపడుతుంది. ప్రశ్నలు వేయండి. వేసుకోండి. ఎంత ఎక్కువ చదివితే అంత చక్కగా రాయగలరు. అన్నీ మన జీవితకాలంలో అనుభవించలేం, చూడలేం.. కాబట్టి చదవాలి. చదవడం ద్వారా జీవితం, అనుభవాలు అక్షరీకరించగలగాలి. కథ ఉద్దేశ్యం వ్యక్తి సంస్కరణ. తద్వారా సమాజ సంస్కరణ. కథ సమస్య నుంచి సంస్కరణ దిశగా ఉండాలి. అయితే సందేశాలు ఇవ్వకూడదు, ఉండకూడదు. మార్పు వస్తుంది. నిదానం కావచ్చు. కానీ తప్పకుండా వస్తుంది. వ్యక్తులు మారితే కానీ సమాజం మారదు. బాహ్య పరిస్థితులు మనిషిని ప్రభావితం చేస్తాయి. పాత కథే అయినా కథాంశం కొత్తగా ఉండాలి. దానిని ఎలా చెప్పాలనే విషయంలో మనదైన దృష్టికోణం కనిపించాలి. కథాంశం దగ్గరే కథ సగం విజయం సాధిస్తుంది. కథకు ఆది..మధ్య..తుది ఉండాలి. ప్రారంభం ఆసక్తిగా.. ముగింపు ఆలోచింపజేసేదిగా ఉండాలి. కథావస్తువుల ఎంపికలో పునరుక్తి లేకుండా చూసుకోవాలి. కథల్లో భాష సూటిగా, స్పష్టంగా, అత్యంత సహజంగా ఉండాలి. కథా శిల్పంలో సర్వం ఇమిడి ఉంటుంది.. శిల్పం వేరు భాష వేరు కాదు. కథ ఎలా చెప్పాలో, ఎవరి కోణంలో చెప్పాలో రచయిత సాధన చేయాలి కనిపించని వ్యవస్థ కూడా కథలో పాత్రేనని గుర్తుంచుకోవాలి. మనిషి మోసం... ప్రాంతానికి, సందర్భానికి అన్వయించుకుంటే ఆశ్చర్యపోయే అంశాలు కథలుగా మారతాయి. ప్రాంతీయత, మాండలికం పాత్రలకు ప్రాణ ప్రతిష్ట చేస్తాయి. పాత్రలు, జీవితం, సమాజం, ప్రకృతిలో సంఘర్షణ తప్పదు పాత్రలకు తమవైన నేపథ్యాలు, వైరుధ్యాలుంటాయి. ఉండాలి. సంఘర్షణ అనివార్యం. సంఘర్షణ ద్వారా పాత్రల మధ్య గొప్ప డ్రామా పుడుతుంది. కథల్లో పాత్రలు ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడాలి. వాస్తవికతకు దగ్గరగా ప్రవర్తించాలి. వర్తమానానికి పునాది చరిత్ర. కథ చీకటి నుంచి వెలుగు వైపు నడిపించాలి . సమాజం పట్ల నిబద్ధత, బాధ్యత ఉండాలి. కవిలో భావావేశం అవసరం. రచయితలో అనవసరం. రచయితకు శాస్త్రీయ దృక్పథం ఉండాలి. వర్తమాన రచయితలు విమర్శను తట్టుకోవాలి. -
సింహళ తీరంలో నిఘానేత్రం
వ్యూహాత్మకంగా కీలకమైన హంబన్‌తోట అంతర్జాతీయ నౌకాశ్రయంలో చైనా సైనిక గూఢచర్య నౌక ‘యువాన్ వాంగ్5’ లంగరేయడానికి శ్రీలంక ఇచ్చిన అనుమతి చర్చోపచర్చలకు దారితీస్తోంది. సదరు పోర్ట్‌పై పట్టు బిగించిన చైనా, వ్యతిరేకిస్తున్న భారత్‌ల మధ్య సర్దుబాటు చేసుకోలేక సిలోన్ సతమతమవుతోంది. ఉపగ్రహ, రాకెట్, ఖండాంతర గతిశీల క్షిపణుల ప్రయోగాల ఆచూకీ తెలుసు కొనేందుకు వాడే ఈ ‘యువాన్ వాంగ్’ శ్రేణి పరిశోధక, సర్వే నౌక మన దేశానికి అతి సమీపంలో వారం పాటు తిష్ఠ వేయడం ఆందోళనకరమే. గగనతలాన 750 కిలోమీటర్ల పైగా కన్నేయగల ఈ షిప్పుతో కేరళ, తమిళనాడు, ఏపీల్లోని అనేక పోర్ట్‌లు చైనా రాడార్లోకి వచ్చేస్తాయి. కల్పాక్కం, కూడంకుళం లాంటి అణుపరిశోధక కేంద్రాలు సహా దక్షిణాదిలోని కీలక ప్రాంతాలూ డ్రాగన్ గూఢ చర్యం బారిన పడే ప్రమాదం ఉంది. ఈ వార్తలే ఇప్పుడు మన దేశాన్ని అప్రమత్తం చేస్తున్నాయి. ఆగస్టు 11 నుంచి 17 దాకా సింహళ తీరంలో ఉండే సదరు నిఘానౌక రాక పట్ల శ్రీలంక దేశాధ్యక్షుడితోనే భారత్ తన అభ్యంతరం తెలిపింది. ఆ నౌక తమ దగ్గరకు వస్తున్నది ఇంధనం, అవసరమైన సరుకులు నింపుకోవడానికే అని సిలోన్ వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న లంకేయులకు భారత్ అందిస్తూ వస్తున్న సాయంపై పార్లమెంట్ సాక్షిగా ప్రశంసాగీతం అందుకొని, అధ్యక్షుడు నష్టనివారణ చర్యలు చేపట్టారు. ఆర్థికకష్టాల్లోనే∙కాదు... అంతకు ముందూ ‘సువసరియా’ అంబులెన్స్ సర్వీసుకు భారత్ సాయమే వేలాది ప్రాణాలు కాపాడిందని గుర్తుచేసుకున్నారు. కానీ మాటల్లోని మెచ్చుకోలుకు భిన్నమైన శ్రీలంక చేతలే సమస్య. ఆసియా, ఐరోపాలను కలిపే సూయజ్ కాలువకూ, మలక్కా జలసంధికీ మధ్య అతి ముఖ్యమైన నౌకాయాన మార్గంలో సింహళం ఉంది. 4500 చమురు ట్యాంకర్లతో సహా దాదాపు 36 వేల నౌకలు ఆ మార్గంలో ఏటా పయనిస్తాయని లెక్క. కొలంబో నౌకాశ్రయం తర్వాత శ్రీలంకలో రెండో అతి పెద్దదైన హంబన్‌తోట ఆ కీలకమార్గంలోదే! ఆ పోర్ట్ నిర్మాణం ఆలోచన మూడు దశాబ్దాల పైగా ఉన్నా, అనేక తర్జనభర్జనలు, నివేదికల బుట్టదాఖలు తర్వాత 2005లో హంబన్‌తోట వాసి మహిందా రాజపక్స అధ్యక్షుడయ్యాక మళ్ళీ ఊపిరి పోసుకుంది. చైనా ఆర్థిక సాయంతో పన్నెండేళ్ళ క్రితం 2010లో ఈ అంతర్జాతీయ పోర్ట్ తొలిదశ పూర్తయింది. ఆర్థికంగా ఆట్టే గిట్టుబాటు కాని ఆ నౌకాశ్రయ నిర్మాణం కోసం 15 ఏళ్ళ కాలానికి చైనా ఇచ్చిన అప్పు వడ్డీలపై వడ్డీలతో ఇప్పుడు శ్రీలంక తలపై భారమై కూర్చుంది. చైనా, శ్రీలంక నౌకాసంస్థల సంయుక్త భాగస్వామ్యంలో నడుస్తున్న ఈ పోర్ట్‌ను స్వల్పకాలిక ప్రయోజనాల నిమిత్తం 99 ఏళ్ళ లీజుకిచ్చి, ద్వీపదేశం తిప్పుకోలేని తప్పు చేసింది. ఆర్థిక సంక్షోభంలో ఉన్నా సరే శ్రీలంక క్రమం తప్పకుండా ఆ అప్పుల వాయిదాలు తీర్చాల్సిందేనని చైనా కొండెక్కి కూర్చుంది. డ్రాగన్ విసిరిన ఈ ఋణదౌత్యం వలలో చిక్కుకొని, బయటపడలేక సింహళం సతమతమవుతోంది. హంబన్‌తోట పోర్ట్‌పై చైనా నియంత్రణతో హిందూ మహాసముద్ర జలాల్లో తమ ప్రయోజనాలకు భంగమని భారత్, అమెరికాలు మొదటి నుంచి ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. తాజా చైనా నిఘానౌక వ్యవహారం ఆ అనుమానాలకూ, ఆందోళనకూ తగ్గట్టే ఉంది. శ్రీలంక ఇటు భారత్, అటు చైనాతో దోస్తీ చేస్తూ, ఇరువైపుల నుంచి లబ్ధి పొందాలని చూస్తోంది. భౌగోళికంగా తనకున్న సానుకూలతను ద్వీపదేశం వాడుకోవాలని అనుకోవడం అర్థం చేసుకోదగినదే. కానీ, ఏకకాలంలో ఇరుపక్షాలకూ కన్నుగీటడమే సమస్య. సింహళం మాత్రం వర్తమాన ఆర్థిక సంక్షోభంలో భారత, చైనాలు రెండూ అండగా నిలిచాయనీ, ఇరుదేశాలూ తమకు కీలక మిత్రులనీ తన వైఖరిని సమర్థించుకుంటోంది. దాని పరిస్థితి ఇప్పుడు కరవమంటే కప్పకు కోపం... విడవమంటే పాముకు కోపంగా తయారైంది. ఏకకాలంలో ఇద్దరికి కన్నుగీటడం సులభమూ కాదు. సమస్యా రహితమూ కాబోదని ద్వీపదేశానికి మరోసారి తెలిసొస్తోంది. చైనానేమో చట్టబద్ధమైన తన సముద్రజల శాస్త్రీయ పరిశోధన కార్యకలాపాల్లో ‘సంబంధిత పార్టీలు’ చొరబడడం మానుకోవాలని శ్రీరంగనీతులు చెబుతోంది. నిజానికి, పసిఫిక్, అట్లాంటిక్, హిందూ మహాసముద్రాల్లో చర్యలు చేపట్టేలా చైనా వద్ద ఏకంగా ఇలాంటి ఏడు నౌకలున్నాయి. ఇప్పటికే భూతలంపై బీజింగ్‌కు ఉన్న ట్రాకింగ్ కేంద్రాలకు ఈ నౌకలు అదనం. అందులోనూ అత్యాధునిక ట్రాకింగ్ సాంకేతికత శ్రీలంకలో లంగరేస్తున్న తాజా నౌక సొంతం. ఈ రెండు నెలలూ హిందూ మహాసముద్ర వాయవ్య ప్రాంతంలో చైనా ఉపగ్రహాల నియంత్రణ, రిసెర్చ్ ట్రాకింగ్‌ను తమ నౌక చేస్తుందని చైనా అధికారిక ‘బెల్ట్ అండ్ రోడ్ ఇనీషియేటివ్ శ్రీలంక’ (బ్రిస్ల్) మాట. కానీ, డ్రాగన్ నక్కజిత్తులు తెలిసినవారెవరైనా ఆ మాటల్ని యథాతథంగా విశ్వసించడం కష్టమే. పైగా, 2014లో కొలంబో పోర్ట్‌లో లంగరేసిన చైనా జలాంతర్గాములతో పోలిస్తే తాజా నిఘానౌక శక్తిసామర్థ్యాలు మరింత ప్రమాదకరం. మీదకొస్తున్న ఈ ముప్పు రీత్యా మనం కట్టుదిట్టమైన ముందుజాగ్రత్త చర్యలు చేపట్టక తప్పదు. దేశ భద్రత, ఆర్థిక ప్రయోజనాల పరిరక్షణకు అది అత్యవసరం. హంబన్‌తోట నౌకాశ్రయం గనక రేపు చైనా ‘పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ’ (పీఎల్ఏ) నౌకాదళానికి కేంద్రంగా మారితే, భారత్‌కు ఉత్తరాన, దక్షిణాన డ్రాగన్ ఆధిపత్యంతో మన పరిస్థితి అడకత్తెరలో పోకచెక్క అవుతుంది. తస్మాత్ జాగ్రత్త! -
అంతం కాదిది ఆరంభం
కొన్నేళ్ళుగా ప్రపంచానికి కంటిలో నలుసుగా మారి, అగ్రరాజ్యాన్ని సైతం వణికిస్తున్న అంతర్జాతీయ ఇస్లామిస్ట్ ఉగ్రమూక అల్‌ఖైదాకు ఇది ఊహించని దెబ్బ. అఫ్ఘానిస్థాన్లోని కాబూల్‌లో ప్రపంచం కంటపడకుండా నివసిస్తున్న అల్‌ఖైదా అధినేత అయ్మాన్ అల్–జవాహిరీని అమెరికా మాటు వేసి, జూలై 31 ఉదయం చాటుగా మట్టుబెట్టడంతో ఒక అధ్యాయం ముగిసింది. ‘9/11’ దాడులకు తెగబడిన ముష్కరమూకను నలిపి, నాశనం చేయాలని ప్రపంచపు పెద్దన్న ఇరవై ఒక్క ఏళ్ళుగా పగతో రగిలిపోతోంది. 2011లో ఒసామా బిన్ లాడెన్నూ, ఇప్పుడు ఆయనకు కుడిభుజంగా వ్యవహరించిన జవాహిరీని హతమార్చడం అమెరికా నిఘా వ్యవస్థ ఎంత బలమైనదో మరోసారి ప్రపంచానికి తెలిసివచ్చింది. అంతకన్నా ముఖ్యంగా అఫ్ఘానిస్థాన్‌ను ఉగ్రమూకలకు స్థావరంగా మార్చబోమంటూ తాలిబన్లు చేసుకున్న ‘దోహా ఒప్పందం’లోని డొల్లతనం బయట పడింది. పాకిస్థాన్, అఫ్ఘానిస్థాన్ లాంటివి ఇప్పటికీ ఉగ్రమూకలకు స్వర్గధామాలే అన్న కఠిన వాస్తవం పొరుగున ఉన్న భారత్ సహా ప్రపంచమంతటినీ మరోసారి అప్రమత్తం చేస్తోంది. 1998 ఆగస్టులో తూర్పు ఆఫ్రికాలో అమెరికా ఎంబసీపై బాంబుదాడి నుంచి ‘9/11’గా పాపు లరైన 2001 సెప్టెంబర్ 11 నాటి న్యూయార్క్ ప్రపంచ వాణిజ్య కేంద్ర జంట భవనాలపై వైమానిక దాడి వరకు... అగ్రరాజ్యంపై అల్‌ఖైదా తెగబడిన అనేక సందర్భాల్లో తెర వెనుక సూత్రధారి జవాహిరియే. నేత్రవైద్యుడి నుంచి తీవ్రవాదిగా మారిన 71 ఏళ్ళ జవాహిరి అప్పట్లో అల్‌ఖైదాలో నంబర్ టూ. 2011లో పాకిస్థాన్‌లోని అబోటాబాద్‌లో అమెరికన్ కమెండోలు లాడెన్‌ను గుట్టుగా మట్టుపెట్టినప్పటి నుంచి ఆ సంస్థకు ఆయనే నంబర్ వన్. అల్‌ఖైదా కొంత తెర వెనక్కి వెళ్ళాక, ‘ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా’ (ఐసిస్) లాంటి హింసాత్మక జిహాదిస్టు పిల్లమొలకలు మొలిచి, ఐరోపాలో తెగబడడం చూస్తున్నాం. కొంత బలహీనపడ్డా, కార్యకర్తల సమీకరణ సత్తా ఉన్న సైద్ధాంతికుడిగా జవాహిరి అమెరికా మొదలు ఇండొనేసియా దాకా అనేక దేశాల వెన్నులో వణుకు పుట్టిస్తూనే వచ్చారు. అమెరికా ఎప్పుడో ఆయన తలకు 2.5 కోట్ల డాలర్ల భారీ వెల కట్టింది. భారత్‌కూ ముప్పు తేవాలని జవాహిరి ఆరాటపడ్డారు. ‘భారత ఉపఖండ అల్‌ఖైదా’ (ఏక్యూ ఐఎస్)ను ఆరంభిస్తున్నట్టు 2014లోనే ఒక వీడియోలో ప్రకటించిన ఆయన నిరుడు హురియత్ నేత గీలానీ చనిపోయినప్పుడు సంతాపం ప్రకటిస్తూ, కశ్మీర్ అంశాన్ని భుజానికెత్తుకొనే యత్నం చేశారు. ఈ ఏడాది కర్ణాటకలో హిజాబ్ వివాదం తలెత్తినప్పుడూ సాయుధపోరు చేయాలంటూ ముస్లిమ్ లను రెచ్చగొట్టేందు ప్రయత్నించారు. కానీ, సహనశీల భారతావనిలో ఆ పప్పులుడకలేదు. నిన్నటి దాకా గుర్తు తెలియనిచోట గడుపుతున్నాడనుకుంటున్న ఈ ఉగ్రనేత సాక్షాత్తూ కాబూల్ నడిబొడ్డున, అఫ్ఘాన్ ప్రభుత్వ పెద్దలెందరో నివసిస్తున్న భవనంలో సకుటుంబంగా కాపురమున్న వైనం దిగ్భ్రాంతికరం. నెలల క్రితమే ఆయన ఆచూకీ కనిపెట్టిన అమెరికా గూఢచారులు ఆనుపానులన్నీ చూసుకొని, చుట్టుపక్కల ఎవరికీ ఏమీ కాకుండా చిత్రమైన హిల్ఫైర్ క్షిపణుల రిమోట్ డ్రోన్ దాడితో లక్ష్యాన్ని ఛేదించిన వైనం కొన్నాళ్ళు కథలు కథలుగా చెప్పుకొనే జేమ్స్‌బాండ్ తరహా విన్యాసం. తాజా ఆపరేషన్‌తో తీవ్రవాదంపై పోరులో అమెరికా ప్రతిష్ఠ కొంత పెరగవచ్చు. ఉపఖండంలో పర్యవసానాలు అంతకన్నా పెరుగుతాయి. ఏడాది క్రితం అమెరికా సేనలు హడావిడిగా వెనక్కి తగ్గాక, అఫ్ఘాన్‌లో బలవంతాన పగ్గాలు చేజిక్కించుకున్న పిడివాద తాలిబన్లకూ, వారి ప్రభుత్వానికీ ఇవాళ్టికీ అంతర్జాతీయ గుర్తింపు అంతంత మాత్రమే. ఈ పరిస్థితుల్లో తమకు తెలియకుండానే జవాహిరి తమ నట్టింట్లోనే తలదాచుకున్నాడని తాలిబన్ సర్కార్ బొంకినా నమ్మేవారెవరూ లేరు. తమ దేశ సార్వభౌమాధికారానికి అమెరికా తాజా రహస్య దాడులు విఘాతమని కాబూల్ వాదన. మామూలుగానైతే ఆ మాటకు అంతో ఇంతో మద్దతు లభించేదేమో! కానీ, పది పడగల పాముకు నేటికీ పాలు పోసి పెంచుతున్న వైనం బట్టబయలయ్యాక తాలిబన్లను ఎవరూ బాహాటంగా సమర్థించ లేరు. ఇక, జవాహిరి వ్యవహారంలో పాకిస్థాన్ ఇవ్వాల్సిన సంజాయిషీ సైతం చాలానే ఉంది. దీర్ఘకాలం పాక్‌లో తలదాచుకొని, ఇప్పుడు అఫ్ఘాన్‌లోనూ పాకిస్థానీ స్థావర ఉగ్రమూక హక్కానీ నెట్వర్క్ నీడలోనే అల్‌ఖైదా అధినేత కాలక్షేపం చేశాడనేది సుస్పష్టం. ఇన్నాళ్ళూ కడుపులో పెట్టుకొని కాపాడిన ఉగ్రసారథితో తమకే బంధం లేదని దాయాది దేశం చెబితే హాస్యాస్పదం. ఆ మాటకొస్తే, స్వలాభం కోసం ఇప్పుడు పాకిస్థానే అతని ఉప్పందించిందనే వాదనా వినిపిస్తోంది. తాజా దాడితో అమెరికా పగ చల్లారిందేమో కానీ, ఆన్లైన్ విషప్రచారంతో వివిధ దేశాలకు వ్యవస్థను విస్తరించిన జిహాదిస్టు గ్రూపులు తోక తొక్కిన తాచులా లేచే ప్రమాదం ఉంది. అధినేతను కోల్పోయి ఇప్పటికి ఆ స్థాయి వారసుడెవరూ లేకపోయినా, కొత్త గ్రూపులను కూడగట్టుకొని అల్ ఖైదా ప్రతీకారం తీర్చుకోజూస్తుంది. ఇక తాలిబన్లు సరేసరి. అందుకే, జవాహిరి ఒక్కడి మరణంతో సమస్త ఉగ్రవాదం సమసిపోయినట్టు కాదు. ప్రపంచానికిస్తున్న హామీలకు విరుద్ధంగా ముష్కర మూకలను పెంచిపోషిస్తున్న పాక్, అఫ్ఘాన్లపై అంతర్జాతీయ సమాజం ఒత్తిడి తేవాలి. ఉప ఖండంలో శాంతి సుస్థిరతలకు భంగం కలిగించే చర్యల్ని అనుమతించబోమనాలి. అందుకే, ‘9/11’ దాడుల్లో మరణించిన 3 వేల మంది కుటుంబాల కన్నీటి కథకు జవాహిరి అంతం ఒక ముగింపని బైడెన్ అన్నారు కానీ, దశకంఠుడి లాంటి ఉగ్రసంస్థలపై యుద్ధంలో ఇది మరో మజిలీ మాత్రమే! -
ఆత్మహత్యా సదృశం
దేనికైనా సమయం, సందర్భం ఉండాలంటారు. అవి లేకుండా ఏ పనైనా చేస్తే? పాతికేళ్ళుగా తమ దేశం నుంచి అత్యున్నత స్థాయివారెవరూ పర్యటించని తైవాన్‌కు అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీ వెళతారనడం అలాంటిదే. ఆ వార్త తేనెతుట్టెను కదిలించింది. అమెరికా అధ్యక్షపదవికి తూగే హోదాలో ఉన్న ఆమె ఆసియా దేశాల పర్యటనలో భాగంగా తైవాన్‌నూ సందర్శిస్తారనడంతో చైనాకు పుండు మీద కారం జల్లినట్టయింది. జూలై 28న అమెరికా అధ్యక్షుడు బైడెన్‌తో చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ సంభాషిస్తూ, తైవాన్‌తో చైనా వ్యవహారంలో పరాయివారి జోక్యం సహించబోమని గట్టిగా చెప్పడం దాని పర్యవసానమే. వారాంతంలో తైవాన్ సమీపాన సాయుధ సైనిక విన్యాసాలకూ డ్రాగన్ దిగడంతో పరిస్థితి వేడెక్కింది. అమెరికా–చైనాల మధ్య ఉద్రిక్తతకు ఆజ్యం పోసింది. అసలే ఉక్రెయిన్‌లో యుద్ధంతో కిందా మీదా అవుతున్న ప్రపంచ దేశాలను ఉలిక్కి పడేలా చేసింది. పసిఫిక్ మహా సముద్రంలో చైనాకు ఆగ్నేయ తీరంలో వంద మైళ్ళ దూరంలోని ఒక చిన్న ద్వీపమైనా తైవాన్‌కు వ్యూహాత్మక ప్రాధాన్యం ఉంది. భౌగోళికంగా అమెరికా విదేశాంగ విధానానికి కీలకమైన స్నేహపూర్వక ద్వీపాల గొలుసుకట్టు మధ్య అది నెలకొంది. తైవాన్ను గనక చైనా స్వాధీనం చేసుకుంటే, పశ్చిమ పసిఫిక్‌లో దాని పట్టు బిగుస్తుంది. సుదూర గువామ్, హవాయ్ల లోని అమెరికా సైనిక స్థావరాలకూ అది ముప్పే. చైనా మాత్రం తమకలాంటి ఉద్దేశం లేదంటోంది. 1949లో చైనాలో అంతర్యుద్ధంతో కమ్యూనిస్టు పాలన వచ్చినప్పటి నుంచి తైవాన్ ప్రత్యేకంగా ఉంటోంది. సొంత రాజ్యాంగం, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన నేతలతో స్వతంత్ర దేశంగా అడుగులు వేస్తోంది. వాటికన్ కాక, ఇప్పటికి ప్రపంచంలో 13 దేశాలే తైవాన్ సార్వ భౌమాధికారాన్ని గుర్తిస్తున్నాయి. అమెరికా, భారత్ సహా పలు దేశాలు ‘వన్ చైనా పాలసీ’కే కట్టు బడ్డాయి. ఇతర దేశాలేవీ ఆ ద్వీపదేశాన్ని గుర్తించకుండా ఉండేలా చైనా దౌత్యపరమైన ఒత్తిడి పెడుతూనే ఉంది. స్వపరిపాలన సాగిస్తున్నప్పటికీ తైవాన్ తమ నుంచి విడిపోయిన ప్రావిన్స్ అనీ, అది తమలో భాగమనీ మొదటి నుంచీ చైనా వైఖరి. అవసరమైతే బలప్రయోగం ద్వారానైనా సరే దాన్ని తమలో ‘పునరేకీకరించే’ లక్ష్యాన్ని సాధించి తీరాలనేది జిన్‌పింగ్ మాట. కానీ, అవసరమైతే బలగాలను దించి మరీ, తైవాన్ను తాము కాపాడడానికి సిద్ధమని బైడెన్ ఆ మధ్య అన్నారు. వాస్తవానికి తైవాన్‌పై చైనా దాడికి దిగితే సైనిక జోక్యం చేసుకోవాలా, వద్దా అనే అంశంలో అగ్రరాజ్యం అమెరికా దీర్ఘకాలంగా ‘వ్యూహాత్మక సందిగ్ధత’ విధానాన్నే అనుసరిస్తోంది. బైడెన్ మాటలు ఏమైనప్పటికీ, తమ వైఖరిలో మార్పు లేదని వైట్‌హౌస్ వర్గాలే తేల్చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ఉరుము లేని పిడుగులా అమెరికా స్పీకర్ నాన్సీ పెలోసీ తైవాన్‌కు వెళతారనే వార్త తాజా తలనొప్పి తెచ్చిపెట్టింది. ఇంతలో ఆదివారం మొదలైన ఆమె పర్యటన షెడ్యూల్లో ఇప్పటికైతే సింగపూర్, మలేసియా, దక్షిణ కొరియా, జపాన్ తప్ప తైవాన్ సందర్శన ప్రస్తావన లేకపోవడం ఊరట. వర్తమాన ప్రపంచ అగ్రరాజ్యాలైన అమెరికా, చైనాల మధ్య సంబంధాలు 2017 –21 మధ్య అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హయాం నుంచి శరవేగంగా క్షీణిస్తూ వచ్చాయి. ఇరు దేశాల సంబంధాలు అలా ఉన్నా, అధినేతల స్థాయిలో రెండు గంటల పైగా గత వారం సంభాషణ సాగడం ఓ సాంత్వన. వాతావరణ మార్పు లాంటి వైరుద్ధ్యాలు లేని అంశాలపై చైనాతో మాటామంతీ జరుపుతూనే, దూకుడుకు పగ్గం వేయాలని బైడెన్ ఆలోచన. ఆంక్షలను సడలించేలా ఒప్పించి, అమెరికాకు చైనా సమస్కంధ అగ్రరాజ్యమని అంగీకరింపజేయాలనేది జిన్‌పింగ్ భావన. కానీ, ఎవరూ పట్టు సడలించడం లేదు. నవంబర్‌లో మధ్యంతర ఎన్నికలున్న బైడెన్ కానీ, ఈ ఏడాదిలోనే చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ 20వ మహాసభలున్న జిన్‌పింగ్ కానీ తమ వారి ముందు తగ్గేదేలే అన్నట్టుగానే ఉండాలనుకోవడంతో చిక్కొచ్చి పడుతోంది. ఈ ఏడాది చివరలో ఇద్దరు అధినేతలూ ప్రత్యక్షంగా కలసి, చర్చించుకొనే సూచనలున్నాయి. అయితే, కొన్నేళ్ళుగా ఇరుదేశాల మధ్య రగులుతున్న తైవాన్ అంశం మళ్ళీ తెర పైకి వచ్చి, ఉద్రిక్తతలు పెంచుతోంది. ఇండో–పసిఫిక్ ప్రాంతంలో, మరీ ముఖ్యంగా తైవాన్‌లో శాంతిభద్రతలు, ఆర్థిక వ్యవస్థ సుస్థిరత ప్రపంచానికి అవసరం. జీ7, నాటో, ఈయూ, క్వాడ్ దాకా అన్నీ ఆ మాటే గుర్తుచేస్తున్నాయి. ఎందుకంటే, కంప్యూటర్ చిప్‌ల ప్రపంచ ఉత్పత్తిలో తైవాన్‌దే అగ్రస్థానం. ప్రపంచమంతా వాడే ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, వాచీలు, గేమ్స్ కన్సోల్స్లోని ఎలక్ట్రానిక్ సామగ్రికి గుండె లాంటి కంప్యూటర్ చిప్‌లన్నీ తైవాన్ తయారీయే. ప్రపంచ మార్కెట్లో సగానికి పైగా ఒకే ఒక్క తైవానీ సెమీకండక్టర్ కంపెనీదే అని లెక్క. కొంతకాలంగా తరచూ తైవాన్‌లో గగనతల చొరబాట్లు సాగిస్తున్న చైనా గనక ఆ దేశాన్ని చేజిక్కించుకుంటే, ప్రపంచంలోని అతి ప్రధాన పరిశ్రమల్లో ఒకటి దాని వశమైనట్టే! అందుకే, తైవాన్‌లో చీమ చిటుక్కుమన్నా ఆ ప్రభావం అంతటా కనిపిస్తుంది. నిజానికి, చైనా, అమెరికా, తైవాన్లు మూడూ స్థూలంగా ప్రస్తుత యథాతథ స్థితి వైపే మొగ్గుతున్నాయి. కాకపోతే, ఎవరికి వారు అవతలివాళ్ళు దాన్ని మార్చడానికి ప్రయత్నిస్తున్నారని భావిస్తున్నారు. అసలే కరోనాతో ప్రపంచ ఆర్థికవ్యవస్థ అతలాకుతలమైన పరిస్థితుల్లో యథాతథ స్థితిని కొన సాగనివ్వక ఎవరు కవ్వింపు చర్యలకు దిగినా, జిన్‌పింగ్ వేరే సందర్భంలో అన్నట్టు అది నిప్పుతో చెలగాటమే! అలాంటి అవివేక చర్యలను అనుమతించడం ప్రపంచ దేశాలన్నిటికీ ఆత్మహత్యా సదృశమే! -
వ్యక్తి విషాదం
యుద్ధాన్ని నేను ద్వేషిస్తాను, అన్ని రూపాల్లోని యుద్ధాన్నీ నేను ద్వేషిస్తాను అంటాడు ఆర్చెమ్ చపేయే. ఈ ఉక్రెయినియన్ రచయిత తనను తాను ‘పసిఫిస్ట్’ అని చెప్పుకొంటాడు. శాంతి కాముకుడు అని ఈ మాటకు విస్తృతార్థం. యుద్ధం, హింస... ఏ కోశానా సమర్థనీయం కావు అనేది ఇలాంటివాళ్ల భావన. పాపులర్ ఫిక్షన్, క్రియేటివ్ నాన్ –ఫిక్షన్ రచనలతో ఆర్చెమ్ ఉక్రెయిన్ లో మంచి ఆదరణ ఉన్న రచయిత. నాలుగుసార్లు ‘బీబీసీ ఉక్రెయిన్ బుక్ ఆఫ్ ద ఇయర్’ అవార్డుకు ఫైనలిస్టు. ఫొటోగ్రఫీ, విజువల్ స్టోరీ టెల్లింగ్ మీద కూడా ఈమధ్యే మక్కువ పెంచుకున్నాడు. ఈమధ్యే అంటే ఉక్రెయిన్ మీద రష్యా దాడికి దిగకముందు! రాజధాని నగరం కీవ్ మీద బాంబుల మోత మొదలుకాగానే ఆయన చేసిన మొదటి పని – ముందు తన కుటుంబాన్ని అక్కడి నుంచి సురక్షితమైన చోటుకు తరలించడం! రెండోది – యుద్ధంలో చేరడానికి తన పేరును నమోదు చేసుకోవడం! యుద్ధం మీద ఆర్చెమ్ అభిప్రాయాలు ఏమీ మారలేదు. కానీ అణిచివేత తన మీద మోపిన యుద్ధం కాబట్టి దీన్నుంచి పారిపోలేనంటాడు. ఓలెహ్ సెన్ త్సోవ్ – రచయిత, దర్శకుడు. ‘క్రిమియా’ ఆయన స్వస్థలం. ఉక్రెయిన్ లో భాగంగా ఉన్న క్రిమియాను రష్యా తన అనుబంధంగా మార్చుకున్నప్పుడు చేసిన నిరసనలకు గానూ తీవ్రవాద ఆరోపణల మీద అరెస్టయ్యాడు. ఐదేళ్లు జైల్లో ఉన్నాడు. (బలవంతపు సప్లిమెంట్స్, మెడికేషన్ కలుపుకొని) 145 రోజుల పాటు చేసిన నిరవధిక నిరశనకు గానూ దాదాపు చావు దాకా వెళ్లొచ్చాడు. 2019లో నేరస్థుల బదిలీ ఒప్పందం మీద ఉక్రెయిన్ కు వచ్చాక దాడి నేపథ్యంలో ‘ద సెకండ్ వన్స్ ఆల్సో వర్త్ బయ్యింగ్’ అనే వ్యంగ్య నవల రాశాడు. ఉక్రెయిన్ లో 1990ల నాటి నేరస్థుల గ్యాంగుల నేపథ్యంలో సాగే ‘రైనో’ సినిమా 2020లో విడుదలైంది. దానికి సానుకూల సమీక్షలు వచ్చాయి. అయితే, మళ్లీ యుద్ధం మొదలుకాగానే ప్రాదేశిక భద్రతా దళంలో చేరిపోయాడు. ఇంకా ఈ జాబితాలో స్తానిస్లావ్ అసెయేవ్, క్రిస్టియా వెంగ్రీనియుక్ లాంటి ఉక్రెయిన్ రచయితలూ ఉన్నారు. అమెరికా రచయితలు ఎర్నెస్ట్ హెమింగ్వే, ఇ.ఇ. కమ్మింగ్స్, టి.ఇ. లారెన్స్, జె.ఆర్.ఆర్. టోల్కీన్ లాంటివాళ్లు మొదటి ప్రపంచ యుద్ధంలో పాల్గొన్నారు. జె.డి. శాలింజర్ రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొన్నాడు. జార్జ్ ఆర్వెల్ స్పానిష్ సివిల్ వార్‌లో పాల్గొని గాయపడ్డాడు. తెలుగు కవి, కథకుడు శిష్టా›్ల ఉమామహేశ్వరరావు; మరో రచయిత అంగర వెంకట కృష్ణారావులు కూడా యుద్ధ అనుభవం ఉన్నవారే! అసలు కవిగానో, రచయితగానో ఉండటమే... దానికదే ఒక యుద్ధం కదా! ఈ రచయితలు మనకు గుర్తున్నది వాళ్లు పట్టుకున్న ఆయుధం వల్ల కాదు, వారి రచనల వల్ల! కాకపోతే అది వారికి ఒక అనుభవంగా పనికివచ్చింది. కానీ ఆ ‘అనివార్యత’ ఎంత దుర్మార్గమైనది? రాసుకోగలిగేవాడు రాసుకునే, ఆనందంగా నర్తించే అమ్మాయి నర్తిస్తూ ఉండగలిగే ప్రపంచాన్ని కోరుకోవడం మరీ అంత పెద్ద కోరికా? లేక, ఇంకో తలంలో వీటన్నింటికీ కారణం అవుతున్న ‘ఇంకో’ మనిషి బుద్ధి అంత చిన్నదా? యుద్ధం అనేది ఏ ఒక్క రూపంలోనో ఉండదని అందరికీ తెలుసు. నేరుగా సరిహద్దు యుద్ధాలు చేయకపోయినా, భిన్నరకాల యుద్ధాల్లో ఎందరు తెలుగు కవులు పాల్గొనలేదు! భావజాల పోరాటాలు మాత్రం యుద్ధం కాదా? సమస్య ఏమిటంటే– ఈ యుద్ధాలు గీతకు అటువైపు ఉన్నావా, ఇటువైపు ఉన్నావా అని తేల్చుకునే విపత్కర పరిస్థితిలోకి మనిషిని నెడతాయి. దీనికి స్పందించడం తప్ప ఇంకో మార్గం ఉండదు. అప్పుడు సమూహంగా మాట్లాడటం తప్ప వ్యక్తికి విడిగా చోటుండదు. వ్యక్తి అనేవాడు లేకుండాపోవడం కంటే బౌద్ధిక విషాదం ఏముంటుంది? అవసరాన్ని బట్టి మనిషి వ్యక్తిగానూ, సమూహంగానూ ఉంటాడు. కానీ సరిగ్గా అదే సందర్భంలో గీతకు అటువైపు ఉన్నవాడు కేవలం విడి మనిషిగానే ఉండదలిస్తే! నేటికి సత్యాలుగా కనబడినవి, రేపటికి మబ్బుల్లా కదిలిపోవని ఎవరూ చెప్పలేరు. కానీ యుద్ధాలు, భావజాలాల్లో వర్తమానపు కొలేటరల్ డ్యామేజ్ అనబడే అనివార్య నష్టం లెక్కలోకి రాదు. వీళ్ల వల్ల గాయపడ్డ ఆ ‘ఎదుటి’ మనిషి ఎవరో వీరికి ఎప్పటికీ సంపూర్ణంగా తెలియకపోవచ్చు. నిరసనకారుల గుంపును చెదరగొట్టడానికి పోలీసులు చేసే లాఠీఛార్జీలో రెండు దెబ్బలు తినేవాడి నొప్పి ఎవరికీ పట్టదు. ఏ కోర్టులూ, ఏ ప్రజాసమూహాలూ దీనికి న్యాయం చేయలేవు. కానీ ఒక్కడు మాత్రం తన జీవితకాలం ఆ రెండు దెబ్బల బరువును మోయాల్సి వస్తుంది. ఆ చివరి మనిషి గాయానికి కూడా లేపనం పూయనంతవరకూ, అసలు ఆ మనిషికి గాయం కాని పరిస్థితులు వచ్చేంతవరకూ మనది నాగరిక సమాజం కాబోదు. వేపచెట్టు మీద వాలి కూసేది ఒక కాకి కాదు. అది ‘ఫలానా’ కాకి మాత్రమే అవుతుంది. దాని కూతకు స్పందనగా వచ్చి జతకూడేది కూడా ఇంకో కేవలం కాకి కాదు. అది మరో ఫలానా కాకి అవుతుంది. రెండూ వేర్వేరు కాకులు... ఇద్దరు వేర్వేరు సంపూర్ణ మనుషుల్లా! అవి వాలిన వేపచెట్టుకు కూడా మనం పేరు పెట్టివుండకపోవచ్చుగానీ అది కూడా దానికదే ప్రత్యేక యూనిట్. దానికదే యునీక్. దాన్ని పోలిన చెట్టు, దానిలాగా కొమ్మలను విరుచుకున్న చెట్టు ఇంకోటి ఎక్కడా ఉండదు. మన ఇంట్లో మన కాళ్లకు తగిలే పిల్లి లాంటిది ఈ ప్రపంచంలో ఇంకోటి లేదు. కానీ మనుషులే కేవలం సమూహ అస్తిత్వాలకు పరిమితమయ్యే పరిస్థితులు ఉత్పన్నం అవుతున్నప్పుడు, ఇంక పక్షులు, జంతువులు, చెట్లూ చేమలను కూడా విడిగా గుర్తించాలంటే మనిషి ఎంత సున్నితం కావాలి! ఎంత సూక్ష్మం కావాలి! -
రైటింగ్ టేబుల్
మగవాడు రాసేటప్పుడు తాను ఒక్కడే ఉంటాడు. స్త్రీ రాసేటప్పుడు ఆమె వెనుక ఇంకా ఆర్పాల్సిన గ్యాస్‌స్టవ్, పిల్లవాడికి పట్టాల్సిన పాలు, ఆరేయగా లోపలికి తేవాల్సిన బట్టలు, కరెంటు మనిషి మీటర్ కట్ చేసి వెళ్లకుండా కట్టాల్సిన బిల్లు, పెద్దగా కదలికలు లేని అత్తగారికి ఇవ్వాల్సిన మందులు, సంతరోజు తప్పిపోకుండా తేవాల్సిన కూరగాయలు... ఇన్ని ఉంటాయి. మగవాడు– రాసుకోవాలి అనంటే ఆ ఇల్లు నిశ్శబ్దం అయిపోతుంది. ఒక గది ఇవ్వబడుతుంది. ముఖ్యం అతనికి ఒక రైటింగ్ టేబుల్ ఉంటుంది. ‘కాని నాకు తెలిసి మన దేశంలో రాయాలనుకున్న స్త్రీలకు ఒకే ఒక టేబుల్ ఉంటుంది. అది డైనింగ్ టేబుల్. దానిని శుభ్రం చేసుకుని కూచుని రాసుకోవడమే’ అంది ప్రఖ్యాత రచయిత్రి కమలాదాస్. వర్జీనియా ఊల్ఫ్ కూడా ఇదే మాట అంది– రాయాలనుకున్న స్త్రీలు తాము ఒకరి మీద ఆధారపడాల్సిన అవసరం లేని ఆదాయం కలిగి ఉండాలి... వారికి సొంత గది ఉండాలి. ఆసియాలోనే అతి పెద్దదైన ‘జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్’ ఇటీవల జరిగితే అందులో వర్తమాన భారతీయ రచయిత్రులు ఎందరో పాల్గొని ‘తాము రాస్తున్నాము’ అని గొప్ప ప్రకటన చేస్తే, మగవారు పాల్గొన్న వేదికలపై రాని చర్చ ఈ రచయిత్రులు పాల్గొనే వేదికపై వచ్చింది. అది– రాయడానికి సమయం, కావలసిన మద్దతు గురించి! ‘మీరు ఎన్నయినా చెప్పండి... భారతీయ స్త్రీ రాయాలంటే భర్త సహకారం తప్పదు. మన స్త్రీలు అనేక బాధ్యతల మధ్య సమయం వెతుక్కుని రాయాలి. ఆ సమయానికి భర్త ఆటంకం కలిగిస్తే రాయడం కష్టం’ అంది అనుకృతీ ఉపాధ్యాయ్ అనే రచయిత్రి. ‘నేను ఒక నవల మొదలెట్టాను. లాక్డౌన్ వచ్చింది. రెండేళ్ల పాటు పిల్లలు ఇంట్లోనే ఉన్నారు. నవల పని మూలపడింది. మళ్లీ స్కూళ్లు తెరిచి వాళ్లు స్కూలుకు, భర్త ఆఫీసుకు వెళితే తప్ప రాయడానికి వీలవలేదు’ అంది సిమ్రన్ ధిర్ అనే ఢిల్లీ రచయిత్రి. ‘ఈ గొడవంతా ఎందుకని నేను ఉదయం నాలుగ్గంటలకు లేచి ఆరు వరకు రాస్తాను. రోజుకు 200 పదాలు రాస్తే చాలు అనుకుంటూ నా నవల పూర్తి చేశాను’ అంది శివానీ సిబాల్ అనే మరో రచయిత్రి. స్త్రీల కల్పనాశక్తి వందల ఏళ్ల పాటు మన దేశంలో మౌఖికంగా ఉండిపోయింది. వారు ఆటల్లో, పాటల్లో, పిల్లల్ని నిద్ర పుచ్చడానికి చెప్పిన కథల్లో తమ సృజనను చూపించి సంతృప్తిపడాల్సి వచ్చింది. మరో రకంగా చెప్పాలంటే మన దేశ పురాణ జ్ఞానం, జానపద సంపద వాళ్ల నాలుక చివరల నుంచే ఒక తరం నుంచి మరో తరానికి అందింది. కానీ వారు విద్యకూ, కలం పట్టి రాయడానికీ శతాబ్దాలు దూరం ఉన్నారు. రాయడం మొదలెట్టాక, ఇంతకాలం గడిచాక కూడా వారి ఎదుట ఉండాల్సిన సవాళ్లు ఉండనే ఉంటున్నాయి. ‘నేను నా మొత్తం కల్పనా సామర్థ్యాన్ని నా కుటుంబ మర్యాదకు లోబడి కుదించుకోవడానికి అవస్థలు పడ్డాను’ అంది కమలా దాస్. స్త్రీలు రాయవచ్చుగాని అన్నీ రాయకూడదు. కొన్ని కథాంశాలు ముట్టుకోవడం నిషిద్ధం. కొన్ని వర్ణనలు చేయడం నిషిద్ధం. కొన్ని మాటలు వాడటం నిషిద్ధం. స్త్రీలు పాపులర్‌గా రాసినా, గాఢమైన మానవ ప్రవర్తనలు రాసినా ‘ఇవన్నీ ఈమెకు ఎలా తెలుసు... ఈ కథలోని పాత్ర అనుభవం ఈమె అనుభవమే కాబోలు’ అనే భావనలో మన ఎదగని పాఠకులు, కుటుంబాలు ఉంటాయి. కనుక ఇప్పటి వరకూ మన దేశంలో రాసిన స్త్రీలు తమ పూర్తి శక్తితో రాశారని అనుకోవడానికి లేదు. ఇక మీదట రాస్తారనీ చెప్పలేము. కనపడని సెన్సార్షిప్ ప్రభావం అది. పురుషులకు వృత్తి ఉంటుంది. రాయడం వారి ప్రవృత్తి (ఆప్టిట్యూడ్). అదే స్త్రీలకు అభిరుచి (హాబీ)గా చెప్పబడుతుంది. రాసే స్త్రీలను భర్తలు పరిచయం చేస్తూ ‘ఆ.. ఏవో గిలుకుతుంటుంది లేండి’ అని చిన్నబుచ్చుతారు. కార్టూనిస్టులు రచయిత్రుల తిరిగొచ్చిన రచనలు మోయలేక పారిపోయే పోస్ట్మేన్లను వేసి నవ్విస్తారు. సినిమాల్లో రచయిత్రులవి హాస్యపాత్రలు. నాణ్యత లేని రచన పురుషుల్లోనూ, స్త్రీలలోనూ ఉంటుంది. కానీ స్త్రీలు హేళనకు సాధనాలవుతారు. 1965 నుంచి మన దేశంలో జ్ఞానపీఠ్ ఇస్తుంటే ఇప్పటికి 62 మందికి ఆ పురస్కారం దక్కితే వారిలో కేవలం 9 మందే స్త్రీలు ఉన్నారు. ఎన్నో ప్రతిబంధకాలను దాటి, సవాళ్లను ఎదుర్కొని, మగ రచయితల రాజకీయాలను జయించి రాగలిగారు కాబట్టే ఈ 9 మందైనా! ‘నేను చెన్నై కన్నెమరా లైబ్రరీలో పని చేశాను. వందల రచయిత్రుల పుస్తకాలు అక్కడ చూశాను. కానీ వారంతా ఒకటీ రెండూ పుస్తకాల వారు. అంటే 18 నుంచి 24 ఏళ్లలోపు రాసిన వారు. బహుశా పెళ్లయిన తర్వాత వాళ్లందరూ రాయడం మానేసి ఉండాలి’ అంది పరమేశ్వరి అనే తమిళ కవయిత్రి ఒక వ్యాసంలో! ఇదే సూత్రాన్ని ప్రతి భాషకూ అప్లై చేస్తే పెళ్లికి ముందు రాసి ఆ తర్వాత ఆగిపోయిన రచయిత్రుల రాయబడని కావ్యాలను హతం చేసినదే మన సమాజం. వెలుతురు అర్థం కాకపోతే చీకటి అర్థం కాదు. స్త్రీ రాయకపోతే పురుషుడు రాసిందీ సంపూర్ణం కాదు. మానవ చిత్తవృత్తులనూ, సంక్షోభ సమయాలలో వారి దిటవునూ, సందర్భాలకు తగినట్టు మారే కపట విన్యాసాలనూ స్త్రీ గమనించినంత సూక్ష్మంగా పురుషుడు గమనించలేడు. ఈ ప్రపంచం అర్థం కావాలంటే స్త్రీ రచన విస్తృతం కావాలి. రాసే స్త్రీలున్న ఇళ్లలో వారికంటూ తప్పక ఒక రైటింగ్ టేబుల్ ఉండాలి. అది లేనంత కాలం మనం పూర్తిగా నాగరికం కానట్టే! స్త్రీలు రాయాలి. స్త్రీ రచనలు వర్ధిల్లాలి. -
స్త్రీవాద విమర్శపై ఉపన్యాస పరంపర
సాహిత్య విమర్శ రంగంలో పని చేస్తున్న ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక, జిజ్ఞాసా వేదిక కలిసి ‘స్త్రీవాద సిద్ధాంతం – సాహిత్య విమర్శ’ అనే అంశం మీద అంతర్జాల ప్రసంగ పరంపరను నిర్వహించడానికి పూనుకున్నాయి. సాహిత్య అన్వయానికి సంబంధించిన అంశాలతో ఈ ఉపన్యాస పరంపరను రూపొందించాం. అంతర్జాతీయంగా ఆలోచించటం, దేశీయ, సామాజిక, రాజకీ యార్థిక పరిణామాల సంబంధంలో స్త్రీల చరిత్ర నడిచిన దారులను తెలుసుకొనటం; ప్రాంతీయంగా స్త్రీల జీవితానికి సంబంధించి తెలుగు సాహిత్యం నిర్మించి ప్రచారం చేసిన భావజాలాన్ని నిర్ధారించటం, సమాంతరంగా సాహిత్య రంగంలో అభివృద్ధి చెందిన ప్రజాస్వామిక సంస్కృతిని నిరూపించటం లక్ష్యంగా ఈ ప్రసంగ విషయాలు రూపొందాయి. (Ravipudi Venkatadri: వంద వసంతాల హేతువాది) మొదటి నాలుగు ఉపోద్ఘాత ప్రాయమైనవి. తరువాతి 19 మానవ హక్కుల ఉద్యమ నేపథ్యంలో స్త్రీల హక్కుల ప్రశ్నను లేవనెత్తటం దగ్గర ప్రారంభించి ప్రపంచమంతటా స్త్రీలు వివక్షకు గురికావటాన్ని నిరసిస్తూ, కారణాలను అన్వేషిస్తూ, పరిష్కారాలు కోరుకొంటూ స్త్రీలు అనేక స్థాయులలో చేసిన యుద్ధాల, సిద్ధాంతాల అవగాహన కోసం ఉద్దేశిం చినవి. 24వ అంశం నుండి ఆ తరువాతవి అన్నీ భారతదేశ సందర్భం నుండి, తెలుగు సాహిత్య ప్రత్యేకత నుండి స్త్రీల అనుభవాన్ని, స్త్రీవాద భావనలను పరిశీలించేవి. (క్లిక్: ఆ నిషేధం చదువును దూరం చేస్తుంది!) స్త్రీవాద సిద్దాంతంలో సాహిత్య విమర్శలో అభిరుచి, అభినివేశం ఉన్న వాళ్ళందరూ ఈ ఫిబ్రవరి 20 నుండి ప్రతి ఆదివారం ఉదయం 11.00 లకు ప్రారంభమై 1.30 వరకు జరిగే ఈ వారం వారం అంతర్జాల సమావేశాలకు క్రమం తప్పకుండా హాజరు కావాల్సిందిగా కోరుతున్నాం. సామాజిక మాధ్యమాలలో జూమ్ లింక్ వివరాలు ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తాము. సాహిత్య విమర్శకు, ప్రత్యేకించి స్త్రీవాద విమర్శకు సంబంధించి జరిగే సంభాషణలో భాగస్వాములు కావలసిందిగా విజ్ఞప్తి. – ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక, జిజ్ఞాసా వేదిక -
మా కోరిక వికేంద్రీకరణే!
1953 నాటి ఆంధ్ర రాష్ట్రమే, 2014లో ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం! 1953లో కర్నూలులో రాజధాని, గుంటూరులో హైకోర్టు ఏర్పడినాయి. శ్రీబాగ్ ఒప్పందంలోని ఒక్క అంశం, ఆ రకంగానైనా ఆనాడు ఆచరణలోకి వచ్చింది. దానిని ఇప్పుడు కొనసాగించమనేదే మా గట్టి డిమాండ్. మూడు రాజధానులు కాదు, మూడు వికేంద్రీకరణలు మాత్రమే! కర్నూలులో పరిపాలనా రాజధాని, అసెంబ్లీ, గుంటూరులో ఓ హైకోర్టు, విశాఖలో శీతకాలపు అసెంబ్లీ సమావేశాలు ఉండాలనేది మా అభిప్రాయం. విశాఖపట్టణం ఆర్థిక రాజధానిగా వెలుగొందుతుందని మా విశ్వాసం. (చదవండి: ‘ఒకే దేశం, ఒకే ఎలక్షన్’లో మర్మం?) అంతే కాకుండా... పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని లక్ష క్యూసెక్కులకు పెంచాలి. తుంగభద్ర సమాంతర కాలువ నిర్మాణానికి తక్షణ చర్యలు తీసుకోవాలి. నదుల అనుసంధానంలో భాగంగా కేంద్ర ప్రణాళికలోని ‘ఆల్మట్టి నుంచి బుక్కపట్నం లింక్ కెనాల్ గురించి కేంద్రంతో, కర్నాటక ప్రభుత్వంతో సంప్రదింపులు జరపాలి. హంద్రీ–నీవా కాలువ సామర్థ్యాన్ని 10 వేల క్యూసెక్కులకు పెంచాలి. గాలేరు–నగరి ప్రాజెక్టును యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేయాలి. (చదవండి: కాసే చెట్టుకే... రాళ్ల దెబ్బలా!) ఎర్ర చందనం స్మగ్లింగ్‌ను అడ్డుకుని, నిల్వ ఉన్న దుంగలను వేలం వేసి ఆ డబ్బును రాయలసీమ అవసరాలకు మాత్రమే వినియోగించాలి. కడపజిల్లాలో ఉక్కు కర్మాగారం, మల్లవరంలో బీహెచ్ ఈఎల్ ఏర్పాటు, పులరిన్ ఖనిజం వెలికితీత, ఆ ఖనిజాధారిత పరిశ్రమల ఏర్పాటు తదితరాలు మా తక్షణ డిమాండ్లు. శ్రీబాగ్ ఒడంబడికను అనుసరించే నీళ్ల వికేంద్రీకరణ, రాజధాని వికేంద్రీకరణ జరగాలని మేం కోరు కుంటున్నాం. రాజీలేని మా వైఖరి, ఏ అపార్థాలకూ తోవచూపరాదని విశ్వసిస్తూ... – రాయల సీమ కవులు, రచయితలు (కేతు విశ్వనాథరెడ్డి, రాచపాళెం చంద్రశేఖరరెడ్డి, బండి నారాయణ స్వామి, భూమన్, శాంతినారాయణ, వేంపల్లె షరీఫ్, రాసాని వెంకట్రామయ్య, మధురాంతకం నరేంద్ర, తదితరులు) -
వారిదైన వ్యక్తీకరణ
‘బ్రదర్స్ కరమజవ్’లో ఇవాన, అల్యోషా ఇద్దరూ ఒక హోటల్లో మాట్లాడుకుంటున్నప్పుడు – గ్లాసు తీసిన తర్వాత టేబుల్క్లాత్ మీద గ్లాసు అచ్చును గమనిస్తాడు ఇవాన్. అంత సున్నితమైన గమనిం పును పాఠకుల దృష్టికి తెచ్చిన దాస్తోయెవస్కీ ముద్ర అది. నోటి దుర్వాసనను చెక్ చేసుకోవడానికి ‘ద క్యాచర్ ఇన్ ద రై’లోని హోల్డెన్ కింది పెదవిని పైకి వంచి ముక్కుకు తగిలేలా గాలి వదులుతాడు. అసలైన సాహిత్య పరిమళాన్ని ఆనందించడానికి శాలింజర్ ఇచ్చిన వివరం అది. ‘ది ఓల్డ్ మ్యాన్ అండ్ ద సీ’లో సముద్రంలో చేపల వేటకెళ్లి వచ్చాక, సామగ్రిని అక్కడే వదిలేద్దామనుకుంటాడు వృద్ధుడు. అక్కడ వదిలేయడం ద్వారా ఎవరికైనా దొంగతనం చేయాలన్న టెంప్టేషన్ ఎందుకు పుట్టిం చాలని తన నిర్ణయం మార్చుకుంటాడు. ఈ వాక్యాన్ని రాసిన దొర హెమింగ్వే. ఆ రచయిత మాత్రమే రాయగలిగే వాక్యం ఆ రచయితను ప్రత్యేకంగా నిలబెడుతుంది. ఆ పసి రాకుమారుడు కాంతి గల వీపు కానవచ్చేటట్లుగా బోరగిలపడటం – నున్నని వీపుగల కూర్మావతారంగా కనబడుతున్నదట. ఈ చిత్రిక ‘కవికర్ణ రసాయనము’ లోనిది. అదే పద్యంలో ఇంకా వివిధ భంగిమల్లో దశావతారాలను కళ్లకు కడతాడు సంకుసాల నృసింహకవి. అసలే సూర్యుడు ఒక అగ్నిగుండం. దానికితోడు సాయంకాలం కమలినీ విరహంలో ఉన్నాడు. ఇంక ఆ వేడికి తట్టుకోలేక సముద్రంలో మునిగాడని సూర్యాస్తమయాన్ని దృశ్యమానం చేస్తుంది ‘భాస్కర రామాయణం’. సూర్యుడి వాడిౖయెన కిరణాల తాకిడికి వేగిపోయిన జగత్తు మీద వీచడం కోసం గుండ్రని విసనకర్రగా వికాసం పొందాడని చంద్రోదయాన్ని వర్ణిస్తాడు ‘విష్ణుమాయా విలాసము’ కవి. ఇక ‘గయోపాఖ్యానము’ కర్త – ఆమె సౌందర్యాన్ని చూపడానికి తాను కూడా తగనని అద్దం గుర్తించి, ముఖం చాటేసిందంటాడు. తెలుగు పద్యసాహిత్యం నిండా ఎన్నో గొప్ప వ్యక్తీకరణలు. చలికాలంలో రైల్వే స్టేషన్లో అంచులు పగిలిన కప్పుల్లో టీ తాగుతున్న శాలువా ముసుగులో ఉన్న కూలీలను చిత్రించిన త్రిపుర నుంచి, చెరువులో బెకబెకమంటున్న కప్పలు చీకట్లో మనిషి ఒంటేలు శబ్దానికి ఒక క్షణం నిలిచి, మళ్లీ అరవడం మొదలుపెట్టాయని రాసిన అజయ్‌ప్రసాద్ దాకా ఆధునిక తెలుగు సాహిత్యంలోనూ కాలాన్ని నిలిపి చూపే ఎన్నో విలువైన క్షణాలు! తల్లి కాళ్లకు ఒంగి దండం పెట్టే కొడుకుకు తల్లి పాదాల పసుపు వాసన తగలడం; ఆఫీసు నుంచి ఇంటికి వస్తూనే ఉద్యోగిని చీర కుచ్చిళ్లలో చిన్నారి కొడుకు తలదాచుకోవడం; మౌన రుషిని తలపించే కప్ప కూర్చున్న భంగిమ... ఇలాంటి వ్యక్తీకరణలు సాహిత్యానికి ప్రాణం. సూక్ష్మంలో మోక్షం చూపే వాక్యాలివి. ఒక దగ్గర కనబడిన వాక్యం ఇంకో దగ్గర ఉండదు. అది అక్కడికి సర్వ స్వతంత్రమైనది. ఆ కవిదో, ఆ రచయితదో ఇక వారిదే. అలాంటిది ఇంకొకరు ముట్టుకోరు. ఎంగిలి వాక్యాలు రాయలేదని చలాన్ని విశ్వనాథ సత్యనారాయణ ప్రశంసించింది... అలాంటి ఎంగిలి వాక్యాలు రాయని ఏ రచయితకైనా వర్తిస్తుంది. సాహిత్యానికి మరో వైపు కూడా ఉంది. పునరుక్తి దీని ప్రధాన లక్షణం. లేత భానుడి కిరణాలు భూమిని తాకుతున్నాయి అనే వాక్యాన్ని కథల్లో ఎన్నిసార్లు చదివుంటారు? పడక్కుర్చీలో విశ్రాంతిగా కూర్చుని పత్రిక చదివే పరంధామయ్య ఆదివారపు అనుబంధాల్లో ఎన్నిసార్లు పరామర్శించి ఉంటాడు? పువ్వు పుట్టగానే పరిమళించినట్టుగా బాల్యంలోనే ప్రతిభను చాటే నాయకులు ఎందరు తగిలారు? చిట్టచివరన, అస్తమిస్తున్న సూర్యుడి వైపు ఎందరు కథానాయికలు పయనించి ఉంటారు? ఇలాంటి వ్యక్తీకరణలు ముందుగా ఎప్పుడు, ఎలా వచ్చాయో చెప్పగలిగే సాహిత్య చరిత్రలు మనకు లేవు. అవి వచ్చినప్పుడు తాజావే కావచ్చు. వాటికవే విలువైనవే కావచ్చు. కానీ వాడీ వాడీ అరగ దీయడం వల్ల పాతకంపు కొడతాయి. ఈ జాడ్యం తెలుగుకే పరిమితమైనది అనుకోవాల్సిన పనిలేదు. ‘ఇట్ వజ్ ఎ డార్క్ అండ్ స్టార్మీ నైట్’ (అదొక చీకటి తుపాను రాత్రి) అనే వాక్యం ఎక్కడి నుంచి ఊడిపడిందనే చర్చ ఆంగ్ల సాహిత్యంలో ఈమధ్య బాగా జరిగింది. అదొక చీకటి తుపాను రాత్రి... అని గంభీరంగా ఎత్తుకోగానే తర్వాత ఏమయివుంటుందన్న కుతూహలం సహజంగానే పుడుతుంది. కానీ ఎన్నిసార్లు ఆ కుతూ హలం నిలుస్తుంది? కథల్లో మహాచెడ్డ ప్రారంభాలకు పెట్టింది పేరుగా ఈ వాక్యాన్ని అభివర్ణించింది ‘రైటర్స్డైజెస్ట్’ పత్రిక. క్లీషేకూ, మెలోడ్రామాకూ, అతిగా రాయబడిన వచనానికీ ఉదాహరణగా నిలిచిన ఈ వాక్యంతో ఎన్నో కథలు మొదలయ్యాయి. బ్రిటన్ర చయిత ఎడ్వర్డ్ బుల్వర్ లిట్టన్ 1830లో రాసిన ‘పాల్ క్లిప్ఫోర్డ్’ అనే నవల ప్రారంభంతో ఇది బాగా ప్రాచుర్యంలోకి వచ్చిందని కొందరి వాదన. ఆయన ఎంతో సాహిత్యం సృజించినప్పటికీ, ఈ ‘అపకీర్తి’ వాక్యంతో ఆయన కీర్తి నిలిచి పోయిందని సరదాగా వ్యాఖ్యానించారు విమర్శకులు. కానీ తమాషా ఏమిటంటే, 1809లో ‘ఎ హిస్టరీ ఆఫ్ న్యూయార్క్’ పుస్తకం రాస్తూ వాషింగ్టన్ ఇర్వింగ్ ఇదే వాక్యాన్ని వ్యంగ్యంగా ఉదాహరి స్తాడు. అంటే, అంతకు ఎంతోముందే ఈ వాక్యం సాహిత్యంలోకి చొరబడి పాఠకుల్ని ఉక్కిరిబిక్కిరి చేసిందన్నమాట! చిన్నకథల పితామహుడు అని చెప్పే ఎడ్గార్ అలెన్ పో కూడా దీన్ని వాడకుండా తమాయించుకోలేకపోయాడు. ‘మాస్టర్లు’ పునరుక్తులు వాడినా వారి ఇతరత్రా విస్తారమైన ప్రతిభలో అవి చెల్లిపోతాయి. కానీ సాహిత్య ‘విద్యార్థులు’ వాటికి దూరంగా ఉండడమే వారిని స్వతంత్రంగా నిలబెడుతుంది. జీవితపు అనుభవం లేకపోవడం, జీవితానికి చేరువగా వెళ్లి వాక్యాలను పిండు కోవడం తెలియనివారు మాత్రమే స్టాక్, ప్లాస్టిక్ వ్యక్తీకరణలను ఏ ప్రయత్న బరువూ లేకుండా తమ రాతల్లోకి తెచ్చేసుకుంటారు. ఎవరిని చదివినా ఒకేలా అనిపించడానికి ఇదే కారణం. -
‘బుల్లెట్ బండి’.. వాళ్లిద్దరికి సన్మానం
సాక్షి, కేశంపేట(హైదరాబాద్): యూట్యూబ్‌లో హల్చల్ చేస్తున్న ‘బుల్లెట్ బండెక్కి..’ పాటను రాసిన గేయ రచయితలను ఎంపీపీ రవీందర్‌యాదవ్ బుధవారం సన్మానించారు. మండల పరిషత్ కార్యాలయంలో గేయ రచయితలు మండల పరిధిలోని నిర్దవెళ్లి గ్రామానికి చెందిన రాము, లక్ష్మణ్‌లను శాలువలతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ వర్కాల లక్ష్మీనారాయణగౌడ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మురళీధర్‌రెడ్డి పాల్గొన్నారు. చదవండి: ఒక్క ఆలూ చిప్.. ధర ఏకంగా రూ.14 లక్షలు -
ఆ సర్జరీ తర్వాత ‘ప్లాస్టిక్ చోప్రా’ అని వెక్కిరించేవారు
ఆకాశమంత జీవితం నిప్పై జ్వలిస్తుంది. నీరై ఎగసిపడుతుంది. ప్రభంజనమై గొంతెత్తుతుంది.ఎప్పడో శేషజీవితంలో పుస్తకం రాసుకుందాం లే...అనుకోకుండా బాలీవుడ్ సెలబ్రిటీలు పుస్తకాలు రాస్తున్నారు. తమ జీవితాన్ని తెరిచిన పుస్తకం చేస్తున్నారు...పుస్తకం పంచభూతాల సమాహారం క్రాకింగ్ ది కోడ్ మై జర్నీ ఇన్ బాలీవుడ్ –ఆయుష్మాన్ ఖురానా ఆయుష్మాన్ ఖురానా ఎవరు? అనగానే వచ్చే సమాధానం బ్యాక్–టు–బ్యాక్ బ్లాక్ బస్టర్స్ ఇస్తున్న హీరో అని! ఈయనలో మంచి రచయితను పరిచయం చేసిన పుస్తకం క్రాకింగ్ ది కోడ్. భార్య తహీర కష్యప్‌తో కలిసి ఈ పుస్తకం రాశారు. చండీగఢ్ నుంచి ముంబైకు ఎంత దూరమో తెలియదుగానీ ‘జీరో టు హీరో’కు మధ్య దూరం మాత్రం చాలా పెద్దది. అలా అని దూరభయంలోనే ఉంటే కలలు ఎప్పటికీ దూరంగానే ఉంటాయి. ఈ విషయం తెలిసే తన కలల దారిని వెదుక్కుంటూ డ్రీమ్స్ సిటీ ముంబైకి వచ్చాడు ఖురాన. తన ప్రయాణంలో ఎదురైన కష్టాలకు ఈ పుస్తకంలో అక్షర రూపం ఇచ్చాడు. ఫేమ్, మై భీ హీరో, మైనే స్ట్రగులర్ హుమ్, టికెట్ టు బాలీవుడ్...మొదలైన చాప్టర్లు ఈ పుస్తకంలో ఉన్నాయి. కలలు కనేవాళ్లకు, కన్న కలలు నిజం చేసుకోవడానికి భయపడేవాళ్లకు ఈ పుస్తకం అంతులేని ధైర్యం. పుస్తకం నుంచి మంచి వాక్యం: మనలోని ‘నాకు అంతా తెలుసు’ అనే ద్వారం మూతపడితే తప్ప ‘తెలుసుకోవాలి’ అనే ద్వారం తెరుచుకోదు. ది పెరిల్స్ ఆఫ్ బీయింగ్మోడరేట్లీ ఫేమస్ సోహా అలీ ఖాన్ పెద్ద మర్రిచెట్టు కింద చిన్న మొక్క కూడా మొలవదు అంటారు. అదేమిటోగానీ, ఆ పెద్ద నీడ మాటున ‘వ్యక్తిగత ప్రతిభ’ అనేది చాలాసార్లు చిన్నబోతుంది. హిందీ, ఇంగ్లీష్, బెంగాలీ సినిమాల్లో నటిగా తన ప్రతిభ చాటుకున్న సోహా అలీఖాన్ చాలామంది దృష్టిలో పటౌడీ–షర్మిలా ఠాగూర్ల కూతురు మాత్రమే, ఇంకొందరి దృష్టిలో బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ సోదరి. ఇలాంటి విచిత్ర పరిస్థితిని హాస్యధోరణిలో రాసి నవ్వించారు సోహా. తన స్కూల్, కాలేజీ జీవిత జ్ఞాపకాలను నెమరేసుకోవడంతో పాటు ఈనాటి సోషల్ మీడియా కల్చర్‌పై తనదైన శైలిలో రాశారు. పుస్తకం నుంచి మంచి వాక్యం: జీవితం అయిదుసార్లు కుప్పకూల్చితే, పదిసార్లు లేచి నిల్చోవాలి.శక్తినంతా కూడదీసుకొని పోరాడాలి. అమ్మ మియా: ఇషా డియోల్ మాతృత్వం మధురిమపై ఇషా డియోల్ రాసిన అద్భుత పుస్తకం అమ్మ మియా. గర్భం దాల్చినప్పుడు తాను ఎదుర్కొన్న భయాలు, సందేహాలు వాటికి దొరికిన సమాధానాలు, ఇద్దరు పిల్లలు రధ్య, మియరల పెంపకం సంగతులు ఈ పుస్తకంలో ఉన్నాయి. ఇదొక బెస్ట్ పేరెంటింగ్ పుస్తకంగా పేరు తెచ్చుకుంది. స్థూలంగా చెప్పాలంటే న్యూ మదర్స్‌కు ఇదొక మంచి గైడ్‌లా ఉపకరిస్తుంది. పుస్తకం నుంచి మంచి వాక్యం: జీవితంలో మంచి విషయాలు అంటే అనుకోకుండా ఎదురయ్యే ఆనందక్షణాలే! అన్ఫినిష్డ్ ప్రియాంక చోప్రా సినిమా నేపథ్యం లేని కుటుంబం నుంచి వచ్చి హాలీవుడ్ వరకు ఎదగడం సాధారణ విషయమేమీ కాదు. తన ప్రయాణం నల్లేరు మీద నడక కాదు. తన ప్రస్థానంలో ఎదురైన అవమానాలు, చేసిన పోరాటాలను ‘అన్ఫిన్ఫినిష్డ్’లో రాశారు ప్రియాంక చోప్రా. ఒకానొక రోజు ప్రమాదవశాత్తు పెదవి తెగి రూపమే మారిపోయిన సందర్భంలో ప్లాస్టిక్ సర్జరీ చేసుకోవాల్సి వచ్చింది. ఇక అప్పటి నుంచి ‘ప్లాస్టిక్ చోప్రా’ అనే వెక్కిరింపులు ఎదురయ్యాయి. అయితే ఇవేమీ తన విజయానికి అడ్డుపడలేకపోయాయి. పుస్తకం నుంచి మంచి వాక్యం: నీలాంటి వ్యక్తి నువ్వు మాత్రమే. నీ గురించి బాగా తెలిసిన వ్యక్తి నువ్వు మాత్రమే. నీ బలాల గురించి బాగా తెలిసిన వ్యక్తి కూడా నువ్వు మాత్రమే! -
‘మాటల మడుగు’ మెర్సీ.. ‘లవ్ లెటర్స్’ కడలి..
-
లవర్స్ మస్ట్ లెర్న్
ప్రేమను ఎలా నిర్వచిస్తాం? ఏయే సిద్ధాంతాలు చదవాలి ప్రేమను నిర్వచించడానికి? అసలు ‘ఈ’ సిద్ధాంతం ప్రేమకు సరిపోతుందని ఒకటి మనం చెప్పగలమా? ఎన్ని కథలు చెప్పుకున్నా ఇంకేదో మిగిలే ఉంటుంది. ఎప్పటికీ, ఎన్నివిధాలుగా, ఎన్ని కోణాల్లో చెప్పుకున్నా ఇంకా ఏదో చెప్పడానికి ఒకటి మిగుల్చుకున్న ఫీలింగే ప్రేమ. ఆ ప్రేమకు నిర్వచనం వెతుకుతూ కొందరు రచయితలు చెప్పిన మాటలివి... లవర్స్ మస్ట్ లెర్న్ వేలెంటైన్స్ డే రోజున ఒక యువకుడికి ‘ప్రేమంటే ఏమిటి?’ అన్న అనుమానం వస్తుంది. ‘‘స్నేహం+ రొమాన్స్ = ప్రేమ’’ లాంటి గందరగోళపు ఈక్వేషన్స్ వేసుకుంటూ మరింత అయోమయానికి లోనవుతూ ఉంటాడు. ప్రేమ గురించి ప్రాక్టికల్‌గా బోధించటానికి స్నేహితుడు చేసిన ప్రయత్నాలు ఫలించవు. పెళ్ళయిన మొదటి రాత్రి భార్యని అడిగే మొదటి ప్రశ్న కూడా అదే. ఆ అమ్మాయి కంగారు పడి ఏడ్చినంత పనిచేస్తుంది. ఒక రాత్రి ఆమెకు విపరీతమైన కడుపునొప్పి వస్తుంది. కన్నీళ్ళతో రాత్రంతా మంచానికి ఆనుకుని కూర్చుంటాడు అతను. అకస్మాత్తుగా అతడికి తన ప్రశ్నకి సమాధానం దొరికినట్టు అనిపిస్తుంది. రచనా జీవితంలో ఇది నా రెండో కథ (1969). పేరు ‘లవర్స్ మస్ట్ లెర్న్’. ఫేస్‌బుక్‌లూ, చాటింగులు లేని రోజుల్లో రాసింది. ఇప్పటికీ ప్రేమ పట్ల నా అభిప్రాయం అదే. – యండమూరి వీరేంద్రనాథ్ ప్రేమ: ఒక అనిర్వచనం 1. జీవితం ఒక బాధ. ఆ బాధకు ఔషధం ప్రేమ. ప్రేమ ఒక బాధ. ఆ బాధకు ఔషధం లేదు – మీర్జా గాలిబ్. 2.ప్రేమ ఒక సక్రియాత్మక శక్తి. మనిషికీ, సమాజానికీ మధ్య గోడల్ని కూల్చే ఒక సాధనం. వైయక్తికతని పరిరక్షిస్తూ ఒంటరితనం నుంచీ, పరాయితనం నుంచీ వ్యక్తుల్ని విముక్తం చేసే ఒక ప్రక్రియ. ఇద్దరు వ్యక్తులు ఒక్కటైకూడా తిరిగి ఎవరికివారుగా మిగిలివుండగల అవకాశానికి అందమయిన ఒక అభివ్యక్తి. సమాన హృదయాల సంవేదనల మధ్య ఒక సున్నితమయిన సర్దుబాటు. నమ్మకం, నిజాయితీ, నిబద్ధత, సహనం, సమానత్వం, సహజీవనం, హక్కులు, బాధ్యతల సంయుక్త సమాగమం. ఇద్దరు వ్యక్తులు తమ అస్తిత్వాలను పణం పెట్టి ‘నేను‘ నుంచి ‘మనం‘ దిశగా ఇంద్రియ చైతన్యంతో చేసే ఒక అద్వైత శిఖరారోహణం. పరస్పరాహరణాన్ని పరిహరించే ఒక నైతిక పర్యావరణం. ప్రజాస్వామ్యం ప్రేమ అంతిమ సారాంశం. 3. వన్ ప్లస్ వన్ ఈజ్ ఈక్వల్ టూ వన్ అండ్ వన్ ప్లస్ వన్ (1+1=1–1+1) – ఖాదర్ మొహియుద్దీన్ నిర్వచనం అనవసరం ప్రేమకు నిర్వచనం ఇవ్వడం అసాధ్యమే కాదు, అనవసరం కూడా. అది అందరి మధ్యా ఒకేలా ఉండదు. మనం ఒక ప్రేమబంధం నుంచి ఏం ఆశిస్తామన్నది ‘ప్రేమ’ మీద ఆధారపడివుండదు. మన మనస్తత్వం మీద ఆధారపడివుంటుంది. కొందరికి ప్రేమ అంటే ఎప్పుడూ కలిసివుండడం, మరికొందరికి ప్రేమ అంటే ఇద్దరూ అన్ని విషయాల్లోనూ ఒకేలా ఆలోచించడం, ఒకే అభిరుచి కలిగివుండడం. ఇంకొకరికి ప్రేమ అంటే ఒకరి కోసం మరొకరు త్యాగాలు చెయ్యడం. ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. నిజానికి ఇవేవీ ప్రేమ సమగ్ర స్వరూపాలు కావు. ప్రేమ ఎప్పుడూ సాపేక్షమైన విలువే. అందుకే తరచుగా స్త్రీపురుషులు ‘నాకు నీ మీద ఉన్నంత ప్రేమ నీకు నా మీదలేదు’ అని నిందలు వేసుకుంటూంటారు. ప్రేమకు ఎవరి కొలమానాలు వారివి. కానీ ప్రేమ గురించి ఒక్కటి మాత్రం నిజం. అది చచ్చిపోతే మళ్లీ బతకించలేం. బలవంతంగా బతికించాలని ప్రయత్నిస్తే అది ఇన్డిఫరెన్స్గా మిగిలిపోతుంది. సోమర్సెట్ మామ్ అన్నట్టు ఇన్‌డిఫరెన్స్ అన్నది ప్రేమకు అసలైన చావు. ద్వేషం కంటే కూడా బాధాకరం. ఎందుకంటే అది శాశ్వతం. మరైతే ప్రేమను నిలుపుకోవడానికి ఏం చెయ్యాలి? దీనికి కూడా శాశ్వత పరిష్కారాలు, చిట్కాలు లేవు. కానీ, ఒకరి నుంచి ఒకరు ఎక్కువ ఆశించడం మానేయాలి. ఇద్దరి మధ్యా సాన్నిహిత్యం ఎంత ఉండాలో, ఒకరికొకరు ‘స్పేస్’ ఇచ్చుకోవడం కూడా అంతగానూ ఉండాలి. అలా స్పేస్ ఇచ్చుకున్నప్పుడు అవిశ్వాసాలు, అనుమానాలు, ఈర్ష్యలు తలెత్తవు. – మృణాళిని ‘ఇదీ’ అని చెప్పలేం! గుండ్రంగా ఉండే భూమికి, దిక్కులు ఎలా నిర్ణయించగలం? సూర్యుడిని ఆధారం చేసుకుని, మార్మికమైన ఈ విశ్వానికి ఒక నిర్వచనం ఇచ్చుకుని... మనం మనుగడ సాగిస్తున్నాం. ప్రేమ కూడా అలాంటి ఒక ఆధారమే. మననీ, మానవ సంబంధాలను.. అర్థం చేసుకోటానికి పనికొచ్చే.. ఆధారం. అది జీవితంలో ఒక్కో దశలో ఒక్కోలా ఉంటుంది, ఒక్కోలా అర్థమవుతుంది. ఏ దశకి ఆ దశ సత్యమే. ఆయా దశల్లో ఉండే ప్రేమ వల్ల వచ్చే బలం, బలహీనత, గ్రే షేడ్స్.. అన్నీ సత్యాలే. ఫలానా వ్యక్తి నిద్రలో ఫలానా కలని కనాలని ఎలా నిర్దేశించలేమో.. ప్రేమ అంటే ‘ఇది’ అని ఎవరూ సార్వజనీన నిర్వచనం ఇవ్వలేరు. – చైతన్య పింగళి ప్రాథమిక అవసరం ప్రేమ హృదయ సంబంధమైనది, వ్యక్తిగతమైంది. ఒక వ్యక్తిపట్ల గాఢమైన ఇష్టానికి లోనవ్వడం, ఆ వ్యక్తి సాన్నిహిత్యంలో స్వాంతన, శాంతి, భరోసా పొందటం ప్రేమ. పరస్పరం ఒక నమ్మకం, గౌరవం, సమానత్వ భావన కలిగి ఉండటం ప్రేమ. కులం, మతం, డబ్బు, హోదాలాంటి వాటికి తావులేదు. ఏ నిబంధనలు, అడ్డుగోడలు, పరిధులు లేని ప్రేమ పునాదిగా విలసిల్లే సమాజం ఏ దేశానికైనా అవసరం. ఆరోగ్యకరం. – డా. ఎమ్.ఎమ్. వినోదిని ఎందుకనిపిస్తుందో... ఎందుకనిపిస్తుందో... ఎప్పుడూ నాదే నాదే అయిన వొక ఆకాశం కావాలనీ నాదే నాదే అయిన వొక పూవు కావాలనీ– ఎక్కడ ఎలా పుడుతుందో తెలియని ప్రేమకి వొకే వొక్క అర్థాన్ని వెతుక్కోవడం ఐరనీ. అయినా అర్థాలు అడగడమూ, వెతుక్కోవడం మానేయలేని బలహీనత ఆ పదం చుట్టూ– నిండా ముంచెత్తే వానలో కురిసిపోవాలి అంతే, పారదర్శకమైన ఆ నీటి కణాల వెల్తుర్లో స్నానాలు చేయాలి అంతే. అన్నీ దగ్గిర దగ్గిరే వున్నట్టు అనిపించినా, చాలా వాటికి దూరమై పోయిన కాలం మనది. ‘‘నీకేం కావాలి?’’ అన్న ప్రశ్నకి సమాధానం కష్టమైన యుగం. పూలూ ఆకాశాలూ కూడా కేవలం వస్తువులైపోయినప్పుడు, వాటి మీద కూడా వ్యాపార ముద్ర పడిపోతుంది. అట్లాంటప్పడు ప్రేమ కూడా వస్తువే అయి, అమ్మకం మిగులుతుంది. నమ్మకం గుర్తు తెలియని శవమైపోతుంది. ఇంతా జేసి, ప్రేమ కావాలా వద్దా అంటే కావాలి, కొమ్మన పునర్జన్మ చిగురాకులానో, చిగురాకుల మధ్య వొదిగి మెరిసే చంద్ర చాపంలానో! – అఫ్సర్ ప్రేమ.. అసలివేవీ కానిది! నిజంగా నామీద ప్రేమ ఉంటే.. నువ్వు మారతావు. ప్రేమిస్తే సరిపోతుందా.. ఎలా పోషిస్తావు? నీకోసం నేనో కవిత రాశా. నన్ను ప్రేమిస్తే సరిపోదు, నా కుటుంబాన్నీ నీదనుకోవాలి. నువ్విలాంటి దాని(వాడి)వనుకోలేదు.. ఛీ. సారీ మా ఇంట్లో వాళ్లు ఒప్పుకోవట్లేదు. నాకు క్యాస్ట్ ఫీలింగ్ లేదు. కనీసం ఒక కారు లేదు.. ఎలా? ఇష్టంలేదంటే.. చంపేస్తాను. మా విషయం వేరు, మేం పెళ్లి చేసుకున్నాం. ఆకాశమంత ప్రేమ ఉంది.. కానీ పరిస్థితులూ.. ప్రేమ! బోల్డంత నాటకం నడుస్తుంది ఈ మాట చుట్టూ. కథలు, కవితలు, నాటకాలు, సినిమాలు, పుస్తకాలు, యూట్యూబ్ చానళ్లూ, వాట్సాప్ ఫార్వార్డ్లు.. ఎక్కడ చూస్తే అక్కడ, బోల్డంత ప్రేమ! వ్యక్తులనూ, వ్యవస్థలనూ, వ్యాపారాలనూ నిలబెట్టే ఆలంబన ప్రేమ. ప్రేమ.. సంస్కృతి, సంస్కారం, సంసారం. మానసికం, శారీరకం, సామాజికం. విలువలు, వలువలూ, ముసుగులూ. ఆనందం, విషాదం. ఉత్సాహం, ఉన్మాదం. ప్రేమ! ప్రేమ! అసలివేవీ కానిది. అసలదేంటో నీకు, నాకూ, ఎవ్వరికీ తెలియనిది. – అపర్ణ తోట గులాబీలు ఇవ్వడం కాదు! ప్రేమ అనే విశాలమైన విస్తృతమైన భావానికి నిర్వచనం ఎలా చెప్తాను? అందులో ఎన్ని కాంపోనెంట్స్ వుంటాయి! దయ వుంటుంది. క్షమ వుంటుంది. కరుణ వుంటుంది. గౌరవం వుంటుంది. అన్నింటికన్నా ముఖ్యమైన ఆత్మగౌరవం వుంటుంది. గులాబీలు ఇవ్వడం కాదు. తను ఇష్టపడిన, మోహపడిన వ్యక్తి స్వేచ్ఛను గౌరవించడం ప్రేమ!! – పి. సత్యవతి -
ఇంతకన్నా గొప్ప స్క్రిప్ట్ ఇవ్వగలరా?: వర్మ
సాక్షి, హైదరాబాద్ : వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ బాలీవుడ్ రచయితలకు ఓ సవాల్ విసిరారు. ప్రస్తుతం దేశంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులకు మించిన స్క్రిప్ట్ అందిచగలరా అని ప్రశ్నించారు. ఓ వైపు ఐఎన్ఎక్స్ మీడియా కేసులో చిదంబరం, ఆయన కొడుకు కార్తీల సీబీఐ విచారణ, కాంగ్రెస్ అవినీతి, బీజేపీ ప్రతీకారం, మనీ లాండరింగ్, నీరవ్ మోదీ బ్యాంకుల కుంభకోణం, ఇంద్రాణి ముఖర్జీ హత్య కేసులను ప్రస్తావిస్తూ ఓ ట్వీట్ చేశాడు. వీటన్నిటి కన్నా బలమైన స్క్రిప్ట్‌తో గొప్ప బాలీవుడ్ రచయితలు ముందుకు రాగలారా? నాకు సందేహమే అని ట్వీట్లో పేర్కొన్నాడు. వర్మ చేసిన ఈ సెటైరిక్ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. Chidambaram, Karti his Son , Congress Corruption,BJP Vendetta,Money laundering , Nirav Modi , bank scams,Indrani mukherjea and Murder..ALL IN ONE.. Whoaaaa I doubt if the best of Bollywood script writers can come up with a more wilder script than this 🙏 — Ram Gopal Varma (@RGVzoomin) 2 March 2018