ప్రతీకాత్మక చిత్రం
ప్రేమను ఎలా నిర్వచిస్తాం? ఏయే సిద్ధాంతాలు చదవాలి ప్రేమను నిర్వచించడానికి? అసలు ‘ఈ’ సిద్ధాంతం ప్రేమకు సరిపోతుందని ఒకటి మనం చెప్పగలమా? ఎన్ని కథలు చెప్పుకున్నా ఇంకేదో మిగిలే ఉంటుంది. ఎప్పటికీ, ఎన్నివిధాలుగా, ఎన్ని కోణాల్లో చెప్పుకున్నా ఇంకా ఏదో చెప్పడానికి ఒకటి మిగుల్చుకున్న ఫీలింగే ప్రేమ. ఆ ప్రేమకు నిర్వచనం వెతుకుతూ కొందరు రచయితలు చెప్పిన మాటలివి...
లవర్స్ మస్ట్ లెర్న్
వేలెంటైన్స్ డే రోజున ఒక యువకుడికి ‘ప్రేమంటే ఏమిటి?’ అన్న అనుమానం వస్తుంది. ‘‘స్నేహం+ రొమాన్స్ = ప్రేమ’’ లాంటి గందరగోళపు ఈక్వేషన్స్ వేసుకుంటూ మరింత అయోమయానికి లోనవుతూ ఉంటాడు. ప్రేమ గురించి ప్రాక్టికల్‌గా బోధించటానికి స్నేహితుడు చేసిన ప్రయత్నాలు ఫలించవు. పెళ్ళయిన మొదటి రాత్రి భార్యని అడిగే మొదటి ప్రశ్న కూడా అదే. ఆ అమ్మాయి కంగారు పడి ఏడ్చినంత పనిచేస్తుంది. ఒక రాత్రి ఆమెకు విపరీతమైన కడుపునొప్పి వస్తుంది. కన్నీళ్ళతో రాత్రంతా మంచానికి ఆనుకుని కూర్చుంటాడు అతను. అకస్మాత్తుగా అతడికి తన ప్రశ్నకి సమాధానం దొరికినట్టు అనిపిస్తుంది. రచనా జీవితంలో ఇది నా రెండో కథ (1969). పేరు ‘లవర్స్ మస్ట్ లెర్న్’. ఫేస్‌బుక్‌లూ, చాటింగులు లేని రోజుల్లో రాసింది. ఇప్పటికీ ప్రేమ పట్ల నా అభిప్రాయం అదే.
– యండమూరి వీరేంద్రనాథ్
ప్రేమ: ఒక అనిర్వచనం
1. జీవితం ఒక బాధ. ఆ బాధకు ఔషధం ప్రేమ. ప్రేమ ఒక బాధ. ఆ బాధకు ఔషధం లేదు – మీర్జా గాలిబ్.
2.ప్రేమ ఒక సక్రియాత్మక శక్తి. మనిషికీ, సమాజానికీ మధ్య గోడల్ని కూల్చే ఒక సాధనం. వైయక్తికతని పరిరక్షిస్తూ ఒంటరితనం నుంచీ, పరాయితనం నుంచీ వ్యక్తుల్ని విముక్తం చేసే ఒక ప్రక్రియ. ఇద్దరు వ్యక్తులు ఒక్కటైకూడా తిరిగి ఎవరికివారుగా మిగిలివుండగల అవకాశానికి అందమయిన ఒక అభివ్యక్తి. సమాన హృదయాల సంవేదనల మధ్య ఒక సున్నితమయిన సర్దుబాటు. నమ్మకం, నిజాయితీ, నిబద్ధత, సహనం, సమానత్వం, సహజీవనం, హక్కులు, బాధ్యతల సంయుక్త సమాగమం. ఇద్దరు వ్యక్తులు తమ అస్తిత్వాలను పణం పెట్టి ‘నేను‘ నుంచి ‘మనం‘ దిశగా ఇంద్రియ చైతన్యంతో చేసే ఒక అద్వైత శిఖరారోహణం. పరస్పరాహరణాన్ని పరిహరించే ఒక నైతిక పర్యావరణం. ప్రజాస్వామ్యం ప్రేమ అంతిమ సారాంశం.
3. వన్ ప్లస్ వన్ ఈజ్ ఈక్వల్ టూ వన్ అండ్ వన్ ప్లస్ వన్ (1+1=1–1+1)
– ఖాదర్ మొహియుద్దీన్
నిర్వచనం అనవసరం
ప్రేమకు నిర్వచనం ఇవ్వడం అసాధ్యమే కాదు, అనవసరం కూడా. అది అందరి మధ్యా ఒకేలా ఉండదు. మనం ఒక ప్రేమబంధం నుంచి ఏం ఆశిస్తామన్నది ‘ప్రేమ’ మీద ఆధారపడివుండదు. మన మనస్తత్వం మీద ఆధారపడివుంటుంది. కొందరికి ప్రేమ అంటే ఎప్పుడూ కలిసివుండడం, మరికొందరికి ప్రేమ అంటే ఇద్దరూ అన్ని విషయాల్లోనూ ఒకేలా ఆలోచించడం, ఒకే అభిరుచి కలిగివుండడం. ఇంకొకరికి ప్రేమ అంటే ఒకరి కోసం మరొకరు త్యాగాలు చెయ్యడం. ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. నిజానికి ఇవేవీ ప్రేమ సమగ్ర స్వరూపాలు కావు. ప్రేమ ఎప్పుడూ సాపేక్షమైన విలువే. అందుకే తరచుగా స్త్రీపురుషులు ‘నాకు నీ మీద ఉన్నంత ప్రేమ నీకు నా మీదలేదు’ అని నిందలు వేసుకుంటూంటారు.
ప్రేమకు ఎవరి కొలమానాలు వారివి. కానీ ప్రేమ గురించి ఒక్కటి మాత్రం నిజం. అది చచ్చిపోతే మళ్లీ బతకించలేం. బలవంతంగా బతికించాలని ప్రయత్నిస్తే అది ఇన్‌డిఫరెన్స్‌గా మిగిలిపోతుంది. సోమర్సెట్ మామ్ అన్నట్టు ఇన్‌డిఫరెన్స్ అన్నది ప్రేమకు అసలైన చావు. ద్వేషం కంటే కూడా బాధాకరం. ఎందుకంటే అది శాశ్వతం. మరైతే ప్రేమను నిలుపుకోవడానికి ఏం చెయ్యాలి? దీనికి కూడా శాశ్వత పరిష్కారాలు, చిట్కాలు లేవు. కానీ, ఒకరి నుంచి ఒకరు ఎక్కువ ఆశించడం మానేయాలి. ఇద్దరి మధ్యా సాన్నిహిత్యం ఎంత ఉండాలో, ఒకరికొకరు ‘స్పేస్’ ఇచ్చుకోవడం కూడా అంతగానూ ఉండాలి. అలా స్పేస్ ఇచ్చుకున్నప్పుడు అవిశ్వాసాలు, అనుమానాలు, ఈర్ష్యలు తలెత్తవు.
– మృణాళిని
‘ఇదీ’ అని చెప్పలేం!
గుండ్రంగా ఉండే భూమికి, దిక్కులు ఎలా నిర్ణయించగలం? సూర్యుడిని ఆధారం చేసుకుని, మార్మికమైన ఈ విశ్వానికి ఒక నిర్వచనం ఇచ్చుకుని... మనం మనుగడ సాగిస్తున్నాం. ప్రేమ కూడా అలాంటి ఒక ఆధారమే. మననీ, మానవ సంబంధాలను.. అర్థం చేసుకోటానికి పనికొచ్చే.. ఆధారం. అది జీవితంలో ఒక్కో దశలో ఒక్కోలా ఉంటుంది, ఒక్కోలా అర్థమవుతుంది. ఏ దశకి ఆ దశ సత్యమే. ఆయా దశల్లో ఉండే ప్రేమ వల్ల వచ్చే బలం, బలహీనత, గ్రే షేడ్స్.. అన్నీ సత్యాలే. ఫలానా వ్యక్తి నిద్రలో ఫలానా కలని కనాలని ఎలా నిర్దేశించలేమో.. ప్రేమ అంటే ‘ఇది’ అని ఎవరూ సార్వజనీన నిర్వచనం ఇవ్వలేరు.
– చైతన్య పింగళి
ప్రాథమిక అవసరం
ప్రేమ హృదయ సంబంధమైనది, వ్యక్తిగతమైంది. ఒక వ్యక్తిపట్ల గాఢమైన ఇష్టానికి లోనవ్వడం, ఆ వ్యక్తి సాన్నిహిత్యంలో స్వాంతన, శాంతి, భరోసా పొందటం ప్రేమ. పరస్పరం ఒక నమ్మకం, గౌరవం, సమానత్వ భావన కలిగి ఉండటం ప్రేమ. కులం, మతం, డబ్బు, హోదాలాంటి వాటికి తావులేదు. ఏ నిబంధనలు, అడ్డుగోడలు, పరిధులు లేని ప్రేమ పునాదిగా విలసిల్లే సమాజం ఏ దేశానికైనా అవసరం. ఆరోగ్యకరం.
– డా. ఎమ్.ఎమ్. వినోదిని
ఎందుకనిపిస్తుందో...
ఎందుకనిపిస్తుందో... ఎప్పుడూ నాదే నాదే అయిన వొక ఆకాశం కావాలనీ నాదే నాదే అయిన వొక పూవు కావాలనీ– ఎక్కడ ఎలా పుడుతుందో తెలియని ప్రేమకి వొకే వొక్క అర్థాన్ని వెతుక్కోవడం ఐరనీ. అయినా అర్థాలు అడగడమూ, వెతుక్కోవడం మానేయలేని బలహీనత ఆ పదం చుట్టూ– నిండా ముంచెత్తే వానలో కురిసిపోవాలి అంతే, పారదర్శకమైన ఆ నీటి కణాల వెల్తుర్లో స్నానాలు చేయాలి అంతే. అన్నీ దగ్గిర దగ్గిరే వున్నట్టు అనిపించినా, చాలా వాటికి దూరమై పోయిన కాలం మనది. ‘‘నీకేం కావాలి?’’ అన్న ప్రశ్నకి సమాధానం కష్టమైన యుగం.
పూలూ ఆకాశాలూ కూడా కేవలం వస్తువులైపోయినప్పుడు, వాటి మీద కూడా వ్యాపార ముద్ర పడిపోతుంది. అట్లాంటప్పడు ప్రేమ కూడా వస్తువే అయి, అమ్మకం మిగులుతుంది. నమ్మకం గుర్తు తెలియని శవమైపోతుంది. ఇంతా జేసి, ప్రేమ కావాలా వద్దా అంటే కావాలి, కొమ్మన పునర్జన్మ చిగురాకులానో, చిగురాకుల మధ్య వొదిగి మెరిసే చంద్ర చాపంలానో!
– అఫ్సర్
ప్రేమ.. అసలివేవీ కానిది!
నిజంగా నామీద ప్రేమ ఉంటే.. నువ్వు మారతావు. ప్రేమిస్తే సరిపోతుందా.. ఎలా పోషిస్తావు? నీకోసం నేనో కవిత రాశా. నన్ను ప్రేమిస్తే సరిపోదు, నా కుటుంబాన్నీ నీదనుకోవాలి. నువ్విలాంటి దాని(వాడి)వనుకోలేదు.. ఛీ. సారీ మా ఇంట్లో వాళ్లు ఒప్పుకోవట్లేదు. నాకు క్యాస్ట్ ఫీలింగ్ లేదు. కనీసం ఒక కారు లేదు.. ఎలా? ఇష్టంలేదంటే.. చంపేస్తాను. మా విషయం వేరు, మేం పెళ్లి చేసుకున్నాం. ఆకాశమంత ప్రేమ ఉంది.. కానీ పరిస్థితులూ.. ప్రేమ! బోల్డంత నాటకం నడుస్తుంది ఈ మాట చుట్టూ. కథలు, కవితలు, నాటకాలు, సినిమాలు, పుస్తకాలు, యూట్యూబ్ చానళ్లూ, వాట్సాప్ ఫార్వార్డ్‌లు.. ఎక్కడ చూస్తే అక్కడ, బోల్డంత ప్రేమ! వ్యక్తులనూ, వ్యవస్థలనూ, వ్యాపారాలనూ నిలబెట్టే ఆలంబన ప్రేమ. ప్రేమ.. సంస్కృతి, సంస్కారం, సంసారం. మానసికం, శారీరకం, సామాజికం. విలువలు, వలువలూ, ముసుగులూ. ఆనందం, విషాదం. ఉత్సాహం, ఉన్మాదం. ప్రేమ! ప్రేమ! అసలివేవీ కానిది. అసలదేంటో నీకు, నాకూ, ఎవ్వరికీ తెలియనిది.
– అపర్ణ తోట
గులాబీలు ఇవ్వడం కాదు!
ప్రేమ అనే విశాలమైన విస్తృతమైన భావానికి నిర్వచనం ఎలా చెప్తాను? అందులో ఎన్ని కాంపోనెంట్స్ వుంటాయి! దయ వుంటుంది. క్షమ వుంటుంది. కరుణ వుంటుంది. గౌరవం వుంటుంది. అన్నింటికన్నా ముఖ్యమైన ఆత్మగౌరవం వుంటుంది. గులాబీలు ఇవ్వడం కాదు. తను ఇష్టపడిన, మోహపడిన వ్యక్తి స్వేచ్ఛను గౌరవించడం ప్రేమ!!
– పి. సత్యవతి
Comments
Please login to add a commentAdd a comment