'ఎందుకింత రాద్ధాంతం'
సాహిత్య అకాడమీ అవార్డులతో పాటు పద్మశ్రీ అవార్డును తిరిగి ఇచ్చేస్తున్న పరిణామాలపై కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ స్పందించారు. ఆయన బుధవారమిక్కడ మాట్లాడుతూ..దేశంలో ఎన్నో పెద్ద సంఘటనలు జరిగినప్పుడు కూడా ఇలాంటి నిరసనలు తెలుపలేదని.. ఇందిరాగాంధీ హయాంలో ఎమర్జన్సీ విధించినప్పుడు, ఏడాదిన్నర క్రితం జరిగిన ముజఫరాబాద్ అల్లర్ల సమయంలోకూడా మౌనంగా ఉన్నవారు ఇప్పుడు ఎందుకింత రాద్ధాంతం చేస్తున్నారని ప్రశ్నించారు.
ప్రధాని నరేంద్రమోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ఇప్పటికే ఈ ఘటనలపై మాట్లాడారనీ అయినప్పటికీ ఈ ఘటనలపై విమర్శలు ఆపకపోవడం విచారకరమని రవిశంకర్ ప్రసాద్ అభిప్రాయపడ్డారు. పురస్కారాలు పొందిన పరిశోధకులు, రచయితలపై తమకు గౌరవం ఉందనీ.. వారి సేవలను, ప్రతిభను గుర్తిస్తూ ఇచ్చిన పుస్కారాలుగా వాటిని చూడాలన్నారు.
కాగా దాద్రీ ఘటన, కన్నడ రచయిత కాల్బుర్గి హత్యల నేపథ్యంలో రచయితలు, సాహితీవేత్తలు పెద్ద ఎత్తున నిరసనలు తెలుపుతున్న విషయం తెలిసిందే. రచయితలు, సాహితీ వేత్తలతో పాటు అనువాదకులు సుమారు 27 మంది తమకు లభించిన సాహిత్య అకాడమీ అవార్డులు తిరిగి ఇస్తున్నట్లు ప్రకటించారు. పంజాబ్ రచయిత్రి దలిప్ కౌర్ ఏకంగా తనకు లభించిన పద్మశ్రీ అవార్డును తిరిగి ఇచ్చేశారు.