అవార్డులు వెనక్కివ్వాలా.. ఊహూ నేనివ్వను!
తిరువనంతపురం: దేశంలో జరుగుతున్న పలు ఘటనలకు నిరసనగా పలువురు రచయితలు తమకు గతంలో వచ్చిన కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులను తిరిగి ఇచ్చేస్తున్న విషయం ప్రముఖ నటి, నృత్యకారిణి శోభనకు అస్సలు తెలియదట. దీనికితోడు వారికి లేటు వయసులో అవార్డు వచ్చి ఉంటుంది, అందుకే ఇచ్చేశారు.. తాను మాత్రం అవార్డును తిరిగి ఇచ్చేది లేదని కుండబద్దలుకొట్టి మరీ చెప్పింది.
కేరళలో జరుగుతున్న 38వ సూర్య ఫెస్టివల్ కోసం తిరువంతనపురం వచ్చినపుడు మీడియా ప్రశ్నించగా శోభన ఈ కామెంట్స్ చేసింది. యూపీలో జరిగిన దాద్రి ఉదంతం గురించి తనకు అస్సలు తెలియనే తెలియదని సెలవిచ్చింది. 'ఏ అవార్డు? అవార్డులు తిరిగి ఇచ్చారా, ఎవరు.... ఏమో నాకు తెలియదు' అంటూ తిరిగి విలేకరులకే ప్రశ్నల వర్షం కురిపిస్తూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసింది. దీనికి తోడు.. తాను మాత్రం తనకు వచ్చిన అవార్డును తిరిగి ఇచ్చేది లేదని చెప్పేసరికి విలేకరులు కంగుతిన్నారట. దీనిపై ఆమెకు కొంత వివరణ ఇచ్చిన మీడియా, ఈ ఘటనలపై వ్యాఖ్యానించాలని ఇంకొంచెం ఒత్తిడి చేయగా.. బహుశా పెద్ద వయసులో వచ్చింది కాబట్టి వాళ్లు అవార్డులను తిరిగి ఇస్తున్నారేమో...తనకు వచ్చిన అవార్డును మాత్రం ఇవ్వనని కరాఖండిగా తేల్చేసిందిట.
ప్రసిద్ధ కన్నడ రచయిత ఎంఎం కల్బుర్గీ హత్య, దాద్రిలో ముస్లిం వృద్ధుని హత్య నేపథ్యంలో దాదాపు 12 మంది కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీతలు తమ అవార్డులను వెనక్కి ఇస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. కేరళకు చెందిన నటి శోభనకు కేరళ రచయిత్రి సారా జోసెఫ్ సహా, కొంతమంది ప్రసిద్ధ రచయితలు తమ అవార్డులను వెనక్కి ఇచ్చేయడం గురించి తెలియకపోవడం ఏంటని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.