కొన్నేళ్ళుగా ప్రపంచానికి కంటిలో నలుసుగా మారి, అగ్రరాజ్యాన్ని సైతం వణికిస్తున్న అంతర్జాతీయ ఇస్లామిస్ట్ ఉగ్రమూక అల్‌ఖైదాకు ఇది ఊహించని దెబ్బ. అఫ్ఘానిస్థాన్‌లోని కాబూల్‌లో ప్రపంచం కంటపడకుండా నివసిస్తున్న అల్‌ఖైదా అధినేత అయ్‌మాన్ అల్–జవాహిరీని అమెరికా మాటు వేసి, జూలై 31 ఉదయం చాటుగా మట్టుబెట్టడంతో ఒక అధ్యాయం ముగిసింది. ‘9/11’ దాడులకు తెగబడిన ముష్కరమూకను నలిపి, నాశనం చేయాలని ప్రపంచపు పెద్దన్న ఇరవై ఒక్క ఏళ్ళుగా పగతో రగిలిపోతోంది.
2011లో ఒసామా బిన్ లాడెన్‌నూ, ఇప్పుడు ఆయనకు కుడిభుజంగా వ్యవహరించిన జవాహిరీని హతమార్చడం అమెరికా నిఘా వ్యవస్థ ఎంత బలమైనదో మరోసారి ప్రపంచానికి తెలిసివచ్చింది. అంతకన్నా ముఖ్యంగా అఫ్ఘానిస్థాన్‌ను ఉగ్రమూకలకు స్థావరంగా మార్చబోమంటూ తాలిబన్లు చేసుకున్న ‘దోహా ఒప్పందం’లోని డొల్లతనం బయట పడింది. పాకిస్థాన్, అఫ్ఘానిస్థాన్ లాంటివి ఇప్పటికీ ఉగ్రమూకలకు స్వర్గధామాలే అన్న కఠిన వాస్తవం పొరుగున ఉన్న భారత్ సహా ప్రపంచమంతటినీ మరోసారి అప్రమత్తం చేస్తోంది.
1998 ఆగస్టులో తూర్పు ఆఫ్రికాలో అమెరికా ఎంబసీపై బాంబుదాడి నుంచి ‘9/11’గా పాపు లరైన 2001 సెప్టెంబర్ 11 నాటి న్యూయార్క్ ప్రపంచ వాణిజ్య కేంద్ర జంట భవనాలపై వైమానిక దాడి వరకు... అగ్రరాజ్యంపై అల్‌ఖైదా తెగబడిన అనేక సందర్భాల్లో తెర వెనుక సూత్రధారి జవాహిరియే. నేత్రవైద్యుడి నుంచి తీవ్రవాదిగా మారిన 71 ఏళ్ళ జవాహిరి అప్పట్లో అల్‌ఖైదాలో నంబర్ టూ. 2011లో పాకిస్థాన్‌లోని అబోటాబాద్‌లో అమెరికన్ కమెండోలు లాడెన్‌ను గుట్టుగా మట్టుపెట్టినప్పటి నుంచి ఆ సంస్థకు ఆయనే నంబర్ వన్. అల్‌ఖైదా కొంత తెర వెనక్కి వెళ్ళాక, ‘ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా’ (ఐసిస్) లాంటి హింసాత్మక జిహాదిస్టు పిల్లమొలకలు మొలిచి, ఐరోపాలో తెగబడడం చూస్తున్నాం. కొంత బలహీనపడ్డా, కార్యకర్తల సమీకరణ సత్తా ఉన్న సైద్ధాంతికుడిగా జవాహిరి అమెరికా మొదలు ఇండొనేసియా దాకా అనేక దేశాల వెన్నులో వణుకు పుట్టిస్తూనే వచ్చారు. అమెరికా ఎప్పుడో ఆయన తలకు 2.5 కోట్ల డాలర్ల భారీ వెల కట్టింది.
భారత్‌కూ ముప్పు తేవాలని జవాహిరి ఆరాటపడ్డారు. ‘భారత ఉపఖండ అల్‌ఖైదా’ (ఏక్యూ ఐఎస్)ను ఆరంభిస్తున్నట్టు 2014లోనే ఒక వీడియోలో ప్రకటించిన ఆయన నిరుడు హురియత్ నేత గీలానీ చనిపోయినప్పుడు సంతాపం ప్రకటిస్తూ, కశ్మీర్ అంశాన్ని భుజానికెత్తుకొనే యత్నం చేశారు. ఈ ఏడాది కర్ణాటకలో హిజాబ్ వివాదం తలెత్తినప్పుడూ సాయుధపోరు చేయాలంటూ ముస్లిమ్ లను రెచ్చగొట్టేందు ప్రయత్నించారు. కానీ, సహనశీల భారతావనిలో ఆ పప్పులుడకలేదు. నిన్నటి దాకా గుర్తు తెలియనిచోట గడుపుతున్నాడనుకుంటున్న ఈ ఉగ్రనేత సాక్షాత్తూ కాబూల్ నడిబొడ్డున, అఫ్ఘాన్ ప్రభుత్వ పెద్దలెందరో నివసిస్తున్న భవనంలో సకుటుంబంగా కాపురమున్న వైనం దిగ్భ్రాంతికరం. నెలల క్రితమే ఆయన ఆచూకీ కనిపెట్టిన అమెరికా గూఢచారులు ఆనుపానులన్నీ చూసుకొని, చుట్టుపక్కల ఎవరికీ ఏమీ కాకుండా చిత్రమైన హిల్‌ఫైర్ క్షిపణుల రిమోట్ డ్రోన్ దాడితో లక్ష్యాన్ని ఛేదించిన వైనం కొన్నాళ్ళు కథలు కథలుగా చెప్పుకొనే జేమ్స్‌బాండ్ తరహా విన్యాసం.
తాజా ఆపరేషన్‌తో తీవ్రవాదంపై పోరులో అమెరికా ప్రతిష్ఠ కొంత పెరగవచ్చు. ఉపఖండంలో పర్యవసానాలు అంతకన్నా పెరుగుతాయి. ఏడాది క్రితం అమెరికా సేనలు హడావిడిగా వెనక్కి తగ్గాక, అఫ్ఘాన్‌లో బలవంతాన పగ్గాలు చేజిక్కించుకున్న పిడివాద తాలిబన్లకూ, వారి ప్రభుత్వానికీ ఇవాళ్టికీ అంతర్జాతీయ గుర్తింపు అంతంత మాత్రమే. ఈ పరిస్థితుల్లో తమకు తెలియకుండానే జవాహిరి తమ నట్టింట్లోనే తలదాచుకున్నాడని తాలిబన్ సర్కార్ బొంకినా నమ్మేవారెవరూ లేరు. తమ దేశ సార్వభౌమాధికారానికి అమెరికా తాజా రహస్య దాడులు విఘాతమని కాబూల్ వాదన. మామూలుగానైతే ఆ మాటకు అంతో ఇంతో మద్దతు లభించేదేమో! కానీ, పది పడగల పాముకు నేటికీ పాలు పోసి పెంచుతున్న వైనం బట్టబయలయ్యాక తాలిబన్లను ఎవరూ బాహాటంగా సమర్థించ లేరు.
ఇక, జవాహిరి వ్యవహారంలో పాకిస్థాన్ ఇవ్వాల్సిన సంజాయిషీ సైతం చాలానే ఉంది. దీర్ఘకాలం పాక్‌లో తలదాచుకొని, ఇప్పుడు అఫ్ఘాన్‌లోనూ పాకిస్థానీ స్థావర ఉగ్రమూక హక్కానీ నెట్‌వర్క్ నీడలోనే అల్‌ఖైదా అధినేత కాలక్షేపం చేశాడనేది సుస్పష్టం. ఇన్నాళ్ళూ కడుపులో పెట్టుకొని కాపాడిన ఉగ్రసారథితో తమకే బంధం లేదని దాయాది దేశం చెబితే హాస్యాస్పదం. ఆ మాటకొస్తే, స్వలాభం కోసం ఇప్పుడు పాకిస్థానే అతని ఉప్పందించిందనే వాదనా వినిపిస్తోంది.
తాజా దాడితో అమెరికా పగ చల్లారిందేమో కానీ, ఆన్‌లైన్ విషప్రచారంతో వివిధ దేశాలకు వ్యవస్థను విస్తరించిన జిహాదిస్టు గ్రూపులు తోక తొక్కిన తాచులా లేచే ప్రమాదం ఉంది. అధినేతను కోల్పోయి ఇప్పటికి ఆ స్థాయి వారసుడెవరూ లేకపోయినా, కొత్త గ్రూపులను కూడగట్టుకొని అల్ ఖైదా ప్రతీకారం తీర్చుకోజూస్తుంది. ఇక తాలిబన్లు సరేసరి. అందుకే, జవాహిరి ఒక్కడి మరణంతో సమస్త ఉగ్రవాదం సమసిపోయినట్టు కాదు. ప్రపంచానికిస్తున్న హామీలకు విరుద్ధంగా ముష్కర మూకలను పెంచిపోషిస్తున్న పాక్, అఫ్ఘాన్‌లపై అంతర్జాతీయ సమాజం ఒత్తిడి తేవాలి. ఉప ఖండంలో శాంతి సుస్థిరతలకు భంగం కలిగించే చర్యల్ని అనుమతించబోమనాలి. అందుకే, ‘9/11’ దాడుల్లో మరణించిన 3 వేల మంది కుటుంబాల కన్నీటి కథకు జవాహిరి అంతం ఒక ముగింపని బైడెన్ అన్నారు కానీ, దశకంఠుడి లాంటి ఉగ్రసంస్థలపై యుద్ధంలో ఇది మరో మజిలీ మాత్రమే!
Comments
Please login to add a commentAdd a comment