నెహ్రూ గారిని నిలదీయడం ఈ మధ్య ఫ్యాషన్ అయిపోయిందిగాని నిజానికి ఆయనను నిలదీయాల్సింది నెహ్రూ జాకెట్‌ను ఎందుకు పాప్యులర్ చేశావయ్యా అని. రచయితలు, కవులు, విమర్శకులు మున్ముందు రోజులలో లాల్చీ పైజమా ధరించడమేగాక నెహ్రూ జాకెట్‌ను కూడా తగిలించారంటే గనక చచ్చినట్టు వారు సాహిత్యకారులుగా మన దేశంలో చలామణి అవుతారని ఆయన ఊహించి ఉండడు. ఎరిగిన సాహిత్యకారులు అడపా దడపా ఆ అదనపు వస్త్రాన్ని ధరించినా తాము సాహిత్యకారులమే అని తప్పక నిరూపించుకోవాలనుకునే వారికి మాత్రం నెహ్రూ జాకెట్ కవచ కుండలం.
పూర్వం రోజులలో కొందరు సాహితీ తాపసులు పెన్నును బుగ్గకు పెట్టుకుని, నుదుటిని నింగి వంక ఎత్తి పెట్టి ఫొటో దిగి, పుస్తకం వెనుక వేసుకోవడం వల్ల వారు రచయితలని, కవులని నమ్మాల్సి వచ్చేది. మరికొందరు టెలిఫోన్ రిసీవర్‌ను చెవి దగ్గర పెటుకొన్న ఫొటోను పుస్తకం వెనుక వేయడం వల్ల అమ్మో వీరు రచయితలేస్మీ అనుకోకుండా ఉండలేకపోయేవారం.
‘మానవతా... ఎక్కడమ్మా నీ చిరునామా?’ అని గూగుల్ మేప్స్ లేని కాలంలో ఎవరు పై అడ్రస్ అడుగుతూ కవిత్వం రాసినా వారు కవులు కాకుండాపోలేదు. ఇక ఏ కాలంలో అయినా ఎల్.ఎస్.వి.శేషాచలం, మునవర్తి సుబ్రహ్మణ్యం, విక్టర్ మనోహర్, ప్రొఫెసర్ చారులత వంటి ప్రముఖ విమర్శకులు ఉంటారు కనుక వారు ముందు మాట రాసి వదిలారంటే– ఎందుకొచ్చిన గొడవ అని నోరు మెదపక అట్టి రచయితలను రచయితలే అనుకోవడమూ కద్దు.
ఏదేని ఒక శాఖ కలిగిన రాష్ట్రమంత్రితో, ఏదేని ప్రాదేశిక ఇన్ కమ్‌టాక్సు కమిషనర్‌తో, లేదంటే స్థానిక వాకర్స్ క్లబ్ ప్రెసిడెంట్‌తో... ఈ ముగ్గురితో కాని కనీసం వీరిలో ఇద్దరితో కాని ఫొటోలు దిగి, ఫేస్‌బుక్‌లో పెట్టి, ఇక మమ్మల్ని సాహిత్యకారులం కాదు అనంటే తంతాం అనేవారు ఉన్నారంటే నోరు నొక్కుకోవాల్సిన పని లేదు.
జీవితంలో అక్షరమ్ముక్క రాయకపోయినా రాసే వాళ్లందరి ఫోన్ నంబర్లు కలిగి ఉండటమే కాదు వారికి కాల్ చేసి ‘ఏవోయ్ ఎలా ఉన్నావ్’ అనిగానీ, ‘నమస్కారమండీ... టిఫినయ్యిందా’ అనిగానీ అడగ్గలిగే చనువు ఉన్నందుకు కనీసం డజను మంది తెలుగునాట ప్రముఖ సాహిత్యకారులుగా చలామణి అవుతున్నారంటే గుండె పొంగే సంగతి. ‘శుంఠల్లారా... ఇదా మీ ప్రతాపమూ... నన్ను గనక కళ్లకు గంతలు గట్టి ఢిల్లీలో ఏమూల వదిలినా నేరుగా సాహిత్య అకాడెమీ ఆఫీసుకు చేరుకోగలను’ అనేవారి ప్రదక్షిణ పటిమ వారికి ఇస్తున్న అతిశయం అంతా ఇంతా కాదు.
‘అడుగడుగున నుడి ఉంది’, ‘అక్షర రశ్మీ జయతు’, ‘మనమంతా కలం కులం’... వాట్సప్ గ్రూప్‌లను స్థాపించి, ఒక దానిలో నూట పదహారుకు తక్కువ కాకుండా సభ్యులను చేసి, అడ్మిన్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఏకైక హోదా వల్ల సాహిత్య దశా దిశను నిర్దేశించాలని కన్నీళ్లతో తపన పడేవారెందరో మన హృదయాలను చెమ్మగిల్ల చేస్తున్నారు. ఈ యొక్క వాట్సప్ గ్రూప్‌లలో ప్రతి ఒక్క కవిత, వ్యాఖ్యకు మరువక లైక్ కొట్టేవారిని దృష్టిలోకి తీసుకుని మాసాంతంలో వారికో అవార్డు బహూకరించడం మరో విశిష్ట ప్రోత్సాహక ప్రోత్సహితం.
జూమ్‌లో స్లాట్ బుక్ చేసి, కార్డు డిజైన్ చేయగల వనరులు కలిగినవారు వారానికి పది మందిని సాహితీ సమాలోచనంలో ముమ్మరం చేయడం చూస్తే ఏమిచ్చి వీరి రుణం తీర్చుకోగలం అనిపిస్తుంది. గుర్తు తెలియని విదేశాలకు వెళ్లి స్థానిక గాంధీనగర్ అసోసియేషన్ స్థాయి సాహితీ సమ్మేళనంలో పాల్గొని రుజువు పత్రంతోనూ, తెల్లవాళ్లతోనూ ఫొటోలు దిగి బెదురు, బెరుకు పుట్టించే వారిది స్వీయ విమానచార్జీలు భరించగలిగే స్థాయి.
సాహిత్యం అంటే అందరికీ ఇష్టం. పాఠకులుగా ఉత్తమ సాహిత్యాన్ని ఇష్టపడేవారూ సృజన కారులుగా ఉత్తమ సాహిత్యసృష్టికి పెనుగులాడేవారూ ఎప్పుడూ ఉంటారు. ఈ ఇద్దరూ ప్రతి ప్రాంతంలో, భాషలో, దేశంలో తమ తమ సాహిత్యాన్ని గౌరవ భంగం కలగకుండా కాపాడుకుంటూ వస్తారు. అలాగే ప్రతి సందర్భంలో, ప్రతి సన్నివేశంలో ఈ సాహిత్యంలో భాగం కావాలని నిజాయితీగా అభిలషించేవారూ ఉంటారు.వీరి ప్రయత్న శుద్ధి, సృజన సామర్థ్యం, విడదీయలేని స్వభావం ఇవ్వవలసిన గుర్తింపు ఇస్తూనే ఉంటాయి.
వీరు కాక ఔత్సాహిక పాఠకులు, ఔత్సాహిక సాహితీ సేవకులూ ఉంటారు. వీరు తమను తాము సాహితీకారులుగా భావించుకుని కార్యాచరణలో దిగడమూ, సాహిత్యానికి ప్రతినిధులుగా మారడం నేటి సోషల్ మీడియా కాలంలో విస్తృతమైంది. సాహిత్యం ఇచ్చే గుర్తింపు ఆనందాన్ని, ఆత్మసంతృప్తిని కలిగించడమేగాక ఏదో ఒక ఊతం దొరికింది కదా అనుకునేలా చేయడం ఇందుకు కారణం. ఇవన్నీ ఉండాల్సినవే. ఉండతగ్గవే. కాకుంటే శ్రుతి మించి అసలు కొంత, కొసరు మరింతగా మారడం నేటి దుఃస్థితి.
వాస్తవానికి రెండు రాష్ట్రాలలోని చిన్న ఊళ్లలో ఉంటూ మంచి కవిత్వాన్ని, కథను రాస్తున్న యువతరం ఎందరో ఉన్నారు. అలాగే ఏళ్లకేళ్లు తమ మానాన తాము రాసుకుంటూ పాఠకుల గౌరవం పొందినవారూ ఉన్నారు. వీరంతా పి.ఆర్. చేయకపోవచ్చు. తమను తాము ముందుకు నెట్టుకోకపోవచ్చు. అంతమాత్రాన రాష్ట్ర, జాతీయస్థాయి వేదికల మీద వీరు కనపడాల్సిన పనిలేదు అనుకోరాదు.
అదే సమయంలో పరిచయ సామర్థ్యమే సాహితీ సామర్థ్యంగా చెల్లుబాటయ్యే వారు అట్టి వేదికల మీద పదే పదే సాహితీ ముఖాలుగా కనిపించడాన్నీ ఉపేక్షించాల్సిన పని లేదు. ‘సత్యముతో పని ఏల, మిడియోకర్‌లతో కలిసి నడిచి ప్రయోజనాలు పొందితే పోలా’ అనుకునే నిజ సాహితీకారులదీ ఈ దోషం. కళ్లు మూత. ఏమైనా మాట్లాడే సందర్భం వస్తుంది. అభినయ సాహిత్యకారులూ కొంచెం నెమ్మదించండి!
నెహ్రూ జాకెట్ సాహిత్యం
Published Mon, Mar 18 2024 1:01 AM | Last Updated on Mon, Mar 18 2024 1:04 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment