సంజీవని కావాలి! | Sakshi Editorial On Dodo Bird | Sakshi
Sakshi News home page

సంజీవని కావాలి!

Published Mon, Feb 26 2024 12:12 AM | Last Updated on Mon, Feb 26 2024 12:12 AM

Sakshi Editorial On Dodo Bird

మనం మనుషులం, మర్త్యులం. పుట్టిన ప్రతి మనిషికీ మరణం తప్పదు. మరణించిన మనుషులు తిరిగి బతికిన ఉదంతాలు అరుదుగా వార్తల్లో కనిపిస్తుంటాయి. చితి మీద నుంచి లేదా శవపేటిక నుంచి అలా బతికి లేచిన వాళ్లు కూడా ఏదో ఒకరోజు మరణిస్తారు. ‘జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ/ తస్మాద పరిహార్యేర్థే న/ త్వం శోచితు మర్హసి’ అని భగవద్గీతలో ఆ శ్రీకృష్ణ పరమాత్ముడే చెప్పాడు. పుట్టిన వారికి మరణం తప్పదని, మరణించిన వారు తిరిగి పుట్టక తప్పదని, ఇదంతా ఒక చక్రమని చాలా మతాలు నమ్ముతాయి. ఈ నమ్మకంలోని నిజానిజాలు ఆ భగవంతుడికే ఎరుక! ఇది ఇంతవరకు శాస్త్రీయంగా రుజువు కాలేదు. నమ్మకాలకు రుజువులతో పనిలేదు. నమ్మకాలను కలిగి ఉండటం ప్రజల హక్కు గనుక జనన మరణ చక్రంపై నమ్మకాన్ని అలా విడిచిపెడదాం.

మన పురాణాల్లో మరణించిన వారిని బతికించిన ఉదంతాలు ఉన్నాయి. అసురగురుడు శుక్రాచార్యుడి వద్ద మృతసంజీవని విద్య ఉండేదట! ఆ విద్యతోనే దేవతలతో జరిగిన యుద్ధాల్లో మరణించిన దానవులందరినీ ఆయన మళ్లీ బతికించేసేవాడట! అప్పట్లో దేవతల వద్ద ఈ విద్య ఉండేది కాదు. ఆ తర్వాత  క్షీరసాగర మథనంలో పుట్టిన అమృతం తాగిన తర్వాతనే దేవతలు అమర్త్యులుగా మారారు. క్షీరసాగర మథనానికి ముందు ప్రమాద నివారణ చర్యల్లో భాగంగా దేవగురువు బృహస్పతి మృతసంజీవని విద్యను శుక్రుని వద్ద నేర్చుకోవడానికి స్వయంగా తన కొడుకు కచుడిని పంపించాడు. శుక్రాచార్యుడి ఆశ్రమంలో కచుడి ప్రవేశం ముక్కోణపు ప్రేమ గాథకు దారితీసింది. అదంతా వేరే కథ! 

త్రేతాయుగం నాటి రామాయణంలో కూడా మృతులను బతికించిన సందర్భం కనిపిస్తుంది. అప్పట్లో ఈ విద్య వానర వైద్యుడు సుషేణుడికి తెలుసు. రామ రావణ యుద్ధంలో ఇంద్రజిత్తు బాణం దెబ్బకు లక్ష్మణుడు మూర్ఛిల్లినప్పుడు సుషేణుడి సలహాపై హనుమంతుడు సంజీవని మూలిక దొరికే సుమేరు పర్వతానికి వెళ్లి, మూలికను గుర్తించలేక ఏకంగా పర్వతాన్ని పెకలించుకొచ్చాడు. సుషేణుడు సంజీవని మూలికతో లక్ష్మణుడు తెప్పరిల్లేలా చేశాడు. అప్పటి వరకు యుద్ధంలో మరణించిన వానరులను తిరిగి బతికించాడు. ఇదంతా రామాయణ కథనం. ద్వాపర యుగం నాటికి మరణించినవాళ్లను తిరిగి బతికించే విద్య అంతరించిందేమో! కురుక్షేత్ర యుద్ధంలో మరణించిన వాళ్లెవరూ తిరిగి బతికిన దాఖలాలు కనిపించవు. 

ఆధునిక కాలంలో మనమేం చేస్తున్నామంటే, భూమ్మీద సృష్టి మొదలైనది లగాయతు ఇప్పటి వరకు ఏమేమి అంతరించిపోయాయో లెక్కలు వేసుకుంటున్నాం. భూమ్మీద జీవసృష్టి మొదలయ్యాక దాదాపు ఐదువందల కోట్ల జీవరాశులు ఉద్భవించాయి. వాటిలో తొంభైతొమ్మిది శాతం అంతరించిపోయాయి. ఇప్పటికి మిగిలిన జీవజాతులు దాదాపు ఎనభై ఏడు లక్షలు మాత్రమే! వీటిలోనూ కొన్ని జీవజాతులు మన కళ్లముందే అంతరించిపోయే పరిస్థితులు ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 

భూమ్మీద అంతరించిపోతున్నవి జీవరాశులు మాత్రమే కాదు. భూమ్మీద పుట్టిన మనుషులు సృష్టించుకున్న ఎన్నో నాగరికతలు, భాషలు అంతరించిపోయాయి. ఆధునికత అభివృద్ధి చెందే క్రమంలో ఎన్నో వస్తువులు, ఎన్నో కళలు కనుమరుగైపోయాయి. ప్రపంచవ్యాప్తంగా దాదాపు ఏడువేల భాషలను శాస్త్రవేత్తలు గుర్తించారు. వీటిలో దాదాపు ఐదువందల వరకు భాషలు పూర్తిగా అంతరించాయి.

మనుగడలో ఉన్న భాషల్లోనూ కొన్ని సాహితీప్రక్రియలు కనుమరుగైపోయాయి. కొన్ని భాషలు కొన ఊపిరితో ఉన్నాయి. యునెస్కో రూపొందించిన ‘వరల్డ్‌ అట్లాస్‌ ఆఫ్‌ లాంగ్వే జెస్‌’ ప్రకారం ప్రస్తుత ప్రపంచంలో సుమారు రెండున్నరవేల భాషలు రానున్న కాలంలో కనుమరుగయ్యే స్థితిలో ఉన్నాయి. ఒక భాష అంతరించిపోతే, ఆ భాషతో ముడిపడి ఉన్న ప్రజల చరిత్ర అంతరించిపోతుంది. ఆ భాషలో నమోదై ఉన్న విలువైన సాహిత్యం, శాస్త్రవిజ్ఞానం; ఆ భాష ప్రజల సంస్కృతి కూడా తుడిచిపెట్టుకుపోతాయి.

ఇప్పటికే అంతరించిపోయిన భాషలను ఎటూ కాపాడుకోలేకపోయాం. కనీసం ప్రమాదం అంచుల్లో ఉన్న భాషలనైనా కాపాడుకోవడానికి ప్రయత్నిస్తే మంచిది. మరణించిన భాషలకు ప్రాణం పోసే మృతసంజీవని విద్య ఏదీ ఇప్పటివరకు లేదు. అయితే, అంతరించిపోయిన కొన్ని అరుదైన జీవరాశులకు తిరిగి ప్రాణం పోయడానికి శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు. నాలుగు శతాబ్దాల కిందట అంతరించిపోయిన ‘డోడో’ అనే ఎగరలేని పక్షిని జన్యుసాంకేతిక పరిజ్ఞానంతో తిరిగి పుట్టించడానికి అమెరికన్‌ శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు. 

నాణ్యత అరుదైపోతున్న ప్రక్రియల విషయానికి వస్తే – తెలుగు సాహిత్యంలో ఇప్పుడు కొన ఊపిరితో ఉన్న ప్రక్రియ విమర్శ. ఆధునిక తెలుగు సాహిత్యంలో కందుకూరి వీరేశలింగంతో మొదలైన విమర్శ – రాచమల్లు రామచంద్రారెడ్డి నాటికి గొప్ప దశకు చేరుకుంది. కానీ, తర్వాత తర్వాత చప్పబడింది. రచయితలు రాటుదేలడానికి విమర్శకులు చాలా అవసరం.

తెలుగు సాహిత్యంలో ప్రస్తుతం రచయితలకు, కవులకు కొదవలేదు గాని, విమర్శకుల లోటు బలంగా ఉంది. కొద్దిమంది విమర్శకులు ఈ ప్రక్రియను బతికించుకుంటూ వస్తున్నారు. అలాగని విమర్శ ప్రక్రియ క్షీణతకు కేవలం విమర్శకులను తప్పుపట్టలేం. విమర్శను తట్టుకునే శక్తి రచయితల్లో కొరవడటం కూడా ఈ పరిస్థితికి కారణం కావచ్చు. విమర్శ కనుమరుగైపోతే, సాహితీ సృజన అంతరించి పోవడానికి ఎంతోకాలం పట్టదు. ఇప్పుడు విమర్శకు పునర్జీవం కల్పించే సంజీవని కావాలి! 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement