మాట్లాడగలగడం, మేధ వికసించడం మానవ చరిత్రలో మహత్తర ఘట్టాలంటారు శాస్త్రవేత్తలు. అవి లేకపోతే మనిషి మనుగడా, ఆ మనుగడతో పెనవేసుకున్న ప్రపంచమూ ఇప్పటిలా ఉండేవే కావు. మేధ జ్ఞానాన్ని పెంపొందిస్తే, దానిని నలుగురికీ పంచేది మాటే. మాట నేర్చిన తొలిరోజుల్లో దాని ప్రభావానికి ఆశ్చర్య చకితుడైన మనిషి దానికి మహత్తును ఆపాదించి మంత్రంగా మార్చు కున్నాడు.
నిత్య జీవనంలో దాని లౌకికమైన విలువనూ గుర్తించాడు. ఒంటరి మనిషిలో స్వగతంగా ఉన్న మాట, మరో మనిషి జత కాగానే సంభాషణ అయింది; మరికొందరు జత పడితే చర్చ అయింది; శ్రోతలు పెరిగిన కొద్దీ ప్రసంగమైంది. వీటిలో ప్రతి ఒక్కటీ జ్ఞానవ్యాప్తికి వాహిక అయింది.
చర్చనే వాద, ప్రతివాదమనీ; సంవాదమనీ; ఆంగ్లంలో డిబేట్, డిస్కషన్ అనీ అంటున్నాం. చర్చలేని సందర్భం మానవ జీవితంలో ఉండనే ఉండదు. కుటుంబ స్థాయి నుంచి, దేశస్థాయి వరకూ నిరంతరం చర్చ సాగుతూనే ఉంటుంది. చర్చకు వస్తువు కాని విషయమూ ఉండదు. భూమి సూర్యుడి చుట్టూ తిరిగినట్టే మానవ ప్రపంచం చర్చ చుట్టూ తిరుగుతుంది. దేనినైనా సరే చర్చించే అభ్యాసం మనకు కొత్తది కాదంటూ నోబెల్ పురస్కార గ్రహీత అమర్త్యసేన్ ‘ది ఆర్గ్యుమెంటేటివ్ ఇండియన్’(సంవాద భారతీయుడు) అనే పుస్తకమే రాశాడు.
రామాయణ, మహాభారతాల్లో, భగవద్గీతలో, ఉపనిషత్తుల్లో చర్చలూ, వాదప్రతివాదాలూ ఎలా సాగాయో ఎత్తిచూపాడు. హెచ్చు, తగ్గుల సమాజంలో కిందిమెట్టు మీద ఉన్న స్త్రీ, పురుషవర్గాల గొంతుకూ మన సంవాద సంప్రదాయం ఎంతోకొంత చోటిచ్చిందన్నాడు. ప్రపంచ వ్యాప్తంగా ప్రజాస్వామ్యం వేళ్ళు చర్చలోనే పాతుకున్నాయంటూ, ప్రత్యేకించి మన దేశంలోని రకరకాల అసమానతలను ప్రజాస్వామికంగా పరిష్కరించుకోడానికి మనదైన సంవాద సంప్రదాయం స్ఫూర్తినిస్తుందన్నాడు.
రామాయణంలో రాముడికి పట్టాభిషేక నిర్ణయాన్ని దశరథుడు అందిరినీ సంప్రదించే తీసుకుంటాడు. జాబాలికి, రాముడికి జరిగిన సంవాదం మరో ఉదాహరణ. పరలోకం లేదనీ, పితృవాక్పాలన అర్థరహితమనీ, ప్రత్యక్షంగా కనిపించే రాజ్యాన్ని అనుభవించమనీ జాబాలి అన్నప్పుడు రాముడు అతని మాటలు ఖండిస్తూ, నువ్వు చెప్పినట్లు చేస్తే ప్రజలు నన్నే ఆదర్శంగా తీసుకుని విచ్చలవిడిగా సంచరిస్తారంటాడు. విభీషణ శరణాగతి లాంటి ప్రతి సందర్భంలోనూ రాముడు సహచరులతో చర్చించే నిర్ణయం తీసుకుంటాడు.
మహాభారతంలో ధర్మరాజు తనను జూదంలో ఒడ్డి ఓడినప్పుడు; తన్నోడి నన్నోడెనా, లేక నన్నోడి తన్నోడెనా అన్న చర్చను ద్రౌపది సభాముఖంగా లేవదీస్తుంది. ధర్మరాజు యుద్ధానికి విముఖుడైనప్పుడు యుద్ధపక్షాన వాదిస్తుంది. బృహదారణ్యకో పనిషత్తులో గార్గి అనే విదుషీమణి యాజ్ఞ్యవల్క్యునితో వాదోపవాదాలు జరిపి ఓటమిని హుందాగా ఒప్పుకుంటుంది. యాజ్ఞ్యవల్క్యునికి, అతని భార్య మైత్రేయికి జరిగిన సంవాదం గురించి కూడా ఉపనిషత్తు చెబుతుంది.
ప్రత్యామ్నాయ చింతన నుంచి, ప్రతివాదం నుంచి, ప్రతిపక్షం నుంచే జైన, బౌద్ధ తాత్వికతలు అభివృద్ధి చెందాయి. అద్వైతవాది అయిన శంకరాచార్యుడు, కర్మవాది అయిన మండనమిశ్రునితోనూ, అతని భార్య ఉభయభారతితోనూ రోజుల తరబడి వాదోపవాదాలు జరిపి ఓడిస్తాడు. ఇప్పటిలా ప్రచురణ, ఎలక్ట్రానిక్, ఇంటర్నెట్ ఆధారిత సామాజిక మాధ్యమాలు లేని కాలంలో సైతం మనిషి తనే సంచార మాధ్యమంగా మారి, దూరభారాలను జయించి పండిత పరిషత్తులను మెట్టాడు; వాద, ప్రతివాదాలలో ప్రకర్షను చాటి జ్ఞానవిజ్ఞాన వ్యాప్తికి వేగుచుక్క అయ్యాడు.
అలాంటి ఒక పండిత స్పర్థలోనే శ్రీనాథ మహాకవి ‘‘పగుల గొట్టించి తుద్భటవివాద ప్రౌఢి గౌడడిండమభట్టు కంచుఢక్క’’ అని చెప్పుకున్నాడు. నిన్నమొన్నటి వరకూ కాశీ, బెంగాల్‌లోని నవద్వీపం మొదలైనవి విద్వత్పరీక్షలకు పట్టుగొమ్మలుగా ప్రసిద్ధికెక్కాయి. అయల సోమయాజుల గణపతిశాస్త్రి అనే పండితుడు ఆంధ్రదేశం నుంచి నవద్వీపం వెళ్ళి అక్కడి విద్వజ్జనాన్ని మెప్పించి ‘కావ్యకంఠ’ బిరుదును అందుకొని వచ్చాడు.
పురాతన నాగరికతలన్నీ సంవాద సంప్రదాయాన్ని పెంచి పోషించినవే. ప్రాచీన గ్రీకు తాత్వికుడు సోక్రటిస్ అభివృద్ధి చేసిన ప్రశ్నోత్తరాల సంవాద శైలి ‘సోక్రటిక్ డైలాగ్’ పేరిట ఒక వచనరచనా ప్రక్రియగా సారస్వతంలో భాగమైంది. సాంస్కృతిక పునరుజ్జీవనం దరిమిలా యూరప్‌లో ఆధునిక చర్చారూపాలు అభివృద్ధి చెంది, సంవాద సమాజాలు ఏర్పడి వైజ్ఞానిక వికాసాన్ని కొత్తపుంతలు తొక్కించాయి.
సంవాద ప్రక్రియ నిర్దిష్టమైన రూపురేఖలు తెచ్చుకుని పాఠశాల నుంచి, విశ్వవిద్యాలయ స్థాయి వరకు విద్యలో భాగమైంది. అందులో పోటీపడే విద్యార్థుల తర్ఫీదుకు శిక్షకులు అవత రించారు. ఆల్ఫ్రెడ్ స్నైడర్, మాక్స్ వెల్ ష్రూనర్ అనే ఇద్దరు శిక్షకులు సంవాదకళను అనేక కోణాల నుంచి చర్చిస్తూ, నిర్వచిస్తూ ‘మెనీ సైడ్స్– డిబేట్ ఎక్రాస్ కరిక్యులమ్’ అనే పుస్తకం వెలువరించారు.
ఈ మొత్తం నేపథ్యం నుంచి చూసినప్పుడు మన పరిస్థితే ఆశ్చర్యకరం. రాచరికపు రోజుల్లోనే మనం తీర్చిదిద్దుకున్న సంవాద సంప్రదాయం ప్రజాతంత్రంలో అక్కరకు రాకుండాపోయింది. ఇన్నేళ్ళ ప్రజాస్వామ్యంలో కీలక సంవాద కేంద్రాలైన శాసనసభలకు వేలసంఖ్యలో ప్రతినిధులను పంపుకున్నా, పంపుతున్నా సంవాద విధివిధానాల శిక్షణ అంచెలంచెల విద్యలో ఇప్పటికీ భాగం కాలేదు.
ఎక్కడైనా పాఠ్యేతర అంశంగా కొన ఊపిరితో ఉన్నా కార్పొరేట్ చదువులు దానినీ పాడి ఎక్కించాయి. కొత్తగా సామాజిక మాధ్యమాల వెల్లువ సంవాదపు బరిలో ప్రతి ఒకరికీ అవకాశమిచ్చి మేలు చేసినా విధివిధానాల శిక్షణ లేక చర్చ రచ్చగా మారడం; ప్రజాస్వామ్యానికి ప్రాణవాయువు కావలసిన సంవాదం విషవాయువు కావడం చూస్తున్నాం!
చర్చ కాదు, రచ్చ
Published Mon, Sep 23 2024 12:07 AM | Last Updated on Mon, Sep 23 2024 5:12 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment