Human History
-
చర్చ కాదు, రచ్చ
మాట్లాడగలగడం, మేధ వికసించడం మానవ చరిత్రలో మహత్తర ఘట్టాలంటారు శాస్త్రవేత్తలు. అవి లేకపోతే మనిషి మనుగడా, ఆ మనుగడతో పెనవేసుకున్న ప్రపంచమూ ఇప్పటిలా ఉండేవే కావు. మేధ జ్ఞానాన్ని పెంపొందిస్తే, దానిని నలుగురికీ పంచేది మాటే. మాట నేర్చిన తొలిరోజుల్లో దాని ప్రభావానికి ఆశ్చర్య చకితుడైన మనిషి దానికి మహత్తును ఆపాదించి మంత్రంగా మార్చు కున్నాడు. నిత్య జీవనంలో దాని లౌకికమైన విలువనూ గుర్తించాడు. ఒంటరి మనిషిలో స్వగతంగా ఉన్న మాట, మరో మనిషి జత కాగానే సంభాషణ అయింది; మరికొందరు జత పడితే చర్చ అయింది; శ్రోతలు పెరిగిన కొద్దీ ప్రసంగమైంది. వీటిలో ప్రతి ఒక్కటీ జ్ఞానవ్యాప్తికి వాహిక అయింది. చర్చనే వాద, ప్రతివాదమనీ; సంవాదమనీ; ఆంగ్లంలో డిబేట్, డిస్కషన్ అనీ అంటున్నాం. చర్చలేని సందర్భం మానవ జీవితంలో ఉండనే ఉండదు. కుటుంబ స్థాయి నుంచి, దేశస్థాయి వరకూ నిరంతరం చర్చ సాగుతూనే ఉంటుంది. చర్చకు వస్తువు కాని విషయమూ ఉండదు. భూమి సూర్యుడి చుట్టూ తిరిగినట్టే మానవ ప్రపంచం చర్చ చుట్టూ తిరుగుతుంది. దేనినైనా సరే చర్చించే అభ్యాసం మనకు కొత్తది కాదంటూ నోబెల్ పురస్కార గ్రహీత అమర్త్యసేన్ ‘ది ఆర్గ్యుమెంటేటివ్ ఇండియన్’(సంవాద భారతీయుడు) అనే పుస్తకమే రాశాడు. రామాయణ, మహాభారతాల్లో, భగవద్గీతలో, ఉపనిషత్తుల్లో చర్చలూ, వాదప్రతివాదాలూ ఎలా సాగాయో ఎత్తిచూపాడు. హెచ్చు, తగ్గుల సమాజంలో కిందిమెట్టు మీద ఉన్న స్త్రీ, పురుషవర్గాల గొంతుకూ మన సంవాద సంప్రదాయం ఎంతోకొంత చోటిచ్చిందన్నాడు. ప్రపంచ వ్యాప్తంగా ప్రజాస్వామ్యం వేళ్ళు చర్చలోనే పాతుకున్నాయంటూ, ప్రత్యేకించి మన దేశంలోని రకరకాల అసమానతలను ప్రజాస్వామికంగా పరిష్కరించుకోడానికి మనదైన సంవాద సంప్రదాయం స్ఫూర్తినిస్తుందన్నాడు. రామాయణంలో రాముడికి పట్టాభిషేక నిర్ణయాన్ని దశరథుడు అందిరినీ సంప్రదించే తీసుకుంటాడు. జాబాలికి, రాముడికి జరిగిన సంవాదం మరో ఉదాహరణ. పరలోకం లేదనీ, పితృవాక్పాలన అర్థరహితమనీ, ప్రత్యక్షంగా కనిపించే రాజ్యాన్ని అనుభవించమనీ జాబాలి అన్నప్పుడు రాముడు అతని మాటలు ఖండిస్తూ, నువ్వు చెప్పినట్లు చేస్తే ప్రజలు నన్నే ఆదర్శంగా తీసుకుని విచ్చలవిడిగా సంచరిస్తారంటాడు. విభీషణ శరణాగతి లాంటి ప్రతి సందర్భంలోనూ రాముడు సహచరులతో చర్చించే నిర్ణయం తీసుకుంటాడు. మహాభారతంలో ధర్మరాజు తనను జూదంలో ఒడ్డి ఓడినప్పుడు; తన్నోడి నన్నోడెనా, లేక నన్నోడి తన్నోడెనా అన్న చర్చను ద్రౌపది సభాముఖంగా లేవదీస్తుంది. ధర్మరాజు యుద్ధానికి విముఖుడైనప్పుడు యుద్ధపక్షాన వాదిస్తుంది. బృహదారణ్యకో పనిషత్తులో గార్గి అనే విదుషీమణి యాజ్ఞ్యవల్క్యునితో వాదోపవాదాలు జరిపి ఓటమిని హుందాగా ఒప్పుకుంటుంది. యాజ్ఞ్యవల్క్యునికి, అతని భార్య మైత్రేయికి జరిగిన సంవాదం గురించి కూడా ఉపనిషత్తు చెబుతుంది. ప్రత్యామ్నాయ చింతన నుంచి, ప్రతివాదం నుంచి, ప్రతిపక్షం నుంచే జైన, బౌద్ధ తాత్వికతలు అభివృద్ధి చెందాయి. అద్వైతవాది అయిన శంకరాచార్యుడు, కర్మవాది అయిన మండనమిశ్రునితోనూ, అతని భార్య ఉభయభారతితోనూ రోజుల తరబడి వాదోపవాదాలు జరిపి ఓడిస్తాడు. ఇప్పటిలా ప్రచురణ, ఎలక్ట్రానిక్, ఇంటర్నెట్ ఆధారిత సామాజిక మాధ్యమాలు లేని కాలంలో సైతం మనిషి తనే సంచార మాధ్యమంగా మారి, దూరభారాలను జయించి పండిత పరిషత్తులను మెట్టాడు; వాద, ప్రతివాదాలలో ప్రకర్షను చాటి జ్ఞానవిజ్ఞాన వ్యాప్తికి వేగుచుక్క అయ్యాడు. అలాంటి ఒక పండిత స్పర్థలోనే శ్రీనాథ మహాకవి ‘‘పగుల గొట్టించి తుద్భటవివాద ప్రౌఢి గౌడడిండమభట్టు కంచుఢక్క’’ అని చెప్పుకున్నాడు. నిన్నమొన్నటి వరకూ కాశీ, బెంగాల్‌లోని నవద్వీపం మొదలైనవి విద్వత్పరీక్షలకు పట్టుగొమ్మలుగా ప్రసిద్ధికెక్కాయి. అయల సోమయాజుల గణపతిశాస్త్రి అనే పండితుడు ఆంధ్రదేశం నుంచి నవద్వీపం వెళ్ళి అక్కడి విద్వజ్జనాన్ని మెప్పించి ‘కావ్యకంఠ’ బిరుదును అందుకొని వచ్చాడు. పురాతన నాగరికతలన్నీ సంవాద సంప్రదాయాన్ని పెంచి పోషించినవే. ప్రాచీన గ్రీకు తాత్వికుడు సోక్రటిస్ అభివృద్ధి చేసిన ప్రశ్నోత్తరాల సంవాద శైలి ‘సోక్రటిక్ డైలాగ్’ పేరిట ఒక వచనరచనా ప్రక్రియగా సారస్వతంలో భాగమైంది. సాంస్కృతిక పునరుజ్జీవనం దరిమిలా యూరప్‌లో ఆధునిక చర్చారూపాలు అభివృద్ధి చెంది, సంవాద సమాజాలు ఏర్పడి వైజ్ఞానిక వికాసాన్ని కొత్తపుంతలు తొక్కించాయి. సంవాద ప్రక్రియ నిర్దిష్టమైన రూపురేఖలు తెచ్చుకుని పాఠశాల నుంచి, విశ్వవిద్యాలయ స్థాయి వరకు విద్యలో భాగమైంది. అందులో పోటీపడే విద్యార్థుల తర్ఫీదుకు శిక్షకులు అవత రించారు. ఆల్ఫ్రెడ్ స్నైడర్, మాక్స్ వెల్ ష్రూనర్ అనే ఇద్దరు శిక్షకులు సంవాదకళను అనేక కోణాల నుంచి చర్చిస్తూ, నిర్వచిస్తూ ‘మెనీ సైడ్స్– డిబేట్ ఎక్రాస్ కరిక్యులమ్’ అనే పుస్తకం వెలువరించారు. ఈ మొత్తం నేపథ్యం నుంచి చూసినప్పుడు మన పరిస్థితే ఆశ్చర్యకరం. రాచరికపు రోజుల్లోనే మనం తీర్చిదిద్దుకున్న సంవాద సంప్రదాయం ప్రజాతంత్రంలో అక్కరకు రాకుండాపోయింది. ఇన్నేళ్ళ ప్రజాస్వామ్యంలో కీలక సంవాద కేంద్రాలైన శాసనసభలకు వేలసంఖ్యలో ప్రతినిధులను పంపుకున్నా, పంపుతున్నా సంవాద విధివిధానాల శిక్షణ అంచెలంచెల విద్యలో ఇప్పటికీ భాగం కాలేదు. ఎక్కడైనా పాఠ్యేతర అంశంగా కొన ఊపిరితో ఉన్నా కార్పొరేట్ చదువులు దానినీ పాడి ఎక్కించాయి. కొత్తగా సామాజిక మాధ్యమాల వెల్లువ సంవాదపు బరిలో ప్రతి ఒకరికీ అవకాశమిచ్చి మేలు చేసినా విధివిధానాల శిక్షణ లేక చర్చ రచ్చగా మారడం; ప్రజాస్వామ్యానికి ప్రాణవాయువు కావలసిన సంవాదం విషవాయువు కావడం చూస్తున్నాం! -
2023 హాటెస్ట్ వేసవి
2023లో ఎండలు అక్షరాలా మండిపోయా యి. ఎంతగా అంటే, మానవ చరిత్రలో రికార్డయిన అత్యంత హెచ్చు ఉష్ణోగ్రతలు ఈ ఎండాకాలంలోనే నమోదయ్యాయి. ఈ ఏడాదే ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న రికార్డులు బద్దలయ్యేంతటి వడ గాడ్పులు, వాటి అనంతర పరిణామాలు ఇందుకు మరింతగా దోహదం చేశాయి. కొన్ని దశాబ్దాలుగా భూగోళం అంతటా ఉష్ణోగ్రతలు క్రమంగా పెరిగిపోతున్న పరిణామానికి ఇది ప్రమాదకరమైన కొనసాగింపేనని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు... 2023 వేసవి 1880లో ప్రపంచవ్యాప్తంగా వాతావరణ వివరాలు నమోదు చేయడం మొదలు పెట్టిన నాటినుంచి అత్యంత వేడిమితో కూడినదిగా రికార్డు సృష్టించింది. ఈ ఆందోళనకర గణాంకాలను న్యూయార్క్‌లోని నాసాకు చెందిన గొడార్డ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ (జీఐఎస్ఎస్) వెల్లడించింది. ‘ఇప్పటికైనా మేలుకుని గ్లోబల్ వారి్మంగ్‌కు, ముఖ్యంగా విచ్చలవిడిగా సాగిస్తున్న పర్యావరణ విధ్వంసానికి అడ్డుకట్ట వేయడం ప్రపంచ దేశాల ముందున్న తక్షణ కర్తవ్యం’ అని పర్యావరణ ప్రియులు, శాస్త్రవేత్తలు∙ఆందోళన వ్యక్తం చేస్తున్నారు పులి మీద పుట్రలా... ఈ వేసవిలో ఎండలు గత రికార్డులన్నింటిన్నీ బద్దలు కొట్టడం వడ గాడ్పుల పాత్ర చాలా ఎక్కువే. ఈ ఏడాది ప్రపంచంలో చాలా ప్రాంతాలను అవి తీవ్రంగా వణికించాయి... ► ఇటు అమెరికా నుంచి అటు జపాన్ దాకా, యూరప్ నుంచి దక్షిణ అమెరికా ఖండం దాకా కానీ వినీ ఎరగని స్థాయిలో వేడి గాలులు అతలాకుతలం చేసి వదిలాయి. ► ఇటలీ, గ్రీస్ తో పాటు పలు మధ్య యూరప్ దేశాల్లో విపరీతమైన వర్షపాతానికి కూడా ఈ గాలులు కారణమయ్యాయి. ► ఈ వడ గాడ్పుల దుష్పరిణామాలను ఏదో ఒక రూపంలో ప్రపంచమంతా చవిచూసింది. ఇవీ రికార్డులు... ఈ ఏడాది ఎండలు అన్ని రికార్డులనూ బద్దలు కొట్టి పర్యావరణ ప్రియుల ఆందోళనలను మరింతగా పెంచాయి. ► ముఖ్యంగా జూన్, జూలై, ఆగస్ట్ ఉమ్మడి ఉష్ణోగ్రతలు నాసా రికార్డుల్లోని గత అన్ని గణాంకాల కంటే 0.23 డిగ్రీ సెంటిగ్రెడ్ ఎక్కువగా నమోదయ్యాయి. ► అదే 1951–1980 మధ్య అన్నీ వేసవి కా సగటు ఉష్ణోగ్రత కంటే ఏకంగా 1.2 డిగ్రీ సెంటిగ్రేడ్ ఎక్కువగా తేలాయి! మేలుకోకుంటే అంతే... గ్రీన్ హౌస్, కర్బన ఉద్గారాలు ఉష్ణోగ్రతల్లో విపరీతమైన పెరుగుదలకు ప్రధాన కారణమని నాసా జెట్ ప్రొపల్షన్ లేబోరేటరీలో క్లైమేట్ సైంటిస్ట్, ఓషనోగ్రఫర్ జోష్ విల్లిస్ అంటున్నారు. ‘ కొన్నేళ్లుగా భూగోళం స్థిరంగా వేడెక్కుతూ వస్తోంది. ప్రధానంగా మనిషి నిర్వాకమే ఈ వాతావరణ అవ్యవçస్థకు దారి తీస్తోంది. సాధారణంగా కూడా ఎల్ నినో ఏర్పడ్డప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పెరగడం రివాజు’ అని ఆయన అన్నారు. ఎలా నమోదు చేస్తారు? నాసా ఉష్ణోగ్రతల రికార్డు పద్ధతిని జిస్ టెంప్ అని పిలుస్తారు. ► దీనిలో భాగంగా భూ ఉపరితల ఉష్ణోగ్రతలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న వేల వాతావరణ కేంద్రాల ద్వారా ఎప్పటికప్పుడు సేకరిస్తారు. ► నౌకలు తదితర మార్గాల ద్వారా సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలను కూడా సేకరిస్తారు. ► 1951–1980 మధ్య కాలాన్ని సూచికగా తీసుకుని, ఆ 30 ఏళ్ల సగటుతో పోలిస్తే ఏటా ఉష్ణోగ్రతల తీరుతెన్నులు ఎలా ఉన్నదీ లెక్కిస్తారు. మరీ విపరీతమైన మార్పులుంటే తక్షణం అన్ని దేశాలనూ అప్రమత్తం చేస్తారు. ‘ఈ రికార్డు స్థాయి ఉష్ణోగ్రతల దు్రష్పభావం మున్ముందు కూడా ప్రపంచం మొత్తం మీదా చెప్పలేనంతగా ఉండనుంది’ – బిల్ నెల్సన్, నాసా అడ్మినిస్ట్రేటర్ సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతల్లో అత్యంత హెచ్చుదల నమోదవడమే ఈసారి కనీ వినీ ఎరుగని ఎండలకు ప్రధాన కారణం. – జోష్ విల్లిస్, క్లైమేట్ సైంటిస్ట్, ఓషనోగ్రఫర్, నాసా జెట్ ప్రొపల్షన్ లేబొరేటరీ – సాక్షి, నేషనల్ డెస్క్ -
మనిషి పుట్టుపూర్వొత్తరాల్లో కొత్త కోణం
దాదాపు 9.7 మిలియన్ల ఏళ్ల నాటి ఓ జత శిలాజ దంతాలు మానవ పుట్టు పూర్వొత్తరాలను వెలుగులోకి తెచ్చే అవకాశం ఉంది. రైన్ నదీ పరివాహాక ప్రాంతాల్లో తవ్వకాలు జరుపుతున్న ఆర్కియాలజిస్టులకు ఈ దంతాలు లభ్యమయ్యాయి. పరిశోధకులకు లభ్యమైన దంతాలు.. 3.2 మిలియన్ల సంవత్సరాల క్రితం జీవించిన లూసీ అనే మహిళ పుర్రెకు సరిపోలుతున్నాయి. లూసీ పుర్రె ఇథియోపియాలో లభ్యమైంది. అయితే, దంతాలు కచ్చితంగా లూసీవేనా? అనే విషయంపై స్పష్టత లేదు. దీనిపై మాట్లాడిన డా.హర్బట్ లట్జ్ అనే పరిశోధకుడు.. నదీ పరివాహక ప్రాంతంలో లభ్యమైన దంతాలు ఒకే వ్యక్తి(స్త్రీ లేదా పురుషుడు అన్న విషయం తెలియదు)కి చెందినవని చెప్పారు. అయితే, లూసీ పుర్రెకు మినహాయించి మరే ఇతర వ్యక్తులకు దంతాలు సూట్ కాకపోవడమే సమస్యగా మారినట్టు చెప్పారు. మానవులను పోలిన జీవులు(హోమినిన్) పూర్వకాలంలో ఉండేవనే వాదనలు ఉన్నాయి. అయితే, వాదనలకు తగిన ఆధారాలు మాత్రం లేవు. తాజాగా పరిశోధకులకు దొరికిన దంతాలు మానవులను పోలిన జీవులవని తేలితే మానవజాతి పుట్టుపూర్వొత్తరాల్లో కొత్త కోణం వెలుగులోకి వస్తుంది. అంటే రెండు నుంచి నాలుగు లక్షల సంవత్సరాల క్రితం తొలి దశ ఆదిమ మానవులు ఆఫ్రికా ఖండం నుంచి వచ్చారని ప్రస్తుతం మనం చదువుకుంటున్న థియరీ మారుతుందన్నమాట. -
చరిత్రలో తలకిందులైన అంచనాలు
ఇప్పటి నుంచి సరిగ్గా వందేళ్ల తర్వాత అంగారక గ్రహంపై మానవులు సుస్థిర నివాసం ఏర్పాటుచేసుకొని జీవిస్తారని 'స్పేస్ఎక్స్' సీఈవో ఎలాన్ మస్క్ అంచనా వేశారు. ఆ దిశగా అప్పుడే ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. వందేళ్ల తర్వాత ఆయన అంచనా నిజం అయితే దూరదృష్టి గల జీనియస్ అని, ప్రముఖ కాల్పనికుడని కీర్తిస్తారు. ఆయన అంచనా నిజం కాకపోనూ వచ్చు. ఇలా చరిత్రలో తలకిందులైన అంచనాలు చాలానే ఉన్నాయి. వాటిలో కొన్ని... 1903లో.. ఆటోమొబైల్ రంగానికి పురోగతి లేదని, ఎప్పటికైనా మానవుడికి గుర్రపు బగ్గీలే దిక్కని అప్పుడే కొత్తగా ఏర్పాటైన హెన్రీ ఫోర్డ్ కంపెనీ న్యాయవాదితో మిచిగాన్ సేవింగ్స్ బ్యాంక్ అధ్యక్షుడు వాదించారు. హŸరేస్ రాకమ్ ఆయన మాటలను వినిపించుకోకుండా ఫోర్డ్ కంపెనీలో తన ఐదువేల డాలర్ల పెట్టుబడిని 1.25 కోట్ల డాలర్లకు పెంచారు. ఫోర్డ్ కంపెనీ ఇప్పుడు ఏ స్థాయిలో ఉందో తెల్సిందే. 1911లో.. త్వరలోనే ఆల్కమీ (ఓ ఖనిజాన్ని బంగారంలోకి మార్చడం) విజ్ఞానం అభివృద్ధి చెందుతుందని, అప్పుడు ట్రక్కు నిండా ఉన్న ఇనుప కడ్డీలను స్వచ్ఛమైన బంగారంగా మార్చడం చాలా సులువని థామస్ ఎడిసన్ అంచనా వేశారు. ఆయన అంచనా ఇప్పటికీ నెరవేరలేదు. 1912లో.. వైర్లెస్ టెలిగ్రామ్ యుగంలోకి మానవుడు అడుగుపెడుతున్నందున ఇక యుద్ధాలనేవే జరగవని, దేశాల మధ్య కమ్యూనికేషన్ సమస్య ఉండదు కనుక యుద్ధాలు వచ్చే ఆస్కారమే లేదని గుగ్లీ ఎల్మో మార్కోని అంచనా వేశారు. ఆయన ఊహించిన దానికన్నా కమ్యూనికేషన్ల వ్యవస్థ మరింత బలపడినా, యుద్ధాలు సమసిపోలేదనే విషయం మనకు తెలిసిందే. 1920లో.. భూ వాతావరణాన్ని దాటుకొని ఏ రాకెట్ కూడా అంతరిక్షంలోకి ప్రయాణించలేదని, ఇది ఎప్పటికీ సాధ్యమయ్యే పని కాదని 'న్యూయార్క్ టైమ్స్' పత్రిక అభిప్రాయపడింది. 1969లో అపోలో 11 అంతరిక్షనౌక చంద్ర మండలంపైకి ప్రయాణించిన విషయం తెల్సిందే. 1955లో.. అణు విద్యుత్‌తో పనిచేసే వాక్యూమ్ క్లీనర్లు పదేళ్లలో మార్కెట్లోకి వస్తాయని లెవిట్ వాక్యూమ్ కంపెనీ అధ్యక్షుడు అలెక్స్ లెవిట్ అంచనా వేశారు. రాలేదు కదా! 1966లో.. 1999 నాటికి మనిషి నడుము బెల్టులకు కట్టుకునే రాకెట్లు వస్తాయని, వాటితో విహరించవచ్చని, ఆకాశంలో ప్రయాణించే కార్లు వస్తాయని, వాతావరణాన్ని సానుకూలంగా నియంత్రించే అద్దాల డోమ్‌ల కింద నగరాలు వెలుస్తాయని రీడర్స్ డైజెస్ట్ మాగజైన్ అంచనా వేసింది. మానవుడు రాకెట్ లేదా విమానాల లాంటి చిన్న పరికరాలపై గాల్లో ఎగరడం, ఆకాశంలో ప్రయాణించే కార్లు ఇంకా ప్రయోగ దశల్లోనే ఉన్నాయి. వాతావరణాన్ని నియంత్రించే డోమ్‌లు నగరాలపై రాలేదు. భవిష్యత్తులో వాతావరణ కాలుష్యం పెరిగిపోతే ఆలాంటి గ్లాస్ డోమ్‌లు అవసరం అవుతాయేమో! 1977లో.. ఇంటికో కంప్యూటర్ కోరుకునే ప్రసక్తే రాదని డిజిటల్ ఎక్విప్మెంట్ కార్పొరేషన్ వ్యవస్థాపకులు కెన్ ఓస్లెన్ భావించారు. ఎందుకంటే అప్పట్లో ఆయన కంపెనీ కంప్యూటర్లు చిన్న ఇల్లుకంటే పెద్దగా ఉండేవి. 1995లో.. ఏడాదిలో ఇంటెర్నెట్ విస్తరించి సూపర్నోవాలాగా పేలిపోతుందని ఈథర్నెట్ కేబుల్ వ్యవస్థాపకులు రాబర్ట్ మెట్కాఫ్ అంచనా వేశారు. ఎందుకంటే ఆయన కేబుల్ భవిష్యత్తులో అవసరమైన డేటాను ఇముడ్చుకునే అవకాశం లేదని ఆయన భావించారు. 1997లో.. మార్కెట్లో గ్యాడ్జెట్ మేకర్లను తట్టుకోలేక హార్డ్‌వేర్ గేమ్ నుంచి త్వరలోనే నిష్క్రమిస్తావని ప్రముఖ ఆపిల్ కంపెనీని 'వైర్డ్ మేగజైన్' హెచ్చరించింది. ఆ తర్వాత నాలుగేళ్లలోనే వెయ్యి పాటల గ్యాడ్జెట్లను ఆపిల్ కంపెనీ మన జేబుల్లో పెట్టింది. ఇప్పుడా కంపెనీ ఏ స్థాయిలో ఉందో మనకు తెల్సిందే. -
మనిషిని స్వప్నించిన బీజభూమి
మానవచరిత్ర భూమిచరిత్రలో ఒక నలుసు మాత్రమే. చిత్రంగా ఆ నలుసులో హిమ, ఆదిమానవ, శిలాయుగాలు వంటి వాటిని వదిలేస్తే మిగిలినదంతా భూమి కోసం జరిగిన, జరుగుతున్న పోరాటాల చరిత్ర. కవి అనేవాడు ఎవరైనా ఆ పోరాటాల పార్శ్వాన్ని తప్పించుకోలేడు. అడపా దడపా అయినా రాయకుండా ఉండలేడు. కాని గత అరవయ్యేళ్లుగా చరిత్ర చలనాలను అంటిపెట్టుకుని సాగుతున్న వరవరరావు కవిత్వానికి భూమి, దానిపైని మనుషుల తండ్లాట ప్రధాన వస్తువు. మనుషులు ఎలాంటి తేడాలు లేకుండా, స్వేచ్ఛగా బతకాలన్న ప్రాపంచిక దృక్పథం కలిగి ఉన్నవాడు కావడం చేత ఆయన కవిత్వం నిండా మట్టితో పెనవేసుకున్న మనుషుల ఆరాటపోరాటాలూ వాటి ప్రతిధ్వనులూ కనపడతాయి. తాజా కవితా సంపుటి ‘బీజభూమి’లో ఆ ప్రతిధ్వనుల తీవ్రత ఆగ్రహంగా, నిష్కర్షగా ఉండటం విశేషం. వయసు శరీరానికే తప్ప హృదయానికి కాదనడానికి నిదర్శనం. ‘బీజభూమి’ దేశకాలాల పరిణామాలకు సాక్ష్యం పలుకుతుంది. ఆదిమానవ ప్రపంచం నుంచి ఫేస్బుక్ దాకా, క్షతగాత్ర పాలస్తీనా నుంచి నవజాత దండకారణ్య జనతన సర్కారు దాకా ప్రవహించి మనిషి జెండాను ఎగరేస్తుంది. నూతన మానవుడిని కలగంటూ సాగే ఈ ప్రయాణంలో గుండె మెలిపెట్టే సహచరుల మరణాలు, ఆత్మీయుల వీడుకోళ్లు, ‘వానకన్నా నెత్తుటిలో ఎక్కువ తడిసిన’ చార్మినార్ ఆనవాళ్లు, ‘కాలి బూటు కలం కన్నా బలమైన ఆయుధ’మని రుజువు చేసిన ఇరాక్ జైదీ తిరుగుబాట్లు, నెత్తుటి త్యాగాలతో సాకారమైన తెలంగాణ దారి తప్పుతున్న వైనాలు.. ఇలా అనేకానేక వర్తమాన జీవన సంవేదనలు తారసపడతాయి. అయితే కవి హృదయం ఎక్కడుందో చూడాలి. భూమి కేవలం మట్టి కాదనీ పంటఫలాలతో మానవ మనుగడకు హామీనిచ్చే జీవధాతనీ అంటూ ‘బీజభూమి’ కవితలో -నూతనత్వమేమీ చంద్రమండలం మీద కాలు మోపడం కాదు నేల మీద నిలిచి సాము చేయడం తనువూ తరువూ మనిషీ ప్రకృతీ శ్రమా రుతువూ కలసి పెనవేసుకుని చెట్టపట్టాల్లా అడుగేయడం అనడంలోనే ఒక మట్టివాసన ఉంది. అయితే అలాంటి కల నిజం కావాలంటే పెద్ద పోరాటం అవసరం. ఆ పోరాటాన్ని కొనసాగించడం అవసరం. అందుకే అలాంటి ఆశయ సాధనలో నేలకొరిగిన స్నేహితురాలిని సుదీర్ఘ ప్రయాణం చేసి/ సుగంధ విస్పోటనం చెందిన చైతన్యమామె అని తలచుకుంటాడాయన. ‘పత్రహరితాన్ని కాటేసిన కోబ్రా ఎన్కౌంటర్లో వొరిగిన ఆకుపచ్చ చందమామ అతడు’ అంటూ మరో మిత్రుడిని పరిచయం చేస్తాడు. ఇదే సందర్భంలో ప్రజా ఉద్యమాలను హెచ్చరించాల్సిన అవసరం ఉంది. వాటి ఫలాలను గమనించాల్సి ఉంది. అందుకే- కొత్త రాష్ట్ర ప్రయాణం / కారులో వాళ్ల నలుగురికే స్థలముంటుంది/ నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు / నడవాల్సిన దూరం చాల ఉంది అనడంలో కవి చేస్తున్నది చాలా గొప్ప, అవసరమైన హెచ్చరిక. ‘ఎప్పుడూ గుండె తడిలో నిప్పు చిగురిస్తూనే ఉండాలి’ అనే చైతన్యం కవికీ, ప్రజలకూ అవసరం.అయితే వరవరరావు కవిత్వం కేవలం విప్లవ గానానికే పరిమితం కాదు. ఆయన అతి మామూలు మనిషినీ గానం చేస్తాడు. ప్రతి చిన్న మానవ స్పందనకు కూడా కళ్లు చెమరింప చేసుకుంటాడు. తమ ఇళ్లను కంటికి రెప్పలా చూసుకునే నైట్ వాచ్‌మన్ అసహజ మరణానికి దుఃఖిస్తూ నిద్రపోవడానికే వీలులేని డ్యూటీకదా నీది అంత దీర్ఘనిద్ర ఎట్లా సాధ్యమైంది?... చాదర్ ఘూట్ రైల్వే బ్రిడ్జి కింద గోరీల మధ్యన మట్టిలోంచి సుప్తాస్థికల జననాంతర సౌహృదమేదో మా ఆవరణను అంటిపెట్టుకునే ఉంటుంది’ అని ఊరట పొందుతాడు. తను ఆస్పత్రిలో ఉన్నప్పుడు- తెల్లవార్లూ కంటికి రెప్పలా కనిపెట్టుకుని ఒంటికొచ్చినా రెంటికొచ్చినా కాల్ నొచ్చినా, కక్కోచ్చినా ప్రసన్నత్వం తప్ప మరో భావమే లేకుండా సేవ చేసిన నర్సుల తల్లిమనుసుకు ముచ్చటపడతాడు. ‘బీజభూమి’ పడిలేస్తున్న చరిత్ర ఘటనల సమాహారం. తక్షణ స్పందనతో రాయడం వల్ల కొన్ని కవితలు కేవలం ఘటనల రికార్డుగా కనిపించొచ్చు. అది వాటి పరిమితి. మిహిరధనుర్ద్యుతి వంటి కష్టమైన పదాలు దొర్లకుండా ఉండాల్సింది. కవికి శ్రీశ్రీపై వల్లమాలిన ఆరాధన ఉండటం వల్ల ఆయన కవితాపాదాలను చాలాసార్లు యథాతథంగా కనిపిస్తాయి. అవి రాకుండా ఉంటే బాగుంటుందా... ఆలోచించాలి. ఇలాంటి చిన్నచిన్న దిష్టిచుక్కలు మినహాయిస్తే ‘బీజభూమి’ వరవరరావు నవనవోన్మేషణ కవితాధారకు ఎర్రెర్రని నిదర్శనం. - పి.మోహన్, 9949052916