మనిషిని స్వప్నించిన బీజభూమి
మానవచరిత్ర భూమిచరిత్రలో ఒక నలుసు మాత్రమే. చిత్రంగా ఆ నలుసులో హిమ, ఆదిమానవ, శిలాయుగాలు వంటి వాటిని వదిలేస్తే మిగిలినదంతా భూమి కోసం జరిగిన, జరుగుతున్న పోరాటాల చరిత్ర. కవి అనేవాడు ఎవరైనా ఆ పోరాటాల పార్శ్వాన్ని తప్పించుకోలేడు. అడపా దడపా అయినా రాయకుండా ఉండలేడు. కాని గత అరవయ్యేళ్లుగా చరిత్ర చలనాలను అంటిపెట్టుకుని సాగుతున్న వరవరరావు కవిత్వానికి భూమి, దానిపైని మనుషుల తండ్లాట ప్రధాన వస్తువు.
మనుషులు ఎలాంటి తేడాలు లేకుండా, స్వేచ్ఛగా బతకాలన్న ప్రాపంచిక దృక్పథం కలిగి ఉన్నవాడు కావడం చేత ఆయన కవిత్వం నిండా మట్టితో పెనవేసుకున్న మనుషుల ఆరాటపోరాటాలూ వాటి ప్రతిధ్వనులూ కనపడతాయి. తాజా కవితా సంపుటి ‘బీజభూమి’లో ఆ ప్రతిధ్వనుల తీవ్రత ఆగ్రహంగా, నిష్కర్షగా ఉండటం విశేషం. వయసు శరీరానికే తప్ప హృదయానికి కాదనడానికి నిదర్శనం.
‘బీజభూమి’ దేశకాలాల పరిణామాలకు సాక్ష్యం పలుకుతుంది. ఆదిమానవ ప్రపంచం నుంచి ఫేస్‌బుక్ దాకా, క్షతగాత్ర పాలస్తీనా నుంచి నవజాత దండకారణ్య జనతన సర్కారు దాకా ప్రవహించి మనిషి జెండాను ఎగరేస్తుంది. నూతన మానవుడిని కలగంటూ సాగే ఈ ప్రయాణంలో గుండె మెలిపెట్టే సహచరుల మరణాలు, ఆత్మీయుల వీడుకోళ్లు, ‘వానకన్నా నెత్తుటిలో ఎక్కువ తడిసిన’ చార్మినార్ ఆనవాళ్లు, ‘కాలి బూటు కలం కన్నా బలమైన ఆయుధ’మని రుజువు చేసిన ఇరాక్ జైదీ తిరుగుబాట్లు, నెత్తుటి త్యాగాలతో సాకారమైన తెలంగాణ దారి తప్పుతున్న వైనాలు.. ఇలా అనేకానేక వర్తమాన జీవన సంవేదనలు తారసపడతాయి. అయితే కవి హృదయం ఎక్కడుందో చూడాలి. భూమి కేవలం మట్టి కాదనీ పంటఫలాలతో మానవ మనుగడకు హామీనిచ్చే జీవధాతనీ అంటూ ‘బీజభూమి’ కవితలో -నూతనత్వమేమీ
చంద్రమండలం మీద కాలు మోపడం కాదు
నేల మీద నిలిచి సాము చేయడం
తనువూ తరువూ మనిషీ ప్రకృతీ
శ్రమా రుతువూ కలసి పెనవేసుకుని
చెట్టపట్టాల్లా అడుగేయడం అనడంలోనే ఒక మట్టివాసన ఉంది. అయితే అలాంటి కల నిజం కావాలంటే పెద్ద పోరాటం అవసరం. ఆ పోరాటాన్ని కొనసాగించడం అవసరం. అందుకే అలాంటి ఆశయ సాధనలో నేలకొరిగిన స్నేహితురాలిని సుదీర్ఘ ప్రయాణం చేసి/ సుగంధ విస్పోటనం చెందిన చైతన్యమామె అని తలచుకుంటాడాయన. ‘పత్రహరితాన్ని కాటేసిన కోబ్రా ఎన్‌కౌంటర్లో వొరిగిన ఆకుపచ్చ చందమామ అతడు’ అంటూ మరో మిత్రుడిని పరిచయం చేస్తాడు. ఇదే సందర్భంలో ప్రజా ఉద్యమాలను హెచ్చరించాల్సిన అవసరం ఉంది.
వాటి ఫలాలను గమనించాల్సి ఉంది. అందుకే- కొత్త రాష్ట్ర ప్రయాణం / కారులో వాళ్ల నలుగురికే స్థలముంటుంది/ నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు / నడవాల్సిన దూరం చాల ఉంది అనడంలో కవి చేస్తున్నది చాలా గొప్ప, అవసరమైన హెచ్చరిక. ‘ఎప్పుడూ గుండె తడిలో నిప్పు చిగురిస్తూనే ఉండాలి’ అనే చైతన్యం కవికీ, ప్రజలకూ అవసరం.అయితే వరవరరావు కవిత్వం కేవలం విప్లవ గానానికే పరిమితం కాదు. ఆయన అతి మామూలు మనిషినీ గానం చేస్తాడు. ప్రతి చిన్న మానవ స్పందనకు కూడా కళ్లు చెమరింప చేసుకుంటాడు. తమ ఇళ్లను కంటికి రెప్పలా చూసుకునే నైట్ వాచ్‌మన్ అసహజ మరణానికి దుఃఖిస్తూ
నిద్రపోవడానికే వీలులేని డ్యూటీకదా నీది
అంత దీర్ఘనిద్ర ఎట్లా సాధ్యమైంది?...
చాదర్ ఘూట్ రైల్వే బ్రిడ్జి కింద గోరీల మధ్యన మట్టిలోంచి
సుప్తాస్థికల జననాంతర సౌహృదమేదో
మా ఆవరణను అంటిపెట్టుకునే ఉంటుంది’ అని ఊరట పొందుతాడు. తను ఆస్పత్రిలో ఉన్నప్పుడు-
తెల్లవార్లూ కంటికి రెప్పలా కనిపెట్టుకుని
ఒంటికొచ్చినా రెంటికొచ్చినా కాల్ నొచ్చినా, కక్కోచ్చినా
ప్రసన్నత్వం తప్ప మరో భావమే లేకుండా సేవ చేసిన నర్సుల తల్లిమనుసుకు ముచ్చటపడతాడు.
‘బీజభూమి’ పడిలేస్తున్న చరిత్ర ఘటనల సమాహారం. తక్షణ స్పందనతో రాయడం వల్ల కొన్ని కవితలు కేవలం ఘటనల రికార్డుగా కనిపించొచ్చు. అది వాటి పరిమితి. మిహిరధనుర్ద్యుతి వంటి కష్టమైన పదాలు దొర్లకుండా ఉండాల్సింది. కవికి శ్రీశ్రీపై వల్లమాలిన ఆరాధన ఉండటం వల్ల ఆయన కవితాపాదాలను చాలాసార్లు యథాతథంగా కనిపిస్తాయి. అవి రాకుండా ఉంటే బాగుంటుందా... ఆలోచించాలి. ఇలాంటి చిన్నచిన్న దిష్టిచుక్కలు మినహాయిస్తే ‘బీజభూమి’ వరవరరావు నవనవోన్మేషణ కవితాధారకు ఎర్రెర్రని నిదర్శనం.
- పి.మోహన్, 9949052916