తలవంచని విప్లవ కవిగా, పెక్కు నిర్బంధాల మధ్యనే ముందుకు సాగుతున్నారు వరవరరావు! 1957–2017 మధ్య కాలంలో ఆయన రాసిన సుమారు 50 కవితలను పెంగ్విన్ రాండమ్ హౌస్ ‘వరవరరావు – ఎ లైఫ్ ఇన్ పొయెట్రీ’ పేరుతో ఆంగ్లంలో ప్రచురించింది. ‘బానిస సమాజం నుంచి బానిస భావం కూడా లేని కమ్యూనిజం’ వైపు పయనిస్తున్న ‘వరవర’కు తగిన గౌరవం.
‘‘లోకంలో మేధావులనుకుంటున్నవారు సహితం పిరికిపందలుగా ఉంటారు. అలాంటి పిరికి పందలకన్నా మనోధైర్యంతో, దమ్ములతో బతకనేర్వడం అతి అరుదైన లక్షణంగా భావించాలి.’’
– ‘వికీలీక్స్’ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజ్
ప్రపంచ దేశాలపై అమెరికా నిరంతర కుట్రలను బహిర్గతం చేసినందుకు జీవిత మంతా కష్టాలను కాచి వడబోస్తున్న మహాసంపాదకుడు, ప్రపంచ పాత్రికేయ సింహం... జూలియన్ అసాంజ్. అలాంటి ఒక అరుదైన సింహంగా, తలవంచని విప్లవ కవిగా ఈ క్షణం దాకా పెక్కు నిర్బంధాల మధ్యనే ముందుకు సాగుతున్న కవి వరవరరావు! దఫదఫాలుగా దశాబ్దాలకు మించిన జైళ్ల జీవితంలో ఆయనను (1973లో తొలి అరెస్టు మొదలు) 25 కేసులలో కేంద్ర, రాష్ట్ర పాలకులు ఇబ్బందులు పెట్టారు. అలాంటి విప్లవకవి వరవరరావు తెలుగులో 1957–2017 మధ్య కాలంలో రాసిన సుమారు 50 కవితలను ఎంపిక చేసి... కవి, సాహితీ విమర్శకులు, మానవ హక్కుల పరిరక్షణా ఉద్యమాలకు నిరంతరం చేయూతనందిస్తున్న పాత్రికేయులు ఎన్.వేణుగోపాల్, నవలాకారిణి, కవయిత్రి మీనా కందసామి ఇండియాలోని సుప్రసిద్ధ పెంగ్విన్ రాండమ్ హౌస్ కోరికపై అందజేసిన గ్రంథమే ‘వరవరరావు – ఎ లైఫ్ ఇన్ పొయెట్రీ’!
సర్వత్రా ‘సామ్యవాద రంకె’ వినిపించిన వరవరరావు 1972 లోనే:
‘దోపిడీకి మతం లేదు, దోపిడీకి కులం లేదు
దోపిడీకి భాష లేదు, దోపిడీకి జాతి లేదు
దోపిడీకి దేశం లేదు
తిరుగుబాటుకూ, విప్లవానికీ
సరిహద్దులు లేవు’ అని చాటుతూనే, తనను శత్రువు కలమూ, కాగితమూ ఎందుకు బంధించాయో తెగేసి చెప్తాడు: ‘ప్రజలను సాయుధులను కమ్మన్నందుకు గాదు/ నేనింకా సాయుధుణ్ణి కానందుకు’ అన్నప్పుడు జూలియన్ అసాంజ్ చేసిన హెచ్చరికే జ్ఞాపకం వస్తుంది. అంతేగాదు, ‘వెనక్కి కాదు, ముందుకే’ అన్న కవితలో ‘వరవర’:
‘బానిస సమాజం నుంచి బానిస భావం కూడా లేని కమ్యూనిజం దాకా
పయనించే ఈ కత్తుల వంతెన మీద
ఎంత దూరం నడిచి వచ్చావు –
ఇంకెంత దూరమైనా ముందుకే సాగు’ గాని
వెనకడుగు వెయ్యొద్దని ఉద్బోధిస్తాడు!
ధనస్వామ్య రక్షకులైన పాలకుల దృష్టిలో ‘ప్రజాస్వా మ్యా’నికి అర్థం లేదని–
‘పార్లమెంటు పులి కూడ /పంజాతోనే పాలిస్తూ
సోషలిజం వల్లించుతూనే / ప్రజా రక్తాన్ని తాగేస్తుంద’నీ
నాగుబాము పరిపాలనలో / ప్రజల సొమ్ము పుట్ట పాల’వుతున్న చోటు –
‘జలగల్ని పీకేయందే – శాంతి లేదు/ క్రాంతి రాద’ని
నిర్మొహమాటంగా ప్రకటిస్తాడు.
‘జీవశక్తి’ అంటే ఏమిటో కవితాత్మకంగా మరో చోట ఇలా స్పష్టం చేస్తాడు:
‘అన్ని రోజులూ కన్నీళ్లవి కావు / అయినా ఆనంద తీరాలు
ఎప్పుడూ తెలియకుండా / దుఃఖం లోతెట్లా తెలుస్తుంది?
ఆ రోజులూ వస్తాయి / కన్నీళ్లు ఇంద్రధనుస్సులవుతాయి
నెత్తురు వెలుగవుతుంది / జ్ఞాపకం చరిత్ర అవుతుంది
బాధ ప్రజల గాథ అవుతుంది!’
జైలు జీవితానుభవాన్ని సుదీర్ఘ అనుభవం మీద ఎలా చెప్పాడో!
‘జైలు జీవితమూ అంగ వైకల్యం లాంటిదే
నీ కంటితో ఈ ప్రపంచాన్ని చూడలేవు
నీ చెవితో వినలేవు, నీ చేయితో స్పృశించలేవు
నీ ప్రపంచంలోకి నువ్వు నడవలేవు
నీవుగా నీ వాళ్ళతో నువ్వు మాట్లాడలేవు
ఎందుకంటే – అనుభూతి సముద్రం పేగు తెగిన అల ఇక్కడ హృదయం!’
ఇప్పటికీ దేశవ్యాపితంగా ప్రజా కార్యకర్తలపైన, పౌరహక్కుల నాయకులపైన యథాతథంగా
హింసాకాండ అమలు జరుగుతూనే ఉంది. దానికి ఉదాహరణగా, అనేక రకాలుగా వికలాంగుడైన ప్రజా కార్యకార్త ప్రొఫెసర్ సాయిబాబానే కార్పొరేట్ శక్తుల కన్నా ప్రమాదకరం అన్నట్టుగా పాలకులు వ్యవహ
రించడం ఏమాత్రం క్షంతవ్యం గాదు!
ఏబీకే ప్రసాద్
సీనియర్ సంపాదకులు
abkprasad2006@yahoo.co.in
Comments
Please login to add a commentAdd a comment