Communism
-
విప్లవాగ్ని జ్వలితుడు
తలవంచని విప్లవ కవిగా, పెక్కు నిర్బంధాల మధ్యనే ముందుకు సాగుతున్నారు వరవరరావు! 1957–2017 మధ్య కాలంలో ఆయన రాసిన సుమారు 50 కవితలను పెంగ్విన్ రాండమ్ హౌస్ ‘వరవరరావు – ఎ లైఫ్ ఇన్ పొయెట్రీ’ పేరుతో ఆంగ్లంలో ప్రచురించింది. ‘బానిస సమాజం నుంచి బానిస భావం కూడా లేని కమ్యూనిజం’ వైపు పయనిస్తున్న ‘వరవర’కు తగిన గౌరవం. ‘‘లోకంలో మేధావులనుకుంటున్నవారు సహితం పిరికిపందలుగా ఉంటారు. అలాంటి పిరికి పందలకన్నా మనోధైర్యంతో, దమ్ములతో బతకనేర్వడం అతి అరుదైన లక్షణంగా భావించాలి.’’ – ‘వికీలీక్స్’ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజ్ ప్రపంచ దేశాలపై అమెరికా నిరంతర కుట్రలను బహిర్గతం చేసినందుకు జీవిత మంతా కష్టాలను కాచి వడబోస్తున్న మహాసంపాదకుడు, ప్రపంచ పాత్రికేయ సింహం... జూలియన్ అసాంజ్. అలాంటి ఒక అరుదైన సింహంగా, తలవంచని విప్లవ కవిగా ఈ క్షణం దాకా పెక్కు నిర్బంధాల మధ్యనే ముందుకు సాగుతున్న కవి వరవరరావు! దఫదఫాలుగా దశాబ్దాలకు మించిన జైళ్ల జీవితంలో ఆయనను (1973లో తొలి అరెస్టు మొదలు) 25 కేసులలో కేంద్ర, రాష్ట్ర పాలకులు ఇబ్బందులు పెట్టారు. అలాంటి విప్లవకవి వరవరరావు తెలుగులో 1957–2017 మధ్య కాలంలో రాసిన సుమారు 50 కవితలను ఎంపిక చేసి... కవి, సాహితీ విమర్శకులు, మానవ హక్కుల పరిరక్షణా ఉద్యమాలకు నిరంతరం చేయూతనందిస్తున్న పాత్రికేయులు ఎన్.వేణుగోపాల్, నవలాకారిణి, కవయిత్రి మీనా కందసామి ఇండియాలోని సుప్రసిద్ధ పెంగ్విన్ రాండమ్ హౌస్ కోరికపై అందజేసిన గ్రంథమే ‘వరవరరావు – ఎ లైఫ్ ఇన్ పొయెట్రీ’! సర్వత్రా ‘సామ్యవాద రంకె’ వినిపించిన వరవరరావు 1972 లోనే: ‘దోపిడీకి మతం లేదు, దోపిడీకి కులం లేదు దోపిడీకి భాష లేదు, దోపిడీకి జాతి లేదు దోపిడీకి దేశం లేదు తిరుగుబాటుకూ, విప్లవానికీ సరిహద్దులు లేవు’ అని చాటుతూనే, తనను శత్రువు కలమూ, కాగితమూ ఎందుకు బంధించాయో తెగేసి చెప్తాడు: ‘ప్రజలను సాయుధులను కమ్మన్నందుకు గాదు/ నేనింకా సాయుధుణ్ణి కానందుకు’ అన్నప్పుడు జూలియన్ అసాంజ్ చేసిన హెచ్చరికే జ్ఞాపకం వస్తుంది. అంతేగాదు, ‘వెనక్కి కాదు, ముందుకే’ అన్న కవితలో ‘వరవర’: ‘బానిస సమాజం నుంచి బానిస భావం కూడా లేని కమ్యూనిజం దాకా పయనించే ఈ కత్తుల వంతెన మీద ఎంత దూరం నడిచి వచ్చావు – ఇంకెంత దూరమైనా ముందుకే సాగు’ గాని వెనకడుగు వెయ్యొద్దని ఉద్బోధిస్తాడు! ధనస్వామ్య రక్షకులైన పాలకుల దృష్టిలో ‘ప్రజాస్వా మ్యా’నికి అర్థం లేదని– ‘పార్లమెంటు పులి కూడ /పంజాతోనే పాలిస్తూ సోషలిజం వల్లించుతూనే / ప్రజా రక్తాన్ని తాగేస్తుంద’నీ నాగుబాము పరిపాలనలో / ప్రజల సొమ్ము పుట్ట పాల’వుతున్న చోటు – ‘జలగల్ని పీకేయందే – శాంతి లేదు/ క్రాంతి రాద’ని నిర్మొహమాటంగా ప్రకటిస్తాడు. ‘జీవశక్తి’ అంటే ఏమిటో కవితాత్మకంగా మరో చోట ఇలా స్పష్టం చేస్తాడు: ‘అన్ని రోజులూ కన్నీళ్లవి కావు / అయినా ఆనంద తీరాలు ఎప్పుడూ తెలియకుండా / దుఃఖం లోతెట్లా తెలుస్తుంది? ఆ రోజులూ వస్తాయి / కన్నీళ్లు ఇంద్రధనుస్సులవుతాయి నెత్తురు వెలుగవుతుంది / జ్ఞాపకం చరిత్ర అవుతుంది బాధ ప్రజల గాథ అవుతుంది!’ జైలు జీవితానుభవాన్ని సుదీర్ఘ అనుభవం మీద ఎలా చెప్పాడో! ‘జైలు జీవితమూ అంగ వైకల్యం లాంటిదే నీ కంటితో ఈ ప్రపంచాన్ని చూడలేవు నీ చెవితో వినలేవు, నీ చేయితో స్పృశించలేవు నీ ప్రపంచంలోకి నువ్వు నడవలేవు నీవుగా నీ వాళ్ళతో నువ్వు మాట్లాడలేవు ఎందుకంటే – అనుభూతి సముద్రం పేగు తెగిన అల ఇక్కడ హృదయం!’ ఇప్పటికీ దేశవ్యాపితంగా ప్రజా కార్యకర్తలపైన, పౌరహక్కుల నాయకులపైన యథాతథంగా హింసాకాండ అమలు జరుగుతూనే ఉంది. దానికి ఉదాహరణగా, అనేక రకాలుగా వికలాంగుడైన ప్రజా కార్యకార్త ప్రొఫెసర్ సాయిబాబానే కార్పొరేట్ శక్తుల కన్నా ప్రమాదకరం అన్నట్టుగా పాలకులు వ్యవహ రించడం ఏమాత్రం క్షంతవ్యం గాదు! ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
కులం, మతంతో ప్రజల్లో విభజన
సాక్షి, హైదరాబాద్: ‘కమ్యూనిస్టులు దేశంలో ఎదగలేకపోవడానికి కులం, మతం వంటి విభజన రాజకీయాలే ప్రధాన కారణం. బూర్జువా పార్టీలు కులం, మతం పేరిట ప్రజల్లో విభజన తెస్తున్నాయి. దేశంలో ముస్లింలను మూడు, నాలుగో పౌరులుగా చూస్తున్నారు. మాది వర్గపరమైన దృక్పథం. ఈ నేపథ్యంలోనే మేము రాజకీయ, సైద్ధాంతిక పోరాటం చేస్తున్నాం. మా పోరాటం ఫలితంగా ప్రజల్లో మార్పు కనిపిస్తోంది. మేం చేస్తున్న పోరాటానికి మద్దతుగా లౌకిక ప్రజాస్వామిక శక్తులు ముందుకు రావాలి. అన్ని పార్టీలు, ప్రజలు.. బీజేపీ, ఆర్ఎస్ఎస్కు వ్యతిరేకంగా ముందుకు రావాలి..’అని త్రిపుర మాజీ ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ విజ్ఞప్తి చేశారు. ‘టీఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్గా ఏర్పాటైంది. దేశంలో బీఆర్ఎస్ను ప్రజలు గుర్తిస్తారా లేదా అన్నది వారు తీసుకునే నిర్ణయాలపైన, వారు ప్రజలను ఏ విధానాలతో కదిలిస్తారన్న దానిపై ఆధారపడి ఉంటుంది. దానిమీదనే ఆ పార్టీ పురోగతి కూడా ఆధారపడి ఉంటుంది. బీఆర్ఎస్తో సీపీఎం పొత్తుపై స్థానిక పార్టీ, పొలిట్‌బ్యూరో కలిసి నిర్ణయం తీసుకుంటాయి..’అని ఆయన తెలిపారు. హైదరాబాద్‌లో ఎస్ఎఫ్ఐ జాతీయ మహాసభల సందర్భంగా బహిరంగ సభలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన.. ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. వివరాలు ఆయన మాటల్లోనే.. మోదీ చరిష్మా పడిపోతోంది.. చరిత్రలో వ్యక్తి చరిష్మాను కాదనలేం. కానీ మోదీ వ్యక్తిగత మేజిక్ అనేది ఇప్పుడు పోతోంది. ఆయన చరిష్మా రోజురోజుకూ పడిపోతోంది. మా పార్టీ ఉమ్మడి నిర్ణయాల మేరకే పనిచేస్తుంది. వ్యక్తులు నిర్ణయాలు తీసుకోరు. మేం సమస్యలపైన పనిచేస్తుంటాం కానీ, వ్యక్తిగత చరిష్మాపై ఆధారపడి లేము. మేం సరైన మార్గంలోనే వెళుతున్నాం. మా బలాన్ని పెంచుకుంటాం. వివిధ పార్టీలకు వివిధ రకాలైన సిద్ధాంతాలు, ఆలోచనలు, వ్యూహాలు ఉంటాయి. ఆ ప్రకారం అవి వ్యవహరిస్తుంటాయి. వారంతా బీజేపీకి వ్యతిరేకంగా ముందుకు రావాలని కోరుతున్నాం. ఎన్నికల నాటికే కాంగ్రెస్‌తో పొత్తుపై నిర్ణయం దేశంలో వామపక్షాల బలం పరిమితం. అయితే బీజేపీపై రాజకీయ, సైద్ధాంతిక పోరాటం చేయడంలో ముందున్నాం. విద్య, ఉపాధి, కార్మికుల హక్కుల కోసం పోరాటాలు జరుగుతూనే ఉన్నాయి. కాంగ్రెస్‌తో పొత్తు విషయం ఎన్నికల సమయంలో నిర్ణయిస్తాం. పార్లమెంటు ఎన్నికలు ఇంకా చాలా దూరంలో ఉన్నాయి. గతంలో రెండు మూడుసార్లు థర్డ్ఫ్రంట్లు ఏర్పాటయ్యాయి. అవి కూడా ఎన్నికల తర్వాతే ఏర్పాటయ్యాయి. కనీస ఉమ్మడి కార్యక్రమంతో ముందుకు వచ్చాం. అటువంటి పరిస్థితి వస్తే అప్పటి పరిస్థితిని బట్టి స్పష్టమైన నిర్ణయం తీసుకుంటాం. త్రిపురలో క్లిష్టమైన పరిస్థితులున్నాయి... రాబోయే కొద్ది నెలల్లో త్రిపురలో ఎన్నికలు జరగబోతున్నాయి. అయితే అక్కడ పరిస్థితులు అత్యంత క్లిష్టంగా ఉన్నాయి. అక్కడ ప్రజాస్వామ్యమే లేదు. మీడియా కూడా స్వతంత్రంగా వ్యవహరించడం లేదు. రాజ్యాంగ వ్యవస్థలను బీజేపీ ధ్వంసం చేస్తోంది. ఆర్థిక పరిస్థితి దయనీయంగా మారింది. సాధారణ ప్రజలు మరింత చితికిపోయారు. కేంద్ర ఆడిట్ సంస్థ కూడా త్రిపుర ఆర్థిక పరిస్థితిపై అసంతృప్తి వ్యక్తం చేసింది. అవినీతి పేరుకుపోయింది. ప్రతి కుటుంబానికి ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని, ఖాళీ పోస్టులను భర్తీ చేస్తామని ఎన్నికలకు ముందు బీజేపీ హామీ ఇచ్చింది. కానీ అవేవీ నెరవేర్చలేదు. మాజీ ముఖ్యమంత్రినైన నన్నే బయటకు పోనీయడం లేదు. శాంతిభద్రతల సమస్య వస్తుందని చెబుతూ నన్ను అడ్డుకుంటున్నారు. గత 50 నెలల్లో 20–25 సార్లు నన్ను ప్రజల్లోకి వెళ్లకుండా అడ్డుకున్నారు. అక్కడి ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. కేంద్ర ఎన్నికల కమిషన్ స్వేచ్ఛగా ఎన్నికలు జరిగేలా చూస్తే వామపక్ష పాలన మళ్లీ వస్తుంది. నేను త్రిపురలోనే ఉండటం లేదు. అంతటా తిరుగుతున్నాను. పార్టీ ఆదేశిస్తే ఎక్కడకు వెళ్లమన్నా వెళ్తాను. బెంగాల్లో కార్యకర్తలు పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నారు. అక్కడ పెద్ద ఎత్తున అవినీతి పేరుకుపోయి ఉంది. -
మానవ ప్రగతికి మేనిఫెస్టో!
సోషలిస్టు రిపబ్లిక్ తప్ప, చివరికి ప్రజాస్వామ్య (డెమోక్రాట్) రిపబ్లిక్కులు సహితం ధనికవర్గాలకు, శ్రమజీవులకు మధ్య వైషమ్యాన్ని రద్దు చేయలేవని మార్క్స్–ఎంగెల్స్ స్పష్టం చేయడం విశేషం. ఏ దేశానికి శాశ్వత విమోచన రావాలన్నా అది కార్మిక శ్రమజీవుల నుంచే, కష్టజీవుల నుంచే సాధ్యమని, విద్యకు వెలి అయినా.. వారికి అసూయా ద్వేషాలుండవనీ, గొప్ప జాతీయ కర్తవ్యాల్ని నెరవేర్చగల శక్తియుక్తులు వారికే ఉంటాయని, వారిదే భవిష్యత్తు అనీ మార్క్స్–ఎంగెల్స్‌లు నిర్మలమైన మనస్సుతో ప్రకటించారు. సోషలిస్టు పేరిటనో, కమ్యూనిస్టు పార్టీల పేరిటనో పార్టీలు ఎన్ని మారినా, రాజీబేరాలతో సిద్ధాంత పదును ఎంతగా కోల్పోయి నిర్వీర్యమౌతున్నా, రెండు రెళ్లు నాలుగన్న సూత్రం మాత్రం మారదు గాక మారదు, మార్చడం కుదరదు. సర్వమానవ ప్రగతికి ఆ కమ్యూనిస్టు మేనిఫెస్టోనే దిక్సూచి. మరో మార్గమేదీ లేదు. 250 సంవత్సరాల స్వాతంత్య్రం తర్వాత కూడా అమెరికాలో దేశాల దురాక్రమణల్లో, దేశాలపై అక్రమ యుద్ధాలు సృష్టించడంలో, ధనికవర్గ సమాజ దోపిడీ వ్యవస్థా చట్రంలో ప్రజాస్వామ్యం బోర్డు చాటున దాగిన సైనిక– పారిశ్రామిక వ్యవస్థల్లో ఏమాత్రం మార్పు లేదు. కనుకనే ఆ దోపిడీ వ్యవస్థను ఆదర్శంగా భావించి భారత ప్రజలను పీడిస్తున్న రకరకాల బ్రాండ్ల చాటున దాగిన సంపన్నవర్గాలకు శాస్త్రీయ సోషలిజం అన్నా శాస్త్రీయ కమ్యూనిజం అన్నా కంపరంగా ఉంటుంది. శాస్త్రీయ సోష లిజం సిద్ధాంతకర్తలైన కారల్ మార్క్స్, ప్రెడరిక్స్ ఎంగెల్స్ ప్రపంచ శ్రామిక వర్గ శాశ్వత విమోచన కోసం రూపొందించిన ‘కమ్యూనిస్టు మేనిఫెస్టో’కి 172 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సర్వత్రా సభలు, సమావేశాలు ప్రపంచవ్యాప్తంగా జరిగాయి. ఇప్పటికీ తరతమభేదా లతో పలు ప్రపంచ దేశాలలోని కష్టజీవులు, శ్రమజీవులు, మధ్య తరగతి ఉద్యోగవర్గాలు అనునిత్యం తమ బతుకుల్ని మెరుగుపర్చు కోవడం కోసం నిరంతర పోరాటాలు చేస్తూనే ఉన్నారు ఉద్యమాల రూపంలో, సమ్మెల రూపంలో భారతదేశంతో సహా అనేక దేశాల్లో పెద్ద ఎత్తున అవిశ్రాంతంగా కొనసాగుతూనే ఉన్నాయి. శ్రామికవర్గ ప్రయోజనాల రక్షణే పొత్తుల భూమిక కమ్యూనిస్టు మేనిఫెస్టో వెలువడిన 172 సంవత్సరాల తర్వాత కూడా దేశంలో అసమానతల పర్వాలకు ముగింపు రాకపోవడానికి కారణ మేమిటో స్థానిక కమ్యూనిస్టు పార్టీలు, సోషలిస్టు శక్తులూ అంత ర్మథనం చేసుకోవలసిన అవసరం ఉంది. దేశాలలోని స్థానిక ధనికవర్గ పార్టీలతో పరిస్థితులను బట్టి వ్యూహరీత్యా సోషలిస్టు, కమ్యూనిస్టు లక్ష్యాలు ప్రజాబాహుళ్యం ఉమ్మడి ప్రయోజనాల సాధన కోసం తాత్కాలికంగా చేతులు కలపడం వేరు, ఆ పేరిట శ్రామిక వర్గ ప్రయోజనాలకు విఘాతం కల్గించే పొత్తులకు ఒరగబెట్టడం వేరు. అలాగే మిలిటెంట్ పోరాటాలలో ఉన్నవారిని ధనిక వర్గ పాలకులు ఉగ్రవాదులంటూ ముద్రవేసి పరిమార్చడాన్ని, విచారణ జరపకుం డానే హతమార్చడాన్ని వామపక్షశక్తులు లోపాయికారీగా సమర్థిం చడమూ, శ్రమజీవుల దీర్ఘకాల ప్రయోజనాల్ని దెబ్బతీయడమే అవు తుంది. గత 172 సంవత్సరాలుగాను దేశదేశాలలోని శ్రమజీవులు, కష్టజీవులు తమ బతుకులను, జీవన ప్రమాణాలను మెరుగుపర్చు కునేందుకు దోపిడీవర్గ వ్యవస్థనుంచి శాశ్వత విమోచనం కోసం జరిపే పోరాటాలకు ఒక ముగింపును ఆశించడం లక్ష్యంగా శాస్త్రీయ సోష లిజం సిద్ధాంతకర్తలు తమ మేనిఫెస్టోలో కొన్ని ఆసక్తికర సూత్రీ కరణలు చేశారని మరవరాదు. వారి మాటల్లో– సంపన్నవర్గం తమ ఉనికికోసం ఒక్కొక్కప్పుడు విప్లవకరంగా ప్రవర్తించినప్పుడల్లా కమ్యూనిస్టులు ఆ వర్గంతో చేతులు కలిపి నిరంకుశ రాచరికాలకూ, భూస్వామ్య వర్గాలకూ పెట్టీబూర్జువా వర్గాలకీ వ్యతిరేకంగా పోరా డుతూ ఉంటారు. అయితే దోపిడీ వ్యవస్థకు ఆలవాలమైన సాంఘిక పరిస్థితులను మూల మట్టంగా తోసిపుచ్చడం ద్వారానే సామాజిక పరిస్థితుల్ని మౌలికంగా మార్చగలమన్న అవగాహనను మార్క్స్– ఎంగెల్స్ అందించారు. శ్రామిక వర్గం, కార్మికవర్గం, వేతన జీవులూ ఎలాగూ దోపిడీ పాలకవర్గ వ్యవస్థ ఉనికిలో ఉన్నన్నాళ్లూ సంకెళ్లలోనే జీవితాన్ని వెళ్లమార్చుకోవలసి వస్తుంది. కాబట్టి.. తెగనివి కావయ్యా ఆ సంకెళ్లు.. తెగతెంచండయ్యా అన్న ఆ సిద్ధాంతకర్తల సందేశానికి లక్ష్యం నెరవేరేదాకా కాలం చెల్లిపోనట్లే లెక్క. కనుకనే శాస్త్రీయ సోష లిజం సిద్ధాంతకర్తలు విస్పష్టమైన భావాన్ని ఆదేశంగా మల్చారు. ధనిక(బూర్జువా) వర్గ సమాజంలో గతం వర్తమానాన్ని శాసిస్తుంది. కానీ సోషలిస్టు లేక కమ్యూనిస్టు సమాజంలో వర్తమానం గతాన్ని శాసిస్తోంది. ధనికవర్గ సమాజంలో పెట్టుబడికి మాత్రమే స్వాతం త్య్రమూ, వ్యక్తిత్వమూ ఉంటాయి కానీ ప్రాణం గల మనిషికి స్వాతం త్య్రమూ ఉండదు, వ్యక్తిత్వమూ ఉండదు. ఈ స్థితినే సోషలిజం (కమ్యూనిజం) రద్దు చేయాలంటుంది. భార్య కార్మికురాలు.. భర్త బూర్జువా! అయితే ఈ రద్దు చేయడాన్ని వ్యక్తిత్వాన్ని రద్దు చేయడం గానూ, స్వేచ్ఛను రద్దు చేయడంగానూ సంపన్నవర్గాలు భావిస్తాయి. ధనికవర్గ వ్యవస్థలో ఉత్పత్తి, స్వేచ్ఛ అంటే వ్యాపారానికి స్వేచ్ఛ, వస్తువుల క్రయవిక్రయాలకు మాత్రమే స్వేచ్ఛ. సోషలిజం/కమ్యూనిజం ఏ వ్యక్తికీ సమాజ ఉత్పత్తి పరికరాలను (ఉత్పాదితాలు) సొంతం చేసు కునే హక్కు లేకుండా చేయదు. అలా సొంతం చేసుకోవడం ద్వారా ఇతరులను కూలివాళ్లుగా మార్చే హక్కును మాత్రమే తొలగిస్తోంది అని స్పష్టం చేశారు. అందుకే ధనికవర్గ వ్యవస్థలో చివరికి భార్యా– భర్తల మధ్య సంబంధాల తీరును కూడా పరామర్శిస్తూ శాస్త్రీయ సోషలిజం సిద్ధాంతకర్తలు దోపిడీ వ్యవస్థలో భార్యను ప్రొలిటేరియట్ గానూ, భర్తను బూర్జువా గానూ వర్గస్వభావాన్ని వివరించడం కోసం ఎంగెల్స్ వర్ణించక తప్పలేదు. మహిళా లోకం ఆందోళనకు ప్రతి బింబంగా వచ్చిన నేటి మీటూ ఉద్యమం కూడా దోపిడీ వ్యవస్థకు మరో నిరసన రూపమే! అలాగే, సోషలిస్టు రిపబ్లిక్ తప్ప, చివరికి ప్రజాస్వామ్య (డెమోక్రాట్) రిపబ్లిక్కులు సహితం ధనికవర్గాలకు, శ్రమజీవులకు మధ్య వైషమ్యాన్ని రద్దు చేయలేవని కూడా మార్క్స్– ఎంగెల్స్ స్పష్టం చేయడం విశేషం. ఏ దేశానికి శాశ్వత విమోచన రావాలన్నా అది కార్మిక శ్రమజీవుల నుంచే, కష్టజీవుల నుంచే, చివరికి విద్యకు వెలి అయినాసరే.. వారికి అసూయా ద్వేషాలుండవనీ, గొప్ప జాతీయ కర్తవ్యాల్ని నెరవేర్చగల శక్తియుక్తులు వారికే ఉంటాయని వారిదే భవిష్యత్తు అనీ మార్క్స్– ఎంగెల్స్‌లు నిర్మలమైన మనస్సుతో ప్రకటించారు. అంతేగాదు, దేశా భివృద్ధికి బాసటగా నిలబడాల్సిన పారిశ్రామిక నాగరికతను కాస్తా స్టాక్ మార్కెట్లకు తార్చి కూర్చున్నారని ఎంగెల్స్ శపిస్తూ, స్టాక్ ఎక్చేంజ్ అనేది ధనికవర్గ సమాజానికి అత్యంత విలువైన పండు అనీ అదే సమాజానికి విషఫలమనీ, అలాంటి సమాజాల్లో నిస్సందేహంగా ఆవి ష్కరించుకునే అవినీతికి స్టాక్ ఎక్చేంజీలు ఉదాహరణ అనీ వర్ణించాడు. ఏతావాతా ఎవరి మాట ఎలా ఉన్నా ఆశయాలు సంఘర్షించే వేళ సైద్ధాంతిక ఆయుధమూ పదును కోల్పోదు గాక కోల్పోదు. సోషలిస్టు పేరిటనో, కమ్యూనిస్టు పార్టీల పేరిటనో పార్టీలు ఎన్ని మారినా, రాజీబేరాలతో సిద్ధాంత పదును ఎంతగా కోల్పోయి నిర్వీర్యమౌ తున్నా, రెండు రెళ్లు నాలుగన్న సూత్రం మాత్రం మారదు గాక మారదు, మార్చడం కుదరదు. సర్వమానవ ప్రగతికి ఆ మేనిఫెస్టోనే దిక్సూచి. మరో మార్గమేదీ లేదు. పోగుపడటమే పెట్టుబడి లక్షణం ఎందుకంటే మహాశాస్త్రవేత్త, ప్రపంచ అణుశాస్త్రవేత్త, మానవతావాది అల్బర్ట్ ఐన్‌స్టీన్ చెప్పినట్లు ప్రైవేట్ పెట్టుబడి అనేది బహుకొలది మంది చేతుల్లోనే పోగుబడుతూ ఉంటుంది. పెట్టుబడిదారుల మధ్య పోటాపోటీల వల్ల కొంత, సాంకేతిక అభివృద్ధి వల్ల కొంత, శ్రమ విభజన పెరగడం వల్ల కొంత.. చిన్నపరిశ్రమలను మార్చి భారీ పరి శ్రమల ఏర్పాటును ప్రోత్సహించడం వల్లనూ నానాటికీ ప్రైవేట్ పెట్టుబడి కొలదిమంది చేతుల్లో పోగుబడటం ప్రారంభించింది. ఈ పరిణామాలతో ప్రైవేట్ పెట్టుబడి గుత్తేదార్ల సంఖ్య పెరిగింది. ఈ విప రిణామాల ఫలితంగా ప్రైవేట్ పెట్టుబడిని పకడ్బందీగా అదుపు చేయడమన్నది చివరికి ప్రజాస్వామికంగా సమీకృతంగా ఏర్పడిన రాజకీయ సామాజిక వ్యవస్థకు కూడా అదుపు చేయడం సాధ్యం కాకుండా పోయింది. శాసనకర్తల్ని రాజకీయ పార్టీలు విచ్చలవిడిగా డబ్బులు వెదజల్లి లేదా ప్రలోభాలకు గురిచేయడం జరుగుతోంది. ఈ పార్టీలను ప్రైవేట్ పెట్టుబడిదారులు సాకుతున్నారు. తద్వారా ప్రజలు ఎన్నుకున్న శాసనవేదికల నుంచి ప్రజలనే విడదీస్తు న్నారు. ఫలితంగా అట్టడుగు వర్గాల ప్రజాబాహుళ్యాన్ని అలా దూరం చేస్తున్నారు. కను కనే సమాచార వ్యవస్థలైన పత్రికలు, రేడియో, విద్యా రంగాలను ప్రైవేట్ పెట్టుబడిదారులు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ప్రభావితం చేయడం జరుగుతోంది. (‘కమ్యూనిస్టు మేనిఫెస్టో’ రచన కు 172 ఏళ్లు అయిన సందర్భంగా) abkprasad2006@yahoo.co.in -
వాళ్లింటికి వెళ్లొద్దు
మొన్న నవంబర్ 9న రెండు చరిత్రాత్మకమైన పరిణామాలు సంభవించాయి. అయోధ్య తీర్పు వచ్చింది. కర్తార్‌పూర్ కారిడార్ ప్రారంభం అయింది. ఈ రెండు సందర్భాలలోనూ.. ముప్పై ఏళ్ల క్రితం ఇదే నవంబర్ 9న కుప్పకూలిన బెర్లిన్ గోడ ప్రస్తావన మన ప్రధాని నోటి నుంచి, పాక్ విదేశాంగ మంత్రి నోటి నుంచి వచ్చింది! బెర్లిన్ గోడలా అయోధ్య తీర్పు మనుషుల మధ్య అడ్డుగోడల్ని కూల్చేసిందని మన ప్రధాని అంటే.. బెర్లిన్ గోడలా కర్తార్‌పూర్.. దక్షిణాసియా దేశాల్ని కలుపుతుందని పాక్ మంత్రి అన్నారు. ఈ నేపథ్యంలో బెర్లిన్ గోడ గురించి క్లుప్తంగా కొన్ని వివరాలు, విశేషాలు. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత జర్మనీ.. రష్యా, ఫ్రాన్స్, యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ కింగ్‌డమ్‌ల ఆధిపత్యంలోకి వెళ్లింది. రష్యా అధీనంలో ఉన్న జర్మనీలో కమ్యూనిజం, మిగిలిన మూడు ప్రాంతాల్లోని జర్మనీలో క్యాపిటలిజం అభివృద్ధి చెందాయి. ఆ మూడు ప్రాంతాలు సంయుక్తంగా వెస్ట్ జర్మనీగా, మిగిలిన ప్రాంతం ఈస్ట్ జర్మనీగా ఉండిపోయింది. ఈస్ట్ జర్మనీ రాజధాని ఈస్ట్ బెర్లిన్, వెస్ట్ జర్మనీ రాజధాని వెస్ట్ బెర్లిన్ అయింది. క్రమంగా కమ్యూనిస్టు, క్యాపిటలిస్టు ప్రాంతాల మధ్య తీవ్రమైన భేదాలు మొదలయ్యాయి. ప్రజల ఆదాయ మార్గాలు, జీవనశైలితో సహా అన్నింటిలోనూ వెస్ట్ జర్మనీ మెరుగయింది. క్యాపిటలిస్టుల అదీనంలోని ప్రదేశాలు సుసంపన్నం అయ్యాయి. దాంతో ఈస్ట్ జర్మనీ వాసులు, ఈస్ట్ బెర్లిన్ వాసులు... వెస్ట్ జర్మనీ, వెస్ట్ బెర్లిన్ల వైపు దృష్టి సారించారు. వెస్ట్ జర్మనీ కూడా తమ దేశానికి రావాలనుకుంటున్న వాళ్లకు అభ్యంతరం చెప్పలేదు. వెస్ట్ బెర్లిన్ భౌగోళికంగా ఈస్ట్ జర్మనీలో ఉన్నప్పటికీ వెస్ట్ బెర్లిన్ చేరగలిగితే ఆ తర్వాత వెస్ట్ జర్మనీ వాసులుగా స్థిరపడడం సులువయ్యేది. దాంతో ఈస్ట్ జర్మనీవాసులు ఏదో ఒక రకంగా వెస్ట్ బెర్లిన్‌కి చేరేవారు. గోడను కట్టింది ఎవరు? రోజూ లక్షల మంది ప్రజలు ఈస్ట్ బెర్లిన్ నుంచి వెస్ట్ బెర్లిన్‌కు వెళ్లేవాళ్లు. ఉద్యోగం, వినోదం ఏదైనా వెస్ట్ బెర్లిన్లోనే దొరికేవి. కమ్యూనిస్టు విధానాలు అమలులో ఉన్న ఈస్ట్ బెర్లిన్‌లో వినోదాలు, విలాసాలే కాదు సౌకర్యాలు కూడా సరిగా లేకపోవడంతో మహిళలు షాపింగ్‌కు కూడా వెస్ట్‌కు వెళ్లేవాళ్లు. దీంతో రష్యాలోని కమ్యూనిస్టు పాలకులు వలసలను నిరోధించడానికి గోడ కట్టడమే ప్రత్యామ్నాయం అనుకున్నారు. మాస్కోలో 1961 ఆగస్టు మూడు నుంచి ఐదవ తేదీ వరకు జరిగిన సమావేశాల్లో ఈ నిర్ణయం తీసుకున్నారు.పన్నెండవ తేదీ రాత్రి సంతకాలయ్యాక 13వ తేదీన నిర్మాణం మొదలైంది. గోడను 12 అడుగుల ఎత్తున కట్టారు. నిత్యం మిలటరీ పహారాలో ఉండే అంత ఎత్తు గోడనూ దాటి వెళ్లడానికి అది కూలేనాటి వరకు ఐదువేల మంది ప్రయత్నించగా వారిలో రెండు వందల మంది తూటాలకు బలయ్యారు. ‘వాళ్లింటికి వెళ్లొద్దు’ అని ఎంత చెప్పినా పౌరులు వినకపోవడంతో అడ్డు గోడ కట్టడమే మార్గం అనుకుంది ప్రభుత్వం. గోడను పడగొట్టింది ఎవరు? నిజానికి బెర్లిన్ గోడ పతనం దాని నిర్మాణంతోనే మొదలయింది! అయితే అది పూర్తిగా ధ్వంసం కావడానికి సుమారు మూడు దశాబ్దాల సమయం పట్టింది. బెర్లిన్ గోడకు వ్యతిరేకంగా కొనసాగుతున్న మూకుమ్మడి నిరసన ప్రదర్శనలు 1989 సెప్టెంబర్ చివరినాటికి ముమ్మరమయ్యాయి. పర్యవసానంగా అక్టోబర్ 18న తూర్పు జర్మనీ కమ్యూనిస్టు పార్టీ అధినేత ఎరిక్ హోనేకర్ రాజీనామా చేయవలసి వచ్చింది. కొత్త ప్రభుత్వం పౌరులను పశ్చిమ జర్మనీలోకి అనుమతించడానికి ఒక కొత్త చట్టాన్ని సిద్ధం చేసింది. ఆ చట్టం 1989 నవంబర్ 9 రాత్రి 10.30 గంటలకు అమలులోకి వచ్చింది. బార్న్హాల్మర్ స్ట్రాస్ దగ్గర జనం గుమిగూడి సరిహద్దు ద్వారాలను తెరిపించారు. ►ఈస్ట్ బెర్లిన్‌లో వినోదాలు, విలాసాలే కాదు సౌకర్యాలు కూడా సరిగా లేకపోవడంతో మహిళలు షాపింగ్‌కు కూడా వెస్ట్ బెర్లిన్‌కు వెళ్లేవాళ్లు! -
నడుస్తున్నది మార్క్స్ యుగం
‘చరిత్ర చరమాంకం’ భావనను దాటుకుని మానవజాతి మరో ప్రత్యామ్నాయం కోసం వెతుకుతోంది. పాశ్చాత్య దేశాధినేతలు, వారి మేధావులు, సామాన్య జనం కూడా నేడు ‘పెట్టుబడి’ గ్రం«థాన్ని చదువుతున్నారు. ఈ కోణంలో మార్క్సిజం చిరంజీవి. కమ్యూనిజం సిద్ధాంతకారుడు కార్ల్‌మార్క్స్ జన్మిం చిన రోజు 1818, మే 5. ఈ శనివారానికి ఆయన జన్మించి 200 సంవత్సరాలు. మార్క్స్ జీవించిన 64 సంవత్సరాల కాలం యావత్తూ కార్మికవర్గ విముక్తి సిద్ధాంత సృజనకు అంకితం అయింది. 1867లో ఆయన రచించిన ‘పెట్టుబడి’ గ్రంథం మొదటి భాగం ప్రచురితమైంది. తన సహచరుడు, ఆజన్మమిత్రుడు ఫ్రెడరిక్ ఎంగెల్స్‌తో కలిసి 1847 చివరలో ‘కమ్యూనిస్టు ప్రణాళిక’ను రచించారు. సమకాలీన కమ్యూనిస్టు పార్టీలు, దేశాల చరిత్రను కార్ల్ మార్క్స్, ఎంగెల్స్, మార్క్స్ జీవిత సహచరి జెన్నీల పోరాటం, జీవితాల నుంచి వేరు చేసి చూడలేం. నాడు పెట్టుబడిదారీ వ్యవస్థ వేళ్లూనుకుంటూ, రూపుదిద్దుకుం టున్న కాలంలోనే దాని గమ్యాన్నీ, గమనాన్నీ వివరిస్తూనే దాని పతనాన్నీ, ఆ పతనంలో శ్రామికవర్గ పాత్రను శాస్త్రీయంగా వివరించినవాడు కార్ల్‌మార్క్స్. ప్రఖ్యాత జర్మన్ తత్వవేత్త హెగెల్ సూత్రీకరణల్లోని భావవాదాన్ని దాటి చలన సూత్రాలను పదార్థం, ప్రకృతి, సమాజానికి అన్వయించడం ద్వారా తత్వశాస్త్రాన్ని కార్ల్ మార్క్స్ భూమార్గం పట్టించాడు. తద్వారా, ’తత్వవేత్తలు నేటివరకూ ప్రపంచాన్ని నిర్వచించారు. కానీ వాస్తవానికి చేయవలసింది దానినిమార్చడం’ అని మార్క్స్ ప్రకటించాడు. మార్క్స్ సృజించిన గతితార్కిక భౌతికవాదం పదార్థం, ప్రకృతిలో జరిగే మార్పులకు కారణం వాటిలోనే అంతర్గతంగా ఉందని సూత్రీకరించింది. దాన్ని మానవ సమాజానికి వర్తించి ఆవిష్కరించింది చారిత్రక భౌతికవాదం. ఆవిధంగా వేలాది సంవత్సరాల మానవ పరిణామ చరిత్రకు కార్ల్ మార్క్స్ ఒక అర్థాన్ని సమకూర్చాడు. చరిత్ర తాలూకు గతం, వర్తమానం, భవితలను ఒడిసిపట్టిన ఆయన మానవజాతికి దాని గమ్యం, గమనాల తాలూకు పరమార్థాన్ని వివరించాడు. మానవ చరిత్రను, దాని దశలను యావత్తూ నిర్దేశించింది ఆయా సమాజాల్లో నిక్షిప్తమై ఉన్న వర్గపోరాటం అనే అంతర్గత చలన సూత్రం అని మార్క్స్ చెప్పాడు. అంటే సమాజంలో మార్పుకు, పరిణామానికి దైవాంశ సంభూతులైన చారిత్రక వ్యక్తులో లేక యాధృచ్ఛికతో కాదనీ, అసలు కారణం ఆయా చారిత్రక దశల్లోని సమాజాల తాలూకు అంతర్గత చోదక శక్తి అయిన వర్గపోరాటాలే అని తేల్చి చెప్పాడు. కాని వర్గపోరాటమనేది మార్క్స్ లేదా కమ్యూనిస్టుల సృష్టి అని పెట్టుబడిదారులూ, దాని మేధావులూ కొట్టిపారేశారు. అయితే కాలం ఎల్లవేళలా ఒకేలా లేదు. ఉండదు కూడా. 1917లో లెనిన్ నాయకత్వాన అక్టోబర్ మహా విప్లవం జరిగింది. పెట్టుబడిదారీ దేశాలను తలదన్నే రీతిలో సోవియట్ యూనియన్‌లో సోషలిజం నిర్మాణం జరిగింది. కాగా, పలు అంతర్జాతీయ సామ్రాజ్యవాద వత్తిడులూ, అంతర్గత తప్పిదాల వలన 1990లలో సోవియట్ సోషలిస్ట్ రాజ్యం పతనం అయ్యింది. దానితో చెలరేగిపోయిన పెట్టుబడిదారీ మేధావి వర్గం, నేతలూ.. సోషలిజం పూర్వపక్షం అయిపోయింది, మార్క్స్‌కు ఏనాడో కాలం చెల్లిందంటూ పాటను అందుకున్నారు. కానీ, 2000 సం‘‘రం నాటికి ఈ కథలో తేడా రాసాగింది. సోవియట్ పతనం అనంతరం ఫ్రాన్సిస్ ఫుకుయామా వంటి మేధావులు ప్రకటించిన నయా ఉదారవాద ‘‘చరిత్ర చరమాంకం’’ కథ తలక్రిందులై మానవజాతి మరో ప్రత్యామ్నాయం కోసం వెతుకులాడటం మొదలెట్టింది. లాటిన్ అమెరికా దానికి తనదంటూ ఒక దారిని ఏర్పరుచుకోసాగింది.2008లో మొదలైన ప్రపంచ ఆర్థిక సంక్షోభం కొట్టిన చావుదెబ్బకు యూరప్ ఆర్థిక మం త్రులు, ఫ్రెంచ్ ప్రధాని సార్కోజీ వంటి నేతలతోపాటు, లక్షలాది సామాన్య జనం, కార్ల్ మార్క్స్ రచించిన ‘‘పెట్టుబడి’’ గ్రంధాన్ని చదువుకోవడం మొదలు పెట్టారు. మార్క్స్ మళ్ళీ వచ్చాడు. వర్గపోరాటం నిజమేనంటూ ప్రపంచ పెట్టుబడిదారీ మీడియా, పత్రికలూ కూడా డాక్యుమెంటరీలూ, వ్యాసాలు రాసుకోసాగాయి. చివరకు నాటి అమెరికా అధ్యక్షుడు ఒబామా, పోప్ ఫ్రాన్సిస్‌లు కూడా సోషలిస్టులూ, కమ్యూనిస్టులుగా కనపడే మానసిక దుస్థితి దాపురించింది. కాగా, ప్రపంచ ధనవంతులు బిల్‌గేట్స్, వారన్ బఫెట్‌తో పాటుగా అమెరికన్ బిలియనీయర్లలో 3 వంతులమంది ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కనీ వినీ ఎరుగని సంక్షోభం రాబోతోందంటూ హెచ్చరికలు నేడు జారీ చేస్తున్నారు. ప్రపంచ పెట్టుబడిదారీ చిల్లి పడవ తడబడుతోంది. అందుకే, నిన్నటి తన ప్రపంచీకరణ సిద్ధాంతాలనూ, స్వేచ్ఛా వాణిజ్యాన్ని తనే స్వయంగా తిరస్కరిస్తూ నేడు ట్రంప్ నేతృత్వంలోని అమెరికా ఉన్మాదంలోకి జారిపోతోంది. బ్రెగ్జిట్ పేరిట యూరప్ నుంచి తాను విడిపోతానంటూ బ్రిటన్ తనలోకి తను ముడుచుకుపోతోంది. అంతిమంగా సమకాలిన యుగంలో పెరిగిపోతోన్న ఆర్థిక అసమానతలూ, పేదరికం, నిరుద్యోగాలూ కార్మికులూ, కర్షకులూ, కలం శ్రామికులూ... కంప్యూటర్ కూలీలూ అందరిదీ ఒకే గమ్యం... ఒకే గమనం... అది సోషలిజమేనని రోజురోజుకూ మరింత బలంగా గుర్తు చేస్తున్నాయి. అయితే సోషలిజం లేకుంటే మరణ వేదన పడుతోన్న సామ్రాజ్యవాదపు ఉన్మాదపు పరాకాష్ఠగా అణు యుద్ధం మినహా మరో దారిలేని చరిత్ర మలుపులోకి మనం వచ్చాం. సోషలిజం వర్థిల్లు గాకా... మార్క్సిజం చిరంజీవి!!! డి. పాపారావు వ్యాసకర్త మార్క్సిస్ట్ విశ్లేషకులు (మే 5న కార్ల్ మార్క్స్ 200వ జయంతి) మొబైల్ : 9866179615 -
యాంత్రికత తొలగేదెన్నడు?
ఎంఎన్ రాయ్ 1920లో ఎంఎన్ రాయ్ తాష్కెం ట్లో భారత కమ్యూనిస్టు పార్టీని స్థాపిం చారు. రెండేళ్లలో భారత కమ్యూ నిస్టు ఉద్యమ శతాబ్ది ఉత్స వాలు జరగనున్నాయి. చీలి కలు, పీలికల అనం తరం చివరికి సీపీఎం కమ్యూనిస్టు ఉద్యమంలో పెద్దన్నగా మిగిలింది. గతంలో పశ్చిమ బెంగాల్లో – తాజాగా త్రిపురలో అధికారం కోల్పో వడం.. చట్ట సభల్లో పార్టీ ప్రాతినిధ్యం భారీగా ం వంటి పరిణామాల నేపథ్యంలో–ఈ పార్టీ హైదరా బాద్‌లో అఖిల భారత మహాసభలు జరుపు కుంటోంది. విలాసవంతమైన జీవితం, అమ్మాయిల జీవితా లతో ఆటలాడుకోవడం వంటి కారణాలపై పశ్చిమ బెంగాల్లో ఓ రాజ్యసభ సభ్యుడు పార్టీ నుంచి బహి ష్కరణకు గురయ్యాడు. కేరళలో అనుయాయులకు నామినేటెడ్ పదవుల పందేరం వ్యవహారం పెద్ద దుమారం రేపింది. మీడియా పెద్దఎత్తున ఎత్తి చూపాక గానీ ఈ రెండు అంశాల్లోనూ దిద్దుబాటు జరగలేదు. పార్టీ రాజకీయ–నైతిక పతనాన్ని ఇవి సూచిస్తున్నాయి. మరోవైపు, మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా 2019 ఎన్నికల్లో కాంగ్రెస్‌తో మిత్రత్వం వ్యవహారం సీతా రామ్ ఏచూరి–ప్రకాశ్ కారత్‌ల మధ్య ప్రచ్ఛన్న యుద్ధంగా పరిణమించింది. మహా సభల ముసా యిదా తీర్మానం ఓటింగ్‌లో తన వాదన ఓటమి చెంది నందుకు ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా సమర్పించేవరకూ వెళ్లారు సీతారామ్ ఏచూరి. పొత్తులు పార్టీ ఎదుగుదలకు ఆటంకంగా మారాయని, స్వతంత్రంగా ఎదగాలని విశాఖ కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు గందరగోళంలో పడింది. పేదలు, బహుజనులు అధికంగా ఉన్న భారత దేశానికి మార్క్సిజాన్ని వర్తింపచేయడంలో చేసిన తప్పిదాలు, వ్యూహాత్మక వైఫల్యాల తాలూకూ చేదు ఫలితాలు ఇప్పుడు సంపూర్ణంగా సీపీఎం అనుభవం లోకి వచ్చాయి. అంబేడ్కర్‌ను బొంబాయిలో దగ్గ రుండి ఓడించారు. బాబా సాహెబ్ జయంతి నిర్వ హించిన పార్టీ నేతలపై సైతం చర్యలు తీసుకున్నారు. అలాంటి పార్టీకి ఇన్నాళ్లకు జ్ఞానోదయమైంది. వైఫ ల్యాలు నేర్పిన పాఠాలివి. ఫలితమే లాల్–నీల్ నినాదం. అయితే ఇందులోనూ పూర్తి నిజాయితీ కొరవడినట్టే అగుపిస్తోంది. దళిత సంఘాలకు సైతం ప్రత్యక్షంగానో, పరోక్షంగానో అగ్రవర్ణాల నాయక త్వం, బాక్ సీట్ డ్రైవింగ్ కొనసాగుతూనే ఉంది. తెలంగాణ బహుజన లెఫ్ట్‌ఫ్రంట్ నేత అగ్రవర్ణానికి చెందినవారనే విషయం అందరికీ తెలిసిందే. కేంద్రీకృత ప్రజాస్వామ్యం సీపీఎంలో సృజనా త్మకతను పూర్తిగా చంపేసింది. తీస్తా సెతల్వాద్, జిగ్నేష్ మేవానీ వంటి వారు పార్టీలో కనిపించరు. ఇందుకు కారణం సృజనాత్మక నేతల్ని పార్టీ పోత్స హించకపోవడమే. సృజనాత్మకత లేని ఏ సంస్థ / ఉద్యమం అయినా ఎదగకపోగా పతనావస్థకు చేరు కుంటుంది. స్పష్టమైన సిద్ధాంతం – నిజాయితీ లేకుండా, కేవలం వైఎస్ జగన్‌ను ఓడించడమే వ్యూహంగా రాజకీయాలు నడుపుతున్న పవన్క ల్యాణ్ వద్ద సీపీఎం నేతలు సాగిలపడటం ఇందుకు ఒక ఉదాహరణ. ప్రగతిశీల శక్తులు బలోపేతమైనప్పుడే సామా జిక న్యాయరథం ముందుకెళుతుంది. మతతత్వ రాజ కీయాలకు అడ్డుకట్టపడుతుంది. మరి ఈ దిశగా హైద రాబాద్ కాంగ్రెస్ తన కార్యక్రమాన్ని రూపొందించు కోగలుగుతుందా? నేటి క్లిష్ట పరిస్థితులకు అనుగు ణంగా స్పందించగలుగుతుందా? నయా ఉదారవాద, మార్కెట్ సమాజం తెచ్చి పెట్టే పెడధోరణుల్ని సీపీఎం తరచూ విమర్శిస్తుంటుంది. ఈ చట్రంలో తమ పార్టీ నాయకులు కూడా చిక్కుకున్నారని గుర్తిం చగలిగి నప్పటికీ.. దిద్దుబాటు చేసే చిత్తశుద్ధి అగ్ర నాయ కత్వంలో కనిపించడం లేదు. పార్టీలో 30 శాతం వరకు చీడ పురుగులున్నారని, వారిని ఏరి వేయాలని కలకత్తా ప్లీనం చెప్పి ఏళ్లు గడిచినా ఫలితం శూన్యం. సీపీఎం అగ్రనాయకులు, సీనియర్ కార్యక ర్తలతో ఈ రచయిత మూడు దశాబ్దాల నుంచి ఇలాంటి పలు అంశాలపై చర్చించారు. ఉద్యమం ఎదగగలదన్న నమ్మకం అగ్ర నాయకత్వంలో సన్న గిల్లడం స్పష్టంగా కనిపిస్తున్నది. ఇది యాంత్రిక పని విధానానికి, అనేక పెడధోరణులకు దారితీసింది. పార్టీ డాక్యుమెంట్లలో ఈ అంశాల్ని వారే పొందుపరి చారు. అయితే, నిజాయితీ – నిబద్ధత గల కార్యకర్త లకు కొదవ లేదు. నాక్కొంచెం నమ్మకమివ్వు.. కొండలు పిండి కొట్టేస్తాను.. అంటాడు ఆలూరి బైరాగి. ఈ తపనను పై నుంచి కింది దాకా పున రుద్ధరించగలిగితే, లోపాల్ని దిద్దుకోగలిగితే సీపీఎం ఎదగగలుగుతుంది. లేకుంటే ఒక విప్లవపార్టీ స్థానంలో ప్రెజర్ గ్రూప్‌గా ఇలాగే మిగిలిపోవాల్సి వస్తుంది. కేజ్రీవాల్, కోర్బిన్, బెర్నీ సాండర్స్‌లు అసా ధ్యాన్ని సుసాధ్యం చేయగలమని నిరూపించారు. ఎంతటి ప్రతికూల వాతావరణంలోనైనా ముంద డుగు వేయగలమని చేసి చూపించారు. సీపీఎం నాయకత్వం ఆ స్ఫూర్తిని అందిపుచ్చుకోవాల్సి ఉంది. (ఏప్రిల్ 18 నుంచి 22 వరకు హైదరాబాద్‌లో సీపీఎం జాతీయ మహాసభల సందర్భంగా) బి.భాస్కర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ మొబైల్ : 99896 92001 -
కమ్యూనిజం అక్కడ ఎలా బతికుందంటే...
వాషింగ్టన్ : సుందరమైన ప్రాంతాలున్న రాష్ట్రం, గాడ్స్ ఓన్ కంట్రీగా కేరళ దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన విషయం తెలిసిందే. కానీ, ఇప్పుడు అంతర్జాతీయ మీడియాలో కూడా ఆ చిన్న రాష్ట్రం గురించి పెద్ద కథనాలే వెలువడ్డాయి. అయితే అది పర్యాటక కోణంలో కాకపోవటమే ఇక్కడ విశేషం. కేరళలో ప్రస్తుతం కమ్యూనిస్టు ప్రభుత్వం అధికారంలో ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ గుర్తింపు ఉన్న పత్రిక వాషింగ్టన్ పోస్ట్ ఆదివారం తమ సంచికలో ఫ్రంట్‌పేజీలో ఓ వ్యాసాన్ని ప్రచురించింది. ఏ కమ్యూనిస్ట్ సక్సెస్ పేరుతో భారతదేశంలో ఓ చిన్న రాష్ట్రంలో కమ్యూనిజం ఇంకా బతికే ఉందని.. కలలు సాకారం చేసుకునేందుకు అక్కడ కృషి జరుగుతోందంటూ కథనం వెలువడింది. ప్రముఖ పాత్రికేయులు గ్రెగ్ జఫ్ఫె, విది దోషి.. ఈ ప్రత్యేక కథనాన్ని రచించారు. కేరళ ఆర్థిక మంత్రి థామస్ ఐసాక్ ఇంటర్వ్యూతోపాటు పలు అంశాలను కూడా అందులో ప్రస్తావించారు. ఎన్నికలద్వారా కమ్యూనిస్టు ప్రభుత్వం ఏర్పడడం అనేది ప్రపంచంలోనే మొదటిసారిగా ఇక్కడ జరగిందని.. వామపక్ష సిద్ధాంతాలను ప్రజలు విస్తృతంగా ఆదరించటం మూలంగానే కేరళలో ఇంకా కమ్యూనిస్ట్ పార్టీ విరజిల్లుతోందంటూ థామస్ అందులో వివరించారు. కేరళలో వామపక్ష ప్రభుత్వ హయాంలో సాధించిన ఘనతలను కూడా ఆ కథనం విపులంగా వివరించింది. అమెరికా ప్రధాన వార్తలను సైతం పక్కన పడేసిన ఈ స్టోరీపై పాఠకులు దృష్టిసారించటం విశేషం. ఇదిలా ఉంటే కేరళ పర్యటన సందర్భంగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కూడా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని.. గ్లోబల్ ఫేస్ అంటూ ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే. -
వందేళ్ల వసంతం
అదొక మహత్తరమైన మలుపు. ప్రపంచాన్ని గడగడలాడించిన ఘటన. కార్మికవర్గ విప్లవంతో సమసమాజ స్థాపన జరుగుతుందన్నాడు కార్ల్ మార్క్స్. ఆ సిద్ధాంతాన్ని లెనిన్ ఆచరణలో పెట్టిన సందర్భమది. ప్రపంచంలో తొలిసారిగా కార్మికులు రాజ్యాధికారం చేజిక్కించుకున్న ఉదంతం. తొలి సోషలిస్టు దేశం ఆవిర్భవించిన చరిత్ర. అదే అక్టోబర్ విప్లవం! రష్యా విప్లవం! బోల్షివిక్ విప్లవం! యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్టు రష్యా! 1917 లో సంభవించిన ఆ మహా విప్లవానికి ఈ నవంబర్ 7వ తేదీతో వందేళ్లు నిండుతున్నాయి. కానీ ఇప్పుడు సోషలిస్టు రష్యా లేదు. పాతికేళ్ల కిందటే రద్దయింది! 1991లో సోషలిజాన్ని అధికారికంగా రద్దు చేసుకుని రష్యా సమాఖ్యగా మారింది. కానీ సోషలిస్టు రష్యా మనుగడ సాగించిన 75 ఏళ్లలో ప్రపంచగతిని సమూలంగా మార్చేసింది. మరిన్ని దేశాలు సోషలిస్టు దేశాలుగా అవతరించాయి. ఆ సమయంలో ప్రపంచం రెండు భిన్న ధృవాలుగా చీలిపోయింది. ఆ ధృవాల మధ్య వైరం ఎప్పుడు విస్ఫోటనమవుతుందోనన్న భయాందోళనలు సర్వత్రా నెలకొని ఉండేవి. కానీ.. సోవియట్ రష్యా విచ్ఛిన్నంతో ప్రపంచం ఏకధృవంగా మారిపోయింది. మార్క్స్ సిద్ధాంతానికి కాలం చెల్లిపోయింది, సోషలిజం సాక్షాత్కారానికి ఆస్కారం లేదు, పెట్టుబడిదారీ వ్యవస్థ, స్వేచ్ఛా విపణి సమాజమే అంతిమం అనే వాదనలు, విశ్లేషణలు వెల్లువెత్తాయి. కానీ.. కార్మికవర్గానికి, సోషలిస్టు వాదులకు అక్టోబర్ విప్లవం ఎప్పటికీ మార్గదర్శిగానే నిలిచిపోయింది. సోవియట్ రష్యా కూలిపోవడానికి కారణం లెనిన్ అనంతర ఆర్థిక, రాజకీయ కార్యక్రమాల్లో లోపాలే కానీ.. అంతటితో సోషలిజం అంతం కాలేదని నమ్మేవారూ ప్రపంచ వ్యాప్తంగా బలంగానే ఉన్నారు. సోషలిస్టు రష్యాలో అక్టోబర్ విప్లవ దినోత్సవాన్ని ఏటా అధికారికంగా ఎంతో ఘనంగా నిర్వహించేవారు. అది ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వామపక్ష శక్తులకు కూడా పండగగానే ఉండేది. ఇప్పుడు అక్టోబర్ వందేళ్ల విప్లవ ఉత్సవాన్ని రష్యాలో అధికారికంగా నిర్వహిస్తారా లేదా అన్నది అటుంచితే.. ప్రపంచ వ్యాప్తంగా వామపక్ష పార్టీలు, మేధావులు తమ పునరేకీకరణకు, మరింత లోతైన అధ్యయనానికి ఈ సందర్భాన్ని ఒక వేదికగా మలచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో రష్యా విప్లవంపై ‘సాక్షి’ ఫోకస్... - సెంట్రల్ డెస్క్ రష్యా సోషలిస్టు విప్లవానికి శతాబ్దం పూర్తి ప్రపంచ చరిత్రను మలుపు తిప్పిన అక్టోబర్ విప్లవం మార్క్స్ ‘కార్మిక విప్లవా’న్ని ఆచరణలో పెట్టిన లెనిన్ - ప్రపంచంలో తొలి కార్మికవర్గ రాజ్యంగా అవతరణం - ఎన్నో దేశాల్లో కమ్యూనిస్టు విప్లవాలకు స్ఫూర్తి ప్రదాత - రెండు భిన్న ధృవాలుగా చీలిపోయిన ప్రపంచ దేశాలు - రష్యా, అమెరికాలు ‘సూపర్ పవర్’లుగా ఆవిర్భావం - ఇరువురి మధ్య అర్ధ శతాబ్దం పాటు ప్రచ్ఛన్న యుద్ధం - పాతికేళ్ల కిందట పతనమైన సోవియట్ సోషలిస్ట్ రష్యా బ్లడీ సండే: తొలి సోవియట్ ఆవిర్భావం రష్యాలో 1917లో సోషలిస్టు విప్లవం రావడానికి అది విజయవంతం కావడానికి ఎన్నో చారిత్రక కారణాలున్నాయి. జార్ రాచరిక నిరంకుశ పాలనలోని రష్యాలో 1905 లోనే ఈ విప్లవానికి పునాదులు పడ్డాయి. పట్టణాల్లోని కార్మికవర్గం అవధులు లేని పనిగంటలతో సతమతమవుతుండేది. పెట్రోగ్రాడ్ (ఇప్పుడు సెయింట్ పీటర్స్బర్గ్.. అప్పటి రష్యా రాజధాని)లో జనవరి 22వ తేదీన (ఆదివారం) కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోసం చక్రవర్తి (జార్) నికొలస్-2కు వినతిపత్రం ఇవ్వడం కోసం నిరాయుధంగా, శాంతియుతంగా ప్రదర్శనగా వెళుతున్నపుడు సైనికులు వారిపై కాల్పులు జరిపారు. ఆ ఘటనలో 1000 నుంచి 4000 మంది వరకూ చనిపోవడం, గాయపడటం జరిగిందని భిన్న అంచనాలు ఉన్నాయి. ‘బ్లడీ సండే’గా పేర్కొనే ఈ సంఘటనతో దేశవ్యాప్తంగా కార్మికవర్గ నిరసనలు, సమ్మెలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో కార్మికులు తొలి సోవియట్ (సహకార మండలి)ని స్థాపించారు. అక్కడి నుంచి దాదాపు అన్ని నగరాల్లోనూ ఈ సోవియట్లు ఏర్పడ్డాయి. కమ్యూనిస్టు రాజకీయ నిరసన అప్పుడే మొదలైంది. రెడ్ అక్టోబర్... ఫిబ్రవరి విప్లవం విజయవంతం కావడంతో అప్పటివరకూ స్విట్జర్లాండ్‌లో ప్రవాసంలో ఉన్న అతివాద బోల్షివిక్ నాయకుడు లెనిన్ తదితరులు ఏప్రిల్‌లో రష్యా చేరుకున్నారు. పెట్రోగార్డ్ సోవియట్‌లో బోల్షివిక్ల కన్నా మితవాద మెన్షెవిక్‌లు, సోషలిస్టు విప్లవవాదులు బలంగా ఉండేవారు. అయితే.. తాత్కాలిక ప్రభుత్వంలో డ్యూమాకు సోవియట్‌కు మధ్య విభేదాలు తలెత్తాయి. అక్టోబర్ నాటికి ఈ విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఈ పరిస్థితులు సోషలిస్టు విప్లవానికి అనుకూలంగా ఉన్నాయని లెనిన్ గుర్తించాడు. లెనిన్ రాకతో అంతకంతకూ పుంజుకుంటూ వచ్చిన బోల్షివిక్‌లు విప్లవం లేవదీశారు. అప్పటికే పెట్రోగార్డ్ సోవియట్‌కు అనుబంధంగా నిర్మించిన రెడ్ గార్డ్స్ సాయంతో అక్టోబర్ 25వ తేదీన (కొత్త క్యాలెండర్ ప్రకారం నవంబర్ 7) ప్రభుత్వాన్ని తమ స్వాధీనం చేసుకున్నారు. దేశ వ్యాప్తంగా కార్మికుల సోవియట్ల చేతుల్లోకి అధికారాన్ని తీసుకోవడం మొదలైంది. ఈ విప్లవంలో ఏ వైపూ ఒక్కరు కూడా చనిపోలేదు. అందుకే ఇది రక్తపాత రహిత విప్లవంగా చరిత్రలో నమోదయింది. లెనిన్ సారథ్యంలో రష్యా కమ్యూనిస్టు పార్టీ అధికారం చేపట్టింది. ప్రపంచ చరిత్రలో సరికొత్త శకం ఆరంభమైంది. అంతర్యుద్ధం..: కానీ.. విప్లవం అంతటితో పూర్తవలేదు. అక్టోబర్ విప్లవం తర్వాత అంతర్యుద్ధం రాజుకుంది. సోవియట్లను, సోషలిస్టు వ్యవస్థను వ్యతిరేకించే వర్గాలు, జార్ రాచరిక అనుకూల వర్గాలతో పాటు.. అతివాద బోల్షివిక్లను వ్యతిరేకించే సోషలిస్టు రివల్యూషనరీలు ఒకవైపు.. బోల్ష్విక్లు మరొకవైపుగా అంతర్యుద్ధం జరిగింది. ఈ యుద్ధం కోసం రెండు పక్షాల వారూ కార్మికులు, రైతులను బలవంతంగా సైన్యంలో చేర్చేవారు. 1918లో జార్ కుటుంబాన్ని బోల్షివిక్‌లు చంపేశారు. కమ్యూనిస్టు పార్టీ అధికారంలోకి రాగానే మొదటి ప్రపంచ యుద్ధం నుంచి రష్యా వైదొలగినా.. అమెరికాతో కూడిన మిత్రరాజ్యాలు అంతర్యుద్ధంలో జోక్యం చేసుకోవటంతో సోవియట్ల రెడ్ ఆర్మీ వారితోనూ పోరాడింది. నాలుగేళ్ల పాటు సాగిన ఈ అంతర్యుద్ధంలో లక్షలాది మంది చనిపోయారు. చివరికి రెడ్ గెలిచిన తర్వాత 1922 డిసెంబర్ 29న సోవియట్ రష్యా ఆవిర్భవించింది. విప్లవ కెరటాలు రష్యా విప్లవం స్ఫూర్తితో అదే సమయంలో జర్మనీలో, హంగరీ, ఇటలీ, ఫిన్లాండ్, వంటి పలు దేశాల్లో కమ్యూనిస్టు విప్లవాలు తలెత్తాయి. కానీ.. పెద్దగా విజయాలు సాధించలేదు. కొన్నిచోట్ల విజయవంతమైనా కూడా ఎంతో కాలం నిలువలేదు. అయితే అంతర్జాతీయ కమ్యూనిస్టు విప్లవం లక్ష్యంగా ప్రపంచ వ్యాప్తంగా కమ్యూనిస్టు ఉద్యమాలు బలపడ్డాయి. అందులో రష్యా కమ్యూనిస్టు పార్టీ పాత్ర, సాయం కూడా ఉంది. అనంతర కాలంలోనూ చైనా, వియత్నాం, ఉత్తర కొరియా, క్యూబా తదితర దేశాల్లో కమ్యూనిస్టు విప్లవాలు విజయవంతమయ్యాయి. భారత్ సహా చాలా దేశాల్లో కమ్యూనిస్టులు కొందరు సాయుధ విప్లవ పంథా ఎంచుకోవడానికి రష్యా, చైనా విప్లవాలు మార్గదర్శిగా నిలిచాయి. ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు విప్లవ ప్రయత్నాలు సాగుతూనే ఉన్నాయి. సోషలిజం నిర్మాణ ప్రయత్నాలు... సోషలిస్టు రష్యాలో ఎన్నో విప్లవాత్మక మార్పులు సంభవించాయి. కార్మికులకు 8 గంటల పనిదినం, రైతులకు భూముల పంపిణీ, బ్యాంకులు, పరిశ్రమల జాతీయీకరణ వంటి కార్మికవర్గ అనుకూల సంస్కరణలు జరిగాయి. సామూహిక వ్యవసాయం అమలు చేశారు. అందరికీ విద్యా హక్కు కల్పించారు. పారిశ్రామికీకరణ వేగవంతమైంది. అందరికీ పని అందించేందుకు కృషి చేశారు. దేశంలో పితృస్వామ్యం ఆధిపత్యాన్ని తగ్గించేందుకు కృషి జరిగింది. మహిళలకు, జాతిపరంగా మైనారిటీలకు సమాన హక్కులు కల్పించారు. వ్యవస్థీకృత మతాన్ని వ్యతిరేకించారు. ఇంట్లో మినహా అన్నిచోట్లా మత బోధనను నిషేధించారు. హేతువాద భావజాలాన్ని ప్రోత్సహించారు. విద్యను చర్చి నుంచి వేరుచేశారు. హేతువాదంతో కూడిన విద్యను అమలు చేశారు. అభివృద్ధిలో చాలా వెనుకబడిన దేశంలో సోషలిస్టు సమాజం నిర్మాణానికి ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. పంచవర్ష ప్రణాళికలతో సోవియట్ రష్యా అనతి కాలంలోనే ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. భారత్ సహా అభివృద్ధి చెందుతున్న, తృతీయ ప్రపంచ దేశాలకు డ్యాములు, పరిశ్రమల నిర్మాణం, ఆయుధాల సరఫరా వంటి వాటితో సహా ఆర్థికంగా, సాంకేతికంగా ఎంతో సాయం అందించింది. ప్రచ్ఛన్న యుద్ధం... మరోవైపు.. అదే సమయంలో అధికార కమ్యూనిస్టు పార్టీలో అంతర్గత పోరూ మొదలైంది. 1924లో లెనిన్ చనిపోయాక స్టాలిన్ అధికారం చేపట్టాడు. స్టాలిన్ విధానాలను వ్యతిరేకించిన రెడ్ ఆర్మీ వ్యవస్థాపకుడు ట్రాట్స్కీ దేశబహిష్కరణకు గురయ్యాడు. ఇదే సమయంలో రెండో ప్రపంచ యుద్ధం సంభవించింది. ఆ యుద్ధంలో హిట్లర్ సారథ్యంలోని నాజీ జర్మనీని రష్యా ఓడించింది. ప్రపంచ చరిత్రలో అది మరింత కీలకమైన మలుపు. కానీ యుద్ధంలో 2.6 కోట్ల మంది రష్యా ప్రజలు చనిపోయారు. అయితే.. యుద్ధం ముగిసిన తర్వాత రష్యా, అమెరికా ప్రయోజనాలు పరస్పరం విరుద్ధమైనవి కావడంతో వాటి మధ్య ప్రచ్ఛన్న యుద్ధం మొదలైంది. తూర్పు యూరప్ మధ్య ఆధిపత్యం అంశంపై విభేదాలు తీవ్రమయ్యాయి. అణ్వాయుధాల తయారీ సహా రెండు దేశాల మధ్యా అన్ని రంగాల్లో పోటీ పెరిగిపోయింది. రష్యా, అమెరికాలు రెండూ ‘సూపర్ పవర్‘లుగా నిలిచాయి. దాదాపు ప్రపంచం మొత్తం ఈ రెండు దేశాల వెనుకా రెండు ధృవాలుగా విడిపోయింది. వాటి మధ్య ఎప్పుడైనా మూడో ప్రపంచ యుద్ధం జరగవచ్చన్నంత ఉత్కంఠగా పరిస్థితి మారిపోయింది. ఫిబ్రవరి విప్లవం... ఇక మొదటి ప్రపంచ యుద్ధం కూడా రష్యా ప్రజల్లో జార్‌పై, ఆయన పరిపాలనపై వ్యతిరేకతను పెంచింది. జార్ తన సామ్రాజ్యాన్ని విస్తరించుకునే లక్ష్యంతో రైతాంగాన్ని యుద్ధరంగంలోకి పంపించాడు. కానీ.. తన కన్నా పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన జర్మనీ చేతిలో రష్యా తీవ్రంగా నష్టపోయింది. వేలాది మంది యుద్ధరంగంలో నేలకూలుతున్నారు. మరోవైపు.. యుద్ధం కోసం భారీగా కరెన్సీ నోట్లు ముద్రించటంతో దేశంలో ద్రవ్యోల్బణం పెరిగిపోయింది. 1917 వచ్చేసరికి ధరలు నాలుగేళ్లలో నాలుగు రెట్లు పెరిగాయి. రైతులకు గిట్టుబాటు ధరలు లభించలేదు. పట్టణాల్లో పరిశ్రమలు సగానికి సగం మూతపడ్డాయి. నిరుద్యోగం అమాంతంగా పెరిగిపోయింది. కార్మికులకు రొట్టెలు దొరకటం గగనమైపోయింది. ఇంకోవైపు ఉన్న పరిశ్రమల్లో కార్మికులు పన్నెండు గంటలకు పైగా వెట్టిచాకిరి చేయాల్సిన దుస్థితి. అందులో మహిళలూ అధిక సంఖ్యలో ఉన్నారు. ప్రభుత్వ విధానాలను సరళం చేయాలన్న డ్యూమా (పార్లమెంటు)ను జార్ రద్దు చేశాడు. ఈ పరిస్థితుల్లో యుద్ధం ఆపాలని, శాంతి కావాలని, రొట్టెలు కావాలనే డిమాండ్లతో పెట్రోగార్డ్లో కార్మికులు సమ్మెకు దిగారు. భారీ స్థాయిలో నిరసన ప్రదర్శనలు మొదలయ్యాయి. ప్రవాసంలో ఉన్న కమ్యూనిస్టు నాయకులు ఈ సమ్మెలకు, ఆందోళనలకు మద్దతు తెలిపారు. ఈ ఆందోళనలను అణచివేయాలని జార్ తన సైన్యాన్ని ఆదేశించాడు. కానీ అప్పటికే యుద్ధంలో దెబ్బతిని ఉన్న సైన్యంలో అధిక భాగం కార్మికులకు మద్దతుగా నిలిచారు. చాలా మంది పారిపోయారు. ఇక గత్యంతరం లేక 1917 మార్చి 2న (కొత్త క్యాలెండర్ ప్రకారం మార్చి 15న) జార్ నికొలస్-2 చక్రవర్తి పీఠాన్ని త్యజించాడు. ఆయన సోదరుడు ఆ పీఠం స్వీకరించేందుకు నిరాకరించాడు. దీంతో రాచరిక డ్యూమా, పెట్రోగార్డ్ సోవియట్ కలిసి తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. రాజ్యాంగ శాసనసభకు ఎన్నికలు నిర్వహించడం ఈ సర్కారు ముఖ్య లక్ష్యం. సోవియట్ పతనం... 1953లో స్టాలిన్ మరణంతో రష్యాలో అధికారం కోసం అంతర్గత పోరాటం మొదలైంది. కృశ్చేవ్ అధికారం చేపట్టి తన పట్టు బిగించాడు. ఆయన విఫలమయ్యాడంటూ కమ్యూనిస్టు పార్టీ స్వయంగా 1964లో తొలగించింది. ఆ తర్వాత బెద్నేవ్, కోసిజిన్, పోద్గోర్నీలు ఉమ్మడిగా నాయకత్వం వహించారు. అనంతరం బ్రెజ్నేవ్ నాయకత్వం చేపట్టాడు. కృశ్చేవ్, బ్రెజ్నేవ్ల హయాంలో రష్యా పారిశ్రామిక, అంతరిక్ష రంగాల్లో శిఖరస్థాయికి చేరుకుంది. కానీ.. ఆ సమయంలో వేగంగా సాగుతున్న ఆధునికీకరణ, కంప్యూటరీకరణల్లో రష్యా అంతకంతకూ వెనుకబడిపోయింది. రష్యా ఆర్థిక వ్యవస్థలో కీలక భాగమైన చమురు ధరలు ఎగుడుదిగుళ్లు కావడంతో సమస్యలు మొదలయ్యాయి. ఆండ్రపోవ్, చెరెన్కోల తర్వాత అధికారం చేపట్టిన గోర్బచేవ్.. రష్యా కమ్యూనిస్టు పార్టీని ఆధునీకరించే పని మొదలుపెట్టాడు. అధికారంలో పార్టీ పట్టును సడలించాడు. సామాజిక సమస్యలపై ప్రజలు దృష్టి సారించడం పెరిగింది. ఈ క్రమంలో గోర్బచేవ్, పార్టీ నాయకుడు ఎల్సిన్ల మధ్య అధికార పోరు తీవ్రమైంది. అనేక నాటకీయ పరిణామాల తర్వాత 1991 డిసెంబర్ 26న సోవియట్ యూనియన్ రద్దయింది. రష్యా ఫెడరేషన్ అవతరించింది. రష్యా సూపర్ పవర్ హోదా కోల్పోయింది. కమ్యూనిజం భవిష్యత్? సోవియట్ రష్యా పతనం ప్రపంచ వ్యాప్తంగా వామపక్ష వాదులను ఎంతో నిస్పృహకు లోను చేసింది. ఇక మార్క్సిజం, కమ్యూనిజాలు విఫలమయ్యాయన్న వాదనలు వ్యతిరేక వర్గం నుంచి వెల్లువెత్తాయి. సరళీకృత స్వేచ్ఛా మార్కెట్ వ్యవస్థే ప్రపంచానికి అంతిమ పరిష్కారమన్న సూత్రీకరణలు జరిగాయి. అయితే వామపక్ష వాదులు అది కేవలం విప్లవానికి ఒక ఎదురు దెబ్బేనని, సోషలిస్టు స్థాపనకు నిరంతర ప్రయత్నం సాగుతూనే ఉంటుందని విశ్వసిస్తున్నారు. నవంబర్‌లో అక్టోబర్ విప్లవం..! రష్యా సోషలిస్టు విప్లవానికి అక్టోబర్ విప్లవం అని పేరు. కానీ.. ఆ విప్లవం సంభవించింది ప్రస్తుత కేలండర్లో నవంబర్ 7వ తేదీ. విప్లవం వచ్చే సమయానికి రష్యాలో జూలియన్ కేలండర్ ఉపయోగించేవారు. ఆ కేలండర్ ప్రకారం.. అక్టోబర్ 25వ తేదీన ఈ విప్లవం సంభవించింది. ఆ తర్వాతి నుంచి ఉపయోగిస్తున్న గ్రెగోరియన్ కేలండర్లో అది నవంబర్ 7వ తేదీ అయింది. అందుకే అక్టోబర్ విప్లవం ఉత్సవాన్ని నవంబర్‌లో నిర్వహించుకుంటారు. -
‘విశ్వసనీయత’ ఎలా?
విశ్లేషణ వర్గేతర సామాజిక దోపీడీకి గురయ్యేవారి ప్రయోజనాలను ప్రతిబింబించే స్వభావాన్ని కమ్యూనిస్టు పార్టీలు కోల్పోయాయనే భావన ఆయా సామాజిక బందాలలో బలపడింది. దళితులు, మైనారిటీలు, మహిళలు, ఆదివాసులు సహా అణగారిన ప్రజలందరి విశ్వాసాన్ని అవి చూరగొనాలి. కమ్యూనిస్టు ఉద్యమం ఎందుకింతగా బలహీన పడిపోయింది? అని ఆవేదన చెందుతున్న కమ్యూనిస్టు శ్రేయోభిలాషులు ఎంతో మంది ఉన్నారు. అదే సమయంలో కమ్యూనిస్టు ఉద్యమం పునరుజ్జీవితమైతే తప్ప ఏ మాత్ర మైనా శ్రామికులకు మేలు జరగదని ఆశతో ఎదురు చూసే వారూ, అందుకోసం కషి చేస్తున్నవారూ లేకపోలేదు. అంతకుమించి ఆయా పార్టీల కార్యకర్తలు, నాయకులు అందు కోసం తీవ్ర మేధోమధనం జరుపుతున్నారు. ఈ అంశాన్ని పరిశీలించే ముందు మన స్వాతంత్య్రోద్యమ చరిత్రలోని ప్రధాన అంశం గూర్చి ఆలోచించక తప్పదు. మన జాతీయోద్యమం అంటారే గాని, అది వివిధ జాతుల జాతీయోద్యమం అనడం çసబబు. నాటికి దేశంలో గుర్తింపును పొందిన 17–18 జాతుల ప్రజలంతా.. బ్రిటిష్ పాలన విరగడై స్వతంత్రం వస్తే తమ తమ జాతుల ఆర్థిక, సామాజిక, సాంస్కతిక జీవనం వద్ధి చెందగలుగు తుందని ఆశించారు. వివిధ జాతుల స్వచ్ఛంద సమాఖ్యగా మన భారతదేశం వర్ధిల్లుతుందని వారు భావించారు. ఈ దష్టి తోటే వివిధ జాతుల ప్రజానీకం, నేతలు స్థానికంగా ఎక్కడికక్కడ పోరా డుతూ మొత్తంగా దేశవ్యాపిత ఉద్యమంలో స్వాతంత్య్రోద్యమంలో భాగస్వాములయ్యారు. అంతే కానీ, ఏ ఒక్క జాతి ప్రజల ఉద్యమ ఫలితమో కాదు మన స్వాతంత్య్ర పోరాట విజయం! భారత జాతి అన్నది స్వాతంత్య్రోద్యమ భావోద్వేగంలో ఏర్పడిన భావనే గానీ... వాస్తవానికి అంగ, వంగ, కళింగ, ఆంధ్ర, ద్రవిడ, పంజాబీ, బెలూచీ ఇత్యాది జాతులు లేని ప్రత్యేక భారత జాతి లేదు. ఈ వాస్తవాన్ని పరిగణించి కమ్యూనిస్టు పార్టీలు దేశవ్యాప్త జాతీయ ఉద్యమాలతో పాటూ ఆయా జాతుల జాతీయ సమస్యలకు కూడా తగిన ప్రాధాన్యాన్ని ఇవ్వాలి. రెండు, మన స్వాతంత్య్రోద్యమం కేవలం బ్రిటిష్ వలస పాలన నుంచి విముక్తి కోసం ఒక్క రాజకీయ ఉద్యమంగానే సాగలేదు. వివిధ దశలలో – బాధ్యతాయుత పాలన కోసం అనే స్థాయి నుంచి సంపూర్ణ స్వాతంత్య్ర స్థాయికి ఎదుగుతూ వచ్చింది. 1930లకు గానీ కమ్యూనిస్టు పార్టీ భారతదేశంలో స్థూలంగా ఒక స్థాయి పార్టీగా ఏర్పడలేదు. స్వాతంత్య్రోద్యమంలో స్వాతంత్య్ర సాధన రాజకీయ అంశమే ప్రధానంగా ఉండినా, అందులో సామాజిక న్యాయం, ఉత్తమ నైతిక సాంస్కతిక కర్తవ్యాలకు గూడా తగిన ప్రాధాన్యం ఉండేది. ఉదాహరణకు, ‘కల్లు మానండోయ్ బాబూ కళ్లు తెరవండోయ్’ అంటూ సాగిన కాంగ్రెస్ ప్రజా ఉద్యమం ఒక సాధారణ డిమాండును మించిన పోరాటంగా జరిగింది కదా! అలాగే దళిత ఉద్ధరణ, వారి ఆలయ ప్రవేశం, అస్పశ్యతా నివారణ, స్త్రీల పురోభివద్ధి వంటివి మన మెరిగినవే. భారత స్వాతంత్య్ర ఉద్యమం ఒక రాజకీయ పోరాటంగానే గాక బహుముఖ ప్రజాహిత కార్యక్రమాల సమాహారంగా సాగింది. తదుపరి కమ్యూనిస్టు పార్టీలోకి వచ్చినవారిలో నేతలేగాక సామాన్య ప్రజలు కూడా కాంగ్రెస్ నుంచి వచ్చినవారే. మన సుందరయ్య, సీనియర్ కంభంపాటి, కేరళకు చెందిన నంబూద్రిపాద్ వంటి వారు అలా కాంగ్రెస్ ఉద్యమం నుంచి కమ్యూనిస్టు పార్టీలోకి వచ్చినవారే. కానీ వారికి వర్గ పోరాటమే ప్రధానమైనది. కాంగ్రెస్‌లో ఆ వర్గ పోరాటం తప్ప ఇతర ప్రజా పోరాటాలన్నీ భాగంగా ఉన్నాయి. ఒక విధంగా చెప్పాలంటే భారత స్వాతంత్య్ర సముపార్జన ప్రధాన లక్ష్యం వర్గ సామరస్యం. అలాగే సామాజిక, న్యాయ తదితర ప్రజా ఉద్యమాల ఆవశ్య కత ఉన్నా అవి ఒక పరిధి దాటి సమరశీలంగా సాగరాదని కాంగ్రెస్ ప్రత్యేకించి గాంధీ, ఆయన అనుయాయుల భావన. వర్గరహిత సాధారణ ప్రజాపార్టీ కాంగ్రెస్ క్రమంగా దోపిడీకి గురవుతున్నవారి వర్గ పోరాటాలను సహించలేనిదిగా దిగజారుతూ పోయింది. కాగా, కమ్యూనిస్టు పార్టీ వర్గపోరాటమే ప్రధానంగా ఇతర సామాజిక, నైతిక తదితర పోరాటాలను నిర్వహించే పార్టీగా రూపొం దుతూ వచ్చింది. ఇక స్వాతంత్య్రానంతర కాలంలో కాంగ్రెస్ తదితర పాలక పార్టీలు దోపిడీ వర్గ ప్రయోజనాలను రక్షిస్తూనే, ఓటు బ్యాంకు రాజకీయంలో భాగంగా ఇతర సామాజిక, నైతిక అంశాలను కూడా వాడుకుంటూ వస్తున్నాయి. మరోవంక వర్గ పోరాటానికి ప్రాధాన్యం పేరిట కమ్యూనిస్టు పార్టీలు... వర్ణ వివక్ష తదితర సామాజిక వివక్షతకు గురవుతున్న ప్రజల న్యాయమైన పోరాటా లను నిర్లక్ష్యం చేస్తూ వచ్చాయి. దోపిడీ వర్గాలలో సైతం అధికార దాహంతో విభేదాలు పెరగసాగాయి. మొదటి నుంచీ కాంగ్రెస్‌లోని మితవాద, మతవాద శక్తులు ఆ పార్టీలో ఉన్న కొద్దిపాటి పురోగామి, లౌకిక స్వభావాన్ని అంగీకరించనివిగా మారాయి. చివరకు ఆ శక్తులు, నాటి హిందూ మహాసభ మితవాద, మతతత్వ ఎజెండాతో క్రమ క్రమంగా భారతీయ జనతా పార్టీగా రూపు దాల్చాయి. మరో వైపు అంతర్జాతీయ, జాతీయ విభేదాలు, ఏదో ఒక మేరకు స్వార్థ సంకుచిత ప్రయోజనాలు కలసి కమ్యూనిస్టు ఉద్యమంలో చీలికలు వచ్చాయి. ఇక వర్ణ వివక్ష తదితర వర్గేతర సామాజిక దోపీడీకి గురయ్యే వారి ప్రయోజనాలను ప్రతిబింబించే స్వభావాన్ని అవి కోల్పోయాయనే భావన ఆయా సామాజిక బందాలలో బలపడింది. దీంతో వివిధ సామాజిక, వర్ణ అస్తిత్వ ఉద్యమాలను ప్రతిబింబిస్తూ కుల సంఘాలు అవతరించాయి. కమ్యూనిస్టు పార్టీలలోనే అవకాశవాదం, అధికార దాహం చోటుచేసుకున్నాయని మార్క్సిస్టు పార్టీయే ఆత్మవిమర్శ చేసుకుంది. కమ్యూనిస్టు ఉద్యమం తిరిగి తన గత వైభవాన్ని సంతరించుకోవా లంటే – తొలితరం కమ్యూనిస్టు పార్టీవలే వర్గపోరాటాలతో పాటూ ఇతర సామాజిక, నైతిక పోరాటాలకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలి. ప్రత్యేక శ్రద్ధా సక్తులతో, కషితో అణగారిన ప్రజలు దళితులు, మైనారిటీలు, మహిళలు, ఆదివాసులు తదితరులందిరి విశ్వాసాన్ని చూరగొనగల రూపును తిరిగి సంతరించుకోవాలి.మొత్తం జాతి ప్రయోజనాలను ప్రతిబింబించే రీతిలో కమ్యూనిస్టులు ఆయా జాతీయ ఉద్యమాలను నిర్మించే కషి చేయాలి. ఉదాహరణకు, కేజీ బేసిన్లో సహజ వాయువు కోసం ‘విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు’ అన్న రీతిలో పార్టీలకు అతీతంగా తెలుగు జాతి ఉద్య మానికి రూపాన్ని ఇవ్వగలగాలి! అలాగే ప్రత్యేక హోదా ప్రజల ఆశగా, ఆకాంక్షగా ఉన్నది కాబట్టి అలాంటి ఏపీ కోసం వర్గ, వర్ణ, రాజకీయ విభేదాలను అధిగమించి ఉద్యమించాలి. సాధారణ ప్రజా సమస్యలపై సాగిస్తున్న ఉద్యమాలకు విస్తత రూపం ఇవ్వగలగాలి! ఇందుకు కమ్యూ నిస్టుల మధ్య ఐక్యత కీలకం! కాంగ్రెస్‌తో ఎన్నికలలో కలవాలా, వద్దా? వంటి ఎన్నికల ఎత్తుగడల తాత్కాలికతను దష్టిలో ఉంచుకుని తమ వ్యూహంపై కేంద్రీకరిస్తూ.. తమ దక్పథాన్ని, శ్రేయోభిలాషులను, ప్రజా పునాదిని విస్తరించుకుని గట్టిపరచుకోవాలి. ప్రజాభ్యుదయం కోసం మహ త్తర ప్రజా ఉద్యమాన్ని నిర్మించడం కోసం కష్టసాధ్యమైనా ఇంతటి బహ త్తర కర్తవ్యాన్ని కమ్యూనిస్టులు సాధించగలరని ఆశిస్తున్నాను. -వ్యాసకర్త ప్రముఖ మార్క్సిస్టు విశ్లేషకులు డా‘‘ ఎ.పి. విఠల్ ‘ 98480 69720 -
కమ్యూనిజం, సోషలిజం, లెనినిజంల పోరాటం
రాముడు, కృష్ణుడు, శివుడు, బ్రహ్మ తదితరులు ఒకరిపై మరొకరు పోటీకి దిగారు గతంలో. ఇప్పుడు కమ్యూనిజయం, సోషలిజం, లెనినిజంలు ఒకే లక్ష్యంతో మూకుమ్మడిగా పోరాటం చేస్తున్నారు. మొదటి సంఘటన గతేడాది జరిగిన బిహార్ ఎన్నికల్లో చోటుచేసుకున్నదైతే, తాజాగా 'ఇజాల' పోరాటం తమిళనాడులో జరుగుతోంది. అసలింతకీ ఏమిటీ ఇజమ్స్..? సేలం జిల్లాకు చెందిన 48 ఏళ్ల మోహన్ కరడుగట్టిన వామపక్షవాది. ఆయన రక్తమేకాదు, మాట, చూపు, పని.. అన్నీ ఎరుపే. ఎరుపు కండువా లేనిదే ఇల్లు కదలడు. తన ముగ్గురు కొడుకులకు కూడా కమ్యూనిజం, సోషలిజం, లెనినిజం అని పేర్లు పెట్టుకున్నాడు. ఏళ్లుగా పార్టీకి చేసిన సేవలను దృష్టిలో పెట్టుకుని భారత కమ్యూనిస్ట్ పార్టీ (సీపీఐ) ఆయనకు వీరపాండి అసెంబ్లీ టికెట్ ఇచ్చింది. తండ్రి విజయం కోసం ఆ ముగ్గురు కొడుకులూ ప్రచారం నిర్వహిస్తున్నారు. పేరులోని వైవిధ్యత ఆ ముగ్గురికీ ఇప్పటికే విస్తృతమైన పరిచయాలున్నాయి. అలా తెలిసిన వాళ్లందరినీ కలిసి, 'కంకి కొడవలి' గుర్తుకు ఓటేయాల్సిందిగా అభ్యర్థిస్తూ తండ్రి విజయానికి కృషిచేస్తున్నారు కమ్యూనిజం, సోషలిజం, లెనినిజంలు. స్థానికంగా ఉంటూ గడిచిన ఏడాది కాలంగా లాయర్ గా ప్రాక్టీస్ చేస్తున్నాడు మోహన్ పెద్దకొడుకు కమ్యూనిజం. 'వెరైటీగా ఉండే నా పేరంటే నాకు చాలా గర్వం. పేరు చెప్పగానే చాలా మంది ఆశ్చర్యపోతారు. ఎందుకీ పేరు పెట్టారని ఆరాతీస్తారు. మా సీనియర్ లాయర్ నన్ను జూనియర్ గా చేర్చుకున్నది కూడా నా పేరు వల్లే'అని పేరు బలాన్ని మాటల్లో ప్రదర్శిస్తాడు కమ్యూనిజం. ఇక సోషలిజం, లెనినిజంలు ఆభరణాల తయారుచేసే వృత్తిలో కొనసాగుతున్నారు. తండ్రి గెలుపుకోసం ఇజాలు చేస్తున్న పోరాటం తమిళనాడు ఎన్నికల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. -
దేశంలో కమ్యూనిజానికి స్థానం లేదు
సాక్షి, హైదరాబాద్: దేశ ప్రజల ఆలోచనకు కమ్యూనిజం సరిపోదని.. ఆ సిద్ధాంతాలకు ఇక్కడ స్థానం లేదని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు. కమ్యూనిజానికి ఒకప్పుడు ఆకర్షణ ఉండేదని, ప్రస్తుతం నేషనలిజాన్నే యువత ఆచరిస్తున్నారని పేర్కొన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ జయంతి వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడారు. దేశం మానవతావాదం వల్లే అభివృద్ధి చెందుతుందని, జాతి పునరుజ్జీవనానికి దీన్‌దయాళ్ ఉపాధ్యాయ ఆనాడే బీజం వేశారని అన్నారు. అట్టడుగు వర్గాలకు అభివృద్ధి ఫలాలు అందాలని సూచించిన మహనీయుడు దీన్‌దయాళ్ అని కొనియాడారు. ఆయన అడుగు జాడల్లో నడుస్తున్న బీజేపీ వైపు దేశమంతా ఆశగా ఎదురు చూస్తోందని చెప్పారు. కానీ కమ్యూనిస్టులు, కాంగ్రెస్ నేతలు కలిసి ‘సెక్యులరిజం’ అంటూ లేనిపోని ప్రచారాలు చేస్తున్నారని వెంకయ్యనాయుడు విమర్శించారు.కమ్యూనిస్టుసిద్ధాం తాలు మంచివి కాకపోయినా... ఆపార్టీలో పుచ్చలపల్లి సుందరయ్య, చండ్ర రాజేశ్వరరావు వంటి మంచి వ్యక్తులు ఉండేవారన్నారు. ఇప్పుడు కమ్యూనిస్టు పార్టీలకు చాలా రాష్ట్రాల్లో ప్రాతినిధ్యమే లేదన్నారు. ఒక చాయ్‌వాలా దేశ ప్రధానిగా ఎదిగి సూట్ వేసుకుంటే కాంగ్రెస్ పార్టీ ఓర్వలేకపోతోందని.. మోదీ దేశాన్ని మరో పదేళ్లు పాలిస్తే సమూల మార్పులు తెచ్చి అన్ని వర్గాలకు న్యాయం చేస్తారన్నారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కె.లక్ష్మణ్, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, ఎమ్మెల్సీ ఎన్.రామచంద్రరావు, ఇంద్రసేనారెడ్డి, బద్దం బాల్‌రెడ్డి పాల్గొన్నారు. -
ఆ తల్లి మాటలు... జీవితంలో మరచిపోలేను!
దేవుడు అన్ని చోట్లా ఉండలేక తల్లిని సృష్టించాడంటారు. తల్లికి కూడా దేవుడిలా కనపడేవారే ఈ దేవుళ్లు. మనిషి నాడి సరిగా ఉందా లేదా అని తెలుసుకోడానికి డాక్టరు పేషెంటు పాదాన్ని పట్టుకుంటాడు. అలాంటి దేవుడు డాక్టర్! మనకు ప్రాణసేవ చేయడానికి పాదసేవ కూడా చేస్తాడు. అంత మహోన్నతమైన మనసు డాక్టర్లది. వర్ణం, మతం, కులం, స్తోమతలకు అతీతంగా సేవ చేస్తాడు. అలాంటి ఎందరో మహానుభావులకు ప్రతీకగా ఈ ఇద్దరు. ఇలాంటి వారందరికీ సాక్షి సలాం. నా ఎంబీబీఎస్‌ను 1964లో పూర్తి చేసుకున్న తర్వాత కమ్యూనిజం పట్ల నాకున్న ఆసక్తితో నెల్లూరులోని డాక్టర్ రామచంద్రారెడ్డి పీపుల్స్ పాలీక్లినిక్‌లో శిక్షణ పొందాను. ఆదర్శ కమ్యూనిస్టు నాయకుడు పుచ్చలపల్లి సుందరయ్యగారి సోదరుడే డాక్టర్ రామచంద్రారెడ్డి. ప్రజావైద్యశాలల కాన్సెప్ట్‌కు ఆద్యుడూ, రూపకర్తా ఆయనే. మంచి వైద్యుడు, ప్రజల డాక్టర్ అని జనంలో ఆయనకు పెద్ద పేరుండేది. శిక్షణ తర్వాత నల్గొండ జిల్లా సూర్యాపేటలో నేను ప్రజావైద్యశాల ప్రారంభించాను. నా జీవితాన్నే ఒక మలుపు తిప్పిన సంఘటన ఒకటి చెబతాను. మా హాస్పిటల్‌కు వచ్చిన ఒక మహిళ ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలను కన్నది. అప్పటికి అదో సంచలనం. పత్రికల్లోనూ ప్రచురితమైంది. ఆమెలోనూ, ఆ కుటుంబసభ్యుల్లోనూ పేదరికం ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. విపరీతమైన రక్తహీనత (అనీమియా)తో బాధపడుతోందామె. ఆ ముగ్గురు పసికందుల ప్రాణాలనూ కాపాడటానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నాను నేను. దాదాపు యాభై ఏళ్ల కింద ఆనాటి పరిస్థితుల్లో సూర్యాపేట లాంటి ఒక చిన్న పట్టణంలో ఉన్న అరకొర వైద్యసదుపాయాలతో ఆ పిల్లలను కాపాడటం నా పరిధిలో అసాధ్యమైన విషయం. అయినా నేను చేయగల ప్రయత్న మంతా చేస్తూనే... హైదరాబాద్‌లోని నీలోఫర్ హాస్పిటల్‌కు తీసుకెళ్తే పిల్లలు తప్పక బతుకుతారనీ, వీలైనంత త్వరగా తీసుకెళ్లమని వారికి సలహా ఇచ్చా. అప్పుడు వారన్న మాటలను నేనెప్పటికీ మరచిపోను ‘‘పేటకు వచ్చే టప్పటికే... మా పానాలు (కను)గుడ్లల్లకొచ్చినయి. ఇక పట్నం యాడబోతం’’ అన్నారు వాళ్లు. ఆ పసికూనలను కాపాడటానికి నేను చేస్తున్న ప్రయత్నం, నేను పడుతున్న ఆరాటం చూసింది ఆ తల్లి. ఇంకా మగత కూడా వీడని తన గొంతుతో ఇలా అంది. ‘‘ఆళ్లని బతికించకయ్యా. ముగ్గురంటే నేను యాడ సాదుతా. నేను సాక లేను సారూ’’ అంది! విషణ్ణ వదనంతో అప్పుడామె అన్న మాటలతో నా కళ్ల నుంచి కన్నీరు చిప్పిల్లింది. డాక్టర్ అన్నవాడు కేవలం వైద్యం చేయడమే కాదు. సేవాదృక్పథంతో సమాజానికి ఉపయోగడాలి. తన కన్నబిడ్డలు బతికేందుకు అవకాశం కల్పించలేని ఈ వ్యవస్థ కంతా వైద్యం చేయాల్సిందే. బిడ్డలు ఒకవేళ మృత్యుముఖం నుంచి బయటకు వచ్చి మనుగడ సాగిస్తే వారిని సాకలేమేమో అని వారి చావును సైతం ఆహ్వానించింది ఆ తల్లి. అలాంటి ఈ అసమానతలతో ఉన్న, అమానవీయ వ్యవస్థను మార్చాలనీ, ఆత్మగౌరవంతో, సుఖశాంతులతో ఉండే సమాజం కోసం జరిగే కృషిలో మా వైద్యులందరూ భాగస్వాములు కావాలనీ, అదే మా కర్తవ్యం అని తెలుసుకున్నాను. నేను శిక్షణ పొందిన సమయంలో డాక్టర్ రామచంద్రారెడ్డిగారు చెప్పిన మాటలు మళ్లీ గుర్తుకు వచ్చాయి. ‘‘మీలో ఎంతమంది కమ్యూనిస్టులవుతారో, కమ్యూనిజాన్ని ఎంతగా ఆచరణలో చూపిస్తారో వేరే సంగతి. కానీ ఒక్క విషయం గుర్తుంచుకోండి. రేపు మీరు మీ సొంత ప్రాక్టీస్ ప్రారంభిస్తారు కదా. అప్పుడు మన హాస్పిటల్‌కు వచ్చిన ఏ రోగి కూడా తన వద్ద తగినంత పైకం లేదు గనక తనకు వైద్యం దొరకదు అనే నిరాశతో ఎవరూ ఎప్పుడూ తిరిగి వెళ్లకూడదు. మంచి వైద్యునికి వృత్తిలో నిబద్ధత, శస్త్రచికిత్సలో నైపుణ్యం ఎంత అవసరమో, మానవతాదృక్పథంతో ఉండటమూ అంతే అవసరం’’ అని అన్నారాయన. నా జీవితంపై చెరగని ముద్రవేసిన డాక్టర్ రామచంద్రారెడ్డి ఉద్బోధలూ, నా అనుభవంలోకి వచ్చిన సంఘటనల స్ఫూర్తిని నా వైద్యచికిత్సలలో జీవితాంతం కొనసాగించా. డాక్టర్ ఎ.పి. విఠల్ ప్రజావైద్యశాల వ్యవస్థాపకులు, సూర్యాపేట ఫోన్: 9848069720 -
మూడోఫ్రంట్ ముగిసిన ముచ్చట
⇒ వామపక్ష సంఘటనే లక్ష్యం ⇒ సీపీఎం ప్రధాన కార్యదర్శి కారత్ స్పష్టీకరణ (విశాఖపట్నం నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి): ఎన్నికలకోసం పార్టీలను ఏకం చేసే ప్రసక్తే లేదని సీపీఎం ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కారత్ స్పష్టం చేశారు. ఎన్నికల ఎత్తుగడలనేవి తాత్కాలికమేగానీ, వాటికోసమే ఏమైనా చేయాలనుకోవట్లేదని తేల్చిచెప్పారు. సమసమాజం, కమ్యూనిజమే అంతిమలక్ష్యంగా పనిచేస్తాం తప్ప స్వల్పకాలిక ప్రయోజనాలకోసం పాకులాడబోమన్నారు. పార్టీ 21వ జాతీయ మహాసభల సందర్భంగా బుధవారమిక్కడ ఏపీ రాష్ట్ర కార్యదర్శి పి.మధుతో కలసి ఆయన మీడియాతో మాట్లాడారు. మహాసభలో చేసిన రెండు తీర్మానాల్ని విడుదల చేశారు. భూసేకరణ చట్టసవరణ బిల్లును వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా పోరాటం చేయాలని మహాసభ పిలుపునిస్తూ తీర్మానం చేసింది. మరో తీర్మానంలో అంబేడ్కర్ 125వ జయంతి సందర్భంగా దేశంలోని షెడ్యూల్డ్ కులాల సమస్యలపై చర్చించేందుకు ప్రత్యేక పార్లమెంటు సమావేశాన్ని నిర్వహించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. మీడియా సమావేశంలో కారత్ చెప్పిన అంశాలివీ.. అది గతించిన గతం..: 1998 నుంచి 2008 వరకు మూడో ప్రత్యామ్నాయంకోసం ప్రయత్నించాం. అది సాధ్యం కాదని తేలిపోయింది. అది గతించిన గతం. ఇప్పుడు మాముందున్న తక్షణ కర్తవ్యం వామపక్ష, ప్రజాతంత్ర శక్తుల ఐక్యత. పోరాటాలు, ఉద్యమాల ప్రాతిపదికన అది ఉంటుంది. గతంలోనూ వామపక్ష, ప్రజాతంత్ర శక్తుల ఐక్యసంఘటనకు పిలుపిచ్చాం. కొంతమేర కృషి జరిగింది. మధ్యలో అనేక అభిప్రాయాలొచ్చాయి. ఇప్పుడు సరిదిద్దుకుంటున్నాం. అందులో తప్పేముంది? వామపక్ష పార్టీల్లో మాది పెద్ద పార్టీ. అంతమాత్రాన మేము చెప్పిందే నడవాలనుకోవట్లేదు. అన్ని వామపక్షాలనూ సంప్రదించాకే భవిష్యత్ కార్యక్రమాన్ని రూపొందిస్తాం. ఇప్పుడున్న ఆరు పార్టీలనే కాదు మరికొన్ని పార్టీలనూ వామపక్ష ఫ్రంట్‌లోకి తేవాలనుకుంటున్నాం. అంబేడ్కర్ ఇప్పుడెందుకు గుర్తుకొచ్చారనేది అప్రస్తుతం అంబేడ్కర్ ఇప్పుడెందుకు గుర్తుకొచ్చారనేది అప్రస్తుతం. ఏ పార్టీ ఒకే రీతిలో ఉండదు. మారుతూ ఉంటుంది. మేమూ అంతే. దళితులు, ఆదివాసీలు, బలహీన వర్గాల సమస్యలపై ప్రత్యేక దృష్టిపెట్టాం. దానిలో భాగంగా అంబేడ్కర్ 125వ జయంతి ఉత్సవాలను నిర్వహించాలనుకుంటున్నాం. మా పార్టీ కేంద్రకమిటీలో దళితులు లేరనడంలో నిజం లేదు. మా పొలిట్‌బ్యూరోలో దళితులు లేనిమాట నిజం. నేను కార్యదర్శిగా ఏమి చేశాననేది అప్రస్తుతం. వెనక్కు తిరిగి చూడాలనుకోవట్లేదు.