కార్ల్‌మార్క్స్
‘చరిత్ర చరమాంకం’ భావనను దాటుకుని మానవజాతి మరో ప్రత్యామ్నాయం కోసం వెతుకుతోంది. పాశ్చాత్య దేశాధినేతలు, వారి మేధావులు, సామాన్య జనం కూడా నేడు ‘పెట్టుబడి’ గ్రం«థాన్ని చదువుతున్నారు. ఈ కోణంలో మార్క్సిజం చిరంజీవి.
కమ్యూనిజం సిద్ధాంతకారుడు కార్ల్‌మార్క్స్ జన్మిం చిన రోజు 1818, మే 5. ఈ శనివారానికి ఆయన జన్మించి 200 సంవత్సరాలు. మార్క్స్ జీవించిన 64 సంవత్సరాల కాలం యావత్తూ కార్మికవర్గ విముక్తి సిద్ధాంత సృజనకు అంకితం అయింది. 1867లో ఆయన రచించిన ‘పెట్టుబడి’ గ్రంథం మొదటి భాగం ప్రచురితమైంది. తన సహచరుడు, ఆజన్మమిత్రుడు ఫ్రెడరిక్ ఎంగెల్స్‌తో కలిసి 1847 చివరలో ‘కమ్యూనిస్టు ప్రణాళిక’ను రచించారు. సమకాలీన కమ్యూనిస్టు పార్టీలు, దేశాల చరిత్రను కార్ల్ మార్క్స్, ఎంగెల్స్, మార్క్స్ జీవిత సహచరి జెన్నీల పోరాటం, జీవితాల నుంచి వేరు చేసి చూడలేం.
నాడు పెట్టుబడిదారీ వ్యవస్థ వేళ్లూనుకుంటూ, రూపుదిద్దుకుం టున్న కాలంలోనే దాని గమ్యాన్నీ, గమనాన్నీ వివరిస్తూనే దాని పతనాన్నీ, ఆ పతనంలో శ్రామికవర్గ పాత్రను శాస్త్రీయంగా వివరించినవాడు కార్ల్‌మార్క్స్. ప్రఖ్యాత జర్మన్ తత్వవేత్త హెగెల్ సూత్రీకరణల్లోని భావవాదాన్ని దాటి చలన సూత్రాలను పదార్థం, ప్రకృతి, సమాజానికి అన్వయించడం ద్వారా తత్వశాస్త్రాన్ని కార్ల్ మార్క్స్ భూమార్గం పట్టించాడు. తద్వారా, ’తత్వవేత్తలు నేటివరకూ ప్రపంచాన్ని నిర్వచించారు. కానీ వాస్తవానికి చేయవలసింది దానినిమార్చడం’ అని మార్క్స్ ప్రకటించాడు.
మార్క్స్ సృజించిన గతితార్కిక భౌతికవాదం పదార్థం, ప్రకృతిలో జరిగే మార్పులకు కారణం వాటిలోనే అంతర్గతంగా ఉందని సూత్రీకరించింది. దాన్ని మానవ సమాజానికి వర్తించి ఆవిష్కరించింది చారిత్రక భౌతికవాదం. ఆవిధంగా వేలాది సంవత్సరాల మానవ పరిణామ చరిత్రకు కార్ల్ మార్క్స్ ఒక అర్థాన్ని సమకూర్చాడు. చరిత్ర తాలూకు గతం, వర్తమానం, భవితలను ఒడిసిపట్టిన ఆయన మానవజాతికి దాని గమ్యం, గమనాల తాలూకు పరమార్థాన్ని వివరించాడు.
మానవ చరిత్రను, దాని దశలను యావత్తూ నిర్దేశించింది ఆయా సమాజాల్లో నిక్షిప్తమై ఉన్న వర్గపోరాటం అనే అంతర్గత చలన సూత్రం అని మార్క్స్ చెప్పాడు. అంటే సమాజంలో మార్పుకు, పరిణామానికి దైవాంశ సంభూతులైన చారిత్రక వ్యక్తులో లేక యాధృచ్ఛికతో కాదనీ, అసలు కారణం ఆయా చారిత్రక దశల్లోని సమాజాల తాలూకు అంతర్గత చోదక శక్తి అయిన వర్గపోరాటాలే అని తేల్చి చెప్పాడు. కాని వర్గపోరాటమనేది మార్క్స్ లేదా కమ్యూనిస్టుల సృష్టి అని పెట్టుబడిదారులూ, దాని మేధావులూ కొట్టిపారేశారు. అయితే కాలం ఎల్లవేళలా ఒకేలా లేదు. ఉండదు కూడా.
1917లో లెనిన్ నాయకత్వాన అక్టోబర్ మహా విప్లవం జరిగింది. పెట్టుబడిదారీ దేశాలను తలదన్నే రీతిలో సోవియట్ యూనియన్‌లో సోషలిజం నిర్మాణం జరిగింది. కాగా, పలు అంతర్జాతీయ సామ్రాజ్యవాద వత్తిడులూ, అంతర్గత తప్పిదాల వలన 1990లలో సోవియట్ సోషలిస్ట్ రాజ్యం పతనం అయ్యింది. దానితో చెలరేగిపోయిన పెట్టుబడిదారీ మేధావి వర్గం, నేతలూ.. సోషలిజం పూర్వపక్షం అయిపోయింది, మార్క్స్‌కు ఏనాడో కాలం చెల్లిందంటూ పాటను అందుకున్నారు. కానీ, 2000 సం‘‘రం నాటికి ఈ కథలో తేడా రాసాగింది. సోవియట్ పతనం అనంతరం ఫ్రాన్సిస్ ఫుకుయామా వంటి మేధావులు ప్రకటించిన నయా ఉదారవాద ‘‘చరిత్ర చరమాంకం’’ కథ తలక్రిందులై మానవజాతి మరో ప్రత్యామ్నాయం కోసం వెతుకులాడటం మొదలెట్టింది. లాటిన్ అమెరికా దానికి తనదంటూ ఒక దారిని ఏర్పరుచుకోసాగింది.2008లో మొదలైన ప్రపంచ
ఆర్థిక సంక్షోభం కొట్టిన చావుదెబ్బకు యూరప్ ఆర్థిక మం త్రులు, ఫ్రెంచ్ ప్రధాని సార్కోజీ వంటి నేతలతోపాటు, లక్షలాది సామాన్య జనం, కార్ల్ మార్క్స్ రచించిన ‘‘పెట్టుబడి’’ గ్రంధాన్ని చదువుకోవడం మొదలు పెట్టారు. మార్క్స్ మళ్ళీ వచ్చాడు. వర్గపోరాటం నిజమేనంటూ ప్రపంచ పెట్టుబడిదారీ మీడియా, పత్రికలూ కూడా డాక్యుమెంటరీలూ, వ్యాసాలు రాసుకోసాగాయి. చివరకు నాటి అమెరికా అధ్యక్షుడు ఒబామా, పోప్ ఫ్రాన్సిస్‌లు కూడా సోషలిస్టులూ, కమ్యూనిస్టులుగా కనపడే మానసిక దుస్థితి దాపురించింది. కాగా, ప్రపంచ ధనవంతులు బిల్‌గేట్స్, వారన్ బఫెట్‌తో పాటుగా అమెరికన్ బిలియనీయర్లలో 3 వంతులమంది ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కనీ వినీ ఎరుగని సంక్షోభం రాబోతోందంటూ హెచ్చరికలు నేడు జారీ చేస్తున్నారు.
ప్రపంచ పెట్టుబడిదారీ చిల్లి పడవ తడబడుతోంది. అందుకే, నిన్నటి తన ప్రపంచీకరణ సిద్ధాంతాలనూ, స్వేచ్ఛా వాణిజ్యాన్ని తనే స్వయంగా తిరస్కరిస్తూ నేడు ట్రంప్ నేతృత్వంలోని అమెరికా ఉన్మాదంలోకి జారిపోతోంది. బ్రెగ్జిట్ పేరిట యూరప్ నుంచి తాను విడిపోతానంటూ బ్రిటన్ తనలోకి తను ముడుచుకుపోతోంది. అంతిమంగా సమకాలిన యుగంలో పెరిగిపోతోన్న ఆర్థిక అసమానతలూ, పేదరికం, నిరుద్యోగాలూ కార్మికులూ, కర్షకులూ, కలం శ్రామికులూ... కంప్యూటర్ కూలీలూ అందరిదీ ఒకే గమ్యం... ఒకే గమనం... అది సోషలిజమేనని రోజురోజుకూ మరింత బలంగా గుర్తు చేస్తున్నాయి. అయితే సోషలిజం లేకుంటే మరణ వేదన పడుతోన్న సామ్రాజ్యవాదపు ఉన్మాదపు పరాకాష్ఠగా అణు యుద్ధం మినహా మరో దారిలేని చరిత్ర మలుపులోకి మనం వచ్చాం. సోషలిజం వర్థిల్లు గాకా... మార్క్సిజం చిరంజీవి!!!
డి. పాపారావు
వ్యాసకర్త మార్క్సిస్ట్ విశ్లేషకులు
(మే 5న కార్ల్ మార్క్స్ 200వ జయంతి)
మొబైల్ : 9866179615
Comments
Please login to add a commentAdd a comment