సాక్షి, హైదరాబాద్: ‘కమ్యూనిస్టులు దేశంలో ఎదగలేకపోవడానికి కులం, మతం వంటి విభజన రాజకీయాలే ప్రధాన కారణం. బూర్జువా పార్టీలు కులం, మతం పేరిట ప్రజల్లో విభజన తెస్తున్నాయి. దేశంలో ముస్లింలను మూడు, నాలుగో పౌరులుగా చూస్తున్నారు. మాది వర్గపరమైన దృక్పథం. ఈ నేపథ్యంలోనే మేము రాజకీయ, సైద్ధాంతిక పోరాటం చేస్తున్నాం. మా పోరాటం ఫలితంగా ప్రజల్లో మార్పు కనిపిస్తోంది.
మేం చేస్తున్న పోరాటానికి మద్దతుగా లౌకిక ప్రజాస్వామిక శక్తులు ముందుకు రావాలి. అన్ని పార్టీలు, ప్రజలు.. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌కు వ్యతిరేకంగా ముందుకు రావాలి..’అని త్రిపుర మాజీ ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ విజ్ఞప్తి చేశారు. ‘టీఆర్‌ఎస్ ఇప్పుడు బీఆర్‌ఎస్‌గా ఏర్పాటైంది. దేశంలో బీఆర్‌ఎస్‌ను ప్రజలు గుర్తిస్తారా లేదా అన్నది వారు తీసుకునే నిర్ణయాలపైన, వారు ప్రజలను ఏ విధానాలతో కదిలిస్తారన్న దానిపై ఆధారపడి ఉంటుంది.
దానిమీదనే ఆ పార్టీ పురోగతి కూడా ఆధారపడి ఉంటుంది. బీఆర్‌ఎస్‌తో సీపీఎం పొత్తుపై స్థానిక పార్టీ, పొలిట్‌బ్యూరో కలిసి నిర్ణయం తీసుకుంటాయి..’అని ఆయన తెలిపారు. హైదరాబాద్‌లో ఎస్‌ఎఫ్‌ఐ జాతీయ మహాసభల సందర్భంగా బహిరంగ సభలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన.. ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. వివరాలు ఆయన మాటల్లోనే..
మోదీ చరిష్మా పడిపోతోంది..
చరిత్రలో వ్యక్తి చరిష్మాను కాదనలేం. కానీ మోదీ వ్యక్తిగత మేజిక్ అనేది ఇప్పుడు పోతోంది. ఆయన చరిష్మా రోజురోజుకూ పడిపోతోంది. మా పార్టీ ఉమ్మడి నిర్ణయాల మేరకే పనిచేస్తుంది. వ్యక్తులు నిర్ణయాలు తీసుకోరు. మేం సమస్యలపైన పనిచేస్తుంటాం కానీ, వ్యక్తిగత చరిష్మాపై ఆధారపడి లేము. మేం సరైన మార్గంలోనే వెళుతున్నాం. మా బలాన్ని పెంచుకుంటాం. వివిధ పార్టీలకు వివిధ రకాలైన సిద్ధాంతాలు, ఆలోచనలు, వ్యూహాలు ఉంటాయి. ఆ ప్రకారం అవి వ్యవహరిస్తుంటాయి. వారంతా బీజేపీకి వ్యతిరేకంగా ముందుకు రావాలని కోరుతున్నాం.
ఎన్నికల నాటికే కాంగ్రెస్‌తో పొత్తుపై నిర్ణయం
దేశంలో వామపక్షాల బలం పరిమితం. అయితే బీజేపీపై రాజకీయ, సైద్ధాంతిక పోరాటం చేయడంలో ముందున్నాం. విద్య, ఉపాధి, కార్మికుల హక్కుల కోసం పోరాటాలు జరుగుతూనే ఉన్నాయి. కాంగ్రెస్‌తో పొత్తు విషయం ఎన్నికల సమయంలో నిర్ణయిస్తాం. పార్లమెంటు ఎన్నికలు ఇంకా చాలా దూరంలో ఉన్నాయి. గతంలో రెండు మూడుసార్లు థర్డ్‌ఫ్రంట్‌లు ఏర్పాటయ్యాయి. అవి కూడా ఎన్నికల తర్వాతే ఏర్పాటయ్యాయి. కనీస ఉమ్మడి కార్యక్రమంతో ముందుకు వచ్చాం. అటువంటి పరిస్థితి వస్తే అప్పటి పరిస్థితిని బట్టి స్పష్టమైన నిర్ణయం తీసుకుంటాం.
త్రిపురలో క్లిష్టమైన పరిస్థితులున్నాయి...
రాబోయే కొద్ది నెలల్లో త్రిపురలో ఎన్నికలు జరగబోతున్నాయి. అయితే అక్కడ పరిస్థితులు అత్యంత క్లిష్టంగా ఉన్నాయి. అక్కడ ప్రజాస్వామ్యమే లేదు. మీడియా కూడా స్వతంత్రంగా వ్యవహరించడం లేదు. రాజ్యాంగ వ్యవస్థలను బీజేపీ ధ్వంసం చేస్తోంది. ఆర్థిక పరిస్థితి దయనీయంగా మారింది. సాధారణ ప్రజలు మరింత చితికిపోయారు. కేంద్ర ఆడిట్ సంస్థ కూడా త్రిపుర ఆర్థిక పరిస్థితిపై అసంతృప్తి వ్యక్తం చేసింది.
అవినీతి పేరుకుపోయింది. ప్రతి కుటుంబానికి ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని, ఖాళీ పోస్టులను భర్తీ చేస్తామని ఎన్నికలకు ముందు బీజేపీ హామీ ఇచ్చింది. కానీ అవేవీ నెరవేర్చలేదు. మాజీ ముఖ్యమంత్రినైన నన్నే బయటకు పోనీయడం లేదు. శాంతిభద్రతల సమస్య వస్తుందని చెబుతూ నన్ను అడ్డుకుంటున్నారు. గత 50 నెలల్లో 20–25 సార్లు నన్ను ప్రజల్లోకి వెళ్లకుండా అడ్డుకున్నారు.
అక్కడి ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. కేంద్ర ఎన్నికల కమిషన్ స్వేచ్ఛగా ఎన్నికలు జరిగేలా చూస్తే వామపక్ష పాలన మళ్లీ వస్తుంది. నేను త్రిపురలోనే ఉండటం లేదు. అంతటా తిరుగుతున్నాను. పార్టీ ఆదేశిస్తే ఎక్కడకు వెళ్లమన్నా వెళ్తాను. బెంగాల్‌లో కార్యకర్తలు పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నారు. అక్కడ పెద్ద ఎత్తున అవినీతి పేరుకుపోయి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment