manik sarkar
-
బీజేపీని ఓడిస్తేనే.. దేశం భద్రం
సాక్షి, హైదరాబాద్: బీజేపీని ఓడించకపోతే దేశానికి భద్రత లేదని త్రిపుర మాజీ సీఎం మాణిక్ సర్కార్ ఆందోళన వ్యక్తం చేశారు. దేశాన్ని రక్షించడా నికి ఎస్ఎఫ్ఐ నాయకత్వంలో విద్యార్థులు శంఖారావం పూరించాలని పిలుపునిచ్చారు. వినాశకరమైన నూతన విద్యా విధానాన్ని రద్దు చేసేలా పోరాటం చేయాలని విజ్ఞప్తి చేశారు. బలీయమైన జాతీయ ఉద్యమాన్ని నిర్మించి కొత్త విద్యా విధానాన్ని తిప్పి కొట్టాలని సూచించారు. ఎస్ఎఫ్ఐ జాతీయ మహా సభలు మంగళవారం హైదరాబాద్‌లో ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో మాణిక్ సర్కార్ మాట్లాడారు. అన్ని రంగాలూ దుర్భర స్థితిలోనే..: ‘దేశం ప్రస్తుతం క్లిష్ట పరిస్థితుల్లో, దిగజారుతున్న దశలో ఉంది. విద్య సహా అన్ని రంగాలు దుర్భర పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. ఆర్ఎస్ఎస్, బీజేపీ నియంతృత్వ కూటమి ప్రజా ప్రయోజనాలను దెబ్బతీస్తోంది. కేంద్రం విద్యారంగాన్ని ధ్వంసం చేస్తోంది. ప్రైవేటుపరం చేస్తోంది. పేద, మధ్య తరగతిని దెబ్బతీసేలా జాతీయ విద్యా విధానాన్ని తెచ్చింది. జాతీయ విద్యా విధానం బలహీన వర్గా లు, గిరిజనులు, దళితులు, మైనారిటీల ప్రయోజనాలకు తూట్లు పొడుస్తుంది. సంపన్న వర్గాల చేతుల్లోకి పోతుంది. మంగళవారం నెక్లెస్ రోడ్డులో ఎస్ఎఫ్ఐ కార్యకర్తల ర్యాలీ పేదలకు దూరం అవుతుంది. అలాగే పాఠ్యాంశాలను, సిలబస్‌ను మార్పు చేయాలని బీజేపీపై ఆర్ఎస్ఎస్ ఒత్తిడి తెస్తోంది. విద్య మౌలిక లక్ష్యం కష్టాల్లో ఉన్నవారికి తోడ్పాటునివ్వడం, శాస్త్రీయ థృక్పథాన్ని తీసుకురావడం. అందుకు విరుద్ధంగా విద్యా విధానం తెస్తున్నారు. నూతన విద్యా విధానంలో విభజన తత్వాన్ని నూరిపోస్తున్నారు. మూఢ నమ్మకాలను, సనాతనత్వాన్ని, సంప్రదాయాలను ప్రవేశపెడుతున్నారు. ఏ కోణంలో చూసినా పాఠ్యాంశాలను కలుషితం చేస్తున్నారు. స్వాతంత్య్ర పోరాటాలను వక్రీకరిస్తున్నారు..’అని మాణిక్ సర్కార్ విమర్శించారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఏమయ్యాయి? ‘దేశంలో కోట్లాదిమంది ఉద్యోగాల కోసం పరితపిస్తున్నారు. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని మోదీ 2014లో వాగ్దానం చేశారు. అలా ఇప్పటివరకు 16 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. కానీ ఇవ్వలేదు. కొత్తవి సృష్టించకపోగా ఖాళీగా ఉన్న లక్షలాది ఉద్యోగాలను భర్తీ చేయడం లేదు. నియామకాల పద్ధతినే మార్చేశారు. తాత్కాలికంగా నియమిస్తున్నారు. దీనితో నిరుద్యోగం ఎన్నడూ లేనంతగా పెరిగింది. సైన్యంలోనూ తాత్కాలిక పద్ధతిలో అగ్నిపథ్‌ను తీసుకొచ్చారు. నాలుగేళ్లు వాడుకొని వదిలేసేలా మార్చారు. దాన్ని వ్యతిరేకించాలి. పారిశ్రామిక, వ్యవసాయ రంగాలూ అలానే ఉన్నాయి. కార్మికులకు జీతాలు, హక్కులు లేవు. కార్మికుల 42 హక్కులను కాలరాశారు..’అని చెప్పారు. మతాల మధ్య చిచ్చు... ‘బీజేపీ ప్రభుత్వం హిందువులు, ముస్లింలు, క్రైస్తవుల మధ్య వైషమ్యాలను పెంచుతోంది. ప్రజాస్వామ్య, పౌర హక్కులను కాలరాస్తోంది. రాజ్యాంగాన్ని భ్రష్టు పట్టిస్తోంది. వ్యవస్థను భగ్నం చేసే కుట్రకు పాల్పడుతోంది. ప్రజల మీద దాడులు చేస్తోంది. రాజ్యాంగాన్ని, న్యాయవ్యస్థను, ఎన్నికల కమిషన్‌ను తన గుప్పిట్లో పెట్టుకొని ప్రజాస్వామ్యాన్ని కాలరాయాలని చూస్తోంది. ఈ పరిస్థితుల్లో విద్యార్థులే దేశాన్ని కాపాడుకోవాలి..’మాణిక్ సర్కార్ పిలుపునిచ్చారు. రైతులు, కార్మికులు, దళితులు ఇలా అన్ని వర్గాల ప్రజల కోసం విద్యార్థులు పోరాడాలన్నారు. ఎస్ఎఫ్ఐ మహాసభల్లో ఈ అంశాలపై చర్చించాలని సూచించారు. -
కులం, మతంతో ప్రజల్లో విభజన
సాక్షి, హైదరాబాద్: ‘కమ్యూనిస్టులు దేశంలో ఎదగలేకపోవడానికి కులం, మతం వంటి విభజన రాజకీయాలే ప్రధాన కారణం. బూర్జువా పార్టీలు కులం, మతం పేరిట ప్రజల్లో విభజన తెస్తున్నాయి. దేశంలో ముస్లింలను మూడు, నాలుగో పౌరులుగా చూస్తున్నారు. మాది వర్గపరమైన దృక్పథం. ఈ నేపథ్యంలోనే మేము రాజకీయ, సైద్ధాంతిక పోరాటం చేస్తున్నాం. మా పోరాటం ఫలితంగా ప్రజల్లో మార్పు కనిపిస్తోంది. మేం చేస్తున్న పోరాటానికి మద్దతుగా లౌకిక ప్రజాస్వామిక శక్తులు ముందుకు రావాలి. అన్ని పార్టీలు, ప్రజలు.. బీజేపీ, ఆర్ఎస్ఎస్కు వ్యతిరేకంగా ముందుకు రావాలి..’అని త్రిపుర మాజీ ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ విజ్ఞప్తి చేశారు. ‘టీఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్గా ఏర్పాటైంది. దేశంలో బీఆర్ఎస్ను ప్రజలు గుర్తిస్తారా లేదా అన్నది వారు తీసుకునే నిర్ణయాలపైన, వారు ప్రజలను ఏ విధానాలతో కదిలిస్తారన్న దానిపై ఆధారపడి ఉంటుంది. దానిమీదనే ఆ పార్టీ పురోగతి కూడా ఆధారపడి ఉంటుంది. బీఆర్ఎస్తో సీపీఎం పొత్తుపై స్థానిక పార్టీ, పొలిట్‌బ్యూరో కలిసి నిర్ణయం తీసుకుంటాయి..’అని ఆయన తెలిపారు. హైదరాబాద్‌లో ఎస్ఎఫ్ఐ జాతీయ మహాసభల సందర్భంగా బహిరంగ సభలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన.. ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. వివరాలు ఆయన మాటల్లోనే.. మోదీ చరిష్మా పడిపోతోంది.. చరిత్రలో వ్యక్తి చరిష్మాను కాదనలేం. కానీ మోదీ వ్యక్తిగత మేజిక్ అనేది ఇప్పుడు పోతోంది. ఆయన చరిష్మా రోజురోజుకూ పడిపోతోంది. మా పార్టీ ఉమ్మడి నిర్ణయాల మేరకే పనిచేస్తుంది. వ్యక్తులు నిర్ణయాలు తీసుకోరు. మేం సమస్యలపైన పనిచేస్తుంటాం కానీ, వ్యక్తిగత చరిష్మాపై ఆధారపడి లేము. మేం సరైన మార్గంలోనే వెళుతున్నాం. మా బలాన్ని పెంచుకుంటాం. వివిధ పార్టీలకు వివిధ రకాలైన సిద్ధాంతాలు, ఆలోచనలు, వ్యూహాలు ఉంటాయి. ఆ ప్రకారం అవి వ్యవహరిస్తుంటాయి. వారంతా బీజేపీకి వ్యతిరేకంగా ముందుకు రావాలని కోరుతున్నాం. ఎన్నికల నాటికే కాంగ్రెస్‌తో పొత్తుపై నిర్ణయం దేశంలో వామపక్షాల బలం పరిమితం. అయితే బీజేపీపై రాజకీయ, సైద్ధాంతిక పోరాటం చేయడంలో ముందున్నాం. విద్య, ఉపాధి, కార్మికుల హక్కుల కోసం పోరాటాలు జరుగుతూనే ఉన్నాయి. కాంగ్రెస్‌తో పొత్తు విషయం ఎన్నికల సమయంలో నిర్ణయిస్తాం. పార్లమెంటు ఎన్నికలు ఇంకా చాలా దూరంలో ఉన్నాయి. గతంలో రెండు మూడుసార్లు థర్డ్ఫ్రంట్లు ఏర్పాటయ్యాయి. అవి కూడా ఎన్నికల తర్వాతే ఏర్పాటయ్యాయి. కనీస ఉమ్మడి కార్యక్రమంతో ముందుకు వచ్చాం. అటువంటి పరిస్థితి వస్తే అప్పటి పరిస్థితిని బట్టి స్పష్టమైన నిర్ణయం తీసుకుంటాం. త్రిపురలో క్లిష్టమైన పరిస్థితులున్నాయి... రాబోయే కొద్ది నెలల్లో త్రిపురలో ఎన్నికలు జరగబోతున్నాయి. అయితే అక్కడ పరిస్థితులు అత్యంత క్లిష్టంగా ఉన్నాయి. అక్కడ ప్రజాస్వామ్యమే లేదు. మీడియా కూడా స్వతంత్రంగా వ్యవహరించడం లేదు. రాజ్యాంగ వ్యవస్థలను బీజేపీ ధ్వంసం చేస్తోంది. ఆర్థిక పరిస్థితి దయనీయంగా మారింది. సాధారణ ప్రజలు మరింత చితికిపోయారు. కేంద్ర ఆడిట్ సంస్థ కూడా త్రిపుర ఆర్థిక పరిస్థితిపై అసంతృప్తి వ్యక్తం చేసింది. అవినీతి పేరుకుపోయింది. ప్రతి కుటుంబానికి ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని, ఖాళీ పోస్టులను భర్తీ చేస్తామని ఎన్నికలకు ముందు బీజేపీ హామీ ఇచ్చింది. కానీ అవేవీ నెరవేర్చలేదు. మాజీ ముఖ్యమంత్రినైన నన్నే బయటకు పోనీయడం లేదు. శాంతిభద్రతల సమస్య వస్తుందని చెబుతూ నన్ను అడ్డుకుంటున్నారు. గత 50 నెలల్లో 20–25 సార్లు నన్ను ప్రజల్లోకి వెళ్లకుండా అడ్డుకున్నారు. అక్కడి ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. కేంద్ర ఎన్నికల కమిషన్ స్వేచ్ఛగా ఎన్నికలు జరిగేలా చూస్తే వామపక్ష పాలన మళ్లీ వస్తుంది. నేను త్రిపురలోనే ఉండటం లేదు. అంతటా తిరుగుతున్నాను. పార్టీ ఆదేశిస్తే ఎక్కడకు వెళ్లమన్నా వెళ్తాను. బెంగాల్లో కార్యకర్తలు పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నారు. అక్కడ పెద్ద ఎత్తున అవినీతి పేరుకుపోయి ఉంది. -
ఎన్నికల వ్యూహంపై చర్చిస్తాం
సాక్షి, హైదరాబాద్: మూడు రోజులపాటు కొనసాగే సీపీఎం కేంద్ర కమిటీ సమావేశాలు శుక్రవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞానకేంద్రంలో ప్రారంభమయ్యాయి. సమావేశాలకు ఆ పార్టీ ప్రధానకార్యదర్శి సీతారాం ఏచూరి, కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్, త్రిపుర మాజీ సీఎం మాణిక్ సర్కార్, పొలిట్ బ్యూరో సభ్యులు ప్రకాశ్ కారత్, బీవీ రాఘవులు, బృందాకారత్‌తోపాటు మిగతా పొలిట్‌బ్యూరో, కేంద్ర కమిటీ సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా తనను కలిసిన విలేకరులతో ఏచూరి మాట్లాడుతూ తమ పార్టీ అఖిల భారత మహాసభలను ఏప్రిల్‌లో కేరళలోని కన్నూర్‌లో నిర్వహిస్తామన్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న కేంద్ర కమిటీ సమావేశాల్లో రాజకీయ ముసాయిదాపై చర్చిస్తామని, అనంతరం ప్రజలకు విడుదల చేస్తామని చెప్పారు. దీనికి సంబంధించిన సూచనలు, సవరణలు, అభిప్రాయాలను తమ పార్టీ సభ్యులందరూ కేంద్ర కమిటీకి తెలపొచ్చని అన్నారు. ఇందుకోసం నెలరోజుల గడువు ఇస్తామని, ఇది సీపీఎం అంతర్గత ప్రజాస్వామ్యమని వివరించారు. సవరణల అనంతరం అఖిల భారత మహాసభలో రాజకీయ నివేదికను ప్రవేశపెడతామని తెలిపారు. త్వరలో జరగబోయే రాష్ట్రాల ఎన్నికల్లో అనుసరించబోయే వ్యూహంపై కూడా కేంద్ర కమిటీలో చర్చిస్తామని ఏచూరి ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ తెలంగాణ మలయాళీ అసోసియేషన్ శనివారం హైదరాబాద్‌లో నిర్వహించతలపెట్టిన సభ కోవిడ్ నిబంధనల దృష్ట్యా రద్దయిందని, అయితే ఇక్కడి కేరళవాసులు విజ్ఞప్తి మేరకు అదే రోజు సాయంత్రం ఆరు గంటలకు కేరళ సీఎం పినరయి విజయన్ వర్చువల్ పద్ధతిలో ప్రసంగించనున్నారని తెలిపారు. -
కేసీఆర్‌కు ఓటేస్తే మోదీకి వేసినట్టే.. : మాణిక్ సర్కార్
సాక్షి, ఖమ్మంమయూరిసెంటర్: ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబించడంలో, అవినీతిల కేసీఆర్‌కు.. మోదీ ఆదర్శమన్నట్లు వ్యవహరించారని, కేసీఆర్‌కు ఓటేస్తే.. మోదీకి ఓటు వేసినట్లేనని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు, త్రిపుర మాజీ ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ అన్నారు. ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గ బీఎల్ఎఫ్ అభ్యర్థి పాల్వంచ రామారావు గెలుపును కాంక్షిస్తూ నగరంలోని వర్తక సంఘం భవనంలో ఆదివారం ఎన్నికల బహిరంగ సభ నిర్వహించారు. సభకు ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ మోదీ పాలనలో పెట్రోల్, డీజిల్ ధరలకు, ప్రజల నిత్యావసర వస్తువుల ధరలకు అడ్డూ అదుపులేకుండా పోయిందని అన్నారు. రూపాయి విలువ పతనం దేశచరిత్రలో క్షీణదశకు చేరుకుందని పేర్కొన్నారు. వ్యవసాయం అత్యంత సంక్షోభానికి చేరుకుందని, ఆత్మహత్యలు విపరీతంగా పెరిగాయని ఆవేదన వ్యక్తంచేశారు. నోట్ల రద్దుతో కోటి మంది ప్రత్యక్షంగా.. పరోక్షంగా ఉపాధి కోల్పోయారని, దేశంలో సన్న, చిన్న వ్యాపారులు తీవ్ర నష్టాన్ని చవిచూశారని చెప్పారు. మోదీ పాలనలో సుప్రీంకోర్టు, సీబీఐ, ఆర్బీఐ, ఎన్నికల కమిషన్, విశ్యవిద్యాలయాలు, ఆర్డినెన్స్‌లలో జ్యూడిషియరీ, నాన్ జ్యూడిషియరీ వ్యవస్థలన్నీ తమ స్వతంత్రతను కోల్పోయాయన్నారు. రాష్ట్రాల హక్కులను హరించారని ఆరోపించారు. ఈ విధానాల అమలు అన్నింటిలో కేంద్ర నిర్ణయానికి కేసీఆర్ మద్దతుగా నిలిచి భాగస్వామి అయ్యారని, కేంద్రానికి కేసీఆర్ అనుచరుడిగా మిగిలారని అన్నారు. సామాజిక న్యాయం.. సమగ్రాభివృద్ధి కోరుకునే బీఎల్ఎఫ్కి ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు యర్రా శ్రీకాంత్, జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, డాక్టర్ రవీంద్రనా«థ్ నాయకులు కల్యాణం వెంకటేశ్వరరావు, అఫ్రోజ్ సమీనా, యర్రా శ్రీనివాసరావు, వై.విక్రమ్, తుశాకుల లింగయ్య, బండారు రమేష్, జబ్బార్, మీరా, దొంగల తిరుపతిరావు, నవీన్‌రెడ్డి, వీరభద్రం, పెరుగు వెంకటరమణ యాదవ్, లతీఫ్, పెల్లూరి విజయ్‌కుమార్, బండారు యాకయ్య, వజినేపల్లి శ్రీనివాసరావు, బండారు వీరబాబు, యర్రా గోపి, భూక్యా శ్రీనివాసరావు, యర్రా సుకన్య, నాగసులోచన, మద్ది సత్యం, సైదులు, బజ్జూరి రమణారెడ్డి, సుధీర్ తదితరులు పాల్గొన్నారు. మరిన్ని వార్తాలు... -
ప్రచారానికి లెఫ్ట్ అగ్రనేతలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారానికి ఉభయ కమ్యూనిస్టు పార్టీల అగ్రనేతలు వస్తున్నారు. సీపీఎం, బీఎల్ఎఫ్ కూటమి పక్షాన ప్రచార కార్యక్రమాల్లో సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, త్రిపుర మాజీ సీఎం మాణిక్ సర్కార్ తదితరులు పాల్గొంటారు. ఈ నెల 29న మహబూబ్‌నగర్, 30న జుక్కల్, చెన్నూరు ఎన్నికల ప్రచారసభల్లో డా.బీఆర్ అంబేడ్కర్ మనవడు ప్రకాశ్ అంబేడ్కర్ ప్రసంగిస్తారు. డిసెంబర్ 3న మహబూబాబాద్, ఖమ్మం, 4న మిర్యాలగూడ, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాల్లో ఏచూరి ప్రచారం చేస్తా రు. డిసెంబర్ 1న ఉమ్మడి ఖమ్మం జిల్లాలో, 2న కోదాడ, హుజూర్నగర్, 3న జనగామ నియోజకవర్గ ప్రచారంలో మాణిక్ సర్కార్ పాల్గొంటారు. సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు 30న భద్రాచలం, 1న ఖమ్మం జిల్లా, 2న గద్వాల, 3న నిజామాబాద్‌లో రెండో విడత ప్రచారాన్ని నిర్వహిస్తారు. మహిళానేత బృందాకారత్ కూడా రెండో విడత ప్రచారం చేస్తారు. మూడు చోట్ల సీపీఐ ప్రచారం.. కాంగ్రెస్ ప్రజాఫ్రంట్ కూటమిలో భాగస్వామ్య పక్షంగా మూడు సీట్లలో పోటీచేస్తున్న సీపీఐ అభ్యర్థుల తరఫున ఆ పార్టీ జాతీయ ›ప్రధాన కార్య దర్శి సురవరం సుధాకర్‌రెడ్డి, జాతీయ కార్యదర్శి కె.నారాయణ ప్రచారం నిర్వహించనున్నారు. డిసెంబర్ మొదటి వారంలో 3 నియోజకవర్గాల పరిధిలో సురవరం ప్రచారం చేస్తారు. ఈ నెల చివరి వారంలో పార్టీ పోటీ చేస్తున్న చోట్ల నారాయణ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. -
సీఎం ఉన్నా.. మోదీ పాలనే
సాక్షి, న్యూఢిల్లీ : త్రిపురలో పాతికేళ్ల వామపక్ష ప్రభుత్వంలో ఎప్పుడూ మూక దాడులు జరిగిన ఘటనలు చోటుచేసుకోలేదని త్రిపుర మాజీ సీఎం మాణిక్ సర్కార్ పేర్కొన్నారు. కనీసం ఏడాది కూడా ముగియకముందే రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం దాడులకు పాల్పడి, ప్రజలను భయాందోళనకు గురిచేస్తోందని మండిపడ్డారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలుచేయడంలో బీజేపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని, తన వైఫల్యాల నుంచి తప్పించుకునేందుకే ఈ దాడులకు పాల్పడుతోందని మాణిక్ ఆరోపించారు. ఢిల్లీలో వామపక్షల ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన ‘ప్రజాస్వామ్య హత్య’ నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘దేశ వ్యాప్తంగా బీజేపీ గోరక్షణ పేరుతో అమాయక ప్రజలపై దాడులకు పాల్పడుతోంది. పాతికేళ్ల వామపక్ష ప్రభుత్వంలో త్రిపురలో ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోలేదు. హిందుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన ప్రతి ఒక్కరిని ప్రభుత్వం టార్గెట్ చేస్తోంది. మైనార్టీ, దళితులకు దేశంలో రక్షణ లేదు. ప్రతీక్షణం భయం, భయంగా బతుకుతున్నారు. మూక దాడులు అనేవి ప్రభుత్వం చేస్తున్న గొప్ప కుట్ర. త్రిపురలో సీఎం ఉన్నా.. అక్కడ సాగేది మోదీ పాలనే’ అని అన్నారు. -
నేటి నుంచే ‘ఎర్ర పండుగ’
సాక్షి, హైదరాబాద్ : భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) 22వ జాతీయ మహాసభలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. హైదరాబాద్ ఆర్టీసీ కల్యాణ మండలం వేదికగా జరిగే ఈ ఐదు రోజుల సభల్లో పార్టీ పటిష్టత, రాజకీయ విధానాలపై చర్చించి భావి కార్యాచరణ రూపొందించనున్నారు. సీపీఎం రాజకీయ పంథాపైనా నిర్ణయం తీసుకుంటారు. పశ్చిమబెంగాల్, త్రిపుర రాష్ట్రాల్లో తాము అధికారం కోల్పోవడం, ప్రాంతీయ పార్టీలతో సంబంధాలు, ఫెడరల్ ఫ్రంట్ తదితరాలపైనా చర్చ జరగనుంది. పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, అగ్రనేతలు ప్రకాశ్‌కారత్, మాణిక్ సర్కార్, కేరళ సీఎం పినరయి విజయన్, రాష్ట్రం నుంచి 35 మందితో సహా 846 మంది ప్రతినిధులు సభల్లో పాల్గొంటారు. షెడ్యూల్ ఇదే.... వరుసగా రెండోసారి తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న సీపీఎం జాతీయ మహాసభలకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. బుధవారం ఉదయం పదింటికి ఆర్టీసీ కల్యాణమండపంలో ‘మహ్మద్ అమీన్ నగర్’ప్రాంగణంలో పార్టీ పతాకావిష్కరణతో సభలు ప్రారంభమవుతాయి. తర్వాత ఏచూరి సందేశం, సీపీఐ, సీపీఐ(ఎంఎల్,) ఫార్వర్డ్‌బ్లాక్, ఆర్ఎస్పీ, ఎస్‌యూసీఐ (సీ) నేతల సౌహార్ద సందేశాలు, కార్యదర్శి నివేదిక ఉంటాయి. 19, 20, 21 తేదీల్లో ప్రతినిధుల సభలో పార్టీ రాజకీయ విధానంతో పాటు తీర్మానాలపై చర్చిస్తారు. 22న కొత్త కమిటీని ఎన్నుకుంటారు. అదే రోజు మలక్‌పేట టీవీ టవర్ నుంచి సభ జరిగే సరూర్‌నగర్ స్టేడియం దాకా 20 వేల మంది రెడ్‌షర్ట్ వలంటీర్లతో కవాతు జరుగుతుంది. సభకు జాతీయ నేతలు హాజరవుతారు. సభలు జరిగే ఆర్టీసీ కల్యాణమండపం పరిసరాలు ఎర్రజెండాలు, తోరణాలు, పోస్టర్లతో ఇప్పటికే ఎరుపెక్కాయి. తెలంగాణ సంస్కృతి, సాయుధ పోరాటం తదితరాలు ప్రతిబింబించే కళారూపాలనూ ఏర్పాటు చేశారు. మహాసభల్లో 25 అంశాలపై తీర్మానాలుంటాయని పార్టీ వర్గాలంటున్నాయి. మంగళవారం పార్టీ పొలిట్‌బ్యూరో, కేంద్ర కమిటీ సమావేశమై మహాసభల ఎజెండాను ఆమోదించాయి. రాజకీయ, నిర్మాణ నివేదికలపై చర్చిస్తాం ‘‘పార్టీ జాతీయ మహాసభల్లో రాజకీయ తీర్మానం, రాజకీయ, నిర్మాణ నివేదికలపై చర్చ జరుగుతాయి. బీజేపీని ఓడించడమే మా ప్రధాన లక్ష్యం. కాంగ్రెస్‌తో పొత్తు, అవగాహన ఉండవు. తెలంగాణలో బీఎల్ఎఫ్ బలోపేతంపై చర్చిస్తాం. మహాసభలకు సర్వం సిద్ధం చేశాం.’ – సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం -
ఏచూరీయే.. లేదంటే చీలికే?
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: సీపీఎం ప్రధాన కార్యదర్శిగా సీతారాం ఏచూరీకి మరోసారి అవకాశం దక్కుతుందా? లేదా అనేదానిపై కామ్రేడ్లలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇప్పటికే సీతారాం అనుకూల, వ్యతిరేక వర్గాలు తమ వ్యూహాలకు పదును పెడుతుంటే మరో వర్గం.. త్రిపుర మాజీ సీఎం మాణిక్ సర్కార్ పేరును తెరపైకి తెచ్చింది. దీంతో ఈ నెల 18 నుంచి 22 వరకు ఐదు రోజులపాటు హైదరాబాద్‌లో జరగనున్న సీపీఎం జాతీయ కాంగ్రెస్ సమావేశాలు ఆసక్తికరంగా మారాయి. సమావేశాల చివరిరోజైన ఏప్రిల్ 22న కొత్త ప్రధాన కార్యదర్శి పేరును అధికారికంగా ప్రకటించనున్నట్లు ఢిల్లీలోని సీపీఎం ప్రధాన కార్యాలయం వెల్లడించింది. ఏచూరీ వర్సెస్ కారత్ : పుచ్చలపల్లి సుందరయ్య మొదలుకుని ఈఎంఎస్ నంబూద్రిపాద్, హరికిషన్ సింగ్ సుర్జిత్, ప్రకాశ్ కారత్ వరకు అందరూ కనీసం మూడు పర్యాయాలు ప్రధాన కార్యదర్శిగా కొనసాగారు. ఇదే సంప్రదాయం ప్రకారం.. సీతారాం ఏచూరీయే మరోసారి ఈ బాధ్యతలు చేపట్టే అవకాశాలూ లేకపోలేదు. కానీ పార్టీ బలంగా ఉన్న బెంగాల్, కేరళ గ్రూపుల్లో స్పష్టమైన విభేదాలు పొడసూపాయి. దీనికి తోడు మాజీ ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కారత్, సీతారాం ఏచూరీ మధ్య కొంతకాలంగా అంతర్గత పోరు నడుస్తోంది. ఎన్నికలు అనివార్యమేనా..! ప్రకాశ్ కారత్కు కేరళ సీఎం పినరయి విజయన్ నుంచి బలమైన మద్దతుంది. దీనికితోడు పలు రాష్ట్రాల కామ్రెడ్లూ కారత్ వెంటే ఉన్నామంటున్నారు. 16 మంది సభ్యులున్న పొలిట్ బ్యూరో, 85 మంది సభ్యులున్న సెంట్రల్ కమిటీల్లో కారత్‌కే బలమైన మద్దతుంది. అయితే, ఏచూరీకి బలమైన మద్దతు లేదు. దీనికి తోడు, బీజేపీని ఓడించేందుకు కాంగ్రెస్‌తో కలిసిపనిచేయటమే మంచిదని మొదట్నుంచీ ఈయన చెబుతూ వస్తున్నారు. ఈ నిర్ణయాన్ని కారత్, ఆయన మద్దతుదారులు వ్యతిరేకిస్తున్నారు. బెంగాల్ కామ్రెడ్లు మాత్రం ఏచూరీ ఆలోచన నేటి పరిస్థితులకు తగ్గట్లుగా ఉందని.. కారత్ వ్యూహం స్టాలిన్ కాలం నాటి ఆలోచన అని అంటున్నారు. 21నాటి సమావేశంలో పార్టీ సెంట్రల్ కమిటీయే కొత్త ప్రధాన కార్యదర్శిపై నిర్ణయం తీసుకోనుంది. ఏచూరీ కాకుండా మరెవరైనా ఆసక్తి కనబరిస్తే.. ఎన్నికలు అనివార్యమే. ఏచూరీయే.. లేదంటే చీలికే? మరోవైపు ఏచూరీ, కారత్‌ల వ్యతిరేక వర్గం త్రిపుర మాజీ సీఎం మాణిక్ సర్కార్‌ను తెరపైకి తెచ్చేందుకు యోచిస్తోంది. అటు మహిళలకు ఈసారి ప్రధాన కార్యదర్శి పదవి ఇవ్వాలనే చర్చ కూడా పార్టీలో జరుగుతుంది. అదే జరిగితే.. ప్రకాశ్ కారత్ భార్య బృందా కారత్ ఒక్కరే పోటీదారు. పలువురి పేర్లు ప్రధాన కార్యదర్శి పదవికోసం తెరపైకి వస్తున్నప్పటికీ.. ఏచూరీకి మరోసారి అవకాశం ఇవ్వని పక్షంలో పార్టీలో భారీ చీలిక తప్పదనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి. -
మాణిక్ సర్కార్ (మాజీ సీఎం) రాయని డైరీ
ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. త్రిపుర కొత్త సీఎం విప్లవ్ కుమార్ కుదురుగా ఒకచోట కూర్చోకుండా డయాస్ మీద లెఫ్ట్ నుంచి రైట్కి, రైట్ నుంచి లెఫ్ట్‌కి కలియదిరుగుతున్నాడు. నవ్వుతున్నాడు. నమస్తే పెడుతున్నాడు. ఎవరైనా అడ్డొస్తే, వాళ్లని చూసీ నవ్వుతున్నాడు, నమస్తే పెడుతున్నాడు. అంతే తప్ప ‘తప్పుకోండి’ అని మాత్రం అనడం లేదు. అలా నవ్వుతూ, నమస్తే పెడుతూ తప్పించడం బాగుంది! డయాస్ మీద నేనూ ఓ పక్కగా కూర్చొని ఉన్నాను. నా పక్కనే లెఫ్ట్‌లో అద్వానీ, రైట్లో మురళీమనోహర్ జోషీ కూర్చొని ఉన్నారు. అద్వానీ పక్కన రాజ్‌నాథ్ సింగ్ ఉన్నారు. ఇంకో వరుసలో నరేంద్ర మోదీ, అమిత్‌షా, రామ్ మాధవ్ ఉన్నారు. వాళ్ల వెనకే బీజేపీ రాష్ట్రాల సీఎంలు ఉన్నారు. బీజేపీ వాళ్లను అంత దగ్గరగా చూడ్డం అదే మొదటిసారి నాకు! విప్లవ్ కుమార్ మేమున్న వరుస వైపు వస్తున్నాడు. నవ్వుకుంటూ, నమస్తే పెట్టుకుంటూ వస్తున్నాడు. నెక్స్›్ట అతడు అద్వానీకో, జోషీకో, రాజ్నాథ్కో నమస్తే పెడతాడనుకున్నాను. కానీ నాకు పెట్టాడు! జోషీ ఆకాశంలోకి, అద్వానీ అగాధంలోకి, రాజ్‌నాథ్.. ఆకాశానికీ, అగాధానికీ మధ్య ఉన్న ఏదో ప్లేస్‌లోకి ముఖం తిప్పుకుని కూర్చున్నారు. అందుకే విప్లవ్ కుమార్ నాకు నమస్తే పెట్టి ఉంటాడనుకున్నాను. నమస్తే పెట్టాక, సడన్‌గా కిందికి వంగాడు విప్లవ్ కుమార్. జోషీకో, అద్వానీకో, రాజ్నాథ్కో పాదాభివందనం చేయబోతున్నాడని అనుకున్నాను. కానీ నాకు చేశాడు! జోషీ, అద్వానీ, రాజ్‌నాథ్‌ల ముఖాలు అందుబాటులో లేకపోవచ్చు. వాళ్ల పాదాలైతే అందుబాటులోనే ఉన్నాయి కదా! మరి నాకెందుకు పాదాభివందనం చేసినట్టు?! ‘‘నన్ను దీవించండి మాణిక్‌జీ’’ అన్నాడు విప్లవ్‌కుమార్. భుజాలు పట్టుకుని పైకి లేపాను. ‘‘నాకు మీ బ్లెస్సింగ్ కావాలి మాణిక్‌జీ’’ అన్నాడు మళ్లీ. ‘‘నేనేమి ఇవ్వగలను విప్లవ్. ఇరవై ఏళ్లుగా నేను ఏమీ ఇవ్వలేదనే కదా నిన్ను ఎన్నుకున్నారు త్రిపుర ప్రజలు’’ అన్నాను. ‘‘ఎప్పుడైనా నాకు డౌట్లు వస్తే మీకు ఫోన్ చేస్తాను మాణిక్‌జీ. అప్పుడు మీరు నా ఫోన్ లిఫ్ట్ చెయ్యాలి’’ అన్నాడు. ‘‘డౌట్లు అడగటానికి మీ మోదీజీ, మీ అమిత్జీ ఉన్నారు కదా విప్లవ్’’ అన్నాను. ‘‘వాళ్లే చెప్పారు మాణì క్జీ.. ముందుగా పెద్దల్ని గౌరవించాలని’’ అన్నాడు, మళ్లీ కాళ్ల మీద పడబోతూ. వద్దొద్దన్నాను. బీజేపీలో ఇదొకటి బాగుంటుంది. ఫామ్‌లో లేని పెద్దల్ని గౌరవించడం! - మాధవ్ శింగరాజు -
సీఎం నివాసంలో అస్తిపంజరం ; మళ్లీ కలకలం
అగర్తలా : త్రిపుర అభివృద్ధిబాటలో మాణిక్ సర్కార్‌ను కూడా కలుపుకొని వెళతామంటూనే.. ఆయనను ఇరుకునపెట్టే ప్రయత్నాలను ముమ్మరం చేసింది బీజేపీ! కాషాయదళం విజయానికి కారకుడైన సునీల్ దేవ్‌ధర్ శనివారం పేల్చిన ఓ ట్వీట్.. రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ‘‘త్రిపుర ముఖ్యమంత్రి విప్లవ్ దేవ్‌కు నాదొక విన్నపం.. అధికారిక నివాసాల్లోకి చేరబోయేముందు అక్కడి సెప్టిక్ ట్యాంకులను ఓ సారి శ్రుభ్రం చేయించండి. గతంలో మాణిక్ సర్కార్ నివాసంలో మహిళ అస్తిపంజరం లభించిన అనుభవం దృష్ట్యా మీరీ పని తప్పక చెయ్యాలి..’ అని దేవ్‌ధర్ కామెంట్ చేశారు. సీఎం నివాసంలో అస్తిపంజరమా? : అగర్తలాలోని ముఖ్యమంత్రి అధికారిక నివాసంలో మాణిక్ సర్కార్ 1998 నుంచి మొన్నటిదాకా ఉన్నారు. కాగా, 2005 జనవరి4న ఆ అధికారిక నివాసంలోని సెప్టిక్ ట్యాంకులో ఓ మహిళ అస్తిపంజరం బయటపడటం అప్పట్లో పెను సంచలనాన్ని సృష్టించింది. సెప్టిక్ ట్యాంకును శుభ్రం చేయడానికి వచ్చిన మున్సిపల్ సిబ్బంది దానిని గుర్తించారు. ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న మాణిక్ సర్కార్ కేసును సీఐడీకి అప్పగించారు. ఆ తర్వాత అది సీబీఐకి బదిలీ అయింది. 13ఏళ్లు గడుస్తున్నప్పటికీ ఆ కేసు ఇంకా కొలిక్కిరాకపోవడంతో పలు విమర్శలకు తావిచ్చినట్లైంది. ‘ఇది మాణిక్ నియంత పాలనకు నిదర్శనమని’ సీపీఎం ప్రత్యర్థులు ఆరోపిస్తారు. ఇప్పుడు ఉన్నపళంగా సునీల్ దేవ్‌ధర్ ‘అస్తి పంజరం’ ఉదంతాన్ని కోట్ చేస్తూ ట్వీట్ చేయడం వ్యూహంలో భాగమా, లేక యాదృశ్చికమా తెలియాల్సిఉంది. ఇంతకీ ఆ స్కెలిటన్ ఎవరిది? : సీఎం నివాసంలోని సెప్టిక్ ట్యాంక్‌లో తేలిన అస్తిపంజరం ఎవరిదనేదానిపై త్రిపురలో భిన్నకథనాలు ప్రచారంలో ఉన్నాయి. నేపాల్‌కు చెందిన పని అమ్మాయిని.. సీఎం సిబ్బందిలో ఒకరు లేదా కొందరు అత్యాచారం చేసి, హతమార్చి ఉంటారని నాటి కాంగ్రెస్ నేత సమీర్ రాజన్ బర్మన్ ఆరోపించారు. హత్యాచారం కేసును తొక్కిపెట్టేక్రమంలో మృతురాలి కుటుంబాన్ని బలవంతంగా నేపాల్‌కు పంపించేశారని ఆయన పేర్కొన్నారు. మాణిక్ సర్కార్‌పై దినేశ్ కాంజీ అనే రచయిత రాసిన ‘మాణిక్ సర్కార్ : ది రియల్ అండ్ వర్చువల్’ అనే పుస్తకంలోనూ అస్తిపంజరం వ్యవహారాన్ని ప్రస్తావించారు. ‘‘అప్పట్లో జాతీయ స్థాయి మీడియాలో సైతం చర్చనీయాంశమైన ఈ కేసులో బర్మన్(కాంగ్రెస్ నేత) ఆరోపణలను ఏఒక్కరూ పట్టించుకోకపోవడం కొంత ఆశ్చర్యం అనిపిస్తుంద’ని రచయిత రాసుకొచ్చారు. దేవ్‌ధర్ తాజా ట్వీట్‌పై సీపీఎం శ్రేణులు ఇంకా స్పందించాల్సిఉంది. I request @BjpBiplab, new CM of Tripura, to get septic tanks of all minister quarters cleaned before occupying them. It should be recollected that a woman’s skeleton was found in septic tank of Ex CM Manik Sarkar's quarter on Jan 4, 2005 but the case was deliberately suppressed. — Sunil Deodhar (@Sunil_Deodhar) 10 March 2018 -
మాణిక్తో కలిసి పనిచేస్తాం: బీజేపీ నేత
ఆగర్తల: వామపక్షాలకు, బీజేపీకి సిద్ధాంతపరమైన వైరుధ్యం తప్ప ఎలాంటి విబేధాలు లేవని, అభివృద్ధి కోసం మాణిక్ సర్కార్ లాంటి సీనియర్ నాయకులతో కలిసి పనిచేస్తామని బీజేపీ సీనియర్ నేత రాంమాధవ్ అన్నారు. ఇరవైయేళ్ల పాటు రాష్ట్రాన్ని అప్రతిహాతంగా ఏలిన మాణిక్ ప్రభుత్వంపై బీజేపీ సంచలనం విజయం సాధించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలోని 60 స్థానాల్లో 43 కైవసం చేసుకుని వామపక్ష కంచుకోటపై కాషాయ జెండా ఎగరవేసింది. నూతన ముఖ్యంమంత్రి విప్లవ్‌దేవ్ ప్రమాణ స్వీకారానికి మాజీ సీఎం మాణిక్‌సర్కార్ ను స్వయంగా రాం మాధవ్ వెళ్లి ఆహ్వానించారు. రాష్ట అభివృద్ధికి ముఖ్యమంత్రిగా 20 ఏళ్ల అనుభవం కలిగిన మాణిక్ లాంటి నిరాడంబరమైన వ్యక్తితో కలిసి పనిచేస్తామని మాధవ్ తెలిపారు. ఈ ఏడాది దేశంలో జరుగనున్న ఎన్నికలకు త్రిపుర విజయం ఎంతో స్పూర్తిని కలిగించిందన్నారు. త్రిపుర విజయంతో ఈశాన్యంలోని 6 రాష్ట్రాల్లో కాషాయ దళం ప్రభుత్వాలను ఏర్పాటు చేసింది. మరో ఏడాదిలో మిజోరంలో జరిగే ఎన్నికల్లో కూడా తమ పార్టీ విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా ఎన్నికల ఫలితాలు వెలువడిన రెండో రోజునే బీజేపీ మద్దతుదారులు కమ్యూనిస్టు నేత లెనిన్ విగ్రహాన్ని కూల్చివేయండంతో పాటు సీపిఎం పార్టీ కార్యాలయాలపై దాడి చేయటంతో దేశవ్యాప్తంగా విమర్శలు వెలువెత్తిన విషయం తెలిసిందే. -
పార్టీ ఆఫీసే మాజీ సీఎం నివాసం
-
అధికారిక నివాసం ఖాళీ చేసిన మాణిక్ సర్కార్
-
త్రిపుర ముఖ్యమంత్రిగా విప్లవ్ కుమార్ దేవ్
-
పార్టీ ఆఫీసే మాజీ సీఎం నివాసం
గల్లీ నాయకులకే ఈ రోజుల్లో కోట్లు విలువ చేసే భవంతుల్లో ఉంటుంటే.. ఒక రాష్ట్రానికి 20 సంవత్సరాలకు పైగా ముఖ్యమంత్రిగా సేవలందించిన మాణిక్ సర్కార్ మాత్రం పార్టీ ఆఫీసునే తన ఇంటిగా మార్చుకున్నారు. త్రిపురను రెండు దశాబ్దాలుగా ఏలి, అసాధారణ సీఎంగా పేరు తెచ్చుకున్న మాణిక్, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ చేతిలో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఈ ఓటమి అనంతరం తన స్వగృహాన్ని పార్టీ ఆఫీసులోకి మార్చుకున్నారు. రెండు రోజుల క్రితమే మాణిక్ తన పుస్తకాలు, వస్తువులను పార్టీ ఆఫీసులోకి మార్చుకున్నారని ఆఫీస్ సిబ్బంది తెలిపారు. పార్టీ ఆఫీసు గెస్ట్ హౌస్‌లో తన భార్య పంచాలి భట్టాచార్యతో కలిసి సింగిల్ రూమ్‌లో నివాసం ఉంటున్నట్టు పార్టీ కార్యదర్శి బిజాన్ ధార్ చెప్పారు. మార్క్స్-ఎంగెల్స్ సరణిలో ఉన్న త్రిపుర ముఖ్యమంత్రి అధికారిక నివాసాన్ని మాణిక్ సర్కార్ గురువారం సాయంత్రం ఖాళీ చేశారని.. దీనికి 500 మీటర్ల దూరంలో ఉండే మెలార్మత్లో దశరత్ దేవ్ భవన్ పార్టీ కార్యాలయానికి సిఫ్ట్ అయ్యారని తెలిపారు. పార్టీ ఆఫీసు కిచెన్‌లో వండే వంటనే ఆయనే తింటున్నారని సీపీఐ(ఎం) ఆఫీసు కార్యదర్శి హరిపద దాస్ చెప్పారు. ఇప్పటికే ఆయన పలు పుస్తకాలను, వస్త్రాలను, కొన్ని సీడీలను పార్టీ ఆఫీసుకు ఇచ్చేశారని, కొత్త ప్రభుత్వం ఆయనకు క్వార్టర్ ఇచ్చాక, మాణిక్ అక్కడికి సిఫ్ట్ అవుతారని తెలిపారు. మార్క్సిస్ట్ సాహిత్యానికి చెందిన పుస్తకాలను, నవలలను తాను కూడా పార్టీ ఆఫీసు లైబ్రరీకి, అగర్తలలో ఉన్న బిర్చంద్ర సెంట్రల్ లైబ్రరీకి విరాళంగా అందించినట్టు మాణిక్ భార్య చెప్పారు. సాధారణ కమ్యూనిస్టుగా ఉండే మాణిక్ సర్కార్, 20 ఏళ్లు నిరంతరాయంగా త్రిపురను పాలించిన సంగతి తెలిసిందే. ప్రజలే తన బిడ్డలనుకున్న ఆయన, తనకు సంతానం కూడా వద్దనుకున్నారు. మాణిక్ భార్య పంచాలి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి. కృష్ణనగర్ ప్రాంతంలో ఆమెకు చిన్న ఫ్లాట్ మాత్రమే ఉంది. ఈ ఫ్లాట్‌లోనే ఆమె సోదరీమణులు కూడా ఉంటున్నారు. అయితే మాణిక్ అక్కడ నివసించడానికి విముఖత వ్యక్తం చేయడంతో, ప్రస్తుతం పార్టీ కార్యాలయంలో వారు నివాసముంటున్నారు. దేశంలో అత్యంత తక్కువ ఆస్తులు కలిగిన ముఖ్యమంత్రి మాణిక్ సర్కారే. -
ఐ లవ్ మాణిక్ సర్కార్ : సీఎం విప్లవ్
అగర్తలా : ఈశాన్య రాష్ట్రం త్రిపురకు 11వ ముఖ్యమంత్రిగా విప్లవ్ కుమార్ దేవ్ శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. అగర్తలాలోని అసోం రైఫిల్స్ మైదానంలో అట్టహాసంగా జరిగిన కార్యక్రమంలో గవర్నర్ తథాగథ రాయ్ నూతన మంత్రివర్గం చేత ప్రమాణం చేయించారు. విష్ణు దెబార్మా డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా, ఈశాన్య రాష్ట్రాల పర్యవేక్షకుడు రాంమాధవ్, బీజేపీ ఇతర ముఖ్యనేతలు సైతం వేడుకలో పాలుపంచుకున్నారు. విప్లవ్ దేవ్ ప్రత్యేక ఆహ్వానం మేరకు కమ్యూనిస్ట్ యోధుడు, త్రిపుర మాజీ సీఎం మాణిక్ సర్కార్ కూడా కార్యక్రమానికి హాజరయ్యారు. ఐ లవ్ మాణిక్‌జీ : సీఎంగా ప్రమాణం చేయడానికి కొద్ది నిమిషాల ముందు విప్లవ్ దేవ్ మీడియాతో మాట్లాడారు. ‘త్రిపుర ప్రజలే నాకు స్ఫూర్తి. వారినే సర్వస్వంగా భావిస్తా. నా ప్రజలు మునుపెన్నడూ చూడని అభివృద్ధిని తప్పక చేసి చూయిస్తా. సీపీఎం అభివృని నిర్లక్ష్యం చేసింది. నేను మాత్రం త్రిపురయే శ్వాసగా జీవిస్తాను. నాకు కమ్యూనిస్టులన్నా, మాణిక్ సర్కార్ అన్నా కూడా ప్రేమే. ఐ లవ్ మాణిక్ సర్కార్జీ’’ అని విప్లవ్ దేవ్ పేర్కొన్నారు. బీజేపీ ప్రభుత్వ ప్రమాణస్వీకారం ఫొటోలు.. -
ఓడిపోతామని ఊహించలేదు: మాణిక్
అగర్తలా : పాతికేళ్ల అప్రతిహత కమ్యూనిస్టు పాలనకు తెరదించిన తాజా ఎన్నికల ఫలితాలపై త్రిపుర ఆపధర్మ ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ తొలిసారి నోరువిప్పారు. ‘త్రిపుర ఎన్నికల్లో ఓటమిని సమీక్షించుకుంటాం. అన్ని ప్రాంతాల నుంచి పూర్తి వివరాలను సేకరించి విశ్లేషిస్తాం. నిజానికి ఇలాంటి ఫలితం కోసం మేము సన్నద్ధంకాలేదు. మా పార్టీ(సీపీఎం) ఓడిపోతుందని అస్సలు ఊహించనేలేదు’’ అని మాణిక్ సర్కార్ అన్నారు. ఆదివారం రాత్రి ఓ జాతీయ చానెల్‌తో ఆయన మాట్లాడారు. త్రిపురకు నాలుగు పర్యాయాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయన దేశంలోనే పేద సీఎంగా గుర్తింపు పొందిన సంగతి తెలిసిందే. కొత్త సీఎం విప్లవ్ : శనివారం వెల్లడైన ఫలితాల్లో బీజేపీ-ఐపీఎఫ్టీ కూటమి ఘనవిజయం సాధించిన దరిమిలా ఆదివారంనాడు మాణిక్ సర్కార తన పదవికి రాజీనామా చేశారు. గవర్నర్ తథాగత రాయ్ సూచనమేరకు.. కొత్త కేబినెట్ ప్రమాణం చేసేదాకా మాణిక్ ఆపధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగుతారు. ఇక త్రిపుర కొత్త ముఖ్యమంత్రిగా ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు విప్లవ్ కుమార్ దేవ్ నియమితులయ్యారు. అయితే మంగళవారం బీజేపీ–ఐపీఎఫ్టీ ఎమ్మెల్యేల భేటీ అనంతరం విప్లవ్ పేరును అధికారికంగా ప్రకటిస్తారు. గెలుపు ఓటమిల మధ్య తేడా 0.7 శాతమే : మొత్తం 60 స్థానాలున్న త్రిపుర అసెంబ్లీలో బీజేపీ–ఐపీఎఫ్టీ (ఇండిజినస్ పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర) కూటమి 43 సీట్లను గెలుచుకుంది. సీపీఎం కేవలం 16 స్థానాల్లో గెలిచింది. బీజేపీకి 43 శాతం ఓట్లురాగా, సీపీఎంకు 42.3 శాతం వచ్చాయి. గెలుపు ఓటముల మధ్య తేడా అయిన 0.7 శాతం ఓట్లను ప్రభావితం చేసిన అంశమేంటి? అనేదానిపై సీపీంఎ కసరత్తు చేస్తోంది. కొన్ని బీసీ కులాలు, ఆదివాసీ తెగల ఓట్లు గంపగుత్తగా బీజేపీకి దక్కడం వల్లే ఇలా జరిగిందనే వాదన వినిపిస్తోంది. -
గద్దె దిగిన పేద ముఖ్యమంత్రి!
త్రిపుర ముఖ్యమంత్రిగా వరుసగా 20 ఏళ్లు కొనసాగి పదవి నుంచి వైదొలుగుతున్న మార్క్సిస్ట్ నేత మాణిక్ సర్కార్ రెండు విషయాల్లో చరిత్రకెక్కారు. దేశంలో ‘అతి పేద’ సీఎం మాణిక్ అని ఆయన ఎన్నికల అఫిడవిట్ వెల్లడించింది. పశ్చిమ బెంగాల్ సీఎంగా 34 ఏళ్లకు పైగా పనిచేసిన జ్యోతి బసు తర్వాత రెండు దశాబ్దాలు ఈ పదవి నిర్వహించిన సీపీఎం నేతగా మాణిక్‌దే రికార్డు. 49 ఏళ్ల వయసులో ఆయన 1998లో సీఎం పదవి చేపట్టారు. 1960ల చివర్లో త్రిపుర కాంగ్రెస్ సర్కారుకు వ్యతిరేకంగా విద్యార్థిగానే ఉద్యమించి కమ్యూనిస్ట్ పార్టీలో చేరారు. ప్రజా పోరాటాలకే అంకితమై సీపీఎం విస్తరణకు చేసిన కృషి ఫలితంగా 1972లో 23 ఏళ్లకే త్రిపుర సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడయ్యారు. 49 ఏళ్లకే సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడయ్యాక ముఖ్యమంత్రి పదవి సర్కార్కే దక్కింది. సొంత ఇల్లు లేని ఆయన తన ముత్తాతకు చెందిన అతి చిన్న ఇంట్లోనే ముఖ్యమంత్రిగా నివసించడం విశేషం. సొంత కారు లేకపోవడమేగాక, సీఎంగా తనకు వచ్చే జీతం మొత్తాన్ని పార్టీకే ఇచ్చి, పార్టీ నెలనెలా అందించే రూ.5000తోనే సరిపెట్టుకుంటున్నారు. సెంట్రల్ సోషల్ వెల్ఫేర్ బోర్డు ఉద్యోగిగా 2011లో పదవీ విరమణ చేసిన ఆయన భార్య పాంచాలీ భట్టాచార్య భర్త మాదిరిగానే నిరాడంబర జీవితం గడపుతున్నారు. సీఎం భార్య అయినా ఎలాంటి భద్రత లేకుండా రాజధాని అగర్తలాలో ఆమె రిక్షాలో ప్రయాణించడం నగర ప్రజలందరికీ తెలిసిన విషయమే. సీఎం అయ్యాక కూడా నగరంలో ఉదయం నడకకు మాణిక్ బయల్దేరడంతో భద్రతా సిబ్బంది పాంచాలికి విషయం చెప్పగానే ఆమె భర్త కోసం ట్రెడ్మిల్ కొని ఇంటికి తెచ్చారు. ‘‘ నా కళ్లజోడు ఖరీదు రూ.1800. చెప్పులు చాలా చౌక. అయినా నీటుగా కనిపిస్తానంటే విలాసవంతమైన వస్తువులు వాడతానని అనుకోవద్దు,’’ అని మాణిక్ చెప్పిన మాటలు అక్షరాలా నిజం. రోజూ ఓ చార్మినార్ సిగరెట్ ప్యాకెట్, చిన్న ప్యాకెట్ నస్యం ఉంటే చాలనీ, ఐదువేల రూపాయలకు తోడు తన భార్య పించనుతో అవసరాలు తీరిపోతున్నాయని ఓ ఇంటర్వ్యూలో సర్కార్ వెల్లడించారు. వరుసగా నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఎంను అధికారంలోకి తెచ్చిన మాణిక్ నాయకత్వం ఇరవై ఏళ్ల తర్వాత నిరుద్యోగం, అభివృద్ధి లేకపోవడం వంటి కారణాల వల్ల ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోవాల్సివచ్చింది. (సాక్షి నాలెడ్జ్ సెంటర్) -
‘మాణిక్.. వెళ్లి ఎక్కడైనా తలదాచుకో!’
సాక్షి, న్యూఢిల్లీ : త్రిపురలో బీజేపీ కూటమి ఘన విజయం దిశగా అడుగులు వేస్తుండటంతో.. ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్‌పై బీజేపీ నేతలు వ్యంగ్యాస్త్రాలు పేల్చటం మొదలుపెట్టారు. ఈ క్రమంలో మాణిక్ రాష్ట్రాన్ని విడిచి వెళ్లిపోవటం ఉత్తమమంటూ బీజేపీ నేత హిమంత బిస్వా ఎద్దేవా చేశారు. శనివారం అగర్తలలో బీజేపీ విజయోత్సవ ర్యాలీలో బిస్వా పాల్గొన్నారు. ‘ మాణిక్ సర్కార్ కావాలంటే ఆశ్రయం కోసం పశ్చిమ బెంగాల్, కేరళ, చివరకు పొరుగున ఉన్న బంగ్లాదేశ్ కైనా వెళ్లొచ్చు. ప్రస్తుతం ఆయన ముందు ఈ మూడు ఆఫ్షన్లు మాత్రమే ఉన్నాయి. ఎంచుకునే అవకాశం కూడా ఆయనకే ఇస్తున్నాం’ అంటూ వ్యాఖ్యలు చేశారు. గతంలోనే ఆయన ఎన్నికల తర్వాత మాణిక్‌ను బంగ్లాదేశ్‌కు సాగనంపుతానంటూ ఆయన వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. సుమారు పాతికేళ్ల అధికారంలో కొనసాగిన వామపక్ష ప్రభుత్వాన్ని పక్కన పెట్టి.. త్రిపుర ప్రజలు బీజేపీ-ఐపీఎఫ్‌టీకి పట్టం కట్టిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. -
'మేం కచ్చితంగా నెగ్గుతాం.. సీఎం ఓడిపోతారు'
సాక్షి, న్యూఢిల్లీ: త్రిపుర అసెంబ్లీకి మరో రెండు రోజుల్లో జరగనున్న ఎన్నికల్లో బీజేపీనే విజయం సాధిస్తుందని ఎన్నికల్లో బీజేపీ ఇంఛార్జ్ గా వ్యవహరిస్తున్న హిమాంత బిస్వా శర్మ ధీమా వ్యక్తం చేశారు. ప్రజల్లో సీఎం మాణిక్ సర్కార్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉందని, అదే సమయంలో బీజేపీ అంటే నమ్మకం ఏర్పడిందన్నారు. జాతీయ మీడియా న్యూస్18తో ఇంటర్వ్యూ సందర్భంగా పలు విషయాలు వెల్లడించారు. అసోంకు చెందిన వ్యక్తిని అయినప్పటికీ నాపై నమ్మకం ఉంచి బీజేపీ అధిష్టానం త్రిపుర ఎన్నికల ఇంఛార్జీగా నియమించింది. నాకు తెలిసినంతవరకూ బీజేపీ సేఫ్ జోన్లోనే ఉంది. బీజేపీ 35-40 స్థానాల్లో విజయం సాధించి అధికారంలోకి రావడం ఖాయంగా కనిపిస్తోంది. ఇంకా చెప్పాలంటే సీఎం మాణిక్ సర్కార్ ఓడిపోతారని విశ్వసిస్తున్నాను. ప్రధాని నరేంద్ర మోదీ చివరి రెండు రోజుల్లో చేసిన పర్యటనలతో బీజేపీ అభ్యర్థులతో పాటు కార్యకర్తల్లో నూతన ఉత్సాహం వచ్చింది. అధికార సీపీఎంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతతో పాటు ప్రధాని మోదీపై నమ్మకం బీజేపీని గెలుపు దిశగా తీసుకెళ్తాయి. అసోం, మణిపూర్‌లో వచ్చిన ఫలితాలే త్రిపురలోనూ నరావృతం అవుతాయి. అందులో ఎలాంటి సందేహం అక్కర్లేదు. సీపీఐ-ఎం భావజాలంతో బీజేపీ ఏనాడూ కలవదు. మరోవైపు బీజేపీ ఎక్కడ నెగ్గుతుందేమోనన్న భయంతో సీపీఎం పార్టీ భారీ మొత్తాల్లో ప్రజలకు డబ్బులు పంచుతుంది. అయితే ఆ డబ్బు విరాళాల రూపంలో వచ్చింది కాకపోవడమే సీపీఎం పాలిట శాపంగా మారనుంది. మార్కెట్లో రూ.150 కోట్ల మేర వసూలు చేసినట్లు ప్రధాన ఎన్నికల అధికారికి, త్రిపుర డీజీపీకి ఫిర్యాదు చేశామని బీజేపీ నేత హిమాంత బిస్వా శర్మ వివరించారు. 60 అసెంబ్లీ స్థానాలున్న త్రిపురలో ఫిబ్రవరి 18న ఎన్నికలు జరగనున్నాయి. -
సీఎం సొంత నియోజకవర్గంలోనే రేప్‌లు జరిగినా..
సాక్షి, అగర్తలా: త్వరలో జరగనున్న త్రిపుర అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే ధ్యేయంగా బీజేపీ జోరుగా ప్రచారం కొనసాగిస్తోంది. సీఎం మాణిక్ సర్కార్‌ను లక్ష్యంగా చేసుకుని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ విమర్శనాస్త్రాలు సంధించారు. సాక్షాత్తూ సీఎం సొంత నియోజకవర్గంలో ఓ యువతిపై అత్యాచారం జరిగితే కనీసం ఆ కుటుంబాన్ని పరామర్శించే తీరికలేని వ్యక్తి మాణిక్ సర్కార్ అంటూ స్మృతి మండిపడ్డారు. ఛండీపూర్ నియోజకవర్గం రంగ్రంగ్ టీ ఎస్టేట్ స్కూల్ ఫీల్డ్‌లో సోమవారం బీజేపీ ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న సందర్భంగా సీఎం మాణిక్ సర్కార్‌పై స్మృతి ఇరానీ నిప్పులు చెరిగారు. సొంత నియోజకవర్గంలోని ప్రజలకే న్యాయం చేయలేని వ్యక్తి సీఎంగా ఎలా పనికి వస్తారని స్థానికులను ప్రశ్నించారు. మాణిక్ సర్కార్ గెలిచిన నియోజకవర్గంలోనే ఓ యువతిపై అత్యాచారం జరిగితే కనీసం వెళ్లి బాధితులను పరామర్శించి వారి సమస్యలను తెలుసుకోవడానికి తీరిక లేకుండా ఉన్న ముఖ్యమంత్రికి.. చంఢీగఢ్‌లో జరిగిన ర్యాలీలో పాల్గొని నిరసన తెలిపేందుకు మాత్రం సమయం ఉంటుందని స్మృతి ఇరానీ ఎద్దేవా చేశారు. గత 25 ఏళ్ల వామపక్షాల పాలనలో త్రిపురలో పేదరికం పెరిగిందని, అభివృద్ధి పూర్తిగా నిలిచి పోయిందన్నారు. కేంద్ర బడ్జెట్లో 10 కోట్ల మంది పేదలకు రూ.5 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం కల్పించిందని, అగర్తలా ఎయిర్పోర్ట్ ఆధునికీకరణకు సైతం రూ.400 కోట్లను కేటాయించినట్లు తెలిపారు. త్రిపుర అభివృద్ధి చెందాలంటే బాధితులను సైతం పట్టించుకోని మాణిక్ సర్కార్‌కు ఓటేస్తారా.. అభివృద్ధి కోసం పాటుపడుతున్న బీజేపీకి ఓటేస్తారో ప్రజలో నిర్ణయించుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. త్రిపురలో ఫిబ్రవరి 18న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. -
ఆ సీఎం వద్ద 4 వేలు కూడా లేవు!
అగర్తలా: రాజకీయ నేతలంటే భారీగా ఆస్తులు, కోట్లకొద్దీ డబ్బు అనే అభిప్రాయం ప్రజల్లో ఉంది. అయితే, ఇప్పటికి నాలుగుసార్లు సీఎంగా పనిచేసి, ఐదోసారి బరిలోకి దిగుతున్న త్రిపుర సీఎం మాణిక్ సర్కార్(69) సొంత ఆస్తి వివరాలు చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలుగకమానదు. రాష్ట్ర అసెంబ్లీకి త్వరలో ఎన్నికలు జరుగనుండగా ఆయన ధన్పూర్ స్థానానికి సీపీఎం తరఫున సోమవారం నామినేషన్ వేశారు. ఈ నామినేషన్ పత్రాల్లో ఆస్తిపాస్తుల వివరాలను సర్కార్ పొందుపరిచారు. వీటి ప్రకారం..మాణిక్ సర్కార్ వద్ద ఉన్న నగదు రూ.1,520 కాగా, బ్యాంకు ఖాతాలో ఉన్న డబ్బు రూ.2,410 మాత్రమే. ఈయనకు వ్యవసాయ భూములు గానీ ఇళ్ల స్థలాలు గానీ లేవు. ముఖ్యమంత్రికి ప్రభుత్వం నుంచి అందే వేతనం మొత్తాన్ని పార్టీకి విరాళంగా ఇస్తూ పార్టీ నుంచి జీవనభృతిగా నెలకు రూ.5వేలు మాత్రం పొందుతున్నారు. కాగా, మాణిక్ సర్కారు సతీమణి పాంచాలీ భట్టాచార్య కేంద్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగిని. ఈమె వద్ద నగదు రూ.20,140కాగా రెండు బ్యాంకు ఖాతాల్లో కలిపి దాదాపు రూ.2 లక్షల నగదు ఉంది. వీటితోపాటు రూ.9.25 లక్షల ఫిక్స్డ్ డిపాజిట్లు.. 20 గ్రాముల బంగారు నగలు ఉన్నాయి. ఈమె పేరుతో రూ.21 లక్షల విలువైన 888.35 చదరపు అడుగుల ఇంటి స్థలంలో రూ.15 లక్షల విలువైన ఇల్లు ఉంది. -
పేద ముఖ్యమంత్రి నిరుపేద అయ్యారు
అగర్తలా : త్రిపుర రాష్ట్ర ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ (69) దేశంలో అత్యంత నిరుపేద ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. సోమవారం శాసనసభ ఎన్నికలకు నామినేషన్ దాఖలు చేసిన ఆయన రూ. 1,520/-లను తన ప్రస్తుత ఆస్తిగా చూపారు. ఈ నెల 20వ తేదీ నాటికి ఆయన బ్యాంకు ఖాతాలో రూ. 2,410లు ఉన్నాయి. 2013లో ఎన్నికల సమయంలో ఆయన బ్యాంకు ఖాతాలో రూ. 9,720/-లు మాత్రమే ఉన్నాయి. 1998 నుంచి త్రిపుర ముఖ్యమంత్రిగా సర్కార్ వరుసగా ఎన్నికవుతూ వస్తున్నారు. ఈ ఎన్నికల్లో ధన్పూర్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతున్నారాయన. ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నందుకు సర్కార్‌కు వచ్చే వేతనం రూ. 26,315/-. ఈ మొత్తాన్ని అంతటిని పార్టీ నిధికి డొనేట్ చేస్తారు. ఇలా చేసినందుకు ఆయనకు నెలకు రూ. 9,700/-లను పార్టీ అలవెన్సుగా ఇస్తుంది. అఫడవిట్లో తన పేరిటలో 0.0018 ఎకరాల వ్యవసాయేతర భూమి అగర్తలాలో ఉన్నట్లు సర్కార్ వెల్లడించారు. సర్కార్ మొబైల్ ఫోన్‌ను వినియోగించరు. ఆయనకు ఈ-మెయిల్ అకౌంట్ కూడా లేదు. సర్కార్ భార్య తరచూ అగర్తలాలోని రిక్షాల్లో ప్రయాణిస్తూ కనిపిస్తారు. -
సర్కార్ ప్రసంగంలో అభ్యంతరాలేమిటీ?
న్యూఢిల్లీ: దేశ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని త్రిపుర ముఖ్యమంత్రి మానిక్ సర్కార్ తన రాష్ట్ర ప్రజలనుద్దేశించి చేసిన ప్రసంగాన్ని దూరదర్శన్, ఆకాశవాణి అగర్తలా విభాగం ప్రసారం చేయడానికి నిరాకరించడం పట్ల వివాదం రాజుకుంటోంది. తన ప్రసంగాన్ని యథాతధంగా ప్రసారం చేయడానికి నిరాకరించడం అసాధారణం, అప్రజాస్వామికం, అసహనం, నిరంకుశత్వం అని మానిక్ సర్కార్ విమర్శించగా, స్వయం ప్రతిపత్తిగలిగిన దూరదర్శన్, ఆకాశవాణిలు కేంద్ర సమాచార, ప్రసారాల శాఖలో భాగమైనట్లు వ్యవహరించడం ఏమిటని వామపక్ష పార్టీలు ప్రశ్నిస్తున్నాయి. మళ్లీ ఎమర్జెన్సీ కాలంనాటి ఆంక్షలు వస్తున్నాయని ప్రజాస్వామ్యవాదులు విమర్శిస్తున్నారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆగస్టు 12వ తేదీన దూరదర్శన్, ఆకాశవాణిలు మానిక్ సర్కార్ ప్రసంగాన్ని రికార్డు చేశాయి. దీన్ని ఆగస్టు 15 తేదీన ప్రసారం చేయాల్సి ఉండింది. అయితే మానిక్ సర్కార్ ప్రసంగంలో అభ్యంతరకరమైన అంశాలు ఉన్నాయని, అవి ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నందున యథాతధంగా ప్రసంగాన్ని ప్రసారం చేయడం కుదరదని చెబుతూ ఆగస్టు 14వ తేదీన సీఎం కార్యాలయానికి ఏఐఆర్ డైరెక్టర్ జనరల్ తరఫున అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ పేరిట ఓ లేఖ అందింది. గౌరవనీయులైన ముఖ్యమంత్రిగారు తన ప్రసంగ పాఠాన్ని మార్చుకున్నట్లయితే దాన్ని ప్రసారం చేయడానికి తమకు అభ్యంతరం లేదని తెలిపింది. ఢిల్లీలోని ప్రసార భారతి సీఈవోతో సంప్రతింపులు జరిపాకే తాము ఈ నిర్ణయానికి వచ్చామని కూడా ఆ లేఖలో స్పష్టం చేసింది. అయితే అందులో ఒక్క అక్షరాన్ని కూడా మార్చడం తమకు ఇష్టం లేదని సీఎం కార్యాలయం స్పష్టం చేయడంతో మానిక్ సర్కార్ ప్రసంగాన్ని దూరదర్శన్, ఆకాశవాణిలు ప్రసారం చేయలేదు. ఇంతకు మానక్ సర్కార్ లేఖలో అంత అభ్యంతరకరమైన అంశాలు ఏమీ ఉన్నాయి. భావ స్వాతంత్య్రం కలిగిన ప్రజాస్వామ్య దేశంలో స్వయంప్రతిపత్తిగల ప్రసార భారతికి నచ్చని అంశాలేమిటో, అవి ఎందుకు నచ్చలేదో ఓ సారి చూద్దాం! ప్రియమైన త్రిపుర ప్రజలారా! దేశ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మీ అందరికి శుభాకాంక్షలు. స్వాతంత్య్రం కోసం పోరాడిన అమర వీరులకు నా నివాళులు. స్వాతంత్య్రం కోసం పోరాడి ఇప్పటికీ మనందరి మధ్యనున్న యోధులకు నా గౌరవ వందనాలు. స్వాతంత్య్ర దినోత్సవం అంటే సంప్రదాయబద్ధంగా ఏటా జరుపుకునే ఓ పండుగ కాదు. ఈ దినానికి చారిత్రక ప్రాధాన్యతతోపాటు మన భావోద్రేకాలు ముడివడి ఉన్నాయి. ఈ సందర్భంగా మనం ఆత్మావలోకనం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. భిన్నత్వంలో ఏకత్వం మన సంప్రదాయ సంస్కతి. లౌకిక భావాల వల్లనే మన భారతీయులంతా కలిసిమెలిసి బతుకుతున్నారు. ఈరోజున మన లౌకిక భావానికి ముప్పు వాటిల్లుతోంది. కులమతాల ప్రాతిపదికన సమాజంలో విభనలు తీసుకరావడానికి కుట్రలు జరుగుతున్నాయి. సంకుచిత భావాలు జాతీయ స్ఫూర్తిని దెబ్బతీస్తున్నాయి. గోరక్షణ పేరిట దళితులు, మైనారిటీలపై దాడులు జరుగుతున్నాయి. వారిలో అభద్రతా భావం పెరిగిపోతోంది. భారత దేశంలో ఓ మత రాజ్యాన్ని స్థాపించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. స్వాతంత్య్ర పోరాటానికి పురిగొల్పిన ఆదర్శాలు, కన్న కలలను దెబ్బతీసే విధంగా విచ్ఛిన్నకర శక్తులు రాజ్యమేలుతున్నాయి. స్వాతంత్య్ర ఉద్యమంతో ఏ మాత్రం సంబంధంలేని, పైగా స్వాతంత్య్ర ఉద్యమాన్ని అణచివేసేందుకు ప్రయత్నించిన జాతి వ్యతిరేకులు నేడు రకరకాల పేర్లతో చెలామణి అవుతూ దేశ ఐక్యతను, సమగ్రతలను దెబ్బతీస్తున్నారు. దేశభక్తిగల ప్రతి పౌరుడు దేశ ఐక్యతకు కట్టుబడి ఈ విచ్ఛిన్నకర శక్తులకు వ్యతిరేకంగా సంఘటితంగా నిలబడాలి’ అని మానిక్ సర్కార్ పిలుపునిచ్చారు. ‘నేడు సమాజంలో ధనిక, పేద అంతరాలు పెరిగిపోతున్నాయి. అపారమైన దేశ సంపద కొద్ది మంది వ్యక్తుల చేతుల్లోకి చేరిపోగా మెజారిటీ ప్రజలు నోటి దగ్గరికి కూడు కూడా అందక కుమిలిపోతున్నారు. కొద్ది మంది కార్పొరేట్ సంస్థలకు ఊడిగం చేస్తూ సామాజిక అంతరాలను పెంచి పోషిస్తున్న ప్రస్తుత ఆర్థిక, సామాజిక విధానానికి ప్రత్యామ్యాయ విధానం తప్పకుండా ఉంది. మెజారిటీ పేద ప్రజలను ఆదుకునే అలాంటి ప్రత్యామ్నాయ ఆర్థిక, సామాజిక విధానాన్ని సాధించడం కోసం త్రిపుర ప్రజలంతా ఒక్కటవ్వాలి. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు భిన్నంగా రాష్ట్ర ప్రజలకు మేలు చేసేందుకు ఉన్నంత పరిధిలో ఈ ప్రభుత్వం కషి చేస్తోంది. ఇది సరిపోదు. ప్రత్యామ్నాయ ఆర్థిక విధానాన్ని సాధించడం ఒక్కటే పరిష్కారం. అందుకు జరిగే పోరాటంలో ప్రతి ఒక్కరు భాగస్వామి కావాలని కోరుకుంటున్నాను’ అని మానిక్ సర్కార్ తన ప్రసంగ పాఠంలో పేర్కొన్నారు. -
'దారుణం, అన్యాయం'
న్యూఢిల్లీ: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా త్రిపుర సీఎం మాణిక్ సర్కార్ ప్రసంగాన్ని ప్రసారం చేయడానికి దూరదర్శన్, ఆలిండియా రేడియో నిరాకరించడాన్ని సీపీఎం ఖండించింది. ఇది దారుణమైన, అన్యాయమైన చర్యగా సీపీఎం నాయకురాలు బృందా కారత్ వర్ణించారు. రాష్ట్రాలతో సహకారాత్మక సమాఖ్య విధానం అవలంభిస్తామని చెబుతున్న ప్రధాని నరేంద్ర మోదీపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయని అన్నారు. 'నరేంద్ర మోదీ సహకారాత్మక సమాఖ్య విధానం గురించి మాట్లాడుతున్నారు. ఇదే సమయంలో నేతృత్వంలోని ప్రభుత్వం.. దూరదర్శన్‌లో త్రిపుర ముఖ్యమంత్రి ప్రసంగాన్ని ప్రసారం చేయడానికి నిరాకరించింది. సహకారాత్మక సమాఖ్య విధానం అంటే ఇదేనా? ప్రజలతో ఎన్నుకోబడిన ముఖ్యమంత్రి ప్రసంగ పాఠంలో మార్పులు చేసే అధికారం దూరదర్శన్‌కు ఎవరిచ్చారు? ఇది దారుణం, పూర్తిగా అన్యాయమ'ని బృందా కారత్ పేర్కొన్నారు. ప్రభుత్వ ప్రసార మాధ్యమాల తీరును తీవ్రంగా ఖండిస్తూ సీపీఎం పొలిట్‌బ్యూరో పత్రికా ప్రకటన కూడా విడుదల చేసింది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా తమ రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించే హక్కు ముఖ్యమంత్రికి ఉందని పేర్కొంది. మోదీ సర్కారు ఎమర్జెన్సీ రోజులను గుర్తుకు తెస్తోందని.. దూరదర్శన్, ప్రసార భారతి స్వయం ప్రతిపత్తిని దెబ్బతీస్తోందని విమర్శించింది. సీఎం మాణిక్ సర్కారు ప్రసంగాన్ని సీపీఎం తన అధికారిక ట్విటర్ పేజీలో పోస్ట్ చేసింది. -
‘ఇలా చెప్పాల్సి వస్తున్నందుకు క్షమించండి’
బెంగళూరు: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ నిప్పులు చెరిగారు. ఆమెను ఆమె రక్షించుకునేందుకే తనపై అవినీతి ఆరోపణలు మోపుతోందని ధ్వజమెత్తారు. శారదా, నారదా, రోజ్ వ్యాలీ కుంభకోణాల్లో మునిగిన ఆమె తనను రక్షించుకునేందుకే తనపై నిందలు వేస్తోందని, ఇదంతా రాజకీయ కుంచితత్వమని అన్నారు. వివిధ చిట్‌ఫండ్ కంపెనీలతో చేతులు కలిపి త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్, త్రిపుర సాంఘిక సంక్షేమ మంత్రి బిజితా నాథ్ అక్రమాలకు పాల్పడ్డారని, అయినప్పటికీ దర్యాప్తు సంస్థలు మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. ఈ నేపథ్యంలో స్పందించిన మాణిక్, తానొక తెరిచిన పుస్తకాన్ని అని, పలకలాంటివాడినని, దయచేసి తనను మమతతో సమానంగా చూడవద్దంటూ విజ్ఞప్తి చేశారు. ఇలా చెప్పాల్సి వస్తున్నందుకు క్షమించండని చెప్పారు. దేశంలో ఎంతో మంది ప్రతిపక్ష నేతలు ఉన్నప్పటికీ సీబీఐ మాత్రం తృణమూల్ వెంటే ఎందుకు పడుతుందని మమత ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ తదితరుల పేర్లు ప్రస్తావించారు. -
'ఏటా కోటిమంది నిరుద్యోగులు'
విజయవాడ: దేశంలో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలం అయిందని త్రిపుర సీఎం మాణిక్ సర్కార్ అన్నారు. అవినీతి మంత్రులపై చర్యలు తీసుకోవడంలో మోదీ వైఫల్యం చెందారని అన్నారు. కార్మిక వ్యతిరేక విధానాలపై దేశ వ్యాప్తంగా ఆందోళనలు వస్తున్నాయని ఆయన చెప్పారు. ప్రతి ఏడాది కోటి మంది నిరుద్యోగులుగా మిగులుతున్నారని ఆయన హెచ్చరించారు. విజయవాడలో సీఐటీయూ రాష్ట్ర మహాసభలు జరుగుతున్నాయి. ఈ సభకు హాజరైన సందర్భంగా మాణిక్ ఈ విధంగా కేంద్రంపై విమర్శలు ఎక్కు పెట్టారు. -
సీఐటీయూ రాష్ట్ర మహాసభలు ప్రారంభం
విజయవాడ నగరంలో సీఐటీయూ 14వ రాష్ట్ర మహాసభలు ఆదివారం ప్రారంభమయ్యాయి. తుమ్మలపల్లి కళాక్షేత్రం నుంచి బీఆర్టీఎస్ రోడ్డు వరకు కార్మికులు భారీ ర్యాలీ చేపట్టారు. బీఆర్టీఎస్ వద్ద జరిగే బహిరంగ సభలో త్రిపుర సీఎం మాణిక్ సర్కారు పాల్గొని ప్రసంగిస్తారు. -
'విద్యార్థి సంఘాల రాజకీయాలు కామన్'
హైదరాబాద్: వేముల రోహిత్ ఆత్మహత్య నేపథ్యంలో హెచ్‌సీయూలో నిరాహార దీక్ష చేస్తున్న విద్యార్థులకు త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ శుక్రవారం సంఘీభావం ప్రకటించారు. వారి న్యాయబద్ధమైన డిమాండ్లకు తన మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా మాణిక్ సర్కార్ మాట్లాడుతూ యూనివర్సిటీ ప్రాంగణంలో విద్యార్థి సంఘాల రాజకీయాలు సర్వసాధారణమని, వాటిని పరిష్కరించడంలో వర్సిటీ యాజమాన్యం బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరముందని పేర్కొన్నారు. ఈ విషయంలో వర్సిటీ యాజమాన్యం పక్షపాతంలేకుండా సమన్యాయం పాటించాల్సిన అవసరముందన్నారు. వేముల రోహిత్ ఆత్మహత్యకు కారణమైన విద్యార్థులపై సస్పెన్షన్ వ్యవహారాన్ని యూనివర్సిటీలోనే పరిష్కరించి ఉంటే బాగుండదని ఆయన అభిప్రాయపడ్డారు. రోహిత్ ప్రతిభ గల విద్యార్థి అని, ప్రతిభావంతుడైన పౌరుణ్ణి ఈ సమాజం కోల్పోయిందని మాణిక్ సర్కార్ అన్నారు. -
'కాంగ్రెస్, బీజేపీలు దొందుదొందే'
కరీంనగర్: కాంగ్రెస్, బీజేపీ రెండూ దొందుదొందే అంటూ త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ వ్యాఖ్యానించారు. ప్రజా సంక్షేమంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఆయన ఆరోపించారు. కరీంనగర్ లో తెలంగాణ వ్యవసాయ, కార్మిక మహాసభలను శుక్రవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మాణిక్ సర్కార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై విమర్శలు గుప్పించారు. నల్లధనం వెలికితీస్తామని చెప్పిన నరేంద్ర మోదీ ప్రభుత్వం అందులో పూర్తిగా విఫలమయిందన్నారు. దేశంలో సామాన్యుడు బతికే పరిస్థి లేదన్నారు. రైతుల ఆత్మహత్యలకు పాలకుల నిర్లక్ష్యమే కారణమంటూ ఆయన మండిపడ్డారు. తెలంగాణ కోసం పోరాడిన వారు భూమి కోసం, భుక్తి కోసం పోరాడాల్సిన పరిస్థితులు తలెత్తాయని మాణిక్ సర్కార్ పేర్కొన్నారు. -
మోదీతో మాణిక్ సర్కార్ భేటీ
న్యూఢిల్లీ: త్రిపురకు ప్రత్యేక హోదా కల్పించడంతోపాటు ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి తోడ్పాలు అందించాలని త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కోరారు. మంగళవారం ఢిల్లీలో ప్రధాన మంత్రి కార్యాలయానికి వచ్చిన మాణిక్ సర్కార్ అరగంటకుపైగా మోదీతో సమావేశమయ్యారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఈశాన్య రాష్ట్రాలకు అందించే ప్రత్యేక నిధులలో ఎలాంటి కోతలు విధించవద్దని, అలాంటి చర్యలు తమ రాష్ట్రాలపాటిట శాపంగా మారుతాయని వివరించారు. ఈ విషయంలో పార్టీలకు అతీతంగా ఏడు ఈశాన్య రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒక్కతాటిపైకి వచ్చి కేంద్రాన్ని అభ్యర్థించాలని నిర్ణయించినట్లు మాణిక్ తెలియజేశారని పీఎంవో వర్గాలు పేర్కొన్నాయి. ఎన్డీఏ సర్కారు ఈశాన్య రాష్ట్రాలను చిన్నచూపు చూస్తున్నదని, ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ప్రధాని మోదీ కనీసం అపాంయింట్ మెంట్ కూడా ఇవ్వడంలేదని అసోం ముఖ్యమంత్రి తరుణ్ గొగాయ్ సోమవారం వ్యాఖ్యనించిన నేపథ్యంలో ప్రధానితో త్రిపుర ముఖ్యమంత్రి భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. -
సాయుధ బలగాల చట్టం ఉపసంహరణ: సర్కార్
ఈశాన్య రాష్ట్రాలతో పాటు మరికొన్ని సమస్యాత్మక రాష్ట్రాల్లో అత్యంత వివాదాస్పదంగా ఉన్న సాయుధ బలగాల ప్రత్యేకాధికారాల చట్టాన్ని తమ రాష్ట్రంలో ఉపసంహరించాలని త్రిపుర సర్కారు నిర్ణయించింది. ఉగ్రవాదుల చొరబాటును నిరోధించేందుకు గత 18 ఏళ్లుగా ఈ చట్టం ఆ రాష్ట్రంలో అమలవుతోంది. రాష్ట్రంలో హోం శాఖ బాధ్యతలను కూడా నిర్వర్తిస్తున్న ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్.. బుధవారం నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో సమస్యాత్మకంగా ఉన్న ప్రాంతాల పరిస్థితిని తాము సమీక్షించామని, రాష్ట్ర పోలీసులు, భద్రతా దళాలతో కూడా ఈ అంశంపై చర్చించామని మాణిక్ సర్కార్ చెప్పారు. ఇక ఇప్పుడు ఈ చట్టంతో అవసరం లేదనే అందరూ భావించారని ఆయన అన్నారు. దాంతో.. వివాదాస్పదంగా ఉన్న ఆ చట్టాన్ని ఎత్తేయాలని నిర్ణయించామని, త్వరలోనే దీనిపై గెజిట్ నోటిఫికేషన్ కూడా ఇస్తామని చెప్పారు. 1997 ఫిబ్రవరి 16 నుంచి త్రిపురలో ఈ చట్టం అమలవుతోంది. -
భారీగా పెరిగిన వేతనాలు
అగర్తలా: త్రిపుర రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలను భారీగా పెంచింది. కేంద్ర 6వ పే కమిషన్ సిఫారసు ప్రకారం జీతాలను పెంచుతున్నట్టు ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ వెల్లడించారు. ఫలితంగా సుమారు లక్షా అరవై వేలమంది లబ్ధి పొందనున్నారని సమాచారం. రాష్ట్రం తీవ్రం ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పటికీ ఉద్యోగుల సంక్షేమం కోసం ఈ నిర్ణయం తీసుకున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. -
సమస్యల పరిష్కారంలో వైఫల్యం: మాణిక్ సర్కార్
* మోదీ సర్కార్‌పై ధ్వజమెత్తిన త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ * రాజకీయాల్లో వామపక్షాలే ప్రత్యామ్నాయమని వ్యాఖ్య * సీపీఎం కేంద్ర కమిటీ సమావేశాల్లో మాణిక్ సర్కార్‌కు సన్మానం * తెలంగాణలో పార్టీని బలోపేతం చేయాలని నేతల పిలుపు సాక్షి, హైదరాబాద్: కేంద్రంలో మోదీ ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలను అమలు చేస్తోందని, ఎన్నికల హామీలను నెరవేర్చడంలో ఘోరంగా విఫలమైందని త్రిపుర సీఎం మాణిక్ సర్కార్ ధ్వజమెత్తారు. కేంద్రం అనుసరిస్తున్న విధానాల ను ఆయన తూర్పారబట్టారు. వామపక్ష, ప్రజాతంత్ర శక్తులే దేశానికి రాజకీయ ప్రత్యామ్నాయాన్ని అందించగలవని విశ్వాసం వ్యక్తంచేశారు. హైదరాబాద్‌లోని ప్రగతినగర్‌లో జరుగుతున్న సీపీఎం కేంద్ర కమిటీ సమావేశాల్లో భాగంగా ‘‘మోదీ ప్రభుత్వ పాలన-ప్రజలపై ప్రభావం’’ అనే అంశంపై మంగళవారం జరిగిన సదస్సులో మాణిక్‌సర్కార్ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయనను పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు సీతారాం ఏచూరి, పార్టీ రాష్ర్ట కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తదితరులు సన్మానించారు. ధరల త గ్గింపు, వ్యవసాయ సంక్షోభ నివారణ, రైతు ఆత్మహత్యల నివారణ, నిరుద్యోగ సమస్యను అధిగమించడం, నల్లధనాన్ని దేశానికి రప్పించడం వంటి అంశాల్లో కేంద్రం విఫలమైందని మాణిక్‌సర్కార్ విమర్శించారు. ఈ విషయాల్లో కేంద్రం శ్రద్ధ చూపడం లేదన్నారు. ఉపాధిహామీని నిర్వీర్యం చేసి పేదల పొట్టగొడుతున్నారని ధ్వజమెత్తారు. బీజేపీ వల్ల మతతత్వం పెరిగే ప్రమాదం ఏర్పడిందని ఆయన వ్యాఖ్యానించారు. కొత్త రాష్ట్రం తెలంగాణలో సీపీఎంను బలోపేతం చేసేందుకు సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కేంద్రం ఎన్ని సమస్యలను సృష్టించినా త్రిపుర ప్రజలు ఏమాత్రం తలవంచరని ఆయన అన్నారు. ప్రభుత్వరంగ సంస్థల్లో వాటాను కేంద్రం విచ్చలవిడిగా అమ్ముతోందని, ఇప్పటికే రూ.48 వేల కోట్లమేర వాటాలను అమ్మాలని నిర్ణయించిందని ఆరోపించారు. సంపన్నులకు రూ. 5 లక్షల కోట్ల మేర రాయితీలు ఇచ్చి పేదలను మాత్రం తీవ్ర సమస్యల్లోకి నెడుతోందన్నారు. కాగా, కేంద్రం అడ్డదారుల్లో ఆర్డినెన్స్‌లను తీసుకొచ్చిందని సీతారం ఏచూరి ధ్వజమెత్తారు. రాజకీయ స్వార్థం కోసం మత ఘర్షణలను పెంచి పోషిస్తున్నారంటూ ఎన్డీయే నేతలపై మండిపడ్డారు. తెలంగాణ రైతాంగ పోరాట కాలంలో 4 వేల గ్రామాలను పాలించిన చరిత్ర కమ్యూనిస్టులదని, దీన్ని పునరావృతం చేయాల్సిన అవసరం ఉందని ఆయన వ్యాఖ్యానించారు. నిజాం నవాబు బాటలో సీఎం కేసీఆర్ నడవడం దారుణమని సీపీఎం తెలంగాణ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. నిరంకుశ పాలనతో 4 వేల మందిని చంపిన నిజాంను కీర్తించడమంటే తెలంగాణను అవమానించడమేనన్నారు. తెలంగాణలో పార్టీని బలోపేతం చేసేందుకు ప్రజలు తోడ్పాటునందించాలని కోరారు. -
వామపక్షాలే ప్రత్యామ్నాయం
సంఘటిత పోరాటమే మార్గం వ్యవసాయ కార్మికులే కీలకం {తిపుర సీఎం మాణిక్ సర్కార్ ఓసిటీలో భారీ బహిరంగ సభ తరలివచ్చిన వ్యవసాయ కార్మికులు నగరంలో ర్యాలీ.. ఎరుపెక్కిన ఓరుగల్లు వరంగల్: దోపిడీ శక్తులకు వ్యతిరేకంగా వామపక్షాలే నిలుస్తాయని, కార్పొరేట్ శక్తుల దోపిడీని అరికట్టేందుకు పోరాటం ఒక్కటే మార్గమని త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ అన్నారు. అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ 8వ మహాసభలను పురస్కరించుకుని వరంగల్ ఓసిటీ మైదానంలో బుధవారం సాయంత్రం జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. రానున్న కాలంలో సాగే పోరాటంలో కీలక పాత్ర నిర్వహించాల్సింది వ్యవసాయ కార్మికులే అన్న విషయాన్ని గుర్తించాలన్నారు. వ్యవసాయ రంగంలోనే వీరి పాత్ర ఉన్నతమైందన్నారు. సాధారణ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా వా మపక్షాలకు అనుకూలంగా ఫలితాలు రాలేదని, ఈ ఫలి తాలు తీవ్ర నిరాశపరిచినప్పటికీ భవిష్యత్‌లో వామపక్షాలే ప్రత్యామ్నాయంగా నిలుస్తాయన్నారు. బహుళజాతి సంస్థ లు యథేచ్చగా దోపిడీ కొనసాగిస్తున్నాయని, పీడిత వర్గా లు ఐక్యం కావాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. పాల కులు చేపట్టే ప్రజావ్యతిరేక విధానాలను ఐక్యంగా ప్రతిఘటించాలన్నారు. కేంద్రంలో మోడీ సర్కార్ తీరు ఇప్పటికే తేటతెల్లమైందన్నారు. ప్రజలపై భారం మోపే విధానాల ద్వారా తమ స్వభావాన్ని చాటుకున్నారని విమర్శించారు. లౌకిక తత్వానికి విరుద్ధంగా మైనార్టీలపై దాడులు సాగుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రమాదాన్ని నివారించాలని కోరారు. ఎన్నికలకు ముందు యువతను ఆకర్షించేందుకు బీజేపి అనేక ఎత్తులు వేసిందని, అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగ యువత గురించి పట్టించుకోవడం లేదని మాణిక్ సర్కార్ విమర్శించారు. దేశంలో 18 నుంచి 20 కోట్ల మంది ఉన్న యువత, నిరుద్యోగులకు ఉపాధి కల్పించే అంశం ఇప్పుడు ఎజెండాలో లేకుండా పో యిందన్నారు. తాజా బడ్జెట్లో వారికి ఉద్యోగాలు కల్పించే అంశమే ప్రాధాన్యతకు నోచుకోలేదని విమర్శించారు. ఈ విషయంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన అవసరం ఉందన్నారు. పారిశ్రామిక వేత్తలకు, పెట్టుబడిదారి వర్గాలకు, కార్పొరేట్లకు, భూస్వాములకు ఉపయోగపడే కార్యక్రమాలు కొనసాగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దుర్భర స్థితిలో వ్యవసాయ కార్మికులు వ్యవసాయ కార్మికులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని, ఇందులో గ్రామీణ పేదలు, దళిత, పీడిత వర్గాలు ఎక్కువగా ఉన్నారన్నారు. కనీస వేతనాలు లేవు.. జీవితాలకు రక్షణ లేద న్నారు. రానున్నకాలంలో వ్యవసాయ కార్మిక సంఘం దేశవ్యాప్తంగా విస్తరించి సంఘటితం కావాల్సిన అవసరం ఉందన్నారు. వ్యవసాయ కార్మికుల పోరాట చైతన్యస్థాయిని పెంపొందిస్తూనే ఈ దోపిడీకి వ్యతిరేకంగా సాగే వర్గపోరాటంలో కీలక భూమిక నిర్వహించాలన్నారు. ఈ దిశగా మహాసభల్లో లోతైన చర్చలు జరగాలని ఆకాంక్షించారు. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జి. నాగయ్య అధ్యతన జరిగిన ఈ బహిరంగ సభలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి విజయరాఘవన్, అధ్యక్షుడు పాటూరి రామయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకట్, తెలంగాణ సాయుధ పోరాటయోధురాలు మల్లుస్వరాజ్యం తదితరులు ప్రసంగించారు. భూ సంస్కరణ లతోనే పేదల అభివృద్ధి హన్మకొండ సిటీ : భూ సంస్కరణలతోనే పేదల అభివృద్ధి సాధ్యమని త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ అన్నా రు. బుధవారం హన్మకొండకు వచ్చిన ఆయన.. సర్క్యూ ట్ హౌస్‌లో మీడియాతో మాట్లాడారు. త్రిపురలో గత కాంగ్రెస్ ప్రభుత్వాలు భూమి పంపిణీ చేసినప్పటికీ సాగునీటి సౌకర్యం కల్పించలేదన్నారు. తమ ప్రభుత్వం వచ్చాక 98 శాతం సాగునీటి వసతి సౌకర్యం కల్పించామన్నారు. ఈశాన్య రాష్ట్రాలలో ఒకటైన త్రిపురలో అందుబాటులో ఉన్న వనరులను సద్వినియోగం చేసుకొని విద్యుత్ ఉత్పత్తి చేసుకుంటున్నామ ని, తమ రాష్ట్రంలో మిగులు విద్యుత్ ఉత్పత్తి అవుతుందని చెప్పారు. ఈ విద్యుత్‌ను విని యోగించడం ద్వారా పారిశ్రామికాభివృద్ధి సాధించాలనే అలోచనలో ఉన్నామన్నారు. ఆ హార భద్రత పథకం ప్రారంభించి ప్రతి కు టుంబానికి 35 కిలోల బియ్యం అందిస్తున్నామని ఆయన వివరించారు. ఉపాధి హామీ ప థకం సక్రమంగా అమలు చేస్తున్నామని, తెలంగాణలో కూడా భూ సంస్కరణలు చేపట్టి పకడ్భందీగా అమలు చేయాలని, అప్పుడే ఇక్కడి పేదల అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. అధికారులు, నాయకుల స్వాగతం జిల్లాకు వచ్చిన త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్సర్కార్కు జిల్లా కలెక్టర్ జి.కిషన్, అర్బన్ ఎస్పీ వెంకటేశ్వర్రావు స్వాగత ం పలికారు. సీపీఎం జిల్లా కార్యదర్శి జి.నాగయ్య, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్ బాస్కర్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ పి.సాంబశిరావు, డీఆర్వో సురేంద్రకరణ్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రవీందర్రావు కలిసి పుష్పగుచ్చాలు అందించారు. నేడు ప్రతినిధుల సభ వరంగల్ : హన్మకొండ నందన గార్డెన్ (సుందరయ్య నగర్)లో గురువారం ఉదయం ప్రతినిధుల సభ ప్రారంభమవుతుంది. ఉదయం 10.30 గంటలకు పతాకావిష్కరణ, 11గంటలకు ఆహ్వాన సంఘం చైర్మన్ ప్రొఫెసర్ నాగేశ్వర్రావు స్వాగతోపన్యాసం ఉంటుంది. 12గంటలకు ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్, ఆర్థికవేత్త ప్రభాత్ పట్నాయక్ ఉపన్యాసం ఉంటుంది. తర్వాత కార్యదర్శి నివేదిక సమర్పిస్తారు. ఈ మహాసభలో పాల్గొనేందుకు 29 రాష్ట్రాలకు చెందిన వెయ్యి మంది ప్రతినిధులు ఇప్పటికే చేరుకున్నారు. ప్రతినిధుల కోసం నగరంలోని పలు సెంటర్లలో వసతి కల్పించారు. ఈ మహాసభల్లో జాతీయ అధ్యక్షులు పాటూరు రామయ్య, జాతీయ ప్రధాన కార్యదర్శి విజయరాఘవన్, రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు జి.నాగయ్య, బి.వెంకట్, నాయకులు మురళీకృ ష్ణ, వెంకటేశ్వర్లు, జాతీయ నాయకులు పాల్గొంటారు. -
యూపీఏ బాటలోనే ఎన్డీయే
* కార్పొరేట్ శక్తుల గుప్పిట్లో బీజేపీ * మైనార్టీ వర్గాలపై పెరిగిన దాడులు * వామపక్షాలే దేశంలో ప్రత్యామ్నాయం * త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ * వరంగల్‌లో వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ మహాసభలు సాక్షి ప్రతినిధి, వరంగల్: కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం యూపీఏ దారిలోనే పయనిస్తోందని త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ విమర్శించారు. బీజేపీ పాలన.. పదేళ్ల యూపీయే ప్రభుత్వాన్ని తలపిస్తోందని చెప్పారు. అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం 8వ జాతీయ మహాసభలు వరంగల్‌లో బుధవారం ప్రారంభమయ్యూయి. ఆగస్టు 2 వరకు ఈ మహాసభలు జరుగనున్నాయి. బుధవారం సాయంత్రం జరిగిన బహిరంగసభలో మాణిక్ సర్కార్ ముఖ్యఅతిథిగా ప్రసంగించారు. కార్పొరేట్ శక్తుల గుప్పిట్లో బీజేపీ సర్కార్ ఉందని, వారి ప్రయోజనాలకే పెద్ద పీట వేస్తోందని విమర్శించారు. రైల్వే, సాధారణ బడ్జెట్లలో ధనికులకు, కార్పొరేట్ శక్తులకు పెద్ద పీట వేశారని విమర్శించారు. రైల్వే రవాణా, ప్రయాణ చార్జీలు, పెట్రోల్ ధరలు పెరిగాయని విమర్శించారు. బీజేపీకి ఆర్ఎస్ఎస్ ఆత్మగా పనిచేస్తోందని, దీని పట్టు నుంచి తప్పించుకోలేదని వ్యాఖ్యానించారు. మోడీ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత మితవాద శక్తులు విజృంభించాయని పేర్కొన్నారు. అమెరికా సామ్రాజ్యవాదానికి ప్రభుత్వం అనుకూలంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. ఉపాధిహామీ చట్టాన్ని మార్పులు చేస్తామంటూ నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆయన విమర్శించారు. ప్రజావ్యతిరేక విధానాలను అరికట్టి, దోపిడీ శక్తులను నిరోధించేందుకు వామపక్షాలే సరైన ప్రత్యామ్నాయమని చెప్పారు. దేశవ్యాప్తంగా విస్తరించి బలమైన ఉద్యమానికి ఈ మహాసభలు నాంది పలకాలని ఆకాంక్షించారు. సామాన్య ప్రజల జీవన ప్రమాణాలు పడిపోతున్నా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి విజయరాఘవన్ ఆవేదన వ్యక్తం చేశారు.సామాన్యులకు సామాజిక భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదేనన్నారు. ప్రజా సమస్యలపై పోరాడే సమయంలో పక్కదారి పట్టించేందుకు రెచ్చగొట్టే కుట్రలకు అవకాశం ఉందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. చంద్రబాబు లాంటివారు ఈ విషయంలో ముందుంటారని పేర్కొన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జి.నాగయ్య అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకట్, తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం, భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య తదితరులు ప్రసంగించారు. సభకు ముందు వరంగల్ నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. -
ప్రభుత్వ విధానాలపై ఉద్యమించండి: మాణిక్ సర్కార్
వరంగల్: వ్యవసాయ కార్మికులకు అనుబంధ రంగాలకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం విధానాలను అవలంభిస్తుందని త్రిపుర సీఎం మాణిక్య సర్కార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ విధానాలు పెట్టుబడిదారి, కార్పొరేట్ సంస్థలను కాపాడే విధంగా ఉందంటూ ఆయన విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా వ్యవసాయ కార్మికులంతా ఉద్యమానికి సిద్ధం కావాలని మాణిక్ సర్కార్ పిలుపునిచ్చారు. హితవాదం వైపు ప్రభుత్వం ప్రయాణిస్తుందని, దీనివల్లే దేశంలో మతఘర్షణలు చోటు చేసుకుంటున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ విధానాలు మైనార్టీ వ్యతిరేకంగా ఉన్నాయని, ఇది మంచిది కాదని త్రిపుర సీఎం మాణిక్య సర్కార్ తెలిపారు. -
పోరు పాఠం
నేటి నుంచి వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ మహాసభలు మొదటి రోజు ర్యాలీ, భారీ బహిరంగ సభ.. లక్ష మంది సమీకరణ లక్ష్యం హాజరుకానున్న త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్‌సర్కార్ మూడు రోజుల ప్రతినిధుల సభకు ఏర్పాట్లు పూర్తి వరంగల్: అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం 8వ జాతీయ మహాసభలకు ఓరుగల్లు ఆతిథ్యమివ్వబోతోంది. నాలుగు రోజుల పాటు జరిగే సభలు.. బుధవారం భారీ బహిరంగ సభతో ప్రారంభం కానున్నాయి. 31, 1, 2 తేదీల్లో హన్మకొండలోని నందనాగార్డెన్ (సుందరయ్యనగర్)లో ప్రతినిధుల సభ జరుగుతుంది. దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచి వెయ్యి మంది ప్రతి నిధులు ఈ మహాసభలకు హాజరవుతున్నారు. వరంగల్‌లోని ఓసిటీలో జరిగే బహిరంగ సభకు ఏర్పాట్లు చేశారు. సాయంత్రం 4గంటలకు సభ ప్రారంభమవుతుందని నిర్వాహకులు చెప్పారు. సభకు ముందు మధ్యాహ్నం 2గంట లకు వరంగల్ రైల్వేస్టేషన్ నుంచి చౌరస్తా, పోచమ్మమైదాన్, వెంకట్రామ థియేటర్ మీదుగా ఓసిటీ వరకు 25వేల మందితో ర్యాలీ నిర్వహించనున్నారు. ర్యాలీకి ముందు భాగంలో డప్పు కళాకారులు, ప్రజానాట్యమండలి కళాకారులు, విచిత్ర వేషధారణ, గిరిజన సంప్రదాయ ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నారు. ఈ సభకు తెలంగాణ, ఏపీలోని వివిధ జిల్లాల నుంచి లక్ష మందిని సమీకరిస్తున్నారు. ఈ బహిరంగ సభకు త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ ముఖ్యఅతిథిగా హాజరవుతున్నారు. బహిరంగ సభా ప్రాంగణానికి తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ ప్రాంగణంగా నామకరణం చేశారు. సభాస్థలం వద్ద అమరవీరులు దొడ్డి కొమురయ్య, ఏసీరెడ్డి నర్సింహారెడ్డిల పేరిట మహాద్వారాలు ఏర్పాటు చేశారు. సభకు వ్యవసాయ కార్మిక సంఘం అఖిల భారత అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పాటూరి రామయ్య, విజయరాఘవన్, సంఘం నాయకులు బీవీ రాఘవులు, మల్లు స్వరాజ్యం, తమ్మినేని వీరభద్రం, సున్నం రాజయ్య, బి.వెంకట్, పిన్నమనేని మురళీకృష్ణ, వి.వెంకటేశ్వర్లు హాజరవుతారు. వ్యవసాయ కార్మిక సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షడు జి.నాగయ్య సభకు అధ్యక్షత వహిస్తారు. మహాసభల సందర్భంగా హన్మకొండ, చౌరస్తా, అంబేద్కర్ సెంటర్, పోచమ్మమైదాన్, రైల్వేస్టేషన్, వరంగల్ చౌరస్తా, వెంకట్రామ సెంటర్, ఎంజీఎం సెంటర్లలో తోరణాలు, బ్యానర్లతో అలంకరించారు. సుమారు 500 మంది వలంటీర్లు మహాసభల నిర్వహణలో పాల్గొంటున్నారు. రేపు మహాసభ ప్రారంభం హన్మకొండలోని నందనాగార్డెన్ (సుందరయ్యనగర్)లో గురువారం ఉదయం 11గంటలకు వ్యవసాయకార్మిక సం ఘం 8వ జాతీయ మహాసభలను ఆర్థికవేత్త, ఢిల్లీ యూనివర్సీటీ ప్రొఫెసర్ ప్రభాత్ పట్నాయక్ ప్రారంభిస్తారు. నగరంలోని ప్రముఖులు, ఉద్యోగ సంఘాల నాయకులు హాజరవుతారు. ఆగస్టు 1వ తేదీ సాయంత్రం 6 గంటలకు హన్మకొం డ పబ్లిక్‌గార్డెన్‌లో ‘గ్రామీణ పేదలు-భారత దేశం’ అనే అంశంపై సెమినార్ ఏర్పాటు చేశారు. ఈ సెమినార్‌కు ప్రముఖ జర్నలిస్టు సాయినాథ్ హాజరవుతున్నారు. 2వ తేదీ న సంఘానికి సంబంధించిన వివిధ అంశాలు, ప్రణాళిక, కార్యక్రమాలపై చర్చించి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకుం టారు. ఓ సిటీలో బహిరంగ సభకు ఏర్పాట్లు పూర్తయ్యూయని, సభకు సంఘీభావంగా నగర ప్రజలు హాజరై విజయవంతం చేయాలని సీఐటీయూ నేత మెట్టు శ్రీనివాస్ కోరారు. -
త్రిపురలో 85%, అస్సాంలో 76%
ఉత్సాహంగా ఓటింగ్‌లో పాల్గొన్న ప్రజలు ప్రశాంతంగా ముగిసిన పోలింగ్ అగర్తల/గువాహటి: సార్వత్రిక ఎన్నికల రణరంగంలో తొలి దశ పోలింగ్ పర్వం ఘనంగా మొదలైంది. అస్సాంలో 5 లోక్‌సభ స్థానాలకు (తేజ్‌పూర్, కలియాబోర్, జార్హాత్, దిబ్రూగఢ్, లఖీంపూర్), త్రిపురలో ఒక లోక్‌సభ స్థానానికి (త్రిపుర-వెస్ట్) సోమవారం జరిగిన పోలింగ్‌లో మహిళలు, వృద్ధులు, యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు. త్రిపురలో 85 శాతం పోలింగ్ నమోదవగా అస్సాంలో 76 శాతం ఓటింగ్ నమోదైంది. తేజ్‌పూర్ నియోజకవర్గంలో మారుమూల గ్రామమైన ఫుల్గురి నేపాలిపామ్ గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన 301 మంది ఓట్లు వేశారు. అస్సాం సీఎం తరుణ్ గొగోయ్, భార్య డాలీ గొగోయ్, కుమారుడు గౌరవ్ గొగోయ్.. జోర్హాత్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ‘‘అస్సాంలో మోడీ మేజిక్కేమీ లేదు, ఉన్నదల్లా నా మేజిక్కే. మేం పది స్థానాలు గెలుస్తామని ఇంతకుముందే చెప్పాను. కాంగ్రెస్ అంతకంటే ఎక్కువే గెలుస్తుందని ఇప్పుడు చెప్తున్నాను’’ అని తరుణ్ గొగోయ్ ఓటేసిన అనంతరం చెప్పారు. త్రిపుర సీఎం, సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు మాణిక్ సర్కార్ సోమవారం విలేకరులతో మాట్లాడుతూ దేశంలో మోడీ గాలి ఏమీ లేదని, కార్పొరేట్ మీడియాయే దాన్ని సృష్టించిందని విమర్శించారు. అస్సాంలోని 5 స్థానాలకు గొగోయ్ కుమారుడు గౌరవ్ సహా 51 మంది అభ్యర్థులు బరిలో నిలవగా త్రిపుర-వెస్ట్ నుంచి 13 మంది అభ్యర్థులు పోటీ చేశారు. పోలింగ్ శాతం పెరిగే అవకాశం... త్రిపురలో రాత్రి 7 గంటలకు 200 పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు ఇంకా బారులుతీరి ఉన్నందున పోలింగ్ శాతం పెరగొచ్చని త్రిపుర ప్రధాన ఎన్నికల అధికారి అశుతోష్ జిందాల్ తెలిపారు. త్రిపురలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదన్నారు. అస్సాంలో సాంకేతిక కారణాల వల్ల 93 ఈవీఎంలను మార్చామని...ఈ కారణంగా పోలింగ్‌కు కాసేపు అంతరాయం ఏర్పడటం వల్ల రీపోలింగ్ నిర్వహించే అవకాశం ఉందని అస్సాం ప్రధాన ఎన్నికల అధికారి విజయేంద్ర తెలిపారు. అయితే దీనిపై ఈసీ తుది నిర్ణయం తీసుకుంటుందన్నారు. మొత్తంమీద తొలి దశ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 2009 సార్వత్రిక ఎన్నికల్లో అస్సాంలో మొత్తంగా 69.60 పోలింగ్ శాతం నమోదవగా త్రిపుర-వెస్ట్‌లో 86.25 శాతం పోలింగ్ నమోదైంది. అస్సాంలోని మరో మూడు స్థానాలకు, త్రిపురలోని మరో స్థానానికి ఈ నెల 12న రెండో దశలో పోలింగ్ జరగనుంది. -
రాజకీయ లబ్ధి కోసమే ఆంధ్రప్రదేశ్ విభజన:త్రిపుర సీఎం
అగర్తల: త్రిపుర రాష్ట్ర విభజనకు సంబంధించి ఎలాంటి ప్రయత్నాలను అనుమతించేది లేదని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ స్పష్టం చేశారు. అలాంటి విభజన ప్రయత్నాలను తనశక్తి కొలదీ అడ్డుకుంటానని చెప్పారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాలను ఆశించే ఆంధ్రప్రదేశ్‌ను విభజించి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడానికి నిర్ణయించిందని ఆయన విమర్శించారు. దీన్ని చూసి త్రిపుర విభజనకు ఒక చిన్న పార్టీ కూడా డిమాండ్ చేయడం మొదలు పెట్టిందన్నారు. అమర్పూర్లో 14వ గిరిజన యువత సమాఖ్య సమావేశం సందర్భంగా సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. 40ఏళ్లుగా నెలకొన్న తీవ్రవాద సమస్యను తాము పరిష్కరించగలిగామని.. కానీ, కొంతమంది రాజకీయ ప్రయోజనాల కోసం తీవ్రావాదాన్ని పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. గిరిజన రాజకీయ పార్టీ అయిన త్రిపుర దేశీయ ప్రజాఫ్రంట్(ఐపీఎఫ్టీ) త్రిపురలో వెనుకబడ్డ గిరిజన ప్రాంతాలతో ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తోంది. ఈ నెల 10న ఢిల్లీలో నిరాహారదీక్ష కూడా నిర్వహించింది. కేంద్ర హోంశాఖకు తాము 8 పేజీల వినతి పత్రాన్ని ఇచ్చామని, తమకు కేంద్ర ప్రభుత్వానికి మధ్య చర్చలు జరుగుతున్నాయని ఐపీఎఫ్టీ అధ్యక్షుడు నరేంద్రచంద్ర దెబ్బర్మ ఆదివారం తెలిపారు. చిన్న ఈశాన్య రాష్ట్రమైన త్రిపుర విభజన డిమాండ్‌కు స్థానికంగా ఇతర రాజకీయ పార్టీల నుంచి ఏ మాత్రం మద్దతివ్వడం లేదు.