నాగలిని చూపుతున్న బీఎల్‌ఎఫ్ అభ్యర్థి పాల్వంచ రామారావు, పక్కన త్రిపుర మాజీ ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ తదితరులు
సాక్షి, ఖమ్మంమయూరిసెంటర్: ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబించడంలో, అవినీతిల కేసీఆర్‌కు.. మోదీ ఆదర్శమన్నట్లు వ్యవహరించారని, కేసీఆర్‌కు ఓటేస్తే.. మోదీకి ఓటు వేసినట్లేనని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు, త్రిపుర మాజీ ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ అన్నారు. ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గ బీఎల్‌ఎఫ్ అభ్యర్థి పాల్వంచ రామారావు గెలుపును కాంక్షిస్తూ నగరంలోని వర్తక సంఘం భవనంలో ఆదివారం ఎన్నికల బహిరంగ సభ నిర్వహించారు. సభకు ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ మోదీ పాలనలో పెట్రోల్, డీజిల్ ధరలకు, ప్రజల నిత్యావసర వస్తువుల ధరలకు అడ్డూ అదుపులేకుండా పోయిందని అన్నారు. రూపాయి విలువ పతనం దేశచరిత్రలో క్షీణదశకు చేరుకుందని పేర్కొన్నారు. వ్యవసాయం అత్యంత సంక్షోభానికి చేరుకుందని, ఆత్మహత్యలు విపరీతంగా పెరిగాయని ఆవేదన వ్యక్తంచేశారు.
నోట్ల రద్దుతో కోటి మంది ప్రత్యక్షంగా.. పరోక్షంగా ఉపాధి కోల్పోయారని, దేశంలో సన్న, చిన్న వ్యాపారులు తీవ్ర నష్టాన్ని చవిచూశారని చెప్పారు. మోదీ పాలనలో సుప్రీంకోర్టు, సీబీఐ, ఆర్‌బీఐ, ఎన్నికల కమిషన్, విశ్యవిద్యాలయాలు, ఆర్డినెన్స్‌లలో జ్యూడిషియరీ, నాన్ జ్యూడిషియరీ వ్యవస్థలన్నీ తమ స్వతంత్రతను కోల్పోయాయన్నారు. రాష్ట్రాల హక్కులను హరించారని ఆరోపించారు. ఈ విధానాల అమలు అన్నింటిలో కేంద్ర నిర్ణయానికి కేసీఆర్ మద్దతుగా నిలిచి భాగస్వామి అయ్యారని, కేంద్రానికి కేసీఆర్ అనుచరుడిగా మిగిలారని అన్నారు. సామాజిక న్యాయం.. సమగ్రాభివృద్ధి కోరుకునే బీఎల్‌ఎఫ్‌కి ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు యర్రా శ్రీకాంత్, జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, డాక్టర్ రవీంద్రనా«థ్ నాయకులు కల్యాణం వెంకటేశ్వరరావు, అఫ్రోజ్ సమీనా, యర్రా శ్రీనివాసరావు, వై.విక్రమ్, తుశాకుల లింగయ్య, బండారు రమేష్, జబ్బార్, మీరా, దొంగల తిరుపతిరావు, నవీన్‌రెడ్డి, వీరభద్రం, పెరుగు వెంకటరమణ యాదవ్, లతీఫ్, పెల్లూరి విజయ్‌కుమార్, బండారు యాకయ్య, వజినేపల్లి శ్రీనివాసరావు, బండారు వీరబాబు, యర్రా గోపి, భూక్యా శ్రీనివాసరావు, యర్రా సుకన్య, నాగసులోచన, మద్ది సత్యం, సైదులు, బజ్జూరి రమణారెడ్డి, సుధీర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment