బీజేపీ నేత హిమాంత బిస్వా శర్మ (ఫైల్ ఫొటో)
సాక్షి, న్యూఢిల్లీ: త్రిపుర అసెంబ్లీకి మరో రెండు రోజుల్లో జరగనున్న ఎన్నికల్లో బీజేపీనే విజయం సాధిస్తుందని ఎన్నికల్లో బీజేపీ ఇంఛార్జ్ గా వ్యవహరిస్తున్న హిమాంత బిస్వా శర్మ ధీమా వ్యక్తం చేశారు. ప్రజల్లో సీఎం మాణిక్ సర్కార్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉందని, అదే సమయంలో బీజేపీ అంటే నమ్మకం ఏర్పడిందన్నారు. జాతీయ మీడియా న్యూస్18తో ఇంటర్వ్యూ సందర్భంగా పలు విషయాలు వెల్లడించారు.
అసోంకు చెందిన వ్యక్తిని అయినప్పటికీ నాపై నమ్మకం ఉంచి బీజేపీ అధిష్టానం త్రిపుర ఎన్నికల ఇంఛార్జీగా నియమించింది. నాకు తెలిసినంతవరకూ బీజేపీ సేఫ్ జోన్‌లోనే ఉంది. బీజేపీ 35-40 స్థానాల్లో విజయం సాధించి అధికారంలోకి రావడం ఖాయంగా కనిపిస్తోంది. ఇంకా చెప్పాలంటే సీఎం మాణిక్ సర్కార్ ఓడిపోతారని విశ్వసిస్తున్నాను. ప్రధాని నరేంద్ర మోదీ చివరి రెండు రోజుల్లో చేసిన పర్యటనలతో బీజేపీ అభ్యర్థులతో పాటు కార్యకర్తల్లో నూతన ఉత్సాహం వచ్చింది.
అధికార సీపీఎంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతతో పాటు ప్రధాని మోదీపై నమ్మకం బీజేపీని గెలుపు దిశగా తీసుకెళ్తాయి. అసోం, మణిపూర్‌లో వచ్చిన ఫలితాలే త్రిపురలోనూ నరావృతం అవుతాయి. అందులో ఎలాంటి సందేహం అక్కర్లేదు. సీపీఐ-ఎం భావజాలంతో బీజేపీ ఏనాడూ కలవదు. మరోవైపు బీజేపీ ఎక్కడ నెగ్గుతుందేమోనన్న భయంతో సీపీఎం పార్టీ భారీ మొత్తాల్లో ప్రజలకు డబ్బులు పంచుతుంది. అయితే ఆ డబ్బు విరాళాల రూపంలో వచ్చింది కాకపోవడమే సీపీఎం పాలిట శాపంగా మారనుంది. మార్కెట్లో రూ.150 కోట్ల మేర వసూలు చేసినట్లు ప్రధాన ఎన్నికల అధికారికి, త్రిపుర డీజీపీకి ఫిర్యాదు చేశామని బీజేపీ నేత హిమాంత బిస్వా శర్మ వివరించారు. 60 అసెంబ్లీ స్థానాలున్న త్రిపురలో ఫిబ్రవరి 18న ఎన్నికలు జరగనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment