అగర్తలా: రాజకీయ నేతలంటే భారీగా ఆస్తులు, కోట్లకొద్దీ డబ్బు అనే అభిప్రాయం ప్రజల్లో ఉంది. అయితే, ఇప్పటికి నాలుగుసార్లు సీఎంగా పనిచేసి, ఐదోసారి బరిలోకి దిగుతున్న త్రిపుర సీఎం మాణిక్ సర్కార్(69) సొంత ఆస్తి వివరాలు చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలుగకమానదు. రాష్ట్ర అసెంబ్లీకి త్వరలో ఎన్నికలు జరుగనుండగా ఆయన ధన్‌పూర్ స్థానానికి సీపీఎం తరఫున సోమవారం నామినేషన్ వేశారు.
ఈ నామినేషన్ పత్రాల్లో ఆస్తిపాస్తుల వివరాలను సర్కార్ పొందుపరిచారు. వీటి ప్రకారం..మాణిక్ సర్కార్ వద్ద ఉన్న నగదు రూ.1,520 కాగా, బ్యాంకు ఖాతాలో ఉన్న డబ్బు రూ.2,410 మాత్రమే. ఈయనకు వ్యవసాయ భూములు గానీ ఇళ్ల స్థలాలు గానీ లేవు. ముఖ్యమంత్రికి ప్రభుత్వం నుంచి అందే వేతనం మొత్తాన్ని పార్టీకి విరాళంగా ఇస్తూ పార్టీ నుంచి జీవనభృతిగా నెలకు రూ.5వేలు మాత్రం పొందుతున్నారు.
కాగా, మాణిక్ సర్కారు సతీమణి పాంచాలీ భట్టాచార్య కేంద్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగిని. ఈమె వద్ద నగదు రూ.20,140కాగా రెండు బ్యాంకు ఖాతాల్లో కలిపి దాదాపు రూ.2 లక్షల నగదు ఉంది. వీటితోపాటు రూ.9.25 లక్షల ఫిక్స్‌డ్ డిపాజిట్లు.. 20 గ్రాముల బంగారు నగలు ఉన్నాయి. ఈమె పేరుతో రూ.21 లక్షల విలువైన 888.35 చదరపు అడుగుల ఇంటి స్థలంలో రూ.15 లక్షల విలువైన ఇల్లు ఉంది.
Comments
Please login to add a commentAdd a comment