
పార్టీ జిల్లా అధ్యక్షులకు ప్రాధాన్యం
నామినేటెడ్ పదవులు, టికెట్ల కేటాయింపు ప్రక్రియలో భాగస్వామ్యం
మీనాక్షి నటరాజన్ ప్రతిపాదనలకు ఏఐసీసీ గ్రీన్‌సిగ్నల్
మారనున్న డీసీసీ అధ్యక్షుల నియామక ప్రక్రియ
జిల్లాకు ముగ్గురి పేర్లతో ప్యానల్..స్థానిక నేతల మొగ్గు ఉన్న వారికే పదవి
సాక్షి, హైదరాబాద్: జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ)లు ఇకపై బలోపేతం కానున్నాయి. పార్టీ జిల్లా అధ్యక్షులకు అధిక ప్రాధాన్యత లభించనుంది. నామినేటెడ్ పదవుల భర్తీ ప్రక్రియ మొదలు స్థానిక సంస్థలు, అసెంబ్లీ, లోక్‌సభ టికెట్ల కేటాయింపులోనూ డీసీసీ అధ్యక్షులను భాగస్వాములను చేయాలని రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ భావిస్తున్నారు.
ఈ మేరకు ఆమె చేసిన ప్రతిపాదనకు ఏఐసీసీ కూడా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. లోక్‌సభ టికెట్ల కేటాయింపు కోసం ఏఐసీసీ ఏర్పాటు చేసే సెంట్రల్ ఎలక్షన్ కమిటీ (సీఈసీ) తరహాలోనే రాష్ట్ర స్థాయిలో టికెట్ల కేటాయింపు కోసం ఏర్పాటు చేసే కమిటీల్లో డీసీసీ అధ్యక్షులను నియమించాలని ఆమె ప్రతిపాదించినట్టు తెలుస్తోంది.
సిఫారసులు, లాబీయింగ్‌కు చెల్లుచీటీ
రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో సంస్థాగతంగా భారీ మార్పులు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు ప్రధాన నాయకుల సిఫారసు, లాబీయింగ్ ప్రాతిపదికన జరుగుతున్న జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుల నియామక ప్రక్రియ ఇకపై పూర్తిగా మారిపోనుంది. మీనాక్షి నటరాజన్ మార్కు డీసీసీ అధ్యక్షుల నియామకాల్లో కనిపించనుందనే చర్చ గాందీభవన్ వర్గాల్లో జరుగుతోంది. పార్టీలో జిల్లా, బ్లాక్, మండల కాంగ్రెస్ అధ్యక్ష పదవులు కీలకమైనందున పీసీసీ అధ్యక్షుడి పర్యవేక్షణలో ఈ మూడు స్థాయిల్లోని పదవులను పకడ్బందీగా భర్తీ చేయాలని ఆమె యోచిస్తున్నట్టు సమాచారం.
ముఖ్యంగా డీసీసీ అధ్యక్షుల నియామకంలో సిఫారసులకు కాకుండా స్థానిక నాయకత్వం అభిప్రాయాలకు ప్రాధాన్యతనివ్వాలని పార్టీ ఇన్‌చార్జి భావిస్తున్నారు. అందులో భాగంగా డీసీసీ అధ్యక్ష పదవుల కోసం జిల్లాకు మూడు పేర్లతో ప్యానెల్ తయారు చేయాలని, ఆ మూడు పేర్లపై స్థానిక నాయకుల నుంచి అభిప్రాయసేకరణ జరిపి, ఎవరికి ఎక్కువ మొగ్గు కనిపిస్తే వారిని డీసీసీ అధ్యక్షులుగా నియమించాలని నిర్ణయించినట్లు తెలిసింది. ప్రస్తుత కసరత్తు నేపథ్యంలో జిల్లా అధ్యక్షుల నియామకానికి కొంత సమయం పడుతుందని గాంధీభవన్ వర్గాలంటున్నాయి.
త్వరలో టీపీసీసీ కార్యవర్గం!
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న టీపీసీసీ కార్యవర్గం కూడా త్వరలోనే వస్తుందని తెలుస్తోంది. ప్రస్తుతానికి పీసీసీకి నలుగురు వర్కింగ్ ప్రెసిడెంట్లు, 20 మంది వరకు ఉపాధ్యక్షులను నియమిస్తారని, ప్రధాన కార్యదర్శులతో పాటు కార్యదర్శులు, అధికార ప్రతినిధులు తదితర పదవులు ఆ తర్వాత ప్రకటిస్తారని సమాచారం. వాస్తవానికి దీపాదాస్ మున్షీ ఇన్‌చార్జిగా ఉన్నప్పుడే పీసీసీ కార్యవర్గంపై కసరత్తు జరిగింది.
సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సీనియర్ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌లు మున్షీతో భేటీ అయి టీపీసీసీ కార్యవర్గం కోసం కొంత కసరత్తు చేశారు. అయితే మీనాక్షి బాధ్యతలు తీసుకున్న తర్వాత ఈ జాబితాను పూర్తిగా పక్కన పెట్టారని, పార్టీలో సీనియార్టీ, గతంలో నిర్వహించిన పదవుల ప్రాతిపదికన ఆమె జిల్లాల వారీగా జాబితాను తయారు చేస్తున్నట్టు సమాచారం. నెలాఖరుకు కొత్త కార్యవర్గాన్ని ప్రకటిస్తారని తెలుస్తోంది.
మంత్రివర్గ విస్తరణకూ మోక్షం?
రాష్ట్రంలో చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న మంత్రివర్గ విస్తరణ అంశాన్ని కూడా పరిష్కరించాలని ఏఐసీసీ నిర్ణయించింది. ఇందుకోసం పలుమార్లు రాష్ట్ర నాయకత్వంతో చర్చలు జరిపిన ఢిల్లీ పెద్దలు ఓ అభిప్రాయానికి వచ్చారని, సామాజిక కోణంలో ఐదు లేదా ఆరు బెర్తులు భర్తీ చేసే విధంగా త్వరలోనే గ్రీన్‌సిగ్నల్ వస్తుందని గాం«దీభవన్ వర్గాలంటున్నాయి. అంతా సవ్యంగా జరిగితే నెలాఖరులోపు మంత్రివర్గ విస్తరణ ఉంటుందని సమాచారం. అదేవిధంగా పెండింగ్‌లో ఉన్న నామినేటెడ్ పదవుల జాబితాకు కూడా క్లియరెన్స్ ఇప్పించేందుకు మీనాక్షి తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment