అధికార, పార్టీ పదవులకు సమర్థుల కోసం అన్వేషణ
70 వరకు నామినేటెడ్ పోస్టులు ఖాళీ
పీసీసీ కీలక పదవులకు 100 మంది నేతల అవసరం
సామాజిక, ప్రాంతీయ సమీకరణల ఆధారంగా కసరత్తు
ఈ నెలాఖరు నాటికి భర్తీ చేయాలని ఏఐసీసీ ఆదేశం
సాక్షి, హైదరాబాద్: పార్టీ, ప్రభుత్వ పదవుల భర్తీ ప్రక్రియ టీపీసీసీకి కత్తిమీద సాములా మారింది. కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్లు, ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, జిల్లా పార్టీ అధ్యక్షులు, కార్పొరేషన్ల చైర్మన్లు, కమిషన్ల సభ్యులు, ఏఐసీసీ కార్యదర్శులు, ఎమ్మెల్సీ పదవులకు సమర్థుల కోసం ఏఐసీసీ, పీసీసీ అన్వేషిస్తున్నాయి. పార్టీ కార్యవర్గంతో పాటు నామినేటెడ్ పోస్టులను ఈ నెలాఖరు నాటికి భర్తీ చేయాలన్న ఏఐసీసీ ఆదేశాల మేరకు టీపీసీసీ కసరత్తు ముమ్మరం చేసింది.
జంబో కార్యవర్గం..
ఈసారి టీపీసీసీ కార్యవర్గాన్ని ఆచితూచి ఎంపిక చేయాలని ఏఐసీసీ, టీపీసీసీ భావిస్తున్నాయి. పీసీ సీకి నలుగురు వర్కింగ్ ప్రెసిడెంట్లను నియమిస్తా రని తెలుస్తోంది. పీసీసీ అధ్యక్షుడిగా బీసీ నేత ఉన్నందున, రెడ్డి సామాజిక వర్గానికి వర్కింగ్ ప్రెసిడెంట్ (ఆర్గనైజేషన్) ఇస్తారని, మరో మూడు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవులు ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల నేతలకు ఇస్తారనే చర్చ జరుగుతోంది.
వీటి తో పాటు ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి ఒక వైస్ ప్రెసిడెంట్ పదవి, ప్రతి జిల్లాకు ఇద్దరు ప్రధాన కార్యదర్శులను నియమించాలని నిర్ణయించారు. పార్టీ అధికార ప్రతినిధులుగా మరో 10 మంది, పీసీసీ కార్యదర్శులుగా 50 మందిని నియమించే అవకాశాలున్నాయి. ఇవన్నీ కలిపి దాదాపు 200 వరకు పెరిగి పీసీసీ జంబో కార్యవర్గం ఉండవచ్చని అంచనా.
ఈ పదవుల భర్తీపై ఇప్పటికే రెండు సార్లు సీఎం రేవంత్‌రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్ మున్షీలు భేటీ అయ్యారు. దాదాపు 10 జిల్లాలకు ఎమ్మెల్యేలే పార్టీ అధ్యక్షులుగా ఉన్నా రు. వీరిలో కొందరిని తప్పించి, సమర్థులైన మరికొందరు ఎమ్మెల్యేలను డీసీసీ అధ్యక్షులుగా నియమించాలని భావిస్తున్నారు.
నామినేటెడ్ పోస్టులపై ఆచితూచి..
నామినేటెడ్ పోస్టుల భర్తీ కూడా గత ఎనిమిది నెలలుగా వాయిదా పడుతూ వస్తోంది. పార్లమెంటు ఎన్నికలకు ముందు 33 కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించారు. మరో 40 వరకు కార్పొరేషన్ పదవులు ఖాళీగా ఉన్నట్టు సమాచారం. వీటితో పాటు పలు కమిషన్లలో మరో 30 మంది వరకు అవకాశం కల్పించవచ్చు.
అంటే 70 వరకు పదవులు ఇవ్వొ చ్చని ప్రచారం జరుగుతోంది. వీటికి ఆయా కార్పొరేషన్ల డైరెక్టర్ల పోస్టులను కలిపితే వందల సంఖ్యలో ఉంటాయి. ఈ పోస్టుల భర్తీపై సామాజిక, ప్రాంతీయ సమీకరణల కసరత్తు ఎటూ తేలకపోవడంతో ఇప్పటికే పలుమార్లు ఈ ప్రక్రియ వాయిదా పడింది.
ఎమ్మెల్సీ హడావుడి
కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ఎమ్మెల్సీ హడావుడి కనిపిస్తోంది. మార్చి నాటికి 8 ఎమ్మెల్సీలు పదవీ విరమణ చేస్తారు. వీటిలో మెజారిటీ సీట్లు దక్కించుకునేందుకు కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తోంది. కరీంనగర్–నిజామాబాద్–ఆదిలాబాద్–మెదక్ పట్టభద్రుల స్థానం నుంచి పోటీకి ఆల్ఫోర్స్ నరేందర్‌రెడ్డి, ముస్కు రమణారెడ్డి, ముదనం గంగాధర్, హరికృష్ణ, వెల్చాల రాజేందర్ పేర్లు రేసులో వినిపిస్తున్నాయి.
రెండు టీచర్ ఎమ్మెల్సీల విషయంలో మిత్రపక్ష ఉపాధ్యాయ సంఘాలకు మద్దతిచ్చే ఆలోచనలో కాంగ్రెస్ ఉంది. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీల్లో మూడు పదవులు నికరంగా కాంగ్రెస్‌కు రానున్నాయి. ఈ కోటాలో ప్రస్తుత ఎమ్మెల్సీ టి. జీవన్‌రెడ్డికి మళ్లీ అవకాశం వస్తుందని చెబుతున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి విదేశీ పర్యటన అనంతరం ఇతర పోస్టులపై స్పష్టత వస్తుందని, నెలాఖరు కల్లా అధికారికంగా ప్రకటిస్తారని తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment