
మంత్రులు జిల్లాలకు వెళ్తే పార్టీ కోఆర్డినేటర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలకు సమాచారమివ్వాలి
టీడీపీ నేతలతో టెలీకాన్ఫరెన్స్‌లో సీఎం చంద్రబాబు
సాక్షి, అమరావతి: నామినేటెడ్ పదవుల కోసం ఇప్పటికీ కొందరు ఎమ్మెల్యేలు వారి నియోజకవర్గాల నుంచి పేర్లను ఇవ్వలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఎమ్మెల్యేలు ఆలస్యం చేయడం వల్లే పోస్టులు భర్తీ చేయలేకపోయామని తెలిపారు. నామినేటెడ్ పదవుల కోసం పార్టీ కోసం కష్టపడిన నేతల వివరాలను వీలైనంత త్వరగా పంపించాలని సూచించారు. ఆయన శుక్రవారం ఉండవల్లిలోని తన నివాసం నుంచి పార్టీ నేతలు, కార్యకర్తలతో టెలీకాన్ఫరెన్స్‌లో మాట్లాడారు.
21 ప్రధాన దేవాలయాలకు చైర్మన్ల నియామకానికి 60 వేల దరఖాస్తులు వచ్చాయని, వాటని నిశితంగా పరిశీలిస్తున్నామని చెప్పారు. మంత్రులు జిల్లాలకు వెళ్లే సమయంలో జిల్లా కోఆర్డినేటర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలకు సమాచారం ఇవ్వాలని చెప్పారు. పీఎం సూర్యఘర్ పథకాన్ని ప్రతి గ్రామంలో అమలు చేసేందుకు ఎమ్మెల్యేలు, నేతలు చొరవ తీసుకోవాలని చెప్పారు.