నామినేటెడ్‌ పదవుల కోసం బాబు సర్వే | - | Sakshi
Sakshi News home page

నామినేటెడ్‌ పదవుల కోసం బాబు సర్వే

Published Mon, Jul 15 2024 1:01 PM | Last Updated on Mon, Jul 15 2024 1:09 PM

నామినేటెడ్‌ పదవుల కోసం బాబు సర్వే

నామినేటెడ్‌ పదవుల కోసం బాబు సర్వే

ఐవీఆర్‌ఎస్‌ సర్వేపై బెంబేలెత్తుతున్న టీడీపీ క్యా‘డర్‌’ 

 సర్వేలో నెగ్గితే తప్ప పదవుల్లేవు 

 నెలరోజులుగా ఎమ్మెల్యేలతో అంటకాగిన ఆశావహులు 

 కొత్త మెలికతో కళ్లు బైర్లు 

 జనసేన, బీజేపీ నాయకులతో పోటీ 

 ఐదేళ్లు పార్టీ కోసం కష్టపడినా గుర్తింపు లేదా? అని నిట్టూర్పు 

 నేతల్లో రాజుకుంటున్న అసంతృప్తి 

నామినేటెడ్‌ పోస్టుల విషయంలో చంద్రబాబు అనుసరిస్తున్న కొత్త పంథా చూసి పార్టీ క్యాడర్‌ గగ్గోలు పెడుతోంది. పార్టీ అధికారంలోకి వస్తే కష్టపడిన నాయకులకు తగిన గుర్తింపునిస్తామన్న బాబు తీరా ‘కూటమి’గా జతకట్టి అధికారంలోకి రావడంతో ఆశావహుల విషయంలో పాము చావకుండా..కర్రా విరగకుండా అనే లెవెల్లో వారికి అగ్నిపరీక్ష పెట్టారు. తాను నిర్వహించే సర్వేలో ఎవరికి జనాదరణ ఉందో వారికే నామినేటెడ్‌ పదవులంటూ ఝలక్‌ ఇచ్చారు. పదవుల కోసం కూటమి నేతల మధ్య తీవ్ర పోటీ నెలకొన్న తరుణంలో సర్వే చర్చనీయాంశమైంది. బహిరంగంగానే టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు.

సాక్షి ప్రతినిధి, తిరుపతి: పార్టీ అధికారంలోకి వస్తే నామినేటెడ్‌ పదవులు వస్తాయని భావించి పనిచేసిన నాయకులకు అధినేత షాక్‌ ఇచ్చారు. ఎమ్మెల్యే అభ్యర్థిత్వానికే కాదు.. నామినేటెడ్‌ పోస్టులు కావాలన్నా సర్వేలో నిరూపించుకోవాల్సిందేనని మరోసారి తేల్చిచెప్పారు. అధినేత తీరుపై పార్టీ కేడర్‌లో తీవ్ర అసహనం వ్యక్తమవుతోంది. అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం నామినేటెడ్‌ పదవుల కోసం టీడీపీ, బీజేపీ, జనసేన నేతలు పోటీపడుతున్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో శాసనసభ, లోకసభ స్థానాలకు అభ్యర్థుల ఎంపికలో అవలంభించిన ఐవీఆర్‌ఎస్‌ సర్వేను నామినేటెడ్‌ పదవుల కేటాయింపులోనూ అనుసరించాలని టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు భావించినట్లు తెలుస్తోంది. 

దీంతో పదవుల కోసం నెల రోజులుగా ఎమ్మెల్యేలు, మంత్రులతో టచ్‌లో ఉన్న నాయకుల ఆశలన్నీ నీరుగారిపోయాయి. తిరుమల–తిరుపతి దేవస్థానం పాలకమండలి చైర్మన్‌తో పాటు శ్రీకాళహస్తి దేవస్థానం, తుడా చైర్మన్‌తో పాటు వివిధ కార్పొరేషన్‌ అధ్యక్ష, సభ్యుల కోసం ఎవరికి వారు పోటీపడుతున్న విషయం తెలిసిందే. పార్టీ కోసం కష్టపడిన వారిని పక్కనబెట్టిన అధిష్టానం సర్వే నివేదిక సమాచారం చూపించి తప్పించుకునేందుకు ప్రయత్నాలను ప్రారంభించింది. అందులో భాగంగా ఐవీఆర్‌ఎస్‌ సర్వే పేరుతో ఆలస్యం చేయడంతో పాటు.. తమకు అనుకూలమైన వారికి పదవులు కట్టబెట్టి, రాని వారికి సర్వేలో అనుకూలంగా రాలేదని చెప్పి, తప్పించుకునేందుకు ఎత్తుగడ వేసింది! పార్టీ అధిష్టానం ఐవీఆర్‌ఎస్‌ సర్వే పేరుతో విషమ పరీక్ష పెట్టడంతో ఆశావహుల్లో ఆందోళన మొదలైంది. పార్టీ బలోపేతం కోసం ఇన్నాళ్లూ కష్టపడి, తీరా అధికారంలోకి వచ్చాక తమకే నామినేటెడ్‌ పదవులు దక్కుతాయన్న గ్యారెంటీ లేకపోవడంతో పార్టీ క్యాడర్‌కు నిద్ర కరువవుతోంది.

నేను మీ చంద్రబాబు నాయుడు...
‘‘నేను మీ చంద్రబాబునాయుడు..మీ ప్రాంతంలో పార్టీ కోసం కష్టపడిన వారికి తగిన రీతిలో గుర్తింపునివ్వాల్సిన అవసరం ఉంది..మీకో ఎస్‌ఎంఎస్‌ వస్తుంది. అందులో లింక్‌ను ఓపెన్‌ చేయండి.. మీప్రాంతంలో ఎవరైతే బాగా కష్టపడ్డారో వారి గురించి తెలియజేయండి..వారిని తగిన విధంగా గౌరవిస్తాం’’ అని ఇటీవల ప్రజలకు టీడీపీ అధినేత చంద్రబాబు గొంతుకతో రికార్డెడ్‌ వాయిస్‌ కాల్స్‌ వచ్చాయి. దీంతో ఆ పార్టీ నాయకులు ఖంగుతిన్నారు. గుర్తింపు అనేది ఏ రూపంలో ఇస్తారో తెలియక జుత్తు పీక్కుంటున్నారు.! అలా ఎస్‌ఎంఎస్‌లో లింకులు వచ్చిన పక్షంలో తమ పేర్లు అందులో ప్రస్తావించాలని కొందరు నాయకులు ప్రజలు, కార్యకర్తలను ప్రాధేయపడుతున్నట్టు తెలియవచ్చింది. మరికొందరు దీనిని కూడా తమకు అవకాశంగా మలచుకునేందుకు గట్టిగా యత్నిస్తున్నట్టు తెలుస్తోంది.

అన్ని దశలూ దాటాల్సిందే!
నామినేటెడ్‌ పదవుల భర్తీకి టీడీపీ అధిష్టానం అన్ని అంశాలకు పరిగణనలోకి తీసుకుని పరీక్షించనుంది. ఐదు దశల్లో అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్లు విశ్వసనీయ సమాచారం. నియోజకవర్గ ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జిలు, జిల్లా పార్టీ అధ్యక్షుడు, పార్లమెంట్‌ నియోజకవర్గ అధ్యక్షులు, నియోజకవర్గ పరిశీలకులు, స్క్రీనింగ్‌ కమిటీల ద్వారా ఒక్కొక్క నియోజకవర్గం నుంచి ఆశావహుల జాబితాను 100మంది లోపు ఉండేలా సిద్ధం చేయించి ఆ పేర్లతో కూడిన జాబితాను అధిష్టానానికి పంపాలి. వారి సామర్థ్యం, విధేయత, నిబద్ధతను పరిగణనలోకి తీసుకుని ఏ పదవికి ఎవరెవరు సమర్థులో నిర్ణయించనున్నట్లు పేర్కొన్నారు. ఇందుకుగాను వేర్వేరు జాబితాలను సిద్ధం చేసి అందులో ఉన్న వారి పేర్లను నియోజకవర్గంలోని పార్టీ కార్యకర్తలు, ప్రజలకు ఫోన్లు చేసి ఐవీఆర్‌ఎస్‌ సర్వే చేయించి పదవులను ఎంపిక చేసేందుకు అధిష్టానం వేగంగా అడుగులు వేస్తుండడంతో ఆశావహుల్లో అంతర్మథనం మొదలైంది.

అవసరం తీరిందనుకుంటున్నారా?
ఎన్నికల సమయంలో పార్టీ అధికారంలోకి వస్తే ఆ చైర్మన్‌ పదవి నీకే..నీకే అని హామీలతో ఊదరగొట్టిన అధి నాయకులు.. అధికారంలోకి వచ్చాక సర్వే పేరుతో పదవులు కట్టబెట్టాలని చూస్తుండటంపై నాయకులు, కార్యకర్తలు తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నారు. పార్టీ కోసం కష్టపడిన తమకు అధికారం వచ్చాక పదవులను కట్టబెట్టేందుకు ఎక్కడలేని విచిత్రమైన విధానాలను అవలంభిస్తున్నారని కుతకుతమని ఉడికిపోతున్నారు. కూటమిలోని టీడీపీ, జనసేన, బీజేపీలకు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ఎన్నికల్లో శక్తివంచన లేకుండా శ్రమించామని ఎవరికి వారు అధిష్టానానికి వివరించారు. తమ శ్రమకు తగిన ఫలితం కోసం ఎదురు చూస్తున్నామని సమాచారం ఇచ్చారు. ఆశావహుల జాబితా పెద్దదిగా ఉందని చెప్పి, వారికి ఇష్టమొచ్చిన వారికి కట్టబెట్టి, చేతులు దులుపుకునేందుకు సర్వేకు పూనుకున్నారని టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు చర్చించుకుంటున్నారు. సర్వే పేరుతో ఎవరికి పదవులు వరిస్తాయో.. ఎవరికి మొండిచెయ్యి చూపుతారోననే గుబులు నాయకులు, కార్యకర్తలకు నిద్రలేకుండా చేస్తుండటం కొసమెరుపు.

కేడర్‌ అంటే చులకనా?
తిరుమల–తిరుపతి దేవస్థానం, శ్రీకాళహస్తీశ్వరస్వామి, కాణిపాకం ఆలయ పాలక మండలి అధ్యక్ష పదవులతో పాటు సభ్యులు, రాష్ట్ర, జిల్లా, నియోజక వర్గ, మండల స్థాయి నామినేటెడ్‌ పదవులతో పాటు కార్పొరేషన్‌ చైర్మన్‌ వంటి పదవులపై ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని టీడీపీ, బీజేపీ, జనసేన నేతలు ఆశలు పెట్టుకున్నారు. పదవులు తమకే వరిస్తాయని ఇప్పటికే తన అనుయులతో గొప్పలు చెప్పుకున్నారు. ఇక పదవి వరించడమే తరువాయి అన్నట్లు నెలరోజులుగా నాయకులు, కార్యకర్తలు ఊహల్లో విహరించారు. తమకు పదవుల విషయంలో ఎలాంటి బ్రేకులు పడకుండా ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్య నాయకులతో సన్నిహితంగా మసలుతూ వారి తల్లో నాలుకగా విధేయతను ప్రదర్శిస్తున్నారు. అయితే ‘తామొకటి తలచిన బాబొకటి తలచెన్‌’ అని లెవెల్లో పార్టీ అధిష్టానం వారందరికీ ఝలక్‌ ఇచ్చింది. గతంలోలా ఈసారి కూడా ఎమ్మెల్యేలు సిఫార్సు చేసిన వారికే పదవులు వస్తాయనే వారి కలలను కల్లలు చేసింది. ఎమ్మెల్యే అనుగ్రహం ఒక్కటే ఉంటే సరిపోదు.. క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకర్తలు, ప్రజల అనుగ్రహం కూడా ఉండాలనే సాకు చూపించి, ఐవీఆర్‌ఎస్‌ సర్వేనే ప్రధాన ఆయుధంగా వారిపై ప్రయోగించేందుకు సిద్ధమైంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement