తమను కాదనడంపై ముఖ్యనాయకుల కినుక
రెండు విడతల నామినేటెడ్ పదవుల్లో సీనియర్లకు ఆశాభంగం
పిఠాపురం వర్మ, దేవినేని ఉమ, బుద్దా వెంకన్న వంటి వారికి మొండిచేయి
అసెంబ్లీ విప్ పదవుల్లోనూ జూనియర్లకే పెద్దపీట
ధూళిపాళ్ల నరేంద్ర ఆశించిన చీఫ్‌విప్ పోస్టు జీవీ ఆంజనేయులుకు..
పార్టీలో అన్ని స్థాయిల్లోనూ అసంతృప్తి
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు పదవుల పంపిణీ చేస్తున్న తీరుపై తెలుగుదేశం పార్టీలో అసహనం వ్యక్తమవుతోంది. ఎన్నో లెక్కలు వేసి, సమీకరణలు చూసి పార్టీ నేతలకు పదవులు ఇస్తున్నట్లు పైకి చెబుతున్నా నేతలు మాత్రం అసంతృప్తితో రగిలిపోతున్నారు. నామినేటెడ్ పదవులు, టీటీడీ బోర్డు సభ్యులు, విప్‌ల నియామకంపై సీనియర్లు పెదవి విరుస్తున్నారు.
సీనియారిటీ, పార్టీలో చేసిన పని గురించి పట్టించుకోకుండా తమకు నచ్చిన వారికే పదవులు ఇస్తున్నారనే అభిప్రాయం అన్ని స్థాయిల్లోనూ వినిపిస్తోంది. రెండు విడతలుగా నియమించిన సుమారు 80 కార్పొరేషన్ చైర్మన్ల పదవుల పంపకంపై పార్టీలో తీవ్ర చర్చ జరుగుతోంది. పార్టీ కోసం పనిచేసిన వారికన్నా లాబీయింగ్ చేసే వారికే ప్రాధాన్యత ఇస్తున్నట్లు నేతలు వాపోతున్నారు.
లాబీయిస్టులకే పదవులు..
పార్టీ ఆఫీసులో తిష్టవేసి లాబీయింగ్ చేసేవాళ్లు, క్షేత్రస్థాయిలో అసలు ఎప్పుడూ తిరగని వారికే మంచి పదవులు వచ్చాయనే ఆందోళన ఎక్కువమంది నేతల్లో వ్యక్తమవుతోంది. కొమ్మారెడ్డి పట్టాభిరాం, ఆనం వెంకటరమణారెడ్డి, నీలాయపాలెం విజయ్‌కుమార్, గోనుగుంట్ల కోటేశ్వరరావు తదితరులకు ఈ కోవలోనే పదవులు దక్కినట్లు బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తున్నారు.
టీటీడీ బోర్డు సభ్యుల పదవుల్లోనూ సీనియర్లను పక్కన పెట్టారనే ఆందోళన నెలకొంది. నంద్యాలకు చెందిన రౌడీషీటర్ మల్లెల రాజశేఖర్‌ను బోర్డు సభ్యునిగా నియమించడంపై స్థానికంగా దుమారం చెలరేగింది. అతనికి పదవి ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ నంద్యాల నేతలు ఏకంగా చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. అయినా ఆయన పదవి పదిలంగానే ఉండడం విశేషం.
సీనియర్లకు ఝలక్.. జూనియర్లకు విప్ పదవులు..
మరోవైపు.. ఇటీవల నియమించిన శాసనసభ, శాసన మండలి చీఫ్‌విప్‌లు, విప్‌ల నియామకంపైనా ఎమ్మెల్యేల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. శాసనసభ చీఫ్‌విప్‌గా తనకు అవకాశం దక్కుతుందని సీనియర్ ఎమ్మెల్యే ధూళిపాళ నరేంద్ర ఆశలు పెట్టుకున్నారు. మంత్రి పదవి ఎలాగూ ఇవ్వలేదు కనీసం ఈ పదవైనా ఇస్తారని ఆయన వర్గం ఎన్నో ఆశలు పెట్టుకుంది.
కానీ, ఆయన్ను కాదని వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులికి ఆ పదవి కట్టబెట్టడంతో నరేంద్ర రగిలిపోతున్నారు. భారీ సంఖ్యలో టీడీపీ తరఫున 11 మందికి విప్ పదవులు ఇచ్చినా చాలావరకూ జూనియర్లకే అవకాశం ఇవ్వడంతో సీనియర్లు నోరు విప్పలేక మిన్నకుండిపోయారు.
ఇక తొలిసారి ఎమ్మెల్యేలుగా గెలిచిన యనమల దివ్య, రెడ్డప్పగారి మాధవి, యార్లగడ్డ వెంకట్రావు, వి. థామస్ తదితరులకు విప్‌లు ఇచ్చి తమను అవమానించారంటూ ప్రత్తిపాటి పుల్లారావు, గంటా శ్రీనివాసరావు, కళా వెంకట్రావు, పరిటాల సునీత, గోరంట్ల బుచ్చయ్యచౌదరి, జ్యోతుల నెహ్రూ, చింతమనేని ప్రభాకర్ వంటి నేతలు ఆవేదనలో మునిగిపోయారు.
సీట్లు వదులుకున్న సీనియర్లలో అసంతృప్తి
గత ఎన్నికల్లో సీట్లు వదులుకున్న ఎస్వీఎస్ఎన్ వర్మ, దేవినేని ఉమామహేశ్వరరావు, కొమ్మాలపాటి శ్రీధర్, జితేంద్రగౌడ్, ప్రభాకర చౌదరి, కేఏ నాయుడు, బూరుగుపల్లి శేషారావు, గన్ని వీరాంజనేయులు తదితరులకు రెండు విడతలుగా ప్రకటించిన నామినేటెడ్ పోస్టుల్లో నిరాశే ఎదురైంది. ఉదా..
» పవన్‌కళ్యాణ్ కోసం పిఠాపురం సీటు వదులుకున్న వర్మకు తొలిదశలోనే మంచి పదవి వస్తుందని అందరూ భావించారు. చంద్రబాబు, లోకేశ్ కూడా ఆయనకు ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇచ్చి ఎన్నికల్లో పనిచేయించారు. కానీ, ఆయన్ను పట్టించుకునే వారే లేరని చెబుతున్నారు.
» ఎన్డీఆర్ జిల్లా మైలవరం సీటు త్యాగంచేసిన మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పరిస్థితి కూడా దయనీయంగా మారింది. పార్టీలో అత్యంత సీనియర్‌గా ఉండి ఇప్పుడు ఆయన కనీస ప్రాధాన్యానికి నోచుకోలేకపోతున్నారు. జిల్లాలో ఆయన్ను వ్యతిరేకించి సుదీర్ఘకాలం రాజకీయాలు చేసిన కేపీ సారథి టీడీపీలో చేరి మంత్రి కాగా, పక్కలో బల్లెంలా మారి తన సీటును ఎగరేసుకుపోయి గెలిచిన వసంత కృష్ణప్రసాద్‌కి గౌరవం దక్కుతుండడంతో దేవినేని ఉమ అసంతృప్తితో రగిలిపోతున్నారు. రెండు విడతల నామినేటెడ్ పోస్టుల్లో ఆయన్ను చంద్రబాబు పట్టించుకోలేదు.
» అనంతపురం అర్బన్ సీటును కొత్తగా వచ్చిన వారికి ఇవ్వడంతో ప్రభాకర్ చౌదరి, చివర్లో జంప్ జిలానీలా వచ్చిన నేత గుంతకల్ సీటు తన్నుకుపోవడంతో జితేంద్రగౌడ్ వంటి వారికి పదవుల పంపకంలో న్యాయం జరగలేదని పార్టీ నేతలు చెబుతున్నారు.
» ఇక అధికారంలో లేనప్పుడు ఎంత కష్టపడినా ఇప్పుడు గుర్తింపు దక్కడంలేదని, కనీసం తమను పట్టించుకోవడంలేదని బుద్ధా వెంకన్న వంటి నేతలు వాపోతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment