5 నుంచి 10 శాతం పదవులకు నో చెప్పిన బీజేపీ
ఎక్కువ శాతంతో పాటు, ముఖ్య పదవులు కోరుతున్న కమలం పార్టీ
జోక్యం చేసుకున్న బీజేపీ అగ్రనాయకత్వం
చంద్రబాబుతో చర్చలు.. ఫలితమివ్వని నేతల భేటీ
ఇప్పట్లో నామినేటెడ్ పదవులు లేవని తేల్చేసిన చంద్రబాబు
కొనసాగుతున్న ప్రతిష్టంభనతో నేతల్లో ఆగ్రహం
ఇప్పటి వరకు కీలక పదవులు భర్తీ చేయలేకపోయిన బాబు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వంలో నామినేటెడ్ పదవుల పంచాయితీ ఎటూ తేలడంలేదు. టీడీపీ, జనసేన పార్టీల మధ్య పదవుల పంపకం మధ్య ఏకాభిప్రాయం వచ్చినా.. బీజేపీ మాత్రం వారి దారికి రాలేదు. దీంతో పదవుల నియామకంలో ప్రతిష్టంభన నెలకొంది. ఇప్పట్లో వాటి వ్యవహారం కొలిక్కి వచ్చే అవకాశం కనిపించకపోవడంతో మూడు పార్టీల నేతలు, శ్రేణుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది.
ముఖ్యమంత్రి చంద్రబాబుతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి, ముఖ్య నాయకుడు శివప్రకాశ్ మంగళవారం సమావేశమై పదవులపై చర్చ జరిగినా ఏ నిర్ణయం తీసుకోలేకపోయారు. రాష్ట్ర స్థాయి నుంచి నియోజకవర్గం వరకు పదవులు ఎలా పంచుకోవాలనే దానిపై గతంలో ఒక ఫార్ములా రూపొందించినట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నా.. ముందుకు వెళ్లలేకపోయారు.
బీజేపీ అభ్యంతరాలు
మొత్తం పదవుల్లో 70 శాతం టీడీపీకి, 20 నుంచి 25 శాతం జనసేనకు, మిగిలినవి బీజేపీకి ఇవ్వాలని మొదట్లో ఒక అభిప్రాయం కుదిరింది. అలాగే ఏ పార్టీ గెలిచిన నియోజకవర్గాల్లో ఆ పార్టీకి పదవుల్లో ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించారు. టీడీపీ ఏ నిర్ణయం తీసుకున్నా తమకు సమ్మతమేనని జనసేన తేల్చి చెప్పేయడం, వారు ఎన్ని పదవులు ఇస్తే అంతటితో సరిపెట్టుకునేందుకు సిద్ధమవడంతో ఆ పార్టీ నుంచి టీడీపీకి ఇబ్బంది రాలేదు. అయితే కేవలం 5 నుంచి 10 శాతం పదవులు ఇస్తామనడంపై బీజేపీలో అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.
రాష్ట్ర స్థాయిలో కీలకమైన పది కార్పొరేషన్ చైర్మన్ పదవులు, టీటీడీలో ప్రాధాన్యం, నియోజకవర్గాల్లోనూ కీలక పదవులు తమకు కేటాయించాలని ఆ పార్టీ పట్టుబడుతోంది. ఇందుకు సంబంధింది ఇప్పటికే ఒక జాబితా కూడా చంద్రబాబుకు ఇచి్చనట్లు తెలిసింది. అయితే అందులో సోము వీర్రాజు, విష్ణువర్ధన్‌రెడ్డి వంటి నేతలకు కీలక కార్పొరేషన్లు ఇవ్వాలని ప్రతిపాదించడం పట్ల టీడీపీ వ్యతిరేకంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో తమ పార్టీలో ఎవరికి పదవులు ఇవ్వాలో టీడీపీ ఎలా నిర్ణయిస్తుందని బీజేపీ నేతల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది.
ఈ విషయంపై ఇరు పార్టీల మధ్య ఏకాభిప్రాయం రాకపోవడంతో బీజేపీ జాతీయ నాయకత్వం జోక్యం చేసుకోవాల్సివచ్చిందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే మంగళవారం చంద్రబాబు వద్దకు ఆ పార్టీ తరఫున జాతీయ ప్రతినిధి వచ్చి చర్చలు జరిపారు. అయినా ఏకాభిప్రాయం రాలేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో నామినేటెడ్ పదవుల నియామకం ఇప్పట్లో లేదని చెబుతున్నారు.
‘నామినేటెడ్’కు మరికొంత సమయం
బీజేపీకి స్పష్టం చేసిన సీఎం చంద్రబాబు
నామినేటెడ్ పదవులు భర్తీ ఇప్పుడే ఉండబోదని, దానికి మరికొంత సమయం పట్టవచ్చని బీజేపీ నేతలకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. ప్రభుత్వ నామినేటెడ్ పదవుల్లో తమ పార్టీ నేతలకు ప్రాధాన్యత, తమ పార్టీ రాష్ట్ర కార్యాలయ కొత్త భవన నిర్మాణానికి ప్రభుత్వ స్థలం కేటాయింపు తదితర అంశాలపై చర్చించేందుకు బీజేపీ జాతీయ సహ సంఘటనా కార్యదర్శి శివప్రకాశ్, బీజేపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలు పురందేశ్వరి ముఖ్యమంత్రి చంద్రబాబుతో మంగళవారం భేటీ అయ్యారు. 26 జిల్లాలకు సంబంధించి జిల్లాకు కనీసం రెండు చొప్పున అయినా నామినేటెడ్ పదవులు కేటాయించాలని చంద్రబాబు దృష్టికి శివప్రకాశ్ తీసుకొచ్చినట్లు తెలిసింది.
నామినేటెడ్ పదవులను ఆశిస్తున్న బీజేపీ నేతల జాబితాను గతంలోనే ముఖ్యమంత్రికి అందజేయగా.. దానికి అదనంగా మరి కొంతమంది ఆశావహుల జాబితాను కూడా ఈ సందర్భంగా చంద్రబాబుకు ఇచ్చారని సమాచారం. ఈ సందర్భంగా.. నామినేటెడ్ పదవుల నియామకానికి కొంత సమయం పట్టవచ్చని బీజేపీ నేతలకు చంద్రబాబు వివరించినట్టు తెలిసింది. ఇక బీజేపీ భవనానికి మంగళగిరి సమీపంలో, లేదంటే అమరావతి రాజధాని ప్రాంతంలో స్థలం కేటాయించాలంటూ ఆ పార్టీ నేతలు సీఎం దృష్టికి తీసుకొచ్చారు.
చంద్రబాబుతో భేటీ అనంతరం పురందేశ్వరి నివాసంలో పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలకు విందు ఇచ్చారు. ఈ సందర్భంగా శివప్రకాశ్.. పార్టీ సభ్యత్వ నమోదుపై పలు సూచనలు చేశారు. విందు అనంతరం పురందేశ్వరి మాట్లాడుతూ.. కూటమి బలోపేతంపైనే ముఖ్యమంత్రి చంద్రబాబుతో చర్చ జరిగిందని చెప్పారు. మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ.. పార్టీ నాయకులకు నామినేటెడ్ పదవుల ఆశ ఉంటుందని, వారి ఆశలు హేతుబద్ధమైనవేనని తెలిపారు.
రెండున్నర నెలలైనా ఒక్క పదవీ ఇవ్వలేదు
కూటమి అధికారంలోకి వచ్చి రెండున్నర నెలలు దాటినా కీలకమైన నామినేటెడ్ పదవులను భర్తీ చేయకపోవడం ఏమిటని మూడు పార్టీల నేతల్లోనూ ఆగ్రహం వ్యక్తమవుతోంది. అత్యంత ప్రాధాన్యమైన టీటీడీ పాలకవర్గాన్ని నియమించకపోవడం అసమర్థతకు నిదర్శనమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏపీఐఐసీ, ఏపీఎస్‌ఆర్‌టీసీ, సివిల్ సప్లయిస్ కార్పొరేషన్, ఎస్సీ, ఎస్టీ కమిషన్లు, కార్పొరేషన్లు వంటి కీలకమైన సంస్థల్లో నియామకాలు చేయలేకపోవడం పట్ల అసహనంతో రగిలిపోతున్నారు.
కాగా, పార్టీ కోసం కష్టపడిన తమకు పదవులు ఇవ్వాలని పలువురు టీడీపీ నేతలు కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడిని కోరారు. మంగళగిరి టీడీపీ కార్యాలయంలో మంగళవారం రామ్మోహన్నాయుడు, విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, మంత్రి వాసంశెట్టి సుభా‹Ù, ఎమ్మెల్యేలు ఎన్.కిషోర్‌కుమార్‌రెడ్డి, శ్రీరాం రాజగోపాల్, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావులతో కలిసి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా పలువురు నేతలు బయోడేటా, పార్టీ కోసం చేసిన కార్యక్రమాలు, ఇతర వివరాలను చూపించి న్యాయం చేయాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment