సాక్షి, తాడేపల్లి: పురందేశ్వరి (Purandeswari) కేవలం చంద్రబాబు ప్రయోజనాల కోసమే పని చేస్తున్నారంటూ మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ(Kottu Satyanarayana) మండిపడ్డారు. మంగళవారం ఆయన వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడుతూ, చంద్రబాబు వలన హైందవ ధర్మానికి కల్గిన నష్టాల గురించి ఆమె ఎందుకు మాట్లాడటం లేదంటూ ప్రశ్నించారు.
చంద్రబాబు వలన గోదావరి పుష్కరాలలో 29 మంది హిందూ భక్తులు చనిపోయినా ఆమె పట్టించుకోలేదు. విజయవాడలో చంద్రబాబు 50 ఆలయాలను కూల్చేసినా ఆమెకి కనపడలేదు. కానీ వైఎస్ జగన్ పాలనపై మాత్రం అనవసర ఆరోపణలు చేస్తున్నారు. వైఎస్ జగన్ సీఎంగా ఉన్నప్పుడు రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఆలయాలను నిర్మించారు. ఆలయాల్లో ఉన్న అర్చకులకు వేతనాలను పెంచారు. అర్చకులకు రిటైర్మెంట్ లేకుండా చేసింది కూడా జగనే. వంశపారంపర్య హక్కులను జగన్ తీసుకువచ్చారు’’ అని కొట్టు సత్యనారాయణ వివరించారు.
కాణిపాకం, కాళహస్తి, శ్రీశైలం, అమరావతి, ద్రాక్షారామం, కనకదుర్గమ్మ గుడి, సింహాచలం, అరసవిల్లి, శ్రీకూర్మం, వాడపల్లి, అంతర్వేది, అయినవల్లి.. ఇలా అనేక ఆలయాల్లో అభివృద్ధి చేశారు. విజయవాడ గుడికి మాస్టర్ ప్లాన్ రూపొందించారు. 49 ఆలయాల్లో ఏకకాలంలో కుంభాభిషేకాన్ని జగన్ నిర్వహించారు. కంచి పీఠాధిపతి సైతం దీన్ని మెచ్చుకున్నారు. శ్రీ వాణి ట్రస్టు ద్వారా 3 వేల ఆలయాలను కొత్తగా జగన్ హయాంలో నిర్మించారు. ఇలా చేసిన అనేక మంచి కార్యక్రమాలు పురందేశ్వరికి కనపడలేదు.
ఇదీ చదవండి: సీజ్ ద షిప్.. సర్వం లాస్!
కేవలం చంద్రబాబు దగ్గర మార్కులు పొందటానికే గత ప్రభుత్వంపై విమర్శలు చేశారు. హైందవ శంఖారావంలో రాజకీయాలు మాట్లాడటం పురంధేశ్వరికే చెల్లింది. చంద్రబాబు కోసమే ఆమె పని చేస్తున్నారు. సెక్షన్ 83 ని సవరణ చేసి ఆలయ భూముల లీజులు వసూలు చేయటం, అన్యాక్రాంతమైన భూములను కాపాడారు. ఈ చట్ట సవరణను ఇతర రాష్ట్రాలు సైతం అనుసరించాయి. తిరుమల లడ్డూని అనవసరం వివాదం చేశారు.
దీని వలన హిందూ సమాజానికి ఏమైనా మేలు జరిగిందా?. హైందవ శంఖారావంలో పీఠాధిపతులు చెప్పినవన్నీ జగన్ చేసి చూపించారు. దాన్ని కొనసాగేలా ఇప్పటి ప్రభుత్వం చూడాలి. అంతేతప్ప ప్రత్యర్థులపై తప్పుడు ఆరోపణలు చేయొద్దు’’ అని కొట్టు సత్యనారాయణ హితవు పలికారు.
Comments
Please login to add a commentAdd a comment