పవన్ పొలిటికల్ డ్రామాతో అంతా నష్టమే..
సీజ్ చేసిన బియ్యం విలువ రూ.5.50 కోట్లు
నౌక డెమరేజ్ చార్జీలు రూ.7.00 కోట్ల పై మాటే
దెబ్బ తిన్న కాకినాడ పోర్టు ప్రతిష్ట
బియ్యం ఎగుమతుల్లో నంబర్ 1 ఇక్కడి యాంకరేజ్ పోర్టు
ఏక కాలంలో ఏడు నౌకల్లో ఎగుమతి చేయగల సామర్ధ్యం
ఇతర పోర్టులకు మళ్లిపోతున్న ఎగుమతిదారులు
10వేల మంది కార్మికుల భవితవ్యం ప్రశ్నార్థకం
సాక్షి ప్రతినిధి, కాకినాడ: పావలా కోడికి ముప్పావలా మసాలా అన్నట్లుంది ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ‘సీజ్ ద షిప్’ వ్యవహారం. కాకినాడ పోర్టులో పీడీఎస్ బియ్యం వివాదంలో పట్టుబడ్డ బియ్యం ఖరీదుకంటే నౌక నిలిచిపోవడం వల్ల పడ్డ డెమరేజ్ చార్జీలు ఎక్కువయ్యాయి. మరోపక్క కార్మికులకూ నష్టం వాటిల్లింది. మొత్తంగా పోర్టు పరువే తీసేసింది కూటమి ప్రభుత్వం. అనేక వివాదాలు, భారీ నష్టం అనంతరం పీడీఎస్ బియ్యం ఉన్న స్టెల్లా నౌక ఆదివారం అర్ధరాత్రి దాటాక 52 వేల మెట్రిక్‌టన్నుల బియ్యంతో పశ్చిమ ఆఫ్రికాకు బయలుదేరింది.
స్టెల్లా నౌకలో పీడీఎస్ బియ్యం ఉన్నాయనే అనుమానంతో నవంబర్ 27న కాకినాడ పోర్టులో నిలిపివేశారు. నవంబర్ 29న పవన్ కాకినాడ పోర్టుకు వచ్చి ‘సీజ్ ద షిప్’ అంటూ సినిమా స్టైల్‌లో ఆదేశించేశారు. కానీ, దాని పర్యవసానాలు ప్రభుత్వం పట్టించుకోలేదు. కాకినాడ పోర్టు నుంచి బియ్యం ఇతర సరకులను ఎగుమతి చేసే వారు ఇతర పోర్టులకు వెళ్లిపోయే పరిస్థితి ఏర్పడింది. పోర్టుపై ఆధారపడ్డ 10 వేలకు పైగా కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి దాపురించింది.
పట్టుకున్న బియ్యం విలువ కన్నా డెమరేజ్ చార్జి రూ.1.5 కోట్లు ఎక్కువ
స్టెల్లా నౌకలోని ఐదు హేచెస్‌లో 52వేల మెట్రిక్ టన్నులు బియ్యం ఉంటే కేవలం 4 వేల టన్నుల బియ్యాన్ని 12 గంటల పాటు తనిఖీ చేశారు. చివరకు 3వ నంబరు హేచెస్‌లో ఉన్న సత్యం బాలాజీ ఎక్స్‌పోర్ట్ ఇండస్ట్రీస్‌కు చెందిన 1,320 మెట్రిక్ టన్నులు పీడీఎస్‌గా లెక్క తేల్చారు. ఈ బియ్యాన్ని వెంటనే అన్‌లోడ్ చేసి, నౌకను పంపకుండా పవన్ అన్న ‘సీజ్ ద షిప్’ మాటతో పోర్టులోనే నిలిపివేశారు. ఇలా నౌకను పోర్టులో నిలిపివేసినందుకు దాని యాజమాన్యానికి ఎగుమతిదారులు డెమరేజ్ చార్జీలు చెల్లించాలి. నవంబర్ 29 నుంచి డెమరేజ్ చెల్లించాలని నౌక యాజమాన్యం అంటుండగా.. తుపాను కారణంగా డిసెంబర్ 4 వరకు డెమరేజ్ వేయడం కుదరదని ఎగుమతిదారులు పట్టుబడుతున్నారు. ఈ వివాదం ఇంతవరకు తేలలేదు.
నౌక పశ్చిమ ఆఫ్రికాకు చేరుకున్నాక షిప్ నిర్వాహకుడు బియ్యానికి చెల్లించాల్సిన సొమ్ము నుంచి డెమరేజ్‌ను మినహాయించుకుని మిగిలిన సొమ్ము జమ చేస్తాడని పోర్టు వర్గాలు చెబుతున్నాయి. నౌకకు క్రూతో సహా అన్ని ఖర్చులు చూసుకుంటే రోజుకు 22 వేల యూఎస్ డాలర్లు (రూ.18.73 లక్షలు) వంతున డెమరేజ్ చెల్లించాలి. అంటే నౌక నిలిచిపోయిన 38 రోజులకు సుమారు రూ.7 కోట్లకు పైగా డెమరేజ్ పడుతుందని లెక్కలేçÜ్తున్నారు. విదేశాలకు ఎగుమతిచేసే బియ్యం ప్రస్తుత ధరల ప్రకారం కిలో రూ.36 పలుకుతోంది. ఈ లెక్కన 1,320 మెట్రిక్ టన్నుల పీడీఎస్ బియ్యం ఖరీదు రూ.5.50 కోట్లు. అంటే పట్టుకున్న బియ్యం కంటే స్టెల్లా నౌకకు చెల్లించే నష్టమే రూ.1.5 కోట్లకు పైగా అదనం. ఇన్ని రోజులు పోర్టులో నిలిపివేసిన నౌక డెమరేజ్ చార్జీలు పవన్ చెల్లిస్తారా అని ట్రేడ్ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. మరోపక్క ఈ నష్టాన్ని సత్యంబాలాజీ కంపెనీ చెల్లించాలా లేక, ఆ నౌకలో బియ్యం ఎగుమతికి రిజిస్టర్ అయిన 28 ఎక్స్‌పోర్టు కంపెనీలు చెల్లించాలా అనే దానిపైనా వివాదం నడుస్తోంది.
మంటగలిసిన పోర్టు ప్రతిష్ట
ఈ వ్యవహారంతో పోర్టు ప్రతిష్ట కూడా మంటగలిసిపోయింది. కాండ్లా, విశాఖపట్టణం, కృష్ణపట్నం పోర్టులు ఉన్నప్పటికీ బియ్యం ఎగుమతిలో కాకినాడ పోర్టుకే ఎగుమతిదారులు ఎక్కువ మొగ్గు చూపుతారు. దేశంలో ఏక కాలంలో బియ్యాన్ని ఏడు నౌకల ద్వారా ఎగుమతి చేయగలిగే బెర్త్‌ల సామర్థ్యం ఉన్న ఏకైక పోర్టు కాకినాడ యాంకరేజ్ పోర్టు. మిగిలిన పోర్టుల్లో రెండుకు మించి బియ్యం ఎగుమతికి అవకాశం లేదు. ఈ వెసులుబాటు కారణంగానే బియ్యం ఎగుమతుల్లో దేశంలోనే నంబర్ వన్‌గా కాకినాడ పోర్టు నిలుస్తోంది. అటువంటి పోర్టుపై పీడీఎస్ బియ్యం పేరుతో కూటమి నేతలు విషం చిమ్మడంతో పోర్టు ప్రతిష్ట మంటగలిసిపోతోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పలువురు బియ్యం ఎగుమతిదారులు కాండ్లా రేవుకు మళ్లే ఏర్పాట్లలో ఉన్నారు.
ఆందోళనలో కార్మికులు
పోర్టుపై ఆధారపడ్డ వేలాది మంది కార్మికులు మట్టికొట్టుకుపోయే పరిస్థితులు దాపురించాయని వారి కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాకినాడ పోర్టుపై ప్రత్యక్షంగా, పరోక్షంగా 10వేలకు పైగా కార్మికులు ఉపాధి పొందుతున్నారు. పోర్టులో ఉన్న 100 బార్జీలపై 2,000 మంది కార్మికులు, టవ్వింగ్‌లో 1,000 మంది, షోర్ లేబర్ (గోడౌన్ ఎగుమతి, దిగుమతి)లో 8,000 మంది, మరో 2,000 మంది స్టీవ్ డోర్ వర్కర్స్‌గా పనిచేస్తున్నారు. ప్రతి కార్మికుడికి రోజూ రూ.800 నుంచి రూ.1,000 వరకు ఆదాయం లభిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment