చక్రం తిప్పిన ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్
బుద్దా వెంకన్నకు సైతం మొండి చెయ్యి
సుజనా మాటే... చెల్లుబాటు
నెట్టెం రఘురాంకు కూడా నిరాశే
పట్టాభికీ దక్కని అవకాశం
లోకేష్ కోటరీదే పెత్తనం
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించిన నామినేటెడ్ పదవుల్లో ఎన్టీఆర్ జిల్లా నాయకులకు చోటు దక్కలేదు. పలువురు ఆశావహులకు నిరాశే మిగిలింది. మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నాయకుడు దేవినేని ఉమా, టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షుడు నెట్టెం రఘురాంకు నామినేటెడ్ పదవులు దక్కుతాయని అశించారు. అయితే వీరికి తొలి జాబితాలో చోటు దక్కకపోవడంపై పార్టీ వర్గాల్లో అసంతృప్తి సెగలు రగులుతున్నాయి.
సాక్షి ప్రతినిధి, విజయవాడ: మాజీ మంత్రి దేవినేని ఉమా ఉమ్మడి కృష్ణా జిల్లాలో 2014–19 మధ్య నీటిపారుదల శాఖ మంత్రిగా చక్రం తిప్పారు. టీడీపీలో తానే నంబరు టూ అన్నంతగా బిల్డప్ ఇచ్చారు. పార్టీ కష్ట కాలంలో వెన్నంటే ఉండి పార్టీకి సేవలందించారు. అయితే వైఎస్సార్‌సీపీ నుంచి వసంత కృష్ణ ప్రసాద్ టీడీపీలో చేరడంతో, దేవినేని ఉమాకు కష్టాలు మొదలయ్యాయి. ఉమాను పక్కన పెట్టి మైలవరం ఎమ్మెల్యే సీటును వసంత కృష్ణ ప్రసాద్‌కు కేటాయించారు. ఈ నేపఽథ్యంలో పార్టీ కోసం సీటు త్యాగం చేశారన్న కోటాలో దేవినేని ఉమాకు మొదటి విడతలోనే ఆర్టీసీ చైర్మన్‌గా నామినేటెడ్ పదవి కేటాయిస్తారని జోరుగా ప్రచారం జరిగింది. అయితే ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ లోకేష్ కోటరీలో ఉండటంతో పాటు, అధిష్టానం అండదండలు ఆయనకే మెండుగా ఉండటంతో ప్రస్తుతం వసంత మాటే చెల్లుబాటు అవుతోంది.
నియోజకవర్గంలో కూడా తన పట్టు జారిపోతుందన్న భయంతో ఇటీవల మైలవరం నియోజకవర్గంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో దేవినేని ఉమా విస్తృతంగా పర్యటించి తన పట్టు నిలుపుకొనే యత్నం చేశారు. ప్రస్తుత ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్, ఆదినుంచి టీడీపీ కోసం కష్టపడిన నాయకులకు ప్రాధాన్యం కల్పించకుండా, వైఎస్సార్ సీపీని వీడి తనతో పాటు టీడీపీలో చేరిన నాయకులకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ విషయంపై టీడీపీ నాయకులు బహిరంగంగానే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ అసమ్మతి నాయకులంతా దేవినేని ఉమా వైపు క్యూ కట్టడంతో తనకు రాజకీయంగా ఇబ్బంది తలెత్తే ప్రమాదం ఉందని వసంత కృష్ణ ప్రసాద్ భావించారు. ఈ నేపథ్యంలో దేవినేని ఉమాకు రాజకీయంగా చెక్ పెట్టేందుకు పావులు కదిపారు. చినబాబు లోకేష్ అండతో ఉమాకు నామినేటెడ్ పదవి రాకుండా వసంత అడ్డుకున్నారనే భావన టీడీపీ వర్గాల్లో వ్యక్తం అవుతోంది. చినబాబు సైతం సీనియర్లతో తనకు ఎప్పుడైనా ఇబ్బంది వస్తుందనే భావనతో ముందుచూపుతో పక్కన పెడుతున్నారు. ఈ నేపథ్యంలో రాజకీయంగా దేవినేని ఉమా శకం ఇక ముగిసినట్టేనని, పాపం..ఉ మా అంటూ పార్టీ వర్గాలే సానుభూతి వ్యక్తం చేస్తున్నాయి.
ప్రెస్‌మీట్ల పట్టాభి
తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పట్టాభి వివాదాస్పద ప్రెస్‌మీట్‌లతో పార్టీ అధిష్టానం దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేశారు. ఈయనకు పౌర సరఫరాల సంస్థ కార్పొరేషన్ చైర్మన్ పదవి వస్తుందని ప్రచారం జరిగింది. తీరా పదవి రాకపోవడానికి కారణం ఈయన దుందుడుకు చర్యలేననే భావన పార్టీ వర్గాల్లో వ్యక్తం అవుతోంది. మొత్తం మీద పార్టీలో లోకేష్ కోటరీలోని వ్యక్తుల హవా సాగుతోందని, అందుకే జిల్లాలో పలువురు టీడీపీ సీనియర్ నేతలకు నామినేటెడ్ పదవులు దక్కలేదనే భావనను పార్టీ శ్రేణులే వ్యక్తం చేస్తున్నాయి.
రఘురాంకు అడ్డుకట్టేసిన తాతయ్య
మాజీ మంత్రి నెట్టెం రఘురాం ఎన్టీఆర్ జిల్లా పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు. పార్టీ అధికారంలోకి రాగానే మంచి పదవి వస్తుందని ప్రచారం జరిగింది. అయితే ప్రస్తుతం గెలుపొందిన ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య నెట్టెం రఘురాంకు పదవి ఇస్తే జగ్గయ్యపేటలో రెండు అధికార కేంద్రాలు ఏర్పడతాయని, పార్టీలో గ్రూపులు పెరుగుతాయని, అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి రఘురాంకు పదవి రాకుండా అడ్డుకట్ట వేసినట్లు పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది. నెట్టెం రఘురాంకు పదవి దక్కకపోవడంతో ఆయన వర్గీయులు అసంతృప్తితో రగిలి పోతున్నారు.
బుద్దా వెంకన్నకు శఠగోపం
మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న తాను పార్టీ కోసం ఎంతో కష్టపడి పనిచేశానంటూ గొప్పలు చెబుతూ ప్రెస్‌మీట్లు పెట్టి హడావుడి చేస్తూ, చాలెంజ్‌లు చేస్తూ అధిష్టానం దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేశారు. ఓ దశలో ఎన్నికల సమయంలో చంద్రబాబు పాదాలకు రక్తాభిషేకం కూడా చేశారు. తనకు తప్పకుండా పదవి వస్తుందని తన అనుచరుల వద్ద ధీమా వ్యక్తం చేసేవారు. అయితే వెస్ట్ ఎమ్మెల్యే సుజనా చౌదరి రూపంలో అతని పదవికి అడ్డుకట్ట పడింది.
నియోజకవర్గంలో జరిగే వ్యవహారాలన్నింటిని సుజనాచౌదరి అధిష్టానం దృష్టికి తీసుకెళ్లడంతో ప్రస్తుతం బుద్దా వెంకన్నకు అధిష్టానం వద్ద పరపతి తగ్గిపోయింది. ఇప్పటికే టీటీడీ లెటర్ల కోసం ఇబ్బంది పడుతున్నామని సాక్షాత్తూ బుద్దా వెంకన్న ప్రకటించటంతోనే, ఎమ్మెల్యేకు, ఆయనకు మధ్య అంతరం ఏర్పడినట్లు స్పష్టం అవుతోంది. దీనికితోడు చినబాబుతో సంబంధాలు కూడా అంతంత మాత్రంగా ఉండటంతో, ఇతనికి పదవి రాకుండా అడ్డుకోవడంలో సుజనా చౌదరి సఫలీకృతం అయినట్లు పార్టీ శ్రేణులే వ్యాఖ్యానిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment