త్రిపుర ముఖ్యమంత్రిగా వరుసగా 20 ఏళ్లు కొనసాగి పదవి నుంచి వైదొలుగుతున్న మార్క్సిస్ట్ నేత మాణిక్ సర్కార్ రెండు విషయాల్లో చరిత్రకెక్కారు. దేశంలో ‘అతి పేద’ సీఎం మాణిక్ అని ఆయన ఎన్నికల అఫిడవిట్ వెల్లడించింది. పశ్చిమ బెంగాల్ సీఎంగా 34 ఏళ్లకు పైగా పనిచేసిన జ్యోతి బసు తర్వాత రెండు దశాబ్దాలు ఈ పదవి నిర్వహించిన సీపీఎం నేతగా మాణిక్దే రికార్డు. 49 ఏళ్ల వయసులో ఆయన 1998లో సీఎం పదవి చేపట్టారు.
1960ల చివర్లో త్రిపుర కాంగ్రెస్ సర్కారుకు వ్యతిరేకంగా విద్యార్థిగానే ఉద్యమించి కమ్యూనిస్ట్ పార్టీలో చేరారు. ప్రజా పోరాటాలకే అంకితమై సీపీఎం విస్తరణకు చేసిన కృషి ఫలితంగా 1972లో 23 ఏళ్లకే త్రిపుర సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడయ్యారు. 49 ఏళ్లకే సీపీఎం పొలిట్బ్యూరో సభ్యుడయ్యాక ముఖ్యమంత్రి పదవి సర్కార్కే దక్కింది. సొంత ఇల్లు లేని ఆయన తన ముత్తాతకు చెందిన అతి చిన్న ఇంట్లోనే ముఖ్యమంత్రిగా నివసించడం విశేషం. సొంత కారు లేకపోవడమేగాక, సీఎంగా తనకు వచ్చే జీతం మొత్తాన్ని పార్టీకే ఇచ్చి, పార్టీ నెలనెలా అందించే రూ.5000తోనే సరిపెట్టుకుంటున్నారు.
సెంట్రల్ సోషల్ వెల్ఫేర్ బోర్డు ఉద్యోగిగా 2011లో పదవీ విరమణ చేసిన ఆయన భార్య పాంచాలీ భట్టాచార్య భర్త మాదిరిగానే నిరాడంబర జీవితం గడపుతున్నారు. సీఎం భార్య అయినా ఎలాంటి భద్రత లేకుండా రాజధాని అగర్తలాలో ఆమె రిక్షాలో ప్రయాణించడం నగర ప్రజలందరికీ తెలిసిన విషయమే. సీఎం అయ్యాక కూడా నగరంలో ఉదయం నడకకు మాణిక్ బయల్దేరడంతో భద్రతా సిబ్బంది పాంచాలికి విషయం చెప్పగానే ఆమె భర్త కోసం ట్రెడ్‌మిల్ కొని ఇంటికి తెచ్చారు.
‘‘ నా కళ్లజోడు ఖరీదు రూ.1800. చెప్పులు చాలా చౌక. అయినా నీటుగా కనిపిస్తానంటే విలాసవంతమైన వస్తువులు వాడతానని అనుకోవద్దు,’’ అని మాణిక్ చెప్పిన మాటలు అక్షరాలా నిజం. రోజూ ఓ చార్మినార్ సిగరెట్ ప్యాకెట్, చిన్న ప్యాకెట్ నస్యం ఉంటే చాలనీ, ఐదువేల రూపాయలకు తోడు తన భార్య పించనుతో అవసరాలు తీరిపోతున్నాయని ఓ ఇంటర్వ్యూలో సర్కార్ వెల్లడించారు. వరుసగా నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఎంను అధికారంలోకి తెచ్చిన మాణిక్ నాయకత్వం ఇరవై ఏళ్ల తర్వాత నిరుద్యోగం, అభివృద్ధి లేకపోవడం వంటి కారణాల వల్ల ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోవాల్సివచ్చింది.
(సాక్షి నాలెడ్జ్ సెంటర్)
Comments
Please login to add a commentAdd a comment