'దారుణం, అన్యాయం'
న్యూఢిల్లీ: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా త్రిపుర సీఎం మాణిక్ సర్కార్ ప్రసంగాన్ని ప్రసారం చేయడానికి దూరదర్శన్, ఆలిండియా రేడియో నిరాకరించడాన్ని సీపీఎం ఖండించింది. ఇది దారుణమైన, అన్యాయమైన చర్యగా సీపీఎం నాయకురాలు బృందా కారత్ వర్ణించారు. రాష్ట్రాలతో సహకారాత్మక సమాఖ్య విధానం అవలంభిస్తామని చెబుతున్న ప్రధాని నరేంద్ర మోదీపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయని అన్నారు.
'నరేంద్ర మోదీ సహకారాత్మక సమాఖ్య విధానం గురించి మాట్లాడుతున్నారు. ఇదే సమయంలో నేతృత్వంలోని ప్రభుత్వం.. దూరదర్శన్‌లో త్రిపుర ముఖ్యమంత్రి ప్రసంగాన్ని ప్రసారం చేయడానికి నిరాకరించింది. సహకారాత్మక సమాఖ్య విధానం అంటే ఇదేనా? ప్రజలతో ఎన్నుకోబడిన ముఖ్యమంత్రి ప్రసంగ పాఠంలో మార్పులు చేసే అధికారం దూరదర్శన్‌కు ఎవరిచ్చారు? ఇది దారుణం, పూర్తిగా అన్యాయమ'ని బృందా కారత్ పేర్కొన్నారు.
ప్రభుత్వ ప్రసార మాధ్యమాల తీరును తీవ్రంగా ఖండిస్తూ సీపీఎం పొలిట్‌బ్యూరో పత్రికా ప్రకటన కూడా విడుదల చేసింది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా తమ రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించే హక్కు ముఖ్యమంత్రికి ఉందని పేర్కొంది. మోదీ సర్కారు ఎమర్జెన్సీ రోజులను గుర్తుకు తెస్తోందని.. దూరదర్శన్, ప్రసార భారతి స్వయం ప్రతిపత్తిని దెబ్బతీస్తోందని విమర్శించింది. సీఎం మాణిక్ సర్కారు ప్రసంగాన్ని సీపీఎం తన అధికారిక ట్విటర్ పేజీలో పోస్ట్ చేసింది.